తెలుగు సినిమా రంగంలో అన్ని వ్యవస్థలను సమన్వయం చేసే ఏకైక సంస్థ తెలుగు ఫిల్మ్ ‌ఛాంబర్‌ ఆఫ్‌ ‌కామర్స్. ఇటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌, అటు తెలుగు దర్శక, నిర్మాతల మండలి, మరోవైపు సినీ కార్మికులకు చెందిన ఫెడరేషన్‌.. ‌వీటి మధ్య ఏ తగవు వచ్చినా పెద్దన్నయ్య పాత్ర పోషించి పరిష్కరించేది ఫిల్మ్ ‌ఛాంబరే. అలానే ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపవలసి వచ్చినా ముందు ఉండేది ఇదే. అలాంటి తెలుగు ఫిల్మ్ ‌ఛాంబర్‌ ఆఫ్‌ ‌కామర్స్‌కు ఇటీవల ఎన్నికలు జరిగాయి.

ఫిల్మ్ ‌ఛాంబర్‌లో మొత్తం నాలుగు విభాగాలు ఉంటాయి. ప్రొడ్యూసర్స్ ‌సెక్టార్‌, ‌డిస్ట్రిబ్యూటర్స్ ‌సెక్టార్‌, ఎగ్జిబిటర్స్ ‌సెక్టార్‌, ‌స్టూడియో సెక్టార్‌. ఇం‌దులో సినిమా పంపిణీదారుల విభాగం మాత్రం ఎన్నికల గొడవ లేకుండా తమ కార్యవర్గాన్ని, సెక్టార్‌ ‌సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మిగిలిన మూడు విభాగాలకు జరిగిన ఎన్నికల్లో ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు ‘దిల్‌’ ‌రాజు; సీనియర్‌ ‌ప్రొడ్యూసర్‌ ‌సి.కళ్యాణ్‌ ‌రెండు ప్యానెల్స్‌గా బరిలో దిగారు. ఇందులో పెద్ద నిర్మాతలు ‘దిల్‌’ ‌రాజు పక్షాన నిలబడితే, చిన్న చిత్రాల నిర్మాతలు సి. కళ్యాణ్‌ను బలపరిచారు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో కొద్దిపాటి మెజారిటీతో ‘దిల్‌’ ‌రాజు వర్గానిదే పైచేయి అయ్యింది. ఛాంబర్‌ ‌నూతన కార్యవర్గంలో ప్రధాన మైన అధ్యక్ష, కార్యదర్శి పదవులకు ‘దిల్‌’ ‌రాజు, కె.ఎల్‌. ‌దామోదర ప్రసాద్‌ ఎం‌పిక కాగా, కోశాధికారి సహా మరికొన్ని పదవులతో సి. కళ్యాణ్‌ ‌వర్గం తృప్తిపడాల్సి వచ్చింది.

ఎన్నికల ఫలితాల అనంతరం సినిమా వర్గాలలో ఆసక్తికరమైన చర్చే జరిగింది. సభ్యులలో చిన్న నిర్మాతలు ఎక్కువమంది ఉన్నా, సి. కళ్యాణ్‌ ఎం‌దుకు ఓడిపోయారు? ‘దిల్‌’ ‌రాజు ఒంటెత్తు పోకడతో వ్యవహరిస్తారనే అపవాదు ఉన్నా, ఆయన వర్గం ఎలా గెలిచింది? అనేదే ప్రధాన చర్చ. అయితే… కొన్నేళ్లుగా సినిమాలు నిర్మించని కొందరు చిన్న నిర్మాతల దన్నుతో ఇటు నిర్మాతల మండలి, అటు ఫిల్మ్ ‌ఛాంబర్‌లో అధికారాన్ని చేపట్టి కాలం గడిపేస్తున్నారనే విమర్శలు గట్టిగా వచ్చాయి. వారు రెగ్యులర్‌గా సినిమాలు తీసే నిర్మాతలకు పెద్దంత ప్రాధాన్యం ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. రోజువారీ ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపడంలో వీరు విఫలమయ్యారనీ చెబుతుంటారు. ఆ కారణంగానే గతంలో కొందరు పెద్ద నిర్మాతలు గిల్డ్‌గా వేరే కుంపటి పెట్టుకుని నిర్మాతల మండలికి దూరం జరిగారు. అయితే సి.కళ్యాణ్‌ ‌చొరవ చూపించి, తిరిగి ఆ పెద్ద నిర్మాతలను ప్రొడ్యూసర్స్ ‌కౌన్సిల్‌లో భాగస్వాములు అయ్యేలా చేశారు. అయినప్పటికీ అక్కడ వారి మాట చెల్లడం లేదనే భావన వారికి కలిగింది. అలానే చిన్న నిర్మాతల పట్ల పెద్ద చిత్రాల నిర్మాతలు ఇప్పటికీ చిన్నచూపుతోనే ఉన్నారనే విషయం కూడా కళ్యాణ్‌ ‌వర్గానికి బోధపడింది. అందుకే ఆ పెద్ద నిర్మాతలతోనే ఈసారి ఛాంబర్‌ ఎన్నికల్లో పోటీకి దిగారు. కానీ నిర్మాతల మండలి ఎన్నికల్లో చూపించినట్టు ఈసారి ఛాంబర్‌ ఎన్నికల్లో కళ్యాణ్‌ ‌వర్గం తమ సత్తాను చా•లేక, ‘దిల్‌’ ‌రాజు ప్యానల్‌ ‌చేతిలో ఓడిపోయింది. మెజారిటీ నిర్మాతలు తమవైపు ఉన్నారనే ధీమా కళ్యాణ్‌ ‌వర్గానికి ఉండగా, ‘దిల్‌’ ‌రాజు తెలివిగా కొందరు చిన్న నిర్మాతలను, వాళ్ళందరికి దన్నుగా ఉన్న చదలవాడ శ్రీనివాసరావు వంటి వారిని తనవైపు తిప్పుకోవడంలో సఫలీకృతు డయ్యారు. దాంతో కొద్దిపాటి మెజారిటీతో అయినా ‘దిల్‌’ ‌రాజు అధ్యక్ష పీఠాన్ని అందుకోగలి గారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఛాంబర్‌ ‌నడక ఎలా సాగుతుందో అనే సందేహానికి తావిచ్చేలా ఉన్నాయి.

‘దిల్‌’ ‌రాజు ఛాంబర్‌ అధ్యక్ష పదవిని స్వీకరించ గానే జూలై 31న లోక్‌సభలో సినిమాటోగ్రఫీ యాక్ట్ 1954 ‌సవరణ బిల్లుకు ఆమోదం లభించడం పట్ల హర్షం వెలిబుచ్చుతూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సవరణ బిల్లు వల్ల నిర్మాతలకు ఎంతో మేలు జరుగుతుందని, పైరసీదారులను ఉక్కు పాదంతో అణచివేయడానికి ఉపకరిస్తుందని చెబుతూ, ప్రధాని నరేంద్రమోదీకి, కేంద్ర సమాచారశాఖ మంత్రి అనురాగ్‌ ‌ఠాకూర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దీనితో పాటే మరో ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ఫిల్మ్ ‌ఛాంబర్‌ ఆఫ్‌ ‌కామర్స్ ఆధ్వర్యంలో త్వరలో దుబాయ్‌లో జరుగబోతున్న టీఎఫ్‌సీసీ నంది అవార్డులకు తమకు ఎలాంటి సంబంధం లేదని, అసలు ఆ సంస్థకు ప్రభుత్వ గుర్తింపు లేదని, టీఎఫ్‌సీసీ ఛైర్మన్‌ ‌ప్రతాని రామకృష్ణ గౌడ్‌ ‌వ్యక్తిగతంగా ఆ అవార్డులను ఇస్తున్నారని, ఏపీ ప్రభుత్వం కూడా ఈ విషయంలో విముఖంగా ఉందని తెలిపారు. అలానే, ది తెలంగాణ స్టేట్‌ ‌ఫిల్మ్ ‌ఛాంబర్‌ ఆఫ్‌ ‌కామర్స్ ‌కూడా ఈ అవార్డు ప్రదానోత్సవం పట్ల సముఖంగా లేదని పేర్కొన్నారు. దీంతో ఓ రకంగా ‘దిల్‌’ ‌రాజు తేనెతుట్టెను కదిలించినట్టు అయ్యింది. గతంలో నంది అవార్డులను ప్రభుత్వమే ఇచ్చినా రెండుగా తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఎవరూ నంది పేరుతో అవార్డులు ఇవ్వడం లేదు.

గత కొన్నేళ్లు పలు సాంస్కృతిక సంస్థలు ‘నంది’ పేరుతో అవార్డులను ఇస్తున్నాయి. అప్పుడు రాని అభ్యంతరం తమ గురించే ఎందుకని ప్రతాని రామకృష్ణ గౌడ్‌ ‌ప్రశ్నిస్తున్నారు. అవార్డుల ప్రదానోత్సవానికి తెలంగాణ సాంస్కృతిక శాఖ తమకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. మొన్న జరిగిన ఛాంబర్‌ ఎన్నికల్లో నిర్మాతల సెక్టార్‌ ‌నుండి తాను సి. కళ్యాణ్‌ ‌ప్యానల్‌ ‌నుండి పోటీ చేసి గెలవడం వల్లే ఈ కక్ష సాధింపు చర్యలు మొదలు పెట్టారని ఆరోపిస్తున్నారు. నిర్మాతగా, పంపిణీదారుడిగా క్షణం తీరిక లేకుండా ఉండే ‘దిల్‌’ ‌రాజు ఈ విమర్శలకు ఎలా చెక్‌ ‌పెడతారు? ఛాంబర్‌ ‌కార్యకలాపాలను సజావుగా ఎలా నిర్వహిస్తారు? అనేది వేచి చూడాలి.

– అరుణ, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE