పదిహేనేళ్ల క్రితం ఆస్కార్‌ ‌వేదికపై ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌. ‌రెహమాన్‌ ‘‌స్లమ్‌ ‌డాగ్‌ ‌మిలియనీర్స్’ ‌చిత్రంలోని ‘జయహో..’ గీతానికి గానూ బెస్ట్ ఒరిజినల్‌ ‌సాంగ్‌ ‌కేటగిరిలో ఆ పాటను రాసిన గుల్జార్‌తో కలిసి ఆస్కార్‌ను అందుకున్నారు. సరిగ్గా అదే సన్నివేశం పునరావృతం అయ్యింది. ఇప్పుడు అదే ఆస్కార్‌ ‌వేదికపై ఉన్నది స్వరకర్త కీరవాణి, గీత రచయిత చంద్రబోస్‌. అయితే ఈ రెండు దృశ్యాల మధ్య ఎంతో తేడా ఉంది. మొదటి సినిమా భారతీయ నేపథ్యంలో తెరకెక్కినా… మనది కాదు. కానీ రెండోది అచ్చతెలుగు సినిమా. దాన్ని నిర్మించింది డీవీవీ దానయ్య కాగా, తెరకెక్కించింది రాజమౌళి. ఇద్దరూ తెలుగు వ్యక్తులు. నూరు శాతం తెలుగు సినిమాకు అంతర్జాతీయ యవనికపై లభించిన అరుదైన, తొట్ట తొలి ప్రతిష్ఠాత్మక గౌరవం ఇది. భారతీయ సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయాల్సిన ఆ సినిమా పేరు ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌.’ (‌రౌద్రం, రణం, రుధిరం). నిజంగానే ఈ సినిమా కోసం దర్శకుడు రాజమౌళి తన బృందంతో కలిసి రౌద్రం ప్రదర్శిస్తూ, రణం చేసి, రుధిరాన్ని చిందించారు. ఫలితంగా తెలుగు పాటకు ఆస్కార్‌ ‌జ్యూరీ జయహో అంది!

తొలి నుండి వివాదాలే!

తెలుగు సినిమా వెలుగు బావుటా రాజమౌళి. సహజంగా ఆయన తన సినిమా ప్రారంభ సమయంలోనే దాని కథ, కమామీషును వివరించి, ప్రేక్షకులను మానసికంగా సిద్ధం చేస్తారు. ‘బాహుబలి’ వంటి విజువల్‌ ‌వండర్‌ ‌సినిమాను చూసి ఆస్వా దించాలి తప్పితే, కథ విషయంలో లోతుపాతులకు పోవాల్సిన అవసరం ఉండదు. రెండు భాగాలుగా తెరకెక్కిన ఆ సినిమా ప్రథమార్థాన్ని ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’ అనే ప్రశ్నను సంధించి, ద్వితీయార్థంపై ఆసక్తిని కలిగించాడు రాజమౌళి. దేశ ప్రధానితో సహా పలువురు అనేక సందర్భాలలో ఆ మాటలనే ఉదహరిస్తూ వచ్చారు. ఫలితంగా రాజమౌళి స్ట్రేటజీతో ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ ‌మొదటి భాగం కంటే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత రాజమౌళి రూపొందించిన చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌.’ ఇది రాజమౌళి తెరకెక్కించిన సినిమాలలో అత్యంత వివాదాలకు తెరలేపింది. అటు అల్లూరి సీతారామరాజును, ఇటు కొమరం భీమ్‌ను తలపించే పాత్రలతో ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌.’‌ను రూపొందిస్తు న్నట్టు రాజమౌళి మొదటే చెప్పేశారు. ఎన్నడూ కలుసుకోని ఈ చారిత్రక పురుషులను కలిసినట్టు తెరపై ఎలా చూపిస్తారు? ఒకరు బ్రిటిషర్స్‌కు, మరొకరు నిజాం నవాబుకు వ్యతిరేకంగా చేసిన పోరాటాన్ని ఒకే గాటన ఎలా కడతారు? అనే సందేహాలను పలువురు వ్యక్తం చేశారు. కొమరం భీమ్‌ను తలపించే పాత్రధారి ఎన్టీయార్‌ ‌నెత్తిన ముస్లిం టోపీని పెట్టడం, అల్లూరి సీతారామరాజును తలపించే పాత్రధారి రామ్‌చరణ్‌ను బ్రిటిషర్స్ ‌దగ్గర పనిచేసే జవానుగా చూపించడంతో సినిమా విడుదలకు ముందే పెద్ద వివాదానికి దారి తీసింది. అలానే ఇటు కొమరం భీమ్‌, అటు అల్లూరి సీతారామరాజుకు చెందిన వారసులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆ వివాదాలన్నింటినీ ఎదుర్కొంటూ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై విజయ కేతనం ఎగరేసింది.

సినిమా కథకు సంబంధించిన వివాదాలు ఇలా ఉంటే, ఆస్కార్‌ ‌నామినేషన్‌ ‌పొందిన తర్వాత కొత్తగా మొదలైన వివాదాలు అనేకం. చరిత్రను వక్రీకరించిన ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌.’ ‌లాంటి సినిమాను ఆస్కార్‌ ‌బరిలో నిలపడం ఏమిటనీ కొందరు ప్రశ్నిస్తే, మరికొందరు కమర్షియల్‌ ‌హిట్‌ అయిన ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌.’‌ను కాకుండా గుజరాతీ చిత్రం ‘చెల్లో షో’ను ఎంపిక చేయడాన్ని నిరసించారు. అయితే.. ఆస్కార్‌ అవార్డును టార్గెట్‌ ‌చేసిన రాజమౌళి బృందం నిరాశ చెందకుండా ఇతర మార్గాలను ఎంచుకుంది. డైరెక్ట్ ‌నామినేషన్‌ ‌కోసం ప్రయత్నాలు సాగించింది. అందుకోసం భూమ్యాకాశాలను ఏకం చేసింది. ఈ చిత్రంలోని అగ్ర కథానాయకులతో పాటు, ప్రధాన సాంకేతిక నిపుణులను అమెరికా తీసుకెళ్లి భారీ ప్రచారం చేసింది. కోట్ల రూపాయలను ఖర్చు పెట్టింది. చివరకు అది కూడా వివాదాలకు దారి తీసింది. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌.’ ‌మూవీ ఆస్కార్‌ ‌కోసం చేస్తున్న ప్రచారంతో తాను ఎనిమిది సినిమాలు తీస్తానంటూ ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఓ వేడుకలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. కొందరు వాటిని ఖండిస్తే మరికొందరు సమర్థించారు. ఇలా సినిమా ప్రారంభం నుండి నిన్నటి వరకూ ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌.’ ‌ప్రయాణం వివాదాల తోనే సాగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే… మార్చి 13వ తేదీ ఉదయం ఆస్కార్‌ ‌వేడుకలో ఈ సినిమా లోని ‘నాటు నాటు…’ గీతం బెస్ట్ ఒరిజినల్‌ ‌సాంగ్‌ ‌కేటగిరిలో అవార్డును అందుకోవడం మరో ఎత్తు.

కుంభస్థలాన్ని బద్దలు కొట్టాల్సి ఉంది!

చాలామంది ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌.’‌లోని పాటకు ఆస్కార్‌ అవార్డు రాగానే ఈ సినిమాలోని ‘ఈ నక్కల వేట ఎంతసేపు కుంభస్థలాన్ని బద్దలు కొడదాం… పదా’ అన్న డైలాగ్‌ ‌గుర్తు చేసుకుంటూ రాజమౌళి బృందం కుంభస్థలాన్ని బద్దలు కొట్టిందని చెబుతున్నారు. నిజానికి కుంభస్థలం అంటే ఇది ఎంత మాత్రం కాదు! అందరిదీ ఒక లెక్క రాజమౌళిది మరో లెక్క!! జాతీయ ఉత్తమ చిత్రంగా ‘బాహుబలి’ని నిలబెట్టిన రాజమౌళి… ఆస్కార్‌లో సైతం బెస్ట్ ‌పిక్చర్‌ ‌మీదనే కన్నేస్తారు తప్పితే ఏదో ఒక కేటగిరిలో అవార్డు అందుకుని తృప్తి పడాలని అనుకోడు. అయితే ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌.’ ‌మూవీని వివిధ కేటగిరిల్లో పోటీకి నిలబెట్టినా.. ఇది బెస్ట్ ఒరిజినల్‌ ‌సాంగ్‌కు మాత్రమే నామినేషన్‌ ‌పొందింది. దాంతో దీన్ని ఎలాగైనా సాధించి, తెలుగు సినిమా సత్తాను విశ్వానికి చాటాలని రాజమౌళి భావించారు. అందుకు అనుగుణంగా పావులు కదిపారు. ఆస్కార్‌ ‌ముందు జరిగే వివిధ సంస్థల అవార్డులనూ సాధించే పనిలో పడ్డారు. ఫలితంగా గోల్డెన్‌ ‌గ్లోబ్‌తో పాటు ఫిల్మ్ ‌క్రిటిక్‌ ‌వంటి అవార్డులూ ‘నాటు నాటు’ పాటకు వచ్చాయి. ఆ రకంగా ఆస్కార్‌ ‌జ్యూరీ సభ్యులను ప్రభావితం చేయగలిగారు. చిత్రమే మంటే… ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌లో గట్టి పోటీనే ఎదురైంది. ‘టెల్‌ ఇట్‌ ‌లైక్‌ ఎ ఉమెన్‌’, ‘‌బ్లాక్‌ ‌పాంథర్‌: ఒకండా ఫరెవర్‌’, ‘‌టాప్‌ ‌గన్‌: ‌మార్విక్‌’, ‘ఎ‌వ్రీథింగ్‌ ఎ‌వ్రీవేర్‌ ఎట్‌ ‌వన్స్’ ‌చిత్రాలలోని పాటలను దాటుకుని ‘నాటు నాటు’ గీతం ఆస్కార్‌ అం‌దుకోవడం సామాన్య విషయం కాదు. ఎందుకంటే… ఇందులోని కొన్ని సినిమాలు వివిధ కేటగిరిల్లో అనేక అవార్డులను అందుకున్నాయి. ఈ విషయాన్ని పక్కన పెడితే, రాజమౌళి తదుపరి లక్ష్యం ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు కేటగిరిల్లో ఆస్కార్‌ను అందుకోవడమే! నిజంగా అది జరిగిన రోజున మన తెలుగు దర్శకుడు కుంభస్థలాన్ని కొట్టాడని భావించొచ్చు.

భారతీయ సినీ చరిత్రలో మైలురాయి

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌.’ ‌సినిమాలోని ‘నాటు నాటు’ గీతం ఆస్కార్‌ ‌పురస్కారం పొందడం వెనుక మన వాళ్ల కృషి అటు ఉంచితే, 2023 మార్చి 13వ తేది భారతీయ సినీ చరిత్రలోనే మైలురాయి లాంటిది. ఇంతవరకూ ఏ భారతీయ సినిమాకు దక్కని గౌరవం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌.’‌కు దక్కింది. ఆస్కార్‌ను అందుకున్న భారతీయ సినీ కళాకారులు కొందరు ఉన్నా, మనదేశం రూపొందించిన సినిమాకు అవార్డు రావడం ఇదే మొదటిసారి. అలానే ఆ ఖ్యాతి తెలుగు సినిమాకు దక్కడం మరింత గర్వకారణం. ఇప్పటి వరకూ ఒక లెక్క… ఇక్కడి నుండి మరో లెక్క అనే చందాన భారతీయ సినిమా అంతర్జాతీయంగా ఉన్నత స్థాయికి ఎదగడానికి ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌.’ ఓ ‌రూట్‌ ‌మ్యాప్‌ను వేసినట్టు అయ్యింది. పట్టుదలతో కృషి చేస్తే, సినిమాలో విషయం ఉంటే ఆస్కార్‌ అం‌దు కోవడం అసాధ్యం కాదని ఈ సినిమా నిరూపిం చింది. ఇవాళ భారతీయ సినిమాకు తెలుగు చిత్రసీమ చుక్కానిగా మారింది. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌.’ ‌సాధించిన ఆస్కార్‌తో అది నిజమని మరోసారి •రారైంది. ఈ అవార్డు ఫలితం కేవలం ఈ చిత్ర బృందానికో, సినిమాకో పరిమితం కాదు. భారతీయ సినిమా రంగం మొత్తాన్ని ఇది ప్రభావితం చేస్తుంది. ఇండియన్‌ ‌మూవీని వరల్డ్ ‌సినిమా చూసే దృష్టి కోణంలోనూ ఇక మీదట మార్పు వస్తుంది. భారతీయ సినిమాలంటే ఆటపాటలే అనే అభిప్రాయం ఒకటి బలంగా ఉంది. అయితే అందులోనే తొలి ఆస్కార్‌ను అందుకున్న మనం మిగిలిన విభాగాల్లోనూ అందు కోవడం పెద్ద కష్టమేమీ కాదు. కాబట్టి ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌.’ ‌వేసిన ఈ తొలి అడుగు… శిఖరాగ్రాన్ని చేరడానికి నాంది. జయహో భారతీయ సినిమా!!

– వడ్డి ఓంప్రకాశ్‌ ‌నారాయణ, సీనియర్‌ ‌ఫిల్మ్ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram