నిఖిల్‌ ‌సిద్ధార్థ్, అనుపమా పరమేశ్వరన్‌ ‌జంటగా నటించిన ‘కార్తికేయ-2’ ఘన విజయం సాధించిన నేపథ్యంలో వారిద్దరూ జంటగా నటించిన తదుపరి చిత్రం ‘18 పేజీస్‌’ ‌మీద కూడా సహజంగానే ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. గతంలో సుకుమార్‌ ‌రైటింగ్స్ ‌పతాకంపై సుకుమార్‌ ‌కథ, స్క్రీన్‌ ‌ప్లే అందించిన ‘కుమారి 21 ఎఫ్‌’ ‌మూవీని డైరెక్ట్ ‌చేసిన సూర్య ప్రతాప్‌ ‌మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత ‘18 పేజీస్‌’‌ను డైరెక్ట్ ‌చేయడం కూడా చాలా మందిలో ఉత్సుకతను పెంచింది. సుకుమార్‌తో ఉన్న అనుబంధం కారణంగా ఈ సినిమా జీఏ2 పతాకంపై అల్లు అరవింద్‌ ‌సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు.

సిద్ధార్థ్ (‌నిఖిల్‌) ఓ ‌సాఫ్ట్‌వేర్‌ ఇం‌జనీర్‌. ‌నిత్యం ఆఫీస్‌ ‌వర్క్‌తో బిజీగా ఉంటాడు. చేతిలో ఫోన్‌ ‌లేకుండా క్షణం కూడా ఉండలేడు. అతని చుట్టుపక్కల ఏం జరుగుతోందో కూడా గమనించడు. అయితే మానవ సంబంధాల మీద మాత్రం అమితమైన ఆపేక్ష ఉంటుంది. తన తాతయ్యను తండ్రి నిర్లక్ష్యం చేసిన కారణంగానే ఆయన ఇంటి నుండి వెళ్లి పోయాడనే కోపంతో ఇతనూ తల్లిదండ్రులకు దూరంగా ఒంటరి జీవితం గడుపుతుంటాడు. అలాంటి సిద్ధార్థ్‌ను ఓ అమ్మాయి ప్రేమించానని చెప్పి, మోసం చేస్తుంది. డిప్రెషన్‌తో ఉన్న అతనికి నందిని (అనుపమా పరమేశ్వరన్‌) అనే అమ్మాయి రెండేళ్ల క్రితం రాసుకున్న ఓ డైరీ కనిపిస్తుంది. కనీసం ఫోన్‌ ‌కూడా వాడటానికి ఇష్టపడని ఆమె డైరీలోని ఒక్కో పేజీ చదువుతూ, ఆమె క్యారెక్టర్‌కు సిద్ధార్థ్ ఇం‌ప్రస్‌ అయిపోతాడు. తనూ ఆమెలానే ప్రవర్తించడానికి ప్రయత్నిస్తాడు. మెకానికల్‌ ‌లైఫ్‌లో నుంచి బయటపడి జీవితాన్ని ఆస్వాదించడం మొదలు పెడతాడు. అయితే 18 పేజీల తర్వాత డైరీ ఖాళీగా ఉంటుంది. ఆ తర్వాత ఆమె ఆ డైరీని ఎందుకు రాయలేదు? ఏ పరిస్థితుల్లో రాయడం ఆపాల్సి వచ్చింది అనేది సిద్ధార్థ్‌కు తెలియదు. ఆమె అడ్రస్‌ ‌ప్రకారం వాళ్ల ఊరు వెళితే, రోడ్‌ ‌యాక్సిడెంట్‌లో నందిని చనిపోయిందని తెలుస్తుంది. కానీ అతనికి మాత్రం మనసులో ఏదో మూల చిన్న ఆశ. ఆమెలాంటి మంచి మనిషికి హాని జరగదని!! మరి సిద్ధార్థ్ ఊహించినట్టుగానే నందిని బ్రతికే ఉందా? ఆమెను హతమార్చాలని అనుకున్నది ఎవరు? ఈ మిస్టరీని సిద్ధార్థ్ ఎలా బట్టబయలు చేశాడన్నదే మిగతా కథ.

నిఖిల్‌ ‌గత కొంతకాలంగా భిన్నమైన కథలను ఎంపిక చేసుకుని ఓ రకంగా రిస్క్ ‌తీసుకుంటున్నాడు. కొన్ని సందర్భాలలో అవి ప్రేక్షకులను ఆకట్టుకుని అతనికి విజయాన్ని అందిస్తున్నాయి. మరికొన్ని ప్రయోగాత్మక చిత్రాలుగా మిగిలిపోతున్నాయి. అయితే వర్క్ ‌పరంగా నిఖిల్‌కు మంచి సంతృప్తి అయితే ఈ సినిమాల కారణంగా లభిస్తోంది. ఇది కూడా ఓ రకంగా అలాంటి సినిమానే. కళ్ల ముందు కనిపించని ఓ అమ్మాయిని ఆరాధించడం, ఆమెను వెతకడం అనేది చాలా ఓల్డ్ ‌కాన్సెప్ట్. అయితే రెండేళ్ల క్రితం నాటి సంఘటనలను లింక్‌ ‌చేసుకుంటూ, మిస్టరీగా మారిన అమ్మాయి ఆచూకీ బయట పెట్టడం అనేది ఇందులో ఆసక్తి కరంగా ఉంది. అదే సమయంలో ఆ అమ్మాయి కనిపించకుండా పోవడానికి ఎంచుకున్న నేపథ్య అంత థ్రిల్లింగ్‌గా లేదు. అలాంటి విలనీ కథలు చాలానే వచ్చాయి.

సాఫ్ట్‌వేర్‌ ఇం‌జనీర్‌ ‌పాత్రలో సిద్ధార్థ్ ‌బాగానే ఒదిగిపోయాడు. నిజం చెప్పాలంటే.. ఈ సినిమాలో అతనికంటే స్ట్రాంగ్‌ ‌క్యారెక్టర్‌ ‌హీరోయిన్‌ ‌నందినిది. ఈ మధ్య కాలంలో ఓ కథానాయిక పాత్రను ఇంత ఆసక్తికరంగా, ఆదర్శవంతంగా ఏ దర్శకుడూ చూపించలేదు. ‘కుమారి 21 ఎఫ్‌’‌ను తెరకెక్కించిన సూర్య ప్రతాప్‌ ఈ ‌సినిమాను ఇంత డీసెంట్‌గా తీస్తాడనైతే ఎవరూ ఊహించరు. ప్రథమార్థంతో పోల్చితే ద్వితీయార్థం కాస్తంత బోర్‌ ‌కొడుతుంది. ఇక హీరో స్నేహితురాలుగా సరయు నటన ఆకట్టు కుంటుంది. కానీ ఆమె నోటి నుండి అసంకల్పితంగా వచ్చే కొన్ని పంచ్‌ ‌డైలాగ్స్‌ను తట్టుకోవడం కష్టమే. ఇతర ప్రధాన పాత్రలను దినేశ్‌ ‌తేజ్‌, అజయ్‌, ‌శత్రు, గోపరాజు రమణి, పోసాని, రవివర్మ, సత్యసాయి శ్రీనివాస్‌ ‌తదితరులు పోషించారు.

హీరో హీరోయిన్లు చివరి వరకూ ప్రత్యక్షంగా కలుసుకోరు కాబట్టి ఇందులో యుగళ గీతాలు లేవు. సినిమా ప్రారంభంలోనే హీరో బ్రేకప్‌ ‌సాంగ్‌ ‌వస్తుంది. అది ఎంత మాత్రం అతకలేదు. ఆ పాట ట్యూన్‌, ‌దాన్ని తమిళ నటుడు శింబు పాడిన తీరు, పిక్చరైజేషన్‌ ఏవీ గొప్పగా లేవు. మధ్యలో వచ్చే నేపథ్య గీతాలు బాగున్నాయి. వసంత్‌ ‌సినిమాట్రోగఫీ మూవీకి ఓ రిచ్‌నెస్‌ను తీసుకొచ్చింది. థియేటర్‌లో చూసే ఛాన్స్ ‌దక్కినా దక్కకపోయినా.. ఓటీటీలోకి వచ్చినప్పుడు ఓసారి చూడొచ్చు. అన్నీ అని చెప్పలేం కానీ.. ‘18 పేజీస్‌’‌లో కొన్ని ఆసక్తికరంగానే ఉన్నాయి!

– అరుణ, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram