– అరుణ

సంక్రాంతి వస్తోందంటే… సినీ జీవులకు పెద్ద పండగ! తమ అభిమాన హీరోల సినిమాలను థియే టర్లలో చూసి ఆనందపడతారు. సంక్రాంతి పెద్ద సీజన్‌ ‌కావడంతో అగ్ర కథానాయకుల చిత్రాలతో పాటు చిన్న హీరోల సినిమాలు విడుదల అవుతుంటాయి. తమిళులకూ పొంగల్‌ ‌పెద్ద పండగ కావడంతో అక్కడి స్టార్స్ ‌సినిమాలు తెలుగులోనూ డబ్‌ అవుతుంటాయి. అలాంటి అన్ని రకాల చిత్రాల విడుదలకు ఈ సంక్రాంతి సాక్షిభూతమైంది. చిత్రం ఏమంటే.. ఇదే సమయంలో పలు వివాదాలకూ తెర లేచింది!!

చిరు వర్సెస్‌ ‌బాలయ్య!

సీనియర్‌ ‌స్టార్‌ ‌హీరో బాలకృష్ణ నటించిన ‘వీర సింహారెడ్డి’ సినిమా జనవరి 12న విడుదల కాగా, చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ 13న విడుదలైంది. ఈ రెండు సినిమాలలో ఏది ముందు, ఏది తర్వాత విడుదల అవుతాయనే విషయంలో చాలా రోజుల పాటు చర్చ జరిగింది. ఎందుకంటే.. మొదట వచ్చిన సినిమాకు దక్కినన్ని థియేటర్లు రెండో సినిమాకు దొరకవు కాబట్టి. అయితే ఈసారి సంక్రాంతి బరిలో చిరంజీవి కంటే బాలకృష్ణే ఓ రోజు ముందు వచ్చాడు. చిరంజీవి, బాలకృష్ణ సంక్రాంతి బరిలో పోటీ పడటం కొత్తేమీ కాదు. అయితే ఈసారి వీరిద్దరి మధ్య నెలకొన్న పోటీకి ఓ ప్రత్యేకత ఉంది. అదేమంటే.. వీరిద్దరితో సినిమాలు తీసిన నిర్మాతలు ఒకరే. మైత్రీ మూవీ మేకర్స్ ‌పతాకంపై ఎర్నేని నవీన్‌, ‌వై. రవిశంకర్‌ ‌వీటిని నిర్మిం చారు. ఒకే నిర్మాణ సంస్థ నిర్మించిన సినిమాలు, అదీ అగ్ర కథానాయకులతో తీసిన రెండూ ఒక్కరోజు గ్యాప్‌తో రావడం అనేది గతంలో ఎప్పుడూ జరగలేదు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ‌కొత్త రికార్డ్‌ను నెలకొల్పారు. ఇక ఈ రెండు సినిమాలకు సంబంధించి మరో సారూప్యం ఏమంటే… కథానాయిక. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ నాయికగా నటించిన శ్రుతీహాసనే.. బాలకృష్ణ సరసన ‘వీర సింహారెడ్డి’లో నటించింది. కమల్‌ ‌హాసన్‌ ‌కుమార్తె అయిన శ్రుతి ఈ ఇద్దరు హీరోల సరసన నటించడం ఇదే మొదటిసారి. అలానే దర్శకులిద్దరూ ఈ అగ్ర కథానాయకులతో సినిమాలు చేయడం కూడా ఇదే మొదటిసారి. ఆ రకంగా పలు విశేషాల మేలు కలయి కగా వచ్చిన ‘వీర సింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ ఆయా హీరోల అభిమానులను అలరిస్తున్నాయి.

ఇద్దరు అగ్ర కథానాయకుల సినిమాలు సంక్రాంతికి విడుదల అవుతున్న సమయంలో ‘దిల్‌’ ‌రాజు వంటి సీనియర్‌ ‌నిర్మాత… తాను తమిళంలో నిర్మించిన ‘వారసుడు’ను సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేశారు. అయితే… ఈ నిర్ణయాన్ని ఆయన చివరి నిమిషంలో తీసుకోవడంతో తెలుగు సినిమా రంగంలో నిర్మాతల మధ్య సరైన అవగాహన లేదనే విషయం తేటతెల్లమైంది. మీడియాలో సంక్రాంతి సినిమాల విడుదల విషయంలో ఇటీవల జరిగిన చర్చ, రచ్చ మునుపె న్నడూ జరగలేదనేది వాస్తవం. ఎందుకంటే… తమిళ స్టార్‌ ‌హీరో అజిత్‌ ‌సినిమా ‘తునివు’ (తెగింపు) జనవరి 11న విడుదల అవుతుందని ప్రకటించిన తర్వాతే ‘దిల్‌’ ‌రాజు తాను 12న విడుదల చేయాలనుకున్న విజయ్‌ ‌సినిమా ‘వారిసు’ను 11న రిలీజ్‌ ‌చేస్తున్నట్టు తెలిపారు. ఆ రకంగా అజిత్‌, ‌విజయ్‌ అభిమానులు తమిళనాట ఢీ అంటే ఢీ అనుకునే పరిస్థితి ఏర్పడింది. అదే ‘వారిసు’ సినిమా తెలుగు వర్షన్‌ ‘‌వారసుడు’ను ‘దిల్‌’ ‌రాజు 11న విడుదల చేయ కుండా, 14వ తేదీన రిలీజ్‌ ‌చేశారు. సంతోషం. కానీ ఈ విషయాన్ని సినిమా విడుదలకు రెండు రోజుల ముందు వరకూ ఆయన నిర్ధారించలేదు. మొదటి నుండి ‘దిల్‌’ ‌రాజు సినిమాను కొద్దిరోజులు వాయిదా వేసుకోవాలని నిర్మాతలు కోరినా, అంగీకరించని ఆయన.. చివరి నిమిషంలో తన పట్టును సడలిస్తూ వెనక్కి వెళ్లడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అగ్ర కథానాయకులను, వారితో సినిమాలు నిర్మించిన నిర్మాత లను మానసికంగా ఆందోళనకు గురిచేసి ‘దిల్‌’ ‌రాజు పొందే ఆనందం ఏమిటనేది ప్రశ్న. అయితే.. అజిత్‌ ‘‌తెగింపు’ సినిమాను ఇటు నైజాంలోనూ, అటు ఉత్తరాంధ్రలోనూ ‘దిల్‌’ ‌రాజే పంపిణీ చేశాడు కాబట్టి.. తన సొంత సినిమా ‘వారసుడు’ను వ్యూహాత్మకంగానే 14వ తేదీకి పంపాడనే వారూ లేకపోలేదు. చిత్రం ఏమంటే.. తెలుగు స్టార్‌ ‌హీరోల సినిమాల కోసం తాను వెనక్కి వెళ్లా నని, తోటి నిర్మాతలకు మంచి జరగాలనే తాను కోరుకుంటా నని ‘దిల్‌’ ‌రాజు మీడియా సమావేశంలో ప్రకటించినా… దాన్ని నమ్మి ఆయన్ని అభినందించిన వారు లేకపోయారు!

అంతేకాదు.. ఈ నెల 14న ‘వారసుడు’ను విడుదల చేయడంతో సంతోష్‌ ‌శోభన్‌ ‌మూవీ ‘కల్యాణం కమనీయం’ కు అది పోటీగా నిలిచి ఈ చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌కు కాస్తంత ఇబ్బందిగానే మారింది. ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తుంటే ‘దిల్‌’ ‌రాజు ఉద్దేశపూర్వకంగానే కొన్ని చర్యలు తీసుకుంటున్నాడని తెలుగు నిర్మాతలు భావిస్తున్నారు. ఎందుకంటే.. మైత్రీ మూవీ మేకర్స్ ‌సంస్థ ఇప్పుడిప్పుడే పంపిణీ రంగంలోకి అడుగుపెడుతోంది. అలానే యూవీ క్రియేషన్స్ ‌ఫిల్మ్ ఎగ్జిబిషన్‌లో జోరు చూపుతోంది. ఈ రెండు రంగాల్లోనూ ‘దిల్‌’ ‌రాజు ఇప్పటికే ఉన్నారు. కాబట్టి వీరిద్దరికీ ఏదో రకంగా చెక్‌ ‌పెట్టాలనుకుని, ఈ సంక్రాంతికి ఇలా మైండ్‌ ‌గేమ్‌ ఆడాడని చిత్రసీమలోని కొందరు గుసగుసలాడుతున్నారు. వాస్తవాలేమిటనేది పక్కన పెడితే.. సంక్రాంతి సందర్భంగా ఈ ఐదు సినిమాల విడుదల సమయంలో జరిగిన తంతు.. రాబోయే రోజుల్లో సినిమాల విడుదలపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది. ఇక సంక్రాంతి బరిలో నిలిచి, గెలిచిన చిత్రాలు ఏవనేది బేరీజు వేయడానికి మరి కొద్ది రోజులు పడుతుంది.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram