– డాక్టర్‌ ఆరవల్లి జగన్నాథస్వామి

ఏప్రిల్‌ 3 ‌నుంచి తిరుమలలో వసంతోత్సవాలు

భక్తపరిపాలన కోసం వైకుంఠం నుంచి భూలోకానికి వేంచేసి ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటున్నాడు వేంకటనాథుడు. శతాబ్దాల తరబడి వివిధ పర్వదినాల సందర్భంగా విశిష్ట అర్చనాదులు స్వీకరిస్తున్న ఆయన శ్రీ శోభకృత్‌ ‌నామ సంవత్సర ఆరంభంలో మరో వేడుకకు (వసంతోత్సం) ముస్తాబవుతున్నాడు.

విష్ణువు అలంకార ప్రియుడు కాగా, ఆయన అవతారమూర్తి శ్రీనివాసుడు ఉత్సవ ప్రియుడు. ఆయన ఏడాది పొడవునా 450కి పైగా ఉత్సవాలు, సేవలు అందుకుంటున్నాడు. అవి వందల సంవత్సరాల నుంచి ఆయా మాసాలలో నిర్దిష్టంగా కొనసాగుతూ వస్తున్నాయి. అలాంటి వాటిలో వార్షిక వసంతోత్సవం ఒకటి. నూతన సంవత్సరం (చైత్రమాసం)లో జరగడం దీని ప్రత్యేకత. ఈ ఉత్సవం సాధారణ శకం 1360లో ప్రారంభమైందని ఆలయ రికార్డులను బట్టి తెలుస్తోంది. ఏటా చైత్ర శుద్ధ త్రయోదశి నుంచి మూడు రోజుల పాటు ఇవి వైభవంగా జరుగుతాయి. 2019 వరకు శ్రీవారి ఆలయ వెనుక భాగాన గల వసంత మండపంలో ఇవి జరిగేవి. తరువాతి రెండేళ్లు (2020, 2021) కోవిడ్‌ ‌కారణంగా ఆలయ ప్రాంగణంలోనే ఏకాంతంగా నిర్వహించారు. కోవిడ్‌ ‌పరిస్థితులు చక్కబడడంతో గత ఏడాది నుంచి ఈ ఉత్సవాలకు వసంత మండపాన్నే వేదిక చేశారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతాన్ని ప్రకృతి రమణీయత ఉట్టిపడేలా అలంకరిస్తారు. గురువారంతో కూడిన పౌర్ణమిని విశేషంగా భావిస్తారు.

వసంతం రుతురాజు. ‘మాసానాం మార్గ శీర్షోహం… ఋతూనాం కుసుమాకరః’ (నెలల్లో మార్గ శిరము, రుతువులతో వసంత రుతువును) తానేనని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో పేర్కొన్నారు. ప్రపంచంలోని అత్యధిక పూలు వసంతంలోనే పూస్తాయట. వసంతకాలంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు (‘వసంతి సుఖం యథాతథా అస్మిన్నితి’) అని పెద్దల మాట. అతి వేడి, అతి చల్లదనం కాకుండా వాతావరణ సమతుల్యత ఈ రుతువు ప్రత్యేకతగా చెబుతారు. ఆ సమయంలోనే తిరుమలేశుడికి వసంత సంబరాలు జరుగుతాయి. ప్రకృతి ఆరాధనకు సంకేతంగా, వసంత రుతువు ఆగమనానికి గుర్తుగా ఈ వార్షిక వేడుకలను ప్రవేశ పెట్టినట్లు చెబుతారు. ఈ మూడు రోజులూ దేవ ఉభయ దేవేరులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. తిరుమలేశుడికి ఒకే మాసంలో పదిహేను రోజుల వ్యవధిలో రెండు ఆస్థాన ఉత్సవాలు జరగడం మరో ప్రత్యేకత. తిరుమలేశుడికి ఒకే మాసంలో పదిహేను రోజుల వ్యవధిలో రెండు ఆస్థాన ఉత్సవాలు జరగడం మరో ప్రత్యేకత. ఈ పక్రియ లోకానికి, దేవతలకు పెరగబోయే సూర్యతాపం నుంచి ఉపశమనాన్ని స్తుందని నమ్ముతారు. గడచిన సంవత్సరంలో శ్రీవారి అర్చనలో ఏవైనా లోటుపాట్లు చోటుచేసుకుంటే వాటి దోష నివారణ, వర్తమాన వత్సరంలో స్వామి వారి సేవలు నిర్విఘ్నంగా సాగాలని అభిలషించడం కూడా ఈ వేడుకల నిర్వహణ మరో ఉద్దేశమని చెబుతారు.

తెలుగు కొత్త సంవత్సరం ఆరంభంలో తిరుమలేశుడికి ఉగాది అస్థాన ఉత్సవం తరువాత జరిగే మరో ముఖ్య వేడుక వార్షిక వసంతోత్సవం. తిరుమల ఆలయంలో నిత్యం అనేక సేవలు జరుగుతుంటాయి. వీటిలో కొన్ని మూలవరులకు, కొన్ని ఉత్సవమూర్తి మలయప్పస్వామికి నిర్వహిస్తారు. కొన్నిటిని మాత్రం ఆర్జిత సేవలుగా పరిగణిస్తున్నారు. వాటిలో వసంతోత్సవం ఒకటి. నిత్య ఆర్జిత సేవ వసంతోత్సవం, వసంతకాలంలో మూడునాళ్ల వార్షిక సేవ భక్తులను అలరిస్తున్నాయి. నిత్యోత్సవాలలో భాగంగా డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం ముగిసిన తరువాత ఆర్జిత వసంతోత్సవం నిర్వహిస్తారు. ఆర్జిత బ్రహ్మోత్సవంలో సర్వాభరణాలతో పాల్గొన్న మలయప్పస్వామి, ఉభయ దేవేరులను వసంతోత్స వాలకు సిద్ధం చేసే క్రమంలో అర్చకులు ఆ మూర్తులపై గల నగలు తొలగించి తిరుమంజనానికి అవసరమైన ధవళ వస్త్రాలతో అలంకరించి, శుద్ధజలం, ఆవు పాలు, పెరుగు, తేనె, పసుపుతో అభిషేకిస్తారు. చందనం, శ్రీతిలకం దిద్ది తులసీ మాలలతో అలంకరించే దృశ్యం నయనానంద కరంగా ఉంటుంది. అనంతరం ‘ఆస్థానం’ ఉంటుంది.

నూతన సంవత్సరానికి సంబంధించి ఆనంద నిలయుడి ఆరాధన కార్యక్రమాలు, ఉత్సవాలు ఉగాది నుంచి ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా ‘ఆస్థానం’ నిర్వహిస్తారు. ఆస్థానం అంటే కొలువు దీరడం అని అర్థం. తిరుమలేశుడు వేంచేపు చేసే స్థలాన్ని ‘ఆస్థానం’ అంటారు. ఉగాది, వసంతోత్సవం తదితర సందర్భాలలో శ్రీవారు కొలువు తీరతారు కనుక ఆయా పేర్లపై ‘ఆస్థానం’ (‘ఉగాది/వసంతోత్సవ/ దీపావళి/మకర సంక్రమణ ఆస్థానం) అని వ్యవహరిస్తారు. ఇది, తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు హాజరై బాధ్యతలకు పునరంకితమయ్యే పక్రియని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దేవస్థానం పూర్వ కార్యనిర్వహణాధికారి పీవీఆర్కే ప్రసాద్‌ ఒక సందర్భంలో తెలిపారు. మరో కోణంలో భగవంతుడు తాను ఆనందిస్తూ, లోకాన్ని ఆనందింప చేయడమే దీని అంతరార్థంగా చెబుతారు. నిజానికి ఇదంతా భక్తజనానందం కోసమే.

ఉగాది ఆస్థాన ఉత్సవం తరువాత ప్రధానమైనది వసంతోత్సవం. మూడునాళ్ల ఈ వసంతోత్సవం ముందురోజు అంకురార్పణ (నవధాన్యాలు విత్తడం), పుణ్యహవాచన (శుద్ధి పక్రియ), వాస్తు, సంప్రోక్షణ ఆచారాలతో ప్రారంభ మవుతుంది. చైత్రశుద్ధ త్రయోదశి ఉదయం శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీమలయప్ప స్వామి ఛత్రచామర మర్యాదలు, దివ్య ప్రబంధ పారాయణం, మంగళవాయిద్యాల నడుమ బంగారు రథంపై ఆలయానికి ప్రదక్షిణగా ఊరేగుతూ వసంత మండపానికి చేరుకుంటారు. అక్కడ దేవదేవేరులను శుద్ధోదకం, ఆవుపాలు, పెరుగు, తేనె పసుపుతో అభిషేకిస్తారు. ధూపదీపారాధన, కర్పూర హారతులు ఇస్తారు. ముగ్గురు మూర్తులను చందన, తులసీమాలతో అలంకరిస్తారు.

శ్రీచందనం సమర్పిస్తారు. కుంభహారతి, నక్షత్ర హారతి సమర్పణ తరువాత మంత్రజలంతో సహస్రధారాభిషేకం నిర్వహించి, పట్టువస్త్రాలతో అలంకరిస్తారు. దేవదేవుడి అభిషేకంలో వినియోగించిన పసుపు, చందనాలను భక్తులకు వితరణ చేస్తారు. శ్రీవారు ఆస్థానంలో పాల్గొన్న తరువాత సాయంత్రం ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. భక్తజనం పవిత్రులు కావాలనే ఉద్దేశంతో సహస్రధారాభిషేక తీర్థాన్ని వారి శిరస్సులపై సంప్రోషిస్తారు. రెండవ రోజు (చతుర్దశి) దాదాపు ఇదే పక్రియ కొనసాగుతుంది.

మూడవ నాడు (పౌర్ణమి) శ్రీమలయప్పతో పాటు శ్రీసీతారామలక్ష్మణ హనుమ; రుక్మిణీ కృష్ణులు వేర్వేరు వాహనాలపై ఊరేగింపుగా వసంత మండపానికి చేరుకుంటారు. అక్కడ వారికి విడివిడిగానే అభిషేకాదులు నిర్వహిస్తారు. ‘త్రేత, ద్వాపర యుగాలలో రామకృష్ణులు నేనే’ అనే భావాన్ని వేంకటేశ్వరుడు ప్రకటిస్తున్నాడని భావం. త్రేత, ద్వాపర యుగాలలోని శ్రీరామ, శ్రీకృష్ణావతారాల ఉభయశక్తులకు (రామకృష్ణత్వ) ప్రతీకగా శ్రీనివాసుడు వేంకటాచలంపై నిలిచి ధర్మరక్షణ, భక్త పాలన చేస్తున్నాడు. రామకృష్ణా వతారాలలోని అన్ని శుభాలను స్వీకరించి ‘వేంకట రామకృష్ణుల’ ఏక మూర్తిగా అర్చావతార రూపంలో కృపాకాంతులను వెదజల్లుతున్నాడు. వసంత వేడుకల అనంతరం సాయంత్రానికి ఆలయానికి చేరుకుంటారు. ఈ మూడు రోజుల ఉత్సవాల సందర్భంగా స్వామిని వివిధ రకాల పుష్పాలతో, ప్రధానంగా తులసితో అర్చించి, పలు రకాల పండ్లను నైవేద్యంగా సమర్పించడం విశేషం.

భగవంతుడు నిత్యానంద కారకుడు. అందులోనూ ఈ రుతువులో మహా ప్రసన్నంగా ఉంటాడట. వసంతోత్సవం నాటి వైభవాన్ని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందుకే నూతన దంపతులు ఈ ఉత్సవాలకు హాజరుకావడం మంచిదని పెద్దలు సూచిస్తారు. అరమరికలు లేకుండా అన్యోన్యంగా జీవించేలా ఔన్నత్యాన్ని పెంచుకునేలా స్వామి ఆశీర్వదిస్తారని విశ్వాసం.

వసంతోత్సవం సందర్భంగా తిరుమలలో పుష్పధారణ నిషేధాన్ని ప్రస్తావించుకోవడం సముచితం. శ్రీవారిని సర్వసేవలలోనూ పూలతో అర్చిస్తారు. ప్రధానంగా వసంతోత్సవం, పుష్పయాగం సందర్భంగా అది మరింత ప్రత్యేకం. తిరుమల క్షేత్రంలో ఆయనకు ఉద్దేశించిన పుష్పాదులను స్త్రీపురుషులు ధరించరాదని భగవద్రామానుజా చార్యులు కట్టడి చేశారు. శ్రీవేంకటాచలం పవిత్రతను కాపాడేందుకు ఆయన ప్రవేశపెట్టిన విధి విధానాలలో ఇదీ ఒకటి. అది నేడు అమలవుతున్న తీరుపై భక్తకోటి ఆత్మపరిశీలన చేసుకోవలసి ఉంటుంది. పీవీఆర్కే తెలిపిన వివరాలను బట్టి ‘కొన్ని శతాబ్దాలు స్వామివారి నిర్మాల్య పుష్పాలు భక్తులకివ్వడం, వారు వాటిని స్వామి ప్రసాదంగా స్వీకరించి వాటితో తమ ఇళ్లలోని పూజా విగ్రహాలకు కైంకర్యం చేసేవారట. అలా సమర్పించిన తరువాతే వాటిని ప్రసాదంగా స్వీకరించేవారట.

అయితే తమ ఇళ్లలో దేవతా మూర్తులకు తిరుమలపై స్వామి వారికి ‘నివేదించని’ పుష్పాలతో కైంకర్యం చేసే సంప్రదాయం లేదు.’ రామానుజల నిర్ణయం నేపథ్యం గురించి వేంకటాచల ఇతిహాసంలో ఒక ప్రస్తావన కనిపిస్తుంది. ఒకనాడు శ్రీనివాసుడికి ‘సమర్పించని’ పూలను శ్రీశైలపూర్ణుల శిష్యుడొకరు ధరించాడట. ఆ రాత్రి స్వామివారు శ్రీశైలపూర్ణులకు స్వప్న సాక్షాత్కరం చేసి ‘నీ శిష్యుడు పరిమళ ద్రోహం చేశాడు’ అని చెప్పడంతో, ఇక• మీదట నిర్మ్యాం కూడా భక్తులకు ఇవ్వకుండా వాటిని పూలాబావి లోనూ, తీర్థాలలో వదలి సంప్రదాయాన్ని తెచ్చారు. స్వామి వారికి ‘నివేదించని’పూలను ‘నివేదించిన’ ట్లుగా చెప్పి ధరించే అవకాశం ఉండడంతో కొండమీద పుష్పాలే ధరించరాదని కట్టడి చేయగా, చాలా కాలం అది సక్రమంగానే అమలైంది.

కల్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయినే!

శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళమ్‌!!

About Author

By editor

Twitter
YOUTUBE