న్యాయవ్యవస్థ ‘వలస’ వాసనలు వీడాలి- 3

– జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ ‌నజీర్‌, ‌సుప్రీంకోర్టు న్యాయమూర్తి

  1. సముద్రయానాలకు ప్రభుత్వం నడిపే నౌకలలో ప్రయాణికుల నుండి యాత్రా రుసుము వసూలు చేయాలి. అది ఎంతో నిర్ధారించే అధికారం నావాధ్యక్షునిది-అని అర్థశాస్త్రం చెప్పింది. హిందువులు నౌకలపై దూర దేశాలకు ప్రయాణించే వారనీ, దేశదేశాలతో సంబంధాలు కలిగి ఉండేవారనీ దీనిని బట్టి నిర్ధారణ అవుతున్నది.
  2. నూలు వడికి, వస్త్రాలు నేసే పని పెద్ద పరిశ్రమగా విలసిల్లింది. ఇది ప్రభుత్వరంగ, ప్రభుత్వేతర రంగ పోషణలో ఉండి విదేశాలకు వస్త్రాలను ఎగుమతి చేసేది. ఇది ప్రభుత్వరంగంలో సూత్రాధ్యక్షుని పర్యవేక్షణలో ఉండేది. అతని కింద చాలామంది అధికారులు ఉండేవారు. వీరి విధులేమిటో అర్థశాస్త్రం చెప్పింది. నూలు, రంగులు, తాళ్లు తయారుచేసేందుకు యోగ్యులను, నిపుణులను నియమించడం సూత్రాధ్యక్షుని బాధ్యత. స్త్రీలు ఇంటి నుంచే సేవలు అందించేవారు. దూది/ పత్తి అందిస్తే వారు రాట్నాలపై దారం తీసి-సేకరించడానికి వచ్చిన వ్యక్తికి అప్పగించేవారు. కొన్నిచోట్ల వారే స్వయంగా సేకరణ కేంద్రంలో అప్పగించేవారు. అలా వచ్చిన మహిళలతో అతిగా చనువు తీసికొని మాట్లాడటం గాని, వేతనం వెంటనే చెల్లించకుండా వేధించటం గాని – జరుగరాదని అర్థశాస్త్రం కఠిన నిబంధనలు విధించింది. అక్కడ ఉన్న ఉద్యోగి వచ్చిన స్త్రీల ముఖంలోకి తేరిపార చూసినా, (వారి పనితో సంబంధం లేని) మాటలలో దించడానికి యత్నించినా, అతనికి దండన ఉండేది. వేతనాల చెల్లింపులో జాప్యమూ దండనార్హమైనదే. ఒక స్త్రీ (కార్మికురాలు) పట్ల అనుచిత ఔదార్యం చూపటం కూడా నేరమే. ‘‘పనిచేయకపోయినా ఒక స్త్రీకి వేతనం చెల్లించినట్లయితే, అందుకు బాధ్యుడైన అధికారికి శిక్ష తప్పదు’’ అనే నిబంధన ఉండేది.
  3. వలస పాలకులు, నేటి వ్యవస్థా ప్రాచీన హిందూ దేశ న్యాయవ్యవస్థను విస్మరించిన తీరు
  4. న్యాయం అందించడంలో ఎంతో సంపన్న మైన సంప్రదాయం హిందూ దేశంలో విలసిల్లి నప్పటికీ, విదేశీయులు వచ్చి, భూభాగాలను ఆక్రమించిన సమయాలలో, వారి పాలనలో ఉన్న చోట్ల విదేశీయమైన, విజాతీయమైన వారి వారి న్యాయవ్యవస్థలను రుద్దారు. 1947లో స్వాతంత్య్రం సంపాదించుకొన్నప్పటికీ, మన న్యాయవ్యవస్థ మార్చలేదు. ఇది దురదృష్టకరం. నిజానికి హిందూ న్యాయవ్యవస్థలోని కొన్ని సంప్రదాయాలు ఆంగ్లేయుల పాలనాకాలంలోనూ అమలు చేశారు. కాని అత్యంత ప్రాచీన కాలం నుండి అమలు చేస్తున్న విధానాలను పరిగణనలోనికి తీసుకోకుండా, ఇక్కడ న్యాయాన్ని అందించే ఎలాంటి వ్యవస్థా లేదని బుకాయించి, వలస పాలకులు తాము కోరుకున్న రీతిలో మార్పులు తెచ్చారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడచినా, వలస పాలన నాటి న్యాయ వ్యవస్థనే కొనసాగించడం ఇంకా విషాదకరం.
  5. పాశ్చాత్య నమూనాలో సాగిపోతున్న నేటి వ్యవస్థలోనూ ప్రాచీన హిందూ న్యాయవ్యవస్థలోని కొన్ని పద్ధతులు కొనసాగుతున్నాయి. న్యాయవ్యవస్థ పాలనా వ్యవస్థతో సంబంధం లేకుండా స్వతంత్రంగా ఉండాలి అనేది వాటిలో ఒకటి. న్యాయమూర్తులు స్వతంత్రులై వ్యవహరించాలని, రాజుకుగాని, మరెవరికైనాగాని భయపడరాదని కాత్యాయనుడు, మరెందరో న్యాయశాస్త్ర ప్రదాతలు చెప్పారు.
  6. స్వాతంత్య్రం లభించిన తర్వాత న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండాలనే విధానాన్ని అనుసరిస్తున్నారు. ప్రపంచంలోని ఏ దేశపు న్యాయ స్థానాలతో పోల్చి చూసినా, మన సుప్రీం కోర్టు గతిశీలత, స్వతంత్ర ప్రతిపత్తితో వ్యవహరించే లక్షణం- మరే దేశ ప్రమాణాలకు తీసిపోయేది కాదని అర్థమౌతుంది. హైకోర్టుల లోనూ మొత్తం మీద సమున్నత ప్రమాణాలు ఉన్నాయనీ, న్యాయమూర్తులు కార్యనిర్వాహక వర్గంతో కుమ్మక్కయ్యే సందర్భాలు అరుదని, దాదాపుగా అవి గణించదగినవి కూడా కాదని చెప్పవచ్చు. ఈ సందర్భంలో సబార్టినేట్‌ ‌జ్యుడిషియరీ, అంటే మున్సిఫ్‌లు, సివిల్‌ ‌జడ్జీలు, జిల్లా జడ్జీల గురించి కూడా చెప్పుకోవాలి. విభిన్న సముదాయముల మధ్య వివాదాలను వారు నిష్పక్షపాతంగా పరిష్కరిస్తున్నారు. హిందువులకూ, బ్రిటిష్‌ ‌వారికీ మధ్య నడచిన వివాదాలలో బ్రిటిష్‌ ‌న్యాయమూర్తులు అలా నిష్పక్షపాతంగా వ్యవహ రించారని చెప్పలేం. న్యాయమూర్తి స్వార్థ ప్రయోజ నాల కోసమో, పాత వివాదాల ప్రభావంతోనో కాకుండా, చట్టం (శాస్త్రం) నిర్దేశించిన ప్రకారమే, నిర్ణయాలు తీసుకోవాలని బృహస్పతి చెప్పాడు.
  7. నేటి న్యాయవ్యవస్థలోని బలహీనత – వలస ప్రభావం నుంచి తప్పించవలసిన అవసరం
  8. ప్రాచీన హిందూ న్యాయవ్యవస్థ నుండి దూరమైన ఫలితంగా ఆధునిక భారత న్యాయవ్యవస్థ సైద్ధాంతిక వారసత్వం కోల్పోయింది.
  9. దీనితో మనకు సిద్ధాంతపరమైన పోషణ లభించడం లేదు. ప్రస్ఫుటంగా కాకపోయినా చరిత్రలోని ప్రముఖ న్యాయశాస్త్రవేత్తల ప్రభావం ప్రతి దేశంలో తప్పక ఉంటుంది. ప్రసిద్ధ అమెరికా న్యాయశాస్త్రవేత్త అలివర్‌ ‌వెస్‌డెల్‌ ‌హోమ్స్ ఇలా రాశాడు : ‘‘ఆ సమయంలో అవసరాలు, ఆనాడు చలామణీలో ఉండే నైతిక, రాజకీయ సిద్ధాంతాలు, ప్రజల ప్రవర్తన ఎలా ఉండాలో బోధించే సంస్థలు, ప్రకటితంగానో, అప్రకటితంగానో న్యాయమూర్తులలో ఉండే అంతర్గత పూర్వ నిశ్చయాలు (వీటిలో కొన్నింటిని వారు తమ సహచరులతో పంచుకొంటూ ఉండవచ్చు) ఇవన్నీ వ్యక్తుల ప్రవర్తనపై ప్రభావం చూపుతాయి. సహజ సిద్ధంగా ఉండే తర్కాన్ని మించి శాసిస్తాయి.’’ మరో అమెరికన్‌ ‌న్యాయమూర్తి బెంజమిన్‌ ‌కోర్డోజో, ‘తర్కం, చరిత్ర, ఆచారం, ఉప యోగిత, సత్ప్రవర్తన గురించి అందరూ అంగీకరించే స్థాయి-ఇవన్నీ చట్టాల రూపకల్పనలో పాత్ర వహిస్తాయి’ అన్నాడు.
  10. ప్రాథమిక హక్కులకు పరిమితులను నిర్ణయించే సమయంలో అది సహేతుకమా, కాదా అని నిర్ణయించడానికి పోతపోసి ఉంచిన ప్రమాణాలు ఏవీ లేవని భారత అత్యున్నత న్యాయస్థానం కూడా అభిప్రాయపడింది. ఆ కాలం నాటి పరిస్థితులు, ప్రజలు విశ్వసిస్తున్న సామాజిక సూత్రాలు, అనుసరించే విలువలు ప్రమాణాలు-వీటినన్నింటినీ దృష్టిలో ఉంచుకొనే-అది హేతుబద్ధమౌతుందా లేదా అని నిర్ధారించాలి. ప్రాచీన హిందూదేశంలో న్యాయమూర్తులు విద్యావంతులై (సకల శాస్త్రాలు తెలిసినవారై) ఉండటమేగాక న్యాయశాస్త్రంలో, పాలనా విధానాలలో నిపుణులై ఉండేవారు. (ధర్మశాస్త్రార్థ కుశలురుగా, అర్థశాస్త్ర విశారదులుగా ఉండేవారు). మరి ఇప్పటి స్థితి ఎలా ఉంది? ఎటువంటి న్యాయపరమైన, సాంఘిక, తాత్త్విక జ్ఞానాలు ఆధారంగా వారు శిక్షణ పొందుతున్నారు?
  11. ఇంగ్లండ్‌లో, పశ్చిమ యూరప్‌ ‌ఖండ దేశాలలో, అమెరికాలో-వారి నాగరికత తమకు ఎటువంటి న్యాయసూత్రాలను బోధిస్తున్నదో – వాటి నుండే వారు విద్యావంతులవుతున్నారు. ప్రేరణ పొందుతున్నారు. ఆ నాగరికత శతాబ్దాల మనుగడలో రూపుదిద్దుకొన్నదని గుర్తించాలి. రష్యాలో న్యాయ నిర్ణయం చేసే సమయంలో మార్క్సిజం ప్రభావం ఉంటుంది. మరి భారతీయ న్యాయమూర్తులు, న్యాయ వాదులు ఎక్కడి నుండి ప్రేరణ పొందుతున్నారు? తమదైన నాగరికత నేర్పిన న్యాయశాస్త్రం నుండైతే కాదు. అతడికి రోమన్‌ ‌న్యాయశాస్త్రం కొంత తెలిసి ఉంటుంది. పాశ్చాత్య న్యాయవేత్తల అభిప్రాయాలు కొన్ని తెలిసి ఉంటాయి. కాని తనదైన సంస్కృతీ నాగిరకతల మధ్య రూపుదిద్దుకొన్న న్యాయశాస్త్రంలో అతడికి తెలిసినది బహు స్వల్పం. మన విశ్వ విద్యాలయాలలో న్యాయశాస్త్ర విద్యార్థికి నేర్పే పాఠ్య ప్రణాళికలో మనదైన న్యాయశాస్త్ర చరిత్రగాని, ప్రాచీన హిందూదేశం న్యాయశాస్త్రం, అర్థశాస్త్రం వినియోగించుకున్న తీరు తెన్నులుగాని తెలియనే తెలియవు. పర్యవసానంగా మన న్యాయశాస్త్ర భవనం సరియైన పునాదులు లేకుండా నిర్మించి నదిగా ఉంది. మరో మాటలో చెప్పాలంటే, ఏవేవో దేశాలలో ఉన్న ఏవేవో కట్టడాలకు ఊతమిచ్చే పునాదులపై నిర్మించారు.
  12. ఒక ఉదాహరణ చూద్దాం – ప్రజా నిరసన నేరగాడికి విధించే ఒక విధమైన దండనేనంటాడు మనువు. సోవియెట్‌ ‌క్రిమినల్‌ ‌కోడ్‌లో దీనికి స్థానం కల్పించారు. కాని మన దేశంలో మెకాలే రూపొందించిన ఇండియన్‌ ‌పీనల్‌ ‌కోడ్‌లో దీనిని పూర్తిగా ఉపేక్షించారు. చాలా సందర్భాలలో మంచి ఫలితాల నీయగల ఒక విధానాన్ని వదిలివేశాం. హిందూ న్యాయశాస్త్రాల గురించి భారతీయులమైన మనకంటే రష్యన్‌ ‌న్యాయనిపుణులు ఎక్కువ శ్రద్ధ గలిగి ఉన్నారన్న మాట!
  13. న్యాయశాస్త్ర అధ్యయనంలో నేడున్నవి తక్కువ స్థాయి ప్రమాణాలు, సత్వరమే దృష్టి సారించవలసిన ఒక సమస్యను మనముందుంచు తున్నాయి. రాజ్యాంగ చట్టాన్నీ, ఇతర చట్టాలనూ వ్యాఖ్యానించే అధికారం అత్యున్నత న్యాయస్థానానికి, హైకోర్టులకు ఇచ్చారు. రాజ్యాంగ విరుద్ధంగా, పౌరుల ప్రాథమిక హక్కులకు భంగకరంగా ఉండే ఏదైనా చట్టాన్ని రద్దు చేయగల అధికారం వీటికి ఉన్నది. అత్యున్నత న్యాయస్థానం తన తీర్పు దారా ఒక చట్టం గురించి ప్రకటించినపుడు ఆ తీర్పు సారాంశాన్ని దేశవ్యాప్తంగా అందరూ అనుస రించాలి. అంతేకాదు, క్రింది న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుల మీద పునర్విచారణ కోరే సందర్భాలలోనూ అత్యున్నత న్యాయస్థానానికి ఉన్న అధికారాలు ప్రపంచంలోని చాలా దేశాల సమున్నత న్యాయ స్థానాలకు ఉన్న అధికారాలను మించినవి. అటువంటి సందర్భంలో ఆర్థిక ప్రగతికి విఘాతం కాని విధంగా మన రాజ్యాంగ సూత్రాలను, చట్టవిహితమైన పాలననూ సజావుగా నడిపించే బాధ్యత గల న్యాయమూర్తులు న్యాయశాస్త్రంలోనే గాక, సాంఘిక విజ్ఞానంలోనూ నిపుణులై, కోవిదులై ఉండాలి. సమయోచితంగా, సాంఘిక అవసరాల కనుగుణంగా న్యాయశాస్త్రాన్ని సమన్వయించగల కుశలురై ఉండాలి. కాగా, నేడు మన విశ్వ విద్యాలయాలలో, న్యాయ కళాశాలలలో విద్యాస్థాయి చాలా తక్కువగా ఉన్నది. తక్కువ స్థాయి విద్యతో తక్కువ స్థాయి న్యాయమూర్తులు, న్యాయవేత్తలే వస్తారు. భవిష్యత్తులో న్యాయమూర్తులుగా బాధ్యతలు చేపట్టనున్న విద్యార్థులలో ఉండాలని భావిస్తున్న స్థాయికి, కనబడుతున్న స్థాయికి మధ్య ఉన్న దూరాన్ని మనం పట్టించుకోకుండా వదిలివేయకూడదు. అది దేశాన్ని ఎటువంటి ప్రమాదానికి గురిచేస్తుందో కదా!
  14. పాశ్చాత్య తత్త్వశాస్త్రం, విజ్ఞానం నుండి మేలైన అంశాలను మన విశ్వవిద్యాలయాలు బోధించటం మంచిదేనని నేనూ భావిస్తున్నాను. అయితే భారతీయ (హిందూ) న్యాయశాస్త్రం, రాజనీతి శాస్త్రం ఏ మాత్రం బోధించకుండా వదిలి వేయటం మన న్యాయవాదుల, న్యాయ మూర్తుల విద్యను అసంపూర్ణంగా ఉంచుతుంది. దేశంలోని ప్రతి విశ్వవిద్యాలయం ‘బేచిలర్‌ ఆఫ్‌ ‌లా’ డిగ్రీ కోర్సులో భారతీయ (హిందూ) న్యాయశాస్త్రం (×అ•ఱ•అ జీబతీఱజూతీబ•వఅమీవ)ను అనివార్యమైన పాఠ్యాంశంగా చేయాలనీ, ఆ పునాదిపైనే విద్యార్థుల అధ్యయనం కొనసాగాలని ఒక నిర్ణయానికి వచ్చాను.
  15. హిందూ న్యాయశాస్త్రంలో పొందుపరిచిన విషయంలో కాలదోషం పట్టింది కొంత (చాలా) ఉందని నేను అంగీకరిస్తున్నాను. ఈ మాట అన్ని దేశాల/ సంస్కృతులకూ న్యాయశాస్త్రాలకూ వర్తిస్తుంది. గ్రీక్‌, ‌రోమన్‌ ‌న్యాయశాస్త్రాలు బానిస విధానంపై ఆధారపడి రూపుదిద్దుకొన్నవి. 17వ శతాబ్దం వరకు యూరప్‌ ‌రాజ్యాలన్నింటిలోను రాజును దైవాంశ సంభూతునిగా, ఏ తప్పూ చేయ నివానిగా భావించేవారు. హేతుబద్ధతను పరిశీలించే న్యాయ విభాగం చాలా సందర్భాలలో ‘క్రీస్తే దేవుడు’ అనే నమ్మకంతో ముడిపడి ఉన్నది. యూరప్‌ ‌ప్రజలకు ఉపాసనా స్వాతంత్య్రం లేదు. క్రీస్తు పట్ల నమ్మకం లేనివారుగా, మంత్రగత్తెలుగా, దయ్యాలతో మాట్లాడేవారుగా ఆరోపణలు ఎదుర్కొని; చెప్పుడు మాటలు, తప్పుడు సాక్ష్యాలతో సజీవ దహనమైన వారి సంఖ్య ఎంతో చెప్పడం కష్టం. ఇటువంటి అసంబద్ధతలు పశ్చిమ యూరప్‌ ‌న్యాయ విధానాలకు అపఖ్యాతి తెచ్చి పెట్టినాయి. అటువంటివి హిందూ న్యాయశాస్త్ర చరిత్రలో లేవు.
  16. హిందూ న్యాయవ్యవస్థలో లేనివీ, పాశ్చాత్య న్యాయవ్యవస్థలో కనిపించే అసమంజసతలకీ కొన్ని ఉదాహరణలు ఇవ్వాలని అనుకుంటున్నాను. కొన్ని జంతువులు, పక్షులు చేసిన నేరాలకు, తప్పులకు వాటినీ విచారించేవారు. 17వ శతాబ్దం వరకూ ఇటువంటివి యూరప్‌లో ఎన్నో! జర్మనీలో ‘కీటన్స్ ఎలిమెంట్స్ ఆఫ్‌ ‌జ్యూరిస్ప్రుడెన్స్’ ‌ప్రకారం ఒక కోడిని తెచ్చి బోనులో ఉంచారు. చెప్పిన మాట వినకుండా అది కూస్తున్నదని ఆరోపణ! ప్రతివాది తరఫు వకీలు దాని నిర్దోషిత్వాన్ని నిరూపించడంలో విఫలమై నందున ఆ కోడిపుంజును వధించాలని తీర్పు ఇచ్చారు. అదే మాదిరిగా పంటలను నాశనం చేస్తున్నాయన్న ఆరోపణతో కోంటెస్‌ అనుచోట గొంగళి పురుగులక• 1508లో శిక్ష వేశారు. 1545లో సెయింట్‌ ‌జీన్‌ ‌డిమారిన్నేలోని కుమ్మరి పురుగులక• శిక్ష పడింది. ఇలాంటి అసంబద్ధతలు ప్రాచీన హిందూ న్యాయవ్యవస్థలో కనబడవు.
  17. ‘హక్కులు-బాధ్యతలు’ విషయంలో ప్రశ్నార్థ కమైన భావనలు (ప్రాచీన హిందూ న్యాయవ్యవస్థలు పరస్పర విరుద్ధమైన వైఖరులు)
  18. హక్కులు, బాధ్యతలను అవలంబించడం దగ్గర హిందూ, పాశ్చాత్య న్యాయ వ్యవస్థలలోని ఒక ముఖ్య విభేదం మన దృష్టికి వస్తుంది. రెండు వ్యవస్థలలోనూ హక్కుల-బాధ్యతలు పరస్పరం ముడివడి ఉన్నవే. అయితే వాటికి గల ప్రాధాన్యంలో చాలా వ్యత్యాసం ఉంది. హిందూ న్యాయవ్యవస్థలో వ్యక్తి ఉండే బాధ్యతల మీద దృష్టి కనిపిస్తుంది. హక్కు లేదా అధికారం అనే మాట అర్థశాస్త్రంలో ఎక్కడా కనబడదు. వ్యక్తులు అనుభవించే అధికారాలన్ని ఇతరులు ఆచరించే విధులలో నుండి జనించిన వేనన్న అవగాహనపైనే హిందూ న్యాయశాస్త్రం ఆధారపడి ఉంది. వాక్‌ ‌స్వాతంత్య్రం (ఖీతీవవ•శీఎ శీ• •జూవవమీష్ట్ర) నిర్భయంగా సత్యాన్నే పలకాలన్న కర్తవ్య భావన నుండి ఉదయించినదే. కాగా పాశ్చాత్య న్యాయశాస్త్రంలో హక్కులు ప్రధానమైన అంశాలుగా బోధిస్తారు. ఈ హక్కులకు అనుగుణంగా ఇతరుల విధులు, బాధ్యతల గురించి చెప్పారు. ఇలా ఒకరి హక్కు మరొకరి బాధ్యతగా గుర్తించిన విధానం కొన్ని సాంఘిక వ్యవస్థలకు (ఉదాహరణకు వివాహం) ఆధారం. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం వివాహం ఒక కర్తవ్యం. ప్రతి వ్యక్తి ఆచరించవలసిన ధర్మాలలో అనివార్య భాగం. కాగా పాశ్చాత్య న్యాయశాస్త్రాను సారంగా అక్కడ హక్కులకు పెద్దపీట వేసినందున – వివాహం అంటే ఒక ఒప్పందంగా భావిస్తూ అతడు, ఆమె ఎవరికివారు ఎక్కువ లాభం పొందాలని చూస్తున్నారు. వివాహ వ్యవస్థలో ఇమిడి ఉన్న ధర్మం (లేదా కర్తవ్యం) అనే భావన లోపించిన కారణంగా పెద్ద సంఖ్యలో విడాకులకు దారితీస్తున్నది.
  19. భారతీయ న్యాయవ్యవస్థ ఇకముందు నడవవలసిన దారి…
  20. ఇప్పటివరకు మాట్లాడిన అంశాల నేపథ్యంలో మన దేశంలో న్యాయవ్యవస్థ భవిష్యత్తు ఎలా ఉండాలని అనుకోవచ్చు? అనే ప్రశ్న తల ఎత్తుతుంది. న్యాయం అందించే వ్యవస్థ శూన్యంలో పనిచేసేదిగా ఉండదు. న్యాయం అందించడం అనేది ఒక సామాజిక కార్యరూపం. విస్తృతమైన సామాజిక న్యాయవ్యవస్థలో న్యాయ వ్యవహారాలు, చట్టాన్ని అనుసరించి నడవటం భాగం మాత్రమే. న్యాయ మూర్తి హోమ్స్ ‌మాట గుర్తుంది కదా! కాలం తెచ్చిపెట్టే అవసరాలకనుగుణంగా సామాజిక ఆకాంక్షలు ఉంటాయి. వాటిని పట్టించుకోకుండా, లేదా కావాలని ఉల్లంఘించి న్యాయస్థానాలు పనిచేయలేవు.‘పైనున్న దూలాలు విరిగి మీద పడినా, న్యాయం అమలు జరగవలసిందే’ అనటం – న్యాయం నిష్పక్షపాతంగా ఉండాలనే ఆకాంక్షను సూచిస్తుంది. అంత మాత్రాన సాంఘిక అవసరాలకు భిన్నమైన రీతిలో న్యాయ ప్రక•న జరగాలని కోరటం కాదని గ్రహించుకోవాలి.
  21. భారతీయ న్యాయవ్యవస్థ పాత్ర దేశ సామాజిక ఆకాంక్షలకు భిన్నంగా, అతీతంగా ఉండలేదు. భారత ప్రజానీకం ముందు మన రాజ్యాంగ చట్టం కొన్ని పరస్పర విరుద్ధంగా కనబడే లక్ష్యాల సమన్వయాన్ని సూచిస్తున్నది. పాశ్చాత్య జీవనశైలి-సోషలిస్టు జీవనశైలి, వ్యక్తిగత స్వేచ్ఛ, సామాజిక నియంత్రణ, వస్తూత్పత్తిలో అరాజకతకు చోటుండకపోవటం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అలాగే రాజకీయ ఆర్థిక స్వాతంత్య్రం ఉన్న సంరక్షణ-వీటి మధ్య సమన్వయం కోరుతున్నది.

పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశాలలో రాజకీయ హక్కులు మృగ్యమైనవని నేను అంటున్నట్లుగా ఎవరూ పొరబడవద్దు. నొక్కి చెప్పటంలో తేడాలున్న విషయాన్ని మనం గ్రహించాలి. మన రాజ్యాంగ చట్టం ప్రభుత్వం నిర్వహించే పాత్రకు, వ్యక్తుల హక్కులకు, స్వాతంత్య్రాలకూ మధ్య సంతులనం సాధించాలని యత్నిస్తున్నది. రాజ్యాంగ సంబంధమైన న్యాయవ్యవహారాలలో అది ఒక విధమైన అలీన విధానాన్ని కోరుతున్నది. పరిశ్రమలు సమాజం అదుపులో ఉండాలనేది భారతీయ సంప్రదాయం. ప్రాచీన హిందూ దేశంలో విస్తృతమైన ప్రభుత్వరంగ పరిశ్రమలు ఉండేవని నేను ఇంతకుముందు ప్రస్తావించాను. యథేచ్ఛగా ధరలు పెంచడానికి వీలుగా, విపణి అంతా ఒకరి గుప్పిటలోనే ఉండే విధానాలను అర్థశాస్త్రం నిషేధించింది. భారత రాజ్యాంగ సంవిధానం మన ప్రజానీకం ముందు ఒక క్లిష్టమైన (జటిలమైన) లక్ష్యాన్ని ఉంచింది. రాజ్యాంగం ఏవో కొన్ని ఆకాంక్షల, ఆలోచనల కలగూరగంప కాదు. శూన్యంలో పనిచేయగలదీ కాదు. ఒకానొక ప్రజానీకం (సముదాయం-జాతి) తమ ఆకాంక్షలను నెరవేర్చుకొనడానికి అనుసరించ వలసిన జీవన విధానాన్ని అది ప్రతిబింబిస్తుంది. ఆ పనిలో అది గనుక విఫలమైతే, అప్పుడు సవరణలు అవసరమౌతాయి. లేదా దానిని ప్రక్కనపెట్టి మరో కొత్త రాజ్యాంగాన్ని రూపొందించుకోవలసి వస్తుంది. అది అందరి సమ్మతితో జరుగవచ్చు. అన్యధా జరిగినా జరుగుతుందేమో! భారత రాజ్యాంగ సంవిధానంలో పొందుపరచుకున్న ఆకాంక్షలను సాధించటంలో సమర్థులం కావాలంటే, వలస పాలనలు ఆరంభం కావడానికి ముందు, శతాబ్దాల తరబడి హిందూదేశంలో ఎటువంటి న్యాయవ్యవస్థ వర్థిల్లినదో, ఆ న్యాయ సంశయాలపట్ల, విధానాల పట్ల మనం తప్పక శ్రద్ధ వహించాలి.

  1. భవిష్యత్తులో మన న్యాయవాదుల, న్యాయ మూర్తుల సామర్థ్యం, విజ్ఞత, దేశభక్తి ఎలా ఉండబోతు న్నవంటే-మన దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలన ఎంత దృఢంగా ఉంటాయో- తదనుగుణంగానే న్యాయవాదుల, న్యాయమూర్తుల సుగుణాలూ ఉండగలవని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు. హిందూ సమాజమనే మృత్తిక నుండి మొలిచి, పెరిగి పైకి వచ్చి, ఆ సమాజ సానుకూల వాతావరణం నుండి పోషణ అందు కున్నపుడే, అటువంటి సుగుణసంపన్నులైన న్యాయవాదులు, న్యాయమూర్తులు వర్థిల్లగలరు. గొప్ప న్యాయవేత్తలు, న్యాయమూర్తులు తమంత తాముగా పుట్టుకతో రూపుదిద్దుకోరు. సరియైన విద్యా విధానం ద్వారా, మహత్తర న్యాయం అందించే సంప్రదాయా లలో నుండి తయారవుతారు. మనువు, కౌటిల్యుడు, కాత్యాయనుడు, బృహస్పతి, నారదుడు, పరాశరుడు, యాజ్ఞవల్క్యుడు మొదలైన ప్రాచీన హిందూ న్యాయశాస్త్ర విశారదులతో కూడిన గొప్ప సంప్రదాయం మనకు ఉన్నది. వారు అందజేసిన మహత్తర జ్ఞానాన్ని నిర్లక్ష్యం చేస్తూ, వలస పాలకులు రుద్దిన న్యాయ విధానాలనే అంటిపెట్టుకొని ఉంటే అది మన రాజ్యాంగ లక్ష్యాలకు, జాతీయ ప్రయోజనాల సాధనకు విఘాత•మవుతుంది.
  2. ఈనాడు భారత న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయం అందించడంలో వలస పాలన నాటి మనః ప్రవృత్తి కొనసాగుతూనే ఉంది. తమ హక్కులను తమపై పాలకులుగా ఉండిన ఆంగ్ల వలస పాలకులకు ఏ ప్రజలైతే ధారాదత్తం చేస్తారో, వారికి (పాలితులుగా ఉండడానికి అంగీకరించినవారికి) మాత్రమే సంరక్షణ కల్పించేవారు. మరోమాటలో చెప్పాలంటే న్యాయం అందరి హక్కు కాదు. బ్రిటిష్‌ ‌వారు దయా దాక్షిణ్యాలతో కొందరికి ప్రసాదించే భిక్షగా, రాయితీగా ఉండేది. ఇది ప్రాచీన హిందూ న్యాయ వ్యవస్థకు పూర్తిగా భిన్నమైన వ్యవహారం. ప్రాచీన హిందూ న్యాయవ్యవస్థలో న్యాయాన్ని కోరే హక్కు అందరికీ ఉంది. పరిపాలనలో అది అంతర్భాగం. నేను ఇంతకుముందే చెప్పినట్లుగా ప్రాచీన హిందూ న్యాయవ్యవస్థలో రాజు సైతం ధర్మదండం ముందు తలవంచవలసినవాడే. రాజు కుటుంబీకులపైన, రాజుపైన కూడా ఆరోపణలు చేసి న్యాయం కోరే హక్కు సామాన్యులకు సైతం ఉండేది. ఈ విధానాన్ని కొనసాగించడానికి బదులుగా – వలస పాలన నాటి మనస్తత్వం కొనసాగుతున్న కారణం గానే, అధికారంలో ఉన్నవారిని బ్రతిమిలాడు కొనే ధోరణిలో అభ్యర్థనలు రూపొందుతున్నాయి. న్యాయస్థానంలోని అధికారులను సంబోధించే సమయంలోనూ అదే ప్రతిబింబిస్తున్నది. కోర్టులలో అడుగుపెట్టటం కూడా సులభంగా లేదు.
  3. ఈనాడు న్యాయం జరగాలని గట్టిగా అడిగే పరిస్థితి లేదు. ప్రాధేయపడవలసివస్తున్నది. ‘ఘనత వహించిన ప్రభువులపై’ అనే తీరులో న్యాయ మూర్తులను సంబోధించవలసి వస్తున్నది. సాధారణ వ్యక్తులు న్యాయం కావలసివచ్చినపుడు వ్యవహారం నడిపించడానికి అవసరమైన ధనం లేని వాడవు తున్నారు. న్యాయస్థానంలో వ్యాజ్యం ఓడినప్పుడు, దానికంటే ఉన్నతమైన న్యాయస్థానానికి ‘అప్పీలు’కు వెళ్లటమనేది మరింత వ్యయ ప్రయాసలతో కూడిన వ్యవహారం. బ్రిటిష్‌ ‌వలస పాలకుల ప్రీవీ కౌన్సిల్‌ ‌వరకు విస్తరించి ఉండే అలాంటి వ్యవస్థను తెచ్చిపెట్టారు.
  4. న్యాయస్థానాలలో కేసులు గుట్టలుగా పేరుకుపోతున్నవి. న్యాయమూర్తులు నిస్సహాయులవు తున్నారు. ఈ విషయంలో సాధారణ వాది లేదా ప్రతివాదికి సహాయపడదలచినా అది వారి వశంలో ఉండటంలేదు. తీర్పు ద్వారా జరిగే అన్యాయం మాట అలా ఉంచి న్యాయం చేయటంలో జరిగే ఆలస్యమే ఒక పెద్ద అన్యాయం. ఒక కేసులో వాదికి లేదా ప్రతివాదికి ఉపశమనం ఇవ్వాలా వద్దా అని నిర్ణయించడానికే చాలా సమయం తీసుకొంటున్నారు. చిన్న చిన్న విషయాలలో – వెంటనే తేల్చే అవకాశం ఉన్నా – వాటిని నానబెట్టటం కూడా వలస పాలన మనస్తత్త్వంలో భాగమే.
  5. మన భారత ప్రజానీకానికి వలన పాలన నాటి ఈ వ్యవస్థ ఏ విధంగానూ తగినది కాదని చెప్పడానికి సందేహించనక్కరలేదు. ఈ వ్యవస్థను భారతీయీకరణం చేయటం ఒక తక్షణావసరం. వలస పాలన నాటి మనస్తత్త్వాన్ని పెకలించి వేయడానికి కొంత సమయం అవసరమయ్యే మాట నిజమే కావచ్చు. అయినా నా మాటలు మీలో కొందరిలోనైనా ఆలోచనలకు దారితీయగలవనీ, మన న్యాయవ్యవస్థను వలస పాలన మనస్తత్త్వం నుండి విడిపించే చర్యలు ఆరంభం కాగలవనీ నా ఆశ. ఇది సమయం తీసికొనే జటిల సమస్యే అయినప్పటికీ, కృషి చేయదగిన విషయమని, దీనిద్వారా మన భారత న్యాయవ్యవస్థ పునరుజ్జీవం పొందగలదని మన మహాన్‌ ‌దేశపు సామాజిక, సాంస్కృతిక వారసత్వాలతో సంబంధం ఉన్నదై, మరింత ఆరోగ్యకర రీతిలో న్యాయ అందించే పక్రియ జరుగగలదని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను.
  6. నన్ను ఈ సదస్సుకు ఆహ్వానించినందుకు అఖిల భారతీయ న్యాయవాద పరిషత్తుకు ధన్యవాదాలు. మన ప్రాచీన హిందూ న్యాయవ్యవస్థ గురించిన అవగాహనకు, వలస పాలన అవశేషా లను తొలగించుకొనే దిశలో యత్నించేందుకు ఈ ప్రయత్నం దోహదం చేయగలదని నా విశ్వాసం.

ధన్యవాదాలు, జైహింద్‌

అను: డా।। వడ్డి విజయసారథి

About Author

By editor

Twitter
Instagram