– పాలంకి సత్య

మరునాడు మిహిరుడు తన గురువు వద్ద సెలవు తీసుకున్నాడు. ఆయన అతనితో ‘‘నీవంటి శిష్యుడు దొరకడం, నీవు నా గురువు కావడం నా అదృష్టం. వీలయితే అలెక్సాండ్రియా నగరానికి వెళ్లి, మరిన్ని విశేషాంశాలు నేర్చుకో!’’ చెప్పి వీడుకొలిపాడు.

మధ్యాహ్న భోజన సమయంలో డేరియస్‌తో తాను తన ఇంటికి తిరిగి వెళ్లగలనని మిహిరుడు చెప్పాడు. ఆయన ‘‘ఉదయమే నా జ్యేష్ఠపుత్రుడు రేవు పట్టణం చేరినట్లు వార్త వచ్చింది. రేపు కుమారులు ఇరువురూ ఇక్కడికే రాగలరు. వారిని చూసి, ఆపై వెళ్లమని నా మనవి’’ అన్నాడు.

‘‘మనవి కాదు, ఆజ్ఞ అనండి. మీ కుమారు లిద్దరినీ చూడగలడం నా అదృష్టం.’’

* * * * * *

డేరియస్‌ ‌కుమారులు తిరిగివచ్చిన సంతోష సమయాన్ని పురస్కరించుకుని, వారం పాటు విందులూ, వేడుకలూ, సంగీత, నృత్య ప్రదర్శనలూ జరిగాయి. బంధుమిత్రులెందరో ఆ ఇద్దరినీ చూసేందుకు వచ్చారు.

అందరూ వెళ్లిన తర్వాత ఒకనాడు డేరియస్‌ అతని కుమారుల సమక్షంలోనే మిహిరునితో ‘‘మిహిరాచార్యా! మీరు మా ఇంట ఇంతకాలం ఉండడం మా అదృష్టమని అనుకుంటున్నాను. ఆ అదృష్టాన్ని ద్విగుణీకృతం కావాలని కోరుతున్నాం. మా కోరిక మన్నించగలరు’’ అన్నాడు.

‘‘ఆచార్య శబ్ద ప్రయోగం వద్దని ఇంకొక మారు మనవి చేస్తున్నాను. నా సామర్థ్యానికి మించని ఏ పనయినా మీకె•సం చేయగలను’’.

‘‘మా కుమార్తె ఖనాను మీరు వివాహం చేసుకోవలసిందని మా ప్రార్థన.’’

కుమారులిద్దరూ తండ్రి మాటే తమ మాట అన్నట్లుగా చూశారు.

మిహిరుడు ఆశ్చర్యంతో స్తంభీభూతుడైనాడు. అతడు కలలో కూడా ఊహించని విషయమిది. భోగభాగ్యాలలో పెరిగిన ఖనా తనవంటి సాధారణ కుంటుంబి ఇంట సుఖపడగలదా?

వివేకం, సౌందర్యం, మంచితనమే సొమ్ములుగా కల ఖనా తనను ఆనంద శిఖరాలధిరోహించేలా చేయగలదు. కానీ తాను ఆమెకు ఏమీ ఇవ్వలేడు. తనలోని ఆలోచనలకు వాగ్రూపమిస్తూ మిహిరుడు ‘‘నా గురించి మీకు తెలుసును కదా! ఉపాధ్యాయునకు ధనమివ్వలేకపోయానని చెప్పి నా స్థితిని మీకు తెలియపరిచాను. వారికి భారతీయ జ్యోతిషం కొంత తెలియచేసి వారి వద్ద చదువుకున్నాను. ఉజ్జయినిలో మా కుటుంబం నివసించేది సాధారణ కుటీరం. మా ఇంట ఒక్క పరిచారిక కూడా ఉండదు. ఖనా కష్టమెరుగని యువతి. ఈ విషయం ఆలోచించ వలసిందిగా కోరుతున్నాను’’ అన్నాడు.

‘‘ఖనా మీ విజ్ఞాన సంపద పట్ల ముగ్ధురా లయింది. మీ సౌందర్యమామెను ఆకర్షించినట్లుగా ఆమె సఖీజనం వలన తెలియవచ్చినది. ధనానికి ఎట్టివారూ లొంగిపోరాదని జరతుష్ట్ర ఆదేశం. అందుచేత మా విన్నపాన్ని మన్నింప ప్రార్ధన’’.

‘‘మీ కోరిక విషయంలో నేను నిర్ణయం తీసుకోవ డానికి భరతఖండ ధర్మం అంగీకరించదు. శ్రీమద్రా మాయణగాథ ఈ విషయాన్నే తెలియజేస్తున్నది.’’

డేరియస్‌, అతని పుత్రులూ అదేమిటో వివరించ మని అడిగారు. మిహిరుడు రామాయణంలోని బాలకాండను ఉపకథలు వదలివేసి చెప్పాడు. ‘‘విన్నారు కదా! జనక మహారాజు తన కుమార్తె సీతను విల్లును ఎత్తిన వీరునకిచ్చి వివాహం చేయవలెననుకున్నాడు. శ్రీరాముడు శివధనుర్భంగం చేశాడు. జనకుడు వెంటనే వివాహం జరిపించలేదు. రాముని తండ్రి వద్దకు దూతలను పంపి, ఆయన అంగీకారాన్ని కోరాడు. మా సంప్రదాయమది. మీ కుమార్తెను తమ కోడలిగా స్వీకరించమని మా తండ్రిగారికి వార్త పంపండి. వారి నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను’’.

డేరియస్‌ అం‌గీకరించాడు. దూతలు వెంట రాగలరనీ, రథాలు ఏర్పాటు చేస్తాననీ, మిహిరుడు తాను ఏర్పాటు చేసిన రథంలోనే ఉజ్జయినికి ప్రయాణం కావలన్నది తన కోరిక అనీ చెప్పాడు.

మిహిరుడూ అంగీకరించాడు.

* * * * * *

ఉజ్జయినికి దూతలను పంపే విషయంలో డేరియస్‌ ‌చేస్తున్న ప్రయత్నాలు  కుమారులకు నచ్చలేదు. సోదరి మిహిరుని ఇష్టపడుతున్న కారణంగా ఆమె వివాహం భరతఖండవాసితో జరిపించటం తమకు అంగీకారమే. కానీ మిహిరుని తండ్రి సమ్మతి  కోరడమేమిటి?

పుత్రుల ముఖకవళికలను బట్టి వారి మనసును గ్రహించిన డేరియస్‌ ‌వారికి వివరణాత్మకంగా చెప్పాడు. ‘‘ఖనా మిహిరుని ఇష్టపడటం చేతనే ఈ వివాహం జరిపించటం లేదు. మీ సోదరి శరీర ఛాయ నలుపు. పారశీక యువకులెవరూ  పరిణయ మాడేందుకు సిద్ధంగా లేరు. మిహిరుడు విద్యావేత్త, అందగాడు. అందుకే అతనిని జామాతగా నేనూ వరించాను. అతని సంప్రదాయాన్ని గౌరవించడం మనకు తప్పనిసరి.’’

నిజమే పారశీక దేశంలో నల్లని వారుండరు. దక్షిణ భరతఖండంలో పుట్టడం చేత తమ చెల్లెలు నలుపు. విషయమర్ధం చేసుకున్న డేరియస్‌ ‌పుత్రులు తాము కూడా ప్రయాణపు ఏర్పాట్లలో పాలు పంచుకున్నారు.

* * * * * *

డేరియస్‌కు నమస్కరించి, అతని పుత్రులను ఆలింగనం చేసికొన్న మిహిరుడు ఖనాతో సెలవిప్పించమని అడిగాడు. ‘మీ జనకులు నన్ను తమ కోడలిగా కాక దాసిగా స్వీకరించినా నాకు సమ్మతమే’ అని మనసులో అనుకున్న ఖనా మిహిరుని వంక చూసి కన్నీరు పెట్టుకున్నది. ఆమెను దగ్గరగా తీసుకుని ఓదార్చాలనుకున్న కోరికను అతి కష్టం మీద అదుపులో పెట్టుకున్న మిహిరుడు రథమధిరోహించాడు. రథం కనుమరుగయ్యే దాకా ఖనా వాకిటనే నిల్చుండి పోయింది. ఆమెను చూస్తూ నిల్చున్న ఆమె తండ్రి, సోదరులు అహుర మజ్దను ప్రార్థిస్తూ ఉండిపోయారు.

* * * * * *

సెర్విలియా శయన మందిరం.ఆసనం మీద  కూర్చున్న  జూలియస్‌ ‌సీజర్‌ ‌శయ్యపై ఉన్న తన ప్రేయసిని తదేక దృష్టితో చూస్తున్నాడు.

 ‘‘నీవు చాలా తెలివైనవాడివి సుమా!’’ అన్నది సెర్విలియా.

‘‘నీ మెప్పు పొందడం నా భాగ్యం’’

‘‘ఒకే దెబ్బకు రెండుపిట్టలను కొట్టిన వార్త నీ రాకకు ముందే నాకు చేరింది. అంత చక్కటి ఆలోచన ఎలా వచ్చింది?’’

‘‘ఏ లోహమైన ఉపయోగించిన కొద్దీ మెరుస్తుందట. కష్టంలో చిక్కుకున్నప్పుడే మనసులో అనేక ఊహలు కదలాడి, అన్నిటిలోనూ గొప్ప మార్గ మెంచుకోగలం.’’

‘‘సముద్రపు దొంగల నుండి ఎలా బయట పడగలిగావో, రోమ్‌ ‌నగరంలో నీ ప్రతిష్ట ఎలా పెంచుకున్నావో నీ నోటనే వినాలని ఉన్నది’’.

‘‘ఏమంత గొప్ప విషయమని విడమరచి, వర్ణించి చెప్పడానికి? నన్ను సముద్రపు దొంగలు బంధించి ఒక ద్వీపంలోని కారాగారంలో పడవేశారు. నేను భయపడకపోవడమే కాక రోమ్‌లో చాలా ముఖ్యమైన వాడినన్న అభిప్రాయం వారికి కలిగించాను. నన్ను వదిలి పెట్టడానికి ఇరవై టాలెంట్ల వెండిని అడగాలని వాళ్లు అనుకున్నారు. కానీ నా వంటి మహాశక్తిశాలిని  విడిపించుకుందుకై యాభై టాలెంట్ల వెండినైనా రోము చెల్లించగలదని నేను చెప్పాను. వారిలో ఆశ పెరిగింది. యాభై టాలెంట్ల వెండిని సమర్పిస్తేనే జూలియస్‌ ‌సీజర్‌ను విడిచి పెట్టగలమని వారు వార్త పంపారు. రోమ్‌ ‌వాస్తవ్యులు అంత వెండిని ఇవ్వరేమోనన్న భయం వారిలో ఉండేది. ఆ భయానికి తోడు, నేను వారితో ‘నన్ను బంధించిన మిమ్మల్ని నేను వదలిపెట్టను. బంధవిముక్తుడైనాక నావికదళంతో వచ్చి, జయించి, మీ అందరినీ కొరత వేయిస్తాను’ అనేవాడిని. నా మాటలను వారు హాస్యోక్తిగానే   తీసుకున్నారు.

‘‘నీ ధైర్య సాహసాలు నన్ను ఆశ్చర్యపరుస్తు న్నాయి.’’ సెర్విలియా అంది.

జూలియస్‌ ‌సీజర్‌ అదేమంత గొప్ప విషయ మన్నట్లుగా నవ్వి, ‘‘సముద్రపు దొంగలు పంపిన సందేశం మన నగరానికి చేరింది. జూలియస్‌ ‌సీజర్‌ అం‌త గొప్పవాడా? అన్న ప్రశ్న అందరిలో తలెత్తింది. గొప్పవాడు కాకుంటే యాభై టాలెంట్ల వెండిని ఎందుకు ఇమ్మంటారు? అన్న ప్రశ్న కూడా ఉదయిం చింది. నేనంటే భయమూ, గౌరవమూ పెరిగాయి. వెండిని సమర్పించి, నన్ను విడిపించుకుని వచ్చాక, నాకు నగరంలో జరిగిన స్వాగతసత్కారాల గురించి నువ్వు వినే ఉంటావు’’ అన్నాడు.

సెర్విలియా ‘‘అక్కడితోనే నువ్వు ఆగిపోలేదు కదా!’’ అంది.

‘‘అవును… నావికదళంతో వెళ్లి సముద్రపు దొంగలను బంధించి తెచ్చి కొరత వేయించాను. వారు ఎక్కువ కష్టపడకూడదనే దయాగుణంతో వారి కంఠచ్ఛేదన త్వరగా చేయించాను.’’

సెర్విలియా లేచి అతని వద్దకు వచ్చి ‘‘నీ ధైర్యసాహసాలు, తెలివితేటలు అమోఘం. ప్రజలను ఆకట్టుకునేలా ప్రసంగించడం నీకు వెన్నతో పెట్టిన విద్య. కానీ అన్నిటికన్నా నన్ను ఆకట్టుకున్నది నీ సౌందర్యమే. ఒత్తైన జుట్టు, నల్లని కళ్లు, పొడుగైన నాసిక…’ అంటూ అతని చుట్టూ చేతులు వేసింది.

సీజర్‌ ‌గట్టిగా నవ్వి ఆమెను గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు.

* * * * * *

మరునాడు సీజర్‌ ‌తన ఇంటిలో కూర్చుని భార్యతో ప్రసంగిస్తున్న సమయంలో అతనిని రోమ్‌ ‌రాజ్య ఆర్థిక వ్యవహారాల అధికారులలో ఒకనిగా నియమిస్తున్నట్లు వార్త వచ్చింది. కొర్నిలియా ఆనందంతో పొంగిపోయింది.

‘‘నావల్ల మీరు సర్వమూ కోల్పోయారన్న దుఃఖం నన్ను నిత్యం వేధిస్తూ ఉండేది. నేడు మీరు ముఖ్యమైన అధికారిగా నియమితులు కావడం చాలా సంతోషంగా ఉంది’’.

‘‘సర్వం కోల్పోవడం ఏమిటి? నా పరాక్రమం, ధైర్య సాహసాలు, స్త్రీల హృదయాలను గెల్చే సౌందర్యం, ప్రజల మనసులను లోబరచుకునే వాక్చతుర్యం నాటికీ, నేటికీ, ఏనాటికీ శాశ్వతాలే.

మానినీ మానసచోరుడనని భర్త అనగానే కొర్నిలియా మనసులో సెర్విలియా నిలిచింది. తనను తాను నిభాయించుకున్నదామె. ‘‘మా తండ్రి అంతర్యుద్ధంలో మరణించగానే నన్ను పరిత్యజించ  మని మీపై వత్తిడి రాలేదా? జూపిటర్‌ ‌దేవాలయ ప్రధాన అర్చక పదవినీ, వంశ పరంపరగా వస్తున్న మీ ఆస్తినీ, నాకు నా తండ్రి ఇచ్చిన ఆస్తినీ వదులుకున్నారే కానీ నన్ను వదలలేదు. మీ ప్రేమ లభించడం నా అదృష్టం.’’

‘‘నన్ను ఆజ్ఞాపించి నా చేత పనులు చేయించ గలరని సూలా అనుకున్నాడు. నన్ను శాసించడం ఎవరి తరమూ కాదు. రోమ్‌ ‌నగరాన్నీ, రాజ్యాన్నీ నేనే శాసించే కాలం త్వరలోనే రాగలదు. సర్వశాసకుడినే కానీ ఒకరి ఆజ్ఞానువర్తిని ఏనాటికీ కాను’’.

* * * * * *

జూలియస్‌ ‌సీజర్‌ ‌పదవిని స్వీకరించిన కొద్ది కాలానికే అతని మేనత్త జూలియా మరణించింది. ఆమె మరణం తనకు అనుకూల పవనాలు వీచేలా సీజర్‌ ‌మార్చుకున్నాడు. ఆమె అంతిమయాత్రలో ఆమె భర్త మార్కస్‌ ‌చిత్రపటాలనూ, శిల్పాలనూ పెట్టిం చాడు. అంతర్యుద్ధంలో మార్కస్‌ ‌మరణించాక అతని ప్రస్తావనను మళ్లీ తీసుకువచ్చాడు. అంతిమ సంస్కార సమయంలో సీజర్‌ ‌చేసిన ప్రసంగం ప్రజలనే కాక నాయకులను కూడా మంత్రముగ్ధులను చేసింది. ఈఉపన్యాసంతోనే సీజర్‌ను హిస్పానియాకు సర్వాధికారిగా నియమించారు.

* * * * * *

రథం దిగుతున్న మిహిరుని వంక ఛాయాదేవీ, ఆదిత్యదాసులు ఆశ్చర్యంగా చూశారు. కుమారుడు ఉజ్జయినీ నగర పరిసరాలకు చేరుకున్నాడన్న వార్త వారికి ముందునాడే చేరినది. కానీ రథంలో పరిచారిక గణంతో వస్తాడని వారు ఊహించలేదు. శకటమవరోహించి, తల్లిదండ్రులకు పాదాభివందనం చేసిన మిహిరుడు తనతో వచ్చిన వారు పారశీక దేశంలో తాను నివసించిన గృహ యజమాని పంపిన వారనీ, రథం కూడా ఆయనదేననీ చెప్పాడు.

స్నానం, జపం పూర్తయిన తర్వాత ఛాయాదేవి పారశీకులకు నడమింటిలో వడ్డన చేసింది. వారి భోజనాలైన తర్వాత మిహిరుడు ఆదిత్యదాసు శిష్య వర్గంలో ఒకరిని తోడిచ్చి ఉజ్జయినీ నగర సందర్శనా నికై పంపించాడు. తనతో వచ్చిన వారిలో ఇద్దరికి సంస్కృత భాషా పరిజ్ఞానమున్నదని తండ్రికి తెలిపాడు. వారు వెళ్లిన తర్వాత ఛాయాదేవి భర్తకూ, కుమారునకూ వడ్డన చేసింది.

 తర్వాత గృహ ప్రాంగణంలో కూర్చున్న సమయంలో మిహిరుడు తండ్రితో వినయంగా తన పారశీక దేశంలోని గృహ యజమాని తండ్రి వద్దకు దూతలను పంపిన కారణాన్ని వివరించాడు. ఖనా పుట్టుక విషయాన్ని, ఆమెను డేరియస్‌ ‌దంపతులు పెంచిన సంగతినీ తెలియచెప్పాక, తానామెకు ఖగోళశాస్త్రం నేర్పిన సంగతిని విశదీకరించాడు. సప్తర్షి చలనానికీ, విషుగతికీ మధ్యగల సంబంధాన్ని నేర్పించడానికై నగరం వెలుపలకు వెళ్లిన సమయంలో తన మనసు చలించిన సంగతిని తండ్రికి చెప్పాడు, దాచకుండా.

‘‘పితృదేవులకు ఈ విషయంను తెలియ జేయడానికి ఎంతగానో లజ్జిస్తున్నాను. ఆ బలహీన క్షణంలో నా ప్రవర్తనను ఎట్టి పరిస్థితిలోనూ సమర్థించుకోను. ఇంటికి తిరిగి వచ్చాక ప్రాయశ్చిత్తకర్మ చేసుకోవలెననుకున్నాను. ఆ సమయంలోనే డేరియస్‌ ‌తమ కన్యను స్వీకరించమని కోరారు. మీ అంగీకారం ముఖ్యమని నేను తెలియచేశాను. ఆ కారణంగా దూతలను నా వెంట పంపారు. మీ నిర్ణయమే నాకు శిరోధార్యం. ఖనాతో నా వివాహానికి మీరు అంగీకరించినా సరే, లేక కన్యను స్పృశించినందుకు శిక్ష విధించినా సరే. నేను మీ ఆజ్ఞకు బద్ధుణ్ణి’’.

ఆదిత్యదాసు మౌనం వహించాడు. మిహిరుడు తండ్రి ఎదుట తలవంచుకుని కూర్చున్నాడు. కొంతసేపు గడిచాక దాసు, ‘‘కుమారా! ఈ విషయం క్షణాలలో నిర్ణయించగలిగినది కాదు. మీ జననితో సంప్రదించాలి. అన్నిటికన్నా పరమేశ్వరానుగ్రహం ముఖ్యం’’ అన్నాడు.

సాయంకాలమాయన భార్యకు మిహిరుడు చెప్పిన విషయాన్ని తెలియజేశాడు. కుమారుడు బహిరంగంగా చెప్పకపోయినా ఖనాను ఇష్టపడుతున్న సంకేతాలను అందచేశాడని అన్నాడు. ‘‘పారశీక దేశంలో జరతుష్ట్ర ఉపదేశాలను అనుసరించే కుటుంబంలో పెరిగిన కన్యతో సనాతన వైదిక ధర్మాన్ని అనుసరించే యువకుడికి వివాహం కావచ్చునా అన్నది ప్రశ్న’’ అన్నాడు ఆదిత్యదాసు.

ఛాయాదేవి ‘‘భోగ భాగ్యాలలో పెరిగిన అమ్మాయి మన ఇంట సాధారణ జీవితాన్ని సంతోషంగా గడపగలదా? చిన్ననాటి నుంచి నమ్మిన ధర్మమార్గాన్ని  వదలి భారతీయ ధర్మాన్ని అనుసరిపంగలదా? సుందరుడూ, వివేకీ అయిన మన కుమారుడామెను ఆకర్షించి ఉండవచ్చును. అంత మాత్రాన…’’ అని ఆగిపోయినది.

‘‘కన్యాదాత ఆమె భవిష్యత్‌ ‌జీవితం గురించి ఆలోచించకుండా, ఆమెను సంప్రదించకుండా నిర్ణయించి ఉండడు. ధర్మశాస్త్రమంగీకరించునా అన్నదే ప్రశ్న’’.

‘‘మీ నిర్ణయానికి నేను బద్ధురాలను కాగలను. కుమారుని ఆనందమే నాకు ప్రధానం.’’

* * * * * *

(ఒక టాలెంట్‌ = 33 ‌కిలోగ్రాములు. నేటి స్పెయిన్‌, ‌పోర్చుగల్‌ ‌దేశాలే నాటి హిస్పానియా)

(సశేషం)

About Author

By editor

Twitter
Instagram