(‌చల్నేదో బాల్‌కిషన్‌)

– తెలిదేవర భానుమూర్తి

పట్నంల గదొక కంపిని. యాద్గిరి గా కంపిని మేనేజర్‌. ‌గాయిన గుండుకు గుండుంటడు. గాయినకు బొర్రున్నది. బుర్ర మీసాలున్నయి. ఎందుకో ఏమో గని గాయిన కండ్లు ఎప్పుడు ఎర్రగనే ఉంటయి. గాయిన మాట్లాడితే గదిరిచ్చినట్లుంటది. బెదిరిచ్చినట్లుంటది. గాయిన ముంగట్కి బోయెతంద్కు కంపినీ జీతగాల్లు బుగులు బడుతుంటరు. ఒగాల్ల ఎవనికన్న గాయిన తాన్కి బోయేటి పని బడ్తె గాని పైంటు పచ్చిగైతది.

ఇస్తారి, సత్నారి; లచ్చినారి గా కంపిని జీతగాల్లు. జీతగాల్లే గాకుంట గాల్లు ముగ్గురు దోస్తులు. ఇస్తారి పొట్టిగుంటడు. దొడ్డుగుంటడు. గాన్కి జర్దపాన్‌ అల్వాటు. సత్నారి, లచ్చినారి పొడుగూతుంటరు. సత్నారి కండ్లద్దాలు బెడుతుంటడు. ఎప్పుడు ఇన్‌షర్ట్ ఏస్తడు. సిగిలేట్లు దాగుతుంటడు. లచ్చినారి బక్క గుంటడు. గీన్కి సుత సిగిలేట్లు తాగేటి అల్వాటున్నది. బట్ట తల్కాయున్నది. సత్నారి, లచ్చినారి ఒకే ఊరోల్లు. కంపినిల షరీకైనంక మాట ముచ్చటల గాల్లకు గా సంగతి ఎర్కైంది. సైమం దొర్కితే సాలు ముగ్గురు ఛాయ్‌ ‌దాగెంతద్కు బోతుంటరు. ఛాయ్‌ ‌దాగినంక పాన్‌ ‌డబ్బ కాడ్కి బోతరు. ఇస్తారి పాన్‌ ‌దింటె కడ్మ ఇద్దరు సిగిలేట్లు ముట్టిస్తరు. సిగిలేట్లు దాక్కుంట ముచ్చట బెడుతుంటరు.

‘‘మొన్న మన మేనేజర్‌ ఇం‌టికి బోయిన’’ అని పాన్‌ ‌దినుకుంట ఇస్తారి అన్నాడు.

‘‘కంపినిల తిట్లు సాలలేదని తిట్టిచ్చుకునెతంద్కు గాయిన ఇంటికి గుడ్క బోయినవా?’’ అని సత్నారి అడిగిండు.

‘‘తిట్టిచ్చుకునెతందుకు ఎవలు బోతరు. జెరూర్‌ ‌పనిబడ్తె మేనేజర్‌ ‌యింటికి బోయిన’’ అని ఇస్తారి అన్నాడు.

‘‘గాయినేమన్నడు. నిన్ను తిట్టిండా? గదిరి చ్చిండా? బెదిరిచ్చిండా?’’

‘‘గాయినేం తిట్టలేదు. గదిరియ్యలేదు, బెదిరియ్య లేదు’’

‘‘చెవుల పూలు బెడ్తున్నవా? నువ్వు ఏం జెప్పినా నమ్మెతందుకు నన్ను అవులగాన్ననుకుంటున్నావా?’’

‘‘మేనేజర్‌ ఇం‌టికి బోయినగని గాయిన ముంగట్కి బోయే మోక నాకు దొర్కలేదు. దాంతోని నేను గాయినతోని మాట్లాడలేదు. గాని గాయినంటె ఏందో ఎర్కైంది.’’

‘‘ఏ మెర్క అయ్యిందో జెర జెప్పు.’’

‘‘నేను బోయినప్పుడు మేనేజర్‌ ఇం‌టి తల్పులు దగ్గరేసి ఉన్నయి. నేను చెయ్యితోని గిట్ల నూకంగనే ఒక తల్పు జెర దెర్సుకున్నది. మన మేనేజర్‌ ‌పెండ్లాం గాయిన ముంగటనే గూసున్నది. కాయితం పెన్ను దీసుకున్నది. లిప్స్‌టిక్‌; ఐటెక్స్. ఒక పోడర్‌ ‌డబ్బ. బాడిలోషన్‌ అని లిస్టు రాస్కుంట గివి గొనెతంద్కు బజార్కు బోతున్న మీకేమన్న గావాల్నా అని మొగన్ని అడిగింది. అడిగితె మన మేనేజర్‌ ఏమన్నాడో ఎర్కేనా?’’

‘‘ఏమన్నాడు.’’

‘‘బట్టల సబ్బులు కతమైనయి. మాసిన బట్టలుత్కు దామంటె ఒక్క బట్టల సబ్బు గుడ్క లేకుంటైంది. నాల్గు బట్టల సబ్బులు దీస్కరా. ఇల్లూకుదామంటే చీపిరి కట్ట చిన్నగైంది. ఒక చీపిరి కట్ట గొన్కరా. బాసండ్లు దోమె తంద్కు ఐదు రూపాయలకు ఒక్క టిచ్చేటి నాల్గు విమ్‌బార్లు ఐదు దీస్కరా అని పెండ్లాంకు జెప్పిండు. గిదంత ఇన్నంక నేను గాయిన ముంగట్కి బోలేదు. గాయినతోని మాట్లాడకుంటనే ఇంటికిబోయిన’’ అని ఇస్తారి జెప్పిండు.

సత్నారి రొండు దినాలు తాతీల్‌ ‌దీస్కుండు. తాతీలైనంక కంపినికి బోయిండు. గాని సీట్ల గూసొని పని జేస్కుంటున్నడు. అద్దగంటైనంక గాని తాన్కి చప్రాసి వొచ్చిండు.

‘‘మేనేజర్‌ ‌సాబ్‌ ‌మిమ్ములను రమ్మంటున్నడు’’ అని జెప్పిండు. ఏం కొంప మునిగిందో అని అను కుంటూ సత్నారి మేనేజర్‌ ‌తాన్కి బోయిండు. మేనేజర్‌ ‌గాన్ని కిందికి మీదికి ఒక్క తీర్గ జూసిండు. గీడు గిట్లెందుకు జూస్తున్నడు. నా జీతం కోస్తడా లేకుంటె సస్పెండ్‌ ‌గిన జేస్తడా అని మనసుల అనుకుంట.

‘‘గుడ్‌ ‌మార్నింగ్‌ ‌సార్‌’’ అని సత్నారి అన్నడు.

‘‘నక్క వినయాలు నా తాన నడ్వయి. నాకు జెప్పి నంకనే తాతీల్‌ ‌దీస్కోవాలెనని నీ కెర్కలేదా? గీ సంగతి నీకు ఎన్నోసార్లు జెప్పిన. నేను జెప్పినంక గూడ గిట్లెందుకు జేసినవ్‌. ‌నేనంటే నీ పానానికి ఏమనుకుంటున్నావ్‌’’ అన్కుంట మేనేజర్‌ ‌కోపాని కొచ్చిండు.

‘‘మీరు జెప్పిన సంగతి నాకు యాదికున్నది సార్‌. ‌నా పెండ్లానికి జెరమొచ్చింది. జెరమే గాకుంట కడ్పు నొప్పి లేసింది. దాంతోని నాకు ఎటూ సుద్రాయించ లేదు. గంతేగాకుంట దినాం గామె జేసేటి పనులు నేనే జెయ్యక తప్పలేదు. యాలపొద్దుగాలే లేసి ఆకిలి ఊకిన. సాన్పుసల్లి ముగ్గేసిన. ఇల్లూకిన,  బాసండ్లు తోమిన, బట్టలుత్కిన. వొంట గుడ్క జేసిన.’’

‘‘నేను అడిగిందేంది, నువ్వు జెప్తున్నాదేంది? ఆడిదానిలెక్క ఇల్లూక్తవా? బాసండ్లు దోమ్తవా? బట్టలుత్కుతవా? వొంట గూడ జేస్తవా? నీకు సిగ్గు లేదా? శరం లేదా? సిగ్గు శరం లేకుంట గీ పనులన్ని జేస్తె జేసినవ్‌ ‌గీ పనులన్ని అయినంక నాకు ఫోన్‌ ఎం‌దుకు గొట్టలేదు. కమస్కం నేను ఇంట్ల ఉన్నప్పు డన్న ఫోన్‌ ‌గొట్టి తాతీల్‌ ‌గావాలని ఎందుకడ్గలేదు. నీ తోలుగిని దొడ్డుగైందా? నేనంటె నీకు బయం లేకుంట బోయిందా?’’

‘‘నిన్న పొద్దుగాలే మీ ఇంటికి ఫోన్‌ ‌గొట్టిన సార్‌. ‌మీరు బాసండ్లు తోమ్తున్నారని పావుగంటైనంక ఫోన్‌ ‌గొట్టుమని మేడం జెప్పింది. పావుగంటైనంక ఫోన్‌ ‌జేస్తె మీరు బట్టలుత్కుతున్నరని అటెంకల ఫోన్‌ ‌జెయ్యుమని మేడం జెప్పింది సార్‌’’ అని సత్నారి అన్నాడు.

గాడు గిట్ల అనంగనే మేనేజర్‌ ‌మొకం గింతైంది.

‘‘గీ సంగతి ఎవ్వరికి జెప్పకు’’ అని మేనేజర్‌ అన్నాడు.

మోకేకా ఫాయిదా ఉటానా ఆద్మీ కా ఫర్జ్ ‌హై అనుకోని గీ మోక బోతె మల్లరాదని-

‘‘నా ప్రమోషన్‌ ‌సార్‌’’ అని సత్నారి అడిగిండు.

‘‘ఇస్త. గాని నేను మా ఇంట్ల బాసండ్లు దోమిన సంగతి ఎవ్వరికి జెప్పకు.’’

‘‘మీ తోడు, నా తోడు, మా అమ్మతోడు ఎవ్వరికి జెప్పను సార్‌’’ అని సత్నారి అన్నాడు.

గానికి ప్రమోషనొచ్చింది. ఎట్లొచ్చిందో గాడు ఎవ్వలికి జెప్పలేదు.

About Author

By editor

Twitter
Instagram