‘శివాయ విష్ణురూపాయ, శివరూపాయ విష్ణవే’ అన్న విధంగా దేవుడు ఒక్కడేనని వారిలో భేదభావాలు లేవని బేళూరులోని చెన్నకేశవస్వామి విష్ణు ఆలయం, దగ్గరలోని హళేబీడు ఈశ్వర శివాలయం చాటుతున్నాయి. వైష్ణవం, శైవం ఏకమనే సిద్ధాంతాన్ని చాటుతూ ఏకంసత్‌, ‌విప్రా బహుధా వదంతి అనే సనాతన ధర్మ సిద్ధాంతానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

క్రీ.శ.12-13 శతాబ్దాల కాలంలో హోయసల వంశీకులు కర్ణాటక ప్రాంతాన్ని పాలించారు. బేళూరులోని అత్యంత ప్రసిద్ధమైన చెన్న కేశవాలయం అంతర్‌, ‌బహిః ప్రాకారాలపై, ద్వారాలపై పైకప్పులు, స్తంభాలపై అత్యంత రమణీయంగా, కళాత్మకంగా చెక్కిన శిల్పాలు ఎన్నో  కనిపిస్తాయి. చోళరాజులపై తన విజయానికి చిహ్నంగా విష్ణువర్ధన చక్రవర్తి ఈ ఆలయాన్ని నిర్మించాడని తెలుస్తున్నది. గర్భగుడిని నక్షత్రాకారంలో నిర్మించారు. ఇక్కడనున్న దైవం కేశవమూర్తిని, చెన్న కేశవుడని, విజయ నారాయణుడని కూడా వ్యవహరిస్తారు.

క్రీ.శ.1397లో రెండవ హరిహరుని కాలంలో ఏడంతస్తుల గోపుర ద్వారాన్ని నిర్మించారు. తర్వాత కాలంలో చెన్నకేశవ ఆలయం ప్రాంగణంలోనే, గర్భగుడికి వెనుకవైపున సౌమ్యనాయక మందిరం, ఆండాళ్‌ ‌మందిరం, కల్యాణ మంటపం నిర్మించారు. ప్రవేశద్వారం ఎత్తు 65 అడుగులు. ఆలయంలో ప్రవేశించగానే మూడున్నర అడుగుల గరుడ విగ్రహం కనబడుతుంది.  మందిర ముఖద్వారానికి ఇరువైపుల మనుషులపైకి దుముకుతున్నట్లున్న భయంకర మృగం కనిపిస్తుంది. ‘హోయసల’ అంటే మానవ రక్షణ కోసం భయంకర మృగాన్ని చంపడమని అర్థమట. ఇక్కడే మలచిన నరసింహస్వామి విగ్రహం కనిపిస్తుంది. ఇరువైపుల దశావతార చిత్రాలున్నాయి.

ఇలాంటివి ఈ ఆలయంలో 24 ఉన్నాయి. ఎడమచేతిలోని దర్పణంలో తన సౌందర్యాన్ని చూసుకుంటూ, కుడిచేతితో తన చీర మడతలను సరిచేసుకుంటున్న దర్పణసుందరి, కుడిప్రక్కన ఉన్న ఆమె చెలికత్తె కోతిని, ద్రాక్షవళ్లను పట్టుకొని నిలుచుంది. వీటిని సహజత్వం ఉట్టి పడేలా ఎంతో రమణీయంగా చిత్రించారు. అందమైన అప్సరసలను వివిధ భంగిమల్లో రంగవంచమి, మర్కట మోహిని, కాళీయమర్దనం, మోహినీ భస్మాసుర, వీణాపాణి, మాధవకేశవ, జనార్దన మొదలుగా గల విష్ణుమూర్తి చిత్రాలు, కైలాసాన్ని ఎత్తుతున్న రావణుడు, బ్రహ్మదేవుడు, అష్టభుజ గణేశ, గజాసుర మర్దన, సప్తాశ్వరథారూఢుడైన సూర్యుడు, మత్స్యయంత్రాన్ని ఛేధిస్తున్న అర్జునుడు, రతిదేవి- మన్మథ చిత్రాలు, నృత్య భంగిమల్లో నాయికలు, విషకన్య, నవరసభరితమైన భంగిమల్లో స్త్రీల చిత్రాలు ఎన్నో ఆలయ ప్రాకారాలపై రమ్యంగా కనిపిస్తాయి. చిలుకతో మాటలాడుతున్న సుందరి, తమలపాకు వేసుకుంటున్న స్త్రీ, ప్రియునిరాకకై ఎదురుచూస్తున్న నాయకి, వేటకు వెళ్తున్న స్త్రీ, కేశాలంకరణ చేసుకుంటున్న స్త్రీ, నాట్యకత్తె, సన్యాసిని, పాడుతున్న స్త్రీ, మురళిని మ్రోగిస్తున్న స్త్రీ, వాయులీన వాయిస్తున్న స్త్రీ, వేటాడుతున్న స్త్రీలు, స్నాన గృహం నుండి బయటికి వస్తున్న స్త్రీ, సిగను ముడివేస్తున్న స్త్రీ, ఈ విధంగా ఎన్నో భంగిమల్లో మహిళ దర్శన మిస్తుందిక్కడ.

చెన్న కేశవాలయంలో 48 స్తంభాలున్నాయి. ఒక్కొక్క స్తంభం మీద విభిన్న రీతుల్లో చెక్కడా లున్నాయి. ఈ రీతిగా అత్యంత కళాత్మకంగా నిర్మిత మైన మందిరాలు మన దేశంలో బహుకొద్ది.

హళేబీడు ఆలయాలు

బేళూరుకు 16 కిలోమీటర్ల దూరంలో హళేబీడు ఆలయాలున్నాయి. హోయసల చక్రవర్తులచే నిర్మితమైన ఈ దేవాలయాలు, బేలూరు ఆలయాల శైలిలోనే ఉంటాయి. కళలో కూడా సారూప్యత గోచరిస్తుంది. క్రీ.శ. 12-13 శతాబ్దాలలో హళేబీడు హోయసలులకు రాజధానిగా ఉండింది. హోయసలేశ్వర మందిర బహిః ప్రాకారాలపై రామాయణ మహాభారత గాథలననుసరించి చెక్కిన చిత్రాలున్నాయి. శ్రీకృష్ణ లీలలు, ప్రహ్లాద చరిత్ర, అభిమన్యుని పద్మవ్యూహం, కైలాస పర్వతాన్నెత్తిన రావణుడు మొదలుగాగల చిత్రాలు మనల్ని ముగ్ధుల్ని చేస్తాయి.

ఈ ఆలయ శిల్పకళా వైభవాన్ని దర్శించేందుకు అనేక దేశాల నుండి యాత్రికులు విశేషంగా వస్తుంటారు. ఒకానొక నాడు వైభవోపేతంగా విరాజిల్లిన ద్వారసముద్రం నేడు కుగ్రామంగా ఉండిపోయింది. హాళేబీడు అంటే పాడుపడిన గ్రామమని అర్థమట.

ఇక్కడి ఆలయ నిర్మాణం విశిష్ఠస్థాయిలో జరిగింది. ఆలయానికి గోపురాలు కాని, గోపుర కలశాలుగాని లేవు. బేల•రు చెన్న కేశవాలయంలో లోపల శిల్పకళా చాతుర్యం విశేషంగా కనిపిస్తుంది. హాళేబీడు ఆలయంలో మాత్రం బయటి భాగంలోనే కళాఖండాలు మలచి ఉన్నాయి. నక్షత్రాకారంలో కోణాల్లో మలచిన ఆలయం పైకప్పు హోయసలుల కళారీతుల వైశిష్ట్యాన్ని తెలియజేస్తుంది. భూతలం నాలుగడుగుల ఎత్తునున్న వేదికపై ఆలయ నిర్మాణం జరిగింది.

హోయసలేశ్వరుని నైశాలేశ్వరుడని కూడా వ్యవహరిస్తారు. శాంత లింగేశ్వర లింగం, హోయసలేశ్వర శివలింగం రెండూ ఒకే ఆలయంలో ప్రక్క ప్రక్కన ఉన్నాయి. దేవాలయ కుడ్యాలపై విశేషంగా మనల్ని ఆకర్షించేవి నరసింహావతార దృశ్యాలు. హోయసల రాజులను నరసింహస్వామి ఆరాధ్యదైవం. అందువల్ల ప్రహ్లాద చరిత్ర మొత్తం శిల్పకళా ఖండాల్లో రమ్యంగా మలిచారు. భారత రామాయణ గాథలు శివలీలలు, క్షీరసాగర మథనం శ్రీ కృష్ణావతార ఘట్టాలు, అభిమన్యుని పద్మవ్యూహ ప్రవేశం,  కైలాస పర్వతాన్ని ఎత్తుతున్న రావణాసురుడు తదితర పౌరాణిక గాథాచిత్రాలు అత్యంత రమణీయంగా చిత్రించారు శిల్పులు. ఒక్కమాటలో చెప్పాలంటే దేవాలయ బాహ్యకుడ్యాలపై శిల్ప నిర్మాణానికి అను వైనా అన్ని స్థలాల్లోను శిల్పులు తమ ప్రతిభను వెల్లడించారు.

గర్భాలయ బాహ్యద్వారాలకు ద్వారపాలకులు, తోరణాలు, తీగలు చెక్కారు. శివలింగాలకెదురుగా మహోన్నతమైన నంది విగ్రహాలున్నాయి. దేవాలయ కుడ్యాల్లో ఒక వరుసన గుర్రాలు, మరొక వరుసన ఏనుగులు, ఇంకో వరుసలో రథాలుండి చతురంగ సేనను సూచిస్తుంటాయి. ముఖద్వారం వద్దనున్న బసవేశ్వరుని వెనుకభాగంలో పదడుగుల ఎత్తుగల సూర్యభగవానుని విగ్రహం ఉన్నది. ఇక్కడ ఉన్న శిల్పాలన్నీ అతి సున్నితమైనవి. ఇవన్నీ కళాప్రియుల హృదయాలపై చెరగని ముద్ర వేస్తాయి. ఇక్కడ వసతి గృహాలు, భోజనశాలలున్నాయి. మధ్యతరగతి యాత్రికుల కందుబాటులో ఉంటాయి. హోయసలేశ్వరాలయం ఏకశిలా నిర్మితమైనట్టిది. దగ్గర్లోని పార్శ్వనాథ జైన దేవాలయంలోని పదిహేను అడుగుల ఎత్తు గల దిగంబర పార్శ్వనాథుని నల్లరాతి విగ్రహం ఆకర్షణీయంగా ఉంటుంది.

ఏడు తలల నాగరాజు జైన విగ్రహానికి ఆచ్ఛాదన కల్గిస్తున్నట్లు ఈ విగ్రహం మలిచారు. మంటపంలో పండ్రెండు స్తంభాలు నల్లరాతితో నిర్మించారు. అద్దంలోవలె ప్రతిరూపాన్ని వీటిలో చూడగలిగినంత నునుపుగా ఉంటాయి. అందువలనే బేళూరు-హళేబీడు ఆలయాల శిల్పకళా వైభవం విశ్వవిఖ్యాతమైనట్టిది. ఇవి మన దేశంలోనే దర్శనీయ స్థలాల్లో ప్రాముఖ్యం వహిస్తున్న ఆలయాలు.

– ఆచార్య మత్స్యరాజ హరగోపాల్‌

About Author

By editor

Twitter
Instagram