– పాలంకి సత్య

ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన

జూలియస్‌ ‌సీజర్‌ ‌కాలినడకన సెర్విలియా ఇంటికి చేరుకున్నాడు. గృహ ప్రాంగణంలో నిలబడి ఉన్న భటుడు సీజర్‌ను గుర్తుపట్టి, లోనికి తీసుకొని వెళ్లాడు. కొంతసేపటికి సెర్విలియా వచ్చి, కౌగలించుకుని, ‘‘నేను పిలిపించవలసినదేనా? నీ అంతట నీవు వస్తావని ఎంతగానో ఎదురుచూసాను’’ అన్నది, నిష్టురంగా.

‘‘ప్రేయసీ! అనుక్షణమూ నా తలపులలో నీవు కదలాడుతూనే ఉన్నావు. జూపిటర్‌ ‌దేవుని ప్రధాన పురోహితుని కుమారునిగా నీ దగ్గరకొచ్చిన నేను ఈనాడు ధనహీనునిగా రాలేకపోయాను’’

‘‘ధనం కన్నా ప్రేమ గొప్పది. రోమ్‌ ‌నగరంలోని ధనవంతురాళ్లలో నేను ఒకతెను. అయినా ఏం ప్రయోజనం? తండ్రి నా చిన్నతనంలోనే మరణించి నాడు. నా తల్లి పునర్వివాహం చేసుకున్నది. ఇద్దరు పిల్లలను కన్న తరువాత ఆమె మరణించింది. నా సవతి తండ్రి పరలోకగతుడైనాడు. నా వయసుకు రెట్టింపు వయసున్న వృద్ధునితో పెళ్లికావడం ఎంత దుఃఖకరమో కదా! నా చీకటి బతుకులో ఉన్న ఒకే ఒక్క వెలుగువు నీవే’’.

‘‘సెర్విలియా’’ అంటూ సీజర్‌ ఆమెను గాఢాలింగనం చేసుకున్నాడు.

రెండు జాములు గడిచిపోయాయి.‘‘అర్ధరాత్రి కావస్తున్నది. చీకటిలో నడచి వెళ్లడం ప్రమాదం. నగర నియమాలు అంగీకరించవు. భటులు చంపివేయగలరు’’ అన్నాడు సీజర్‌.

‘‘ఉదయమే వెళ్లవచ్చును’’ సెర్విలియా అన్నది.

‘‘ఇప్పుడు వెళ్లవలసిన అవసరముంది!’’

‘‘నీ భార్య మీద మనసు మళ్లిందా ఏమిటి?’’ వ్యంగ్యంగా అన్నది సెర్విలియా.

జూలియస్‌ ‌సీజర్‌ ‌సంభాషణను మళ్లిస్తూ, ‘‘ఇంతకూ నా పుత్రుని నాకు చూపించనే లేదు’’ అన్నాడు.

‘‘పుత్రుడు అతని తండ్రితో కలసి కార్యార్ధమై వెళ్లినాడు.’’

‘‘తండ్రి ఎవరు? నేనే కదా తండ్రిని!’’

‘‘కుమారుని పేరు మార్కస్‌ ‌బ్రూటస్‌’’ అన్న సెర్విలియా లేచి నిలబడి ‘‘నీవు నడచి వెళ్లడం ప్రమాదం. నీ కోసమో రథం సిద్ధం చేయమని సారథికి చెప్తాను’’ అని బయటకు వెళ్లింది.

సీజర్‌ ‌ముభావంగా కూర్చున్నాడు. పిల్లవాడు తన కొడుకు కాదా?

* * * * *

రథం దిగిన జూలియస్‌ ‌సీజర్‌కు ఇంటి ముంగటనే ఎదురైన కొర్నీలియా ‘‘మీ కోసమే ఎదురుచూస్తున్నాను. సాయం సమయములో బయటకు వెళ్లిన మీరు ఇంతవరకూ రాలేదు. భటులు బంధించారేమోనని భయపడ్డాను’’ అన్నది.

‘‘రాచకార్యార్ధమై వెళ్లవలసి వచ్చింది’’

‘‘రాచకార్యమా? రోమ్‌కు రాజులు లేరు కదా!’’

‘‘నేడు లేకున్ననేమి? రేపు రాజరికం రావచ్చును. నీవు చక్రవర్తి భార్యవు కావచ్చును.’’

‘‘నాకు అటువంటి కోరికలు లేవు. మీ ప్రేమ తరంగిణిలో నన్ను ఓలలాడిస్తే చాలు.’’

ఇదేమిటి? సెర్విలియా తన ప్రేమనే కోరు కుంటున్నది. తన భార్య కూడా తన ప్రేమనే కోరుకుంటున్నది. ఇంకెందరు స్త్రీలు తనను వలచి, వరించగలరో! గ్రీసు రాజ్యంలో వలె రోమ్‌లో బహు భార్యత్వం చట్ట సమ్మతం కాదు. అయిననేమి? బహు ప్రేయసీ వ్రతాన్ని ఎవరు కాదనగలరు?

తనలోని మగసిరికి తానే నీరాజనాలు సమర్పిస్తూ జూలియస్‌ ‌సీజర్‌ ‌భార్యను దగ్గరగా తీసుకొని, శయన మందిరం వైపు నడిచాడు.

 * * * * *

తనకు శాస్త్రాన్ని బోధిస్తున్న యవన జ్యోతిషశాస్త్ర గురువు చెప్పిన విషయాలు డేరియస్‌తో చర్చించాడు మిహిరుడు.

‘‘అలెక్సాండరు అనే గ్రీకు రాజు భరతభూమిపై దండెత్తినాడనీ, పాంచాల రాజ్య ప్రభువు పురుషోత్తముడతనిని నిలువరించినాడనీ ఇదివరకే నాకు తెలుసు. అయితే విచ్ఛినమైన గ్రీకు సామ్రాజ్యం లోని రెండు భాగాలను రోమ్‌ ‌పాలకులు జయించి, సర్వనాశనం చేసినారని ఇవాళే మా గురువులు తెలియజెప్పారు. రోమ్‌ ‌పాలకుల క్రూర ప్రవర్తన, ఆ చరిత్ర నా మనసును వికలం చేశాయి.

‘‘గ్రీకు రాజులు సాధు వర్తనులని నీ నమ్మకమా? గ్రీసులో అనేక చిన్న రాజ్యాలుండేవి. వారు ఒకరితో ఒకరు యుద్ధం చేసినప్పుడు ఒకరి నగరాలను ఒకరు నాశనం చేసికొనేవారు. అలెక్సాండరు పారశీకంపై దండెత్తి విజయం సాధించినప్పుడు దేశ రాజధాని పెర్సిపోలిస్‌లోని ముఖ్య ప్రాంతాలన్నిటినీ తగల పెట్టించినాడు. నాడు వారు చేసినదే నేడు రోమ్‌ ‌పాలకులూ చేస్తే ఆశ్చర్యమేముంది?’’ అన్నాడు డేరియస్‌.

‌మిహిరుడు ‘‘భరతభూమిలో ధర్మరక్షణకో, అధర్మ నిర్మూలనకో మాత్రమే యుద్ధాలు జరుగుతాయి. రాజ్యాలను ఆక్రమించుకోవడం, జనావాసాలను ధ్వంసం చేయడం జరగనే జరగదు. ఓడిన రాజు విజేతకు కప్పం చెల్లించడం వరకే. . యుద్ధంలో రాజు మరణించిన పక్షంలో అతని కుమారునికే సింహాసనంపై కూర్చుడే అర్హత ఉంటుంది’’ అని అన్నాడు.

వారి సంభాషణ వింటున్న ఖనా ‘‘నాకు అందుకే భరతభూమిపై, భరత ఖండ సంస్కృతీ సంప్రదాయ ములపై అపారమైన గౌరవం’’ అని అన్నది.

‘నీవు భారతీయుల బిడ్డవే కదా!’ అని మనసులో డేరియస్‌ అనుకున్నాడు. అతని ఆలోచనలను గమనించిన మిహిరుడు, ‘‘భారతీయ జ్యోతిషంకూడా నీకు నచ్చినట్లుగానే ఉన్నది కదా’’ అని ఖనాతో చెప్పి డేరియస్‌తో ‘‘మీ పుత్రిక ఎంతో తెలివైనది. నేను ఆరు సంవత్సరాలలో నేర్చుకున్న విద్యను ఆమె ఆరు నెలలలోనే చక్కగా నేర్చుకున్నది’’ అన్నాడు.

అందులో నా గొప్పతనమేమీ లేదు. నాకు విద్యనేర్పిన గురువుల ఘనత’’ ఖనా అన్నది.

‘‘నేను మా తండ్రిగారి వద్ద విద్యాభ్యాసం చేశాను. ఆయన కన్నా ఘనుడినా ఏమిటి? ఏనాటికీ ఆయనను మించిపోలేను’’.

‘‘ఏ తండ్రి అయినా తన కుమారుడు తనను మించి పోవాలని కోరుకోవడం సహజం. మీరు ఎన్ని శిఖరాగ్రాలను అధిరోహించగలరో ఇవాళే ఎలా చెప్పగలం?’’

‘‘నిన్ను మాటలలో మాత్రం మించలేను!’’ అన్న మిహిరుని మాటలకు ఖనా మందహాసం చేసినది. డేరియస్‌ ఆనందంగా నవ్వాడు.

* * * * *

ఆనాటి సాయం సంధ్యావందనమైన తర్వాత మిహిరుడు ఖనాకు సప్తర్షి చలనం గురించి పాఠం ప్రారంభించాడు.

‘‘భూమి తన చుట్టూ తాను తిరగడం వలన సూర్యోదయం, అస్తమయం మనకు కన్పిస్తున్నవని నీకు తెలుసు. భూమి సూర్యుని చుట్టూ తిరగడం వలన సూర్యుడు ఆకాశంలోని పన్నెండు రాశులలో కదలుతున్నట్లు కన్పించడం గురించి నేర్చుకున్నావు. చంద్రుని పెరుగుదల, తరుగుదల మొదలైనవీ నీకు బోధించాను. నేడు సప్తర్షి మండలం కదలిక గురించి తెలిసికొనెదవు గాక.’’

‘‘నక్షత్రాలు కదలిక లేనివని అన్నారు కదా!’’

‘‘నిజమే, సప్తర్షి మండలం కదలిక అయినా భ్రమ మాత్రమే. సూర్యుడు కదలినట్లుగా కనిపించే వృత్తమూ, ఖగోళ మధ్య రేఖ వృత్తమూ ఖండించుకునే బిందువులకు విషువులని పేరు. ఈ విషువులు ఒకే చోట ఉండవు. వృత్తం వెంబడి పయనిస్తూ ఉంటాయి’’ అని చెప్పి మిహిరుడు ఆమెకు భూర్జ పత్రంపై పటం గీసి చూపించాడు.

ఖనా పాఠం వింటూ, పటం చూస్తూ విషయాన్ని గ్రహిస్తున్నది.

‘‘విషు బిందువులు వృత్తమంతటినీ తిరిగి మొదటనే ఉన్న స్థానం చేరుకొనడానికి 26,000 సంవత్సరాల సమయం పడుతుంది. విషు బిందువుల స్థానాన్ని బట్టి ఆకాశంలో ఉత్తర, దక్షిణాలను నిర్ణయిస్తారు. సప్తర్షి మండలంలో ముందుగా ఉదయించేవి పులహ, క్రతువులు. వాటికి నేరుగా దక్షిణంగా ఏ నక్షత్రముంటుందో, సప్తర్షులు ఆ నక్షత్రంలో ఉన్నట్లుగా చెప్తారు.’’

మిహిరుడు పటాల సహాయంతో వివరిస్తున్నాడు. ఖనా ఆకళింపు చేసుకుంటున్నది.

అర్ధరాత్రి అయింది. పరిచారిక వచ్చి విన్నవించే వరకూ ఇరువురికీ కాలగమనం తెలియలేదు.

* * * * *

మరునాడు మధ్యాహ్న భోజన సమయంలో మిహిరుడు డేరియస్‌తో ‘‘నిన్న మీ పుత్రికకు సప్తర్షి మండల చలనం గురించి వివరించాను. ఒక పర్యాయం ఆకాశంలోని నక్షత్రాలను సూర్యో దయానికి ముందుగా ఆమె గమనిస్తే మరింత చక్కగా ఆకళింపు చేసుకొనగలదు. రేపు సూర్యుని తులా సంక్రమణం. మీరు అంగీకరిస్తే నగరం వెలుపల ఆరుబయట ప్రదేశానికి ఆమెను తీసికొని వెళ్లగలను’’ అన్నాడు.

‘‘అలాగే. రేపు ఉదయమే రథం సిద్ధపరచమని సారథికి చెప్తాను’’

ఎక్కువ దూరం లేదే. రథమెందుకు? భోగ భాగ్యాల మధ్య పెరిగిన ఖనా సుకుమారి కనుక నడువలేదా? పర పురుషుని వెంట పంపేందుకు భయమా? ఏ కారణమైన ఏమి? మిహిరుడు ఆలోచనా ప్రవాహాన్ని ఆపివేశాడు.

* * * * *

ఆనాటి రాత్రి రెండు జాములు గడిచిన కొంతసేపటికే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకుని, గృహం వెలుపలకు వచ్చిన మిహిరునకు రథం పక్కనే నిలబడి ఉన్న ఖనా కనిపించింది. అతడు ఆనందంగా ‘‘నీకు తొందరగానే మెలకువ వచ్చినట్లున్నది’’ అన్నాడు.

‘‘నిద్రపోతే కదా!’’ అంటూనే ఖనా సారథిని పిలిచింది. దగ్గరలోనే ఉన్న సారథి వచ్చి, రథాన్ని ఆయత్తపరచిన తర్వాత ఖనా, మిహిరులిద్దరూ ఆరో హించారు. కొంతసేపటికే నగరం వెలుపలకు వచ్చిన రథాన్ని ఆరుబయట ప్రదేశంలో సారథి నిలిపాడు.

ముందు మిహిరుడు, వెనుక ఖనా మైదానం మధ్యకు చేరుకున్నారు. అతడామెకు ఆకాశంలోని ఉత్తర దిశను చూపుతూ ‘‘అదిగో సప్తర్షి మండలం. పులహ, క్రతువులు ఉన్న బిందువు దగ్గర నుండి దక్షిణంగా ఒక రేఖను మనసులో ఊహించుకునే ప్రయత్నం చేయాలి. ఆ రేఖ నేరుగా వెళ్లి రాశి చక్రంలో ఏ నక్షత్రాన్ని చేరుకుంటుందో సప్తర్షులు ఆ నక్షత్రంలో ఉన్నట్లు లెక్క. ధర్మరాజు పట్టాభిషి క్తుడైనప్పుడు సప్తర్షి మండలం ఉన్నది. ఆపైన విషు బిందువు వెనుకకు జరిగి పరీక్షిత్తు సింహాసన మధిష్టించే నాటికి ఆశ్లేషలో ఉన్నది. 2700 సంవత్స రాలు పూర్తయ్యేనాటికి ఆంధ్ర చక్రవర్తి శాతవాహన మేఖస్వాతి రాజ్యమేలేవాడు. ఆనాటి నుంచి కొత్త యుగ మేర్పడింది. నేను మేఖస్వాతి సమయం నుంచే కాలగణన చేస్తున్నాను.’’

సప్తర్షి మండలాన్ని, రాశి చక్రాన్ని గమనించిన ఖనాకు విషయం సంపూర్ణంగా అర్ధమయింది. ఆమె భారతీయ సంప్రదాయ పద్ధతిలో మిహిరుని పాదాలకు నమస్కరించి ‘‘మీ వంటి గురువు లభించడం నా అదృష్టం’’ అన్నది. ఆపైన ‘‘మీరు కనుక ఇంత చక్కగా వివరించారు. భవిష్యత్తులో ఇటువంటి గురువులు ఉండరేమో! అప్పుడు సప్తర్షియుగం ఎవరికీ అర్ధము కాదేమో! ఈ లెక్కను తప్పుగా భావిస్తారేమో!’’ అన్నది.

‘‘ఎప్పుడేం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? కాల స్వరూపం సామాన్య మానవులమైన మనకు తెలియదు. ఒకప్పుడు వాస్తవం మరుగున పడ వచ్చును. మరొకప్పుడు బహిర్గతం కావచ్చును’’ అంటూనే మళ్లీ మిహిరుడు ‘‘తెలవారవచ్చుచున్నది. ఇంటికి పోయి జపమూ, సంధ్యావందనమూ నిర్వర్తించాలి’’ అన్నాడు.

ఇద్దరూ కలిసి నడుస్తున్నారు. ఖనా కాలికి రాయి తగిలి ఆమె ‘అమ్మా’ అంటూ పడిపోయింది. మిహిరుడామెను పడిపోకుండా పట్టుకున్నాడు. ఆమె అతని చుట్టూ చేయి వేసి పడిపోకుండా నిలబడింది.

మిహిరునిలో అతనికే అవగతం కాని మధుర భావం ప్రవాహంలా శరీరంలో సాగిపోయింది. అతడామెను పట్టుకున్న చేతిని ఆమె నుండి తీయలేదు. అతని చుట్టూ వేసిన చేతిని ఆమె కదల్చలేదు. కాలం కదలలేదు. తీయని అనుభూతుల పరంపర ఆగలేదు.

కొంతసేపటికి బాహ్య ప్రపంచంలోనికి వచ్చిన ఖనా ముఖంపై సిగ్గూ, ఆనందం కలిసి తాండ వించడాన్ని తూర్పు దిక్కున కన్పిస్తున్న వెలుగు రేకలు మరింత రమణీయంగా తీర్చిదిద్దాయి. ఆ సౌందర్య లక్ష్మిని చూస్తూ నిలబడిన మిహిరుడు ఒక్కసారి ఉలికిపడి, మనస్సును నిలువరించుకుని, ఆమె మీద నుండి చేతిని తీసివేసి, శీఘ్రంగా నడవసాగాడు. అతనిలో ఆలోచనలు అంతకన్నా వేగంగా కదలసాగాయి.

‘‘ఏమిటి? ఇట్లయినదేమి? ఒక కన్యను స్పృశించవచ్చునా? ఆపద్ధర్మంగా ఆమె పడిపోకుండా ఆపే ప్రయత్నం జరిగినది చెప్పుకొనవలెనా? అయితే పులకరింతలేల? అవసరం తీరినప్పటికీ చేతిని తీయకపోవడం ఏమిటి? శరీరం హద్దు మీరితే ప్రాయశ్చిత్తముండవచ్చును. మనస్సు చంచలమైతే…. భరత ఖండానికి తిరిగి వెళ్లిన తర్వాత జనకులే తగిన శిక్షను విధించెదరు గాక.

* * * * *

ఆనాటి సాయం సంధ్యాసమయం దాటినాక ఖనా ఎప్పటివలెనే పాఠం నేర్చుకొనడానికి మిహిరుని వద్దకు వచ్చింది. అతడు తనను తాను తమాయించు కుని బోధన ప్రారంభించాడు. కొంత సేపయినాక ఖనా ‘‘గాలి వీయడం లేదు. పరిచారికను చామరం తీసుకురమ్మని చెప్పనా!’’ అన్నది.

‘‘వాన వచ్చుననిపిస్తున్నది’’ అని మిహిరు డన్నాడు.

‘‘ఆకాశం నిర్మలంగా ఉంది. మబ్బులెక్కడా లేవు. వాన రాదనుకుంటాను’’

‘‘అదిగో అక్కడ చీమల బారును చూడు. తమ గుడ్లను సులువుగా మోసికొనిపోతున్నవి. వర్షానికి అది సూచన’’.

ఖనా ఆశ్చర్యంగా చూసింది.

‘‘సర్ప సమాగమం, పాము చెట్టెక్కడం, ఆవులు తమ గిట్టలనూ, చెవులనూ ఆడించడం వంటివి వాన రాకడను సూచిస్తాయి. కుక్కలు ఇంటిపైకెక్కి ఆకాశం వైపు చూస్తూ అదే పనిగా మొరగడం కుంభవృష్టికి సంకేతం. ‘‘అయితే ఈనాటి రాత్రి వాన తప్పకుండా పడుతుందా?’’

‘‘సంకేతమన్నాను కానీ జరిగి తీరుతుందని అనలేదు. జంతువులూ, పక్షులూ తెలితక్కువవనీ, మానవుడే వివేకవంతుడనీ మన జాతికి గర్వం. కానీ అనేక విషయాలను అవి మనకన్నా చక్కగా గ్రహించగలవు. మానవజాతి అనేక యంత్రాలను కనుగొన్నది. నేటికీ కనుగొంటూనే ఉంది. యంత్ర సహాయంతో వాతావరణ సూచనను జంతువులకన్నా సరిగా గ్రహించగలమనుకోవడం మన భ్రమ మాత్రమే.’’

‘‘నాకు వాన రాకడ తెలుసుకునే విషయ మిదివరలో చెప్పలేదేమి’’?

‘‘విజ్ఞానశాస్త్ర పారంగతులు కావడం ఎవరి వల్లనూ కాదు. సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు భగవంతుడు మాత్రమే’’.

(సశేషం)

(సప్తర్షి చలనం గురించి మరిన్ని వివరాలు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించిన గణిత, ఖగోళ శాస్త్రములు అనే గ్రంథం నుండి తెలిసికొనవచ్చును: రచయిత)

About Author

By editor

Twitter
Instagram