– దేబొబ్రత్‌ ‌ఘోష్‌, ‘‌సైన్స్ ఇం‌డియా’ సంపాదకులు –

బ్రిటిషర్లు మనదేశంలో శాస్త్రీయ విజ్ఞానాన్ని (వాళ్లది) ప్రవేశపెట్టింది భారత్‌పై ప్రేమతో కాదు. అక్కడి పరిశ్రమలకు అవసమైన వనరులను దోచుకోవడానికి మాత్రమే!

‘ఇది వ్యాపారం ముసుగులో ఉన్న రాజ్యం’ అంటూ ఈస్టిండియా కంపెనీని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు ప్రఖ్యాత ఐరిష్‌ ‌రాజనీతిజ్ఞుడు, ఆర్థికవేత్త, తత్త్వవేత్త ఎడ్మండ్‌ ‌బర్క్ (1729-1797). ‌ప్లాసీ యుద్ధం (1757)లో ఈస్టిండియా కంపెనీ విజయం సాధించిన కొన్ని దశాబ్దాల తరువాత ఆయన చేసిన వ్యాఖ్య ఇది. భారత్‌లో బ్రిటిష్‌ ‌సామ్రాజ్య విస్తరణకు ఈ యుద్ధమే నాంది.

బ్రిటిష్‌ ‌పాలన ప్రారంభం నుంచి, భారత్‌లో ప్రవేశపెట్టిన ప్రతి నూతన ఆవిష్కరణ ప్రధాన లక్ష్యం స్వప్రయోజనాలు మాత్రమే! అభివృద్ధి పేరుతో వారు మన దేశానికి పరిచయం చేసిన ప్రతి శాస్త్రీయ ఉపకరణాన్ని, దోపిడీకి మాత్రమే ఉపయోగించారు.

ఇంతగా దోపిడీకి గురిచేసినప్పటికీ, వలసపాలన ఎన్నో లాభాలు చేకూర్చిందంటూ స్వాతంత్య్రానంతరం కూడా కొందరు ఏకరువు పెట్టడమే విషాదం!

ప్లాసీ యుద్ధంలో దక్కిన విజయం బ్రిటిష్‌ ‌వాణిజ్య సంస్థ ఈస్టిండియా కంపెనీ (ఈఐసీ)కి బెంగాల్‌లో ‘దివానీ’ హక్కులు కల్పించింది. అంటే పన్నులు యథేచ్ఛగా వసూలు చేసుకోవచ్చు. తదనంతరం ఈ సంస్థను నియంత్రిస్తున్న లండన్‌లోని బోర్డ్ ఆఫ్‌ ‌డైరెక్టర్లు క్రమంగా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి అవసాన దశకు చేరుకున్న మొగల్‌ ‌సామ్రాజ్య పాలకులకు సమాన స్థాయికి ఎదిగారు.

1757కు ముందు బెంగాల్‌ ఎప్పుడూ మిగులు తోనే ఉండేది. ముఖ్యంగా దిగుమతుల కంటే ఎగుమతులు ఎక్కువగా జరిగేవి. కానీ 1757-80 మధ్యకాలంలో బెంగాల్‌ ‌నుంచి 38 మిలియన్‌ ‌పౌండ్‌ ‌స్టెర్లింగ్‌ల మేర సంపదను ఇంగ్లండ్‌కు తరలించారు. ఈ మొత్తం అక్కడి పారిశ్రామిక విప్లవాన్ని మరింత ప్రోత్సహించేందుకు, కొత్త యంత్రాలను కనుగొనే పనికి ఖర్చు చేశారు.

బెంగాల్‌పై ఈస్టిండియా కంపెనీ సాధించిన విజయం రుచి మరిగిన బ్రిటిష్‌ ‌ప్రభుత్వం, పారిశ్రామిక విప్లవం ఫలితంగా సాధ్యమవుతున్న నూతన శాస్త్రీయ ఆవిష్కరణలను కూడా భారత్‌ను గరిష్ట స్థాయిలో దోచుకోవడానికే ఉపయోగించింది. నిజం చెప్పాలంటే ఈస్టిండియా కంపెనీ భారత్‌లో తన దోపిడీని అప్రతిహతంగా కొనసాగించడానికి ఎంతగానో ఉపకరించినది ఈ ఆధునిక శాస్త్రీయ పరిజ్ఞానమే.

సంస్థాగత దోపిడీ

ప్లాసీ యుద్ధం తర్వాత సరిగ్గా దశాబ్దకాలానికి, 1767లో ఈస్టిండియా కంపెనీ సర్వే ఆఫ్‌ ఇం‌డియాను నెలకొల్పింది. వాళ్ల పరిపాలన సుస్థిరం కావడానికీ, సైనిక విస్తరణకూ, అదే సమయంలో మరింత రెవెన్యూ వసూలుకు భూ- సముద్ర మార్గాల శాస్త్రీయ సర్వే అవసరమైంది. భారత ఉపఖండంలో భౌగోళిక, జనాభాపరమైన సర్వేలు చేపట్టడమే సర్వే ఆఫ్‌ ఇం‌డియా ఏర్పాటు అసలు ఉద్దేశం. బెంగాల్‌, ‌బిహార్‌, ఒరిస్సాల్లో దివానీ హక్కులు పొందిన తర్వాత 1767లో మేజర్‌ ‌జేమ్స్ ‌రానెల్‌ను బెంగాల్‌ ‌సర్వేయర్‌ ‌జనరల్‌గా కంపెనీ నియమించింది.

సర్వే ఆఫ్‌ ఇం‌డియా భారత ఉపఖండంలో ఏర్పాటైన మొట్టమొదటి బ్రిటిష్‌ ‌సంస్థ. పాలనా పరమైన హంగూ ఆర్భాటం పైకి ఎంత కనిపించినా, ఈస్టిండియా కంపెనీ ఒక వర్తకసంస్థ కావడం వల్ల అది నెలకొల్పిన సర్వే ఆఫ్‌ ఇం‌డియాకు సాధికారత మాత్రం లేదు. కాకపోతే భవిష్యత్తులో చోటుచేసుకో బోయే పరిణామాలకు ఇదొక స్పష్టమైన సంకేతంగా నిలిచిందని కచ్చితంగా చెప్పవచ్చు. ముఖ్యంగా దేశంలో మొగల్‌ ‌పరిపాలన నామావశిష్టంగా మారడం, అయోధ్య, బెంగాల్‌ ‌వంటి ముఖ్యమైన ప్రావెన్స్‌లు స్వతంత్రం కావడం వంటి పరిణామాల నేపథ్యంలో యావత్తు దేశాన్ని తన నియంత్రణలోకి తీసుకోవాలన్న ఈస్టిండియా కంపెనీ ఉద్దేశాన్ని ఈ సంస్థతో ప్రస్ఫుటమైంది. ఉపఖండంలో రాజకీయ పరిణామాలు దుర్బలస్థితికి చేరుకున్న నేప థ్యంలో, దేశాన్ని శాస్త్రీయమైన రీతిలో ఒక పద్ధతి ప్రకారం కబ్జా చేసుకోవడానికి కంపెనీ నెల కొల్పిన మొట్టమొదటి ధ్వజ స్తంభం- సర్వే ఆఫ్‌ ఇం‌డియా.

సరికొత్త శాస్త్ర సంబంధ పరికరాలను (సెకండ్‌ ‌హ్యాండ్‌వి అయినా) దేశంలో ప్రవేశపెట్టిన కాలం కూడా ఇదే. వీటన్నింటిని ఇంగ్లండ్‌ ‌తన లక్ష్యసాధన కోసం ఉపయోగించింది. నిజానికి 1800లో ఏర్పాటుచేసిన ట్రిగొనామెట్రిక్‌ ‌సర్వే ఆఫ్‌ ఇం‌డియాలో ఉపయోగించినవి అన్నీ సెకండ్‌ ‌హ్యాండ్‌ ‌పరికరాలే! 1818లో ఆంగ్లో- మరాఠా యుద్ధంలో విజయం సాధించిన తర్వాత సట్లెజ్‌ ‌నదికి దక్షిణ భాగంలో ఉన్న ప్రాంతం యావత్తూ ఈస్టిండియా కంపెనీ ఆధీనంలోకి వచ్చింది. అప్పుడు ట్రిగొనామెట్రిక్‌ ‌సర్వే ఆఫ్‌ ఇం‌డియా పేరును బ్రిటిష్‌వారు గ్రేట్‌ ‌ట్రిగొనా మెట్రిక్‌ ‌సర్వే ఆఫ్‌ ఇం‌డియా (జీటీఎస్‌)‌గా పేరు మార్చారు. హిమాలయ పర్వత ప్రాంతాలతో సహా మొత్తం భారత ఉపఖండంలో సర్వే నిర్వహించడమే ఈ పేరు మార్పు వెనుక అసలు ఉద్దేశం. హిమాలయాల్లోని ఖనిజ సంపద బ్రిటిష్‌వారిని ఆకర్షించింది.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనదిగా పరిగణించే ‘శిఖరం-15’ ఎత్తును జీటీఎస్‌ ‌కచ్చితంగా లెక్కించింది. కానీ ఈ గణన వెనుక ఉన్నది మన దేశానికి చెందిన గొప్ప గణిత శాస్త్రవేత్త రాధానాథ్‌ ‌సిక్ధర్‌. ‌జీటీఎస్‌లో ఆయన అప్పట్లో ‘కంప్యూటర్‌’ ఉద్యోగిగా పనిచేశారు. ఆ శిఖరం ఎత్తును కనుగొన్న రాధానాథ్‌ ‌సిక్ధర్‌ ‌పేరును పైకి రానీయకుండా, అప్పటి సర్వేయర్‌ ‌జనరల్‌ ‌జార్జ్ ఎవరెస్ట్ ‌పేరు మీద ఆ శిఖరానికి ‘మౌంట్‌ ఎవరెస్ట్’ అని నామకరణం చేశారు. ఈయన ఒక్కడే కాదు, ఎన్నో విజయాలు సాధించిన ఎంతోమంది తెలివైన భారతీయ శాస్త్ర వేత్తల పేర్లు బ్రిటిషర్ల వివక్ష కారణంగా వెలుగులోకి రాకుండాపోయాయి.

ఈవిధంగా భారతీయ సంపదను కొల్లగొట్ట డానికి, భారతీయుల మేధన్సును అణగదొక్కి ఆ స్థానంలో తాము కీర్తిప్రతిష్టలు పొందడానికి బ్రిటిషర్లు ఉపయోగించిన ఆయుధం సైన్స్, ‌దానితో పాటు శాస్త్ర ఉపకరణాలు. ఆ విధంగా దేశీయ శాస్త్రీయ పరిజ్ఞానం, భారతీయ శాస్త్రవేత్తల విలువైన ఆవిష్కరణలు అణచివేతకు గురయ్యాయి.

ఇందుకోసం భారతీయ శాస్త్రవేత్తలు, ఇక్కడి శాస్త్రీయ పరిజ్ఞానాన్ని విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఎప్పటికప్పుడు తక్కువచేసి చూపేవారు. భారతీయ శాస్త్రవేత్తలకు శాస్త్రీయ దృక్ఫథం లేదంటూ నూరిపోసే వారు. ఒక పద్ధతి ప్రకారం చేస్తున్న ఈ విషప్రచారం ప్రభావం తర్వాతి దశాబ్దాల్లో స్పష్టంగా కనబడింది.

రైల్వేల ద్వారా దోపిడీ

 ఏప్రిల్‌ 16, 1853-ఇది మన దేశంలో సువర్ణాక్షరాలతో లిఖించిన తేదీ. ‘బ్రిటిష్‌ ‌వారి దయవల్ల’ మొట్టమొదటి రైలు నడిచింది ఆ రోజునే! బొగ్గు, ఇనుము, పత్తి వంటి ముడిసరుకులను పోర్టులకు, అక్కడి నుంచి ఇంగ్లండ్‌కు సత్వర రవాణాకు దేశంలో రైల్వే వ్యవస్థను నెలకొల్పడం అత్యంత అవసరమని వలస పాలకులు గుర్తించారు. ముఖ్యంగా ఇంగ్లండ్‌ అభివృద్ధికి దోహదం చేసే పారిశ్రామిక విప్లవానికి అవసరమైన ముడిసరుకు రవాణాకు రైల్వే వ్యవస్థ ఎంతో ఉపకరిస్తుంది. ఈ నేపథ్యంలో సహజవనరులు పుష్కలంగా ఉండే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పోర్టు నగరాలైన కొల్‌కతా, మద్రాస్‌, ‌బొంబాయిలను కలుపుతూ తొలినాటి రైల్వేలైన్లను నిర్మించారు. మధ్యభారత్‌లో బొగ్గు పుష్కలంగా లభించే షహ్‌దల్‌ (‌ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో ఉంది) లేదా ఛోటానాగ్‌పూర్‌ (‌ప్రస్తుతం జార్ఖండ్‌) ‌వంటి ప్రాంతాలు ఇందుకు ఉదాహరణ. వలసవాదుల ప్రయోజనాలకే ప్రాధాన్యం తప్ప, స్థానికుల సదుపాయాల కల్పన అనేది కేవలం అనుషంగికం. ఉదాహరణకు భారతీయులు ప్రయాణించాల్సింది మూడో తరగతి కంపార్ట్ ‌మెంట్లలో మాత్రమే! కలపతో తయారైన ఈ పెట్టెల్లో చెక్క బెంచీలు తప్ప మరే ఇతర సదుపాయాలు ఉండేవికావు.

అసలు నిజం ఇదయితే, బృహత్తర రైల్వే వ్యవస్థ ఏర్పాటు ఘనత బ్రిటిష్‌ ‌వారిదేనన్న కథలు ఇప్పటికీ ప్రచారంలో ఉండటం దురదృష్టకరం. భారత్‌లో బ్రిటిష్‌ ‌వలస పాలనను సమర్థించేవారు, రెండు శతాబ్దాల పాటు దేశాన్ని దోచుకున్న వైనాన్ని ప్రశ్నించకుండా, రైల్వేల వంటి గొప్ప వ్యవస్థలను మన అందుబాటులోకి తెచ్చారంటూ ఆకాశాని కెత్తేయడాన్ని ఏమనాలి?

రైలును కనుగొనడం గొప్ప శాస్త్రీయ ఆవిష్కరణ అనడంలో ఎంతమాత్రం సందేహంలేదు. కానీ మొట్టమొదటగా ఈ సదుపాయాన్ని తన స్వార్థంకోసం పూర్తిగా ఉపయోగించుకున్నది మాత్రం ఈస్టిండియా కంపెనీనే. 1843లో గవర్నర్‌ ‌జనరల్‌ ‌లార్డ్ ‌హర్డింజ్‌, ‘‌రైల్వేలు ప్రభుత్వానికీ, దేశాన్ని సైనిక నియంత్రణలో ఉంచడానికీ ఎంతో ఉపయోగం’ అంటూ వాదించడం గమనార్హం.

బ్రిటిష్‌ ‌మదుపర్లు పెద్దఎత్తున రైల్వేల్లో పెట్టుబడులు పెట్టి కనీవినీ ఎరుగని రీతిలో లాభాలనార్జించారు. ప్రభుత్వ వాటాల్లో పెట్టుబడి పెడితే రెట్టింపు ఆదాయం లభించేలా బ్రిటిష్‌ ‌ప్రభుత్వం అప్పట్లో మదుపర్లకు హామీ ఇచ్చింది. నిజానికి ఇంత పెద్దమొత్తాలను తిరిగి చెల్లించింది భారతీయుల నుంచి వసూలు చేసిన పన్నుల మొత్తం నుంచి తప్ప, బ్రిటిష్‌ ‌పన్ను చెల్లింపుదార్లనుంచి కాదు!

20వ శతాబ్దం ఆరంభంలో రైల్వేలో బోర్డ్ ఆఫ్‌ ‌డైరెక్టర్ల దగ్గరి నుంచి టీటీఈల వరకు అంతా తెల్లవారే. వీరికి యూరోపియన్‌ ‌పేస్కేళ్లతో సమానంగా వేతన చెల్లింపులు జరిగాయి.

భారతీయ శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానాన్ని బ్రిటిషర్లు ఏవిధంగా తొక్కేశారో తెలుసుకోవడానికి ఈ క్రింది ఉదాహరణే గొప్ప రుజువు. బెంగాల్‌లోని జమాల్‌పూర్‌, ‌రాజ్‌పుఠాణాలోని అజ్మీర్‌లలో రైల్వే వర్క్‌షాపులను 1862లో బ్రిటిష్‌ ‌ప్రభుత్వం నెలకొల్పింది. ఇక్కడ రైళ్ల నిర్వహణ చేపట్టేవారు. వీటిల్లో పనిచేసిన భారతీయ కార్మికులు ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శించేవారు. వారి నైపుణ్యం ఏ స్థాయిలో ఉన్నదంటే 1878 నుంచి సొంతంగా రూపకల్పన చేసి లోకోమోటివ్‌లను నిర్మించేవారు. వీరు తయారుచేసిన లోకోమోటివ్‌లు బ్రిటిష్‌ ‌వారి ప్రమాణాలతో సరితూగడమే కాకుండా తక్కువ ధరకే లభ్యమయ్యేవి.

వెంటనే మేల్కొన్న బ్రిటిష్‌ ‌ప్రభుత్వం 1912లో అక్కడి పార్లమెంట్‌లో ఒక బిల్లును ప్రవేశపెట్టింది. దీని ప్రకారం భారతీయ వర్క్‌షాపులు లోకో మోటివ్‌ల రూపకల్పన, తయారీలను చేపట్టడానికి వీల్లేదు. ఈవిధంగా భారతీయ ప్రతిభను మొగ్గలోనే తుంచి వేసింది. ఫలితంగా 1912 తర్వాత మనదేశంలో ఒక్క లోకోమోటివ్‌ ‌కూడా తయారుకాలేదు. 1854 నుంచి 1947 మధ్యకాలంలో భారత్‌కు మొత్తం 14వేల లోకోమోటివ్‌లు ఇంగ్లండ్‌ ‌నుంచి దిగుమతి అయ్యాయి!

ప్రయోగశాలలు, సంస్థల ఏర్పాటులో మతలబు

అది 1787వ సంవత్సరం. ఈస్టిండియా కంపెనీ సైన్యాధికారి కల్నల్‌ ‌రాబర్ట్ ‌కైడ్‌ ‌కలకత్తా బొటానికల్‌ ‌గార్డెన్‌ (‌ప్రస్తుతం జగదీష్‌చంద్రబోస్‌ ఇం‌డియన్‌ ‌బొటానికల్‌ ‌గార్డెన్‌)‌ను నెలకొల్పాడు. ఇది హౌరాకు చెందిన షిబ్‌పూర్‌లో ఉంది. ఈ బొటానికల్‌ ‌గార్డెన్‌ ఏర్పాటు వెనుక ఒక స్వార్థపూరిత చరిత్ర దాగి ఉంది. ఈస్టిండియా కంపెనీకి భారతీయ వృక్షశాస్త్రం, వనమూలికలు, వాణిజ్య ప్రయోజనాలు ఉన్న మొక్కలపై ఎటువంటి నమ్మకం లేదు. నౌకలను తయారుచేయడానికి అవసరమైన కలపను ఉత్పత్తిచేసి, దానినుంచి తయారైన నౌకల ద్వారా సరుకులను కలకత్తా నుంచి రవాణా చేయడం వారి ప్రధాన ఉద్దేశంగా ఉండేది. అంతకుముందు నౌకల తయారీకి బర్మా నుంచి టేకును అత్యధిక ధరకు కొనుగోలు చేసేవారు. ఈ ఖర్చును తగ్గించుకోవడం కోసం ఈ గార్డెన్‌ ఏర్పాటు చేసి, ఇక్కడ టేకు మొక్కల పెంపకాన్ని చేపట్టేవారు. ఇదీ ఈ గార్డెన్‌ ఏర్పాటు వెనుక ఉన్న అసలు రహస్యం!!

భారత్‌ను బలిచేసి…

వలసవాదం అంటే అర్థం ఆధిపత్యం! భారతీయు లపై ఈ ఆధిపత్యాన్ని చెలాయించడానికి ఏ ఒక్క అవకాశాన్ని బ్రిటిషర్లు వదులుకునేవారు కాదు. ఆధునిక ప్రపంచ చరిత్రలో తొలి పారిశ్రామిక దేశంగా ఇంగ్లండ్‌ ‌గౌరవం దక్కించుకుంది. ఎవరిని తొక్కేయడం ద్వారా అది ఈ ఘనత సాధించింది? భారత్‌లో శాస్త్ర పరిజ్ఞానం, శాస్త్రస్వభావం లేవా?

భారతీయులు పుక్కిటి పురాణాలు, మూఢ నమ్మకాలను విశ్వసిస్తారని బ్రిటిషర్లు ప్రచారం చేశారు. అసలు వారికి హేతుబద్ధ జ్ఞానం లేదని తేల్చేశారు. వలసవాదానికి పూర్వం ఉన్న శాస్త్రీయ పరిజ్ఞానం నమ్మదగింది కాదని పశ్చిమదేశాల శాస్త్రవేత్తల అభిప్రాయం. అందువల్లనే ఏ శాస్త్రీయ సిద్ధాంతాన్నైనా అప్పట్లో పశ్చిమదేశాల శాస్త్రవేత్తలు తాము అనుసరించే పద్ధతుల ప్రకారం పరీక్షించి దాని విశ్వసనీయతను నిర్ధారించేవారు. ఇక భారత మార్కెట్‌ ‌విషయానికి వస్తే, బ్రిటన్‌లోని పరిశ్రమలకు అవసరమైన ముడి పదార్థాలను సరఫరా చేసేదిగా రూపొందింది. అక్కడి పరిశ్రమల్లో తయారైన వస్తువులను అమ్ముకోవడానికి పెద్ద మార్కెట్‌గా స్థిరపడింది. ఈవిధంగా దోచుకోవడానికి ప్రధాన కేంద్రంగా మారి ‘బలైపోయింది’.

ప్రభావం

క్రీ.శ.1600లో ఈస్ట్ ఇం‌డియా కంపెనీ స్థాపన జరిగినప్పుడు ఇంగ్లండ్‌ ఉత్పత్తులు ప్రపంచ జి.డి.పిలో 1.8% మాత్రమే. అదే భారత ఉత్పత్తులు 23%. 1700 సంవత్సరానికి ఇవి 27%కు పెరిగాయి. దాదాపు రెండు శతాబ్దాల తర్వాత అంటే 1940 నాటికి ప్రపంచ జి.డి.పి.లో బ్రిటన్‌ ఉత్పత్తులు 10%కు చేరుకోగా, భారత్‌ ‌నిరుపేద ‘మూడో ప్రపంచ దేశం’ స్థాయికి దిగజారిపోయింది. కరవు, పేదరికం, దిక్కులేని స్థితి నేపథ్యంలో 90% మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువకు చేరిపోయారు. ‘శాస్త్రం’ భారత్‌ను ఇంతటి దయనీయ స్థితిలోకి నెట్టేసింది. కొన్ని వేల సంవత్సరాల సుసంపన్న నాగరికత కలిగిన మన దేశ వనరులను ఇంగ్లండ్‌ ‌దోచుకు పోయింది. సాంస్కృతిక సుసంపన్నత, విద్యాపరమైన వారసత్వం, గొప్ప ఆవిష్కరణలు, దేశీయ పరిశ్రమలు (వృత్తులు)… అన్నీ బ్రిటిషర్ల పుణ్యమాని తుడిచి పెట్టుకుపోయి ‘అస్థిపంజరం’ వంటి నిరుపేద దేశం మిగిలింది.

19వ శతాబ్దపు ప్రారంభంలో మద్రాస్‌ ‌ప్రెసిడెన్సీ బోర్డ్ ఆఫ్‌ ‌రెవెన్యూ అధ్యక్షుడిగా పనిచేసిన జాన్‌ ‌సులైవాన్‌, ‘‌మనం ఇక్కడి గంగామైదాన ప్రాంతంలోని ఉత్తమ మైనదాన్ని పీల్చి పిప్పిచేసి, లండన్‌లోని థేమ్స్ ‌నగరంలో వదిలేస్తున్నాం’ అంటూ వ్యాఖ్యానించడం, నాటి వాస్తవికతకు నిలువుటద్దం పడుతోంది.

అను: జమలాపురపు విఠల్‌రావు

About Author

By editor

Twitter
Instagram