– డాక్టర్‌ ఆరవల్లి జగన్నాథస్వామి

తెలుగువారికే సొంతమైన అపురూప వినోద, విజ్ఞాన సమ్మేళనం అవధానం. ‘అవధానం అంటే మనసులో హెచ్చరిక లేదా ఏకాగ్రత కలిగి ఉండడం అని చెబుతారు. ఒక విషయాన్ని మనసులో ధరించడం లేదా ధారణ చేయడం అవధానం అనే పదాన్ని నిర్వచించవచ్చు. అలా ధారణ చేసిన దానిని ‘స్మృతి’లో (Memory)లో నిలిపి ఉంచి అవసరమైనప్పుడు ఇతరులకు అప్పగించడం (Reproduction) అనే భావం కూడా ఇందులో ఇమిడి ఉంది. ఈ మహోన్నత సాహిత్య పక్రియ వందల ఏళ్ల నుంచే ఉన్నప్పటికీ, ఆధునిక కాలానికి సంబంధించి గుంటూరుకు చెందిన మాడభూషి వేంకటాచార్యులును ఆద్యులుగా పరిగణిస్తారు. ఆయన 150 ఏళ్ల క్రితం (ఫిబ్రవరి 22, 1872) కృష్ణా జిల్లాలోని ఆగిరిపల్లిలో మొదటిసారి అవధానం నిర్వహించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఆ ప్రాతిపదికపైనే ఆ రోజును ‘అవధాన దినోత్సవంగా నిర్వహించాలని సాహితీలోకం చిరకాలంగా కోరుతోంది.

తెలుగువారికి సొంతమైన అపురూప వినోద, విజ్ఞాన సమ్మేళనం అవధానం. అవధానమంటే ఏకాగ్రత, తదేక నిష్ఠ అని అర్థం చేసుకోవచ్చు. ఇది కవి మేధోసంపత్తిని ప్రతిబింబింపచేసే విశిష్ట పక్రియ. 13వ శతాబ్దం కడపటి దశ నుంచి ఈ పక్రియ ఉన్నట్లు సాహిత్య చరిత్ర చెబుతుండగా, 19వ శతాబ్దంలో విద్వాన్‌ ‌మాడభూషి వేంకటాచార్యులు అవధానం చేసేంత వరకు దీని స్వరూప స్వభావాల పట్ల ఆంధ్రులకు అంతగా అవగాహన లేదని సాహితీ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆయన గంటకు వందల పద్యాలు చెప్పగలగడమే కాక అద్భుతాహమైన ‘ఏకసంథా’గ్రహణ శక్తి కలవారని ప్రసిద్ధి. అష్టావధాన, శతావధాన పక్రియలకు సరైన లక్షణాలు లేని కాలంలో వాటిని ఏర్పచి ఆంధ్ర సాహిత్యలోకానికి వాటి స్వరూప స్వభావాలను ఎరుకపరచిన మాడభూషి వారు నూజివీడు సంస్థాన ఆస్థాన కవిగా విలసిల్లారు. పద్యాన్ని అనులోమంగా, ప్రతిలోమంగాను చదవగల నేర్పరి. ఆయన అనుసరించిన విధానాన్ని తాము అనుకరించి అవధానాలు నిర్వహించామని తిరుపతి వేంకటకవులు తమ ‘శతావధాసార’ పీఠికలో పేర్కొన్నారు.

అవధానులుగా తిరుపతి వేంకటకవుల ప్రాభవం, ప్రభావం అనన్య సామాన్యం. దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి జంట అవధానులకు ఆద్యులు. తెలుగు సాహితీ సుమగంధాలను సామాన్య జనవాహినికి చేరేలా చేసిన ఘనత వీరికే దక్కుతుంది. పామరులు కూడా అవధానాలను ఆస్వాదించేలా సాధారణ విషయాలను కూడా వాటిలో మిళితం చేసేవారు. అప్పటి వరకు రాజాస్థానాలలో నర్తించిన కవితాకన్యను అవధానాల ద్వారా ప్రజా సమూహం మధ్యకు తెచ్చిన ప్రజాస్వామ్య కవితా వ్యవస్థాపకులుగా కీర్తిని ఆర్జించారు. ఈ పక్రియకు బహుళ ప్రాధాన్యం కల్పించారు. దీనిని ‘జగదాశ్చర్యకర’ విద్యగా అభి వర్ణించారు. వారి హయాంలో తెలుగునాట అవధా నులు, ఆశుకవులు, ప్రబంధకర్తలు విరివిగా కనిపి స్తారు. అందుకే, శతావధాని వేలూరి శివరామ శాస్త్రి..

‘ఎక్కడఁ జూచినన్‌ ‌గవులె, యెక్కడఁ జూడ శతావధానులే / యొక్కడఁ జూడ నాశుకవులెక్కడఁ జూడ బ్రబంధకర్తలే

దిక్కరులంచుఁబేర్వడిన తిర్పతి వేంకట సూరు లేగు నా / ప్రక్కల నెల్ల నీ కడుపు పండినదమ్మ! తెలుగుదేశమా!… అని కీర్తించారు.

మాడభూషి వారి స్ఫూర్తితోనే తాము శతావధాన విద్యలో కృతార్థులమయ్యామని దేవులపల్లి సోదరులు (పిఠాపురం) చెప్పుకున్నారు. కాకతీయుల ఆస్థానంలో కోలాచలం మల్లినాథయ్య తొలి అవధానిగా, శిరిశన హళ్‌ ‌కృష్ణమాచార్యులు (కోరుట్ల) ఆద్య శతావధానిగా వినుతికెక్కారు. మొత్తం తెలుగునాట వేంకట రామకృష్ణకవులు, కొప్పరపుకవులు, వేలూరి శివరామ శాస్త్రి, అవ్వారి సుబ్రహ్మణ్యశాస్త్రి, కాశీ కృష్ణాచార్యులు, ప్రతివాద భయంకర రాఘవాచార్యులు, పీశుపాటి చిదంబరశాస్త్రి, గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి, పోకూరి కాశీపతి, జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి, సీవీ సుబ్బన్న అవధాని, పింగళి లక్ష్మీకాంతం, కాటూరి వేంకటేశ్వ రావు, విశ్వనాథ సత్యనారాయణ తదితరులు అవధాన శుకవితా ప్రదర్శనలతో విద్వత్కవితాప్రియుల మెప్పు పొందారు.

అవధానం-ఏకాగ్రత

కవిత్రయంతో పాటు శ్రీనాథుడు, తెనాలి రామకృష్ణ కవి, పుష్పగిరి తిమ్మన తదితరులు తమ రచనలలో ‘అవధాన’ శబ్దాన్ని ‘ఏకాగ్రత’కు ప్రత్యా మ్నాయ పదంగా వినియోగించారు. చిత్తం (మనసు) అతి చంచలమైనది. అటుఇటు పరుగులు తీసే దానిని నియంత్రించడం కష్టసాధ్యమని ప్రత్యేకంగా చెప్పన వసరం లేదు. అది ఒకప్పుడు గాఢసుషుప్తిలో ఉంటుంది. మరొకప్పుడు పరుగులు తీస్తుంది. సుషుప్తి సమయంలో మేల్కొలిపి, పరుగులు తీస్తున్నప్పుడు నియంత్రిస్తూ ఏకాగ్రతను సాధించడం మహా కష్టతరం. వాస్తవానికి దీనిని ఒక యోగంగా చెప్పాలి. ‘దయచేసి వినండి’ అని అభ్యర్థన పూర్వక ప్రకటన లోనే ‘సావధాన మనస్కత’ ఎంత కష్టమో బోధపడు తుంది. ఒక అంశంపై మనసు పెట్టడమే అసాధ్య మనుకుంటే అనేక విషయాల పట్ల మనసును లగ్నం చేసి సావధానచిత్తులై ఉండడం ఎంత కష్టతరమో అనిపిస్తుంది సామాన్యులకు. ఏకకాలంలో అనేక అంశాలను చక్కదిద్దుకుంటూ నిభాయించుకు రావడానికి ఎంతో ప్రజ్ఞాపాటవాలు అవసరం. అందుకే ఏకకాలంలో అన్ని పనులను అతి సమర్థంగా నిర్వహించగలిగే వారిని ‘అష్టావధానులు’ అని ప్రశంసించడంలోనే ఈ పక్రియ విశిష్టత తెలుస్తోంది.

 పృచ్ఛలకు ఇచ్చే సమస్యలు, అడిగే ప్రశ్నలకు అవధాని ఏకాగ్రత, సృజనాత్మకత, సద్యఃస్ఫూర్తితో చందోబద్ధంగా ఒక్కొక్క ఆవృతానికి ఒక్కొక్క పాదం పూరించి, చివరిలో ధారణతో వివరిస్తారు. ఎలాంటి సమస్యనైనా పూరించగల సామర్ధ్యం, చతురత, సమయోచిత సమాధానం చెప్పి ఒప్పించడంలో ఏకాగ్రత అవసరం. అష్టాదశ పురాణాలు, తెలుగు కావ్యాలు, పూర్వ కవుల ప్రయోగాలతోపాటు వర్తమాన వ్యవహారాల పట్ల అవగాహన కలిగి, వాటిని సందర్భానుగుణంగా ఉటంకించగలగాలి. అప్పుడే అవధాన అక్షర క్రతువు రక్తికడుతుంది. ఈ పక్రియకు ఆశుకవిత, ధారణ ఆయుపుపట్టు. వెయ్యిమంది అడిగిన సమస్యలను పూరించడం ఒక ఎత్తయితే, అన్ని పద్యాలను అక్షరం పొల్లుపోకుండా  చివరిలో వరుసక్రమంలో ధారణ (అప్పగించడం) చేయడం ఎంత కష్టమో ఊహించలేం. విన్న విషయాన్ని మరుక్షణంలో మరచిపోయే పరిస్థితులలో అన్నన్ని పద్యాలను గుర్తు పెట్టుకుని అప్పగించడం ఎలా సాధ్యం? అని ప్రశ్నించుకుంటే ఆ కిటుకు అవధాను లకు తెలియాలి. స్థూలంగా.. దానిని ‘ఏకాగ్రత’గా చెప్పుకోవాలి. చక్కని పాండిత్యం, ఆశుధార, ప్రతిభ, వ్యుత్పన్నత, అభ్యాసం కలిగిన అవధానులు సద్యఃస్ఫూర్తితో అప్పటికప్పుడు (ఆశువుగా) చెప్పిన పద్యాలు, శ్లోకాలు ఎక్కడా కుంటుపడకుండా నిలక డగా రాసినట్లుగానే మనసులకు హత్తుకుంటాయి.

వేదాధ్యయనం, వేదపఠనాన్ని కూడా నాడు అవధానంగానే వ్యవహరించేవారట. వాటిలోని పన్నలు, పనసలను కంఠస్థం చేసి, జ్ఞాపకం పెట్టుకుని అవసరమైనప్పుడు అనర్గళంగా అప్పగించేవారు. కానీ అవధాన పక్రియ దానికంటే కొంత భిన్నత్వంతో కూడుకున్నది. అధ్యయనం చేసిన దానిని తిరిగి అప్పగించడానికి, ఆశువుగా కవిత్వం అల్లి అందరి పూరింపులను గుర్తుంచుకుని ఏకధాటిగా ధారణ చేయ డానికి వ్యత్యాసం ఉంటుందంటారు సాహితీవేత్తలు.

పడిలేచిన కెరటం

ఒకనాడు సాహితీవనంలో పచ్చగా విలసిల్లిన అవధాన పక్రియ కొన్నేళ్లపాటు మోడువారింది. ‘పదకొండవ శతాబ్ది నారాయణ భట్టు నాడు మొలకెత్తి పదునారవ శతాబ్దిలో చిగురించి పందొమ్మిదవ శతాబ్దిలో మాడభూషి వారిచే మొగ్గతొడిగి తిరుపతి వేంకటేశ్వర కవీశ్వరాదులచే ఆమనియందువలె పూచిన ఈ అవధానాశు కవిత్వ కళావల్లి కొన్నినాళ్లు తెలుగువారినలరించి క్రమంగా వెర్రి తలలు వేయ జొచ్చినది. అందువలన దీనియెడ రసప్రలుబ్ధులుగు వారి యాదరాభిమానములు క్రమముగా తగ్గిపోసాగి నవి. కవులును ఈ మార్గము నంతటితో విడిచి పెట్ట వలసిన వారైరి’ అని ప్రముఖ సాహితీవేత్త ఎర్రోజు మాధవాచార్యులు సుమారు ఐదున్నర దశాబ్దాల క్రితం ఆవేదన వ్యక్తం చేశారు. అయితే 1980వ దశకం నుంచి అవధాన పక్రియ పరిమళింప సాగింది.

సర్వశ్రీ మేడసాని మోహన్‌, ‌మాడుగుల నాగఫణి శర్మ, గరికపాటి నరసింహారావు, ఆశావాది ప్రకాశ రావు, ధారా రామనాథశాస్త్రి, నరాల రామారెడ్డి, కె.రాజన్న కవి, ఎస్వీ భుజంగరాయశర్మ, గుమ్మన్నగారి లక్ష్మీనరసింహ శర్మ, గండ్లూరి దత్తాత్రేయశర్మ, కడిమెళ్ల వరప్రసాద్‌, ‌వద్దిపర్తి పద్మాకర్‌, ‌పాలపర్తి శ్యామలా నంద ప్రసాద్‌, ‌రాళ్లబండి కవితా ప్రసాద్‌, ‌దోర్బల ప్రభాకరశర్మ, కోట వేంకట లక్ష్మీనరసింహారావు, గౌరీభట్ల రామకృష్ణశర్మ, ప్యారక శేషాచార్యులు, సూరం శ్రీనివాసులు, తిగుళ్ల శ్రీహరిశర్మ, అవధానం రంగనాథ వాచస్పతి, మరడాన శ్రీనివాసరావు, దిట్టకవి శ్రీనివాసాచార్య, అవధానం సుధాకరశర్మ, చేబోలు శేషగిరిరావు, చక్రాల లక్ష్మీకాంత రాజారావు, గురువేపల్లి నరసింహం, కోట రాజశేఖర్‌, ‌సురభి శంకరశర్మ, జీఎం రామశర్మ, మాచిరాజు శివరామ రాజు, అష్టకాల రామ నృసింహ శర్మ, అబ్బిరెడ్డి పేరయ్య నాయుడు, ఎం.కె. ప్రభావతి, ధూళిపాళ మహదేవమణి తదితరులు నూతన సొగబులద్దారు. పలువురు అవధానులు రాష్ట్రేతర ప్రాంతాల్లో,  దేశ విదేశాలలో లెక్కకు మిక్కిలిగా అవధాన ప్రదర్శనలతో తెలుగు కవితా ప్రతిభను వ్యాపింప చేస్తున్నారు. రస హృదయులను రంజిపచేస్తున్నారు. ‘వయసు మీరిన వారు, పూర్ణారోగ్యవంతుల• కానివారు అవధానాలు చేయలేరు’ అనే అపప్రథను పక్కకునెట్టి అవధాన జైత్రయాత్రను కొనసాగిస్తున్నారు. అవధాన ప్రదర్శనలు ఇచ్చిన 150 మందిపై డాక్టర్‌ ‌రాపాక ఏకాంబరాచార్యులు రెండు తెలుగు దిన పత్రికలలో ధారావాహిక వ్యాసాలు వెలువరించారు.

తిరుపతి వేంకట కవులు, ఇతర సుప్రసిద్ధ అవధానుల అవధాన ప్రదర్శనల స్ఫూర్తితో 20వ శతాబ్ది ఉత్తరార్థంలో తమిళ, కన్నడ కవులు కొందరు తమ భాషలలో ఈ పక్రియను చేపట్టారు.

అవధాన పీఠమేది?

అవధాన విద్యా ప్రదర్శనకు ఆదరణ తగ్గలేద నేందుకు వివిధ సందర్భాలలో నిర్వహిస్తున్న కార్యక్రమాలే నిదర్శనం. ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం ఉంటే ఈ పక్రియ మరింత రాణిస్తుందనడంలో సందేహం లేదు. అందుకు అవధానాలకు విశేషం సంఖ్యలో హాజరవుతున్న సాహిత్యాభిమానులే నిదర్శనం. పీవీ నరసింహారావు ప్రధాని హోదాలో అవధాన ప్రదర్శనకు ముఖ్య అతిథిగా హాజరై అవధానం పట్ల అభినివేశాన్ని, పద్యానురక్తిని, సాహిత్యాభిమానాన్ని చాటుకున్నారు.

ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్ర నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తన మానస పుత్రికగా చెప్పుకున్న శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో అవధాన విద్యకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలనుకున్నా, ఆ ఆలోచన సాకారం కాలేదు. తెలుగు భాష, సాహిత్యంలోని వివిధ పక్రియలలో విశేష సేవలు అందించిన వారికి ఏటా ప్రదానం చేసే పురస్కారాల జాబితాలలో మాత్రం అవధానాన్ని చేర్చింది. ఆంధ్ర విశ్వకళాపరిషత్‌ ఉపకులపతిగా ఆచార్య జీఎస్‌ఎన్‌ ‌రాజు అవధాన విద్య కోసం ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించారు. ఆయన పదవీ కాలం ముగిసిన తరువాత దాని ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తమవుతోంది. నెల్లూరులోని ‘పాచీన తెలుగు విశిష్ట అధ్యయనం కేంద్రం’ అయినా ఆ దిశగా చొరవ చూపాలని సాహిత్యాభిమానులు అభిలషిస్తున్నారు.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram