మతి, స్మృతి, బుద్ధి. ఈ మూడింటిలో మొదటిది భవితను సూచిస్తుంది. రెండోది గతానికి చెందింది. ఇక మూడోది – ప్రస్తుతాన్ని వెల్లడిస్తుంది. వీటన్నింటికీ వర్తించేది ప్రజ్ఞ. ఇది వెల్లివిరిస్తే ప్రతిభ. దీనికి సృజన తోడైతే శక్తి. మరి శక్తియుక్తీ కలగలిస్తే… ఏమవుతుంది? అని నటాషాను అడిగితే బాగా చెప్తుంది. ఆ అమ్మాయికి పదమూడేళ్లు. భారత సంతతి బాలిక. పూర్తిపేరు-నటాషా పెరియ నాయగం. స్వస్థలం తమిళనాడులోని చెన్నై ప్రాంతం. అక్కడి నుంచి ఆ కుటుంబ పెద్దలు ఏనాడో అమెరికా దేశానికి చేరారు. అదే వంశంతో పాటు మన భారతదేశ కీర్తినీ విదేశంలో వెలిగిస్తోందీ బాలిక. ప్రపంచంలోని 76 దేశాల నుంచి పదిహేను వేల మందికి పైగా ప్రజ్ఞాసంపన్న విద్యార్థులు పాల్గొన్న గ్రేడ్‌ ‌స్థాయి పరీక్షల్లో పటిమ చాటింది. విశ్వవ్యాప్త ప్రతిభావంత బాలల జాబితాలో ఈమె పేరు చోటు చేసుకుంది! ఇంతటి ఖ్యాతిని సాధించడం తనకు ఇది మొదటిసారి కాదు. రెండోసారి. ఇండియన్‌ – అమెరికన్‌ ‌టీన్స్‌లో ఇంతటి సుప్రసిద్ధత సంపాదించిన నటాషా గురించి అన్ని వివరాలూ తెలుసుకుందాం. ఈ బ్రైటెస్ట్ ‌స్టూడెంట్‌కి అభినందన చందన మందారహారం అందించి, మనసారా శుభాకాంక్షలు తెలిపి, భారతీయత ప్రభానిధిత్వాన్ని ఎంతైనా ప్రశంసిద్దాం. ‘సుభగ సుందర సుమనోజ్ఞ శోభలొలుకు రంజతాఖలలోక భారత పతాక / భరత బాలల భాగ్యాల పంటయగుచు అవని ఆచంద్ర తారార్క మలరుగాక’ అని కలసికట్టుగా దీవిద్దాం. ఎందుకంటే నటాషాలో రెండు మేధలున్నాయి. ఒకటి సుమేధ, మరొకటి సత్యమేధ. గొప్ప తెలివి, పాటవ సంపత్తి ఉన్నాయి కాబట్టే.. సెంటర్‌ ‌ఫర్‌ ‌టాలెంటెడ్‌ ‌యూత్‌ (‌సీటీవై) నుంచి మరోసారి ప్రత్యేక గుర్తింపు పొందింది బాల ‘సరస్వతి’!

ఎప్పుడూ నవ్వుల పువ్వులు రువ్వే నటాషాకి గమనింపు సామర్థ్యం మొదటి నుంచీ ఎక్కువే. తాను న్యూజెర్సీలోని పాఠశాలలో చదువుతోంది. గ్రేడ్‌ 5 ‌విద్యార్థినిగా ఉండగానే, 2021లో టాలెంట్‌ ‌టెస్ట్ ‌రాసింది. వివిధ విభాగాల్లో అత్యధిక మార్కులు సంపాదించి, గ్రేడ్‌ 8 ‌స్థాయిని కనబరచింది. ఇంతటి అద్భుత ముందడుగే తనను ఆనర్స్ ‌లిస్టులోకి చేర్చింది. పాఠశాలతో పాటు కళాశాల స్థాయి ఫర్‌ఫార్మెన్స్‌లోనూ ఎబిలిటీ టెస్ట్ ‌మేటిగా నిలిచింది. ఇదే అంశాన్ని సంబంధిత విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు సగర్వంగా ప్రకటించారు. టాలెంట్‌ ‌సెర్చ్‌లో తన మేధాసంపత్తి చూసి ఆశ్చర్యచకితులమయ్యామని విపులీకరించారు. ఎప్పుడు ఏ కాస్త సమయం లభించినా ఆంగ్ల నవలల్లో తలదూర్చే అమ్మాయి ఎప్పుడూ మెదడుకు పదునుపెడుతూనే ఉంటుంది. ప్రపంచం మొత్తం మీద అడ్వాన్స్ ‌మేధావులను అన్వేషించే క్రమంలో పరమోన్నత స్థాయి పరీక్షను నిర్వహించింది వర్సిటీ. ఈ సిటీవై శోధనలో పాలుపంచుకున్న అందరికన్నా గ్రేడ్ల ఉన్నతిని వశం చేసుకుంది నటాషా. కచ్చితంగా ఇదొక అపూర్వ అపురూప ఘన విజయమంటున్నారు నిర్వాహకులు. విజేతల పరిశోధనాసక్తి, వారి శక్తియుక్తులను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ – మరీ ముఖ్యంగా ఈమె పేరును కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు. అత్యద్భుత భవితవ్యానికి ఇదొక సూచిక అంటూ సెంటర్‌ ఎగ్జిక్యూటివ్‌ ‌డైరెక్టర్‌ ‌డాక్టర్‌ అమీషెల్టన్‌ ‌కితాబిచ్చారు. ‘తెలివితేటలను ఆ బాలిక ప్రదర్శించిన తీరు మమ్మల్ని ముగ్ధుల్ని చేసింది. అంత చిన్న వయసులో ఇంత మేధను మేం ఇంతవరకు ఇంకెక్కడా చూడలేదు. వేగం, ధారణ, జ్ఞాపకశక్తి, సమయస్ఫూర్తి, అన్నింటినీ మించి పరిణతి నటాషాలో పుష్కలంగా ఉన్నాయి. తనను చూసి నిజంగా మేమెంతో గర్వపడుతున్నాం’ అన్నారామె.

చదువుల మాలిక ఈ బాలిక

డెస్ట్‌స్కోర్‌ ఆధారంగా, ఈ మేధావి బాలకు అంతటా గ్రాండ్‌ ఆనర్‌ ‌హోదా లభించింది. ‘పిట్ట కొంచెం, కూత ఘనం’ అనేది ఇందుకేనేమో! తన చదువుకూ, ఎదురయ్యే ప్రశ్నలకు తను చెప్పే సమాధానాలకు ఎంతో తేడా! మాటలు సైతం ఆచితూచి అన్నట్లు ఉంటుంటాయి. తాను చదువు తున్న తరగతి కన్నా, ఆపై గ్రేడ్‌ ‌స్థాయి ప్రశ్నలకు బదులివ్వడమంటే మాటలా? అంతటి మేటి బాలల్లో అర్హత పొందింది 27 శాతంలోపే. వారిలో నటాషా విశేషాల బాలిక. ఎంత పాటవం లేకపోతే ఆమె రెండు (వెర్బల్‌, ‌క్వాంటిటేటివ్‌) ‌విభాగాల్లో 90కి పైగా స్కోర్‌ ‌చేస్తుంది? ఎంతటి శక్తి సామర్థ్యాలు లేకుంటే టాపర్ల జాబితాలో చోటు సంపాదించుకుంటుంది? అత్యంత చురుకైన పిల్లల్ని వెలికితీసి పేరు ప్రఖ్యాతులు సంతరింపచేయాలన్నదే నిర్వాహకుల లక్ష్యం. అందుకే ఏటా విభిన్న రీతిన పాటవ పరీక్షలు ఏర్పాటు చేస్తుంటారు. అభ్యసించాలన్న తపన, గెలిచి తీరాలన్న పట్టుదల మెండగా కలవారు వీటిల్లో పాల్గొంటూ ఉంటారు. వయసుకు మించిన జ్ఞాన ప్రతిభ చూపు తుంటారు. వారిలో అగ్రస్థానాన నిలవడమే నటాషా విలక్షణత. ఇంతింత అరుదైన రికార్డును సృష్టించిన ఈమె దీన్ని పోటీగా భావించిందా? పరీక్షగా పరిగణించిందా? అంటే… రెండూ! మెదడు అనేది కేంద్ర నాడీ వ్యవస్థ మొత్తానికి కీలకం. ఇందులో ఎన్నెన్ని కోట్ల కణజాల కూడళ్లు ఉంటాయో ఒక పట్టాన చెప్పలేం. ధారణ అయినా, విశ్లేషణ నిండినా, సృజన సంబంధమైనా- అన్నీ ఇందులోనే. చూసేది నేత్రా •కానీ, చూపేది మటుకు మెదడే కదా! ఆ కణాల సంచలన వేగం ఎంత ఎక్కువగా ఉంటే, అంత మేధ దాగి ఉన్నట్లు. అది ఇంకా ఇంకా విస్తరించాలంటే, మెదడు కణాలన్నీ ఉత్తేజితమవ్వాలి. ఆ రీత్యా చూసినప్పుడు, నటాషా ఆలోచనల వేగాన్ని ఇంత అని ఎలా నిర్ధారించగలమో కదా!

విద్యాధన వర్ధనం

ఇదంతా చూస్తుంటే, వింటుంటే, ఆలోచనగా సాగిస్తుంటే, ప్రాచీన పద్యమొకటి గుర్తుకొస్తుంది. దాన్ని ఇదే సందర్భంలో సమన్వయిస్తే –

కలదు మాకడ శుభంకర తపః ఫలరూపమై

జగమేలు మహాధనమ్ము

కలదు మాకడ సత్యబలమాన్యమై

శాశ్వతానందకరమౌ మహాధనమ్ము

కలదు మాకడ దానకల్పకమై

నిత్య అభివర్త తమ్మపు మహాధనము!

ఇవే మాటల్ని ‘నాకడ’ అని అన్వయించి నటాషా నోట చెప్పిస్తే-జగాన్ని ఏలేది, ఆనందాన్ని శాశ్వతంగా ప్రసాదించేది, నిత్యమూ వర్థిల్లుతూనే ఉండేది జ్ఞానధనం! ఆ ధనికురాలు నటాషా. ఆమె భారత సంతతి బాలిక కావడం అందరికీ సగర్వనీయమే. విద్య, విజ్ఞానం, వికాసం… వీటిల్లో దేనికి అదే మహాధనం. అదొక దీపం. ప్రకాశమైనా, వికాసమైనా దానితోనే! విద్యలో భాగాలుగా అనేకం ఉంటుంటాయి. ప్రధానంగా సూచకం, వాచకం, బోధకం. నటాషాలో ఈ మూడూ మిళితమై ఉన్నాయి. తాను చదివే పుస్తకాలు సామాజిక, శాస్త్రగమనాన్ని సూచించేవి. తాను పొందిన పరీక్షల అనుభవాలు మాటల్లో వ్యక్తమవుతూ ఉంటున్నవే. తన ఈ ఘనతకు కారణం తల్లిదండ్రులు నేర్పిన బోధలే అనడం ఆమె మూర్తిమత్వాన్ని చాటి చెప్తున్నాయి. శాస్త్రం, గణితం, సంఖ్యాశాస్త్రం, ఏ ఇతర అంశంమీదనైనా తర్కిస్తుందామె. కేవలం పుస్తక పరిజ్ఞానం కాదు. మార్కులకే పరిమితమైన జ్ఞానం అంతకన్నా కాదు. రోజువారీ అభ్యాసాలు, ప్రయోగాల నుంచి వెలువడటంవల్ల – నటాషా కృషి అంత అత్యుత్తమ ఫలితాన్ని అందుకుందని మనలో ఎవరైనా సరే, ఢంకా బజాయించి చెప్పవచ్చు. తను సాధించి సముపార్జించింది ఒక్క బుద్ధిబలంతోనే కాదు, ఆచరణాత్మక దృక్పథంవల్ల కూడా.

విజయాల మారు పేరు

భవంతి ఎంత మహోన్నతంగా ఉన్నా, దాని ఉనికి మొత్తానికీ పునాదే ఆధారం. అదే రీతిన జీవితంలో సముదాత్త స్థాయికి చేరడానికి చదువే ప్రధానం. చదువుల పరిమళాలు గుబాళిస్తేనే, ఆస్వాదించి మానవాళి పులకిస్తేనే, జీవితానికి సార్థకత. చదివినంతసేపూ ఆసక్తి ఉంటే, ఆ చదివింది పరీక్షల్లో వ్యక్తపరిచేంత శక్తి నిండితే, స్వదేశంలోనైనా విదేశాన అయినా పురోగమనే కదా! నటాషా వంటి విజేత విద్యార్థినుల దృష్టిలో – విద్య అన్నది ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ పడి ఉంటే జడపదార్థమేమీ కాదు. అదంతా

ఒక సత్తా

ఒక సత్తువ

ఒక శోధన

ఒక సాధన.

వీటిని ఫలప్రదం చేసేందుకే శిక్షణలైనా, పరీక్షలైనా! ఇందులో ఎవరికివారు నిలవాల్సిందే, గెలుపు అందుకోవాల్సిందే. దీనిలో ఒత్తిడిని చిత్తు చేయటముంటుంది. చదువున్నది అలవోకగా సాగిపోతుంటుంది. సమస్యలూ సవాళ్లూ కనిపించవు. పరీక్షలు, వాటిల్లో కృతార్థతలే కనిపిస్తాయి. అలా కనిపించే, వినిపించే ప్రతిభా సంపత్తి ఉన్న భారతీయ సంతతి బాలిక, అమెరికా విజ్ఞాన వీధిన ధగధగ లాడుతున్న తారక నటాషా. ఎప్పుడైనా అంతేకదా! సారవంత మనోభూమిలోనే చదువు సేద్యం వర్థిల్లు తుంది. నటాషా వంటి అమ్మాయిల పాత్ర, ప్రత్యేకత, ప్రశస్తి వల్లనే సరస్వతీమాత మహదానంద తరంగిత అవుతుంది. బాల మేధావినికి జేజేలు!

  • జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram