శ్రీమహావిష్ణువు దశవతారాలలో నాలగవది నృసింహుడు అవతారరీత్యా ఉగ్రమూర్తే అయినా కరుణాంతరంగుడు. దుష్టశిక్షణ కోసం స్తంభంలో ఉద్భవించి, శిష్టులకు ప్రసన్నాకృతితో సాక్షాత్కరించారు. మంగళాద్రి (మంగళగిరి), అహోబిలం నృసింహ క్షేత్రాలలో ఫాల్గుణ శుక్ల పక్షంలో బ్రహ్మోత్సవ/ కల్యాణోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

గుంటూరు జిల్లాలో కృష్ణానదీ తీరంలో గజాకార కొండకు మంగళాచలం, మంగళశైలం, మంగళాద్రి, తోతాద్రి, ధర్మార్తి, ముక్త్యాద్రి అనీ నామాంతరాలు ఉన్నాయి. ఐశ్వరప్రదాయిని శ్రీలక్ష్మీ దేవి అధిష్ఠించిన క్షేత్రం కనుక మంగళ ప్రదమైనదని, ‘మంగళ’గిరి అని పేరు వచ్చిందని పురాణ కథనం. ఈ క్షేత్రంలో నరసింహస్వామి మూడు రూపాలలో కొలువై ఉన్నారు. పర్వత శిఖరాగ్రాన గండాల నరసింహ స్వామి, కొండ మధ్యభాగాన పానకాల నరసింహ స్వామి, కొండ కింద శ్రీలక్ష్మీ నరసింహ స్వామిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఎగువ సన్నిధిలో (పానకాల స్వామి) ఉదయ, మధ్యాహ్నకాల అర్చనలు, దిగువ (శ్రీరాజ్యలక్ష్మీ నరసింహస్వామి) సన్నిధిలో త్రికాలార్చనలు జరుగుతాయి.

స్థల పురాణం ప్రకారం, ఈ పర్వత గుహలోకి ప్రవేశించిన బ్రహ్మ వరప్రసాది, లోకకంటకుడు నముచి అనే దానవుడిని విష్ణువు నృసింహరూపంలో సంహరించారు. త్రినేత్రాలతో భీకరంగా ఉన్న ఆ మూర్తిని చూసి దేవతలే భీతిల్లారట. ఉగ్రరూపం ఉపశమనం కోరుతూ బ్రహ్మరుద్రాదులు స్తుతించగా, తన ఆజ్ఞతో దేవతలు తీసుకువచ్చిన అమృతాన్ని స్వీకరించి శాంతించారట. నాటి నుంచి యుగధర్మం ప్రకారం (కృతయుగంలో అమృతం, త్రేతాయుగంలో ఆవునేయి, ద్వాపరంలో గోక్షీరం, కలియుగంలో బెల్లం పానకం) నైవేద్యంగా స్వీకరిస్తున్నారు. నాడు దేవతలు అందించిన అమృతంలో సగం మాత్రమే స్వామి స్వీకరించి మిగిలినది బయటకు వదిలారట. కలియుగంలో సమర్పిస్తున్న పానకం ప్రసాదం కూడా ఆ కోవ కిందికే వస్తుందని చెబుతారు. తరతరాలుగా ఇలా పానకం తయారు చేసి సమర్పిస్తున్నా, ఆలయ ప్రాంగణంలో చీమలు, ఈగలు వంటివి కనిపించక పోవడాన్ని ప్రత్యేకతగా చెబుతారు. శంకర భగవత్పాదులు, చైతన్యప్రభువు ఈ క్షేత్రాన్ని సందర్శించారన్న నిదర్శనంగా వారి పాదచిహ్నాలను మెట్లపై మలచారు. శ్రీరామచంద్రుడి ఆదేశం మేరకు భక్తాంజ నేయుడు ఇక్కడ క్షేత్రపాలకుడిగా స్థిరనివాసం ఏర్పరచు కున్నారని మరో పురాణగాథ.

వార్షిక కల్యాణోత్సవాలు

ఏటా ఫాల్గుణ శుద్ధ షష్ఠినాడు మొదలైన వార్షిక కల్యాణోత్సవాలు పదకొండు (తొమ్మిది) రోజుల పాటు సాగుతాయి. శుద్ధ చతుర్దశి నాటి రాత్రి కల్యాణం, మరుసటి రోజు రథోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని దక్షిణాది ‘పూరి’ రథోత్సవం’గా భక్తులు విశ్వసిస్తారు. ‘మంగళగిరి తిరునాళ్ల’కు తెలుగునాట ప్రత్యేకత ఉంది. ఫాల్గ్గుణ బహుళ తదియ నుంచి పది రోజుల పాటు రోజుకు ఒక అవతారంలో స్వామిని అలంకరించి అర్చిస్తారు.

అహోబిలేశ్వరా! నమో నమః…

తిరుమల నుంచి శ్రీశైలం వరకు ఆదిశేషుని ఆకృతిలో గల పర్వత•పంక్తిలోని మధ్య ప్రదేశం అహోబిలం. దీనికి అహోబలం, అహోబిలం, అహోబిలగిరి, ఓబులం, దిగువ తిరుపతి, గరుడాద్రి, వీరక్షేత్రం, నగరి, నిధి, తక్ష్యాద్రి, నరసింహతీర్థం, గరుడాచలం తదితర పేర్లు ఉన్నా ‘అహోబిలం’ పేరే ప్రాచుర్యంలోకి వచ్చింది. హిరణ్యకశిపుని సంహరణకు శ్రీహరి స్తంభం నుంచి ఉద్భవించగా పేరెన్నిక గన్నదే శ్రీ ఉగ్ర నరసింహక్షేత్రం అహోబిలం. స్తంభోద్భవుడు (నృసింహుడు) ఒక పాదం అహోబిలంలో, మరో పాద•ం పెన్నాహోబిలంలో (అనంతపురానికి సుమారు 22 కి.మీ. దూరంలోని కొండపై) మోపి హిరణ్యకశిపుడిని సంహరిం చాడని జనశ్రుతి. అసుర సంహారం తరువాత స్వామి  అహోబిలంలోని ‘రక్తకుండం’లో చేతులు కడుక్కున్నారని చెబుతారు. మహోగ్ర నరసింహమూర్తిని వీక్షించి భీతాశ్చార్యాలకు లోనైన బ్రహ్మరుద్ర ఇంద్రాది దేవతలు, గంధర్వ, యక్షకిన్నెర, కింపురుషులు, ప్రజాపతులు, రుషులు తదితరులు ‘అహో వీర్యం అహో శౌర్యం అహో బాహు పరాక్రమంః/నారసింహం పరందైవం అహోబలం అహోబలం’ అని శ్లాఘించారట. కాలక్రమంలో అది ‘అహోబిలం’గా మారిందంటారు. గరుత్మంతుడి ఘోర తపస్సుకు ప్రసన్నుడైన నరసింహుడు గుహ(బిలం)లో దర్శనమివ్వడంతో ‘అహోబిలం’అనే పేరు వచ్చిందని మరో కథనం ప్రచారంలో ఉంది. స్వామివారి సాక్షాత్కారంతో సంతోషాతిశయంతో పక్షిరాజు ‘అహోబిలం మహాబలం’ (అహోబలక్షేత్రం మనలను మహాబలవంతులను చేస్తుంది)అన్నాడనీ కథనం.ఈ నవనారసింహ క్షేత్రంలో ఎగువ అహోబిలంలో చెంచులక్ష్మీ సమేత ఉగ్రనరసింహ, దిగువన ప్రహ్లాద వరద శ్రీ అమృతవల్లి నరసింహుడిగా స్వామి దర్శన మిస్తున్నారు. ‘అహోబలేశుడు’గా పూజలందుకునే స్వామి జన సామాన్యంలో ‘ఓబులేశు’గా మారాడు. మహా బలపరాక్రమాలతో స్వామి బిలం(గుహ)లో దర్శనం ఇవ్వడంవలన ఈ క్షేత్రానికి ‘అహోబలం, ‘అహోబిలం’ అనే పేర్లు వచ్చాయని ప్రతీతి. పన్నెండు మంది ఆళ్వారులలో ఒకరు (ఎనిమిదవ శతాబ్దానికి చెందిన) తిరుమంగై ఆళ్వార్‌ ఈ ‌క్షేత్రాన్ని ‘సింగవేల్‌ ‌కుండ్రమ్‌’ అన్నారు. తమిళులు నేటికీ ఇలాగే వ్యవహరిస్తారు.

కానుగ వృక్షం కింద కొలువై ఉన్నందున కారంజ నరసింహుడు అని పేరు వ్యవహరిస్తారు. తమ ఆడపడుచు చెంచులక్ష్మిని మనువాడడం ద్వారా నరసింహుడు తమ అల్లుడయ్యాడన్నది ఈ ప్రాంతం (నల్లమల) చెంచుల ప్రగాఢ విశ్వాసం. గిరిజనులు స్వామి వారికి జుంటు తేనె, అడవి మాంసం నైవేద్యంగా పెట్టేవారట. దివిజ గంగ ‘భవనాశిని’గా భువికిదిగి వచ్చి నృసింహుని పాదాలు కడుగుతూ ప్రవహిస్తోంది. ఇది భవరోగాలకు దివ్యౌషధమని విశ్వాసం. దీనిద్వారా సకల పుణ్యాలు సమకూరు తాయని సాక్షాత్తు స్వామివారే అనుగ్రహించారని పురాణవాక్కు. ఫాల్గుణ శుద్ధ పంచమి నుంచి పౌర్ణమి వరకు స్వామి వారి కల్యాణోత్సవాలు జరుగుతాయి. ఈ క్షేత్రాన్ని పురాణపురుషులు పరశురామ, రామలక్ష్మణులు,బలరామ శ్రీకృష్ణార్జునులు, త్రిమతా చార్యులు శంకర, రామానుజ. మధ్వాచార్యులు సందర్శించి స్వామిని అర్చించారని ఐతిహ్యం. విశిష్టాద్వైత స్థాపకులు రామానుజాచార్యులు, అనంతర కాలంలో వేదాంత దేవికులు, పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు ఈ స్వామి ఘనతను తమ సంకీర్తనలలో కీర్తించారు.

– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram