– బద్ది గణేశ్‌

‌వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

‘‘మీకు దండం బెడ్తా సేటు, ఈ ఇత్తునాలు మీ సాపుల్నే దిస్కున్న, నా ఇమానంగా జేప్తున్నా, మీ తాన్నే దీస్కున్న మీరట్ల అవద్దమాడొద్దు.., మీకు రెండు శేతుల మొక్కుతున్న మీరట్లంటే నాకు ఇక సావుమర్నమే.’’ కండ్లలో నీరు ఉబికి వత్తాంటే, తన శేతిలల్ల వున్న ఏపుగా పెరిగి కాతపూత లేని పత్తి మొక్కలతో శేతులు జోడించి దండం బెడుతు ఇత్తనాల షాపు ఓనర్‌ ‌రమేష్‌ ‌సేటు కాళ్ల మీద పడి పట్టుకున్న కాళ్లను అస్సలు ఇడుస్తలేడు రైతు రంగయ్య.

‘‘నీ యవ్వ ఎవర్రా నువ్వు. యాడ్నుంచి వచ్చినవ్‌..! ‌ఛేల్‌… ‌థూ..’’ ఒక్కసారిగా కాళ్ల మీదున్న రంగయ్యను బలంగా తన్నడంతో ఔవుతల పడ్డడు. బనీను, ధోతి నిండా ఇంకాస్తా మట్టి అంటుకుంది. తువ్వాల, శేతులున్న పత్తి చేట్లు అటు దూరంగా పడ్డాయ్‌. ‌రంగయ్యకేల్లి కోపంగా కళ్ల్లెర్రజేసి, పళ్లు కొరుకుతూ కోపంగా చూస్తుండు షాపు ఓనర్‌. అది మండల కేంద్రం, మంచి సెంటర్‌. ‌రోడ్డు మీద పోయేటోళ్లు ఆగి మరి చూస్తాండ్రు, ఒక్కొక్కరుగా జనం పెరుగుతున్నరు, ఆ జనంలో కొందరు రైతులు గూడ ఉన్నరు. అందరూ అలా చూసే వరకు సేటుకు ఇజ్జతు పోయినట్టు అనిపిస్తాంటే, మరోపక్క ఇంత జరిగితే తన దగ్గర్కి ఇక ఏ రైతు రాడన్న భయం పట్టుకుంది రమేష్కు. రైతు రంగయ్యకు యాబై ఏండ్ల దాక ఉంటాయ్‌, ‌భార్య పేరు రామక్క పోతే శెల్క వత్తే ఇల్లే. ఇంట్లే ముచ్చట్లు తప్ప బయటి యవ్వారం తెల్వని అమాయకత్వం . రంగయ్యకు అవ్వయ్యలు పంచి ఇచ్చిన రెండెకరాల శెల్కుంది, అదైన అయింత కాలం అయితేనే ఇంత పంట పండుద్ది. ఎన్నో ఏండ్ల సంది ఎవుసాయం జేస్తున్నగానీ ఇంత ఘోరంగా పత్తి ఎన్నడు కాత పూత లేకుంటా లేదు. బోర్ల మీద బోర్లు ఏపిచ్చి బొందల పడ్డడ్డు అయ్యింది రంగయ్య బతుకు. సూడు సుడని సందుట్ల వానలు పడే సర్కి తన గెట్టు పక్కనున్న ఇంకో నాలుగెకురాలు మక్తకు తీసుకోని వర్షధారమే అని పత్తి పెట్టిండు.

‘‘తులుతూ లేచి ఆడ పడున్న తువ్వాల భుజం మీదేస్కోని మీరు నన్ను కొట్టుర్రి, తిట్టుండ్రి నాకు మీరే న్యాయం జేయ్యాలే ‘‘..పోయ్నా పంటకు డబ్బులు కట్టియ్యాలి. దీనంగా కండ్లనీరు తీసుకుంటునే ఆ సేటును బత్మిలాడుతండూ రంగయ్య. షాపు ముందు జనం ఇంకాస్తా జమైండ్రు. టైం పగటిలి పదకొండు కావొత్తంది. పంటల మందుల కోసం ఆషాపు దగ్గర్కి వచ్చి ఈ తతంగమంతా చుస్తాండ్రు ఆసాములు.

‘‘మీరు జేప్తేనే కదా సేటు నేను తీసుకుంది. మీరే కదసేటు ఇయ్యి కొత్త ఇత్తనాలు, మంచి కాపు వత్తది అన్నది, నేను కొత్తయి వద్దు అన్న. ఆడ అట్ట పండింది, ఇడ ఇట్ట పండింది అని ఏవో పోట్వాలు చూపిచ్చి మరి నాకు ఇచ్చిర్రు, మర్శిపోయిండ్రా?. నీ మాటలు నమ్మి తీస్కపోతే మూడు ఎరుకాలు….!. ఏపుగా నా యేత్తు పెరిగే సర్కి చూట్టు పక్కల రైతులచ్చి రంగయ్య నీ అప్పులన్నీ ఉష్కాకి అయినట్టే పటు. ఈ కాపుతోని, నువ్వు బొర్లేప్పిచ్చిన పైసలన్ని ఉత్తగనే తీర్తయ్‌ ‌తీయ్‌. ‌రందిపెట్టుకోకు ఇక నీ కష్టాలు తీర్నట్టే , అట్నే నీకు మస్తు ఇకమతు ఉంటదే, మన పట్టేకు ఎవ్వలు తేని ఇత్తునం తెచ్చినవ్‌ ‌పో.. అని అంటుంటే నేనే ఇంకేదో అనుకున్న. ఇంగో ఇట్లుంది సేటు నా ఇకమతు ఇచ్చకపోయినట్టు అన్నడు రంగయ్య జీరబోయిన గొంతుతో.

‘‘నీ యవ్వ నాది గూడ ఒక ఎరుకం గీట్లనే అయ్యింది జనం లోంచి ఓ రైతు. షాక్‌ ‌కొట్టినట్టు చూసిండు షాపు ఓనరు. ‘‘మా దూరపు సుట్టాల ఊల్ల్ల కూడ గిట్లనే ఓ రైతుకు అయ్యింది అంటా!’’ ఆ జనంలోంచి ఇంకో గొంతు.

సేటుకు చెమటలు పడ్తున్నాయ్‌, అం‌దులో పన్జేసేటోల్లు మాకు ఏం తెల్వదన్నట్టు ఆ షాపులో ఏవో సద్రుతున్నరు. ఇట్నే సూత్తే లొల్లి ఇంకాస్తా పెద్దతి అయ్యేతట్టు ఉంది, ఆ రంగయ్య ఊకునే కోపు కానొత్తలేదు, ఏం జేయ్యాలో పాలుపోవడం లేదు, ఆ ఇత్తునాలన్ని ఈ రంగయ్యకే పోవాల్నా తనను తానే తిట్టుకుండు షాపు ఓనర్‌. ‌జనమంత షాపుకేలే సూత్తాండ్రు, కొందరు రైతులు రంగయ్య పీక్కొచ్చిన పత్తి చేట్లను పరిశీలనగ చూస్తాండ్రు.

‘‘ఓ సేటు..! ఎంతగనం చూడాలే మాకు న్యాయం జేత్తర జేయ్యరా..? గొంతు పెంచిండు రంగయ్య?’’ న్యాయం జేయ్యాల్సిందే అని గట్టిగ్నే అన్నరు తోటి రైతులు. వాళ్లు అలా అనేసర్కి రంగయ్యకు కొంచె దైర్నం వచ్చింది. అప్పట్కే మంచిమాటేమ్మటి మూడుసార్లు వచ్చిండు రంగయ్య పత్తి కాత పూత లేదని. అప్పుడు ఏదో మత్పరిచ్చి పంపిండు రమేష్‌.

ఏదైదే అదైందని గట్టిగానే రంగయ్య మీద్కిఎదురు తిర్గిండు షాపు ఓనరు. మల్లోపాలి దైర్నం చేసి సేటు దగర్కి పోవాల్ని చూసిండు రంగయ్య. అట్ట రెండు అడుగుల వేసిండో లేదో అగబట్టి వెనక్కు గుంజుక పోయిండ్రు ఆ షాపులో పన్జేసేటోళ్లు.

రంగయ్యకు గబారా గబారా అయితంది. పొద్దున ఇంత పచ్చిపుల్సు, ఉల్లిగడ్డతో తిన్నడు. శెల్కాడికి పోయి అట్లే పత్తి శేట్లు పీక్కోని శీద పట్నం వచ్చిండు. ‘ఇయ్యాల న్యాయం జరిగే వరకు ఈడ్నే కూసుంట నా పానం బోయిన ఏంకాదు’ భీష్మించిండు రంగయ్య. కోపం తెచ్చుకున్న సేటు రెక్క పట్టుకోని గుంజేసర్కి బొర్లబొక్కల పడ్డడు రంగయ్య తలకాయ కొట్టుకపోయి రక్తం కార్తంది. ‘‘మా రైతుల ఊసురు తల్గి నాశ్నం అయిపోతవ్‌, ‌పురుగులు పట్టి పోతవ్‌, ‌బాధతో నిండిన కోపంతో శాపనార్థలు పెడ్తుండు రంగయ్య.

ఇట్టకాదు అందరం ఈ షాపు మందట్నే కూసోని ధర్నాం చేద్దాం పటు..! అందులో ఒక రైతు అనంగనే అందరూ కూసోని మాకు న్యాయం జరగాలే అంటు గట్టిన అన్నరు. ఇక ఇది ఇప్పటితో ఆగదు అనుకున్న షాప్‌ ఓనర్‌ ‌తన పలుకుబడిని ఉపయోగించిండు.

కుయ్‌… ‌కుయ్‌ ‌మంటు పోలీస్‌ ‌వ్యాన్‌ ‌రానే వచ్చింది. ఆ సప్పుడుకు కొందరు భయపడి ఆడ్నూంచి పోయిండ్రు. అక్కడ రైతులు మాత్రమే ఉన్నరు. పోలీసులు షాప్‌ ‌దగ్గర్కి రావే వచ్చిండ్రు. వాళ్లను చూశ్నా రైతులకు కొంచెం బెరుకు అనిపించినా దైర్యంగానే ఉన్నరు.

ఎస్సై లింగయ్య రైతు రంగయ్య తాన్కి వచ్చిండు. ‘‘ఏమైంది ధర్నా చేస్తాండ్రు రంగయ్యను అడిగిండు..! తన సమస్యను ఏ మాత్రం జంకకుండ ఎస్సైకి చెప్పిండు రంగయ్య’’. కొంచెం బాధతోనే ఆలోచన చేసిన ఎస్సై అగ్రికల్చర్‌ ఆఫీసర్ని పిలిపించిండు. సమస్యకు పరిష్కారం చూపలన్నడు. విత్తనాలు తీసుకపోయినప్పడు ఉన్న బిల్లు ఉంటే ఏదైన న్యాయం చేయేచ్చు అని సలహ ఇచ్చిండు ఆఫీసర్‌.

‘‘ఆ.. ‌రంగయ్య…! విత్తనాలు తీసుకునేటప్పడు బిల్లు తీస్కున్నావా ?

‘‘ఆ మాగ తీస్కున్న సారు..’’

అది ఉంటే మీ సమస్యకు కొంతైన పరిష్కారం దొరుకుతుంది. ‘‘ఇప్పుడుందా బిల్లు…? రంగయ్యకు మల్లో ప్రశ్న వేసిండు ఎస్సై.

‘‘ఆది… సారు ఆరోజు ఇత్తనాలు తీస్కోని శీదా బాయికాడ్కి పోయిన. ఎప్పుడన్న మంచిగనే పండుతాయి అనుకోని ఆ బిల్లు మీద శ్రద్ద పెట్టలె..!. ఇప్పడు అది యాడుందో లేక మట్టిలోనే కలిసి పోయిందో ఏందో సారు. మీకు దండం బెడుతా ఈ పేద రైతుకు మీరే నాయం జేయ్యాలే. ఏడుస్తు ఎస్సై కాళ్ల మీద పడపోయిండు రంగయ్య’’. రంగయ్య బాధను చూశ్నా ఎస్సై మనసు కశిబిశయ్యింది.

దీన్ని గమనించిన షాపు ఓనర్‌, ఇదే సందు అనుకోని. ఆడు నా దగ్గర అస్సలు కొనబోలే సార్‌. ఎస్సై ముందు గట్టిగనే అన్నడు షాప్‌ ఓనర్‌. ఇది విన్న రంగయ్య మొఖం తెల్లబడ్డది. రైతు, అందులోను పెద్ద మన్శిని పట్టుకోని ఏంటా మాటలు రమేష్‌ ‌కేలి జూసి కండ్లేర్ర జేసిండు ఎస్సై.

ఇంగో రమేష్‌ ‌నువ్వు అమ్మిన బిల్లు ఉంటదిగా అది చూపియ్యి..! ఎస్సై షాప్‌ ఓనర్ని అడిగిండు. సారు నా దగ్గర తీస్కనే పోలేదు..! సమాధానం ఎల్లతల్గనే ఎస్సై ఫోన్‌ ‌మోగింది. ఏదో కొద్ది సేపు మాట్లాడిన ఎస్సైకి ఏం చేయాల్నో అర్థం అయితలేదు. తన చేతులోంచి పరిష్కర మార్గం దాటిపోయినందుకు బాధపడ్డడు. ఒక్కసారిగా షాప్‌ ఓనర్‌ ‌వైపు ఓరగా చూసి.. రైతు రంగయ్యతోని ఇప్పడు నీ సమస్య పరిష్కర మార్గం నా చేతుల్లో లేదు. అర్థం చేసుకో రంగయ్య తన చేతిని రంగయ్య చేతిలో పెట్టి…ఇప్పడు ఇక్కడ ధర్నా బంద్‌ ‌చేయ్యూ. నీకు న్యాయం జరిగేలా చూస్తా ఇక ఇంటికి పో.. చేప్పిండు ఎస్సై. ‘మీరే న్యాయం జేయ్యాలే సారూ!’ అక్కడున్న రైతులందరు ఆ ఎస్సైని వేడుకున్నరు. ఆ ఎస్సై వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిండు , అందుకే న్యాయం జరుగుద్దని ఒక్క మాటతోని ధర్నా బంద్‌ ‌చేసిండ్రు రైతులు.

‘‘ఆ రైతుల్ని చూసి ఒక వెకిలి నవ్వు నవ్వాడు షాప్‌ ఓనర్‌…’’

‌మన బతుకలు ఇంతే అనుకోని ఆడ్నూంచి కదులుతూ… ఎస్సై సార్కు ఫోన్‌ ఎవలు జేపిచ్చిఉంటరో? అందులోంచి ఓ రైతు అడిగాడు. ఈ షాపోడు ఏం జేసిండో! ఏమో మనకు న్యాయం జరుగుద్దో లేదో? ఆ పత్తి చేట్లు ఆ షాప్‌ ‌కాన్నే వదిలేసి అక్కడి నుంచి కదిలిలారు.

‘‘వద్దురో..ముండా కొడుకా ఈ శేత వద్దురో.. అని మొత్తుకున్న!. మనయ్‌ అసలే ముసలిపాణాలు. మనది మనం జేసుకుంటే సాలు పోరగాళ్లు పెద్దగైరు ఆళ్ల కష్టం వాళ్లు పడ్తరు. ఈ శాతనయ్‌ ‌శాతకానీ ఈ వయసులో ఇంత ఎవుసాయం వద్దు అని నిరుడునిండి తలకొట్టుకుంటున్న ఇనడే. ఈనే పెద్ద ఆసామి, ఊల్లో ఇంక ఎవ్వలు లేరన్నట్టు ఇంకో నాలుగెకురాలు మక్తకు తీసుకుండూ. పత్తి చేట్ల ముచ్చట ఎర్కైనంక మొగన్ని తిట్టుకుంటూనే బొగ్గుల పోయ్యి మీద బువ్వోండుతుంది రామక్క’’.

‘‘వాన పడుతుంది. చలిపెడుతుంది ఆ సలికి రెండు బుక్కలు సుట్టాతాగుదాన్కి తడకకు శెక్కివుంచిన పాత సుట్టా తీసుకో జకముకతో అంటియ్యవోతుంటే ఆ సల్లదానానికి నిప్పురవ్వలు రాట్లేదు. ఆ వర్షం సప్పుడుకు రామక్క అంటున్న మాటలు ఏవో కొన్ని ఇనోచ్చి వినబడనట్టు వినిపిస్తున్నయ్‌. ఏమోపో దాని లొల్లి అన్నట్టు మల్ల జమకుక కొట్టిండు. అస్సలు రాకపోగ వున్న పత్తి కూడ అయిపోయింది’’. అది సద్రి మల్ల ఆ సంచి దోతిలో కట్టుకోని ఎనుక బాజుకు మల్లిండు. బొగ్గుల పొయ్యిల అన్నం వండుతున్న రామక్క కనబడ్డది. నీయవ్వ అట్ల బొగ్గుల పోయ్యిల్నన్నా సుట్ట అంటించుకుట కుతి గుంజి పాడైతంది, ఆడ ఒర్రి ఒర్రి తలకాయంతా నొయ్యబట్టే చేతులు భుమిని ఆసరగా చేసుకోని లేచి బొగ్గుల పోయ్యికాడ్కి పోయిండు రంగయ్య.

‘‘నీ యవ్వ ఏందో గుల్గుతున్నవ్‌.. ఏం‌దో సాపుగా జేప్పేదాన్కో..!’’ సుట్టను అంటించుకుంటా రామక్కను అడుగుతుండు. అప్పుడు తిట్టిన తిట్లన్ని మల్ల అందుకుంది రామక్క. సప్ప సప్ప గుడిసెలోనే పొగ పీల్చుకుంటా సుట్ట అంటుకుందా లేదా అని మల్లోసరి తిప్పి చూసి సుట్టతాగుతుండు రంగయ్య. ఆ సుట్ట పొగ పడకా దగ్గుతునే అట్లే తిడుతుంది రామక్క. ఆ తిట్లకు కోపానికొచ్చిన రంగయ్య .’’ థూ… నీయవ్వ గట్టిగ కాండ్రిచి బైట తడకకు ఉంచి, ఆ చెట్లు పూతపిందలేక ఎట్టరో ఏందిరో అప్పుల సంగతి అని, నాకు సావుమర్నం అయిందిరో అని నేను సత్తాంటే నువ్వు నీ మాటలు ఏందే’’ రామక్క కెలి కండ్లేర్ర జేసి చూసిండు రంగయ్య. అప్పుడే బువ్వ గిన్నే దింపేసర్కి ఆ కొర్కాసుల ఎరుపు రంగయ్య కండ్లలోకి పడేసర్కి ఆయన కండ్లు మండుతున్న సూర్యునోలే అవుపిత్తున్నయ్‌.

ఆలుమగలు ఒకల్నిఒగలు గట్టిగానే అనుకుంటున్నరు. వర్షం జోరు కొనసాగుతునే ఉంది. ‘‘ఇప్పట్కే అప్పులు మన తలకు మించిన భారమైనయ్‌, ఈ ‌సంగతి తెల్సినకాంచి ఒకటికి రెండు సార్లు వచ్చిపోతాండ్రు అప్పిచ్చినోళ్లు. ఈ కాలం ఇట్లుంటే ఈ ఏడు మాగ కాలం అయితదని అని ఇంకొంత భూమి తీసుకుంటివి. అండ్లకత అట్లుండే ఇప్పడు కొంచెం బాధతో చెప్తుంది రామక్క. ఏం జేద్దమే… మన శేతుల్ల ఏముంది పండన్వి పండేటివి మనం చూడబోయ్నామా? ఇన్ని రూపాలిచ్చి తెచ్చి భూమిలో పెట్టుడేనాయో. అవి మంచివా కాదా ? అని తెలుసుకుందాన్కి నాకు అచ్చరం ముక్క రాకాపాయే అదే తల్చకోని రందిపడుతుండు రంగయ్య’’. ఎప్పుడు ఏం పాపం చేసిన్నో..! ఇప్పుడు పంట పండక ఈ కతకావట్టే. మన బతుకులు ఇంతేపో..!. అట్ల కాలం కాగ కొంత ఆగం అయితే.. ఇగ్గో ఇట్ల కాతపూత లేక అగం కావట్టే..! అది తల్సుకోని మల్ల కండ్లనీరు దీసిండు. ట్రాక్టర్‌ ‌దున్నుడు, నాగలి దున్నుడు, కూల్లోళ్లు. అడుగు మందు, పై మందులు కొట్టి మొక్కలను చిన్నపిల్లల లెక్క సాత్తే ఇగ్గో ఇట్ల మోద్లారే. తోటి రైతుల్వి మంచిగానే ఉన్నయ్‌. ఒక ఎరుకం పోతే ఏం కాకపోవు గని గీట్ల జరుగుద్దని అనుకుంటిమా..! పొద్దున ధర్నా చేశ్నాం న్యాయం జేత్తం అన్నరు. చూడాలే వాన తగ్గే కొపు కనబడ్తలేదు గనీ ఇంత తిందం పటు గాబర అయితంది. శేతనైతలేదు ఓ ముద్ద తిని అట్ల మంచంల ఒర్గుతా..!. బువ్వేసింది రామక్క. రందితో ఓ నాలుగు ముద్దలు తిని మంచంలకు ఒర్గిండు రంగయ్య.

‘‘ఓ రంగయ్య మామా యేడిదాంకొచ్చింది.. గప్పుడేప్పుడో ధర్నా చేసిండ్రు. ఓ ఉల్కు లేదు పల్కు లేదు’’.. గెట్టు పక్కపొంటి పత్తి చేన్లో గుంటుక ఆపి మరి అడుగుతుండు మల్లయ్య. ‘‘ఏమోరా మల్లి సూడాలి మొన్న అట్ట పంచాతీ ఆపీస్‌ ‌కాడ తెల్సినోళ్లను అడిగితే ఇయ్యాల రేపట్ల ఆపీసర్లు వత్తరని చెప్పిర్రు’’ అన్నడు. రంగయ్య మాటల్లో, మొఖంలో దిగాలు కొట్టొచ్చినట్టు కన్పిస్తుంది. ‘‘అట్లకాదే మామా అయ్యింయేదో అయ్యిందిగనీ ఉన్నదాన్ని పీకి పారేసి జొన్నలో ఏదో ఒకటి అల్కు.. అట్ట ఉత్తగా ఉంటే ఏమొత్తదే..అది రాకపోగ భూమి బలం దండగా’’ చెప్పుకుంటా హో… అని ఎద్దుకి బుట్టిపెట్టిన పచ్చగ అగుబడేసరికి పత్తి చేట్లను తిందాన్కి గుంజుకుంటే పగ్గం గుంచి ఆగబట్టిండు మల్లయ్య. ‘‘ఇంగ అదే ఉపాయం జేయ్యాలే గానీ ఆపీసర్లు వచ్చిపోతే ఏదో ఒకటి తెల్తది కదా’’ ఆ పత్తి శేన్ల నుంచి నడ్సుకుంటా కొట్టంకేలి కదిలిండు ఆడ యాప చేట్టుకు కట్టేశిన బర్రెకు గడ్డేదాన్కి. ‘‘పాపం మామా… ఇది వరకు కాలం గాక బోర్లేపిచ్చి మస్తు అప్పులైనయ్‌… ‌పేదోడి మీదే కష్టాల వానన్నట్టు ఈ కత అయ్యే… అయిన ఈ సేటుకు ఎట్ట పానం దరిచ్చిందో? గీసోంటి ఇత్తనాలు ఇచ్చిండు. ఏమన్న అయితే గట్టిన కొట్లడలేడు అని కావొచ్చు’’ గుంటక పండ్లకు అంటివున్న గడ్డి మట్టిని ముల్లు గర్రతోని తీసి హై… చో.. చో.. ఎడ్లను అదిలిచ్చిండు మల్లయ్య.

ఆ రోజు పత్తి శేను కాడ్కి రానే వచ్చిండ్రు ఆపీసర్లు. ‘‘ఓ… రంగయ్య మామా… ఓ… రంగయ్య మామా ఆపీసర్లు వచ్చిండ్రే’’ గుంటుక ఇడ్సి యాపశేట్టు కింద బువ్వ తింటున్న మల్లయ్య బోట్లే బర్రెను మోపుతున్న రంగయ్యను కూత్తేతాండు.

‘‘ఆ..ఏంది ‘‘

‘‘ఆపీసర్లు… సార్లు వచ్చిండ్రు ఇట్రా..’’

‘‘ఆ వత్తన్న వత్తన్నా…’’

బర్రెను చూడమని సత్తెన్నకి చెప్పి ఆపీసర్ల కాడికి మల్లిండు.

‘‘రంగయ్య అంటే నువ్వేనా?’’ ‘‘ఆ నేనే సారు అట్ట కాత పూత లేకుండ కనబడేదంతా నాదే సారు… మీరే న్యాయం జేయ్యాలి సారు. కంటినీటిని తువ్వాల తోని అదిమిపట్టి బాధతో కూడిన బొంగురు గొంతుతో పదే పదే వేడుకుటుంటు వాళ్లు ఇంకో ప్రశ్న అడగనీయకుండానే చెప్పిండు రంగయ్య.

రంగయ్య చెప్పిన వివరాలన్ని ఓ డైరీలో రాసుకున్నరు ఆపీసర్లు. ఇంగో రంగయ్య నీ బాధను మీం అర్థం చేసుకోగలం. కానీ మేము రూల్స్ ‌ప్రకారం నడవాలి కాబట్టి ఆ షాపులో కూడ విచారణ చేసినంక పూర్తి వివరాలు చెప్తాం. నీవేం దిగులు పడకు రంగయ్యకు కొంచెం దైర్నం చెప్పమని ఆడ్నేవున్న మల్లయ్యకి చెప్పి కదిలిండ్రు ఆపీసర్లు.

* * * * * * * *

పట్నంల రంగయ్య విత్తనాలు తీసుకున్న షాపుల విచారణ చేపడుతుండ్రు అధికారులు. ఆ షాప్‌ ఓనర్‌ ఎవలెవలకి అమ్మిండో రికార్డులు తీసి ఆ పత్తివిత్త నాలు తీసుకున్న రైతుల వివరాలు, ఈ విత్తనాల లాట్‌ ‌వివరాలు రాసుకోని మల్లీ ఆ రైతుల శేన్ల దగ్గర్కి పోయిండ్రు విచారణకు.

ఒక్కసారిగా షాక్కి గురి అయ్యారు ఆపీసర్లు… విత్తనాలు అమ్మి రైతును ముంచె తెలివి ప్రదర్శిం చిండు. షాప్‌ ఓనర్‌ ‌తప్పు చేశాడు కానీ రూల్స్ ‌ప్రకారం రంగయ్యకు నష్టం పరిహారం ఇప్పియ్యలేని పరిస్థితి ఏర్పడ్డది.

ఇదే విషయాన్ని ఆ గ్రామ షేష్కందుల ద్వారా రంగయ్యకు చెప్పించిండ్రు అధికారులు. ‘‘రంగయ్య మొఖంలో ఎలాంటి ఆందోళన లేదు’’ మందే ఉహించినట్టు ఉన్నడు ఇదే ఫతితం వస్తుంది కాబోలు అని..!

అప్పిచ్చినోల్లకు ఎట్లా తెలిసిందో ఏందో నష్టపరిహారం రాదని. ఒక్కోక్కరుగా ఏదో మాట ముచ్చట లెక్క వస్తున్నారు ఇచ్చిన అప్పు అడుగు తున్నరు. ఇదే ఇషయం తన కొడుకులకు చెప్తే పెద్దోన్ని అడిగితే చిన్నోని, చిన్నోన్ని అడిగితే అన్న పేరు చెప్తున్నాడు. ఇక వీళ్లను అడుగుడు దండుగ అనుకుండూ రంగయ్య. కొన్ని రోజులుగా రంగయ్య వాలకం సూత్తాంటే రామక్కను ఏదో అనుమానం కొడ్తంది కానీ ఏం లేదని దాటేస్తున్నడు..! ఆ పత్తిశేను చికాకే అనుకోని తను మౌనంగ ఉంది.

ఆ రోజు రాత్రి ఇంత తిని ఎప్పటిలాగానే మంచంలకు వొరిగిండు కానీ నిద్రపట్టడం లేదు. కన్ను ముస్తే అప్పుల ఆలోచనలు. ఉన్నశేను పీకేస్తే మల్ల ఏదైన వేయ్యలన్నా పెట్టుబడి కావాలి. ఈ పరిస్థితుల్లో మల్ల అప్పు పుట్టదని అర్థం అయ్యి. మల్ల కొత్త పంట వాయిదా వైపు రంగయ్య ఆలోచనలు కదులుతున్నాయి. పుట్టినప్పటి నుంచి పుట్టేడు కష్టాలు ఈ రైతు బతుకు ఎందుకని తన రైతు బతుకు మీద తనకే వికారం కలిగింది. అవే ఆలోచనలతో ఎప్పుడు కన్నంటుకుందో ఏందో అట్లనే నిద్రపోయిండు రంగయ్య.

ఎన్నడు లేంది వానొత్తదని కావొచ్చు ఆ రోజు సంకల కవరు పెట్టుకోని శెల్కాడ్కి పోయిండు రంగయ్య. ‘‘ఓ మామా ఎన్నడు లేంది ఇయ్యాలా ఇంత పొద్దుగాల వచ్చినవ్‌..’’ ఆ.. ‌మా దగ్గరి సుట్టపోల్లది ఓ పంచన్‌ ఉం‌డే బర్రె బట్టే ఉండేగా ఒకపాలి చూసిపోదాన్కి వచ్చిన. ‘‘అంటే ఇయ్యాల రేపు తున్కల పట్టు అన్నట్టు.. అయితేమాయేగని ఇంటికాడ బువ్వతిని పోకు ముక్కలు పట్టయ్‌..’’ అనుకుంటా నవ్విండు యాపపుల్లతోని పల్లుతోముతున్న మల్లయ్య. ఆ ముచ్చటకు రంగయ్య కూడ నవ్వుకుంటా శెల్కలకు కదిలిండు. శెల్కమొత్తం ఒకపాలి కలియదిరిగిండు బర్రెను చూసి సందెడు గడ్డివేసిండు. కాత పూత లేకున్న అవి కూడ చేట్లేనని గుండెలకు హత్తుకోని ముద్దాడిండు.

చిన్న చిత్క పనులు చూసుకున్న మల్లయ్య ఇంటికి పోదాన్కి తయారుగా ఉన్నడు. ఒక్కసారిగా పక్షుల కిలకిలలు వినిపిస్తున్నయి. అక్కడ అవి అరుదు అని లుంగీ, తువ్వాల సద్రుకోని ఆడ్నూంచి బయలు దేరుదం అనుకోని ఒక్క క్షణం ఆగిండు పక్షులు చేసే శబ్దం ఏదోతేడ కొడ్తుంది. పోయేవాడు ఒక్కసారిగా తల వెనక్కి తిప్పాడు. ఆ పక్షుల గుంపు ఆ పత్తిశేన్లో చూట్టు తిరుగుతు శబ్దం చేస్తున్నాయి. ఏదో పామో, ఉడుమో, అడవి జంతువు అనుకుండు, మళ్లీ ఆలోచన… కొంచెం భయం భయంగానే అటుకేలే సుత్తాండు.. కానీ ఏం కనిపిస్తలేదు.. పత్తి శేట్లు ఏపుగా పెరిగి ఉన్నయ్‌. ‌కొంచెం ముందుకొచ్చి ఒక బడితే అందుకోని ఏదైన అడవి జంతువు అనుకోని మెల్లిగా అడుగులు వేస్తుండు. మల్లయ్య దగ్గర్కి పోతున్న కొద్ది పక్షులు దూరం పోతున్నాయి.

అక్కడ్కి చేరుకున్న మల్లయ్య బిత్తరపోయి సూత్తాండు. తనకు తెల్వకుండానే కన్నీరు బొటబొట కారుతోంది. కాళ్లు వణుకుతున్నయ్‌, ఏదో తెలియని భయం తనలో జొరబడ్డది. రంగయ్య మామా… బిగ్గరగా అరిచాడు. రంగయ్య పక్కన కవరు, కొంచెం దూరంలో ఏదో డబ్బా పడివుంది… మామా మామా… అనుకుంటా చెంపలను తలకాయను కదిలిస్తుండు, చిన్న కదలిక, నోట్లోచి తెల్లని నురగా కారుతోంది చూట్టు పక్కోల్లను కూతేశిండు… ఎవ్వరు దరిదాపుల్లో లేరు. ఆగమాగం ఉరికి తండకు చేరుకోని వాళ్లను తీసుకోని ఎడ్ల బండి సాయంతో ఊర్లోకి తీసుకపోతున్నారు రంగయ్యను. ఎడ్ల బండి ఊర్లోని చేరుకునే సరికి అప్పట్కే జనం బాగనే జమయిండ్రు. రామక్క అనుమానం నిజమైంది. రంగయ్యను ఆటోలో పడుకొబెట్టి మల్లయ్య, రామక్క కూడ ఎక్కినంగా ఆటో పట్నం వైపు కదిలింది.

‘రైతుల ప్రాణాలు తీస్తున్న నకిలీ విత్తనాలు’ నకిలీ రాయుళ్ల ఆగడాలు ఇంకెన్నాళ్లు అంటూ మంగలి షాపులోంచి రేడియోలో వార్తలు వస్తున్నాయి.

About Author

By editor

Twitter
YOUTUBE