– తెలిదేవర భానుమూర్తి

మా వూరు భోన్గరి. మా ఊల్లె మూడు బడులున్నయి. ఒకటి బాగాయత్‌. ‌గాదాంట్ల ఒకటో తరగతి కాడికెల్లి మూడో తరగతి దాంక ఉండేది. రొండోది బీచ్‌ ‌మహల్లా. గీదాంట్ల నాల్గో తరగతి కెల్లి ఎన్మిదో తరగతి దాన్క ఉండేది. మూడోది పెద్దబడి. పెద్దబడిల తొమ్మిదో తరగతికెల్లి పన్నెండో తరగతి దాంక ఉండేది. గీ మూడు బడులల్ల సత్నారి నేను సద్వుకున్నం. ఇద్దరం ఒకే తరగతిల పక్కపక్కనే గూసుండెటోల్లం.

సత్నారి, నేను ఒకే వాడకట్టుల ఉండెటోల్లం. ఒక్క తీరు ఆటలనే ఆడెటోల్లం. యాడికి బోయినా ఇద్దరం గల్సి బోయెటోల్లం. ఒక్క మంచంల పండకున్నా, ఒక్క తల్లెలనేల దినకున్నా మేమిద్దరం జిగ్రిదోస్తులం, మొగులు మీద మస్తు సుక్కలున్నా చందమామ ఒక్కడే. గదే తీర్గ నాకు శానమంది దోస్తులున్నా సత్నారి గాడొక్కడే జాన్‌ ‌జిగ్రి.

బడి ఇడ్సిపెట్టినంక ఒక దినం గోటీలాడితె ఇంకొక దినం గిల్లిదండ ఆడెటోల్లం. గిల్లిని దండతోని లాసిగ కొట్టుట్ల నేను నంబర్‌ ‌వన్‌. ‌బొద్దికాడ ఉంచిన దండను సూటి జూసి గిల్లితోని కొట్టుట్ల సత్నారి అసువంటి దార్‌కార్‌ ‌మా దోస్తులల్ల ఎవ్వడు లేడు. పెద్ద గైనంక మేము కిరికిట్‌ ఆడెటోల్లం. నేను ఓపెనింగ్‌ ‌బాట్స్‌మెన్‌ అయితే సత్నారి నంబర్‌వన్‌ ‌ఫాస్ట్ ‌బోలర్‌.

‌డిగ్రి అయినంక భోన్గిరి తాసిల్‌ ‌కచేరిల సత్నారికి కొల్వు దొర్కింది. నేను బడిపంతులునైన. నాకు పట్నంల కొల్వు దొర్కింది. కొల్వులు దొర్కెదాంక ఇద్దరం గల్సి దిర్గెటోల్లం. గని కొల్వుకొచ్చినంక అలగైనం. ఎవరి బతుకు ఆల్లదైంది. ఎవరి సంసారం ఆల్లదైంది. ఎవరి బాధలు ఆల్లవైనయి. మా పెండ్లిండ్లు అయినయి. పిల్లలు బుట్టిండ్రు. నాకు ఒక కొడ్కు. బిడ్డ. సత్నారికి ఇద్దరు కొడ్కులు.

భోన్గిరి బోక శానొద్దులైంది. ఒకసారి బోయొస్తె బాగుంటదనిపిచ్చింది. పెండ్లాం పిల్లలను దీస్కోని వూరికి బోయిన. పొద్దు వూకినంక నేనొక్కనే సత్నారి ఇంటికిబోయిన. గాడు నన్ను బిర్రుగ కాగలిచ్చు కుండు. గాని పెండ్లాం మిర్చిబజ్జి జేసింది. ఉడుకు డుకు ఛాయ్‌ ఇచ్చింది. సత్నారిగాని చిన్నపోరనికి ఏడేండ్లు. గాని చేత్ల బోర్నవిట సీస ఉన్నది.

‘‘ఏంరా! బోర్నవిట తింటావా? తాగుతవా?’’ అని గాన్ని అడ్గిన.

‘‘బారబోస్త. నీకేమన్న బాదనా’’ అని గాడు అడిగిండు. గాడు గట్ల అనంగనే ఏమనాలెనో ఎర్కలేక ఎడ్డిమొకం ఏస్కున్న.

సైమం ఎప్పుడు ఒక్క తీర్గనే ఉండదు. గదే తీర్గ మనం గుడ్క ఎప్పుడు ఒక్క తీర్గనే ఉండం. ఒకప్పుడు సత్నారి, నేను పోరలం. అటెంకల పెద్దోల్లం. గిప్పుడు ముసలోల్లం.

పిల్లల సద్వులు జెయ్యబట్కే వజీప దీస్కునంక గూడ నేను పట్నంలనే ఉన్న. పొలాలుండె బట్కె సత్నారి భోన్గిరిలనే ఉన్నాడు. పని మీద పట్నం గినొస్తె తప్పకుంట గాడు మా ఇంటికి వొచ్చెటోడు. పని లేకున్నా నెలకొకసారి నేను భోన్గిరి బోయెటోన్ని. సత్నారితోని గల్సి ఊరంత దిర్గెటోన్ని. ఇద్దరం గల్సి భారత్‌  ‌టాకిస్ల సిన్మ జూసెటోల్లం. పాత సంగతులు యాదికి రాంగ పాతముచ్చట్లు జెప్పుకునేటోల్లం.

ఏదో ఒక పని ఉండెబట్కె ఊరికి బోక మూడునెలలైతున్నది. సత్నారి గూడ పట్నం రాలేదు. గాని పెయ్యి బాగ లేదని ఎర్కైంది. చేతులు, కాల్లు పడిపోయినయని ఇగ దాంతోని గాడు మంచంలనే ఉంటున్నడని తెలిసింది. గీ సంగతి ఎర్కగాంగనే గాన్ని సూసెతంద్కు ఊరికి బోయిన.

సత్నారి ఎప్పుడు ఒకతాన గూసుండెటోడుగాదు. పని ఉన్నా లేకున్నా అటిటు దిరిగెటోడు. ఆనిది తిట్టే నోరుగాదు. గని తిరిగే కాలు. గసువంటోడు గిప్పుడు ఇర్వై నాలుగ్గంటలు మంచంలనే ఉంటున్నడు.

గాన్ని సూడంగనే నాకు ఏడ్పు వొచ్చింది.

‘‘అరే నా దినాలు దగ్గరబడ్డయిరా. ఎక్వల ఎక్వ వారం దినాలు బత్కుతరా’’ అని సత్నారి అన్నాడు.

‘‘గట్లనకురా’’

‘‘అరే యాడికిబోయినా మనిద్దరం గల్సిబోయెటోల్లం. గిప్పుడు నేనొక్కన్నే సొర్గంకెట్లా బోవాలెరా. నువ్వు గూడ నాతోని రారా’’ అని సత్నారి అన్నాడు.

‘‘నువ్వుగిన సొర్గం బోతె గాడ ఏయే ఆటలు ఆడుతున్నరో అర్సుకుని నాకు జెప్పురా’’.

‘‘నీకెట్ల జెప్పాలె’’ అని గాడు అడిగిండు.

‘‘నా కలల గండ్లబడి జెప్పురా.’’

నెల దినాలైనంక సత్నారి కాలం జేసిండు. సచ్చినవారం దినాలకు గాడు నా కలల గండ్లబడ్డడు.

‘‘సొర్గంల గూడ ఆటలాడ్తున్నారురా’’ అని గాడు అన్నాడు.

‘‘కిరికిట్‌ ‌గిన ఆడ్తున్నారా?’’ అని అడిగిన.

‘‘ఆడ్తున్నరు’’ వారం దినాలైనంక సొర్గం, నర్కం టీంల నడ్మ టెస్ట్ ‌మ్యాచ్‌ ఉన్నది.’’

‘‘నువ్వు గిన ఆడ్తున్నవా?’’

‘‘ఆడ్తున్న. నేనే మెయిన్‌ ‌బోలర్‌ను’’ అని సత్నారి అన్నాడు.

‘‘ఓపెనింగ్‌ ‌బ్యాట్స్‌మెన్‌ ఎవరు?’’

‘‘ఓపెనర్‌ ‌నువ్వేరా’’

‘‘నేను ఓపెనింగ్‌ ‌బ్యాట్స్‌మెన్గ మంచిగ ఆడ్తనని గాల్లకెవలు జెప్పిండ్రు.’’

‘నేనే జెప్పినరా’’ అని గాడు అన్నాడు.

‘‘ఎంత జిగ్రిదోస్తువైనా గట్లెంద్కు జెప్పినవురా’’

‘‘ఈడ నువ్వు లేకుండబట్కె నాకు ఎటూ సుద్రాయిస్తలేదు. పిచ్చిలేసినట్లున్నది’’ అని గాడు అన్నాడు.

కలల సత్నారి గట్ల జెప్పగంనే నాకు మేల్కొ చ్చింది. సల్లచెమ్టలు బడ్డయి. నా దినాలు దగ్గరబడ్డయని ఎర్కైంది.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram