– డా।। కాశింశెట్టి సత్యనారాయణ

నల్గొండ జిల్లాలో భైరవునిపల్లె అనే గ్రామం ఉండేది. ఇది వరంగల్‌, ‌నల్గొండ, మెదక్‌, ‌కరీంనగర్‌ ‌జిల్లాలను కలిపే సరిహద్దు ప్రాంతం. ఈ గ్రామవాసులు ముఖ్యంగా ఇమ్మడి రాజిరెడ్డి, వంగాల అనంతరామిరెడ్డి, మగుటం రామయ్య, దండాల కృష్ణయ్య, దుబ్బుల రామచంద్రారెడ్డి మొదలైన వారు కలిసి రజాకార్లను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఈ పల్లెకు పశ్చిమాన ఉన్న లింగాపూర్‌ ‌గ్రామానికి ఒక రోజు పగటిపూట రజాకార్లు నిప్పంటించారు. ఆ వార్త విని భైరవుని పల్లెవాసులు నీళ్లకుండలు, గుతుపలు, గొడ్డళ్లు పుచ్చుకొని రజాకార్లపై దాడికి బయలు దేరారు. రజాకార్లు దోపిడీ సామాగ్రిని నాలుగు బళ్లలో వేసుకుని నినాదాలు చేసుకుంటూ తిరిగి అక్కడికి వచ్చారు. వెంటనే రాజిరెడ్డి బృందం కేకలు వేసుకుంటూ వారిని వెంటాడింది. రజాకార్లు కాల్పులు సాగించారు. అయినా నిర్భయంగా వెంటాడుతున్న గ్రామస్తులను చూసి రజాకార్లు బెదిరిపోయి బళ్లు వదిలి పారిపోయారు. ఇది జరిగిన కొన్నాళ్లకు తమ బళ్లు తమకు ఇమ్మని కబురుపెట్టారు. ఇందుకు ఆ పల్లె ప్రజలు ఒప్పుకోలేదు. దీంతో రజాకార్లు ఆ ప్రాంత పోలీసు అమీన్‌కు ఫిర్యాదు చేశారు. అమీన్‌ ‌రాజిరెడ్డికి కబురు పంపాడు. ఈ కేసును తానే విచారిస్తానని, గ్రామస్తులపై ఎలాంటి చర్యలు తీసుకోనని రాజిరెడ్డికి అమీన్‌ ‌హామీ ఇచ్చాడు. ఈ లోగా 12 వందల రూపాయలు చందా ఇమ్మని భైరవునిపల్లె గ్రామానికి  రజాకార్లు తాకీదు పంపారు.

ఆ గ్రామం చుట్టూ ఒక కోటగోడ ఉండేది. ఆ గోడకు ఎత్తైన బురుజు కూడా ఉండేది. బురుజుపై మందుగుండు సామాగ్రితో ఇరవై నాలుగు గంటలూ (ఇద్దరు చొప్పున) తుపాకులతో కాపలా ఉండేవారు. రజాకార్లు కనబడితే బురుజుపైనున్న నగరా మోగించేవారు. గ్రామస్తులు అప్రమత్తమై దాడులను ధైర్యంగా ఎదుర్కొనేవారు. అంతేకాదు, ఎప్పుడూ 50 మంది గుతుపలు, గొడ్డళ్లతో చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతూ ప్రజలకు ధైర్యం చెప్పేవారు. ఈ పరిణామాల నేపథ్యంలో రజాకార్లు తమ బళ్లు తిరిగి సంపాదించలేక పోయారు. ఆ కోపంతో రజాకార్లు భైరవునిపల్లెలో విధ్వంసం సృష్టించడానికి నిర్ణయించు కున్నారు. రేపర్తి (జనగామ దగ్గర) గ్రామం మీదుగా రజాకార్ల రాకను గమనించిన గ్రామస్తులు బురుజుపై నున్న నగారా మ్రోగించారు. అందరూ అప్రమత్త మయ్యారు. గ్రామస్తులు బురుజుపై నుంచే కాల్పులు ప్రారంభించగా రజాకార్లు పారిపోయారు. అమీన్‌కు మళ్లీ ఫిర్యాదు చేశారు. ఈసారి అమీన్‌ ‌స్వయంగా వచ్చి భైరవునిపల్లెను తనిఖీ చేశాడు. బురుజుపై గల మందుగుండు సామానును పరిశీలించి ప్రజలతో ‘మేముండగా మీకెందుకీ ఏర్పాట్లు. నేను మీకు రజాకార్లతో దోస్తీ చేపిస్తాను’ అని చెప్పి గ్రామంలోని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాడు.

హైదరాబాద్‌ ‌ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన ‘లాయక్‌ ఆలీ’ ఓసారి ఆ ప్రాంత పర్యటనకు వచ్చాడు. రాజిరెడ్డి గ్రామస్తులతో వెళ్లి ప్రధానిని కలిసి తమపై రజాకార్ల దాడులు గురించి చెప్పాడు. ఆయన అందరూ కలిసిమెలసి ఉండాలని ‘నీతులు’ చెప్పి వెళ్లిపోయాడు. ఇక లాభం లేదని ఆ ప్రాంతవాసులు తమ రక్షణకు ఆయుధాలు సేకరించడం మొదలు పెట్టారు. బురుజుపై నాలుగైదు మణుగుల బరువుండే ఫిరంగిని అమర్చారు. గ్రామంలోని కంసాలికి ఇనుపగుండ్లు తయారుచేయాలని చెప్పారు.

భైరవునిపల్లెను చూసి బెక్కల్‌, ‌ధూళిమిట్ట, తోరసాల్‌, ‌జాలపల్లి, కొండాపూర్‌, ‌కుటిగల్‌, ‌పోలిపూర్‌, అం‌కుశీపూర్‌ ‌గ్రామస్తులు కూడా రక్షణ దళాలను ఏర్పాటు చేసుకున్నారు. భువనగిరి డిప్యూటీ కలెక్టర్‌ ‌హషీం నిఘా పెంచాడు. ఒకరోజు భైరవుని పల్లెపై దాడి చేశాడు. బురుజు మీద నగారా మోగింది. వెంటనే పైనుండి కాల్పులు ప్రారంభ మయ్యాయి. కలెక్టర్‌ ‌బృందం తట్టుకోలేకపోయింది. 15 మంది పోలీసులు మరణించారు. ఎప్పటికైనా భైరవునిపల్లెను నేలమట్టం చేస్తానని ప్రతిజ్ఞ చేసిన హషీం అక్కడినుంచి వెనుదిరిగాడు. ఈ ఘటనతో నిజాం ముఠాలను ధైర్యంగా ఎదుర్కోగలమనే ధీమా గ్రామస్తుల్లో బాగా పెరిగింది.

సైన్యం వచ్చి గ్రామాన్ని చుట్టుముడుతుందనే వార్త ముందుగానే తెలిసింది. అయినా గ్రామం విడిచి అడవుల్లోకి పోవాలనే ఆలోచన వారికి కలగలేదు. భైరవునిపల్లె సర్వనాశనమైంది. జనగాం తాలూకా కేంద్రంలో నిజాం ప్రభుత్వం తాత్కాలికంగా మిలటరీ క్యాంపు ఏర్పాటు చేసింది. నిజాం సైన్యంలోని ఒక మేజర్‌, ఇద్దరు కెప్టెన్‌లు తమ దళాలతో సహా వచ్చి విడిది చేశారు. మరోవైపు నుండి సాయుధ దళం వచ్చింది. వరంగల్‌, ‌నల్గొండ డీఎస్పీలు, వరంగల్‌కు చెందిన డీజీ స్వయంగా వచ్చి ఏర్పాట్లు చూశారు. రజాకార్ల ముఠా తమ నాయకులతో సిద్ధంగా ఉంది. వరంగల్‌, ‌మెదక్‌ ‌సుబేదార్లు ఇక్బాల్‌, ‌హషీం తమ బలగాలతో వచ్చారు. పెద్దఎత్తున సాగుతున్న ఈ సైనిక ఏర్పాట్లు చూసి జనగామ ప్రజలు భీతి చెందారు. ఏదో ఒక హత్యాకాండకు పన్నాగం పన్నుతున్నారని అర్థమైంది. ఆ రాత్రి ట్రక్‌పై సామాన్లు వేసుకొని 500 మంది సైనికులు, పోలీసులు, రజాకార్లు జనగామ నుండి సిద్ధిపేట వైపు వెళ్లే రోడ్డు మీదుగా బయల్దేరారు. 200 మందికి పైగా అధికారులు కూడా వారితో ఉన్నారు.

భైరవుని పల్లె ప్రజలు గాఢనిద్రలో ఉన్నారు. ఆ గ్రామాన్ని ఆక్రమించాలని బయల్దేరిన నిజాం సైన్యం ముస్త్యాల గుండా వల్లపట్ల చేరుకుంది. వల్లపట్ల నుండి సైన్యాన్ని మళ్లించి మరో వైపు నుండి భైరవుని పల్లెను తెల్లవారుఝామున చుట్టుముట్టమని నిజాం సైన్యాధ్యక్షుడు ఆదేశించాడు. ఉదయం 4.30 గంటల సమయంలో భైరవుని పల్లెను నిజాం సైన్యం ఏకకాలంలో ముట్టడించింది. ఆ సమయంలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి వచ్చిన విశ్వనాథ్‌భట్‌ ‌జోషి, ఉల్యంగల వెంకట నరసయ్యలను కాల్చేందుకు ప్రయత్నించగా వారు తప్పించుకొని గ్రామానికి పరుగెత్తి బురుజుపై గల నగారాను మోగించారు. వెంటనే చిన్న ఫిరంగుల కాల్పులు ప్రారంభ మయ్యాయి. కానీ సైన్యం దగ్గర పెద్ద ఫిరంగి ఉంది. దాని ధాటికి బురుజు ధ్వంసమై మగుటం రామయ్య, భూమయ్యలు మరణించారు. గ్రామంలోనికి చొచ్చుకు వచ్చి కనపడిన వారందరినీ కాల్చారు. ఎందరో యువకులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో విశ్వనాథ్‌భట్‌ ‌జోషి కూడా ఉన్నాడు. గ్రామం పూర్తిగా నాశనమైంది. గడ్డివాములు, ఇళ్లు తగులబెట్టారు. స్త్రీలను బలాత్కరించారు. 92 మంది యువకులను బందీలుగా పట్టుకున్నారు. 303 రైఫిల్‌తో ఒకే గుండుతో ఎంతమందిని చంపవచ్చోనని అంచనా వేసుకోవడానికి ఆ యువకులను కట్టేసి నాలుగు వరుసలలో ఒకరి వెనుక ఒకరిని బలిపశువుల్లా నిలబెట్టారు. మొదట ఒక సైనికాధికారి కాల్పులు జరిపాడు. ఒక గుండు వరుసగా నలుగురి శరీరాల గుండా దూసుకు పోయింది. ఆ నలుగురు యువకులు నేలకూలారు. రెండోసారి ఓ పోలీసు అధికారి ఫైరింగ్‌ ‌చేయగా మరో ముగ్గురు చని పోయారు. భువనగిరి డిప్యూటీ కలెక్టర్‌ ‌హాషీం ఎనిమిది మందిని కాల్చి చంపాడు. తర్వాత అందరినీ కాల్చి శవాలను నిరుపయోగంగా ఉన్న ఓ బావిలో పాడేసి సామూహిక సమాధి చేశారు. ఈ దారుణ హత్యాకాండలో రజాకార్ల సర్వసైన్యాధికారి, కాశీంరజ్వీ ముఖ్య అనుచరుడు మొహజీం హుస్సేన్‌ (‌నల్గొండ కలెక్టర్‌) ‌కీలకంగా వ్యవహ రించాడు.

ఈ ఘటనలో భైరవుని పల్లె ప్రజలకు నాయకత్వం వహించిన ఇమ్మడి రాజిరెడ్డి మాత్రం సజీవంగా మిగిలాడు. రజాకార్ల దాడికి ముందురోజు రాత్రి రాజిరెడ్డి తన చేను కాపలా కోసం వెళ్లాడు. ఆయన గ్రామంలో లేకపోయే సరికి దాడి నుంచి తప్పించుకోగలిగాడు.

ఈ సంఘటన అంతనరం నిజాం పాలకులు వేల రూపాయలు ఖర్చు చేసి విదేశాల నుండి పత్రికా విలేకరులను రప్పించి భైరవునిపల్లె ఘటనకు వక్రభాష్యం చెప్పించి ప్రచారం చేశారు. హిందువులే ప్రభుత్వంపై తిరగబడితే శాంతి, భద్రతలు అదుపులో ఉంచేందుకు వారిపై కాల్పులు జరిపామని చెప్పారు. అయినా నిజాం అమానుష చర్యలు, నిజరూపం ప్రపంచానికి బహిర్గతం కాక తప్పలేదు. ఆ ప్రాంత ప్రజలు నిజాంపై కోపంతో జనగామ రోడ్డు మధ్యన గల చిన్న వంతెనను కూల్చారు. కాని తరువాత పోలీసులు ఆ వంతెన కూలిన ప్రాంతంలోనే అమాయకులైన తొమ్మిదిమంది రైతులను పొలాల్లో పనిచేస్తూండగా కాల్చి వేశారు. ఆ శవాలను లాక్కెళ్లి గడ్డివేసి తగులబెట్టారు. అక్కడికి ఓ చాకలి మంచినీళ్లు తాగేందుకు రాగా అతన్ని కూడా కాల్చేశారు.

———————————————————————–

శవాలను చెట్టుకి వేలాడదీశారు!

రజాకార్లు గ్రామాలపై పడి దోపిడీలు, మానభంగాలు, హత్యలు కొనసాగిస్తున్న భయానక వాతావరణమది. అయితే ఈ విషయాలేవీ బయటకి రాకుండా నిజాం ప్రభుత్వం ప్రజలను మభ్య పెట్టడానికి ‘శాంతిసంఘాల’ను ఏర్పరచి హిందువుల కళ్లు కప్పేందుకు యత్నించింది. జనగాం లోని శాంతిసంఘంలో పరిశ్రమల శాఖ సూపర్‌ ‌వైజర్‌ ఎంఎన్‌ ‌రెడ్డి, వ్యవసాయశాఖ సూపర్‌ ‌వైజర్‌ ‌శఠగోపాచార్యులు ఇద్దరు సభ్యులు. శాంతిసంఘంలో హిందువులు కూడా ఉన్నారని నమ్మించడానికే ఈ ప్రయత్నం. హిందూ సభ్యులు నోరెత్తి రజాకార్లకు వ్యతిరేకంగా మాట్లాడితే ప్రాణాలతో మిగలడం కష్టం. ఓ సారి శఠగోపా చార్యులు శాంతిసంఘం సమావేశంలో మితిమీరి పోతున్న రజాకార్ల చర్యలను ఖండించారు. మరుసటి రోజు ఆయన్ను తీసుకువెళ్లి కాల్చివేశారు. ఆ తరువాత ఎంఎన్‌ ‌రెడ్డి నమ్రతతో ఈ ఆగడం గురించి ఫిర్యాదు చేశారు. ఆయనను కూడా కాల్చివేస్తామని బెదిరించే సరికి ఆనాటి నుండి ఆయన ఫిర్యాదులు చేయడం మానేశారు. గ్రామాల్లో శాంతిసంఘాలు స్థాపించి ప్రజలకు రక్షణ కల్పిస్తామని నిజాం పాలకులు ప్రచారం చేసేవారు. కాని అవి ఎంత భయానకంగా ఉండేవో ఎంఎన్‌ ‌రెడ్డి ఓ సంఘటన ద్వారా వివరించారు..

ఒకరోజు ఎంఎన్‌ ‌రెడ్డి కొడకండ్ల-రంగాపూర్‌ ‌మార్గం గుండా వెళుతున్నారు. ఒకచోట ఒక చింత చెట్టుకు అయిదు శవాలు వేలాడుతున్న దృశ్యం కనపడింది. ఆ ప్రాంతం ‘ఇసనూరు’ పోలీసు స్టేషన్‌కు నాలుగు మైళ్ల దూరంలోనే ఉంది. ఆ అయిదు శవాలు బ్రాహ్మణులవని గ్రామస్థులు ఆయనకు చెప్పారు. అంతకు క్రిందిటి రోజే శ్రాద్ధ భోజనం చేసి ఏడుగురు బ్రాహ్మణులు తిరిగి వస్తున్నారు. దారిలో రజాకార్ల ముఠా వారిని అడ్డగించింది. అయితే వారిలో ఇద్దరు తప్పించుకున్నారు. మిగిలిన అయిదుగురిని ప్రభుత్వ ఏజెంట్లుగా అనుమానించి ఆ చింతచెట్టు కొమ్మలకు వరుసగా వేలాడదీశారు. కింద మంట కూడా పెట్టారు. ఆ మంటల్లో కాలి, ఉడికి, మాడి ఆ అమాయకులైన బ్రాహ్మణులు ప్రాణాలు వదిలారు. అంతేకాదు, ఈ చర్య ఇది హిందువులకు గుణపాఠం కావాలని ఆ శవాలను అలాగే వేలాడదీసి వెళ్లిపోయారు. ఆ బ్రాహ్మణుల్లో ముగ్గురి వెండి మొలతాళ్లు కాలి వంకర్లు పోయాయి. వారి ధోవతులు కాలి, శవాలు నల్లగా మసిబారి భయానకంగా ఉన్నాయి ఆ దృశ్యాలు. వాళ్లకు సంభావనగా లభించిన వెండి రూపాయి నాణేలు తర్వాత బూడిదలో దొరికాయి.

About Author

By editor

Twitter
Instagram