‘దేశం స్వేచ్ఛగా ఉన్నప్పుడే మేలైన చరిత్రను రాసుకోగలం!’ అంటాడు వోల్టేర్‌. ‌నిజమే, స్వతంత్ర దేశమే తనదైన చరిత్రను రాసుకోగలుగుతుంది. కానీ శృం•లాల మధ్య ఉన్నప్పుడూ, స్వాతంత్య్రం పొందిన తరువాత కూడా భారతదేశం మేలైన చరిత్ర రచనకు నోచుకోలేదు. మొదటి కారణం- స్వేచ్ఛ లేనప్పుడు వలస పాలకులు చరిత్రను రుద్దడం. రెండో కారణం-స్వతంత్ర దేశ చరిత్రకారులలో అధికులు ఆంగ్లేయ మనస్తత్త్వం వీడకపోవడం. మనదైన గతాన్ని సరైన రీతిలో మథించ లేకపోవడం ఈ పురాతన దేశ చరిత్ర రచనకు పట్టిన ప్రారబ్ధం. ‘ఆర్యులు’ అన్న అంశం మొదలు, ‘ఆగస్ట్ 15’ ‌వరకు వివాదాలే. వీటి పునర్‌ ‌మూల్యాంకన అవసరం. వలసదేశంగా సరే, స్వతంత్ర దేశంలోను చరిత్ర రచనలో నిజాయితీ లేదని రూఢి అయిన తరువాత మనదైన చరిత్ర రచన మీద దృష్టి అనివార్యం. మొదట సరిచేసుకోవలసిన తప్పిదాలలో ఇదొకటి. ఆ ప్రయత్నంలో భాగమే, ‘సంక్షిప్త భారతదేశ చరిత్ర- సంస్కృతి (వేదకాలం నుంచి 1947 వరకు)’ ఉద్గ్రంథం. ఇతిహాస సంకలన సమితి (భారతీయ) తెలంగాణ శాఖ ప్రచురించిన ఈ పుస్తక రచయిత ఆచార్య ఎస్‌వి శేషగిరిరావు.

ఐదు భాగాలలో భారత చరిత్రను పరిచయం చేసిన పుస్తకమిది. చారిత్రక ఘట్టాల వర్గీకరణ ఇప్పటి చరిత్ర గ్రంథాలు, పాఠ్యపుస్తకాలకు దగ్గరగానే ఉంది. మార్పు ఒక్కటే-చరిత్రను ఆచార్య శేషగిరిరావు చూసిన విధానం. ‘ఏదో భావజాలానికీ, సైద్ధాంతిక మౌఢ్యానికీ ఈ గ్రంథం బందీ కాదు’ అని చెప్పారాయన. కొందరు చేసిన తప్పిదం తాను చేయబోవడం లేదని అలా చెప్పారు. ఎందుకంటే, ఆక్స్‌ఫర్డ్ ‌వక్రదృష్టితో, మార్క్సిస్టు రంగటద్దాలతో చరిత్ర తనదైన తాత్త్వికతను కోల్పోయిన పరిస్థితిలో ఉంది. ముఖ్యంగా భారతదేశ చరిత్ర. చరిత్రను వాస్తవాలతో ఆవిష్కరిస్తే అది నేటి తరాలనూ దేశాన్ని గౌరవించేటట్టు చేస్తుంది.

భారతీయత అనే మూలసూత్రాన్ని బలిపీఠం ఎక్కించే కుట్రను ఖండించేందుకు ఆరంభం నుంచి గట్టి యత్నం చేశారు రచయిత. ‘ఇండియా అనే దేశమే లేదు. యూరోపియను భావజాలం ప్రకారం ఇండియాలో భౌగోళిక, రాజకీయ ఏకత అనేది లేనేలేదు’ అంటాడు జాన్‌ ‌స్ట్రాచీ (1823-1907). మరి, క్రీస్తుశకం 1600లో ఆవిర్భవించిన ఈస్టిండియా కంపెనీలో ఆ ‘ఇండియా’ అన్న పేరు ఎక్కడ నుంచి వచ్చింది అన్నది రచయిత ప్రశ్న. స్వాతంత్య్రం రావడానికి ముందు ఆక్రమిత కశ్మీర్‌ ‌భారత్‌ ‌లోనిదేనన్న భౌగోళిక వాస్తవాన్ని సైతం మరచిన వారిని మొదటి అధ్యాయంలోని తొలి అంశం ‘ఏది భారతదేశం?’ విస్మయ పరుస్తుంది. నిజానికి ఆర్యావర్తం, లేదా భారతభూమి కాలక్రమంలో, విదేశీ దండయాత్రల ఫలితంగా ఐదారు పర్యాయాలు చీలి, ఇప్పటికి ఈ ముక్క మిగిలింది. తరువాతి చర్చ ‘ఆర్యులు’. ఈ అంశంపై జరిపిన రాద్ధాంతం ‘చరిత్రలోని ప్రతి పేజీని కళంకితం చేసింది’. ఆ వివాదం చదువుతుంటే, ఈహెచ్‌ ‌కార్‌ (ఆక్స్‌ఫర్డ్) ‌మాట గుర్తుకు వస్తుంది. చరిత్ర అంటే వర్తమానంతో గతం జరిపే నిరంతర సంభాషణ అంటాడాయన. కానీ, ఆ జాతి చరిత్ర కారులే సంభాషణను సంఘర్షణగా మార్చేశారను కోవలసివస్తుంది. ఈ నేపథ్యంలోనే వలసపాలక చరిత్రకారుల గుట్టును రట్టు చేసే పని శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం తీసుకుంది. మరుగున పడిన (పెట్టిన) మహోన్నత వాస్తవాల మీద వెలుగు ప్రసరించింది. ఆ వాస్తవాలతో చరిత్రకారులు అనివార్యంగా అభిప్రాయాలను మార్చుకొని వాస్తవాలకు కాస్తయినా దగ్గరగా రాక తప్పలేదు. ఇస్రో, నాసా వంటి సంస్థలు సరస్వతీ నది పురాణ కల్పన కాదన్న నిజాన్ని బహిర్గతం చేశాయి. ఆర్యులు బయటి నుంచి వచ్చిన దురాక్రమణదారులు కాదన్న నిజానికి చాలా ఆధారాలు దొరికాయి. మహాభారత యుద్ధకాం మీద ఒక అభిప్రాయానికి వచ్చేటట్టు చేశాయి. అంతిమంగా చరిత్ర జననానికి సంబంధించిన పురిటినొప్పులు పురాణాలలో వినవచ్చునని తేలింది. మగధరాజ్యం, ఆవిర్భావం, విస్తరణ వంటివన్నీ చరిత్రకారులు అంగీకరించేవే. కానీ ఆ రాజ్యాన్ని విస్తరించిన శిశునాగుడి ప్రస్తావన వాయుపురాణంలో ఉంది. అలాగే ఇంకొన్ని ఉదాహరణలు కూడా. నాడు రాజ్యం, పరిపాలన, కుటుంబం, యుక్త వయసు వివాహాలు, కుటుంబ వ్యవస్థ ఆ కాలంలో సరైన పంథాలో నడిచాయి.

వక్రీకరణలకు సమాధానం ఇస్తూ, వాస్తవాలను ముందుకు తెచ్చే పుస్తకమిది. ‘జైనమతమంటూ ఒక ప్రత్యేక మతమేమీ లేదు. హిందూ సమాజాన్ని చీల్చడానికి బ్రిటిష్‌ ‌పాలకులు పన్నిన కుట్రలో అదొక (ఆ కల్పన) భాగం’ (పే.69) అని కరాఖండీగా చెప్పారు రచయిత. ఎలా? వారి ధార్మిక గ్రంథాల పేర్లు ఆగమాలు (వేదాలు). శ్వేతాంబర జైనులు బ్రహ్మ, అంబిక, సరస్వతి, లక్ష్మి వంటి దేవతలను పూజిస్తారు. ‘జైన హిందూ సమాజాలు ఒకదానికొకటి దూరంగా ఎన్నడూ లేవు. వారి మధ్య వైవాహిక సంబంధాలు వుంటూనే వున్నాయి. సాంస్కృతికంగా ఎలాంటి అంతరాలు లేవు. ఎన్నో హిందూ దేవాలయాల్లో తీర్థంకరుల (జైన గురువులు) విగ్రహాలున్నాయి. బాదామి గుహలు, ఖజురహో వంటి ఎన్నో దేవాలయ సముదాయాలు ఉభయులకు సంబంధించినవే’ (పే.71). బుద్ధుడు ‘వేదాలకు పూర్తిగా వ్యతిరేకి కాదు’ (పే.74). ధర్మం, ధర్మం మీద వచ్చిన భిన్నాభిప్రాయాలు, పరిపాలనా వ్యవస్థ, కుటుంబం వ్యవస్థలలో సారూప్యం ఉన్నప్పటికీ ఈ దేశంలో ఏకత లేదని తేల్చడమంటే కుట్ర కాక మరేమవుతుంది? సంస్కృతం తెలియని వారు, అందులోని పదాలకు సరైన అర్ధం తెలియనివారు భారతీయతను విశ్లేషించే, వ్యాఖ్యానించే దుస్సాహ సానికి పాల్పడిన ఫలితమే ఇదంతా. హిందూ జీవన విధానాన్ని నడిపించినదీ, నడిపిస్తున్నదీ ఆధ్యాత్మిక చింతన. భారత్‌ అన్న శరీరానికి ఆత్మ ఆధ్యాత్మిక చింతన. ఇందులోని వైవిధ్యమే భారతీయతకు ప్రత్యేకతను తెచ్చింది. చార్వాకాన్ని కూడా అర్ధం చేసుకునే ప్రయత్నం జరిగింది. కానీ సెక్యులరిజం పేరుతో, పురోగామి భావాల పేరుతో ఆధ్యాత్మికతకు తాత్త్వికతను అందించిన సమస్త వాఙ్మయాన్ని చరిత్ర నుంచి వేరుచేశారు. ఇందులో దురుద్దేశాలు చూడకుండా ఉండలేం. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలే కాదు, ఆది శంకరులు సహా ఆచార్యత్రయం, ఆళ్వార్లు, నాయనార్లు వంటి వారి బోధనలన్ని చరిత్రతో సంబంధం లేనివేనన్న ధోరణిని ప్రదర్శించారు. కానీ ఈ పుస్తకం వాటి అవసరం, సామాజిక, సాంస్కృతి ప్రస్థానంలో వాటి ప్రాధాన్యం ఏమిటో విశ్లేషించింది. వీటినే పునాదులుగా చేసుకుని వికసించిన కళలు, సాహిత్యం గురించి కూడా పరిచయం ఉంది. ఇది చదివాక సంస్కృతానికీ, భారత్‌కీ ఉన్న బంధాన్ని ఆవిష్కరించడం తక్షణావసర మన్న అభిప్రాయం పాఠకులకు వస్తుంది.

భారత్‌ ‌మీద దండయాత్రలు, అందులో నాటి హిందూ రాజుల వైఫల్యం ఒక వాస్తవం. కానీ దురాక్రమణదారులకి చిన్న ప్రతిఘటనైనా ఎదురు కాలేదా? ఈ అంశాన్ని అన్వేషించిందీ పుస్తకం. పర్షియన్‌, ‌గ్రీక్‌ ‌దండయాత్రలు, మౌర్య సామ్రాజ్యం, శాతవాహన శకం, గుప్త సామ్రాజ్యం, ఆయా కాలాలలో జరిగిన పరిణామాలు, చింతన, విజయ నగర సామ్రాజ్యం, పోర్చుగీస్‌, ‌మొగలులు, మరాఠా చరిత్ర వంటి భారత చరిత్రలోని అన్ని ప్రధాన ఘట్టాలను ఆ కోణం నుంచి చర్చించారు రచయిత. పురాతన చరిత్రను వక్రీకరించే పని కొందరు చేస్తే, ఆధునిక చరిత్రకు వక్రభాష్యం ఇచ్చే పని కూడా ఇబ్బడిముబ్బడిగానే జరిగింది. 1192 నాటి రెండో స్థానేశ్వర్‌ ‌యుద్ధం భారతదేశాన్ని ఇస్లామ్‌ ‌నియంతృ త్వానికీ, 1757 ప్లాసీ యుద్ధం ఆంగ్ల నిరంకుశత్వానికీ కారణమయ్యాయి. రెండింటిలో విజేతలు విదేశీయులే. విదేశీయులు గెలవడం కొత్త కాదు. కానీ వీరెవరికీ అసలు ప్రతిఘటనే లేదు అన్నంతగా ‘విజేతల చరిత్ర’ కనిపిస్తుంది. ఈ వక్రదృష్టిని రచయిత గుర్తించి, జాతీయ భావాలకు ఈ దేశంలో ఆది నుంచి ఉన్న గౌరవాన్ని వెలికి తెచ్చారు.

ఇవాళ్టి రాజకీయాలే రేపటి చరిత్ర అంటారు. కానీ ఇవాళ్టి రాజకీయాల కోసం నిన్నటి చరిత్రని దగా చేస్తే ఏమనాలి? అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను నిర్మించడం వల్ల జరిగిన నష్టం- ఈ దేశ విభజన వెనుక వాస్తవాల దారుణ వక్రీకరణ. ఇంకా, స్వరాజ్య సమరంలో కొందరి త్యాగాలకే విలువ వచ్చింది. ఎందరో చేసిన రక్తతర్పణలకు గౌరవం దక్కలేదు. ముస్లింలలో సహజంగా ఉన్న పాలకవర్గ భావన స్థానంలో కల్పిత హిందూ మెజారిటేరియన్‌ ‌భావనను నిలబెట్టడం ఆధునిక చరిత్రలో ఇంకొక వికృతి. హిందువులు ఎప్పటికీ పాలితులనీ, తాము ఎప్పటికీ పాలకులమనీ భావిస్తూ ముస్లింలు మెజారిటీ వర్గంతో సయోధ్యకు నిరాకరించిన చారిత్రక వాస్తవం వక్రీకరణకు గురైందంటారు గ్రంథకర్త. కాంగ్రెస్‌ ‌పార్టీ బుజ్జగింపు రాజకీయాల దృష్టికోణం నుంచి చూడడం వల్ల వహాబీ ఉద్యమం, బెంగాల్‌ ‌విభజనకు బీజాలు, ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాల అసలు ఆశయం, ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తి కోరిక నిజరూపం; అంతిమంగా 1947 నాటి భారత విభజనలోని విభ్రాంతికర సత్యాలు ప్రజల ముందుకు రాలేకపోయాయి. 1857 నాటి సిపాయిల పోరాటాన్ని నమోదు చేయడం దగ్గర నుంచి ఈ వక్రీకరణ ఉంది. ఆ పోరు విస్తృత మద్దతు సాధించలేకపోవడానికి మొగల్‌ ‌వంశ అవశేషం బహదుర్‌ ‌షా జఫర్‌ను నాయకునిగా ప్రకటించడమే నని రచయిత అంచనా. దీనిని కాదనలేం. మొగల్‌ ‌పాలన అంతానికి ప్రజలు ఎదురుచూస్తుండగా, జఫర్‌ను దేశనేతగా ప్రకటించడం ఉద్యమకారుల తప్పిదం కాగా, ఆ వెల్లువలోనూ జఫార్‌ ‌సరైన నాయకత్వం అందించలేకపోవడం ఇంకో తప్పిదమని అంటారు రచయిత. ఒక విదేశీ (మొగల్‌) ‌పాలన నుంచి ఇంకో విదేశీ పాలన(బ్రిటిష్‌)‌లోకి వెళుతున్నాం, అంతే అన్న భావన తప్ప ప్రజానీకంలో మరొక అభిప్రాయం లేదని రుజువులతో చెబుతుందీ పుస్తకం. ఆ ఉద్యమ నాయకత్వం, వైఫల్యాల మాట ఎలా ఉన్నా, 1857 నాటి హింస గురించి ఇందులో చదివినప్పుడు అపారమైన దుఃఖం కలుగుతుంది. చరిత్రలో చోటు కల్పించక తప్పని కొందరు మహనీయుల గురించి ఇందులో ఉంది. ‘చంద్ర గుప్తుని తరువాత అంతటి మహోన్నత చారిత్రక పురుషుడు శివాజీ’ (పే. 376) అంటారు రచయిత.

 ఖిలాఫత్‌ ఉద్యమం పేరుతో అంతర్జాతీయంగా ముస్లిం ఆధిపత్యాన్ని నిలిపి ఉంచడానికి భారత దేశంలో జరిగిన ప్రయోగాలు ఎక్కడికి దారితీశాయి? టర్కీలో ఉండే ఖలీఫాను తిరిగి పీఠం మీద కూర్చో బెట్టడమే ఖిలాఫత్‌ ఉద్యమ నినాదం (ఇతడిని మొదటి ప్రపంచ యుద్ధంలో ఇంగ్లండ్‌ ఓడించింది). ఖిలాఫత్‌ ‌విషయంలో విజయం సాధించే వరకు స్వరాజ్య సమస్యను కూడా వాయిదా వేయడానికి సిద్ధమని గాంధీజీ ప్రకటించడం విశేషం. కానీ ఖిలాఫత్‌ ఉద్యమం ముస్లిం వేర్పాటు ధోరణికి కొత్త కోరలు మొలిపించగలదన్న వాస్తవిక అంచనాకు కాంగ్రెస్‌ ‌రాలేకపోయిందని రచయిత ఆరోపణ. ఈ ఉద్యమం ప్రదర్శించిన మతోన్మాదం గురించి వందలాది ఆధారాలు ఉన్నాయి. అయినా దానికి స్వాతంత్య్ర సమరంలో చోటు కల్పించడమే వింత. మత ప్రాతిపదికన దేశం విడిపోయి, హిందూ భారత్‌, ‌ముస్లిం పాకిస్తాన్‌ ‌పేరుతో ఆవిర్భవించినా అందులోని మతోన్మాద కోణాన్ని మైనారిటీల మనసులు గాయపడరాదన్న వాదనతో మరుగుపరచడం పెద్ద దగా. దీనిని వివరించడానికి రచయిత చాలా శ్రమించారు.

 జాతీయ కాంగ్రెస్‌లోని అభిప్రాయభేదాల గురించి, చీలికల గురించి, పరిణామాల గురించి ఇందులో మనకి పరిచయమవుతుంది. కానీ జాతీయ కాంగ్రెస్‌ ‌కంటే ముందే ఆంగ్ల పాలన మీద నిరసనతోనే ప్రారంభమైన గిరిజనోద్యమాలు, రైతాంగ పోరాటాల గురించి(అల్లూరి మన్య పోరాటం తప్ప) రచయిత చెప్పలేదు. స్థలాభావం సమస్యే అయినా, వాటికీ స్థానం ఇచ్చి ఉంటే ఈ పుస్తకానికి మరింత విలువ వచ్చి ఉండేది. స్వాతంత్య్ర భారత సమరంలోని అన్ని పంథాలను, అన్ని ఘట్టాలను కూడా రచయిత పరిచయం చేశారు. కానీ గాంధీ ఉద్యమం కోసం ప్రత్యేక అధ్యాయమంటూ కేటాయించలేదు. దేశ విభజన, సెరెల్‌ ‌ర్యాడిక్లిఫ్‌ ‌పాత్ర, ముస్లిం లీగ్‌ ‌రక్తపాతం, అంతిమంగా విభజన గురించి చర్చించారు. ఇందులో ఎక్కువ సందర్భాలు భారతీయులను బలితీసు కున్నవే. ముఖ్యంగా హిందువులు. తరువాత కశ్మీర్‌ ‌సమస్య, జునాగఢ్‌, ‌హైదరాబాద్‌ ‌సంస్థానాల విలీనంతో వంటి కీలక ఘట్టాలతో ఈ పుస్తకం ముగిసింది.

ఇంత సుదీర్ఘ చరిత్రను 624 పేజీలలో సమగ్రంగా వివరించడం కష్టమే. చాలాచోట్ల కనిపించే క్లుప్తత అందుకే. 562 సంస్థానాలను భారత్‌లో విలీనం చేయడం, అందులో సర్దార్‌ ‌పటేల్‌, ‌వీపీ మేనన్‌ల పాత్ర మహోన్నత స్వరాజ్య సమరం ఆశయాన్ని పరిపూర్ణం చేశాయంటే సత్యదూరం కాదు. విభజన తరువాత భారత్‌కు మిగిలిన భూభాగంలో 46 శాతం విస్తరించి ఉన్న స్వదేశీ సంస్థానాలను లొంగదీయకుంటే భారత్‌ ‌సమగ్రత, సమైక్యత దేశం ఎదుట ఎప్పటికీ ప్రశ్నార్థకాలుగా మిగిలి ఉండేవి. ఆ పెనుముప్పు నుంచి ఈ దేశాన్నీ, ఈ జాతినీ కూడా బయటపడేసిన వారు ఆ ఇద్దరు. ఇలాంటి కీలక చారిత్రక పరిణామాల మీద ఆచార్య శేషగిరిరావు వంటి వారి అభిప్రాయాలు రావడం ప్రస్తుత అవసరం. ఈ పుస్తక రచన ఉద్దేశం కేవలం చరిత్రను అందించడమే కాదు. ఆ చరిత్రలోనే అంతర్వాహినిలా సాగే జాతీయ సమైక్యతా దృష్టిని ఆవిష్కరించడం. దానికి క్రమంగా పట్టిన గ్రహణం గురించి చర్చించడం కూడా. చివరన ఇచ్చిన ఫొటోలు, భౌగోళిక చిత్రపటాలు ఈ అంశాన్నే స్పష్టం చేస్తాయి. అయినా ఈ గ్రంథం సమగ్రమని రచయిత చెప్పడం లేదు. చరిత్రకు తుది వాక్యం లేనట్టే, ఏ చరిత్ర గ్రంథమూ అంతిమం కాలేదు.

ఈ పుస్తకంలోకి రాకుండా మిగిలిన కొన్ని అంశాలు- గిరిజన, రైతాంగ పోరాటాలు, సంస్థానాల సమస్య వంటివి వేరే సందర్భంలో అయినా చదివే అవకాశం వస్తుందని ఆశిద్దాం. అందుకు తగిన ఆరోగ్యం, శక్తి వారికి ఉండాలని కోరుకుందాం. ఈ పుస్తకం చదువుతుంటే, ‘నా దేశ చరిత్రను చదువుతుంటే ఒక మహామాతృమూర్తి నా చేయి పట్టుకు నడిపించినట్టు ఉంటుంది’ అన్న శేషేంద్ర కవితా వాక్యం గుర్తుకు వస్తుంది.

సంక్షిప్త భారతదేశ చరిత్ర – సంస్కృతి

(వేదకాలం నుంచి 1947 వరకు)

రచన : ఆచార్య ఎస్‌.‌వి. శేషగిరిరావు

పేజీలు: 688, వెల: రూ.600/-

ప్రచురణ : ఇతిహాస సంకలన సమితి

ప్రతులకు: సాహిత్యనికేతన్‌, 3-4-852

‌బర్కత్‌పురా, హైదరాబాద్‌

‌ఫోన్‌ : 040-2756 3236

About Author

By editor

Twitter
Instagram