– డా।। కాశింశెట్టి సత్యనారాయణ, విశ్రాంత ఆచార్యుడు

పత్రికలపై నిషేధం, పండుగలపై నిషేధం, సమావేశాలపై నిషేధం.. పెళ్లి ఊరేగింపుకైనా, చావు ఊరేగింపుకైనా అనుమతి తప్పనిసరి. నిజాం పాలనలో మెజారిటీ హిందూ సమాజం తమ ఆచార వ్యవహారాలు, పూజలు కూడా మానుకున్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో నిర్వీర్యమవుతున్న సమాజంలో జవసత్వాలు నింపారు ఆ ముగ్గురు. సమాజాన్ని సమరోన్ముఖుల్ని చేశారు. నిజాం బానిస సంకెళ్ల నుండి తెలంగాణకు విముక్తి కలిగించిన వారిలో ఆ ముగ్గురి పాత్ర ఎంతో కీలకం. వారే- రాజా బహద్దూర్‌ ‌వేంకటరామారెడ్డి, మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి.

ఈ ముగ్గురూ ప్రజాభ్యుదయానికి అవలం బించిన పంథాలు, అనుసరించిన మార్గాలు వేరైనా లక్ష్యం మాత్రం ఒకటే. అదే నిజాం విముక్తి. మాడ పాటి హనుమంతరావు ప్రజల్లో రాజకీయ చైతన్య కలిగించి తెలుగన్నలను జాగృతం చేశారు. రాజా బహద్దూర్‌ ‌ప్రభుత్వ కొత్వాల్‌గా మత కల్లోలాల్ని అరికట్టారు. హిందూ-మహమ్మదీయుల మధ్య సమైక్యత నెలకొల్పారు. విద్యాలయాలు నిర్మించి, వసతి గృహాలు నెలకొల్పి పేద విద్యార్థులకు ఉచిత విద్యనందించి విద్యాదాతగా రాణించారు. ఇక సురవరం ప్రతాపరెడ్డి పాత్రికేయుడిగా, సాహితీవేత్తగా మూగబోయిన తెలంగాణ సమాజానికి గొంతుకగా నిలిచారు. మహాత్మాగాంధీ సత్యాగ్రహోద్యమం, అహింసా సిద్ధాంతం, ఖద్దరు వస్త్రధారణ, మద్యపాన నిషేధం నాడు అబాల గోపాలాన్ని ఆకర్షించాయి. గాంధీజీ ఉద్యమాలకు సురవరం కూడా ఆకర్షితు లయ్యారు. ఖద్దరు వస్త్రధారణ, నిరాడంబర జీవన విధానం, సత్యనిష్ట, స్వాతంత్య్రేచ్ఛ ఆయన అణువణు వులో జీర్ణించుకు పోయాయి. అంతేకాదు, ఈ ముగ్గురికి ఆంధ్ర సారస్వత పరిషత్తుతో గాఢమైన సంబంధముంది. పరిషత్తు స్థాపకులలో ఈ ముగ్గురూ కీలకం. సురవరం ప్రతాపరెడ్డి పరిషత్తు స్థాపకులేగాక రెండు సార్లు అధ్యక్షులుగా కూడా పనిచేశారు.

ఈ ముగ్గురు మూర్తులు తెలుగుతల్లి నోచుకున్న నోముల పంట. తెలుగు ప్రజల భాగ్యదాతలు. కారణ జన్ములు. వారు తెలంగాణకు చేసిన సేవ అగణితం, అనన్య సామాన్యం, అనితర సాధ్యం. ప్రతిఫలాపేక్ష రహితంగా, అవిశ్రాంతంగా ప్రజల సర్వతోముఖ వికాసానికి పాటుపడిన కర్మయోగులు.

అంతా ఉర్దూలోనే

నాటి హైదరాబాద్‌ ‌రాష్ట్ర పరిస్థితులు ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా, వైజ్ఞానికంగా పొరుగు రాష్ట్రాల స్థితిగతులతో పోల్చితే ‘హస్తిమ శకాంత’ భేదముండేది. 1930-40 సంవత్సరాల మధ్య హైదరాబాద్‌ ‌పౌరుల అక్షరాస్యత ఐదు శాతం కూడా లేదు. జిల్లా అంతటికి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒకే ఉన్నత పాఠశాల ఉండేది. అది కూడా ఉర్దూ మీడియంలోనే. బల్తా ఖైదా (శిశు), అవ్వల్‌ (‌మొదటి తరగతి), ధువ్వం (రెండవ తరగతి), సువ్వల (మూడవ తరగతి) అని తరగతుల్ని పిలిచేవారు. ఆనాటి పాఠ్యపుస్తకాల అట్టల మీద నిజాం రాజు చిత్రం ఉండేది. నిజాం రాజు చల్లగా ఉండాలని ప్రతి రోజూ ఉదయం ప్రార్థన చేయించేవాళ్లు. పోఖానియా (ఉన్నత పాఠశాల)లో చారుం (నాల్గవ తరగతి), పంజుం (5వ తరగతి), చెస్సుం (6వ తరగతి), అఫ్‌ ‌తుం (7వ తరగతి).. తరగతులు నిర్వహించేవారు. ప్రభుత్వ ఉద్యోగాలలో 95 శాతం ముస్లింలే ఉండేవాళ్లు. తురకం తప్ప మరొక భాష ద్వారా విద్యాలయాలు నెలకొల్పలేదు. రాజకీయ స్వాతంత్య్రం మాట అటుంచి కనీసం వ్యక్తిగత స్వేచ్ఛ కూడా లేని చీకటి రోజులవి. నిజాం పాలనలో తెలుగుభాషను చాలా చులకనగా చూశారు. కరీంనగర్‌ ‌జిల్లాలోని సిరిసిల్ల గ్రంథాలయాన్ని ఒక సందర్భంలో పర్యవేక్షించిన అక్కడి తహశీల్దారు ‘సర్కారు దస్త్రాల్లో వ్యవహారమంతా ఉర్దూలో ఉండాలి. చచ్చిపోయిన తెలుగును బయటకు గుంజవలసిన పని లేదు’ అన్నాడట.

రెడ్డి హాస్టల్‌ ‌కార్యదర్శిగా సురవరం

అమరచింత సంస్థానాధీశుల బంగారం దొంగిలించాడని సురవరం ప్రతాపరెడ్డి బంధువు పెరూరు బసిరెడ్డిపై చౌర్య నేరం మోపారు. దీంతో తన చిన్నాన్న ఆదేశం ప్రకారం ప్రతాపరెడ్డి హైదరా బాద్‌ ‌వెళ్లి కొత్వాల్‌ ‌బహద్దూర్‌ ‌వేంకట రామారెడ్డిని కలిసి నిజానిజాలు తెలియజేసి కేసును కొట్టివేయించా లని కోరారు. అయితే రాజా బహద్దూర్‌ ‌ప్రతాపరెడ్డికి ఒక షరతు విధించారు. ‘సరే, నువ్వు తెచ్చిన కేసును ఒక షరతుపై అంగీకరిస్తాను. కానీ నువ్వు రెడ్డి జనవసతి గృహానికి కార్యదర్శిగా ఉండాలి’ అని ప్రతాపరెడ్డిని కోరారు. ఆ విధంగా ప్రతాపరెడ్డి రెడ్డి హాస్టల్‌ ‌కార్యదర్శి అయ్యారు. అనేక కొత్త నిబంధనలు అమలు జరిపి హాస్టల్‌ను చక్కగా నిర్వహించారు. ఒక గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. పదకొండు వేల పుస్తకాలు అందులో ఉంచారు. ప్రతాపరెడ్డి నిజాం కాలేజీలో చదువుకునే రోజుల్లో ‘రెడ్డి హాస్టల్‌’‌లోనే ఉండేవారు. హైదరాబాద్‌ ‌విముక్తి పోరాటంలో పాల్గొన్న వారిలో ఎంతోమంది ఈ హాస్టల్‌ ‌విద్యార్థులే.

ఒక చిన్న సంఘటన కారణంగా సురవరం తనకు తానుగా హాస్టల్‌ ‌సెక్రటరీ పదవీ బాధ్యతల నుండి వైదొలగాల్సి వచ్చింది. వీరసావర్కర్‌ ‌రాసిన ‘The war of Independence’ గ్రంథం ప్రతాపరెడ్డి.. హాస్టల్‌ ‌కోసం కొన్న పాత పుస్తకాల కట్టలో దొరికింది. అప్పటికే ఈ పుస్తకాన్ని నిజాం ప్రభుత్వం బహిష్క రించడంతో ఈ వార్త రెసిడెన్సీ పోలీసులకు తెలిసింది. పోలీసులు విచారణలో ప్రతాపరెడ్డే ఆ పుస్తకాన్ని హాస్టల్‌కు తెప్పించారని తెలిసింది. రెడ్డి హాస్టల్‌ ‌కార్య నిర్వాహక సభ్యులు కూడా ఈ విషయాన్ని బలపరిచారు. అధికారి ట్రెంచ్‌ ‌దొర ప్రతాపరెడ్డిని హాస్టల్‌ ‌విధుల నుండి బహిష్కరించాలని ఆదేశించారు. ఈ విషయం తెలిసి ఆయనే రాజీనామా చేశారు.

About Author

By editor

Twitter
Instagram