సమీక్ష : వి.ఆర్వీ

కొన్ని ప్రచ్ఛన్న విచ్ఛిన్న శక్తులు; జాతీయ, అంతర్జాతీయ, స్థాయిలో చేస్తున్న భారత వ్యతిరేక ప్రచారాలకు సూటిగా జవాబు చెప్పడానికి, అసత్యాలను ఎండగట్టి, సత్యం ప్రపంచానికి తెలిసేలా రచయిత భమిడిపల్లి సుబ్రహ్మణ్య శర్మ చేసిన అవిరళ కృషిని ఈ గ్రంథం ఆవిష్కరిస్తున్నది. ఈ గ్రంథం ఒక పరిశోధనాత్మక ప్రబంధం. సనాతన ధర్మాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి, సమకాలీన అధర్మమార్గాలకు ‘మంగళం’ పాడేలా రచయిత దీనిని తీర్చిదిద్దారు. పలు భాషల నుంచి ప్రమాణాలను సేకరించి ఉత్తమ విజ్ఞాన సంహితను (మాగ్‌నమ్‌ ఓపస్‌గా) రూపొందించారు. ఈ భారతీయ జాతీయ, చారిత్రక, భౌగోళిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక నిఘంటు వును తాతగారైన జటావల్లభుల పురుషోత్తంగారికి, అధ్వయానంద శంకర భారతీ స్వామి వారికి అంకితం చేశారు. స్ఫూర్తి, విజయం, సాధన, సత్యం అనే చతుర్విధ వ్యూహాలతో సనాతన ధర్మానికి కొత్త ఊపిరి పోశారు. ‘‘ఇది చారిత్రక అవసరం’’ అంటారు ఆచార్య ముదిగొండ శివస్రాద్‌.

అసలు సత్యం ఏమిటంటే… ‘ఆర్యుల దండయాత్ర’ అసత్యం. సింధు నాగరికత అతి ప్రాచీనమైనది అన్నది నిర్వివాదాంశం. బ్రిటిషు ప్రభుత్వం తన అధికారాన్ని చలాయించడానికి, దేశాన్ని ‘విభజించి- పాలించ’డానికి. ‘అబ్రహామిక్‌’ ‌మతాలను పైకి తేవడానికి, అసలు నిజాలను కప్పిపుచ్చడానికి, శాయశక్తులా ప్రయత్నించడం వాస్తవం. ‘జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే’ అన్న వేదమంత్రం, ‘ఆ సింధో సింధు పర్యంతాం’’ అన్న స్మృతి వాక్యం తిరుగులేనివి. జరదస్త్ర మహర్షి వంశీయులే దక్షిణంగా వెళ్లి పరస్థానీయులై, ‘పర్షియన్లు’గా వేరు కుంపటి అంటించారు. పారశీకంలో స ‘హ’గా పలుకుతుంది. అలా ‘సింధు’ ‘హిందు’ అయింది. ఛందోభ్యస్త (వేదం) జండా వెస్తగా మారింది. ‘అగ్నిమిళే పురోహితం’ అనే తొలి రుగ్వేదమంత్రం-హిందూ ధర్మం ముందంజ వేసిందని చెబుతున్నది అగ్నిసాక్షిగా. పరస్థానీయులకు ఆగ్ని ఆరాధ్య దేవతగా నిలిచింది. ‘ఛ’ ‘జ’గా మారింది. శర్మగారు ‘ఎ టు జడ్‌’ అని (మాట వరుసకు) రాసినా, ఆయన సాధన, శోధనలు ‘అ’నుంచి ‘అం- అః’ దాకా విస్తరించి మస్తకాలకు పదునుపెట్టాయి.

ఎందరో మహాత్ముల త్యాగఫలంగా భారత దేశానికి స్వాతంత్య్రం (15.8.1947) లభించింది. రాజకీయ లబ్ధి కోసం నెహ్రూ వారసత్వం దేశాన్ని రెండుగా చీల్చి, మత ప్రాతిపదికన 75 సంవత్సరాలు కొలువు తీరింది, ‘నాది క్రైస్తవ విద్య, ముస్లిం మతం, హిందువుగా పుట్టడం ఒక ప్రమాదం’ అని నెహ్రూ స్వయంగా చెప్పడం మిక్కిలి శోచనీయం. బ్రిటిషు బంటు ప్రధానమంత్రినని, చివరి వాడినని చెప్పడం కడుంగడు శోచనీయం! ఆంగ్లేయులు వెళ్లినా ఆంగ్ల మానసపుత్రులు చరిత్రను వక్రీకరించి, ఛిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. తుక్‌డే గ్యాంగు ‘జోడో భారత్‌’ అం‌టూ పరుగులు తీయడం వృథా ప్రయాస అని తేలుస్తూ త్వరలో రానున్న ప్రజాతీర్పు కోసం ఎదురు చూడక తప్పదు. అపస్మారక స్థితి నుంచి మేలుకోకపోతే ‘మార్క్సిస్ట్ ‌మదరసా’లు విద్యారంగాన్ని కైవసం చేసుకుని దేశ భవితతోపాటు యువతరం భవిష్యత్తునూ దెబ్బతీయగలవు. ఇది ఒక భయంకరమైన కుట్ర.

 ఇరవై ఆరు అధ్యాయాల గ్రంథాన్ని శర్మగారు ఆర్యుల దండయాత్రతో మొదలుపెట్టి, భారత్‌ను విజ్ఞాన శిఖర దీపంగా నిలబెట్టారు. చివర్లో ఆర్యులు భారతీయులు, వర్ణాశ్రమ ధర్మాలు గుణాత్మకమైన ప్రగతి రథాలు; కుల, మత, ప్రాంతీయ విభేదాలు కేవలం కల్పితాలని నిరూపించారు. ‘ఆర్య’ శబ్దం గౌరవ వాచకం తప్ప జాతి వాచకం కాదని కుండబద్ధలు కొట్టేశారు. అధర్మం, అన్యాయం, అనార్య లక్షణాలని ‘అపకీర్తికరం’ అని శ్రీకృష్ణ పరమాత్మ నరుడి ద్వారా నరజాతి సమస్తానికి గీతోపదేశం చేశాడు. మూలాలను నరికి, వలస పొలాలు పండించారు ఆంగ్లేయులు. దేశద్రోహులు – అంభి, జయచంద్రుల్లా శత్రువులలో చేతులు కలుపుతూనే ఉన్నారు ‘కృణ్వంతో విశ్వమార్యం’ అన్న వేదవాక్యం (రు.9-63-5) ‘భారత్‌ ‌విశ్వగురువు’ అన్న సత్యానికి చిరునామా లాంటిది. గోమాత వ్యవసాయానికి, సంస్కృతం ప్రపంచ భాషలకు, మాతృకలు అంటారు శర్మగారు. ‘ఏకం సత్‌ ‌విప్రా బహుదావదంతి’, సర్వేజనా స్సుఖినోభవంతు’, ‘వసుధైక కుటుంబం’ లాంటి మహా వాక్యాలు ‘భారత చరిత, చరిత్రకు అందనిద’ని రుజువు చేస్తున్నాయి. మనుస్మృతి, అర్థశాస్త్రం, విద్యార్థులకు పాఠ్య గ్రంథాలు కావాలని, ఆయుర్వేదంతో పాటు ఆచార వ్యవహారాలలోని ఆరోగ్యసూత్రాలు సామాన్యులకు అందుబాటులో ఉండాలని, బట్టలు కట్టుకోనివాళ్లు భారతీయ వస్త్రధారణను విమర్శించడానికి అర్హులు కారని, మెకాలే, మ్యాక్స్ ‌ముల్లర్లు దేశానికి తీరని అపకారం చేశారని శర్మగారు ఎలుగెత్తి చాటడం సమంజసమే! ‘మితభుక్‌, ‌హితభుక్‌’ అం‌టూ శాకాహారానికి పెద్దపీట వేసి, బలమైన ఏనుగును, చూపి ‘గజేంద్రమోక్షం’ గుర్తుకు రప్పించి, యోగం సర్వరోగ నివారిణి అని, న్యాయం గ్రామ పంచాయతీల ద్వారా అందరికి ‘‘వితరణ’’ ముంగిటకు చేరిందని, మాధవవర్మ లాంటి రాజులు తమ కొడుకులు దోషులైనప్పుడు మరణ శిక్ష విధించారని, స్త్రీకి అన్ని దశల్లో అండదండలు ఉండాలని మనుచక్రవర్తి చెప్పడాన్ని లింగ వివక్షగా చిత్రించారని, ఎన్నెన్నో నూతన అంశాలను సేకరించి గ్రంథస్థం చేయడం ఆషామాషీ కాదు. యజ్ఞయాగాలు, భారత రామాయణాది ఇతిహాసాలు, భాగవతాది పురాణాలు, జ్యోతిష్యం, గురుకుల వ్యవస్థ వెరసి ఒక జ్ఞాన, విజ్ఞాన భాండాగారాన్ని శర్మగారు శ్రమపడి అందించారు. వారి శ్రమ వృథా కాకుండా పఠన, పాఠనాలు, ఉపన్యాసాల ద్వారా, తదితర ఉద్యమ మాధ్యమాల ద్వారా విజ్ఞానం సామాన్య ప్రజలకు అందజేయవలసిన బాధ్యత అందరిదీ!

సత్యపథం

(అసత్యాలు – అసలు నిజాలు)

రచన : బి.ఎస్‌.‌శర్మ

పేజీలు: 312, వెల: రూ.200/-

ఋషిపీఠం ప్రచురణ

ప్రతులకు: ఫోన్‌ 040-27132350

About Author

By editor

Twitter
Instagram