రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) ‌శతాబ్ది సంవత్సరం వైపుగా అడుగులు వేస్తోంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఆర్‌ఎస్‌ఎస్‌ ఏం ‌చేయబోతోంది, ఎలాంటి ప్రణాళికలను సిద్ధంచేస్తోంది? అనే విషయంలో సహజంగానే సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.  ఇక బురద చల్లేందుకు విమర్శకులు రాజకీయాలపై సంఘ్‌ ‌ప్రభావం మొదలు, సంఘ్‌లో మహిళల ప్రాతినిధ్యం వరకు చాలా ప్రశ్నలు తరచూ అడుగుతూ ఉంటారు. అలాగే యువత ప్రాతినిధ్యం, టెక్నాలజీ, ఎల్జీబీటీ, పర్యావరణం, ఆర్థిక వ్యవస్థలపై సంఘ్‌ ‌దృష్టికోణం తెలుసుకోవాలని ప్రజలు కోరుకుంటారు. సంఘ్‌ ‌మార్గ నిర్దేశనం ఆశిస్తారు. ఈ అంశాలతో పాటుగా మరిన్ని అంశాలను సర్‌ ‌సంఘచాలక్‌ ‌డాక్టర్‌ ‌మోహన్‌జీ భాగవత్‌ ‘‌పాంచజన్య’ సంపాదకులు హితేష్‌ ‌శంకర్‌, ‘ఆర్గనైజర్‌’ ‌పత్రిక సంపాదకులు ప్రఫుల్ల కేత్కర్‌తో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ (జనవరి 15 సంచిక)లో పంచుకున్నారు. ఆ వివరాలు జాగృతి పాఠకుల కోసం..

ఇది పాంచజన్య, ఆర్గనైజర్‌ ‌ప్రతి సంవత్సరం నిర్విహించే ఇంటర్వ్యూ. పాఠకులు, వీక్షకులు ఎంతగానో ఎదురుచూసే అంశం. కొవిడ్‌ 19 ‌మహమ్మారి కారణంగా వరసగా రెండు సంవత్సరాలు అంతరాయం ఏర్పడింది. ఈ రెండు సంవత్సరాల కాలంలో మనం, రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌శతాబ్ది ఉత్సవాలకు మరింత దగ్గరయ్యాం. ఏ సంస్థ అయినా వంద సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకోవడం మాములు విషయం కాదు, అదొక సవాలు. సుదీర్ఘ ప్రయాణంలో ఒకరు దారి తప్పవచ్చు లేదా ప్రయాణమే ముగిసి పోవచ్చు. ఈ మహోన్నత మైలురాయిని చేరుకుంటున్న సమయంలో, ఈ సుదీర్ఘ ప్రయాణంలో సంఘ్‌ ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు ఏమిటి, అది ఎప్పుడు ఎదుర్కొంది? వివరిస్తే తెలుసుకోవాలని ఉంది?

సవాలు అనేది చాలా ఉన్నతమైన పదం. అవును, సంఘ్‌ ఎగుడు దిగుడు దారిలో, కష్టతరమైన మార్గంలో ప్రయాణం చేసింది. ప్రయాణ మార్గంలో అనేక అనూహ్య మలుపులు దాటి వచ్చింది. అలాగే, సంఘ్‌ ‌ప్రయాణించిన మార్గంలో అనేక అవరోధాలు, అగాధాలు ఉన్నాయి. అయినా మా ముందు, ఒక లక్ష్యముంది. కర్తవ్యముంది. ఆ రెంటినీ సమన్వయ పరిచే కార్యాచరణ ఉంది. మేం మా ముందున్న లక్ష్యం మీదనే దృష్టి కేంద్రీకరించాం. సంక్లిష్ట ప్రయాణంలో కూడా మౌలిక లక్ష్యాన్ని, ఎంచుకున్న మార్గాన్ని వీడకుండా ముందుకు సాగడమే మేం ఎదుర్కొన్న అతి పెద్ద సవాలు.

మా ఈ ప్రయాణంలో చాలా బలమైన శక్తుల నుంచి గట్టి వ్యతిరేకతను ఎదుర్కున్నాం. ఆ వ్యతిరేకతను మౌనంగా భరించవలసి వచ్చింది. అయినా.. వ్యతిరేకతను ఎదుర్కుని నిలబడ్డాం. అయినా, మేము మా వ్యతిరేకులకు విరోధులం కాదల్చుకోలేదు. ఎందుకంటే, అలా చేస్తే అది మరింత వ్యతిరేకతకు, నిరంతర సంగ్రామానికి దారితీస్తుంది. అందుకే మేం మా ప్రత్యర్థులను విరోధులుగా తీసుకోలేదు. కొన్ని సందర్భాలలో పరిస్థితుల ప్రభావంతో మనం మన మార్గాన్ని మార్చు కోవలసి వస్తుంది. అయితే, అలాంటి సందర్భాలలో మేం, కొత్త మార్గాలను కనుగొనే విధానాన్ని ఎంచుకున్నాం. మా ప్రయాణ మార్గంలో అనూహ్య మలుపు తీసుకుంటే తీసుకుని ఉండవచ్చు కానీ, లక్ష్యం నుంచి చూపును ఎప్పుడూ తిప్పుకోలేదు. అలా లక్ష్యం నుంచి చూపు తిప్పకుండా సాగినప్పుడే కొత్త దారులు, కొత్త మలుపులు ఆశించిన ప్రతిఫలాన్ని అందుకుంటాయి. కాదంటే, లక్ష్యం దారి తప్పుతుంది. ఈ గ్రహింపు, మా ప్రయాణం పొడుగునా మాకు చుక్కానిగా నిలిచింది. దారి చూపింది. మేం ప్రయాణించే మార్గం కంటకాకీర్ణ మార్గమని మాకు తెలుసు. ఇవన్నీ మేం ముందుగా ఉహించినవే.

ఆనాటి విద్వేషం, వ్యతిరేకత ఈరోజున (సంఘం పట్ల) లేవు. ఆ రోజులు వెళ్లిపోయాయి. ఈ రోజున సమాజం నుంచి అసమాన ప్రేమ, వాత్సల్యం పుష్కలంగా అందుతున్నాయి. మా ఆలోచనలకు కాలమాన పరిస్థితులు కూడా సానుకూలంగా ఉన్నాయి. నిజానికి, సమకాలీన ప్రపంచాలలోనూ సానుకూల మార్పులు అనివార్యమవుతున్నాయి. ఇంతవరకు అటూ ఇటూగా ఆలోచిస్తున్న వ్యక్తులు కూడా మా మార్గంలోకి, మా ఆలోచన ధోరణిలోకి వస్తున్నారు. కాలంతో పాటుగా ఈ భావన మరింతగా బలపడుతోంది. ఈ కారణంగా మా మార్గం కొంత సులభమైంది. దీనిని సాధించడమూ ఒక సవాలే.

ఇంతకు ముందు మా మార్గంలో గుచ్చుకున్న ముళ్లు ఇప్పుడు వాటి స్వభావాన్ని మార్చుకున్నాయి. గతంలో మేం వ్యతిరేకత, విద్వేషాలను ఎదుర్కోవలసి వచ్చేది. వాటి నుంచి తప్పిచుకునే వీలుండేది. కొన్ని సందర్భాలలో వాటిని అసలు పట్టించుకోలేదు. వదిలేశాం. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కొత్తగా లభించిన విస్తృత ప్రజామోదం మాకు వనరులు చేకూర్చింది. వెసులుబాటు కలుగజేసింది. సంవృద్ధిని అందించింది. సామాజిక గౌరవ, మర్యాదలు, విశ్వాసం పెరిగాయి. సమాజం మా మీద విశ్వాసం ఉంచింది. అంచనాలు పెరిగాయి. సమాజం మా ద్వారా  పరివర్తనను ఆశిస్తోంది. ఈ పరిస్థితులలో పెరిగిన ప్రజాదరణ, వనరులు అనుకోకుండా మాకు ముళ్లుగా మారాయి. ఇప్పుడు ఈ ముళ్లను ఎదుర్కోక తప్పని పరిస్థితి. ఉదాహరణకు, చాలా వాటిపై మీడియా ముందుకు వెళ్లడం మాకు ఇష్టం ఉండదు. కానీ తప్పించుకోలేం. మీడియాకు దూరంగా ఉంటే, అది ప్రతికూల ప్రభావం చూపవచ్చు. మేం నీడల మాటున ఎందుకు దాక్కుంటున్నామని వారు ఆశ్చర్యపోవచ్చు. కాబట్టి మేం మీడియా ముందుకు రాక తప్పదు. మేం బయటకు వచ్చినప్పుడు పత్రికలు మా గురించి రాస్తాయి. ఫొటోలు ముద్రిస్తాయి. మాకు ప్రచారం అవసరం లేదు. ఈరోజు మావద్ద ఉన్న సాధనాలు, వనరులు పనికి అవసరమైనవిగానే చూడాలి. వనరులను మనం నియంత్రిచాలే కానీ, వనరులు మనలను నియంత్రిచరాదు. మనం వాటికి అలవాటు పడరాదు. కష్టాలను ఎదుర్కొనే మన పాత అలవాట్లు ఎప్పటికీ మనతోనే ఉండాలి. ప్రస్తుత కాలం అనుకూలంగా ఉన్నా కానీ, అది అహంకారానికి దారి తీయరాదు. సానుకూల వాతావరణం, ప్రాచుర్యంతో పాటుగా, మరికొన్ని అంశాలు తోడవుతాయి. మనకు స్వాగతం పలికేందుకు రైల్వేస్టేషన్‌కు గుంపులు గుంపులుగా జనం వచ్చినప్పుడు ఆ ఆనుభూతి బాగుంటుంది. అయితే అలాంటి భావనలకు ఆధారభూతమైన అంశాలు ఎటు దారితీస్తాయి అనేది గమనంలో ఉండాలి. అదే సమయంలో, ఆ భావాలను అర్ధంచేసుకునేందుకు మనం జాగరూకతతో మెలగవలసి ఉంటుంది. ఆ భావనలు ఎక్కడికి తీసుకుపోతున్నాయో కూడా మన నిరంతర గమనంలో ఉండాలి. ఈ గ్రహింపు కలిగి ఉండడం, నిరంతర జాగరూకత మా ముందున్న అసలు సవాలు.

వాస్తవ దృక్పథంతో పనిచేస్తున్న క్రమంలో మా కార్యం ముందుకు సాగుతోంది. కాలక్రమంలో అందరూ వాస్తవాలను గ్రహిస్తారు. మా మార్గంలోకి వస్తారు. ఈ వాస్తవ పునాదులపైనే మా భవిష్యత్‌, ఈ ‌దేశ భవిష్యత్‌ ‌రూపుదిద్దుకుంటుంది. ఈ విషయంలో మాకు ఎలాంటి అనుమానం లేదు. ఆందోళన లేదు. అయితే, ఇక్కడితో ప్రస్థానం ముగిసిందనే భావనతో, మా ఆలోచనలు పక్కదారి పట్టకుండా, గమ్యం చేరే వరకు మూలాధార బిందువును (స్వత్వ) పట్టుకుని ముందుకు సాగవలసి ఉంటుంది. ప్రస్తుతమున్న సానుకూల వాతా వరణంలో ఈ లక్ష్యాలను చేరుకోవడం, మా ముందున్న పెద్ద కష్టంగా అనిపిస్తుంది. మేం ఈ దశను దాటి రావాలి. ఇదే మా ముందున్న సవాలు.

ఒకప్పుడు సంఘ్‌ ‘‌సంస్థ కోసం సంస్థ’ (ఆర్గనై జేషన్‌ ‌ఫర్‌ ఆర్గనైజేషన్‌) అనే ఆలోచన ధోరణి, కార్యపద్ధతిని అనుసరించింది. ఇప్పుడు మీరు సామాజిక పరివర్తన, విస్తృతస్థాయిలో మానవత్వం కోసం సంఘ్‌ ‌పనిచేయాలని అంటున్నారు. ఈ నేపథ్యంలో సంఘ్‌ ‌కార్యపద్ధతిలో, ఆలోచనలలో ఎలాంటి మార్పును చూస్తున్నారు?

ఇది మార్పు కాదు. ఇందులో మార్పు లేదు. ఇది పురోగతి. మొగ్గ విచ్చుకునే క్రమంలో.. అన్ని రెక్కలు ఒకేలా విచ్చుకోవు. ఒకటిగా విచ్చుకోవు. కొన్ని రెక్కలు త్వరగా విచ్చుకుంటాయి. కొన్ని కొంచెం ఆలస్యంగా విచ్చుకుంటాయి. అలాగే, మా సంస్థలో మార్పు లేదు. కార్యపద్ధతిలోనూ మార్పు లేదు. అప్పుడు ఉన్నదే ఇప్పుడూ ఉంది. మేం ఇప్పటికీ సంస్థ కోసమే సంస్థ.. అనే విశ్వాసంతో, అదే పద్ధతిలో, అదే విధానంలోనే పనిచేస్తున్నాం. లేదంటే మాలో ఆత్మతృప్తి ఏర్పడుతుంది. నిత్యశాఖలు నిర్వహించకపోయినా ప్రజలు మనతోనే ఉంటారు అనే ఆత్మతృప్తి భావన ఏర్పడుతుంది.

మేం సమాజంలో ఉన్న మేధస్సును ప్రోది చేసేందుకు ప్రాధాన్యం ఇస్తాం. సంఘ్‌ ‌సభ్యుల్లో చాలా వరకు కుటుంబ సంబంధాల కారణంగా పుట్టుకతోనే మాలో ఒకరిగా వస్తారు. అయినా, నిత్యశాఖను నిర్లక్ష్యం చేయం. నిర్వహిస్తూనే ఉంటాం. సమాజ పరివర్తన బాధ్యతను తీసుకోవడం వలన మా పని భారం పెరుగుతుంది. అదే సమయంలో, సమాజ పరివర్తన కోసం పనిచేయడం వలన ఏమొస్తుంది, ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది? అనే ప్రశ్న ప్రశ్నగానే ఉండిపోతుంది. మనం ఆరోగ్యంగా ఉండాలని ఎందుకు కోరుకుంటాం? ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటే మనం చేసే పనులన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటాయి. వయసు మీద పడిన తర్వాత మనం రిటైర్‌ అవుతాం. పని ఉండదు. అయినా మనం ఆరోగ్యంగా ఉండాలనే కోరు కుంటాం. అలాగే, బాల్యంలో బాధ్యతలు ఉండవు. చేసే పనీ పెద్దగా ఉండదు. అయినా ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటాం. ఇక మనం పని చేస్తున్నపుడు ఆరోగ్యం మన మొదటి ప్రాధాన్యం అవుతుంది. అందుకే, సంస్థ కోసం క్రమశిక్షణ అనే సూత్రం మా సంస్థ మూల స్తంభం.

ఇక సామాజిక సేవకు సంబంధించి, సామాజిక పరివర్తన కార్యం నిర్వహించేందుకు మాకు స్వయంసేవకులున్నారు. వ్యవస్థలు మార్చేందుకు మాకు స్వయంసేవకులున్నారు. విభిన్న కార్యక్షేత్రా లలో పనిచేసేందుకు, పరివర్తన తెచ్చేందుకు మాకు స్వయంసేవకులున్నారు. సంఘ్‌ ‌నిర్వహణ మాత్రమే చూస్తుంది. అంతకుమించి ఇంకేమీ చేయదు. స్వయంసేవకులు ఏ ఒక్క క్షేత్రాన్ని వదిలి పెట్టరు. అన్ని రంగాలలో, అన్ని క్షేత్రాలలో పనిచేస్తారు. చేస్తూనే ఉంటారు. ఇది మేం ఎప్పటి నుంచో చెపుతున్నదే. ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తోంది. ఇది పురోగతి.. సంఘ్‌ ‌సాధించిన ప్రగతి. ఇప్పుడు కాదు, అప్పుడు కూడా సంఘ్‌ ‌కోసమే సంఘ్‌ ‌నిర్మాణ కార్యక్రమాలు ఉంటాయనే వారున్నారు. అవును, అందులో దాపరికం ఏం లేదు. సంఘ్‌ ‌కోసమే సంఘ్‌ ‌కార్యక్రమాలు.

ఇక ఇప్పుడు అందరికీ ఆసక్తి కగించే విషయం లోకి వద్దాం. ఇప్పుడు సంఘ్‌ను రాజకీయ దృక్కోణంలో చూసే ధోరణి బలంగా ఉంది. మీడియా అయితే రాజకీయ పరిణామాలపై సంఘ్‌ ‌దృక్పథం తెలుసుకోవాలని ఆరాట పడుతుంది. రాజకీయాలతో సంఘ్‌ ‌సంబంధాలను మీరు ఎలా చూస్తారు?

కారణాలు ఏవైనా మన సమాజంలో ప్రతి పరిణామాన్ని రాజకీయంగా చూసే దృక్పథం బలంగా వేళ్లూనుకొంది. అందుకే, ఇప్పుడు ఒక్క సంఘ్‌ ‌కార్యకలాపాలను మాత్రమే కాదు, ప్రతి విషయాన్ని రాజకీయ దృక్కోణంలో చూడడం జరుగుతోంది. సహజంగా సమాజంలో ఇతర రంగాలలో జరిగే మంచి చెడుల గురించి మనం అంతగా పట్టించుకోం. ప్రతిదీ రాజకీయాల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అయితే సంఘ్‌ ఆవిర్భావం నుంచి కూడా ఉద్దేశ పూర్వకంగానే రోజువారీ రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటోంది. ఓట్ల రాజకీయాలతో, ఎన్నికల రాజకీయాలతో సంఘ్‌కు సంబంధం లేదు. ఒకరినొకరు అవహేళన చేసుకునే, అవమాన పరచుకునే రోజువారీ రాజకీయాలతో సంఘ్‌కు ఎలాంటి సంబంధం లేదు. అయితే, రాజకీయాలలో మన జాతీయ విధానాలను, జాతీయ ప్రయోజనా లను, హిందూ ప్రయోజనాలను దెబ్బతీసే మరో కోణం ఉంది. రాజకీయ సమగ్ర దృక్పథం ఈ అంశాలకు అనుకూలంగా ఉందా లేదా అనే విషయంలో సంఘ్‌, ‌డాక్టర్జీ (ఆర్‌ఎస్‌ఎస్‌ ‌వ్యవస్థాపకులు డాక్టర్‌ ‌హెడ్గేవార్‌) ‌రోజుల నుంచి ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటోంది. రాజకీయాలు తప్పుడు మార్గం పట్టి సామాజిక జాగృతిపై వ్యతిరేక ప్రభావం చూపితే, మేం సహజంగానే స్పందిస్తాం. జాతీయ విధానాల విషయంలో మేం చాల స్పష్టంగా ఉన్నాం. స్పష్టంగా చెపుతున్నాం. అందుకు అనుగుణంగా రాజకీయాలు సరైన మార్గంలో సాగేందుకు మేం మా శక్తి మేరకు ప్రయత్నిస్తాం. ఈ విషయంలో ఎలాంటి మీమాంస అవసరం లేదు. మేం బహిరంగంగా పనిచేస్తాం. ఇందులో ఎలాంటి దాపరికం, రహస్యం లేదు. ఇప్పుడు కూడా అదే పద్ధతి పాటిస్తున్నాం. రోజువారీ రాజకీయాలతో మాకు సంబంధం లేదు. కానీ, దేశం నీతి-జాతీయ విధానాలకు సంబంధించిన రాజకీయ అంశాలు, పరిణామాలతో మాకు కచ్చితంగా సంబంధం ఉంది. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఇదే మా విధానం. ఇప్పుడు మేం, మాకున్న సంస్థాగత నిర్మాణం ద్వారా, మా బలాన్ని తగినంతగా పెంచుకున్నాం. ఆ బలాన్ని జాతీయ ప్రయోజనాల కోసం ఉపయోగించు కుంటున్నాం. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. మేం కచ్చితంగా మా బలాన్ని జాతి ప్రయోజనాల కోసం వినియోగించుకుంటాం.

గతంలో మా స్వయంసేవకులు అధికార పదవుల్లో లేరు. ఇప్పుడున్నారు. అప్పటికీ ఇప్పటికీ అదొక్కటే వ్యత్యాసం. అయితే కొందరు వ్యక్తులు ఒక విషయం మరిచిపోతున్నారు. ఇప్పుడు కొందరు స్వయంసేవకులు, ఒక రాజకీయపార్టీ ద్వారా రాజకీయ పదవులను అధిష్టించారు. అయినా సంఘ్‌ ‌సమాజం కోసం వ్యక్తి నిర్మాణ కార్యక్రమాన్ని కొన సాగిస్తూనే ఉంటుంది. అయితే స్వయంసేవకులు రాజకీయాల్లో చేసే పనులకు సంఘ్‌ ‌బాధ్యత వహించవలసి వస్తుంది. నిజానికి, ఎవరూ మమ్మల్ని నేరుగా బాధ్యులను చేయరు కానీ, స్వయంసేవకులు శిక్షణ పొందేది సంఘ్‌లోనే కాబట్టి మాపై కచ్చితంగా కొంత బాధ్యత ఉంటుంది. కాబట్టి రాజకీయాలతో మా సంబంధాలు ఎలా ఉండాలి, మనం (జాతీయ ప్రయోజనాల దృష్ట్యా) ఏ ఏ అంశాల పరిష్కారంపై శ్రద్ధ పెట్టాలి అనే విషయంలో ఆలోచించవలసి వస్తుంది. ఉదాహరణకు, సంఘ్‌ ‌కార్యక్రమాలను వివరించేందుకు ఇటీవల వ్యాపారులతో సమావేశం జరిగింది. సమావేశం చివర్లో ప్రశ్నోత్తరాలకు సమయం కేటాయించారు. సమావేశంలో పాల్గొన్న వారు సంఘ్‌ ‌కార్యక్రమాల వివరాలను చక్కగా విన్నారు. చక్కగా అర్థం చేసుకున్నారు. కానీ, చివర్లో ప్రశ్నోత్తరాల సమయంలో ఆదాయ పన్ను గురించి, జీఎస్టీ గురించి, సులభ వ్యాపార పద్ధతుల గురించి ప్రశ్నించారు. ప్రభుత్వం, ప్రభుత్వ విధానాలు, వ్యాపారం, వాణిజ్యాలకు సంబంధించిన ప్రశ్నలే అడిగారు. అలా వారు అడిగినప్పుడల్లా అది మా పని కాదని చెపుతూ వచ్చాను. అందుకే నేను ఇది ఒక పక్క విధానానికి సంబంధించిన విషయం, మరోవైపు విధానాలను రూపొందించి అమలుచేసే వారి ఆలోచన ధోరణి (మైండ్‌సెట్‌)‌కు సంబంధించిన విషయమని పదే పదే చెప్పాను. అయినా వారు అవే ప్రశ్నలు మళ్లీ మళ్లీ అడిగారు. దీంతో మీ సమస్యలను సంబంధిత వ్యక్తుల దృష్టికి తీసుకు వెళ్తామని చెప్పక తప్పని పరిస్థితి వచ్చింది. రాజకీయ పరిణామాల గురించి మేం చెప్పేది ఒక్కటే. ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను మా దృష్టికి తీసుకువస్తే మేం అ సమస్యను సంబంధిత వ్యక్తుల దృష్టికి తీసుకు వెళతాం. గతంలో స్వయంసేవకులు అధికార పదవుల్లో లేని సందర్భాలలోనూ ఇతరుల సలహాలు తీసుకునేవారు ఉన్నారు. భవిష్యత్‌లో కూడా అలాంటి వారుంటారు. ప్రజా సమస్యలతో మేం అలాంటి వారిని కలుస్తూనే ఉంటాం. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంలో ప్రణబ్‌ ‌ముఖర్జీ ఆర్థికమంత్రిగా ఉన్నారు. నేపాల్‌ ‌వ్యవహారాలను కూడా వారే చూస్తున్నారు. ఆ సందర్భంలో మేం మా ఆలోచనలు, ఆందోళనను వారి దృష్టికి తీసుకు వెళ్లినప్పుడు, వారు మా మాట విన్నారు. మేం చేసేది అదే. క్రియాశీల రాజకీయా లలో అంతకుమించి మా ప్రమేయం, పాత్ర ఉండదు.

మా ప్రయాణంలో ఎక్కడా మా గమ్యం పక్కదారి పట్టిపోకుండా, గమ్యం చేరేవరకు మూలధాతువు (సారం) నిలుపుకుంటామనే భరోసా/విశ్వాసం ఇవ్వవలసి ఉంటుంది. ఈ లక్ష్యాల దృక్కోణంలో చూసినప్పుడు, సంపూర్ణ సానుకూల పరిస్థితులున్న ప్రస్తుత కాలం చాలా కష్ట కాలం. మేం ఈ పరిస్థితిని వేగంగా దాటవలసి ఉంటుంది. ఇదీ మా ముందున్న సవాలు.

గత కొన్ని సంవత్సరాలుగా హిందూ సమాజం గళం గట్టిగా వినిపిస్తోంది. హిందూ విశ్వాసాలు, విలువలు, ఆదర్శాలు, చిహ్నాల గురించి హిందూ సమాజం గట్టిగా మాట్లాడుతోంది. కొన్ని సందర్భాలలో దూకుడు చూపుతోంది. మరోవైపు సంఘ్‌ ‌వెనకటి దూకుడును వదిలేసిందా? అన్న అనుమానాలు సోషల్‌ ‌మీడియాలో తరచూ వినిపిస్తున్నాయి. మీరు ఈ మార్పును ఎలా చూస్తారు? ఈ మార్పుకు సంఘ్‌లో వచ్చిన పరివర్తన కారణమా, లేక సమాజంలో వచ్చిన మార్పు దృష్ట్యా సంఘ్‌ ‌తన పాత్రను వ్యూహాత్మకంగా మార్చుకుందా?

చూడండి. హిందూ సమాజం వెయ్యేళ్లుగా విదేశీ దురాక్రమణలకు వ్యతిరేకంగా, విదేశీ భావజాల ప్రభావాలకు వ్యతిరేకంగా, విదేశీ కుట్రలకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తోంది. సంఘ్‌ ఈ ‌పోరాటానికి మద్దతు తెలిపింది. అలాగే కొన్ని సంస్థల దాడులు, కుట్రల గురించి చాలా మంది చాలా మాట్లాడారు. ఈ అన్నిటి కారణంగా హిందూ సమాజం మేల్కొంది. యుద్ధభూమిలో ఉన్నవారు దూకుడుగా ఉండడం సహజం. ‘యుధ్యస్వ విగతా-జ్వరః’ (భగవద్గీత) శ్లోకంలో చెప్పినట్టుగా కోరికలు, స్వార్ధం వదులుకుని, వ్యక్తిగత మానసిక క్షోభను పక్కనపెట్టి పోరాడడం అందరికీ సాధ్యం కాదు. అయినా, సంఘ్‌ ‌ద్వారా కొందరు వ్యక్తులు సామాజిక చైతన్యం కోసం పనిచేస్తున్నారు. సేవాకార్యక్రమాలను చేపట్టారు. సామాజిక చైతన్య ప్రస్థాన సంప్రదాయం చాలా పురాతనమైనది. మనదేశంపై దండెత్తిన మొట్టమొదటి దురాక్రమణదారు అలెగ్జాండర్‌ ‌దేశ సరిహద్దుల్లో కాలుపెట్టిన నాడే సామాజిక చైతన్యమనే సంప్రదాయం మొదటి అడుగు వేసింది.

సంప్రదాయ మార్గంలో సామాజిక చైతన్య కార్యాన్ని ఎంచుకున్న వారంతా మరో యుద్ధం గురించి హిందూ సమాజాన్ని హెచ్చరించారని మీరనవచ్చు. దురదృష్టవశాత్తు పొంచి ఉన్న ముప్పు గురించి ఈ వాస్తవం మనలను పూర్తి స్థాయిలో హెచ్చరించలేదు. సన్నద్ధం చేయలేదు. ఈ యుద్ధం బయటి శత్రువు మీద కాదు. మనలో ఉన్న శత్రువుతో చేస్తున్నది. హిందూ సమాజం, ధర్మం, సంస్కృతి పరిరక్షణ కోసం చేస్తున్న యుద్ధం. విదేశీ దురక్రమణ దారులు ఇప్పుడు లేరు. కానీ, విదేశీ ప్రభావం, విదేశీ కుట్రలు ఉన్నాయి. ఇది యుద్ధం. కాబట్టి, కొందరు అత్యుత్సాహం చూపితే చూపవచ్చు. అది అభిలష ణీయం కాకపోయినా, కొన్ని సందర్భాలలో ఉద్రేకపూరిత, రెచ్చగొట్టే ప్రకటనలు రావచ్చు. అయితే అదే సమయంలో మాకు సంబంధించిన అంతర్గత సమస్యలు కొన్ని ఉన్నాయి. శ్రీరాముడు మన గౌరవానికి ప్రతీక. శ్రీరాముని ఆలయాన్ని తప్పక నిర్మించాలనే లక్ష్యంతో ఆలయ నిర్మాణానికి ఉద్యమం నడిచింది. ఉద్యమంలో ఉన్నవారు జై ‘శ్రీరామ్‌’ అని నినదించారు. అలాంటి నినాదాలు సహజంగా ఉత్సాహాన్ని నింపుతాయి. శక్తినిస్తాయి. శ్రీరాముడు జాతి, కులాలకు అతీతంగా అందరినీ ఏకం చేశాడు. అయినా నేటికీ మన దేశంలో కులవ్యవస్థ కొరడా ఝుళిపిస్తూనే ఉంది. ఇది మారదా? హిందూ సమాజాన్ని చైతన్య పరచడమనే సంప్రదాయాన్ని కొనసాగించిన ప్రతి ఒక్కరూ ఈ విషయంపై దృష్టి నిలిపారు. మాట్లాడారు. హిందూ సమాజం నినాదాన్ని స్వాగతించింది, మెచ్చుకుంది. కానీ ఆత్మశుద్ధి సందేశాన్ని మాత్రం స్వాగతించలేదు. హిందూ సమాజం ఇంకా నిజాన్ని, పూర్తిగా ఆకళింపు చేసుకోలేదు. మేల్కొనలేదు. ఇప్పుడు అది జరగాలి, జరుగుతుంది. మనం (ఎవరో ఒకరిపై) ఎప్పుడూ యుద్ధం గురించి మాట్లాడుతూనే ఉంటాం. కానీ, మన పరిస్థితి ఏమిటి? యుద్ధంలో మనం శత్రువు గురించి ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. అలాగే మనం ఎప్పుడు, ఏం చేయాలో కూడా నిర్ణయించు కోవలసి ఉంటుంది.

మీరు ఒక్కసారి చరిత్రను గుర్తు చేసుకుంటే మొగల్‌ ‌దండయాత్ర తర్వాత, ఛత్రపతి శివాజీ మహరాజ్‌ ‌చేసిన ప్రయోగమే చిట్టచివరి ప్రయోగం. ఇక అక్కడి నుంచి అదే ప్రయోగం కొనసాగింది. ఆ వ్యూహాన్నే ఇతరులు అనుసరించారు. శివాజీ మహరాజ్‌ ‌విధానం ఏమిటి? ఆయనకు శత్రువు గురించి తెలుసు, అదే సమయంలో ఆత్మరక్షణ గురించిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయనకు ఎప్పుడు పోరాడాలో మాత్రమే కాదు ఎప్పుడు వెనకడుగు వేయాలో కూడా తెలుసు. పట్టాభిషేకం తర్వాత, శివాజీ ఇరుగు పొరుగున ఉన్న ముస్లిం రాజవంశాలకు స్నేహ హస్తం అందించారు. శివాజీ గోల్కొండ వెళ్లారు. గోల్కొండ పాలకులు కుతుబ్‌షాహీ లతో స్నేహ సంబంధాలు నెలకొల్పారు. అయితే, అందుకు కుతుబ్‌షా మంత్రివర్గంలో ఇద్దరు హిందువులకు స్థానం కల్పించాలని, హిందువులపై జరుగుతున్న దౌర్జన్యాలను తక్షణం ఆపాలనే షరతు విధించారు. కుతుబ్‌ ‌షా ఆ రెండు షరతులను అంగీకరించారు. అయితే శివాజీ మహరాజ్‌ ‌మరణం తర్వాత పరిస్థితి మారిపోయింది. అది వేరే కథ. కుతుబ్‌ ‌షాహీలలోని ఛాందసవాదులు.. హిందూ మంత్రులు ఇద్దరినీ హత్య చేశారు. అయితే, అధికార హోదాలో ఉండి తలపెట్టిన మంచిపనులకు అందరికీ ఆమోదయోగ్యం అవుతాయని శివాజీకి తెలుసు. అందుకే ఆయన ఆ ప్రయోగం చేశారు.

ఇక్కడ మరో విషయం ఏమంటే, హిందూ సమాజం తనను తాను అర్థం చేసుకుంటే సమాజానికి ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కరుడుగట్టిన క్రైస్తవులు ప్రపంచం మొత్తాన్ని క్రైస్తవంలోకి కన్వర్ట్ ‌చేస్తామని అంటారు. మత మార్పిడికి అంగీకరించని వారు బతికితే తమ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతకాలి లేదా నశిస్తారని అంటారు. స్వేచ్ఛను ఎంతమాత్రం సహించని, అబ్రహమిక్‌ ఐడియాలజీని ఆచరించే ఛాందసవాద ముస్లింలు, విశ్వాసకులు, కమ్యూ నిస్టులు, నల్ల పెట్టుబడిదారీ విధానాన్ని ఆచరించే అందరిదీ ఇదే ధోరణి. ఇతరులు అందరూ మరో మార్గం ఏదీ లేదన్నట్లుగా తమ మార్గంలోకే రావాలని అంటారు. మీరు కాదన్నారంటే, మా దయా దాక్షిణ్యాలపై బతకడమా? చావడమా అనేది మీరే తేల్చుకోవలసి ఉంటుంది. మేము నిన్ను నాశనం చేస్తాం. అంటారు.

మరి హిందూ దృక్పథం ఏమిటి? ఏ హిందువు అయినా ప్రతి ఒక్కరు తమ విశ్వాసాలనే ఆమోదించా లని ఎప్పుడైనా అన్నారా? అంటారా? అది మన అలోచన విధానం కాదు. మనం ఇతరులకు చూపేందుకు ఒక ఉదాహరణ ఉంచుతాం. అందరితో చర్చ జరగాలని కోరుకుంటాం. పురోగతి సాధించాలనుకునేవారు మన ఉదాహరణ పాటిస్తారు. కాదనుకున్నా మనం వారికి హాని తలపెట్టం. కానీ అదే సమయంలో ఇతరులు మనకు హాని తలపెట్టకుండా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఈ యుద్ధాలలో మనం తగినంత శక్తిని పుంజుకున్నాం. ఇక వారు మనకు హాని తలపెట్టరు. మన రాజకీయ స్వాతంత్య్రాన్ని భగ్నం చేయగల సామర్ధ్యం ఎవరికీ లేదు. ఇది విస్పష్టం. హిందువులు ఈ దేశంలోనే ఉంటారు. మరో దేశంలో ఆశ్రయం కోరే అవసరం లేదు. ఇప్పుడు ఈ దేశంలో హిందువులు చాలా అప్రమత్తంగా ఉన్నారు.

ఈ అవకాశాన్ని వినియోగించుకుని మనం మన అంతర్గత విభేదాలను పరిష్కరించుకోవడంతో పాటుగా, ఇతరుల సమస్యలకు పరిష్కారాలు చూపేందుకు కూడా ఇప్పుడు అవకాశం ఏర్పడింది. ఇప్పుడు మనం ఒక బలమైన శక్తిగా ఉన్నాం, కాబట్టి మనం తప్పక మన శక్తిని సద్వినియోగం చేసుకోవలసి ఉంటుంది. ఇప్పుడు కాకుంటే, రానున్న 50 సంవత్సరాలలో లక్ష్యాన్ని సాధించేందుకు ఇప్పుడే, ఈరోజే మొదలవ్వాలి. చైనా ప్రస్తుత ప్రాధాన్యతకు 1948లో తొలి అడుగు పడింది. ప్రణాళిక అప్పుడే సిద్ధమైంది. అప్పటి నుంచి వారు అదే మార్గంలో ప్రయాణిస్తున్నారు. మనం తగినంత శక్తిని కూడదీసు కున్నప్పుడు మన భవిష్యత్‌ ‌ప్రాధాన్యతల విషయంలో మనకు స్పష్టత ఏర్పడుతుంది. నిత్యం పోరాట భావన వలన మనకు ఎలాంటి ప్రయోజనం చేకూరదు. దేశం విషయంలో అలా కాదు. అలా జరగదు. అలాగే, పోరాడితే అన్నీ సాధిస్తారని అనుకోవడం కూడా పొరపాటే అవుతుంది. ఇటలీ పోరాటానికి గారిబాల్డి సారథ్యం వహించారు. కానీ, యుద్ధం ఆగిపోయిన తర్వాత ఆయన సారథ్య బాధ్యతలు ఇతరులు తీసుకోవాలని కోరుకున్నారు. చివరకు చక్రవర్తిని ఎన్నుకోవలసిన సమయం వచ్చినప్పుడు, గారిబాల్డి బాధ్యతలు తీసుకునేందుకు నిరాకరించారు. ఆ బాధ్యతను వేరొకరు తీసుకోవాలని అన్నారు. ఇటలీ ప్రగతి ప్రస్థానంలో ముగ్గురు వ్యక్తులు ప్రముఖంగా కనిపిస్తారు. గారిబాల్డి  యుద్ధభూమిలో సారధ్యం వహించారు. అయితే, చివరకు ఆయన అది (పరిపాలన) తన పనికాదని తప్పుకున్నారు. అదేవిధంగా మనం కూడా పరిస్థితులను బట్టి లక్ష్యం మారకుండా, భాష, భావన, పద్ధతులను మార్చుకోవ లసి ఉంటుంది. హిందూస్తాన్‌, ‌హిందూరాష్ట్రం. శక్తివంతమైన హిందూ సమాజం-హిందూ రాష్ట్ర-భారత్‌ ‌కీర్తి శిఖరాలను చేరుకుంటుంది. ప్రపంచానికి నాయకత్వం వహిస్తుంది. ఈ లక్ష్యం చేరుకోవడంలో ఎక్కువ తక్కువలు, లోపాలు ఉంటే, వాటిని అధిగమించడం ఎలా? అవసరం అయితే, మనకు మనంగా యుద్ధాన్ని ఎంచుకుంటాం. అంతేకానీ, ఎవరో సవాలు చేశారని మనం మన వ్యూహాలను మార్చుకోరాదు. మనం యుద్ధాలను మన పద్ధతిలో, మన ప్రణాళిక ప్రకారం చేస్తాం. హిందూ సమాజం ఈ విధంగా ఆలోచించాలి.

ప్రజలు సంఘ్‌ను ఒక సాంస్కృతిక సంస్థ అంటారు. సుదీర్ఘ ప్రయాణం చేయాలనుకునే వారు, తమ ప్రాధాన్యతలను సక్రమంగా నిర్దేశించు కోవాలని, రోడ్‌ ‌మ్యాప్‌ ‌రూపొందించుకోవాలని మీరంటున్నారు. సంఘ్‌ ‌సాంస్కృతిక సంస్థ కాబట్టి, సాంకేతిక విజ్ఞానం (టెక్నాలజీ), పర్యావరణం, లింగ (జెండర్‌) ‌సంబంధ సమస్యల వంటి సమకాలీన చర్చనీయాంశాలపై మీ స్పందన ఏమిటి? ఈ అంశాల విషయంలో సంఘ్‌ ఆలోచన ఏమిటి?

ఇంతవరకు ప్రపంచం పాశ్చాత్య దేశాల ఆధిపత్యంలో ఉంది. కాబట్టి, అనేక విషయాల్లో వారు ముందున్నారు. వారే నాయకత్వం అందిస్తున్నారు. చర్చను వారే నిర్దేశిస్తున్నారు. పరిష్కారాలు కనుగొంటున్నారు. అందరూ అదే ఆచరించాలని చెపుతున్నారు. మనతో సహా ప్రపంచం అంతా వారినే అనుసరిస్తోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి? ఆ దేశాల నాయకత్వం విఫలమైంది. మనల్ని విఫలం చేసింది. ఆ దేశాలు వారి వైఫల్యాలను అంగీకరించి, ఆలోచించి పరిష్కారాల కోసం ఎక్కడికి చేరారు? పర్యావరణం విషయాన్నే తీసుకుంటే ప్రపంచం భారతీయ ఆలోచనల వైపు, హిందూ ఆలోచనల వైపు చూస్తోంది. అలాగే లింగ, మహిళల సమస్య విషయానికి వస్తే చాలా కాలంగా మహిళా విముక్తి, మహిళల సాధికారిత మొదలైన నినాదాలు వినిపిస్తు  న్నాయి. అయితే ముందడుగు వేసిన పాశ్చాత్య మహిళలు ఇప్పుడు కుటుంబ జీవితం అవసరాన్ని గుర్తించి, లింగ సమానత్వం దగ్గరకు తిరిగొస్తున్నారు. మరోలా చెప్పాలంటే హిందూ భావనకు దగ్గరవు తున్నారు. అలాగే టెక్నాలజీ, టెక్నాలజీ రహిత, నైతిక విలువలతో కూడిన టెక్నాలజీ, నియంత్రిత రహిత టెక్నాలజీ, మానవ వైఖరితో టెక్నాలజీ.. ఇలా టెక్నాలజీ చుట్టూ చాల చర్చ జరుగుతోంది. అయితే టెక్నాలజీనే సర్వస్వం కాదు. ఇలాంటి సాంకేతిక ఆవిష్కరణలు అనేకం వస్తూనే ఉంటాయి. ప్రపంచం ముందుకు సాగుతూనే ఉంటుంది. జీవితాన్ని సమూలంగా అర్థం చేసుకున్నవారు మాత్రమే ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరు. భారతీయ జీవన విధానం జీవితాన్ని సంపూర్ణంగా, సమూలంగా, సమగ్రంగా అర్థం చేసుకుంటుంది. వ్యక్తులను ఎవరికి వారు, ప్రత్యేక కుటుంబంగా చూసే పాశ్చాత్య ఆలోచన ధోరణిలోని కొన్ని లింగ సంబంధ అంశాలకు కూడా భారతీయ ఆలోచన విధానం పరిష్కారం చూపింది. పాశ్చాత్య ఆలోచన ధోరణి దేనికదిగా, విడివిడిగా, ముక్కలు ముక్కలుగా అతుకుల బొంతలా సాగుతుందని భారత్‌కు తెలుసు. అలాగే, ఆ అతుకులను ఎలా కలపాలో కూడా భారత్‌కు తెలుసు.

ఈరోజు సాధారణ చర్చలో మార్పు చోటు చేసుకుంటోంది. భారతీయ ఆలోచనలకు దగ్గరవు తోంది. భారతీయ ఆలోచనలకు ప్రపంచ ఆమోదం లభించకముందు నుంచీ కూడా మేం భారతీయ ఆలోచనలు, భారతీయ చర్చకు ప్రాధాన్యం ఇస్తున్నాం. టాగూర్‌, ‌గాంధీజీ, వివేకానంద, దయానంద సరస్వతి వారి నుంచి స్ఫూర్తిని పొంది, వారి అలోచనల వెంట మేం ముందుకు సాగుతున్నాం. ఆధునిక పాశ్చాత్య ఆలోచనలో కూడా ఇదే తరహా ఆలోచనలు కొనసాగుతున్నాయి. మనం వాటిని కూడా అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. సంఘ్‌కు ఈ విషయంలో ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. టెక్నాలజీకి సంబంధించినంత వరకు అది మానవాళికి సేవ చేయాలి. అదే సంఘ్‌ ‌భావన. ఉదాహరణకు ఇప్పుడు మనకు కృత్రిమ మేధస్సు అందుబాటులో ఉంది. అయితే, నియంత్రణ లేకపోతే యంత్రాలు మనపై స్వారీచేసే రోజులు వస్తాయని ప్రజలు అనుమానిస్తున్నారు. ఆందోళన చెందు తున్నారు. ఈ విషయంలో సంఘ్‌కు వేరే అభిప్రాయం లేదు. ఈ ప్రశ్నలకు హిందూ (ఆలోచన) సంప్రదాయాలు ఇప్పటికే స్పందించాయి. అలాగే ఎల్జీబీటీ, ట్రాన్స్‌జెండర్‌ (‌హిజ్రాల) అంశాలకు సంబంధించి చాలా తరచుగా ఒక చిన్న ప్రశ్న వినిపిస్తుంది. నయా వామపక్ష మేధావులు భుజానికి ఎత్తుకున్న విషయం కావడంతో ఆ చిన్న ప్రశ్న పరిధిని దాటి ప్రకంపనలు సృష్టిస్తుంది. అయితే ఇవేవీ కొత్తగా ఇప్పుడే పుట్టుకొచ్చిన సమస్యలు కాదు. ఎప్పుడూ ఉన్నవే. ట్రాన్స్‌జెండర్‌కు కూడా అందరిలానే జీవించే హక్కుంది. పెద్దగా గందరగోళం లేకుండా మానవీయ కోణంలో ఆలోచించి వారూ మనుషులే. వారికీ జీవించే హక్కుందనే భావాన్ని మనసులో నిలుపుకుని, వారికి సామాజిక ఆమోదం తెలిపే పరిష్కారాన్ని కనుగొన్నాం. ట్రాన్స్‌జెండర్‌ ‌సమాజం ఉంది. మేం దీనిని సమస్యగా చూడడం లేదు. వారికి వారి దేవీ దేవతలున్నారు. ఇప్పుడు వారికి ప్రత్యేకంగా మహామండలేశ్వర్‌ ఉం‌ది. కుంభ మేళ సమయంలో వారికి ప్రత్యేక స్థానం కల్పిస్తారు. వారు మన నిత్య జీవితంలో భాగం. మన ఇంట్లో పిల్లో పాపో పుట్టినప్పుడు, వారు మనింటికొచ్చి పాటలు పాడుతారు. వారికి ప్రత్యేక జీవన స్థావరం ఉన్నా ప్రధాన స్రవంతిలో వారూ భాగస్వాములే. మేం ఈ ఏర్పాటు గురించి ఎప్పుడు గొప్పగా చెప్పుకోలేదు. అంతర్జాతీయ స్థాయి చర్చగా మార్చలేదు.

ఎల్జీబీటీ సమస్య కూడా అంతే. జరాసంధునికి ఇద్దరు సైన్యాధికారులు (జనరల్స్) ఉన్నారు. హంస, డింభక. డింభకుడు మరణించాడని కృష్ణుడు ప్రచారం చేయడంతో హంస ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విధంగా శ్రీకృష్ణుడు ఇద్దరు సైన్యాధికారులను తొలిగించారు. ఆలోచిస్తే ఈ కథ ఇచ్చే సందేశం ఏమిటి? ఆ ఇద్దరు సైన్యాధికారులకు ఆ విధమైన సంబంధం ఉంది. అంటే, ఇలాంటి వారు మన దేశంలో ముందు లేరని అనుకోవడం తప్పు. ఉన్నారు. మానవాళి ఉన్నంత వరకు అలాంటి లక్షణాలున్న వారు ఉంటారు. ఒక పశు వైద్యునిగా నాకు తెలుసు. మనుషుల్లోనే కాదు, పశువుల్లోను అలాంటి లక్షణాలు ఉన్న పశువులు ఉంటాయి. ఇదొక జీవ సంబంధమైన విషయం. ఒక జీవిత విధానం. అందుకే వారికి ప్రత్యేక స్థానం అవసరం. అలాగే, వారిలో తాము కూడా ఈ సమాజంలో భాగమనే భావన అవసరం. ఇది చాలా చిన్న విషయం. ఈ సమస్య పరిష్కారం కోసం ఇంతవరకు జరిగిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. అందుకే, ఈ ఆలోచనకు ప్రాచుర్యం కల్పించవలసిన అవసరం ఉంది. అందుకే ఇలాంటి విషయాల్లో సంఘ్‌ ‌సంప్రదాయాల విజ్ఞతపై ఆధారపడుతుంది.

(మిగతా వచ్చేవారం)

అను: రాజనా బాలకృష్ణ

About Author

By editor

Twitter
Instagram