– ఎస్‌. ‌ఘటికచలరావు

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

గొప్ప ప్రారంభోత్సవం!

కనీవినీ ఎరుగని రీతిలో ప్రఖ్యాత సినీతారలు, గొప్ప నాయకులూ విచ్చేస్తున్నారట! మరో రెండ్రోజుల్లోనే అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం జరుగుతుందట!!

ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా ఇదే మాట. చిలవలు పలవలుగా ఆ నోటా ఈనోటా ఈ వార్త ఊరంతా పాకింది. శుభ ఘడియ కోసం అందరూ ఆతృతతో ఎదురు చూస్తున్నారు. తమ తమ అభిమాన తారలతో కలసి ఫొటోలు దిగాలన్న ఉద్ద్దేశ్యాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇంతకూ ప్రారంభోత్సవం దేనికంటే… అదొక మల్టీప్లెక్స్!

‌గొప్ప సినీతారలూ, ప్రముఖ రాజకీయ నాయ కులూ, మంత్రివర్యులందరికీ ఆహ్వాన పత్రిక లందాయట. ఐతే మల్టిప్లెక్స్‌కు ప్రారంభోత్సవం చేసేదెవరన్నది తెలియరాలేదు.

అనుకున్న తేదీకి భవన సముదాయం సర్వాంగ సుందరంగా తయారైంది. భవనం ముఖద్వారానికి రిబ్బన్‌ ‌కట్టి సిద్ధంగా ఉంచారు.

లోపలికి వెళ్తే అదొక బహుళ అంతస్తుల సము దాయం. అనేక దుకాణాల సమాహారం. అనేకరకాల వస్తువులు ఒకే గొడుగు కింద విక్రయానికి దొరుకు తాయి. గుండుసూది మొదలుకొని కాసులపేరు వరకూ, కర్చీఫ్‌ ‌నుంచి కంచిపట్టు చీర వరకూ, కరివేపాకు నుంచి గుమ్మడికాయ వరకూ, కిలోల్లెక్కన చిత్తు కాగితాలు మొదలుకొని అపురూపమైన సుప్రసిద్ధ గ్రంథాల వరకూ, కొండపల్లి బొమ్మ నుంచి కోట్లు ఖరీదు చేసే శిల్పాల వరకూ…! ఇలా చెప్పు కుంటూ పోతే ఆ చిట్టాకు అంతే ఉండదు.

వీటన్నింటికీ తోడు ఆ ప్రాంగణంలోనే రెండు సినిమా థియేటర్లున్నాయి. ఒకటి మినీ, మరొకటి మాక్సీ (అంటే పెద్దదన్నమాట, ఐమాక్స్ ‌తరహాలో అనుకోండి).

ఆ భవనం లోపలి దుకాణాలన్నీ ఆయా సామాన్లతో నిండి ఉన్నాయి. థియేటర్లు కూడా కొత్తగా రిలీజైన సినిమాలతో సిద్ధంగా ఉన్నాయి.

ఎప్పటిలాగే ఆ రెండ్రోజుల ముందుగానే ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తూ, వచ్చేపోయే వారి తిట్లు శాపనార్థాలను ఆశీర్వాదాలుగా భావిస్తూ, భవనానికి బయటే రోడ్డంతా కవర్‌ ‌చేస్తూ పెద్ద షామియానా వేశారు. చెవులు చిల్లులు పడేలా మైక్‌ ‌సెట్టొకటి కట్టి ఫుల్‌ ‌వాల్యూమ్‌లో ఈ తరం గానాబజానా పాటలు మోత మోగిస్తున్నారు. అక్కడి వాతావరణం పల్లెటూరు తిరునాళ్లులా ఉంది.

భవన సముదాయానికి స్వంతదారు పదహార ణాల తెలుగుతనం ఉట్టిపడేలా పంచె•కట్టులో హుందాగా ముఖద్వార వద్ద వీఐపీలను స్వాగతించేం దుకు సిద్ధంగా ఉన్నాడు.

అతని ముఖంలో ఏదో ఇబ్బంది గోచరిస్తున్నా సంతోషాన్ని పులుముకుని హుందాతనాన్ని అరువు తెచ్చుకున్నట్లు కనిపిస్తోంది. అతని తమ్ముడు కాబోలు, అడ్డదిడ్డంగా పరుగులు తీస్తూ అందరినీ అదిలిస్తూ పనివ్ణాళ్లను పరుగులు తీయిస్తు న్నాడు. యజమాని తన తమ్ముడి వైపు అప్పుడప్పుడూ ఓరకంటితో చూస్తూ అంతలోనే కొద్దిగా నొసలు చిట్లిస్తూ, పెదాలు కదిలిస్తూ నానా ఇబ్బంది పడుతున్నాడు.

ఇంతలో బయట కలకలం! కారణం… కుర్ర సినీ హీరోహీరోయిన్‌లు విచ్చేశారు. వాళ్లేదో సినిమాలో మొదటిసారి హీరో హీరోయిన్లుగా పరిచయమ య్యారుట.

వెంటనే తమ్ముడి అనుచరగణం ఒక్క గెంతులో వాళ్లను చేరుకుని వారి కోసం ప్రత్యేకించిన సీట్ల వద్దకు తోడ్కొని వెళ్లి కూర్చోబెట్టారు. ఆ వెంటనే అక్కడ యూనిఫామ్‌లో ఉన్న పని కుర్రాళ్లు చిరుతిళ్లు, కూల్‌ ‌డ్రింకులు హాట్‌ ‌డ్రింకులతో తుఫానులా దూసుకొచ్చి వాళ్లముందు నిలబడి ఒకళ్లను మించి మరొకరు ‘అతిథి మర్యాదలకు పూనుకొన్నారు.

‘మీరు ఇబ్బంది పడితే నాకేంటి నట్టం’ అన్నట్టుగా దాదాపుగా హీరో హీరోయిన్ల మీద పడిపోయారు. తమ చేతిలో ఉన్న కేకును దాదాపుగా నోట్లో కుక్కేసినంతగా, కూల్‌ ‌డ్రింక్స్, ‌కాఫీలను చిన్నపిల్లలను కాళ్లమీద అడ్డంగా పడేసుకుని ఆముదం తాగించినట్టు నోరు పగల్దీసి పోసేందుకే సిద్ధమై పోయారు.

ఉన్నంతలో హీరో పరిస్థితి కాస్త నయం. అది సహజమే. ఎందుకంటే హీరో కన్నా హీరోయిన్‌ ‌కే క్రేజ్‌ ఎక్కువ. తేనె పట్టును ముసురుకున్న తేనెటీగల్లా, చెరుకు పిప్పిని ముసురుకున్న ఈగల్లా, చక్కెరపాకం చుట్టూ చేరిన గండు చీమల్లా, కొత్త సినిమా రిలీజ్‌ ‌రోజున థియేటర్‌ ‌ముందు గుమిగూడిన జనంలా, ఉదయం తొమ్మిది గంటలకు వెళ్లే సిటీ బస్సులోని తలుపు వద్ద వేలాడే ప్రయాణికుల్లా, ఉదయం ఆఫీసు సమయాల్లో ట్రాఫిల్‌ ‌సిగ్నల్‌ ‌వద్ద వాహనాల గుంపులా… ఇలా అనేక విధాలుగా వర్ణించవచ్చు ఆమె పరిస్థితిని. కుర్ర హీరోహీరోయిన్లు కావడాన కుర్రకారు క్రేజ్‌!

ఇం‌తలో మళ్లీ కలకలం! బడా హీరో ఎవరో వచ్చారట!

సుమారుగానే పాపులారిటీ ఉన్న హీరో కావడంతో క్షణాల మీద కొత్తవాళ్లను వదిలేసి అటువైపు లంఘించారు అందరూ. అన్ని కెమెరాలూ అటువైపు మళ్లాయి.

కొత్త హీరోహీరోయిన్ల పరిస్థితి థియేటర్లో ఫ్లాప్‌ ‌సినిమా ఆఖరి ఆటలా, క్రికెట్‌ ‌మ్యాచ్‌ ‌ముగిసి తరువాత స్టేడియంలా అయింది.

అక్కడికి వచ్చిన ఆ ఓ మోస్తరు బడా హీరో పరిస్థితి కూడా దాదాపుగా తేనె తుట్టిలాగే ఉంది. ప్రస్తుతానికి పరిచారకులు తమకు చేతనైనంతలో చేతనైన అన్ని విధాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. నవ్వలేక, ఏడవలేక, వద్దనలేక, వారించలేక, కూర్చోలేక, నిలబడలేక ఇలా అనేక ‘లేక’లతో సతమతమయ్యాడు హీరో. ఈ ‘లేక’లన్నీ భరించలేక పోతే ఈనాడు అతను ఈ స్థితిలో ఉండేవాడు కాడేమో!

ఇంకాస్సేపటికి మరో కల్లోలం! ఎందుకంటే ప్రముఖ హీరోయిన్‌ ‌వచ్చేసింది.

వేసవి కాలంలో ఒకచోటి నుంచి మరోచోటికి, ఖండాంతరాలకు వలసపోయే పక్షుల గుంపులా, పక్షితీర్థంలో వచ్చివాలే పక్షుల్లా, మొత్తంగా ఆమె వైపు మళ్లారు జనమంతా. ఈ మధ్యన సేవకుల, పరిచార కుల అవస్థ వర్ణనాతీతం. పద్మవ్యూహం లోనికి జొరబడే అభిమన్యుడిలా తమ చేతిలోని ట్రేలు డాలుగా భావించి జనాన్ని ఛేదించుకుని లోపలికి జొరబడుతున్నారు.

ప్రముఖ హీరోయిన్‌ ‌తెలుగమ్మాయే ఐనా తెలుగు మాట్లాడేందుకు తెగులు పట్టి ‘‘యూ నో, ఐ డోనో టేల్గూ దట్‌ ‌మచ్‌. ‌కొంతకొంత మాట్లాడుతను’’ అంటూ కొంకర్లు పోయింది.

ఈలోగా మళ్లీ మరో కలకలం. మరో పే…ద్ద హీరోహీరోయిన్‌ ఒకేసారి జంటగానే వచ్చేశారు. అదేదో సినిమాలో జంటగానే నటిస్తున్నారట మరి!

దాంతో పెద్దపెద్ద హీరోయిన్‌ను వదిలి పే…ద్ద హీరోయిన్‌ ‌వద్ద వాలిపోయారందరూ పుష్కరిణిలో బొరుగులు, పేలాలూ, తినుబండారాలు చల్లితే ముసురుకునే చేపపిల్లల్లా!

భవన సముదాయం యజమాని కాస్త కాకుండా చాలా ఇబ్బందిగా చూస్తున్నాడు. అతని పేరు గజపతి. మాటిమాటికీ చేతి గడియారం వంక చూసుకుంటూ ఇబ్బందిగా కదులుతున్నాడు. ముహూర్తం మించి పోతుందన్న ఆందోళన అతన్ని స్థిమితంగా ఉండనివ్వడం లేదు.

ఇలా సినీజన ప్రహసనం ముగుస్తూండగా మరికాస్సేపటికి హఠాత్తుగా ‘‘పేదలపాలిటి పెన్నిధి పెద్దన్న గారికి జిందాబాద్‌’’ అం‌టూ అరిచారు. ఎవరో లోకల్‌ ‌నాయకుడి ఆగమనం! అదీ ఆ సంబరం!

ఓమూలగా పిట్ట గోడమీద కూర్చుని ఈ తతంగాన్నంతా చోద్యంగా చూస్తున్నాడో ఆర్కే లక్షణ్‌ ‌కార్టూన్‌ ‌లోని సామాన్యుడిలాంటి సామాన్యుడు. ‘పేదల పెన్నిధా? పెరట్లో గుప్తనిధా? ఎవడికి తెలుసు లోగుట్టు?’ అది ఆ సామాన్యుడి సణుగుడు!

హఠాత్తుగా అక్కడి రంగుల వాతావరణం రాజకీయరంగు పులుముకుంది. ఆ షామియానా కింద అంత క్రితం కాస్త పులుముకున్న రాజకీయ రంగు ఇప్పుడు పూర్తిగా అలుముకుంది. మరి కాస్సేపటికి స్టేట్‌ ‌లెవెల్‌ ‌నాయకుడొకరు విచ్చేశారు. ఆ వ్యక్తి పెద్ద హీరోలకు బాగా పరిచయం. దాంతో సినిమారంగు రాజకీయరంగు పాలు నీళ్ళల్లా కలిసిపోయాయి.

గజపతికి సహనం అంతకంతకూ చచ్చి పోతూంది. ఇందరు వస్తున్నా అసలు రావల్సిన వ్యక్తి ఇంకా రాలేదు. సరిగ్గా ఇక అరగంటే ఉంది ముహూర్తానికి. అతను వచ్చిన తరువాత పూజా కార్యక్రమాలకు ఎరేంజ్మెంట్స్ ‌పేరిట ఎంతలేదన్నా ఓ పావుగంట మింగేస్తాడు పురోహితుడు. అసలింత వరకూ ఆ పురోహితుడే పత్తాలేదు.

ప్రారంభోత్సవానికి వచ్చే ముఖ్య అతిథి స్థానికంగానే కాక ఢిల్లీ లెవెల్లో మంచి పలుకుబడి ఉన్న వ్యక్తిట. అందుకే అతని తమ్ముడి భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని అతని సిఫార్సు మేరకే నాయకుణ్ణి పిలిపిద్దామని ఎరేంజ్‌ ‌చేశాడు. ఆ విషయం అక్కడెవరికీ ఇంకా తెలియదు. రాజకీయంగా ఎదగాలని తెగ ఉబలాట పడిపోతున్న తమ్ముడికి ఆసరాగా ఉంటుందిలే అన్న ఒక సాఫ్ట్ ‌కార్నర్‌ ‌వల్ల ఒప్పుకోవాల్సి వచ్చింది.

ప్రారంభోత్సవం చేసే వ్యక్తి ఓ ప్రముఖ నాయకుడన్న వార్త హఠాత్తుగా బయటికి పొక్కింది. ‘అతను మంత్రి కాదూ, సినీ తారా కాదు. స్థానికం గానే కాక ఢిల్లీ లెవెల్లో బలమున్న నేతట!’ అంటూ గుసగుసలాడారు.

సరిగ్గా పదోనిముషంలో ఆ వ్యక్తి వచ్చాడు. విశేషమేమిటంటే పురోహితుడు కూడా అతనితో బాటే కార్లోంచి దిగాడు. మళ్లీ ఎప్పటిలాగే అంతకు ముందున్న వాళ్లందరినీ వదిలి ఇతని చుట్టూ మూగారు ఫోటోగ్రాఫర్లు.

గజపతి కొద్దిగా అసహనంతో ఉన్నాడన్నది గ్రహించిన అతని తమ్ముడు అతన్ని శాంతించమని ముక్కూ మూతీ మెలేసుకున్నాడు.

ఎట్టకేలకు పురోహితుడు పూజా కార్యక్రమం ప్రారంభించాడు.

‘‘శుభాభ్యాం, శుభే శోభన ముహూర్తే…’’ అంటూ గట్టిగా ప్రారంభించాడు. అక్కడ గుంపులో ఎవరికో సందేహం ‘‘శోభన ముహూర్తమంటాడే? ముహూర్తం పెట్టింది శోభనానికా, ప్రారంభోత్సవానికా? ఇక్కడ శోభనం జరుపుతారా? ఎవరికి?’’

‘‘నాక్కూడా తెలీదు నేనిప్పుడే వచ్చా. ఎవరికైతేనేం చూసేందుకేగా వచ్చాం’’ మరొకరి సర్దుబాటు వచనాలు. ఎట్టకేలకు రిబ్బను కత్తిరించే సమయం ఆసన్నమైంది.

గజపతి కత్తెర చేతిలోనికి తీసుకుని అందరివైపూ ఓమారు విజయగర్వంతో చూసి అడుగు ముందు కేశాడు రిబ్బన్‌ ‌వైపు. హఠాత్తుగా అక్కడున్న వాళ్లందరికీ ‘ఇదేమిటి? నాయకుడు కాదా రిబ్బన్‌ ‌కత్తిరించేది?’ అన్న సందేహం కలిగింది.

‘‘అదేంటన్నయ్యా? అయ్యగారికివ్వు’’ అన్నాడు తమ్ముడు ఆతృతగా.

‘మరేం ఫర్వాలేదు. నువ్వు సైలెంట్‌గా ఉండు’ అన్నట్టుగా చెయ్యి చూపించి అడుగు ముందుకేసి రిబ్బన్‌ ‌ముందు నిల్చున్నాడు గజపతి.

‘అన్నయ్యా, నా ఎమ్మెల్యే సీటు…’’ అంటూ గుసగుసలాడాడు గజపతి చెవిలో.

‘‘అదేమన్నా ఎల్‌కేజీ సీటనుకున్నావా. అమాం తంగా ఇచ్చెయ్యడానికి? నీబోటివాళ్లు వెయ్యిమంది ప్రయత్నిస్తుంటారు. కార్యక్రమం ముగిసిం తరువాత మిగతా విషయాలు మాట్లాడుదాం. నువ్వు నువ్వు డిస్టర్బ్ ‌చెయ్యొద్దు’’ అంటూ రిబ్బను కత్తిరించేందుకు ఉపక్రమించాడు గజపతి.

ముహూర్తం దాటిపోతూందన్న ఆతృతతో ఒక్కసారిగా కిందామీద పడుతూ ఒకళ్ల నొకరు తోసుకుంటూ ముఖద్వారానికి కట్టి ఉన్న రిబ్బను కిందనుంచి దూరి లోపలికెళ్లబోయారు కొంతమంది ఫోటోగ్రాఫర్లు.

కత్తెరతో సిద్ధంగా నిలబడున్న గజపతి అలా లోపలికి దూరేందుకు ప్రయత్నించే ఇద్దరు ఫొటో గ్రాఫర్లను అమాంతంగా కాలర్‌ ‌పుచ్చుకుని ఇవతలికి ఈడ్చి పారేశాడు.

ఈ హఠాత్పరిణామానికి అందరూ నివ్వెర పోయారు.

‘‘ముందు రిబ్బను కత్తిరించిన తరువాతే ఎవరైనా లోపలికి అడుగు పెట్టాలి. రిబ్బన్‌ ‌కట్టిందందుకే. అర్థమైందా? అదే నిజమైన ప్రారంభోత్సవం’’ అన్నాడు గజపతి స్థిరంగా.

‘‘అదేంటి సార్‌ అలా ఈడ్చేశారు? లోపల నిలబడి ఫొటో తీస్తేనే రిబ్బను కత్తిరించే వాళ్ళ ముఖం బాగా కవర్‌ ‌చెయ్యగలం. లేకపోతే లేదు’’ అన్నాడు ఆ ఫొటోగ్రాఫర్‌.

‘‘‌కవర్‌ ‌కాకపోతే కొంపలేమీ మునిగిపోవు. ప్రారంభోత్సవం అని ముహూర్తం పెట్టింది పద్ధతిగా ఆ సమయానికి రిబ్బన్‌ ‌కట్‌ ‌చేసి తరువాతే లోపలికి ప్రవేశించాలని, పాదం మోపాలని. అంతకు ముందే రిబ్బను కిందనించి లోపలికి దూరి పబ్లిసిటీ కోసం ఫొటోలు తీయించుకోడానిక్కాదు కాదు. మీకిష్ట ముంటే, ఇలాగే కవర్‌ ‌చేయడం చేతనైతే, పక్కనే నిలబడి ఫొటోలు తీసుకోండి. లేకుంటే అసలు ఫొటోలూ, వీడియోలే అక్కర్లేదు’’

ముఖ్యఅతిథిగా వచ్చిన స్థానిక నాయకుడు ఆ మాటలకు చిద్విలాసంగా నవ్వాడు.

‘‘పెద్దవారు క్షమించాలి. మా తమ్ముడికి మీదగ్గరున్న చనువుతో ప్రారంభో త్సవానికి మిమ్మల్ని పిలుస్తానంటే కాదనలేకపోయాను. ముందుగా మీ చేతనే ఈ ప్రారంభోత్సవం కానిద్దామనుకున్నాను. కానీ ఇదుగో, ఇలాంటిదేదో జరుగు తుందని ఊహించే మీకు ఫోన్లో విషయాన్ని విన్నవించాను. సహృదయతో మీరర్థం చేసుకున్నారు. కానీవ వీళ్లు మాత్రం మాటలతో కాక చేతలతోనే, ప్రాక్టికల్‌ ‌గానే అర్థం చేసుకుంటారన్న విషయం నాకు ముందే తెలుసు. వ్యాపారం పది కాలాలపాటు చల్లగా సాగాలని మంచి ముహూర్తం పెట్టి రిబ్బను కట్టి ప్రారంభోత్సవం చేస్తాం. అంతేకానీ మనం ఫొటోకు ఫోజులివ్వడం కోసమైతే పెట్టిన ముహూర్తానికీ, కట్టిన రిబ్బనుకూ ఏముంది విలువ? సంప్రదాయాలకు విలువనివ్వడం మన కర్తవ్యం. ప్రారంభోత్సవ సమయంలో ఇవన్నీ ఇంతగా విడమర్చి చెప్పలేను గనుకనే ముందుగానే విన్నవించుకున్నాను. మీరు అంతకన్నా హుందాగా నన్నర్థం చేసుకుని నా ఆహ్వానాన్ని మన్నించారు. ఇక కత్తిరించ మంటారా?’’ అన్నాడు గజపతి.

‘‘మీ సెంటిమెంట్‌, ‌ప్రారంభోత్సవం గురించిన అసలు విషయం ఇక్కడ అందరికీ అర్థమైందిగా. ఇప్పుడు మీరంగీకరిస్తే నేను కూడా మనస్ఫూర్తిగానే కత్తిరించగలను. నాకెటువంటి ఈగోలూ లేవు’’ అన్నాడు ముఖ్యఅతిథి గజపతి భుజం తడుతూ.

సంతోషంగా కత్తెరను ముఖ్య అతిథికి అందించాడు గజపతి.

అక్కడ ఫొటోగ్రాఫర్లందరికీ ఇదొక ఎదురు చూడని అనుభవం. సాధారణంగా ఎక్కడ ప్రారంభోత్సవం జరిగినా ఆ ప్రారంభానికి ముందే రిబ్బను కిందనుంచి లోపలికి దూరి ఎదుటి వైపునుంచి ఫొటోలు తీసి ఆర్భాటం చేయడం ఇప్పటి ఆనవాయితీగా మారింది. ముహూర్తాన్ని మూలకు నెట్టి పబ్లిసిటీకి పెద్దపీట వెయ్యడమే ఈనాటి ప్రారంభోత్సవాలకు ఆనవాయితీ మారింది.

అలా కుదరదని గజపతి కుండబద్దలు కొట్టినట్టు చెప్పడంతో అందరూ ఒక్కసారిగా బిక్కచచ్చి పోయారు.

ఫొటోలకు ఫోజులివ్వడమే నిజమైన ప్రారంభో త్సవం అని అనుకునే వాళ్లకూ, అదే ఆనవాయితీగా ఇన్నాళ్లు కవరేజ్‌ ‌చేస్తున్న వాళ్లకూ నిజమైన ప్రారంభోత్సవం అంటే ఏమిటో అర్థమైంది. ఐనా జరిగింది జీర్ణించుకోలేక తమ ఫొటోగ్రఫీ, వీడియో గ్రఫీ సామర్థ్యతను నిరూపించుకునే అవకాశాన్ని కోల్పోయినట్టు పరమ ఇబ్బందిగా ముఖాలు పెట్టుకుని ఫొటోలు తీసుకున్నారు.

కేవలం ఇలాంటి ప్రారంభోత్సవాలే కాదు. రెండు జీవితాలను ఒకటి చేసి కలకాలం చల్లగా ఉండాలని పదిమందీ మనసారా దీవించే పెళ్లిళ్లలో కూడా ముహూర్తాన్ని మూలకు నెట్టి, కేవలం ఫొటోలకూ వీడియోలకే ప్రాముఖ్యత నిస్తున్నారన్నదే అక్షరసత్యం. పైగా చేసినదాన్నే మళ్లీ మళ్లీ చేయించి రకరకాల యాంగిల్స్‌లో ఫొటోలు తీస్తారు.

అందరు ఫొటోగ్రాఫర్లకూ, ప్రారంభోత్సవం చేసిన ముఖ్యఅతిథి, పక్కనున్న గజపతుల వీపులే ఫొటోల్లో కనిపించాయి కవరయ్యాయి. ముందు నిలబడ్డ ఇద్దరు ముగ్గురు ఫొటోగ్రాఫర్లు మాత్రమే ఓ మోస్తరు సైడ్‌ ‌వ్యూ తీయగలిగారు. గజపతి రిబ్బన్‌ ‌కత్తిరించగానే అందరూ గట్టిగా చప్పట్లు కొచ్చారు.

పిట్ట గోడమీద కూర్చున్న సామాన్యుడు మాత్రం ఆనందం పట్టలేక మరింత గట్టిగా చప్పట్లు చరిచి కేరింతలు కొట్టాడు. అందరి చప్పట్లు ఆగిపోయినా అతనింకా కొడుతూనే ఉన్నాడు. మనస్ఫూర్తిగా, ఆహ్లాదకరంగా నవ్వుకున్నాడు. చాన్నాళ్ళకు అతనికి నిజమైన ప్రారంభోత్సవం చూసిన ఆనందం, తృప్తి కలిగాయి.

About Author

By editor

Twitter
Instagram