‘నెహ్రూ అన్న ఇంటిపేరు మీరు ఎందుకు పెట్టుకోలేదు? భయమా?’ ఇటీవల ముగిసిన పార్లమెంట్‌ ‌సమావేశా లలో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌ అధినేతలను ఉద్దేశించి రాజ్యసభలో సంధించిన ప్రశ్న ఇది. నెహ్రూ సేవలను విస్మరిస్తూ, కొన్ని పథకాలకు ఆయన పేరును తొలగిస్తున్నారని  పెద్దల సభలో కాంగ్రెస్‌ ‌సభ్యులు రగడ సృష్టించినప్పుడు ప్రధాని ఆ ప్రశ్నతో నిలదీశారు. ఫిబ్రవరి 9న జరిగిన ఈ ఇంటిపేర్ల వివాదం నెలన్నర రోజులకే దేశ రాజకీయాలలో పెను మార్పునకు దారితీసింది. ఇటీవలి రాజకీయాలలో ఒక సంచల నంగా మిగిలింది. మోదీ అన్న ఇంటిపేరును ఘోరంగా అవమానించినందుకు ఆయనకు రెండేళ్లు జైలు శిక్ష పడింది. నాలుగేళ్ల నాటి ఈ పరువు నష్టం వ్యాజ్యం కారణంగానే రాహుల్‌ ‌లోక్‌సభ సభ్యత్వం కోల్పోయారు. ఇక్కడ ఒక సంగతి గుర్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 14న వాయినాడ్‌లో ఒక సభలో మాట్లాడుతూ రాహుల్‌ ఇం‌టిపేరు తండ్రి నుంచే వస్తుందని మోదీకి తెలిసి ఉండదు అని సంప్రదాయాల పట్ల తనకు ఉన్న పరిజ్ఞానాన్ని ప్రదర్శించుకున్నారు. ఇంటిపేరుకు ఉన్న ప్రాధాన్యం, దానితో ఉన్న అనుబంధాలు, వారసత్వ విలువ గురించి ఇంత గొప్పగా తెలిసిన రాహుల్‌ ‌గాంధీకి ఒక ఇంటి పేరు వారంతా దొంగలు అని వ్యాఖ్యానించడం ఎంత హీనాతి హీనమైన కుసంస్కారమో ఎందుకు తెలియలేదు?

మోదీ అనే ఇంటి పేరు మీద బురద చల్లి రాహుల్‌ ‌లోక్‌సభ సభ్యత్వం కోల్పోయిన నేపథ్యంలో విలువల వలువలన్నీ వదిలేసిన మూకలు రాజకీయ నాగరికతను రక్షించండంటూ ఊరేగింపునకు తెగబడిన వింత దృశ్యాన్ని ఈ దేశం వీక్షించవలసి వచ్చింది. 2019 నాటి సాధారణ ఎన్నికల ప్రచారంలో  ఏప్రిల్‌ 13‌న కర్ణాటకలోని కోలార్‌ ‌దగ్గర రాహుల్‌ ఎవరూ హర్షించని విధంగా ఒక ఇంటి పేరు మీద బురద చల్లారు. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ గుజరాత్‌ ‌శాసనసభ సభ్యుడు పూర్ణేశ్‌ ‌మోదీ పరువు నష్టం దావా వేశారు. దీని మీదే సూరత్‌ ‌న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి హెచ్‌హెచ్‌ ‌వర్మ రాహుల్‌ను దోషిగా నిర్ధారించి రెండేళ్ల కారాగార వాస శిక్ష విధించారు. జస్టిస్‌ ‌వర్మ ఈ శిక్ష అమలు కాకుండా నెల రోజులు తానే స్టే ఇచ్చారు.

‘నీరవ్‌ ‌మోదీ, లలిత్‌ ‌మోదీ, నరేంద్ర మోదీ అన్న ఇంటి పేరు ఎందుకుంది? దొంగలందరికీ మోదీ అనే ఇంటి పేరు ఎందుకు ఉంటుందో!’ అని రాహుల్‌ ‌గాంధీ వ్యాఖ్యానించారు. దీనికే సూరత్‌ ‌కోర్టు ఈ శిక్ష విధించింది. ఈ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా ఇలా మాట్లాడడం రాహుల్‌ ‌గాంధీకి రివాజేనన్న ధ్వని వినిపిస్తుంది. ఆదానీ మీద తాను మాట్లాడితే కల్లోలం చెలరేగుతుంది కాబట్టే ఇలా ఆగమేఘాల మీద లోక్‌సభ సభ్యత్వానికి అనర్హత ప్రకటించారని రాహుల్‌ ‌వ్యాఖ్యానించడమే వింతల్లో కల్లా వింత. ఇది ఆదాని గురించి మాట్లాడకుండా చేయడానికి కాదు, 2019 నాటి కేసులో వచ్చిన తీర్పు, దాని పర్యవసానాలని ఎంత చెప్పినా ఆయన బుర్రకు ఎక్కడం లేదు. తన సభ్యత్వం అనర్హత గురించి ఆయన గంటకు పైగా విలేకరులతో మాట్లాడారు. ఇందులో మళ్టీ కోర్టు ధిక్కారమే కనిపించింది. సత్యమే ఆయన దేవుడట. సత్యం, అహింసలే ఆయన మతమట. వాటిని చేరడానికి అహింసే మార్గమట. ‘రాహుల్‌ ‌తాను చేసే ప్రకటన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సుప్రీం కోర్టు గతంలోనే సూచించింది. అయినప్పటికీ ఆయన ప్రవర్తనలో మార్పు లేదు’ అంటూ సూరత్‌ ‌కోర్టు వ్యాఖ్యానించింది. సూరత్‌ ‌కోర్టు చెప్పినా ఈయనలో మార్పు రాలేదని ఇప్పుడు అనిపిస్తుంది. రాహుల్‌ ఇప్పటికీ బరితెగించి మాట్లాడుతున్నారు. ఆయన పార్టీ దేశంలో అల్లర్లకు సిద్ధమైంది. రాహుల్‌ ఒక ఇంటి పేరు మీద తీవ్ర వ్యాఖ్యలు చేసి క్రిమినల్‌ ‌నేరానికి పాల్పడ్డారని ఆ కోర్టు నిర్ధారించినా, దేశమంతటా సంకల్ప సత్యాగ్రహం పేరుతో కాంగ్రెస్‌ ‌ప్రదర్శనలు నిర్వహించింది. కొన్నిచోట్ల నరేంద్ర మోదీ, అమిత్‌ ‌షా దిష్టిబొమ్మలను దహనం చేశారు.

తీర్పు వచ్చిన మరుక్షణమే రాహుల్‌ను అనర్హునిగా ప్రకటించాలా అంటూ నాటు కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌, ఇతర విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇదీ ఈ దేశ విపక్షాల న్యాయ పరిజ్ఞానం. ఇదంతా ఆదాని గురించి మాట్లాడడానికి చేసినదేనట. అలా అయితే ఈ నేరంలో మొదటి ముద్దాయి మళ్లీ రాహుల్‌ అవుతారు. ఎందుకంటే చట్టసభ సభ్యుని మీద క్రిమినల్‌ ‌నేరం మీద శిక్ష పడితే తక్షణం సభ్యత్వం రద్దు కావాలని పాత చట్టమే చెబుతోంది. అది రాజ్యాంగకర్తల నిర్ణయం. సవాలక్ష అవినీతి కార్యకలాపాలలో మునిగిన లాలూ ప్రసాద్‌ ‌యాదవ్‌ ‌లోక్‌సభ సభ్యత్వం ఇలాగే రద్దయ్యే పరిస్థితి ఏర్పడింది. దీనితో నాటి యూపీఏ ప్రభుత్వం అప్పీలు చేసుకోవడానికి పాత చట్టం ఇచ్చిన నెల గడువును, మూడు నెలలకు పెంచి డాక్టర్‌ ‌మన్మోహన్‌సింగ్‌ ‌ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. అంటే అప్పీలు దాకా సభ్యత్వం అనర్హత పరిధిలోకి రాదు. అలా సభ్యుడుకి కొనసాగే అవకాశం వస్తుంది. సరిగ్గా ఆ ఆర్డినెన్స్‌నే, అంటే తన పార్టీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌నే రాహుల్‌ ‌గాంధీ విలేకరుల సమావేశంలో హఠాత్తుగా ప్రత్యక్షమై చించివేశారు. ఆ ఆర్డినెన్స్‌ను యూపీఏ అమలు చేయలేదు. ఇప్పుడు అదే రాహుల్‌ ‌పదవికి ఎసరు పెట్టింది. ఆ కేసు వివరాలలోకి కూడా ఒకసారి వెళ్లాలి.

1951 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 8(3) నిబంధన ప్రకారం ఒక చట్టసభ సభ్యుని మీద కేసు రుజువై రెండేళ్లు శిక్ష పడితే అతడి సభ్యత్వం పోతుంది. కానీ అదే సెక్షన్‌లోని 8(4) మాత్రం సభ్యుడి మీద అనర్హత అనేది శిక్ష పడిన రోజునుంచి మూడు మాసాల తరువాత చెల్లుబాటు అవుతుందని చెబుతోంది. ఆ కాలంలో చట్టసభ సభ్యుడు తనకు పడిన శిక్ష మీద పై కోర్టుకు అప్పీలుకు వెళ్లవచ్చు. కానీ ఈ వెసులుబాటు రాజ్యాంగ విరుద్ధమని నిర్ధారించిన సుప్రీం కోర్టు 2013లో కొట్టివేసింది. ఇదే లిలీ థామస్‌ ‌వర్సెస్‌ ‌భారత ప్రభుత్వం కేసు.  ఈ 8(4)ను సవాలు చేస్తూ 2005లో కేరళ న్యాయవాది లిలీ థామస్‌, ‌లోక్‌ ‌ప్రహారీ అనే స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎన్‌ ‌శుక్లా సుప్రీంను ఆశ్రయించారు. లిలీ థామస్‌ ‌భారతదేశంలోనే న్యాయశాస్త్రంలో మాస్టర్స్ ‌డిగ్రీ తీసుకున్న (1959) తొలి మహిళ. నేరం రుజువైన చట్టసభ్యులను అప్పీలు పేరుతో ఈ సెక్షన్‌ ‌రక్షణ కల్పిస్తున్నదని ఆ ఇద్దరి వాదన. కేసు పెండింగ్‌లో ఉన్నది కాబట్టి అనర్హత ప్రశ్న ఉత్పన్నం కాదు. ఆ సెక్షన్‌కు ఉప సెక్షన్‌ను జత చేసే హక్కు పార్లమెంటుకు లేదని జస్టిస్‌ ఏకే పట్నాయక్‌, ‌జస్టిస్‌ ఎస్‌జే ముఖోపాధ్యాయలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం జూలై 10, 2013న తీర్పు చెప్పింది.

లోక్‌సభ సెక్రటరీ రాహుల్‌ అనర్హతను ప్రకటించగానే దీనిని తొందరపాటు అని కొందరు వ్యాఖ్యానించారు. ఇంత తొందర ఎందుకు? అప్పీలు వరకు ఆగవచ్చు కదా! అని ఒక పెద్దమనిషి వ్యాఖ్యానించడం అంతా చూశాం. వీటన్నిటి సారాంశం ఒక్కటే. ప్రజాస్వామ్యం ఏమై పోవాలి అన్న ప్రశ్న. అంటే ఒక ఉప ఎన్నికను నివారించడానికి సూరత్‌ ‌కోర్టు తీర్పు మొదలు వెనక్కి వెళితే లిలీ థామస్‌ ‌కేసు, సుప్రీం కోర్టు తీర్పునకు విలువ లేకుండా చేయడమేనా? వాయినాడ్‌లో ఒక ఉప ఎన్నికను నివారించడానికి ఇంతటి రాజ్యాంగ మథనాన్ని అటకెక్కించాలా? గంటసేపు విలేకరులతో మాట్లాడిన రాహుల్‌ ‌తన వ్యాఖ్య గురించి ఒక్కసారైనా ప్రస్తావించలేదు. అంటే సూరత్‌ ‌కోర్టు తీర్పును ఆయన గౌరవించడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని బట్టి మేధావుల రాజ్యాంగ పరిజ్ఞానం మారిపోతుందా? చట్టం ముందు అంతా సమానమేనన్న సూత్రాన్ని అవసరమైతే పక్కన పెట్టాలి (ప్రధానంగా గాంధీ-నెహ్రూ కుటుంబ సభ్యుల విషయంలో)  అనే వీరంతా టీవీ చానళ్లలో, పత్రికలలో హోరెత్తిస్తున్నారు. కోర్టు తీర్పు, లోక్‌సభ కార్యదర్శి వీరంతా చేసినది సాంకేతికంగా సరైనదే. కానీ దానిని అంత కఠినంగా అమలు చేయాలా అనడం ఏమిటి? కోర్టులు చెప్పినది సరైనదే అంటే రాజ్యాంగం చెప్పినదే కదా! దానిని అమలు చేయడంలో మళ్లీ ముందు వెనుకలు ఏమిటి? మనిషికి మనిషికి తేడా ఏమిటి? ఇలాంటి కేసుల మీద ఇలాంటి తీర్పులు కోర్టులు ఇచ్చుకుంటూ పోతే పార్లమెంటు, శాసనసభలు, శాసన మండళ్లు అన్నీ ఖాళీ అవుతాయని మరొక నేత వ్యాఖ్య. ఏ మాత్రం మర్యాద లేకుండా మాట్లాడే కొందరు రాజకీయ నాయకులు ధోరణి మార్చుకోవాలని చెప్పకుండా, రాజ్యాంగం మేరకు తీర్పులు ఇచ్చే కోర్టులను పరోక్షంగా తప్పు పట్టడంలోని ఔచిత్యం ఏమిటో ఎవరికీ అర్ధం కాదు. రాహుల్‌ అనర్హత వ్యవహారాన్ని పరిశీలిస్తున్నామని ఐక్యరాజ్య సమితి ప్రకటించడం ఏమిటో అసలే అర్ధం కాదు. రాహుల్‌ ఒక విదూషకుని కంటే తక్కువేమీ కాదు అన్న బరాక్‌ ఒబామా (అమెరికా మాజీ అధ్యక్షుడు) వ్యాఖ్య మరీ వికృతం. రాహుల్‌ ‌చెప్పినట్టు భారతదేశంలో ప్రజాస్వామ్యం లుప్తమైపోతున్నదన్న మాట నిజమని అనుకోవలసి వస్తున్నదని ఆయన అన్నారు. ఇలా కూడా ఆయన విదేశీయుల జోక్యాన్ని తెస్తున్నారు.

తమ కుటుంబానికి ప్రత్యేక హక్కులు ఉండాలని రాహుల్‌, ఆయన సోదరి ప్రియాంక పరోక్షంగా మాట్లాడుతున్నారు. ఔను ఉండాలంటూ పార్టీ కార్యకర్తల చేత ప్రత్యక్షంగా చెప్పిస్తున్నారు. కోర్టు తీర్పుల మీద వీధులలో నిరసనలు ప్రకటించే సంస్కృతి ప్రజాస్వామ్యానికి చేటు. కానీ మేమే ప్రజాస్వామ్య రక్షకులమని కాంగ్రెస్‌ ‌వారు మాట్లాడుతున్నారు. 1975లో ఇందిర ఎన్నికకు వ్యతిరేకంగా అలహాబాద్‌ ‌హైకోర్టు తీర్పు ప్రకటించిన తరువాత కూడా కాంగ్రెస్‌ ‌పార్టీ సరిగ్గా ఇవే విన్యాసాలు చేసింది. కాబట్టి ప్రజాస్వామ్యం మీద కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రకటించే ప్రేమ ఒక కపట నాటకం. దానిలో చాలా ప్రతిపక్షాలు కూడా పాత్రధారులవుతున్నాయి.  ఇది భారత ప్రజాస్వామ్యానికి కొత్త బెడద.

About Author

By editor

Twitter
Instagram