– కాశింశెట్టి సత్యనారాయణ, విశ్రాంత ఆచార్యుడు

రజకార్ల ఆగడాలకు సహనం కోల్పోయిన ప్రజలు తిరుగుబాటు బాట పట్టారు. స్వయం రక్షణ చర్యలు చేపట్టారు. గృహోపకరణాలనే ఆయుధాలుగా మలచుకున్నారు.

‘‘తలుపు మలుపులు శీరి

బలుపు కర్రలు పట్టి

క్టొవే ఒక దెబ్బ చెల్లెమ్మా

కణత పగిలేటట్టు అక్కయ్యా

చిట్టెడు కారం గట్టిగా పట్టండి.

కండ్లలో చల్లండి

కత్తితో పొడవండి

ఇంతైన భయమేల చెల్లెమ్మా

భయమేలనే అక్కయ్యా’…

ప్రత్యర్థులపై ప్రతిఘటనలో భాగంగా, అవసర మైతే వారిపై జల్లేందుకు కారం సిద్ధం చేసుకున్నారు. పాలు, పెరుగులో విషం కలిపి వుంచారు. తమ ఇళ్లకు గల తలుపులను చీరి బలమైన కర్రలు చేసి వాటిని ఆయుధాలుగా చేసుకున్నారు. ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాటంలో నిలబడ్డారు. ఈ ప్రజా పోరాటం రజాకార సైన్యాన్ని దెబ్బతీసే స్థాయికి చేరింది. అదే సమయంలో రజాకారు సైన్యం ఆధునిక ఆయుధాలతో అశ్వాలపై వచ్చి ప్రజల దెబ్బను కాచుకొనే స్థితికి వచ్చారు.

చేతి కర్రలకు కొన్ని పరిమితులుంటాయి. పశువుల వంటి వాటిని అదిలించడానికే తప్ప గూండాలను ఎదిరించటానికి అవి ఉపయోగపడవు. ఇందుకు కొత్తరకం కర్రలు కావలసివుంటుందని వాలంటీర్లు భావించారు. చేతితో పట్టుకోవడానికి తగినంత లావు, పొడవు వుండాలని, కర్రతో ఒక దెబ్బవేస్తే ప్రత్యర్థులు లేవకుండా పడాలని వీరి అభిప్రాయం.

వాలంటీర్లు గొడ్డళ్లతో కొట్టి, కర్రలను కాల్చి, వాటిపై గల తోలు తీసివేసి గట్టిపరచి తమకు తగిన పరిమాణంలో కర్రలను తయారు చేసుకున్నారు. ఇలాంటి కర్రలను ‘గుతుప’ అంటారు. గుతుపలు పట్టుకొని రజాకార్లను ప్రతిఘటిస్తూ నిలిచిన ‘గుతుపల సంఘం’ ఆ తరువాత జైత్రయాత్ర సంఘంగా మారింది. ఈ దళాలు తమకు లభ్యమైన ఆయుధాలను సమకూర్చుకొన్నాయి. రజాకార్లు చేసే బీభత్సం వల్ల గ్రామాల్లోని స్త్రీలందరూ ఒకే దగ్గర పడుకునేవారు. మల్లారెడ్డి గూడెం తదితర గ్రామాల్లో తమపై జరిగిన అత్యాచారాలతో స్త్రీలలో రజాకార్ల మీద ద్వేషం పెరిగింది. వారిని సమిష్టిగా ఎదుర్కోవడం ప్రారంభించారు. వారు చేపట్టిన దళాల నిర్మాణానికి ప్రజలు అన్ని రకాలుగా సహకరించారు. వక్షస్థలానికి చేటలు కట్టుకుని రజాకార్లకు, నైజాం పోలీసులకూ ఎదురు నిలిచి వడిసెలతో పోరాడారు. ఆ ప్రతిఘటన పోలీసు దళాలపై దాడుల వరకూ వచ్చింది.

రజాకార్ల దాడులను తట్టుకోవడానికి రాత్రులు ఊరు బయట గడిపేవారు. కొన్నిచోట్ల ప్రజలే గ్రామాలకు కాపలా వుండేవారు. శత్రువుల కదలికలపై ప్రజల నిఘా వేయి కళ్లతో పనిచేసింది. రజాకార్లు శిబిరాల నుంచి బయలుదేరే సమాచారం ఎన్నో మైళ్ళ దూరంలో వున్నా అంచెలంచెలుగా అందేది. ప్రజలను హుషారు చేయడానికి పాటలు అందుకునేవారు. ఈ పాట చూడండి.

‘ఓయ్‌ – ‌హోయ్‌ – ‌హోయ్‌ – ‌నైజాం హోయ్‌

ఓయ్‌ – ‌హోయ్‌ – ‌హోయ్‌ – ‌కాశ్మీర్‌ ‌హోయ్‌

‌కొండల్లో సింహాల్లా

లోయల్లో ఉరుముల్లా

వంకర కొంకి – వరలో కత్తి

కండ్లకు గంత – కారపు ముంత

కావడి బద్దా – రేవడి సుద్దా

రాయి రప్పా – తాళం కప్పా

గడగడలాడించే

జంబియ, పేష్‌ ‌కప్‌ – ‌బామ్‌ ‌తల్‌వార్‌

‌వందలు వేల్‌ – ‌లక్షల కొలది

గబగబ దూకిన – గజిబిజి నైజాం

లే లే రారా

లే లే కనరా పోరుకు రారా …’

వీరు మార్చింగ్‌ ‌పాటలు ఎక్కువ పాడేవారు. దళాలు అడుగు అడుక్కూ ఓ పదం చొప్పున పాడుతూ కదిలేవి. ఇవి వారి కెంతో ఉత్సాహాన్నిచ్చాయి. తమను ప్రేరేపించే ఎలాంటి పాటనైనా మార్చింగ్‌ ‌పాటగా మార్చుకో గలిగారు. అలాంటిదే…

‘తెలుగు తల్లి బిడ్డలం-తెలంగాణా వీరులం

మాతృ దేశ ముక్తికొరకు-పోరు సలుప కదిలినాం

తర తరాల నుండి మేము- సాగనంపదలచినాం

వెట్టి పనులు కట్టిపెట్టి – జబర్దస్తే నెగరగొట్టి

స్వేచ్ఛగాను బ్రతుకు కొరకు-

ఐకమత్యమై నిలిచినాం’… అనే పాట.

చిట్యాల తిలమ్మ అనే చాకలి ఐలమ్మ మల్లంపల్లి మక్దెదార్‌ ‌కొండలరావు దగ్గర కొంత భూమి కౌలుకు తీసుకుని సాగుచేసింది.అయితే కుప్ప నూర్చి ధాన్యం రాశి పోసే సమయానికి విసునూరి దేశ్‌ముఖ్‌ ‌రాపాక రామచంద్రారెడ్డి పాలకుర్తి పోలీసు పటేల్‌ ‌వీరమనేని శేషగిరిరావు సహకారంతో ఆ భూమిని తన పేర రాయించుకున్నాడు. పంట తనకే ఇవ్వాలన్నాడు. అందుకు అంగీకరించకపోవడంతో ఇంటిని తగల బెట్టారు, కూతురు సోమ నర్సమ్మ మీద అత్యాచారం చేశారు. దాంతో తెగించిన ఐలమ్మ మొండిధైర్యంతో  రోకలి బండ చేతబట్టి తిరుగుబాటు చేసింది. రామచంద్రారెడ్డి గ్రామం మొత్తం నాశనం చేశాడు. ఆతని చేష్టలతో ప్రజలు భయభ్రాంతులతో వీధుల్లోకి రావడం మానేశారు. ఐలమ్మ భర్త, ఇద్దరి కుమారులపై హత్యానేరం మోపి జైల్లో పెట్టారు.

ఐలమ్మ పంటను స్వాధీనం చేసుకుంటామని విసునూరి దేశ్‌ముఖ్‌ ‌మనుషులు ప్రచారం చేయడంతో స్పందించిన ఆంధ్రమహాసభ తన కార్యకర్తలను పాలకుర్తి పంపి పంటను కోయించి నూర్పించి రాశిపోయించింది. అయితే రాత్రి విసునూరి దేశ్‌ముఖ్‌ ‌గూండాలు వచ్చి పంటను ఎత్తుకు పోయారు. ఆంధ్ర మహాసభ కార్యకర్తలను విసునూరు పోలీసు స్టేషన్‌లో బంధించారు. అరెస్టు అయిన వారిలో భీంరెడ్డి కరుటూరి రామచంద్రారెడ్డి, నరసింహరెడ్డి, చకిలం యాదగిరి రావు, ఇతరులు వున్నారు. వీరి ఆసనంలో కారం పెట్టి చిన్న చిన్న కర్రలను లోపలికి దూర్చి హింసించారు. దాహం వేస్తే మంచినీళ్లకు బదులు ముంతలలో మూత్రం నింపి నోళ్లల్లో పోశారు.

వారి జాడ తెలియడం లేదంటూ ఆంధ్ర మహాసభ, ఆరుట్ల లక్ష్మీ నరసింహారెడ్డిని పాలకుర్తికి పంపగా, ఆయన రఘునాథపల్లిలో త•న మిత్రుని కచ్చడం బండిని తీసుకుని పాలకుర్తి బయలు దేరాడు. గ్రామంలో కాపలాకాస్తున్న గూండాలు ఆయన్ను పట్టుకొని కొట్టి, కచ్చడాన్ని పాలకుర్తి చెరువులో పడవేసి బురదలో తొక్కి కనపడనీయ కుండా చేశారు. ఆయన దుస్తులు ఊడదీసి తన్ని వెళ్లగొట్టారు. గ్రామస్థులు భయంతో నిస్సహా యులుగా ఉండి పోయారు. ఆరుట్ల లక్ష్మీ నరసింహారెడ్డి సమీపంలోని బమ్మెర గ్రామానికి చేరుకుని అక్కడి ముఖ్తాదార్‌ను కలసి ఆశ్రయించారు. అన్ని విధాల ఆదుకుని ఆయనను సురక్షితంగా హైదరాబాద్‌ ‌పంపారు. దాడి ఘటనపై రావి నారాయణరెడ్డి ఆంధ్ర మహాసభ’ డైరెక్టర్‌ ‌జనరల్‌ అం‌డర్‌ ‌సన్‌కు వినతి పత్రం అందచేయగా, ఆయన నల్గొండ ఎస్‌.‌పి.ని విచారణకు ఆదేశించారు. అయితే ఆంధ్ర మహాసభ కార్యకర్తలే దురుసుగా ప్రవర్తించారని అంతకు మించి ఏమీ జరగలేదని ఎస్పీ తేల్చారు. పైగా ఆంధ్ర మహాసభ ‘అరాచక సంస్థ’ అని నిందించారు. ఆ శీర్షికతోనే పత్రికలు వ్యాసాలు రాశాయి.

దేవరుప్పల గ్రామం ఆంధ్రమహాసభకు ముఖ్య కేంద్రం. సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న పాలకుర్తికి దేవరుప్పల ప్రజల సహాయసహకారాలు అవసరమని మహాసభ గ్రామపెద్దలతో చర్చించింది. గ్రామానికి చెందిన ‘గుతుప సంఘం’ వాలంటీర్లు పాలకుర్తిలో మకా వేసి, ప్రజల్లో చైతన్యం కలిగించి, ఆత్మ విశ్వాసం పెంపొందించి సాక్ష్యాలు ఇప్పించాలనీ, తరువాత అన్ని గ్రామాల నుంచీ వాలంటీర్లను తయారు చేసి గూండాలను ప్రతిఘటించడానికి పూనుకోవాలని అప్పుడే మనం ‘‘ఆంధ్రమహాసభ’’ రక్షించుకోగలమని గ్రామ నాయకత్వానికి నచ్చజెప్పింది. ‘ఈ వేళ పాలకుర్తి అయ్యింది. రేపు దేవరుప్పలవుతుంది. మీరు కూడా నిర్భంధానికి గురి కావలసి వస్తుంది. ఈ పరిస్థితుల్లో మీరు వెనుకాడ కూడదు’ అని నచ్చచెప్పింది. చివరకు గ్రామపెద్దలు అరవై మంది వాలంటీర్లను పంపేందుకు అంగీక రించింది. అలా ‘గుతుప సంఘం’ సభ్యులు తమ సామాన్లను రెండు బండ్లలో వేసుకొని పాటలు పాడుకుంటూ మార్గమధ్యలోని మూడునాలుగు గ్రామాల్లో ప్రదర్శనలిస్తూ పాలకుర్తి చేరుకున్నారు. కడివెండి నాయకుడు మోహన్‌రెడ్డి నాయకత్వంలో పెరెడ్‌ ‌నిర్వహించారు.

‘నైజాము ప్రభుత్వ

నాయకత్వ రాక్షసత్వమున్‌

‌దాన్ని రూపు మాపకున్న

మనకు లేదు సౌఖ్యమున్‌’ అని పాడిన పాటలతో, రెండు రోజుల తరువాత గ్రామస్థులలో కదలిక ప్రారంభమైంది. ఇళ్ల నుంచి వెలుపలికి రాసాగారు.

 ‘ఇంతమంది అంత దూరం నుండి మా కోసం వచ్చారు. మీకు మేము సాయం చేస్తాం’ అంటూ స్థానికులు వారిని అనుసరించారు. వాలంటీర్లు ఉన్న ప్రాంతానికి వచ్చిన సి.ఐ. ‘ఇక్కడ వుండటానికి వీలులేదు ఎవరి గ్రామాలకు వారు వెళ్లిపొండి’ అని చేసిన హెచ్చరికను వాలంటీర్లు లక్ష్య పెట్టలేదు. వారి మాటను గ్రామస్తులు బలపరిచారు. చేసేది లేక పోలీసులు వెళ్లిపోయారు.

 వాలంటీర్ల రాకతో గ్రామస్థులలో మనో నిబ్బరం పెరుగుతుండగా, మరోవంక వాలంటీర్లను చూసి గూండాలు భయపడుతున్నారు. ఈ అనుభవాన్ని దృష్టిలో వుంచుకొని విసునూరి ప్రాతంలోని 40 గ్రామాల్లో వాలంటీరు దళాలను ఏర్పాటు చేసుకున్నారు. అలా సూర్యాపేట, నల్లగొండ, హుజూర్‌నగర్‌ ‌తాలూకాల్లో ఈ ఉద్యమం బలపడింది. ఈలోగా ఐలమ్మ తరపున కొండా క్ష్మణ బాపూజీ వాదించగా ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది. రజాకార్ల ఉపసేనాపతి రెండుసార్లు కోర్టులో పరాజయం పొందాడు. ఐలమ్మ ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచింది.

About Author

By editor

Twitter
Instagram