– జమలాపురపు విఠల్‌రావు

చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తున్న ‘జీరో కొవిడ్‌’ ‌విధానం భస్మాసుర హస్తం మాదిరిగా మారడం వర్తమాన చరిత్ర . జీ జిన్‌పింగ్‌ ‌భవితవ్యం మీద అనుమానాలు రేకెత్తిస్తున్న పరిణామం ఇప్పుడు మహాకుడ్యం వెనుక శరవేగంగా జరుగుతున్నది. నాలుగేళ్ల క్రితం ఊహాన్‌ ‌నగరంలో మొట్టమొదటి కరోనా వైరస్‌ ‌కేసును కనుగొన్న తర్వాత లాక్‌డౌన్‌, ‌పెద్దఎత్తున పరీక్షలు, క్వారంటైన్‌ ‌వంటి కొవిడ్‌-19 ‌నిరోధక చర్యలు చైనా ప్రజల జీవితాల్లో భాగమైపోయాయి. కానీ కొవిడ్‌ ‌కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం తన ఉక్కు పిడికిలిని ఇంకాస్త బిగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజలు తిరగబడుతున్నారు. 1989 నాటి తియనాన్మెన్‌ ‌స్క్వేర్‌ ‌హింసాత్మక చరిత్రను పునరావృతం చేయడానికేనన్నట్టు ప్రభుత్వ చర్యలు కనిపిస్తున్నాయి. ఎన్ని గట్టి చర్యలు తీసుకుంటున్నా ఇటీవల ఒక్కరోజులో నలభయ్‌ ‌వేల కేసులు నమోదై కలవర పెట్టాయి.

సాధారణ ప్రజలు, విద్యార్థులు అంతా వీధులకెక్కారు. కొవిడ్‌ ‌పేరుతో నిర్బంధం ఇంకానా అని గొంతెత్తుతున్నారు.  ప్రజల్లో వెల్లువెత్తుతున్న నిరసనల నేపథ్యంలో చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం తక్షణమే కొన్ని ఉపశమన చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఉరుమ్‌కిలోని చాలా ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ఎత్తేయడం, చెంగ్డూలోని క్వారంటైన్‌ ‌కేంద్రాన్ని తక్షణమే మూసేయడం, వృద్ధులకు వ్యాక్సినేషన్‌ ‌పక్రియను వేగంగా పూర్తిచేస్తామని ప్రకటించడం ఇందులో భాగమే. అయితే ఉన్నఫళంగా లాక్‌డౌన్‌ ఎత్తేస్తే మరణాలు ఒక్కసారిగా పెరిగిపోతాయని ప్రభుత్వం భయపడుతోంది. ఇందుకు కారణం ఉంది. నవంబర్‌ ‌మొదట్లో వచ్చిన వారంరోజుల ప్రభుత్వ సెలవు దినాల నుంచి చైనాలో కొవిడ్‌ ‌కేసులు పెరగడం మొదలై ఆదే నెల 29 నాటికి రోజువారీ కేసుల సంఖ్య 71 వేలు నమోదు కావడం ప్రభుత్వంలో ఆందోళన పెంచింది. మోడెలింగ్‌ అధ్యయనాల ప్రకారం చైనా ప్రభుత్వం కొవిడ్‌ ‌నిబంధనలను తొలగిస్తే, 160 నుంచి 280 మిలియన్‌ ‌ప్రజలకు వైరస్‌ ‌సోకి, 1.3 నుంచి 2.1 మిలియన్‌ ‌ప్రజల మరణాలకు దారితీయవచ్చు. ముఖ్యంగా వ్యాక్సినేషన్‌ ‌చేయని వృద్ధుల్లో మరణాల సంఖ్య అధికంగా ఉంటుందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ప్రభుత్వ కఠిన వైఖరికి ఇది ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌ ‌వరకు చైనాలో లాక్‌డౌన్‌ ఇదే విధంగా కొనసాగుతాయన్నది సర్వత్రా వ్యక్తమవుతున్న అభిప్రాయం. ఇదే సమయంలో, లాక్‌డౌన్‌ ‌వల్ల తమ జీవితాలు అస్తవ్యస్తమవుతున్నాయని యువకుల్లో ఆందోళన వ్యక్తమవుతుండటం కూడా సహజమే. జీరో కొవిడ్‌ ‌విధానం పుణ్యమాని దేశంలో లక్షలాది మంది ప్రజలు నెలల తరబడి తమ ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తోంది. కొవిడ్‌ ‌వైరస్‌ ‌కనిపించి నాలుగేళ్లయినా, ఆ వైరస్‌ ‌వ్యాప్తి నిరోధానికి ఇంకా సతమతమవుతున్న దేశం ఒక్క చైనానే! ఇతర దేశాలను కొవిడ్‌ అతలాకుతలం చేసినప్పటికీ, ఇప్పుడు ఆయా దేశాలు వైరస్‌ ‌బారి నుంచి బయటపడి, క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటే, చైనాలో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొనడం విచిత్రం!

అత్యంత కఠినమైన సామాజిక క్రమం ఉండే చైనాలో ఇటువంటి ‘అరుదైన’ నిరసనలు వ్యక్తం కావడం ఒకరకంగా విశేషమే. ముఖ్యంగా జిన్‌ ‌జియాంగ్‌ ‌ప్రావెన్స్‌కు చెందిన ఉరుమ్‌కిలోని ఒక పెద్ద అపార్ట్‌మెంట్‌లో గత నవంబర్‌ 24‌న అగ్ని ప్రమాదం సంభవించిన తర్వాత దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థుల్లో నిరసనలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. కేవలం ‘జీరో కొవిడ్‌’ ‌విధానం, దానిలోని అమానుష ఆంక్షల వల్లనే ఈ అగ్ని ప్రమాదంలో పది మంది నిస్సహాయంగా మరణించడానికీ, మరో తొమ్మిది మంది గాయ పడడానికీ కారణమయ్యాయని ప్రజలు ఆరోపిస్తు న్నారు. ‘కొవిడ్‌ ‌నిబంధనల’ పేరుతో భవనం చుట్టూ అమర్చిన బ్యారికేడ్ల వల్ల అగ్నిమాపక సిబ్బంది నిస్సహాయంగా ఉండిపోవాల్సిరావడంతో సమ యానికి సహాయం అందక ప్రాణనష్టం జరిగిందన్న వాస్తవం ప్రజానీకంలో ఆగ్రహాన్ని పెంచింది.

నిజానికి ఉరుమ్‌కి నగరంలో సుదీర్ఘకాలంలో కొవిడ్‌ ‌నిబంధనలు అమలవుతున్నాయి. ‘జీరో కొవిడ్‌’ ‌విధానం పేరుతో ప్రభుత్వం ఈ ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. ఈ నిబంధనల పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో చైనాలో అత్యంత ప్రాచుర్యంలో ఉన్న సోషల్‌ ‌మీడియా వేదికలైన ‘వుయ్‌బో’, ‘వుయ్‌చాట్‌’ ‌ద్వారా ప్రజలు తమ అసంతృప్తిని పెద్దఎత్తున వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీయడమే కాకుండా, తమ జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్న ‘జీరో కొవిడ్‌’ ‌విధానాన్ని తక్షణమే ఎత్తేయాలని ప్రజలు డిమాండ్‌ ‌చేయడమే కాదు, ఉరుమ్‌కి అపార్ట్‌మెంట్‌ ‌బాధితులను ప్రభుత్వమే ఆదుకోవాలని కూడా సోషల్‌ ‌మీడియా వేదికల ద్వారా కోరుతున్నారు. అపార్ట్ ‌మెంట్‌లో అగ్నిప్రమాదం జరిగిన రోజున, సోషల్‌ ‌మీడియా వేదికల్లో, ప్రభుత్వం అత్యంత సున్నితంగా పరిగణించే అంశాలపై అభిప్రాయాలు ట్రోల్‌ ‌కావడం నిజంగా ఆశ్చర్యకరమే. అంతేకాదు చైనా సోషల్‌ ‌మీడియాలో ఈ విషయంపై చర్చలు జరగడం అత్యంత అరుదైన విషయం!

ఉత్ప్రేరకంగా పనిచేసిన ఉరుమ్‌కి సంఘటన

చైనాలో నిరసనలు అరుదైనవేం కావు. కార్మిక, ఆస్తులు, ఆర్థిక సమస్యలపై నిరసనలు జరగడం చాలా సహజం. కాకపోతే అవి కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమతమయ్యేవి. ప్రస్తుతం కేవలం ఒకే ఒక్క అంశం దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం కావడానికి కారణమవుతుండటం విశేషం. అదే  జిన్‌పింగ్‌ అనుసరిస్తున్న ‘జీరో కొవిడ్‌’ ‌విధానం. అయితే ఉరుమ్‌కి సంఘటన ప్రజల్లో రగులుతున్న కోపాగ్ని మరింతగా ప్రజ్వరిల్లడానికి ఒక ఉత్ప్రేరకంగా పనిచేసిందనే చెప్పాలి.

నవంబర్‌ 26‌న షాంఘై నగరంలోని ఉలుమ్‌కి రోడ్డులో (దీనికే ఉరుమ్‌కి అని పేరుంది) చైనా కమ్యూనిస్టు పాలన చరిత్రలో ఒక అరుదైన నిరసన వ్యక్తమైంది. ‘కమ్యూనిస్టు పార్టీ గద్దె దిగాలి’, ‘జిన్‌పింగ్‌ ‌పదవి నుంచి తప్పుకోవాలి’ అన్న నినాదాలు ఇక్కడ వినిపించడం ఎంతో మందిని ఆశ్చర్యానికి గురిచేసిన అంశం. ఈవిధంగా షాంఘై నగరంలో వందలాది మంది ప్రదర్శనకారులు వీధుల్లోకి రావడంతో అప్రమత్తమైన పోలీసులు వీరందరినీ బలవంతంగా క్వారంటైన్‌ ‌కేంద్రానికి తరలించడం మరో సంఘటన. లాక్‌డౌన్‌ ‌వల్ల నగర ప్రజలు నిత్యావసరాలు, మందులు ఇతర అవసరాల కోసం బయటకు రావడం కుదరడం లేదు. వారాల తరబడి ఇదే పరిస్థితి కొనసాగడం వారిలో తీవ్ర అసహనాన్ని, అసంతృప్తిని రగిల్చి, చివరకు ఆందోళనకు దారితీసింది. అదే విధంగా నవంబర్‌ 27 ‌రాత్రి, బీజింగ్‌ ‌నగరంలో వందలాది మంది నిరసనకారులు ‘పత్రికా స్వేచ్ఛ’ కోరుతూ నినాదాలు చేయడం, చెంగ్డూలో ‘చైనాకు ఇప్పుడు చక్రవర్తి అవసరం లేదు’ అనే నినాదాలు వినిపించడం, చైనా ప్రజల్లో స్వేచ్ఛ పట్ల గూడుకట్టుకున్న మక్కువను వెల్లడిస్తున్నాయి. ఇవన్నీ రాజ్యాంగాన్ని సవరించి మూడోసారి అధికార పీఠాన్ని హస్తగతం చేసుకున్న జిన్‌పింగ్‌కు వ్యక్తమవుతున్న వ్యతిరేకతకు ప్రత్యక్ష నిదర్శనాలని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. గంగ్‌ఝావూలో ప్రజలు ‘ఏవిధమైన సంకెళ్లు లేని స్వేచ్ఛ కోసం నా జీవితం పడుతున్న ఆరాటాన్ని నువ్వు అర్థం చేసుకుంటావనుకోవడం లేదు’ అనే అర్థంతో వచ్చే పాటను కాంటొనీస్‌ ‌భాష (సైనో-టిబెటన్‌ ‌భాష)లో పాడుతూ తమ నిరసన తెలిపారు. సరిగ్గా 1989లో తియానెన్మెన్‌ ‌స్క్వైర్‌ ‌వద్ద 59 ట్యాంకులకు ఎదురుగా ధైర్యంగా నిలబడి నిరసన తెలిపిన ఒక గుర్తు తెలియని ఆందోళనకారుడిని (ట్యాంక్‌మాన్‌)‌ను గుర్తుచేసే విధంగా ఇప్పుడు పోలీసు జీపునకు ఎదురెళ్లి ముగ్గురు నిరసన తెలపడం, వారిని పోలీసులు అరెస్ట్ ‌చేయడం వెంటవెంటనే జరిగిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా చైనాలో వైరలైంది.

చైనా ప్రజల్లో ప్రభుత్వమంటే భయం కంటే, గూడుకట్టుకున్న తీవ్ర అసహనం ఎక్కువని ఈ పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, చైనా ప్రజలు ‘కమ్యూనిస్టు ప్రభుత్వ పాలన కింద బానిసత్వపు సంకెళ్ల నుంచి బయట పడేందుకు చేస్తున్న పోరాటం ఇది’. బానిసలా బతకొద్దు, పౌరుడిగా బతుకు అన్న నినాదం వినిపిస్తున్నది. ప్రస్తుతం దేశంలో నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్న తరుణంలో అత్యంత సున్నితమైన, ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించే 1989 తియనాన్మెన్‌ ‌స్క్వేర్‌ ‌వద్ద ఆందోళన సంఘటన గురించి కూడా ప్రజలు ధైర్యంగా చర్చించుకోవడం మరో విశేషం. అంతేకాదు ఉరుమ్‌కి ప్రమాదంలో పది మంది మృతి చెందిన సంఘటనకు బాధ్యత వహిస్తూ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని కూడా నిరసనకారులు డిమాండ్‌ ‌చేస్తున్నారు.

కప్పిపుచ్చే యత్నం

దేశంలో నిరసనలు ప్రారంభమైన కొద్ది గంటల వరకు ప్రభుత్వ మీడియాలో వీటికి పెద్దగా చోటు లేకపోయినా ‘విదేశీ శక్తులు’ అనే పడికట్టు మాటలతో కప్పిపుచ్చే యత్నం జరిగింది. ఇదే సమయంలో వివిధ నగరాల్లో పోలీసుల సంఖ్య విపరీతంగా పెరిగింది.  నిరసనల్లో పాల్గొన్న వారిని గుర్తించే జీపీఎస్‌, ‌ఫోన్‌ ‌సర్వీసుల ద్వారా ప్రయత్నాలు చేసింది. అయితే కొవిడ్‌ ‌నిబంధనలను నిరసిస్తూ షాంఘై నగరంలో నవంబర్‌ 27‌న ప్రారంభమైన నిరసనలు చాలా వేగంగా ఇతర నగరాలకు వ్యాపించాయి. కేవలం కొద్ది గంటల్లోనే సోషల్‌ ‌మీడియా పుణ్యమాని ఇవి ఏడు నగరాలకు విస్తరించడమే కాదు, నిరనసన కారులు పోలీసులతో ఘర్షణలకు దిగిన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. దేశ రాజధాని బీజింగ్‌ ‌సహా, డజన్ల కొద్దీ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు వీధుల్లోకి వచ్చారు. మావో తర్వాత అత్యంత శక్తిమంతుడిగా పేరుపొందిన జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా ఈ ఆందోళనలు జరగడమే చైనాలో చోటు చేసుకున్న అసాధారణ పరిణామం. తర్వాత క్రమంగా సోషల్‌ ‌మీడియాలో ప్రసారమైన వీడియోల ప్రకారం దేశంలోని 50 యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు ఆందోళనల్లో పాల్లొన్నట్టు తెలుస్తోంది. తూర్పున నాన్‌జింగ్‌, ‌దక్షిణాన గంగ్‌ఝౌ, ఉత్తరాన బీజింగ్‌ల్లో తెల్లటి రక్షణ దుస్తులు ధరించిన నిరసనకారులు బ్యారీకేడ్లు ధ్వంసం చేస్తూ పోలీసులతో తలపడుతున్న దృశ్యాలు సోషల్‌ ‌మీడియాలో విపరీతంగా వైరల్‌ అయ్యాయి. చెంగ్డూ, దాలి, లాన్‌ఝవు వంటి నగరాల్లో కూడా ఇటువంటి ప్రదర్శనలే కనిపించాయి. నవంబర్‌ 27‌న బీజింగ్‌లోని ప్రఖ్యాత సింఘువా యూనివర్సిటీ విద్యార్థులు ఉరుమ్‌కి మృతులకు నివాళులు అర్పిస్తూ ప్రదర్శన జరిపారు.

ఒకే గళంతో నిరసన

చైనాలో ఇటువంటి ప్రదర్శనలు 1919, మే నెలలో, 1989 తియనాన్మెన్‌ ‌స్క్వేర్‌ ‌వద్ద మాత్రమే చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు కమ్యూనిస్టు ప్రభుత్వం తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందన్న భయంతో ప్రజలు ఎక్కువగా ప్రదర్శనల్లో పాల్గొనకపోవడం జరిగేది. ఎందుకంటే ఇప్పటికే వారు ప్రభుత్వ నిబంధనల పుణ్యమాని అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవేళ అటువంటి ఆందోళనలు జరిగితే, ప్రభుత్వం కఠినంగా అణచివేయడమో లేక అవి పెద్దగా ప్రాచుర్యంలోకి రాకపోవడమో జరిగేది. కానీ ఈసారి పరిస్థితి అందుకు భిన్నం. గడచిన కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ప్రజలు ఒకే గళంతో ప్రభుత్వంపై ఎదురుతిరగడం ప్రపంచవ్యాప్తంగా ఆశ్చర్యానికి గురిచేస్తున్న అంశం. తాజా పరిణామాలు చైనా ప్రజలు, జిన్‌పింగ్‌ను నియంతగా చూడడానికి అంగీకరించడం లేదని స్పష్టం చేస్తున్నాయి. గతంలోని నిరసనలు కేవలం వలస కార్మికులు, వేరేచోట గృహాలు కేటాయించినవారు తమకు కలుగుతున్న ఇబ్బందులకు వ్యతిరేకంగా చేసే ఆందోళనలకే పరిమితం. ఇందులో మధ్యతరగతి ప్రజలు పాలుపంచుకునేవారు కాదు. కానీ ప్రస్తుతం చైనా మధ్యతరగతి ప్రజలు కూడా రోడ్డెక్కడం కీలకాంశం. నిజానికి 1989 నాటి ఆందోళనకు, ఇప్పటి ప్రజల వ్యతిరేకతకు అసలు పోలిక లేకపోయినప్పటికీ, కమ్యూనిస్టు ప్రభుత్వానికి ఎదురైన అతిపెద్ద సవాలుగా దీనిని పరిగణించవచ్చు. ప్రస్తుతం సంపూర్ణ మెజారిటీ, సాంకేతిక ఆధిపత్యాన్ని కలిగిన సీసీపీకి ఈ ఆందోళనలను కఠినంగా అణిచి వేస్తామన్న ధైర్యం ఉండవచ్చు. కానీ తమ విధానాలు సాధారణ ప్రజల్లో ఎంతటి తీవ్రస్థాయి వ్యతిరేకతకు దారితీస్తాయనేది చైనా పాలకులకు అర్థమయ్యే ఉండాలి. జిన్‌పింగ్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ‘చైనా పునరుజ్జీవం’ క్రమంగా ధ్వంసమవుతూ వస్తోంది. ప్రస్తుతం ఆందోళనలు విస్తరిస్తున్న తీరు చూస్తుంటే, దీన్ని అణచి వేయడంలో ప్రభుత్వం ఎంతమేర విజయం సాధిస్తుందనేది ప్రశ్నార్థకమే. ప్రస్తుత పరిణామాలు చైనా, జిన్‌పింగ్‌ల ప్రతిష్టను మసకబారుస్తున్నాయన్నది మాత్రం అక్షరసత్యం.

ప్రపంచ దేశాల ఆసక్తి

చైనాలో కొనసాగుతున్న నిరసనలు క్రమంగా ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తుండటం విశేషం. నవంబర్‌ 28‌న ఐక్యరాజ్య సమితి ఒక ప్రకటన చేస్తూ, ప్రదర్శనకారుల న్యాయబద్ధమైన హక్కులను కాపాడాలని చైనాను కోరింది. ప్రస్తుతం చైనాలో మధ్యతరగతి ప్రజలు, యాపిల్‌ ‌సరఫరాదారు ఫాక్స్‌కాన్‌కు చెందిన బ్లూ-కాలర్‌ ‌శ్రామికులు కొవిడ్‌-19 ‌నిబంధనలకు వ్యతిరేకంగా ఏకతాటిపైకి వచ్చి ఉద్యమించడం జిన్‌పింగ్‌ ‌నేతృత్వంలోని కమ్యూనిస్టు ప్రభుత్వానికి కొరుకుడు పడని అంశంగా మారింది. విచిత్రమేమంటే ప్రజల్లో నిరసనలు ఒకేసారి కాకుండా, క్రమంగా విస్తరిస్తుండటం తాజా పరిణామంలోని ప్రత్యేకత. లాక్‌డౌన్‌ ‌నిరసనలు రాజకీయ మార్పును, పత్రికాస్వేచ్ఛను డిమాండ్‌ ‌చేయడం ఇప్పుడు జిన్‌పింగ్‌కు విషమ పరీక్షను పెడుతున్నాయి. ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న తక్కువ వేతనాలకు వ్యతిరేకంగా కూడా ఈ నినాదాలు తోడు కావడం కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

బీజింగ్‌లోని సింఘువా యూనివర్సిటీ విద్యార్థులు ‘ప్రజాస్వామ్య అనుకూల గళం’ వినిపించడం 1989 నాటి తియానన్మెన్‌ ‌సంఘటన తాలూకు జ్ఞాపకాలు.. కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని నీడలా వెంటాడుతున్నాయన్న సత్యాన్ని వెల్లడిస్తున్నాయి. అంతేకాదు ‘తెల్ల పేపర్ల’తో నిరసన తెలపడం, ఆందోళనకారుల్లో సృజనాత్మకతను మరోసారి బయటపెట్టాయి. ప్లకార్డుల ప్రదర్శన నిషేధం కాబట్టి, తెల్లపేపర్ల ప్రదర్శన ద్వారా ఆందోళనకారులు ‘ఆగ్రహం తీవ్రం.. అరెస్టు అసాధ్యం’ అంటూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా జిన్‌పింగ్‌ ‌నేతృత్వంలోని అగ్రనాయకత్వం ‘జీరో కొవిడ్‌’’ ‌విధానాన్ని విడనాడటానికి ఎంతమాత్రం సుముఖంగా లేకపోవడం మొండిపట్టుకు నిదర్శనం. 20వ కాంగ్రెస్‌ ‌సమావేశాలు మార్పులకు దోహదం చేస్తాయన్న ఆశ ప్రజల్లో ఉండేది. కానీ, జిన్‌పింగ్‌ ‌మళ్లీ అధికారంలోకి రావడం, విధానాల్లో ఎటువంటి మార్పులు లేకపోవడం వారిలో తీవ్ర నైరాశ్యానికి దారితీసింది. జెన్‌ఘావు నగరంలోని ఐఫోన్‌ ‌ఫ్యాక్టరీలో వరుసగా ఐదురోజుల పాటు లాక్‌డౌన్‌ ‌విధించడం, జెన్‌ఘావుకు చెందిన ఎనిమిది జిల్లాల్లో ‘హైరిస్క్’ అపార్ట్‌మెంట్ల చుట్టూ బ్యారికేడ్లను ఉంచి ప్రజలను బయటకు రాకుండా నిషేధించడంతో అరవై లక్షలమంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా కరోనా రిస్క్ ‌చాలా తక్కువ ఉన్నప్పటికీ, కఠిన నిబంధనలు వీరిని ఆగ్రహానికి గురిచేశాయి. చైనా ఆగ్నేయ ప్రాంతానికి చెందిన తయారీ హబ్‌ ‌గన్‌ఝావు నగరంలోని ప్రజలను కొవిడ్‌ ‌నెగెటివ్‌ ‌సర్టిఫికెట్లు లేకుండా బయటకు రాకూడదన్న ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక హైఝు జిల్లాలో ప్రజలు బ్యారికేడ్లను ధ్వంసం చేసి బయటకు వచ్చే వీడియోలు సోషల్‌ ‌మీడియాలో వైరల్‌ అయ్యాయి.

అంత తేలిక కాదు!

కొన్ని రోజుల క్రితం వరకు, చైనా వ్యాప్తంగా 60 పట్టణాలు, నగరాల్లో లాక్‌డౌన్‌ ‌పుణ్యమాని మిలియన్ల కొద్దీ ప్రజలు ఇళ్లకే పరిమితయ్యారు. మూడో సారి దేశాధినేతగా ఎన్నికైన జిన్‌పింగ్‌పై ఈ పరిస్థితి తీవ్ర వత్తిడిని కలుగజేస్తోంది. ప్రస్తుతం కమ్యూనిస్టు ప్రభుత్వం అనుసరిస్తున్న ‘డైనమిక్‌ ‌జీరో-కొవిడ్‌ ‌విధానం’ విజయం అనేది, జిన్‌పింగ్‌ ‌రాజకీయంగా విజయం సాధించినంత తేలిక కాదనేది వర్తమాన పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ ఇది విఫలమైతే, ఇంతటి ధైర్యశాలిగా పేరుపొందిన జిన్‌పింగ్‌కు నష్టం కలిగించకమానదు. విచిత్రమేమంటే, ప్రపంచంలోని మిగిలిన దేశాలు వ్యాక్సిన్‌లు ఉపయోగిస్తూనే, వైరస్‌తో జీవితాలను ఏవిధంగా గడపాలన్నది నేర్చుకుంటే, చైనాలో అందుకు పూర్తి భిన్నస్థితి నెలకొంది. అసలు వైరస్‌ను సమూలంగా అంతం చేయాలన్న లక్ష్యంతో అనుసరిస్తున్న జీరో-కొవిడ్‌ ‌విధానం లాక్‌డౌన్‌కు దారితీస్తోంది. లాక్‌డౌన్‌ను కచ్చితంగా అమలు పరచడం, పెద్దఎత్తున వైరస్‌ ‌పరీక్షల నిర్వహణ, ప్రయాణాలపై విధించిన ఆంక్షల కారణంగా చైనా ఆసుపత్రులకు కొవిడ్‌ ‌రోగులు వెల్లువెత్తడం ఆగిపోయింది. కానీ దీని ప్రతికూల ఫలితం మరోరూపంలో అంటే నిరుద్యోగం రూపంలో వ్యక్తమవుతోంది. అధికారిక లెక్కల ప్రకారం లాక్‌డౌన్‌ ‌కారణంగా దేశంలో నిరుద్యోగం ఏకంగా 18.7%కి చేరుకుంది. ఈ ఏడాది మొదట్లో ఇది 20%కి కాస్త అటు ఇటుగా కొనసాగింది. అయితే ఎంతటి సామాజిక, ఆర్థిక వత్తిళ్లు ఎదురైనా ప్రభుత్వం తన జీరో కొవిడ్‌ ‌విధానం నుంచి వెనక్కి తగ్గడానికి ఇష్టపడటం లేదు. ఇదే సమయంలో ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ను తప్పనిసరి చేయకపోవడం గమనార్హం. అంతేకాదు, ప్రజల్లో వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించేందుకు విస్తృతంగా కార్యక్ర మాలను చేపట్టడానికి ప్రభుత్వం అంత ఉత్సాహం చూపడంలేదు. అదీ కాకుండా దేశీయంగా తయారైన వ్యాక్సిన్లనే ఉపయోగించాలన్న దృఢ నిర్ణయంతోనే ప్రభుత్వం ముందుకెళుతోంది. అంతర్జాతీయంగా తయారైన వ్యాక్సిన్లు, చైనా తయారీ వ్యాక్సిన్‌ల కంటే సమర్థవంతంగా పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవడం లేదు. ఫలితంగా ప్రపంచంలో ఐదోవంతు జనాభా కలిగిన చైనాలో అంతర్గత జీవనం ఒక పెద్ద ‘బుడగ’ను తలపిస్తోంది. ముఖ్యంగా ప్రజల జీవనోపాధులు దాదాపు దెబ్బతిన్నాయి. లాక్‌డౌన్‌ను, ఆంక్షలను ఎంత పకడ్బందీగా అమలు చేస్తున్నా, వైరస్‌ ‌వ్యాప్తి ఆగడంలేదు. గత అక్టోబర్‌లో జిన్‌జియాంగ్‌ ‌నుంచి చాలా పశ్చిమ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు నిలిపేసి, లాక్‌డౌన్‌ అమలు పరచినా వైరస్‌ ‌వ్యాప్తిని నిలువరించలేకపోయామని ప్రభుత్వ అధికారులే అంగీకరిస్తున్న పరిస్థితి.

ప్రైవేటు రంగం కుదేలు!

జీరో కొవిడ్‌ ‌విధానం ప్రైవేటు రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా చైనా పట్టణ ఉద్యోగ కల్పనలో 4/5శాతం పాత్ర ప్రైవేటు రంగానిదే. ఆలీబాబా, టెనిసెంట్‌, ‌దిది వంటి చైనా టెక్‌ ‌దిగ్గజాలు పెద్దమొత్తంలో లాభాలను కోల్పోవడమే కాకుండా, తమ ఉద్యోగుల నుంచి అసంతృప్తిని ఎదుర్కొంటున్నాయి. చైనాలో జీరో కొవిడ్‌ ‌విధానం అమల్లో భాగంగా పాక్షిక లేదా పూర్తి లాక్‌డౌన్‌ ‌పుణ్యమాని జీడీపీలో వృద్ధి నాలుగోవంతు దెబ్బతిన్నది. చైనా తయారీ హబ్‌ ‌షాంఘై నగరం రెండు నెలలుగా లాక్‌డౌన్‌లో కొనసాగుతోంది. మిగిలిన నగరాల పరిస్థితి ఇంతకంటే భిన్నంగా ఏమీ లేదు. చైనాలో పరిశ్రమల కార్యకలాపాలు ఒక్కసారిగా నిలిచి పోవడంతో, వాటిపై ఆధారపడిన ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్‌ ‌రంగాల పరిశ్రమల్లో ఉత్పత్తి తీవ్రంగా దెబ్బతిన్నది. ఈవిధంగా సరఫరా మార్గాలు వరుసగా దెబ్బతినడంతో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరగడం మరో విపరిణామం. చైనాలో కొవిడ్‌ ఆం‌క్షలు, అమెరికా- చైనాల మధ్య సంబంధాల్లో నెలకొన్న ఉద్రిక్తతలకు తోడు ఉక్రెయిన్‌ ‌యుద్ధ ప్రభావం ప్రపంచ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. చైనా ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడంతో విదేశాలకు 140 బిలియన్‌ ‌డాలర్ల మేర ఎగుమతులు పడిపోయే ప్రమాదం ఏర్పడింది. ముఖ్యంగా హాంకాంగ్‌, ‌యూఎస్‌, ‌జపాన్‌, ‌దక్షిణ కొరియా, జర్మనీ దేశాలు ఈ ప్రతికూల ప్రభావానికి గురవుతాయి. ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్‌ ‌రంగాల్లో 1.3 ట్రిలియన్‌ ‌డాలర్ల మేర చైనా ఉత్పత్తులను ప్రపంచ దేశాలు వినియోగిస్తున్నాయి. ప్రస్తుతం ఈ రంగం దెబ్బతినడంతో ప్రధానంగా దక్షిణ కొరియా, వియత్నాం, భారత్‌, ‌జర్మనీ దేశాలు ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. ఇక ఇతర దేశాలకు షిప్పింగ్‌ ‌కార్యకలాపాలు 2022లో మొత్తం నిదానించాయి. 2022 మార్చి, ఏప్రిల్‌ ‌నెలల కాలంలో చైనా పోర్టుల్లో నిలిచి ఉన్న కంటైనర్‌షిప్‌ల సంఖ్య బాగా పెరిగింది. అయితే పోర్టుల్లో కార్యకలాపాలు కొనసాగుతుండటం ఒక అదృష్టంగా చెప్పాలి. ఉక్రెయిన్‌ ‌యుద్ధం కారణంగా వస్తుమార్కెట్‌లో డిమాండ్‌, ‌సప్లై-డిమాండ్‌ల మధ్య పొంతన లేకపోవడంతో ఉద్రిక్తతలు నెలకొంటు న్నాయి. ఆర్థికంగా చైనా పనితీరు నిరాశాజనకంగా ఉండటానికి కొవిడ్‌ ‌నిబంధనలే కారణమని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాలు అభిప్రాయపడటం గమనార్హం. నిజానికి కొవిడ్‌ ‌మహమ్మారి చైనాపై మాత్రమే కాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రస్థాయిలో ప్రతికూల ప్రభావాన్ని చూపింది.

భారత్‌పై ప్రభావమెంత?

కొవిడ్‌-19 ‌నేపథ్యంలో చైనాలోని వివిధ నగరాల్లో లాక్‌డౌన్‌ ‌కొనసాగుతుండటం భారత్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా తయారీ, సరఫరా వ్యవస్థ దెబ్బతినడం ఇందుకు ప్రధాన కారణం. చైనాలో ఈ సరఫరా వ్యవస్థ ఇదే మాదిరి కొనసాగితే, అత్యధిక దిగుమతుల భాగస్వామిగా ఉన్న భారత్‌పై ఈ ప్రభావం తప్పక పడి తీరుతుంది. 2022లో భారత్‌ ‌మొత్తం దిగుమతులు 609 బిలియన్‌ ‌డాలర్లు కాగా, ఇందులో చైనా వాటా 15%. అంటే 94.2 బిలియన్‌ ‌డాలర్లు. అదే 2021లో భారత ఆర్థిక వ్యవస్థ 6.6% మందగించినప్పుడు చైనా నుంచి దిగుమతులు 17% తగ్గిపోయి, 65.2 బిలియన్‌ ‌డాలర్లు నమోదు చేశాయి. చైనాలో కొవిడ్‌ ‌తీవ్రత అధికంగా ఉన్నా భారత్‌ ‌నుంచి ఎలక్ట్రానిక్‌ ‌వస్తువులకు డిమాండ్‌ ‌తగ్గకపోగా పెరగడం గమనార్హం. చైనా నుంచి 16 రకాల వస్తువులు ప్రధానంగా భారత్‌ ‌దిగుమతి చేసుకుంటున్నది. కేవలం వీటి కారణంగానే మనదేశం చైనాకు అతిపెద్ద దిగుమతి భాగస్వామిగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చైనా నుంచి దిగుమతులు మందగిస్తే, ఇప్పటికిప్పుడు ఆ లోటును భర్తీ చేయడం భారత్‌కు కష్టం. ముఖ్యంగా మనదేశంలోని తయారీ పరిశ్రమకు అవసరమైన, ఎలక్ట్రానిక్‌ ‌వినియోగ వస్తువుల సరఫరా వ్యవస్థ దెబ్బతింటుంది. కేవలం ఈ కారణంగానే చైనా నుంచి దిగుమతులను తగ్గించుకోవడం భారత్‌కు సాధ్యం కావడంలేదు. మరి భారత్‌ ఎగుమతుల విషయానికి వస్తే ఈ ఏడాది జనవరి-మార్చి మధ్యకాలంలో 30.3% క్షీణించాయి. విచిత్ర మేమంటే చైనా నుంచి డిమాండ్‌ ‌తగ్గడం వల్ల మన ఎగుమతులు మందగించిన ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఎందుకంటే 2022లో చైనాకు మన ఎగుమతులు 5.1% మాత్రమే!

పెట్టుబడుల లక్ష్యంగా భారత్‌!

‌చైనా లాక్‌డౌన్‌ ‌పుణ్యమాని భారత్‌కు పెట్టుబడుల విషయంలో ప్రయోజనం కలిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. సానుకూల అభివృద్ధి, ద్రవ్యోల్బణం అదుపులో ఉన్న నేపథ్యంలో భారత్‌లో పెట్టుబడులకు సానుకూల వాతావరణం ఉన్నదని, స్టేట్‌ ‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇం‌డియా నివేదిక పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో సానుకూల పరిస్థితులు లేకపోవడంతో, భారత్‌కు ప్రత్యామ్నాయం మరోటి కనిపించడంలేదు. చైనాలో నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతినడం కూడా దీర్ఘకాలంలో భారత్‌కు ప్రయోజనకరంగా మారుతుందని అంచనా. అదీ కాకుండా చైనాలో ఇళ్ల కొనుగోలుదారులు రుణాలు తిరిగి చెల్లించబోమని తెగేసి చెబుతుండటం పెద్ద సమస్యగా మారింది. దీని ఫలితంగా ప్రాపర్టీ ప్రాజెక్టులు నిలిచిపోతున్నాయి. ఇది దేశాన్ని పెను రుణ సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా చైనాలో అతిపెద్ద నిర్మాణ కంపెనీ ఎవర్‌‌గ్రాండ్‌ ‌గ్రూపు రుణాలు తిరిగి చెల్లించలేని స్థితికి దిగజారిపోయింది. దీని ప్రభావం దేశంలోని పెద్ద, మధ్య తరహా కంపెనీలపై పడుతోంది. గత పదేళ్లకాలంలో చైనాలో మొట్టమొదటిసారి రియల్‌ ఎస్టేట్‌ ‌రంగానికి ఇచ్చే బ్యాంకు రుణాలు తగ్గిపోయాయి. చైనా జీడీపీలో నిర్మాణ రంగం వాటా 20%. ఎన్నో ఏళ్లుగా చైనా వృద్ధికి నిర్మాణరంగం చోదకశక్తిగా కొనసాగుతోంది. 2016 నుంచి ఈ రంగం క్రమంగా క్షీణతను నమోదు చేసినా, కొవిడ్‌ ‌సమయంలో ఒక్కసారిగా కుదేలైంది. ఇదిలా ఉండగా చైనాలో మరోకొత్త సమస్య జనాభా వృద్ధి పడిపోవడం! ప్రస్తుతం జపాన్‌ ఎదుర్కొంటున్న పరిస్థితే చైనాలో కూడా ఏర్పడితే కుటుంబాలు కుంచించుకొనిపోయి కొత్త సమస్యలకు దారితీస్తుందన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. చైనా పరిస్థితి ఈవిధంగా ఉంటే భారత్‌లో పరిస్థితి ప్రస్తుతం పూర్తి భిన్నంగా ఉంది. ఈ ఏడాది జనవరి-జూన్‌ ‌మధ్య కాలంలో దేశంలో ఇళ్ల అమ్మకాలు గరిష్ట స్థాయిలో జరిగాయి. ఇందుకు ఇళ్ల ధరలు అందుబాటులో ఉండటం, తక్కువ వడ్డీరేట్లు, వీటికి తగ్గట్టు ఇళ్లకు డిమాండ్‌ ఉం‌డటం ప్రధాన కారణాలు.

రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధం, తైవాన్‌పై దురాక్రమ ణకు చైనా యత్నాల నేపథ్యంలో యూఎస్‌ ‌నేతృత్వంలోని పశ్చిమ దేశాల వైఖరుల్లో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా చైనాపై ఆధారపడటాన్ని తగ్గించాలన్న నిర్ణయానికి వచ్చాయి. భారత్‌ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా తయారీ రంగాన్ని బలోపేతం చేస్తే, విదేశీ పెట్టు బడులను పెద్దఎత్తున ఆకర్షించవచ్చు. ఆవిధంగా ‘ప్రపంచ తయారీ హబ్‌’‌గా మనదేశం రూపొంద వచ్చు. చైనాలోని యాపిల్‌ ‌కంపెనీ ఐఫోన్‌-14 ‌మోడల్‌ ‌తయారీని భారత్‌కు తరలించాలని నిర్ణయించడం, కొవిడ్‌ ‌నిబంధనల కారణంగా ఫాక్స్‌కాన్‌ ‌కంపెనీలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో చెన్నైలోని తన కేంద్రానికి తయారీని బదలీ చేయాలని ఆ కంపెనీ యోచిస్తున్నదన్న వార్తలు భారత్‌కు సానుకూలమైనవే. చైనా సంక్షోభం వల్ల చోటు చేసుకునే మరో ముఖ్య పరిణామం అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం. ఒకవేళ చమురు ధరలు తగ్గితే, మనదేశానికి చమురు బిల్లు తగ్గుతుంది. ఇది రూపాయిపై వత్తిడి తగ్గించి, ఫారెక్స్ ‌నిల్వలు పెరగడానికి దోహదం చేయగలదు. ఆసియాలో భారత్‌ ఎదుగుదలను ఎంతమాత్రం ఓర్వని చైనా, తన స్వీయ తప్పిదాల కారణంగా క్రమంగా సంక్షోభంలో కూరుకుపోతోంది. జిన్‌పింగ్‌ ‘‌జీరో కొవిడ్‌ ‌విధానం’ ఆ దేశాన్ని ఆర్థికంగా నిండా ముంచుతోంది. అమెరికా-చైనాల మధ్య నెలకొన్న సంఘర్షణ వాతావరణం, రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధం వంటి అంతర్జాతీయ పరిణామాలు భారత్‌కు క్రమంగా సానుకూల పరిస్థితులను కల్పిస్తున్నాయి. మన ప్రభుత్వం కూడా ఈ పరిణామాల వల్ల కలిగే ప్రయోజనాలను అందిపుచ్చుకునేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నదనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.

About Author

By editor

Twitter
Instagram