వరాహమిహిర – 4

– పాలంకి సత్య

విక్రముడా వీరుని వంకా పరీక్షగా చూశాడు. వయస్సు పదహారేళ్లకు మించి ఉండదు. ఇంకా మీసాలు కూడా వచ్చినట్లు లేదు. బాలిక గొంతులా ఉంది. ఎవరైనా గాని, తన గానం నచ్చిందని చెప్పినందుకు సమాధానం చెప్పాలి.

‘‘నా గానం మిమ్మల్ని అలరించినందుకు ఆనందంగా ఉంది’’.

‘‘ఆనందంతో పాటు సంశయం కూడా కలిగింది’’.

ఎందుకో మరి, విక్రముడికి ఆ యువకుని మాటలు ఆహ్లాదకరంగా అనిపిస్తున్నాయి.

‘‘సంశయమెందుకు?’’

‘‘దేవాలయ ప్రాంగణాలలో శృంగారగీతాలు పాడవచ్చునా?’’

‘‘ఆలయంలో ఆయుధ ప్రయోగం చేయవచ్చునా?’’

యువకుడు సమాధానం చెప్పలేక తబ్బిబ్బైనట్లనిపించినట్లుగా కన్పించడంతో విక్రముడు చిరునవ్వు నవ్వాడు.

‘‘నేను ఎవరి మీదా ఆయుధాన్ని ప్రయోగించలేదు’’.

‘‘నేను ఎవరినీ ఉద్దేశించి పాడలేదు.’’

యువకుని ముఖంలో కొంత నిరాశ, కొంత నిరుత్సాహం కనిపించాయి. విక్రముడు ‘‘మాటలకు ముందు పరిచయ వాక్యాలు చెప్పుకొనడం సంప్రదాయం. ఆ ధర్మ మిద్దరమూ మరచినాము. నేను మధ్య భారతవాసిని. నా నామధేయం ప్రతాప భాస్కరుడు.’’

‘‘నేను వాయవ్య ప్రాంతం నుండి మా మాతామహుల వద్దకు వచ్చాను. ప్రస్తుతం ఇందప్రస్థ నగరంలో తాతల ఇంట ఉన్నాను. నా పేరు వీరసేన…నుడు’’.

‘‘వీరసేననుడా’’?

ఆ యువకుడు మరింత కలవరపడి, తలను తిప్పుటలో ఒత్తైన జుట్టు తలపాగా నుండి విడివడి పిరుదల దాకా జారింది.

‘‘నా పేరు వీరసేనుడు. నేను పురుషుడనే. ఎందుకో జుట్టు చాలా పొడవుగా పెరిగినది. సెలవు’’ అంటూ పరిగెత్తి వెళ్లిపోతున్న వ్యక్తి వైపు చూస్తూ ఉండిపోయిన విక్రమాదిత్యలో మధుర భావనలు పొంగిపోయాయి. రెండు క్షణాలకే అతడు వాటిని నిలువరించుకుని, దూరాన ఉన్న రక్షకులకు సైగ చేసి, తన స్కంధా వారం వైపు నడక సాగించాడు.

****

ఇందప్రస్థం మీద విజయం సాధించిన విక్రముడు తన సేనకు కొంత విశ్రాంతి ఇవ్వాలన్న సంకల్పంతో యుద్ధయాత్రను నిలిపి, ఉజ్జయినీ చేరుకున్నాడు. దిగ్విజయుడై తిరిగి వచ్చిన తమ మహారాజుపై పౌరులు పూలవాన కురిపించారు.

నిత్య, నైమిత్తిక కర్మలను చాలాసార్లు యథావిధిగా నిర్వహించలేక పోయినందుకు ప్రాయశ్చిత్త హోమ, జపాలు సలిపిన అనంతరం విక్రముడు తన తల్లిదండ్రులను దర్శించుకునేందుకు ఆశ్రమానికి వెళ్లాడు.

సాష్టాంగ ప్రణామములాచరించిన కుమారుని ఆశీర్వదించిన తర్వాత గంధర్వ సేనుడు ‘‘పుత్రా! నీ విజయం మమ్ము ఆనందింపజేసింది. పశ్చిమ, దక్షిణ దిశలలో సైతం నీ యుద్ధయాత్ర సఫలమగును గాక. యుధిష్టిరుని వలెనే నీవును అశ్వమేధం నిర్వహిస్తే బాగుండునని మా ఊహ. మగధ చక్రవర్తులలో పుష్యమిత్ర శుంగుడు, సముద్రగుప్తుడు అశ్వమేధ యజ్ఞాలు చేసినట్లు తెలియవస్తున్నది. యాగ నిర్వహణ ధర్మపత్నీ సమేతంగానే చేయాలి!’’ అన్నాడు.

విక్రమునిలో ప్రేమ తరంగాలు కదిలాయి.

‘‘పిత్రాజ్ఞను శిరసావహించేందుకు ప్రయత్నం చేయగలను’’ అని విక్రముడు తల్లిదండ్రులకు ఇంకొకసారి నమస్కరించి, సెలవు తీసుకున్నాడు.

****

గ్రంథపఠనం చేస్తున్న మిహిరుని వద్దకు రాజభటుడు వచ్చి, ‘‘మహా ప్రభువు రాజ కార్యార్ధమై విదిశా రాజ్యానికి పయనమవుతున్నారు. తమను వారితో రమ్మనమని కోరుతున్నారు’’ అన్నాడు.

‘నేను ఈ సాయంత్రమే మహారాజులను దర్శించుకోగలనని విన్నవించ’మని రాజభటుని పంపివేసిన మిహిరుడు తల్లిదండ్రులతో విషయం చెప్పాడు. వారి అంగీకారంతో విక్రమాదిత్యుని ప్రాసాదానికి వెళ్లి తన రాకను మహారాజుకు తెలియజేయమన్నాడు. రాజు అనుమతిపై లోనికి వెళ్లిన మిహిరుడు ‘‘రాజ కార్య నిర్వహణలో ప్రభువులకు నేనేవిధమైన సేవనూ అందించలేను. నా రాక మీకు ఉపయోగకరం కానేరదు’’ అన్నాడు.

‘‘మిత్రమా! ఏకాంతంగా ఉన్నప్పుడు నేను ప్రభువును కానని ఇదివరలో తెలియజేసినట్లు గుర్తు. నిన్ను రమ్మన్న కారణం వేరే ఉన్నది. శుక్రవారం

ఉదయమే మన ప్రయాణం.’’ ‘‘చిత్తం ప్రభూ!’’ అనబోయిన మిహిరుడు ఒక్క క్షణమాగి, ‘‘సఖుడా, అట్లే!’’ అన్నాడు.

****

విదిశలో పని పూర్తయిన తర్వాత మిహిర, విక్రమాదిత్యలు ఉదయగిరి గుహాలయాలలోని విష్ణు దర్శనానికై వెళ్లారు. పూజ తర్వాత ఆలయ ప్రాంగణంలో కూర్చున్న విక్రముడు ‘‘విష్ణు పదమనే పేరు గల ఈ కొండ మీది కోవెలను చంద్రగుప్తుడు నిర్మించి, ధ్వజం ప్రతిష్టించినాడు. ఇనుముతో తయారైన ఈ స్తంభం రెండు వందల సంవత్సరాలు గడచినప్పటికీ తుప్పు పట్టక పోవడం ఆశ్చర్యం కదా!’’ అన్నాడు.(ఈ ఇనప స్తంభం ఇప్పటికీ ఢిల్లీలో కుతుబ్‌మినార్‌ ‌ముందు ఉంది.)

మిహిరుడు ఉత్సాహపూరితమైన కంఠంతో, ‘‘ఇంకొక రెండు వేల సంవత్స రాలు గడచినా స్తంభం తుప్పు పట్టదు. లోహాన్ని కరిగించే సమయంలో సున్నం కొంచెమైనా వాడరాదు. అగ్నిని రగిల్చేందుకు ఉపయోగించే కర్రలలో భాస్వరం ఎక్కువగా ఉండడమూ ముఖ్యమే. ఈ ప్రాంతపు లోహ కర్మకారులు తంగేడు చెట్లను కొట్టి, స్వయంగా ఎండబెట్టి…. ’’ అంటూ ప్రసంగించసాగాడు. కొంతసేప టికి విక్రముని పెదవులపై సన్నని చిరునవ్వు గమనించి ఆగిపోయిన మిహిరునితో మహారాజు, ‘‘మిత్రమా, కొన్ని సంవత్సరాల తర్వాత కలుసుకున్న మనం శాస్త్ర విషయలా మాట్లాడు కొనవలసినవి?’’ అన్నాడు.

మిహిరుడు ఏమీ మాట్లాడలేదు.

‘‘వ్యాస భగవానులు, కృష్ణార్జునులు ఇద్దరే ఉన్నప్పుడు ఏమి మాట్లాడుకున్నారో రాశారు కదా. విక్రాంతని రతానిచ. తాము సాధించిన విజయములూ, తమ ప్రేమ ముచ్చటలూ….’’

‘‘క్షంతవ్యుడను. నీ దిగ్విజయ యాత్రా విశేషాలు అడగనే లేదు. తూర్పు దిక్కుగా ప్రారంభమైన నీ యుద్ధ పరంపరను తెలియజేయ కోరుతున్నాను.

విక్రముడు తాను ఏయే రాజ్యాలను జయించినాడో వివరిస్తూ, ‘‘నేపాల రాజ్యంలో వింత జరిగింది. పదునాలుగేండ్ల బాలుడయిన నేపాల రాజు నమస్కార బాణం వేసినాడు. అది సంధి ప్రయత్నమా, లొంగి పోవడమా అన్న ఊహ మనసులోకి ప్రవేశించకముందే అతడు నా ఆశీర్వాదం కోరినాడు. నాకు అతనిపై సోదర వాత్సల్యం కలిగింది’’ అన్నాడు.

మిహిరుడు, ‘‘శ్రీరామచంద్రుడు అవతార సమాప్తి చేసే సమయంలో లవ, కుశులనే కాక తన ముగ్గురు సోదరుల కుమారులనూ రాజ్యాభిషిక్తు లను చేసినాడు. లక్ష్మణ కుమారులైన అంగద, చంద్రుకేతులు నేపాల ప్రభువులైనారు. లక్ష్మణేయులన్న మాట కాలక్రమంలో లిచ్ఛవిగా మారింది. శ్రీరాముడికి లక్ష్మణునిపై సోదర వాత్సల్యమున్నట్లే నీకును లిచ్ఛవీ రాజపుత్రునిపై కలిగి ఉంటుంది’’ అన్నాడు.

నేను శ్రీరామచంద్రునితో ఏనాటికీ పోల్చదగినంత గొప్పవాడను కాను అన్న భావాన్ని ధ్వనింపచేస్తూ విక్రముడు ఆలయం వైపు తిరిగి హరినామ స్మరణ చేసి, నమస్కరించి తన యుద్ధ విశేషాలు తిరిగి చెప్పసాగాడు.

‘‘ఇంద్ర ప్రస్థనగరం మీద దండు వెడలే ముందు కోట వెలుపలనున్న యోగ మాయాదేవిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో కూర్చున్న నా నోట ఎందుకో శృంగార రసపూరితమైన పాట వెలువడింది. ఒక యువకుడు నా వద్దకు వచ్చి గానం తనకు రంజింపచేసిందని అన్నాడు.

విక్రమాదిత్యుడు ఆగిపోయినాడు. మిహిరుడు ‘‘నీవు చక్కగా పాడగలవు. నీ పాట విని ఆనందింపని వారుండరు’’ అన్నాడు. ‘‘నా దగ్గరకి రావడానికి ముందు బాణాలు వేసి, వృక్షశాఖలను ఊగించి, నాపైన పూలజల్లు కురిపించి నాడు. ఎవరీ ధనుర్విద్యా నిపుణుడనుకునే లోగానే నా ఎదుట సుందరమూర్తి ప్రత్యక్షమైనది. కిన్నెర కంఠం, దీర్ఘ శిరోజ సంపద… స్త్రీయే అనిపించినది.’’

‘‘ధానుష్కుడంటివి కదా! ’’

‘‘అవును… ఇంద్ర ప్రస్థమును ముట్టడించినప్పుడు శత్రుసేనను పరిశీలనగా గమనించాను. ఆ యువకుడు కనిపించలేదు.’’

‘‘ఇందప్రస్థ వాసి కాకపోవచ్చును.’’

‘‘నిజమే… మాతామహుల ఇంటికి వచ్చినట్లు ఆమె చెప్పినది.’’

‘‘ఆమెయా? లేక అతడా?’’

‘‘స్త్రీయేనని నా మనసుకనిపిస్తున్నది. మా తండ్రిగారు నన్ను అశ్వమేధ యాగం చేయమనీ, యాగకర్తకు ధర్మపత్ని ప్రక్కన ఉండవలెననీ అన్నారు. ధర్మాచరణకే కానీ వలపు పండించుకోవడానికి కాదా వివాహం చేసుకోవడం?’’

మిహిరుడు విక్రమాదిత్యుని చేతిని తన చేతిలో ఉంచుకుని, రేఖలను పరిశీలించి, ‘‘త్వరలోనే నీకు పరిణయమవుతుంది’’ అన్నాడు.

‘‘నా మనసును హరించిన పడతితోనేనా?’’

‘‘ఆ విషయంను హస్త సాముద్రిక శాస్త్రం సూచిం చలేదు. విక్రమా! ఇంత బేలతనమేల? శత్రువుల నుండి అఖిల శస్త్రాలనూ ఎదుర్కొని నిలిచిన నీవు మన్మథ బాణాలకు పడిపో తగునా? వయసులో నీకన్నా చిన్నవాడను. నీకు చెప్పే అర్హత నాకు లేదు.’’

విక్రముడు లేచి నిలబడి ‘‘నీవన్నది నిజం. భరత ఖండ రక్షణకే, ధర్మ పరిరక్షణకే నా జీవితం అంకిత మగును గాక’’ అని ఆలయ శిఖరానికి నమస్కరించి నడవసాగాడు. కొంత నడిచిన తర్వాత అతడు ‘‘మిహిరా, నేను యుద్ధరంగం నుండి తిరిగి వచ్చునప్పటికి, నీ వివాహం జరిగి ఉండునని అనుకున్నాను’’ అన్నాడు.

‘‘మా మేనమామ తన పుత్రిక పద్మలతను ఒక శిల్పాచార్యునికిచ్చి, వివాహం జరిపించినాడు’’.

‘‘ఏల? నీవు ధనవంతుడవు కావనా?’’

‘‘అది మాత్రమే కారణం కానేరదు. నిరంతర శాస్త్ర ప్రసంగం చేసే వానిని ఏ కన్య భర్తగా కోరుకుం టుంది? శస్త్ర, శాస్త్రములకే మన ఇద్దరి జీవితాలు అంకితమగునుగాక.’’

విక్రమాదిత్యుడు మిహిరుని చుట్టూ చేయి వేసి, నడవసాగాడు.

****

ఉజ్జయినికి తిరుగు ప్రయాణంలో స్నేహితులిరు వురూ తమతమ ఆలోచనలలో మునిగిపోయి, మౌనం వహించారు. విక్రమాదిత్యుని కనుల ముందర విష్ణుధ్వజం కదలాడుతున్నది. ‘‘ఏనాటికీ తుప్పు పట్టని ఇనుమును సృష్టించిన కర్మకారులను ప్రోత్సహించడం, కళాభివృద్ధి పాలకుల ధర్మం. మగధ చక్రవర్తి చంద్రగుప్తుడు ఆ విధిని చక్కగా నిర్వర్తించి నాడు. కవిరాజ బిరుదాంకితుడు, వీణా వాదనలో మేటి సముద్రగుప్తుని కన్న, చంద్రగుప్తుని తర్వాత రాజ్యమేలిన కుమారగుప్త, స్కంధగప్తుల కన్న తనకు చంద్రగుప్తుని పైననే గౌరవమేల? విక్రమాదిత్య బిరు దాంకితుడనా? తన నామమే ఆయన బిరుదమగు టయే కారణమేమో! ఏమైనానేమి, ఆయన వలెనే వృత్తి విద్యలనూ, కళలనూ పోషించడం తన కర్తవ్యం. అంతకుమించి ధర్మ సంరక్షణ ముఖ్యం. యుద్ధ సమ యంలో సైతం నీతి తప్పరాదు. ప్రజల ప్రాణరక్షణ, స్త్రీల మానరక్షణ పాలకులకు విహితము. నా మనసు ఎన్నటికీ ధర్మం పైననే నిలుచును గాక. అజ్ఞాత సుందరి నా తలపులలోకి రాకుండుగాక’’ అని అను కుని విక్రముడు భగవన్నామస్మరణలో మునిగిపోయాడు.

‘‘శాస్త్రానికీ, శాస్త్ర అధ్యయనానికీ నా జీవిత మంకితం కావాలని చెప్పినాను. కానీ తల్లితండ్రులు నన్ను వివాహం చేసుకొమ్మనీ, లేకున్న వంశపరంపర నిలిచిపోగలదనీ హెచ్చరిస్తున్నారు. నా కర్తవ్యమే మిటి? ఖగోళశాస్త్ర విజ్ఞానాన్ని అన్ని ప్రాంతాల నుంచి నుండీ సంగ్రహించి, నలుదిక్కులా జ్ఞానసంపదను పంచాలని ఉన్నది. జ్ఞానదీపాన్ని వెలిగించి, మనసుకు దారి చూపించే సూర్యదేవుడే నన్ను నడిపించును గాక’ అని మిహిరుడు రవిని ప్రార్థించసాగాడు.

****

విధి విలాసం విచిత్రమైనది. సృష్టి రహస్యం అగమ్యగోచరమైనది. భరతఖండ రక్షణకై, సనాతన ధర్మ పరిరక్షణకై విక్రమాదిత్యుడు ఉదయించిన సంవత్సరంలోనే రోమ్‌ ‌సామ్రాజ్య విస్తరణకై, నియం తృత్వ పాలన స్థాపనకై జూలియస్‌ ‌సీజర్‌ ‌జన్మించాడు. సీజర్‌ ‌వంశంలో నామకరణం వింతగా ఉండేది. పుట్టిన ప్రతి మగబిడ్డకూ జూలియస్‌ ‌సీజర్‌ అని పేరు. ప్రతి ఆడపిల్లకూ జూలియా అని పేరు.

పదునాలుగేండ్లు వయసులో పాఠశాలలో విద్యను అభ్యసించి వస్తున్న పుత్రుడు జూలియస్‌ ‌సీజర్‌ను చూసి తండ్రి జూలియస్‌ ‌సీజర్‌ ఆనాడు నేర్చుకున్న చదువు విషయమై ప్రశ్నించాడు. రోమ్‌ ‌నగరస్థాపన గురించి నేర్చుకున్నానని కుమారుడు సమాధానమిచ్చాడు.

‘‘ఏమేమి చదివినావో తెలియజేయమ’’ని తండ్రి అడిగాడు.

‘‘ఆల్బాలోంగా రాజైనా న్యూమిటర్‌ ‌కుమార్తె రియాసిల్పియా. ఆమెకు యుద్ధ దేవత మార్స్ అనుగ్రహం చేత రీమస్‌, ‌రోములస్‌ అనే కవలపిల్లలు కలిగారు. రాజు ఆమ్యూలియస్‌ ‌వారిని నదిలో పడవేయించాడు. వారు దైవానుగ్రహంచేత ఒడ్డుకు చేరుకోగా ఒక ఆడ తోడేలు వారిని సాకింది. ఆపైన ఒక గొర్రెల కాపరి వారిని పోషించాడు. వారు నిర్మించిన నగరమే రోమ్‌. ‌నగర నిర్మాణమైనాక తానే అధికారం చేజిక్కించుకునే ఉద్దేశంతో రోములస్‌ ‌తన కవల సోదరుడైన రీమస్‌ని చంపి, తానే రాజుగా పరిపాలించాడు. నగరానికి తన పేరే నిలిపాడు.’’

‘‘ఇంతేనా మీ గురువు నేర్పినది? ఆమ్యూలియన్‌ ‌కవలలను ఎందుకు చంపవలెననుకున్నాడు? ఆల్బా లోంగాను ఎవరు నిర్మించారు? సీజర్‌ ‌వంశంతో ఆ నగరానికి ఉన్న సంబంధమేమిటి? ఆల్బోలోంగా రాజు న్యూమిటర్‌ అని ఒకసారీ, ఆమ్యూలియస్‌ అని మరొకసారీ చెప్పినావేమి?’’

కుమారుడు తానా విషయాలు నేర్చు కోలేద న్నాడు. ‘‘నిన్ను పాఠశాలకి పంపించడం దండుగ. అయినా, ఉపాధ్యాయునకు ఏమైనా తెలిస్తే కదా నీకు బోధించడానికి! నా వద్దనే విద్యనభ్యసించు! లోనికి పోయి, భుజించి రా!’’

గురునింద చేయరాదన్న ఊహ తండ్రి కొడుకు లిద్దరకూ రానేలేదు.

భోజనానంతరం తండ్రి కుమారునకు రోమ్‌ ‌నగర స్థాపనకు కారణమైన విషయాలన్నీ వివరంగా చెప్పసాగినాడు. ఒక వారంలో జూలియస్‌ ‌సీజర్‌కు రోమ్‌ ‌నగర చరిత్రా, తమ వంశపు గొప్పతనం, రోమ్‌ ‌పాలకులు సాధించిన విజయ పరంపర సంపూర్ణంగా అవగతమైనాయి.

భువనైక సుందరి అయిన హెలెన్‌ ‌స్పార్టా నగర ప్రభువు భార్య. ఆమెను ట్రాయ్‌ ‌నగర రాజకుమారుడు పారిస్‌ అపహరించుకొని పోయినాడు. ఆమెను విడి పించుకునే ప్రయత్నంలో గ్రీకులు ట్రాయ్‌ ‌నగరాన్ని సర్వనాశనం చేశారు. ట్రాయ్‌ ‌పట్టణంలో హతశేషులు స్త్రీలతో సహా ఓడలలోకి ఎక్కి, అష్టకష్టాల పాలై, మధ్యధరా సముద్ర తీరంలోని ఒక చిన్న పట్టణం చేరుకున్నారు. వారి నాయకుడైన ఎయినీస్‌ ఆ ‌పట్టణ రాజకుమారి లావినియాను వివాహం చేసుకున్నాడు. వారి తనయుడు ఆస్కానియస్‌ ఆల్బాలోంగా నగరాన్ని నిర్మించి, పరిపాలించాడు. ఆ రాజ వంశంలో కొన్ని తరాలు గడచిన తర్వాత ప్రోకాస్‌ అనే రాజుకు న్యూమిటర్‌, అమ్యూలియస్‌ అని పేర్లు కల కుమా రులు కలిగారు. పెద్దవాడైన న్యూమిటర్‌ ‌సింహాసన మదిష్టించినాడు. కానీ చిన్నవాడు అమ్యూలియస్‌ అతనిని బంధించి రాజయినాడు. న్యూమిటర్‌ ‌కుమా ర్తెను బలవంతంగా దేవీ పూజ నిర్వహించే కన్యలలో ఒకతెగా మార్చివేసినాడు. ఆమెకు యుద్దదేవత మార్స్ అనుగ్రహంతో జన్మించిన కవలలే రోములస్‌, ‌రీమస్‌. ‌వారు నిర్మించిన నగరమే రోమ్‌.

(‌సశేషం)

About Author

By editor

Twitter
Instagram