– పాలంకి సత్య

ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన


మరునాడు ఉదయం స్నాన, సంధ్యావందన, పూజాదికాలు పూర్తయిన తర్వాత విక్రముడు, ‘‘మిహిరా! ఇక సెలవు’’ అన్నాడు.

‘‘నీ యుద్ధయాత్ర దిగ్విజయంగా సాగునుగాక! సర్వదేవతలు నిన్ను రక్షించెదరు గాక!’’ అని స్వస్త్యయనం చెప్పి, ‘‘త్వరలో నీ దర్శనభాగ్యం నాకు లభించును గాక!’’ అని మిహిరుడు పలికినాడు.

‘‘అగ్ని నుండి ఉద్భవించిన మా పరమార వంశ చిహ్నం వరహం. ఆది వరాహమూర్తి భూదేవిని రక్షించినట్లే పరమార వంశస్థులు భరతఖండ రక్షణ చేపట్టాలని ధర్మ నిర్ణయమట. నీవు కూడ వరాహ లాంఛనుడవు కావాలని నా ఆశ.

‘‘భగవన్నిర్ణయ మెట్టున్నదో!’’ అని మిహిరుడు మిత్రుని వీడ్కోలిపి, గాయత్రీ జపమారభించినాడు.

****

ఆరుమాసాల తర్వాత ఇంటికి వచ్చి జననీ జనకులకు నమస్కరించాడు మిహిరుడు. ఆశీర్వ దించిన ఆదిత్యదాసు కుమారుని వంక పరీక్షగా చూసి ‘‘పుత్రా, సూర్యదేవుని కృప నీపై సంపూర్ణంగా ప్రసరిం చింది. ఆదిత్య వరప్రసాద లబ్ధుడవైన నీవు సర్వ విద్యా పారంగతుడవు కాగలవు. నీ కీర్తి చిరస్థాయిగా నిలిచిపోగలదు. నీ వంటి కుమారుడు పూర్వ జన్మ సుకృతం. తండ్రి సంతానాన్ని పొగడరాదన్న నియ మోల్లంఘన చేసేందుకు సాహసిస్తున్నాను’’ అన్నాడు.

‘‘నా ఘనత ఏమీలేదు. మీ ఆశీర్వాదమే నాకు సదా రక్ష’’ అని మిహిరుడన్నాడు.

****

విక్రముడు కాపిత్థక క్షేత్రం నుండి తండ్రి ఆశ్రమానికి వెళ్లి జననీజనకులకు నమస్కరించి, దండయాత్రకు సేనను సమీకరించిన విధానాన్ని గంధర్వసేనుడికి వివరించాడు.

‘‘కుమారా! నీ యుద్ధయాత్రా ప్రయత్నం బాగు న్నది. తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయస్కరం. అవంతీ రాజ్యాన్ని ఆనుకుని విదిశ ఉన్నది. ప్రథమంగా విదిశను జయించడం మంచిది. నీకు యుద్ధనీతిని బోధించవలసిన పనిలేదు. సాధ్యమయినంత వరకు సామమార్గమే ఆచరణ యోగ్యం. సేన తక్కువగా నష్టమయ్యే విధంగానే వ్యవహరించాలి. ధనం అధికంగా వ్యయపరచరాదు. రాయబారంతోనే రాజులు లొంగిపోవడం సంభవించిందని ఇదివర లోనే నీకు తెలియపరచినాను.’’

‘‘చిత్తం!’’

‘‘అగ్ని వంశీయులైన ప్రభు వులు భరతభూమిలో అక్కడక్కడ ఉన్నారు. వారితో వైవాహిక సంబంధం వాంఛనీయం.’’

‘‘జనకుల ఆజ్ఞ’’ అని చెప్పి, తల్లితండ్రులకు నమస్కరించి, విక్రమాదిత్యుడు సేన వైపుకు నడిచాడు.

****

విక్రమాదిత్యుడు సేనా సమేతంగా తూర్పు దిక్కుగా పయనిస్తూ ఎదురింప వచ్చిన రాజులను జయిస్తూ మగధ రాజ్య ఎల్లలను సమీపించేసరికి రెండు సంవత్సరాలు గడచినాయి. ముందుగా రాజగృహంలోని బౌద్ధ చైత్యాన్నీ, విహారాలనూ దర్శించాలని మహారాజు నిర్ణయించినాడు. నగరానికి వెలుపల సేన విడిసింది. తన విజయ పరంపర విషయమై విక్రముడు సేనాపతులతో సంభాషణ కావించాడు.

‘‘ఇంతవరకూ అపజయమన్న మాట లేదు. ఇది మన సేన గొప్పతనంగా భావించి సంతోషించాలా? లేక భరతఖండపు రాజులలో పౌరుషం, శక్తి తగ్గిన దనుకొనవలెనా?’’

‘‘మహాప్రభువులకు చెప్ప తగిన వారము కాము. ఒక్కొక్క కాలంలో వీరాధి వీరు డొకడు ఉద్భవించడం యుగ యుగాలుగా జరుగుతున్న విషయం. మీకు కలిగిన సందేహం ఇదివరలో ఏ రాజు మనసులోనూ ఉద్భవించి ఉండదు.’’

‘‘ప్రస్తుత పరిస్థితి వేరు కదా! వాయవ్య దిశ నుండి అనార్యులైన మ్లేచ్ఛులు భరతభూమిని ఆక్ర మించేందుకు ప్రయత్నించడం, కొన్నిసార్లు విజయ లక్ష్మి వారినే వరించడం జరుగుతున్నది. ఆ సేతు హిమాచలం ఒక ప్రభువు రక్షణలో ఉండాలని చెప్పి, మా జనకులు మమ్ము కార్యానికి నియోగించినారు. ఇదివరలో అనార్యుడూ, శ్వేత జాతీయుడూ అయిన అలెక్సాండరు దండయాత్రను పాంచాల ప్రభువు పురుషోత్తముడు నిలపగలిగాడు. గుప్త సామ్రాజ్యం పటిష్టంగా ఉన్నంతవరకూ ఎవరూ కన్నెత్తి చూడలేక పోయినారు. ఆపైన వాయవ్య దిశ నుండి శకుల దండయాత్రలు ప్రారంభమైనాయి.’’

‘‘తమ పాలనలో భరతభూమి సురక్షితంగా ఉండగలదని మా విశ్వాసం’’.

‘‘పరమేశ్వరుని కృప, తథాగతుని ఆశీర్వాదాలే ముఖ్యం’’.

పాటలీపుత్రాన్ని ఏలుతున్న పురుగుప్తుడు ఎక్కువ ప్రతిఘటించకుండా, నామమాత్ర యుద్ధం చేసి లొంగిపోయాడు. పురుగుప్తునికి ముందుగా గుప్త సామ్రాజ్యాన్ని ఏలిన స్కంధగుప్తుడు శ్వేతహూణుల దండయాత్రలను నిలువరించగలిగాడు. ఏ వంశాని కైనా వృద్ధి క్షయాలుంటాయి కాబోలు ననుకుంటూ, విక్రమాదిత్యుడు ముందుకు సాగి, అంగ, వంగ, కామరూపం రాజ్యాలను జయించి, నేపాల సరిహద్దులలో సేనను నిలిపాడు.

****

నేపాల రాజ్యంలోని రాజసభలో విక్రమాదిత్యుని ఎదుర్కొనే విషయమై మంత్రి, దండ నాయకులతో కూర్చిన సమావేశాన్ని రాజా మానదేవుడు ప్రారంభి చాడు. ‘‘ఉజ్జయిని నుంచి విక్రముని దండయాత్ర మొదలయిన నాటి నుండి చారులు ఎప్పటికప్పుడు విషయాలను తెలియపరుస్తూనే ఉన్నారు. ఇదివరలో ఏ పాలకుడూ అతనిని ఎదిరించి నిలబడిన వార్త తెలియరాలేదు. నేడు అతడు మన రాజ్యం పొలిమేర లకు చేరవచ్చినట్లు తెలిసింది. తదుపరి కార్యక్రమం విషయమై మీ సూచనలను నిర్భయంగా చెప్ప వచ్చును’’ అన్నాడు.

సింహాసనం మీద ఉన్న రాజును చూసిన వారికి ఆశ్చర్యం కలుగక తప్పదు. పదునాలుగేళ్ల పసి బాలుడాతడు. తండ్రి పరలోకగతుడు కాగా, తల్లి సహగమనం చేసింది. చిన్న వయసులోనే రాజ్య పాలనా బాధ్యతను స్వీకరించక తప్పలేదు. దేశంలోని కుట్రలొక ప్రక్కన కుంగ తీస్తుండగానే, శత్రువు దండెత్తి వచ్చాడు.

‘‘మగధ చక్రవర్తులే నిలబడలేకపోయినారు’’ అని ఒక మంత్రి అన్నాడు.

‘‘చక్రవర్తి అన్న పదమెందుకు? స్కంధగుప్తుల తర్వాత మగధ సామ్రాజ్యమెక్కడ ఉన్నది? మిగిలినది పాటలీపుత్ర పరిసర ప్రాంతాలే’’ అని వేరొక మంత్రి అన్నాడు.

‘‘నేపాల సైన్యం ఏ దాడినైనా ఎదుర్కొనగలదు’’ అని సేనాపతి అన్నాడు.

‘‘నేపాలమును ఆక్రమించగల వారెవరూ లేరు. శకులు భరతభూమి అంతటా దండయాత్ర జరిపారు. కానీ నేపాలం వైపు కన్నెత్తి చూడలేదు’’.

‘‘విక్రముడు శకులను పారద్రోలినాడని వింటిమి కదా’’.

వాదోపవాదాలు ముగిసిన తర్వాత మానదేవుడు, ‘‘సేనను సమాయత్తపరచవలసినదిగా సైన్యాధ్యక్షు లను ఆదేశించడమైనది. మేమే స్వయంగా సేనను నడపగలం’’ అని చెప్పి సభను ముగించాడు.

****

ఉజ్జయినీ సైన్యమూ, నేపాల సేనా ఎదురెదురుగా నిలబడి ఉన్నాయి. యద్ధారంభానికి సూచనగా తమ రాజులు శంఖనాదం చేయగానే శస్త్రయోగం చేయటానికై వీరులందరూ సిద్ధంగా ఉన్నారు.

ఆ సమయంలో మానదేవుడు శంఖాన్ని పూరించకుండా, విల్లెక్కుపెట్టి విక్రముని వైపు బాణం వదిలాడు. అందరూ ముందుగా ఆశ్చర్యపడినారు. ఆపైన ఉలికి పడినారు. తమ నాయకుని కాపాడే ప్రయత్నంలో అంగరక్షకులు విక్రముని ముందుకు వచ్చారు.

ఇదేమి వింత? ధర్మయుద్ధమన్న మాటను మాన దేవుడు మరచినాడా, లేక ఆ చిన్నవాడికి యుద్ధనీతి తెలియదా?

అందరకూ అచ్చెరవు కొలుపుతూ బాణం విక్రముని పాదాల చెంత పడింది. అశ్వాన్ని అధి రోహించి, మానదేవుడు నెమ్మదిగా నడచివచ్చి విక్రమాదిత్యునితో ‘‘మీ కన్నా వయస్సులో, విద్యలో చిన్నవాడను. మీ ఆశీర్వచనాలు అనుగ్రహించమని ప్రార్ధిస్తున్నాను’’ అని అన్నాడు.

ఉజ్జయినీ మహారాజులో అతనికే అవగతం కాని సోదర వాత్సల్యం పొంగి పొరలింది.

‘‘విజయ పరంపర నీదగును గాక. నేపాల మెన్నటికీ అజేయంగా నిల్చును గాక’’

‘‘నేపాలమును మీ రాజ్యంగానే భావించి నాతో రావలసినది’’ అని మానదేవుడు అతిథి మర్యాద సూచకంగా అర్ఘ్య పాద్యములిచ్చి గౌరవించినాడు.

‘‘సోదరా, ఇప్పుడు రావడం సాధ్యం కాదు. భరత భూమినంతటినీ ఏక ఖండంగా నిలుపవలసిన పని ఉంది. ఆపైన రాగలం’’.

‘‘నా సేన తమ వెంట రాగలదు’’.

‘‘వలదు.. నీ అంత: శత్రువులను జయించ వలసిన కార్యంలో నిమగ్నుడివై ఉండు. శకులను నిర్మూలించే సమయానికి నీ సేనను మా వద్దకు పంపవచ్చును.

‘‘అనుగ్రహీతుణ్ణి’’

విక్రమాదిత్యుడు మానదేవుని కౌగిలించుకుని, ముందుకు సాగాడు. నేపాల రాజ్యం పరహస్తగతం కానందుకు ప్రజలు పండుగ జరుపుకున్నారు.

****

వారణాసిలో, పాటలీపుత్రంలో ఖగోళశాస్త్ర విశేషాంశములనూ, ఇతర అనుబంధ విషయాలనూ నేర్చుకున్న మిహిరుడు అవంతీ నగరానికి తిరిగివచ్చి మాతాపితరులక• ప్రణమిల్లాడు. తాను పఠించిన వాటిని తండ్రికి తెలియచెప్పి, పండితులతో తాను జరిపిన చర్చలను వివరించాడు.

‘‘పూర్వ శాస్త్ర గ్రంథాలలోని అనేక విషయాలను మనమీనాడు అంగీకరించకపోవచ్చును. కానీ ఆ విషయాలు తప్పు అని కానీ, గ్రంథ రచయితలం దరూ అపండితులని కానీ అనరాదు కదా! ఆ విషయమై వాదోపవాదాలు జరిగినవి’’.

‘‘వితండవాదం వైపునకు నీ మార్గం పోలేదు కదా!’’ అని ఆదిత్యదాసు ప్రశ్నించాడు.

‘‘లేదు… నా అభిప్రాయం తెలియజేసినాను. వారి వాదాలు విన్నాను.’’

‘‘భవిష్యత్తులో నీవు శాస్త్ర విషయాలను గ్రంథస్థం చేసినప్పుడు కూడా ఈ మార్గాన్నే అవలంబించెదవు గాక’’.

మిహిరుడు ఆశ్చర్యంతో, ‘‘నేను గ్రంథ రచన చేయడమా?’’ అన్నాడు.

ఆదిత్యదాసు సమాధానం చెప్పడానికి ముందే ఛాయాదేవి, ‘‘కావ్య రచన కన్నా ముందు కన్యాన్వేషణ జరుపవలసి ఉంది’’ అన్నది.

మిహిరునికి తల్లి మాటలు అర్థం కాలేదు. ఆమె వివరణాత్మకంగా ‘‘నా మేనకోడలి వివాహమైపో యింది. ఒక శిల్పాచార్యునితో ఆమె వివాహం నా సోదరుడు జరిపించినాడు. జ్యోతిశ్శాస్త్రవేత్తలకు ధనార్జనకు అవకాశం లేదు. ధనవంతునితోనే తన కుమార్తె సుఖపడగలదని నా అన్నగారు నమ్మినాడు’’ అన్నది.

శాస్త్ర విజ్ఞానం కన్న ధనం గొప్పదా? భోగాలు శాశ్వతాలా? లేక కీర్తి శాశ్వతమా?

మిహిరుని మనసులోని సందేహాలతో సంబంధం లేనట్లుగా అతని తల్లి ‘‘నా సోదరుడు వరులకై ప్రయత్నిస్తున్నాడని తెలిసిన వెంటనే నేను నా మేన కోడలిని అడిగాను. ఆమె తండ్రి ఆజ్ఞను మీరజాల నన్నది. చిన్ననాటి నుంచీ అందరమూ అనుకున్న బంధాన్ని ఆమె ప్రేమబంధంగా మార్చుకోగల దలనుకున్నాను’’.

ఛాయాదేవికి మేనకోడలు తన కోడలు కాలేదన్న దుఃఖం చాలా ఉన్నట్లున్నది. ఆదిత్యదాసు ‘‘బ్రహ్మ రాసినదానిని ఎవరూ తప్పించలేరు. మిహిరా, అనేకులు తమ పుత్రికలకై నీ హస్తాన్ని కోరుతూ వార్తలను పంపుతున్నారు. వారిలో నీకు నచ్చిన కన్యనే నీవు వివాహం చేసుకోవచ్చును’’ అన్నాడు.

తనకు వివాహమా? వివాహః విద్యానాశాయ అన్నది ఆర్యోక్తి. తనకింకను శాస్త్ర విజ్ఞానం సంపా దించాలనే ఉంది. యవన, పారశీక దేశాల విద్య నేర్చుకోవాలి. వివాహానంతరం దేశ పర్యటన సాధ్యమయ్యేనా?

‘‘నాకు కొంత వ్యవధి నీయవలసినదిగా ప్రార్ధన.’’

‘‘అలాగే కానీ. ఈ వంశ పరంపర నిలబెట్టడం, గురుకుల నిర్వహణ నీ కర్తవ్యాలని మరచిపోకు’’ అని ఆదిత్యదాసు అన్నాడు.

****

విక్రమాదిత్యుడు ఇందప్రస్థ నగరానికి అనతి దూరంలో సేనను నిలిపి, కోట వెలుపల ఉన్న యోగ మాయా మందిరానికి ఒంటరిగా బయలుదేరినాడు. రాజోచితమైన ఆభరణాలూ, చీనాంబరాలు వదిలి పెట్టి సాధారణ వస్త్రాలతో గుడిలోకి వెళ్లాడు. అమ్మ వారికి నమస్కరించాడు. ‘‘తల్లీ, ఏనాడైతే శ్రీమన్నా రాయణుడు దేవకీదేవి గర్భాన ఉదయించాడో ఆనాడే నీవు యశోద శిశువుగా జన్మించి, కంసుని హెచ్చరిం చావు. సమస్త మానవాళికీ కనులకు కనబడేది మిధ్య అని తెలియజెప్పావు. అయినప్పటికీ నీ మాయలోనే మేము పడిపోతున్నాం. సర్వమూ మాయ అని తెలిసినప్పటికీ క్షత్రియ ధర్మంగా భరత ఖండమంత టినీ ఏకచ్ఛత్రంగా చేయవలెనన్న కర్తవ్య దీక్షలో ఉన్నాను. నన్ను అనుగ్రహించు!’’ అని ప్రార్థించి, ఆలయం వెలుపలకు వచ్చి, అక్కడ ఉన్న తోటలో అశోక వృక్షం క్రింద ఆసీనుడైనాడు. ప్రక్కనే ఉన్న పారిజాతవృక్షం కొమ్మ ఒకటి అతడు కూర్చున్న వైపునకు విస్తరించి ఉన్నది. దూరాన సైనికులు మహారాజు రక్షణకై నిలబడి ఉన్నారు.

‘‘రాజధర్మమెంత క్లిష్టమైనది. నిరంతరం యుద్ధా లలో, న్యాయస్థాపనలో, ధర్మరక్షణలో, ప్రజాపాలనలో నిమగ్నమైపోవాలి. ఎవరినీ నమ్మకుండా, ఎవరితోనూ ఏ అనుబంధమూ పెంచుకోకుండా ఉండే జీవితంలో సుఖమేమున్నది..’’ సరిగ్గా అక్కడే విక్రముని ఆలోచన ఆగిపోయింది. ఆ సుఖమున్నదా అని ప్రశ్నించుకునే సమయంలో తన మిత్రుడు మిహిరుని శ్లోకం గుర్తు వచ్చింది. ఆలయ ప్రాంగణంలో ఉన్నప్పటికీ భక్తిరసం వెనుకపట్టింది. యుద్ధం త్వరలో ఆరంభం కానున్న ప్పటికీ వీరరసం ముందుకు రాలేదు. తనకే తెలియ కుండా విక్రమాదిత్యుడు శృంగార రస ప్రధానమైన పాటను రచించి, పాడసాగినాడు. గానం పూర్తిచేసిన మరుక్షణమే అతని పాదాల దగ్గర అశోక పుష్పాలు పడినాయి. శిరస్సుపై పారిజాత కుసుమాల వర్షం కురిసింది. ఆశ్చర్యంగా తల పైకెత్తిన అతనికి చెట్లు కొమ్మలకు బాణాలు తగిలి, కొమ్మలు ఊగి, పూలు రాలడం కనిపించింది. విలుకాడు ఎవరూ కనిపించ లేదు.

‘‘ఎవరీ ధనుర్విద్యా నిపుణుడు? శబ్దభేది తెలియ కుండా మా గానం విని బాణాలు వేయలేడు. అందునా కొమ్మలకు తగిలి అవి ఊగే విధంగా బాణ వేగాన్ని నియంత్రించడం సాధారణ ధనుష్కులకు సాధ్యమయ్యే పని కాదు. ఎవరై ఉండవచ్చును.’’

విక్రమాదిత్యుని ఊహా ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ ఒక యువకుడక్కడకు వచ్చి నమస్కరించి, ‘‘మీ గాన విద్య నన్ను ఆనందాంబుధిలో ముంచి వేసింది’’ అన్నాడు.

By editor

Twitter
Instagram