‘‘ప్రకృతి రక్షతి రక్షితః .. ప్రకృతిని మనం రక్షిస్తే, అది మనల్ని రక్షిస్తుంది’’. కానీ, పర్యావరణంలో మానవ జోక్యం భూమి మీద విధ్వంసం ముప్పును పెంచింది. దీంతో వాతావరణంలో కొన్నిచోట్ల అనూహ్య మార్పులు చోటుచేసుకోగా – మరోవైపు వరదలు, తుపానులు, సముద్రమట్టం పెరగడం, కొండ చరియలు విరిగిపడటం, కార్చిచ్చు, అంటార్కిటికాలో మంచు కరగడం మామూలై పోయింది. ఈ విపరీత పరిస్థితుల మధ్య మానవాళి రక్షణకు పర్యావరణ హిత జీవనశైలి ఒక్కటే మార్గం. ఈ లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘‘మిషన్‌ ‌లైఫ్‌’’ ‌కార్యక్రమం నేడు ప్రపంచ ప్రజా ఉద్యమంగా మారుతోంది. గ్లాస్గో వాతావరణ మార్పు సదస్సు తర్వాత ఈజిప్టులో కాప్‌-27 ‌సందర్భంగా ప్రపంచానికి భారత్‌ ఓ ‌సరికొత్త మార్గం చూపింది. కొన్ని దశాబ్దాలుగా ప్రపంచం అనూహ్య విపత్తులను ఎదుర్కొనడాన్ని బట్టి వాతావరణ మార్పు దుష్ప్రభావాలు ఎలాంటివో స్పష్టంగా గుర్తించవచ్చు.

నేడు మన హిమానీనదాలు కరిగిపోతూండగా సముద్రమట్టం పెరిగిపోతోంది. నదులు ఎండి పోతుంటే వాతావరణం నానాటికీ అనిశ్చితమవు తోంది. ఈ పరిణామాలతో వాతావరణ మార్పు సమస్య పరిష్కారానికి విధాన రూపకల్పన మాత్రమే చాలదనే ఆలోచన ప్రజల్లో కలుగుతోంది. వ్యక్తిగానే కాకుండా ఓ కుటుంబంగా, సమాజంగా, భూమాత పట్ల మన వంతు బాధ్యత నిర్వర్తించాలని ప్రజలు తమంతట తాము గ్రహిస్తున్నారు. భూమాత రక్షణకు వ్యష్టిగా, కుటుంబంగా, సమష్టి కృషితో చేపట్టగల వివిధ చర్యలేమిటో తెలుసుకోవాలనే ఆసక్తి వారిలో కలుగుతోంది. ఈ ప్రశ్నలన్నింటికీ ‘‘మిషన్‌ ‌లైఫ్‌’’ ‌జవాబిస్తుంది. ‘‘పర్యావరణం కోసం జీవనశైలి’’ అన్నదే ‘‘మిషన్‌ ‌లైఫ్‌’’ ‌తారకమంత్రం. అంటే- పర్యావరణహిత జీవనశైలి. అక్టోబర్‌ 20‌న, సర్దార్‌ ‌పటేల్‌ ‘ఐక్యతా ప్రతిమ’ వద్ద ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెజ్‌ ‌సమక్షంలో నరేంద్ర మోదీ ‘‘మిషన్‌ ‌లైఫ్‌’’‌కు శ్రీకారం చుట్టారు. భూగోళం రక్షణ కోసం ప్రజాబలాన్ని సమ్మిళితం చేస్తూ వారి సమష్టి శక్తియుక్తుల వినియోగం ఎలాగో నేర్పుతుంది. వాతావరణ మార్పులపై పోరును ‘‘మిషన్‌ ‌లైఫ్‌’’ ‌ప్రజాస్వామ్యబద్ధంగా విస్తరిస్తూ ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యానికి తగినట్లు సహకరించేలా చేస్తోంది. ఒక చిన్న ప్రయత్నం కూడా బలమైన ప్రభావం చూపగలదన్నది ‘‘మిషన్‌ ‌లైఫ్‌’’ ‌దృఢ విశ్వాసం. మన దైనందిన జీవనంలో పర్యావరణ పరిరక్షణ ఎలా, ఎంతవరకూ సాధ్యమో ‘‘మిషన్‌ ‌లైఫ్‌’’ ‌చూపుతుంది. జీవనశైలిలో మార్పుల ద్వారా పర్యావరణ రక్షణ సాధ్యమేననే నమ్మకాన్ని ప్రోత్సహిస్తుంది. పర్యావరణ హిత జీవన మంత్రం- ‘‘మిషన్‌ ‌లైఫ్‌’’ ‌గ్లాస్గోలో నిర్వహించిన కాప్‌-26 ‌సదస్సులో ప్రధాని 2021 నవంబరు 1న ‘‘లైఫ్‌’’ (•‌ఱఖీజు) భావనను పరిచయం చేశారు. ఈ నేపథ్యంలో 2022 జూన్‌ 5‌న ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు భారతదేశం ‘లైఫ్‌’ ‌ప్రపంచ ఉద్యమాన్ని ప్రారంభించడం ద్వారా ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపింది. ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా విద్యావేత్తలు, పరిశోధకులు, అంకుర సంస్థలకు ఆహ్వానం పలికింది. పర్యావరణ సంక్షోభానికి స్వస్తిపలికే దిశగా సమష్టి కార్యాచరణ సంపూర్ణ సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రీయ పరిష్కార అన్వేషణను ప్రోత్సహించే మార్గాలను కనుగొనాల్సిందిగా కోరింది. ఈ కార్యక్రమానికి రికార్డు స్థాయిలో ప్రపంచ దేశాధినేతల మద్దతు లభించింది. వాతావరణ మార్పుపై ఒడంబడికపట్ల భారత్‌ ‌నిబద్ధతను ప్రదర్శించే శాస్త్రీయ, నిర్దిష్ట కార్యక్రమం ద్వారా ‘లైఫ్‌’ ఆలోచనలు, ఆదర్శాలను ‘మిషన్‌ ‌లైఫ్‌’ ఉద్యమ స్థాయిలో కార్యాచరణగా మలుస్తుంది. ఈ మేరకు పర్యావరణ రక్షణ కోసం 2022-2027 మధ్య భారతీయులు సహా ప్రపంచవ్యాప్తంగా కనీసం 100 కోట్ల మంది పౌరులను వ్యష్టి, సమష్టి కార్యాచరణ దిశగా నడిపించే లక్ష్యంతో ‘మిషన్‌ ‌లైఫ్‌’ ‌రూపొందింది. ఆ మేరకు 2028కల్లా దేశంలోని అన్ని గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలలో కనీసం 80 శాతం పర్యావరణ హితం కావాలన్నది భారత్‌ ‌నిర్దేశించుకున్న లక్ష్యం. నిరుడు బ్రిటన్‌లోని గ్లాస్గోలో కాప్‌-26 ‌సదస్సులో ప్రధానమంత్రి తొలిసారి ‘మిషన్‌ ‌లైఫ్‌’‌ను ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో ఈజిప్టులోని షర్మ్ ఎల్‌-‌షేక్లో 2022 నవంబర్‌ 6-18 ‌మధ్య నిర్వహించిన కాప్‌-27 ‌సదస్సులో భారత పెవిలియన్‌ ‌ను ‘లైఫ్‌’ ఇతివృత్తంగా ఏర్పాటు చేశారు. దీని గురించి కేంద్ర పర్యావరణ-అటవీ- వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ ‌మాట్లాడుతూ, సంక్లిష్టమైన వాతావరణ మార్పు సమస్యకు ప్రధాని మోదీ సరళ పరిష్కారం చూపారని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కార్యాచరణ మూలాల నుంచి, వ్యక్తిగత స్థాయిలో మొదలు కాగలదన్నది భారత్‌ ‌విశ్వాసమని స్పష్టం చేశారు. అందుకే ‘‘పర్యావరణం కోసం జీవనశైలి-లైఫ్‌’’ ఇతివృత్తంగా పెవిలియన్‌ ‌రూపొందించామని వివరించారు. ఇందులో వివిధ దృశ్య-శ్రవణ చిహ్నాలు, 3డి నమూనాలు, ఇతర ఏర్పాట్లు, అలంకరణలు, అనుబంధ కార్యక్రమాల ద్వారా ‘మిషన్‌ ‌లైఫ్‌’ ‌సందేశం వినిపిస్తారు. శతాబ్దాలుగా భారతీయ నాగరికత అనుసరిస్తున్న, ఆచరిస్తున్న సుస్థిర జీవనశైలి ఈ పెవిలియన్‌ ‌రూపకల్పనకు మార్గదర్శకం. భారతీయ సంస్కృతి అంటేనే పర్యావరణహిత అలవాట్లకు ప్రతిబింబం. సహజ ప్రకృతికి గౌరవమిచ్చే అనేక పద్ధతులు దైనందిన జీవితంలో అంతర్భాగం. వాతావరణ మార్పుపై మన పోరాటంలో ఈ పద్ధతులన్నీ ఎంతో ప్రధానమనే వాస్తవం తప్పక రుజువవుతుంది. వెయ్యేళ్లకు పైగా తరతరాలకూ అందుతున్న ఈ లోతైన సుస్థిర జ్ఞానమే భారత ప్రధాని మోదీకి స్ఫూర్తినిచ్చింది. ఆ మేరకు భూగోళం మనుగడ, శ్రేయస్సుపై గణనీయ సానుకూల ప్రభావం లక్ష్యంగా ప్రపంచానికి ‘లైఫ్‌’ ‌తారకమంత్రాన్ని ఆయన అందించారు. అలాగే ప్రపంచ వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో భారత్‌ ‌వంతు కృషిలో ‘మిషన్‌ ‌లైఫ్‌’ ఒక భాగం. ఆధునిక ప్రపంచంలో సుస్థిర జీవనశైలిని అనుసరించే వారిని ‘‘భూమి సంక్షేమానికి శ్రమించే వ్యక్తులు’’గా మార్చడానికి ఇది కృషి చేస్తుంది. ఆ మేరకు పెవిలియన్‌ ‌చిహ్నంలో భూమికి సంకేతంగా ఆకుపచ్చ రంగు వాడారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ప్రకృతితో సమతౌల్యం, సామరస్యం కలిగి ఉండటాన్ని ఇది చూపుతుంది. చిహ్నంలోని కేంద్ర భాగం సూర్యునితో ప్రకృతి సమతౌల్యాన్ని చూపుతుంది. అందులో వృక్షాలు, పర్వతాలు, నీరు, జీవవైవిధ్యం భాగంగా ఉన్నాయి. ఇక దీని నినాదం అందరికీ సుఖజీవనం కాంక్షించే మంత్రం ‘‘సర్వే భవన్తు సుఖినః’’ స్ఫూర్తితో రూపొందించారు. కాబట్టే ‘మిషన్‌ ‌లైఫ్‌’‌ను ప్రధాని ‘పి-3’ (‘ప్రో ప్లానెట్‌ ‌పీపుల్‌’) ‌నమూనాగా అభివర్ణించారు. ఇది ‘‘భూగోళం ద్వారా… భూగోళం కోసం.. భూగోళం జీవనశైలి’’ అంటే- ‘పర్యావరణం ద్వారా.. పర్యావరణం కోసం.. పర్యావరణ హిత జీవనశైలి’ అనే ప్రాథమిక సూత్రాల ఆధారంగా పని చేస్తుంది. పర్యావరణం మీద భారత్‌ ‌నిబద్ధతపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెజ్‌ ‌తన అభిప్రాయం వెల్లడిస్తూ- ‘‘పర్యావరణ సంబంధిత విధానాల అమలులో భారత్‌ ‌నిబద్ధత సంతోషం కలిగించింది. ఈ కార్యక్ర మాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భారత్‌తో కలసి కృషి చేయడానికి నేనెంతగానో ఎదురు చూస్తున్నాను’’ అన్నారు.

కాప్‌-27‌లో భారత్‌ ఏం ‌చెప్పిందో దాని అమలుకు సమయం ఆసన్నమైంది. ఆచరణాత్మక విధానం ద్వారా నిర్దిష్ట వ్యవధిలో పరిష్కారాన్వేషణ సాధ్యమేనని భారత్‌ ‌నాయకత్వం స్పష్టం చేసింది. ఈ వాతావరణ మార్పు సమస్యకు తాను అవరోధం కాదని, ఒక పరిష్కారమని భారతదేశం రుజువు చేసుకుంది. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత పెరుగుతున్న నేపథ్యంలో వాతావరణ మార్పులపై ప్రపంచం ఎందుకు తీవ్రంగా ఆలోచించాల్సి వచ్చిందో అర్థం చేసుకోవడం కూడా అవసరం. భూతాపం కారణంగా మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లుతోంది. భూతాపం 1.5 డిగ్రీల సెల్సియస్‌ ‌దాకా పెరగవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నట్లు మీడియా కథనాల పేర్కొంటున్నాయి. అయితే, వాతావరణంలో కర్బన ఉద్గారాల పెరుగుదల వేగాన్నిబట్టి చూస్తే 21వ శతాబ్దం చివరి నాటికి భూతాపం పెరుగుదల 3 డిగ్రీల సెల్సియస్‌ ‌దాకా ఉండవచ్చునని అంచనా.

కాగా, దశాబ్దానికి పైగా పర్యావరణ పరిరక్షణ కృషి కొనసాగుతోంది. అయినప్పటికీ అభివృద్ధి చెందిన, వర్ధమాన, అల్ప ప్రగతి దేశాల అభివృద్ధిలో అసమతౌల్యం వల్ల కచ్చితమైన పరిష్కారం లభించడం లేదు. ఈ అంశంపై మేధోమథనం కోసమే ఐక్యరాజ్య సమితి గత సంవత్సరం గ్లాస్గోలో వాతావరణ మార్పుపై శిఖరాగ్ర సదస్సు ‘కాప్‌-27’ ‌నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రణాళికల అమలుపై భారత్‌ ‌తన గళాన్ని గట్టిగా వినిపించడంతో ఈ వాతావరణ సదస్సుకు ప్రాముఖ్యం ఏర్పడింది. మిషన్‌ ‌లైఫ్‌ ‌ద్వారా వాతావరణ మార్పు సవాళ్ల పరిష్కారం లేదా పంచామృతం ద్వారా ప్రపంచానికి మార్గనిర్దేశం చేయడంలో భారత్‌ ‌సదా ఒక ఉదాహరణగా నిలుస్తోంది.

భారతదేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 2014లో కేవలం 20 గిగావాట్లకు పరిమితం కాగా, 2022 నాటికి 100 గిగావాట్ల స్థాయికి చేరాలని ప్రధాని మోదీ లక్ష్యం నిర్దేశించారు. అయితే, సదరు గడువుకు ఎంతో ముందుగానే ఈ లక్ష్యాన్ని సాధించడం ద్వారా భారత ప్రపంచానికి సరికొత్త మార్గం చూపింది. అంతేకాదు.. సౌరశక్తి ధర యూనిట్‌ ‌రూ.16 నుంచి నేడు రూ.2కి దిగివచ్చింది. మరోవైపు 2015లో అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్‌ఏ)‌కి భారతదేశం పునాది వేసింది. సౌరశక్తి అన్నిటికన్నా గొప్ప ప్రత్యామ్నాయం. ఈ నేపథ్యంలో ‘ఐఎస్‌ఏ’ ‌పురోగమనం ఫలితంగా ప్రపంచంలో జీవ ఇంధనంతో వాణిజ్య విమానాలు నింగికెగిరిన ఏకైక దేశంగా భారత్‌ ‌పరిగణనలోకి వచ్చిందనవచ్చు. సౌర శక్తి రంగంలో బ్యాటరీ నిల్వ ఒక సవాలు కాగా, దీని పరిష్కారానికి భారత్‌ ‌నిర్విరామంగా కృషి చేస్తోంది. అలాగే 2030 నాటికి రైల్వేలను హరిత ఇంధన చోదితం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా 60 మిలియన్‌ ‌టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చు.

ఇక 2050 నాటికి నికరశూన్య ఉద్గార లక్ష్యంతో భారత పరిశ్రమలు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలను అందిపుచ్చుకుంటున్నాయి. అందువల్ల ప్రధానమంత్రి ఆశించిన మేరకు వంద కోట్ల టన్నుల కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యాన్ని భారత్‌ ‌సులువుగా సాధించే వీలుంది. వ్యక్తులు, సమాజం చేసే సాధారణ కృషి కూడా భారీ ఫలితాలకు దోహదం చేస్తుంది. ఎల్‌ఇడి బల్బుల వినియోగమే ఇందుకు నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం ఎల్‌ఇడి బల్బుల పంపిణీ పథకం ప్రారంభించినప్పుడు దేశంలోని ప్రైవేట్‌ ‌రంగం కూడా అందులో ‘భాగస్వామి’ అయింది. దీంతో స్వల్ప వ్యవధిలోనే దేశపౌరులు తమ ఇళ్లలో 160 కోట్లకు పైగా ఎల్‌ఐడి బల్బులు అమర్చుకున్నారు. ఈ ప్రభావంతో కార్బన్‌ ‌డై ఆక్సైడ్‌ ‌విడుదల 100 మిలియన్‌ ‌టన్నుల మేర తగ్గింది. ఫలితంగా ఇవాళ ప్రపంచ వార్షిక తలసరి కర్బన ఉద్గారాల సగటు 4 టన్నులతో పోలిస్తే భారతదేశంలో తలసరి సగటు కేవలం 1.5 టన్నులుగా మాత్రమే నమోదవుతోంది.

అయినప్పటికీ, వాతావరణ మార్పు వంటి అంతర్జాతీయ సమస్యల పరిష్కారంలో భారత్‌ ‌ముందంజలో ఉంది. బొగ్గు, కలప పొగను వదిలించుకునే దిశగా ‘ఉజ్జ్వల’ పథకాన్ని ప్రారంభించింది. ప్రతి జిల్లాలో 75 అమృత సరోవరాల ఏర్పాటుకు కృషి మొదలైంది. భారత్‌ ఇవాళ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన సామర్థ్యంగల దేశం కాగా- పవన శక్తిరీత్యా నాలుగో స్థానంలో, సౌర శక్తి రీత్యా ఐదో స్థానంలో ఉంది. ఆ విధంగా నేడు భారతదేశం పురోగమన పథంలో సాగుతూ ప్రకృతితో సామరస్యంగా జీవించే మార్గం రూపొందిస్తోంది. ఇవాళ భారత్‌ ‌ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. మన అటవీ విస్తీర్ణమే కాకుండా వన్యప్రాణుల వైవిధ్యం, సంఖ్య కూడా పెరుగుతోంది.

‘‘ఒకే సూర్యుడు-ఒకే ప్రపంచం-ఒకే గ్రిడ్‌’’ ‌నినాదం కూడా మన సంకల్పాలను బలోపేతం చేస్తోంది. ఈ క్రమంలో ‘మిషన్‌ ‌లైఫ్‌’ ‌తదుపరి దశగా ఉంటుంది. గతం నుంచి నేర్చుకోవడం ద్వారానే మనం ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోగలం. భారతదేశానిది వేల ఏళ్లుగా ప్రకృతిని ఆరాధించే సుసంపన్న సంప్రదాయం. మన పూర్వికులు అనుసరించిన, మన జీవితంలో భాగం చేసుకోదగిన ప్రకృతి పరిరక్షణ హిత జీవనశైలి ‘మిషన్‌ ‌లైఫ్‌’ ‌ప్రోత్సహిస్తుంది.

‘న్యూ ఇండియా సమాచార్‌’ ‌నుండి

About Author

By editor

Twitter
Instagram