– అరుణ

‘అవతార్‌’ ‌వంటి వరల్డ్ ‌క్లాసిక్‌కు సీక్వెల్‌ ‌తీయడం అంటే మాటలు కాదు. పైగా ఓ కొత్త ప్రపంచాన్ని, కొత్త రకం జీవులతో సృష్టించిన తర్వాత వారితోనే మరో వండర్‌ను సదరు దర్శకుడు సృష్టించాలని అనుకోవడం సాహసమే అవుతుంది. అయితే ఆ సాహసాన్ని సవాల్‌గా స్వీకరించి ‘అవతార్‌’‌కు సీక్వెల్‌గా ‘అవతార్‌: ‌ది వే ఆఫ్‌ ‌వాటర్‌’‌ను తెరకెక్కించాడు విశ్వ విఖ్యాత దర్శకుడు జేమ్స్ ‌కామెరాన్‌. ‌పుష్కర కాలం క్రితం వచ్చిన ‘అవతార్‌’ ‌సూపర్‌ ‌డూపర్‌ ‌హిట్‌ ‌కావడంతో ఈ సీక్వెల్‌ ‌మీద సహజంగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ రెండో భాగం ఎలా ఉంటుందో అనే ఆతురత కూడా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిలో నెలకొంది. అందులో భారతీయులూ ఉన్నారు. వారి ఎదురుచూపులకు తెర దించుతూ ‘అవతార్‌: ‌ది వే ఆఫ్‌ ‌వాటర్‌’ ‌డిసెంబర్‌ 16‌న జనం ముందుకు వచ్చింది. ఈ సినిమాతో పోటీ పడటం ఇష్టం లేక అనేక భారీ బడ్జెట్‌ ‌చిత్రాలు తమ విడుదల తేదీలను మార్చుకున్నాయంటే ‘అవతార్‌’ ‌మేనియా జనాలలో ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు.


తొలి భాగంలో పండోరా గ్రహాన్ని తన కథా క్షేత్రంగా మలుచుకున్న జేమ్స్ ‌కామెరాన్‌ ఇప్పుడు ఓ ద్వీపాన్ని ఎంచుకున్నాడు. సాగరతీరంలోనూ, సాగర గర్భంలోనూ ఈ కథ సాగుతుంది. ‘అవతార్‌’ ‌మూవీకి ఇది సీక్వెల్‌ ‌కాబట్టి దానిని చూడని వారికి ఈ కథ అర్థం కావడం కాస్తంత కష్టం. మొదటిసారి ఈ చిత్రమే చూస్తే విషయం అర్థం కాక తికమక పడే ఆస్కారం ఉంది. అందుకే ఇందులోనూ ప్రథమార్థం కథను కొంత తెలిపే ప్రయత్నం చేశారు. అందువల్ల ఇప్పటికే మొదటి చిత్రం చూసిన వారికి ప్రథమార్థం కాస్తంత బోర్‌ ‌కొట్టే ఆస్కారం ఉంది.

మానవులతో ముప్పు ఉందని గ్రహించిన జేక్‌ ‌తన పండోరా గ్రహాన్ని వదిలి, భార్య బిడ్డలతో కలిసి సముద్ర తీర ప్రాంతమైన మెట్కాయినాకు వస్తాడు. దాని అధిపతి టోనోవరి, రోనాల్‌ ‌దంపతులకు జేక్‌తో సత్సంబంధాలే ఉన్నా, వారి పిల్లలకు మాత్రం ఈ కొత్త జాతి వాళ్లంటే పడదు. ఏదో రకంగా జేక్‌ ‌పిల్లలను అవమానించాలని చూస్తుంటారు. వైరుధ్య భావాలు, అలవాట్లు ఉన్న ఆ ప్రాంత వాసులతో జేక్‌, అతని కుటుంబం నిదానంగా కలిసిపోతుంది. అయితే.. జేక్‌ను వెతుక్కుంటూ భూమి నుండి వచ్చిన క్వారిచ్‌ ‌రూపంలో వారికి ప్రమాదం ఎదురవుతుంది. జేక్‌ను, అతని కుటుంబాన్ని అంతం చేయడానికి క్వారిచ్‌ ‌వేసే ఎత్తుగడలు ఏమిటీ? వాటిని టోనోవరి సాయంతో జేక్‌ ఎలా వమ్ముచేశాడు? ఈ క్రమంలో క్వారిచ్‌ ‌కొడుకు స్పైడర్‌ ‌పోషించిన పాత్ర ఏమిటి? అనేదే ఈ సినిమా.

మొదటి చిత్రంలో అద్భుత ఖనిజ సంపద ఉన్న పండోరా గ్రహం మీద మానవులు దాడి చేయడం చూపించిన జేమ్స్ ‌కామెరాన్‌ ఇం‌దులో జేక్‌ ‌తన కుటుం బాన్ని కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నాన్ని చూపించాడు. ఈ క్రమంలో సముద్ర గర్భంలోని జీవరాశులతో అతని పిల్లలు చేసే స్నేహం, ఆ జీవుల సాయంతోనే క్వారిచ్‌పై చేసే పోరాటం ఆసక్తికరం. ప్రకృతిలోని ప్రతి జీవికి జలంతో విడదీయరాని సంబంధం ఉంటుంది. నీరు లేకపోతే ఏ జీవికీ మనుగడే లేదు. దానిని గుర్తించి నీటిని స్వచ్ఛంగా ఉంచుకోవడంతో పాటు అందులో ఉండే జీవరాశితోనూ మనం స్నేహపూర్వకంగా మెలగాలనే సందేశాన్ని జేమ్స్ ‌కామెరాన్‌ ఈ ‌సినిమా ద్వారా అందించాడు. పండోరా గ్రహంలో మొద లయ్యే ఈ సీక్వెల్‌ ‌ప్రథమార్థం కాస్తంత బోర్‌ ‌కొట్టించినా, ద్వితీయార్థం మొత్తం సాగర గర్భంలో సాగడంతో ఆసక్తి నెలకొంటుంది. అయితే… ‘అవతార్‌’ ‌చూసినప్పటి గొప్ప అనుభూతిని మాత్రం ఈ సీక్వెల్‌ ‌కలిగించదు. అక్కడో కొత్త లోకాన్ని చూపించిన జేమ్స్ ‌కామెరాన్‌… ఇక్కడ ఆ మ్యాజిక్‌ను రిపీట్‌ ‌చేయలేకపోయాడు. పైగా ఈ రెండు భాగాల లోని పాత్రలకు, జీవులకు మధ్య సారూప్యత కూడా ఎక్కువగానే ఉంది. కథ కూడా అంత గాఢతతో కూడుకున్నది కాదు. పైగా ఈ సినిమాను చూస్తుంటే జేమ్స్ ‌కామెరాన్‌ ‌గతంలో తెరకెక్కించిన ‘పిరానా-2’, ‘ఎబిస్‌’, ‘‌టైటానిక్‌’ ‌చిత్రాలు జ్ఞప్తికి వస్తాయి. సినిమా నిడివి విషయం లోనూ దర్శకుడు కాస్తంత జాగ్రత్త పడి ఉండాల్సింది. మూడుగంటల పదహారు నిమిషాల సేపు థియేటర్‌లో ప్రేక్షకుడిని ఎంగేజ్‌ ‌చేయడం అనేది కత్తిమీద సాములాంటి. రొటీన్‌ ‌సీన్స్, ‌పెద్దంత ఆసక్తి కలిగించని డ్రామా కారణంగా పదే పదే మనకు కాలహరణం జరుగుతున్న భావన కలుగుతుంది. ఇదే సమయంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కించిన సన్నివేశాలు అబ్బురపరుస్తాయి. దానికి తోడు సినిమాను త్రీడీలో చిత్రీకరించడంతో ఒకసారి ఈ సినిమాను చూడ వచ్చనే భావన అందరిలో కలుగుతుంది.

‘అవతార్‌’ ‌రెండో భాగాన్ని జనం ముందుకు తీసుకుని రావడానికి పన్నెండు సంవత్సరాల సమయం తీసుకున్న జేమ్స్ ‌కామెరాన్‌… ‌తర్వాత మూడు భాగాలను మాత్రం వెంట వెంటనే విడుదల చేయడానికి ప్లాన్‌ ‌చేశారు. మూడో భాగం 2024 లోనూ, నాలుగో భాగం 2026లోనూ, చివరిదైన ఐదో భాగం 2028లోనూ విడుదల కానున్నాయి. ‘అవతార్‌’‌తో పోల్చితే ఈ సీక్వెల్‌ ఆ ‌స్థాయి విజయం సాధిస్తుందా అనే సందేహాలు లేకపోలేదు. మరికొన్ని రోజులు గడిస్తే కానీ పక్కా లెక్కలు బయటకు రావు. ‘అవతార్‌’ ‌సీక్వెల్‌ ‌రిలీజ్‌కు ముందు.. మొదటి భాగాన్ని త్రీడీలోకి కన్వర్ట్ ‌చేసి రీ-రిలీజ్‌ ‌చేయడం, దానికి కూడా జనం పట్టం కట్టడం అనేది గొప్ప విషయం. ఆ రకంగా జనం మదిలోంచి ‘అవతార్‌’ ‌జ్ఞాపకాలు చెరిగిపోకుండా చేశాడు జేమ్స్ ‌కామెరాన్‌. ‌మొత్తంగా చూసుకుంటే.. ‘అవతార్‌: ‌ది వే ఆఫ్‌ ‌వాటర్‌’ ‌ప్రేక్షకులను నిరాశకు మాత్రం గురిచేయదనే చెప్పాలి.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram