‘పాముకు పాలు పోసి పెంచినా కాటేస్తుంది’ అని నానుడి. ఇప్పుడు వైరస్‌ ‌విషయంలోను, చైనా విషయంలోను ఇదే రుజువైంది. చైనా తను పెంచి పోషించిన నాగు తననే కాటు వేసింది. ఈ విషయాన్ని ఎక్కువ కాలం దాచి ఉంచలేమన్న వాస్తవమే కాదు, దేశంలో పెల్లుబుకుతున్న కొవిడ్‌ ‌నిబంధనల వ్యతిరేకోద్యమం నుంచి కూడా తనను తాను రక్షించుకునే పనిలో చైనా పడిపోయింది. మూడేళ్ల క్రితం కొవిడ్‌ ‌పతాకస్థాయిలో ఉన్నప్పుడు దాని సృష్టికర్త చైనాయేనంటూ తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు మరొకసారి అదే ఆరోపణ తెర మీదకు వచ్చింది. కొవిడ్‌-19 ‌వైరస్‌ ‌చైనాలో ఉన్న ఊహాన్‌ ‌వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌ ‌నుంచే వెలువడింది. ఇది నిజం. కానీ ఈసారి మాత్రం జాగ్రత్తలు సరిగా పాటించని కారణంగా పొరపాటున వైరస్‌ ‌విడుదలైందని మాత్రం ఒక సవరణ కనిపించింది. పొరపాటు సరే. అసలు ఇలాంటి ఒక ప్రాణాంతక వైరస్‌ను ఎందుకు తయారు చేయవలసి వచ్చింది? దానికైనా చైనా సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. కానీ ఈ పాపంలో అమెరికాకు కూడా భాగం ఉందని చెప్పడమే కొత్త విషయం. ఈ సంగతి చెప్పినవారు అమెరికా శాస్త్రవేత్త. ఇంతకీ ఈ శాస్త్రవేత్త ఒకప్పుడు అదే ఊహాన్‌ ‌ప్రయోగశాలలో పనిచేశారు.


కొవిడ్‌ ‌బాధల నుంచి, కఠిన ఆంక్షల నుంచి ప్రపంచం మొత్తం దాదాపు విముక్తమయింది. జపాన్‌ ‌మాత్రం మళ్లీ ఏడో విడత కొవిడ్‌ను ఎదుర్కొంటున్న దన్న వార్తలు వచ్చాయి. అది అలా ఉంచితే కొన్ని దేశాలు మాస్క్‌ల వినియోగాన్ని సైతం నిలిపివేశాయి. మార్కెట్లు, హోటళ్లు, కళాశాలలు సాధారణ స్థాయికి చేరాయి. సామాజిక దూరం నిబంధన కూడా దాదాపు లేదు. కానీ నాలుగేళ్ల తరువాత కూడా చైనాలో కొన్ని ప్రాంతాలలో లాక్‌డౌన్‌ అమలవు తున్నది. అది కూడా కమ్యూనిస్టు ప్రభుత్వం శైలిలో కర్కశంగా, అమానుషంగానే ఉన్నది. దీనికి వ్యతిరేకంగా కొన్ని రోజులుగా అక్కడ ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. 1989 నాటి తియనాన్మెన్‌ ‌స్క్వేర్‌ అలజడిని ఇవి గుర్తు చేస్తున్నాయని ప్రపంచం అభిప్రాయపడుతున్నది. ఈ అలజడులకు భయపడి ఆందోళనకారులకు కమ్యూనిస్టు ప్రభుత్వం పెద్ద పెద్ద శిక్షలు విధిస్తున్నది. ఇక ప్రభుత్వ హింస సరేసరి. కరోనా వైరస్‌ను ఎదుర్కొనడంలో అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ అసమర్ధంగా వ్యవహరించారని ప్రజలు ఘోషిస్తు న్నారు. ఏమైనా చైనాతో ప్రపంచం ఇప్పటికే ఎదుర్కొంటున్న బెడద కరోనాతో, కరోనా తరువాతి పరిణామాలతో మరింత తీవ్రమైందని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి.

‘జీరో కొవిడ్‌’ ‌పేరుతో విశ్వవిద్యాలయాలలో అమలు చేస్తున్న కఠిన నిబంధనలకు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళనలకు దిగారు. ఊహాన్‌ ‌విశ్వవిద్యాలయం అలజడులతో అట్టుకుతున్నది. వారంతా సమాచారంలో, పరిపాలనలో పారదర్శకత ఉండాలంటూ నినదిస్తున్నారు. అడ్డూ ఆపూ లేకుండా సాగుతున్న కొవిడ్‌ ‌పరీక్షలు, నిబంధనల పేరుతో విశ్వవిద్యాలయ ప్రాంగణాలలో కనీసం ఆహారం లేకుండా చేయడం పట్ల కూడా వారు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. నిజానికి కొన్ని రోజుల క్రితం నుంచే చాలా నగరాలలో విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. కొందరు జీ జిన్‌పింగ్‌ ‌పదవి నుంచి తప్పుకోవాలని కూడా నినదిస్తున్నారు. తాజా వార్తలను బట్టి అంత కరడుగట్టిన చైనా కమ్యూనిస్టు సర్కారు కూడా ఒక్కొక్క మెట్టు దిగిరాక తప్పడం లేదు. అందులో జీరో కొవిడ్‌ ‌నిబంధనల సడలింపు కూడా ఉన్నది. నిజానికి ఈ ఆగ్రహం వెనుక కొవిడ్‌ ‌పేరుతో సాగిన నాలుగేళ్ల అణచివేత ఉంది. చైనా అనుసరించిన వ్యాక్సినేషన్‌ ‌విధానం కూడా అత్యంత నిర్లక్ష్య ధోరణిలో సాగింది. ప్రతి పదిమంది చైనీయులలో ఒక్కరికి మాత్రమే వ్యాక్సినేషన్‌ అం‌దింది. మొదటి దశ వ్యాక్సిన్‌ ‌తీసుకున్నవారు 66 శాతం. బూస్టర్‌ ‌డోస్‌ ‌తీసుకున్నవారు 40 శాతం. ఇందుకు కారణం, చైనా ఏ విదేశీ వ్యాక్సిన్‌ను అనుమతించకపోవడమే. దేశంలో తయారైన వ్యాక్సిన్‌ను మాత్రమే వినియోగించాలన్నది ఆ దేశం పెట్టుకున్న నిబంధన. కానీ దాని సామర్ధ్యం మిగతా దేశాల వ్యాక్సిన్‌లతో పోలిస్తే తక్కువ అని నిపుణులు ఎప్పుడో తేల్చి చెప్పారు. లాక్‌డౌన్‌ ‌నిబంధనలు, విదేశీ వ్యాక్సిన్‌ ‌మీద నిషేధం ఇలాగే కొనసాగితే అక్కడ మిలియన్‌ల కొద్దీ మరణాలు సంభవించే అవకాశం ఉందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ గణాంకాలు దారుణంగా ఉన్నాయి. ఈ నిబంధనలు, ఆంక్షలు కారణంగా భవిష్యత్తులో 13 లక్షల నుంచి 20 లక్షల వరకు మరణాలు సంభవించవచ్చునని వారు అంచనా వేస్తున్నారు. ఇన్ని సవాళ్లు ఎదురవుతున్నా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ ‌మాత్రం పాశ్చాత్య దేశాల నుంచి వ్యాక్సిన్‌ ‌దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం లేదు. చివరికి పెల్లుబుకుతున్న ప్రజాగ్రహం నేపథ్యంలో కొన్ని సడలింపులు చేయక తప్పలేదని వార్తలు వెలువడుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే అమెరికా శాస్త్రవేత్త ఊహాన్‌ ‌గుట్టును మరొకసారి బయటపెట్టారు. అంటే ఇది గబ్బిలాల నుంచి లేదా పందుల నుంచి గాడిదల నుంచి సంక్రమించిన వైరస్‌ ‌కాదు. మానవ నిర్మిత ప్రాణాంతక వైరస్‌ అని ఆయన తేల్చినట్టే. నిజానికి ఈయన ఈ విషయాన్ని రెండేళ్ల క్రితమే బయట పెట్టారు. అప్పుడు కూడా ‘ది సన్‌’ ‌పత్రిక ఆ వార్తను నివేదించింది. ఇప్పుడు మాత్రం తన అనుభవాలు, వాస్తవాలు జోడించి పుస్తకం రాశారు.

అమెరికాకు చెందిన శాస్త్రవేత్త డాక్టర్‌ ఆం‌డ్రూ హఫ్‌ (ఎపిడిమియాలజిస్ట్) ‌కొవిడ్‌-19 ‌వైరస్‌ ‌వ్యాప్తి గురించి తాజాగా కొంత సమాచారం లోకానికి తెలియచేశారు. ‘ది ట్రూత్‌ ఎబౌట్‌ ఊహాన్‌’ ‌పేరుతో రాసిన పుస్తకంలో కొన్ని అంశాలను వెల్లడించారు. ప్రాణాంతకమైన ఈ జీవశాస్త్ర పరిశోధన కార్యక్రమాన్ని అజాగ్రత్తగా నిర్వహించడం వల్లనే ఇంత విపత్తు ప్రపంచం ఎదుర్కొనవలసి వచ్చిందని ఆయన చెప్పారు. ఈ ప్రయోగానికి అమెరికా కూడా నిధులు ఇచ్చినట్టు కూడా ఆయన ఆరోపిస్తున్నారు. ‘ది సన్‌’ ‌పత్రిక ప్రతినిధితో మాట్లాడుతూ ఎకో హెల్త్ అలయెన్స్ అనే ప్రభుత్వేతర శాస్త్ర పరిశోధనల సంస్థ ఈ పరిశోధన కోసం నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌హెల్త్ ‌నుంచి నిధులు తీసుకుంది. ఎకో హెల్త్ అలయెన్స్ ఊహాన్‌ ‌పరిశోధనా సంస్థతో కలసి పనిచేస్తున్నది. ఈ సంస్థకు డాక్టర్‌ ‌హఫ్‌ 2014 ‌నుంచి 2016 మధ్య ఉపాధ్యక్షునిగా పనిచేశారు. కొవిడ్‌ ‌వైరస్‌ ‌సంగతులన్నీ మొదటి నుంచి చైనాకు పూర్తిగా తెలుసునని కూడా డాక్టర్‌ ‌హఫ్‌ ‌రాశారు. ఆ దేశం మీద ఆరోపణలు వచ్చినప్పటికీ కొవిడ్‌ 19 ‌మూలాల గురించి శోధించడానికి చైనా పూర్తి స్థాయిలో అనుమతించని సంగతి తెలిసినదే. ఆఖరికి ఐక్య రాజ్యసమితి ఆధ్వర్యంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత తనిఖీ చేయించడానికి కూడా కమ్యూనిస్టు చైనా సహకరించ లేదు.

చాలా దేశాల ప్రయోగశాలలో జీవ పరిరక్షణ, భద్రతల కోసం సరైన రక్షణ చర్యలు తీసుకునే వ్యవస్థ, విధానం లేవని డాక్టర్‌ ‌హఫ్‌ ఆరోపణ. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌హెల్త్ ఇచ్చే నిధులతో గత దశాబ్ద కాలంగా కొన్ని ప్రయోగశాలలో కరోనా వైరస్‌ ‌గురించి పరిశోధనలు జరుగుతున్న విషయాన్ని కూడా ఆయన బయటపెట్టారు. ఊహాన్‌ ‌ప్రయోగశాలలో డాక్టర్‌ ‌హఫ్‌ ‌పనిచేసిన కాలంలో గబ్బిలాల నుంచి ఇతర ప్రాణులకు సంక్రమించే వైరస్‌ను అదుపు చేయడం గురించి పరిశోధనలు జరిగాయి.

కానీ ప్రాణాంతకమైన జీవ సాంకేతిక శాస్త్ర పరిజ్ఞానాన్ని చైనాకు అమెరికా అందచేయడం కచ్చితంగా తప్పిదమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంతకీ ప్రపంచ ప్రఖ్యాతి కోసం శాస్త్రరంగంలో అసాధారణం అనిపించే ఆవిష్కరణలు చేయాలని చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం ఊహాన్‌ ‌ప్రయోగశాల శాస్త్రవేత్తల మీద తీవ్రమైన వత్తిడి తెచ్చిందని ఆయన అంటారు. అయితే ఆ స్థాయిలో ఆవిష్కరణలు జరపడానికి అవసరమైనన్ని నిధులు మాత్రం సంస్థకు అందుబాటులో లేవు.

 చైనా చుట్టూ ఉండే మహా కుడ్యం ఎంత గట్టిదైనా, కొన్ని వాస్తవాలు బయటకు రాకుండా ఉండవు. ఇది చక్రవర్తుల పాలన కాదు. కమ్యూనిస్టు చక్రవర్తుల పాలనే అయినా, వాస్తవాలు దాచలేరు. ఇవాళ కాకుంటే భవిష్యత్తులో అయినా వాస్తవం ఏమిటో చైనా ప్రపంచానికి చెప్పక తప్పదు. ఇప్పుడు తన పశుబలంతో దేశ ప్రజలను అణచివేస్తూ ఉండవచ్చు. కానీ, ఇన్ని కోట్ల మందిని బలితీసుకున్న ఆ మహమ్మారిని సృష్టించినందుకు చైనా మూర్ఖ కమ్యూనిస్టులు పశ్చాత్తాపపడక తప్పదు.

About Author

By editor

Twitter
Instagram