బీజేపీ మీద పోరాటం పేరుతో ఎన్ని అరాచకాలు చేసినా వాటి గురించి ఇక్కడ ప్రశ్నించలేరు. ప్రశ్నించడానికి వీలేలేదు. బీజేపీ హిందూత్వను నిరోధించే పేరుతో దేశ విద్రోహానికి తక్కువ కాని బుజ్జగింపు ధోరణికి పాల్పడినా ఇదేమిటని అడగరాదు. అలాగే కేంద్రం మీద పోరాటం అంటూ ఎంత అవినీతికైనా పాల్పడవచ్చు. ఇప్పుడు దేశంలో జరుగుతున్నది ఇదే. ‘అవినీతి నేరమూ కాదు, ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిందీ కాదు, రాజకీయంగా బలహీనపరచడం సాధ్యం కాదు కాబట్టి అసహ్యించుకోవాల్సిన అసవరంలేదు!’ ఇదీ అవినీతికి మనం ఇవ్వాల్సిన తాజా నిర్వచనం! పశ్చిమ బెంగాల్‌ అనే రాష్ట్రంలో, అక్కడ రాజ్యమేలుతున్న తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం పాలనలో జరుగుతున్నది ఇదే. అవినీతి, అరాచకం – ఈ రెండే ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నాయి. పార్థా చటర్జీ అనే ఇప్పటి పరిశ్రమల మంత్రి, గతంలో విద్యామంత్రిగా ఉన్నప్పుడు చేసిన అవకతవకలు ఇప్పుడు దేశాన్ని కుదుపుతున్నాయి. అక్కడ ఇప్పటిదాకా సెక్యులరిజం- హిందువుల మీద అరాచకం ఒకే నాణేనికి రెండు ముఖాలని అంతా అనుకున్నారు. ఇప్పుడు అక్రమార్జన-రాజకీయాల మధ్య గాఢమైన బంధం కూడా బయటపడింది. నారద, శారద, బొగ్గు, రోజ్‌ ‌వ్యాలీ… అక్రమాలన్నీ కేవలం మమతా బెనర్జీ హయాంలోనే జరిగాయి.

వీటికి పరాకాష్ట పశ్చిమబెంగాల్‌ ‌వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పార్థా చటర్జీని, ఆయన సన్నిహితులను పాఠశాల నియామకాల స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్ట్ ‌చేయడం ఆశ్చర్యం అనిపించదు. ఈ పెడధోరణి విషయం లోను తన మన అంటూ విపక్షాలు మౌనం దాల్చడమే పెద్ద వింత. ఇక తన మెడకు చుట్టుకున్న ఈ అవినీతి రొంపి నుంచి బయటపడటానికి తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌నానా తంటాలు పడుతోంది. పార్థాచటర్జీ సన్నిహితు రాలు అర్పితా ముఖర్జీ వద్ద నుంచి దాదాపు రూ.50.36 కోట్ల వరకు నగదు, కిలోల కొద్దీ బంగారాన్ని ఈడీ రికవరీ చేయడమే కాకుండా స్థిరాస్తులు, విదేశీ నగదు ఎక్స్చేంజ్‌కి సంబంధించిన పత్రాలను కూడా స్వాధీనం చేసుకోవడంతో పార్టీపై విపరీతమైన వత్తిడి పెరిగింది. కార్లూ, అపార్ట్‌మెంట్లు సరేసరి. స్వపక్ష, విపక్షాలనుంచి కూడా విమర్శలు తీవ్రం కావడంతో జూలై 28వ తేదీన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో, పార్థా చటర్జీని మంత్రి పదవుల నుంచి బర్తరఫ్‌ ‌చేయడమే కాకుండా, పార్టీ పదవుల నుంచి విచారణ పూర్తయ్యేవరకు సస్పెండ్‌ ‌చేసింది. ఆయన ఇప్పటివరకు వాణిజ్యం, పరిశ్ర మలు, పార్లమెంటరీ వ్యవహారాలు, ఇన్ఫర్మేషన్‌ ‌టెక్నాలజీ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ‌పబ్లిక్‌ ఎం‌టర్‌‌ప్రైజెస్‌ అం‌డ్‌ ‌రీకన్‌‌స్ట్రక్షన్‌ ‌శాఖలకు మంత్రిగా కొనసాగారు. అధికార దుర్వినియోగానికి పాల్పడేవారిని తమ పార్టీ ఎంత మాత్రం సహించబోదని మమతా బెనర్జీ ఈ సందర్భంగా ఎంత గంభీర ప్రకటన చేసినా, మొదటి నుంచి అవినీతి దుర్గంధంతో పార్టీ భ్రష్టుపట్టి పోయిందన్న సంగతి తెలియనిదెవరికి?

ఎక్కడ మొదలయింది?

2016లో పార్థా చటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు విద్యాశాఖలో ఉపాధ్యాయ, ఉపాధ్యాయే తర ఉద్యోగాలకు పశ్చిమ బెంగాల్‌ ‌స్కూల్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ప్రవేశ పరీక్ష నిర్వహించింది. వీటి ఫలితాలు 2017 నవంబర్‌లో వచ్చాయి. బబితా సర్కార్‌ అనే అభ్యర్థి ప్రథమ స్థానంలో నిలిచారు. ఆమెతో పాటు 20 మంది టాపర్స్ ‌జాబితాను ప్రకటించారు కూడా. కానీ వెంటనే ఆ జాబితాను రద్దు చేశారు. తరువాత వచ్చిన జాబితాలో అసలు బబితా సర్కార్‌ ‌పేరే లేదు. ఆ స్థానంలో అంకితా అధికారి పేరు వచ్చింది. ఇంతకీ ఈమె పశ్చిమ బెంగాల్‌ ‌మంత్రి పరేష్‌ అధికారి కూతురు. బబితా సర్కార్‌కు 77 మార్కులు, అంకితకు 61 మార్కులు వచ్చినా అంకితనే ప్రథమ స్థానంలో పెట్టారు. దీనితో బబిత కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. మాజీ న్యాయమూర్తి రంజిత్‌ ‌కుమార్‌ ‌బాగ్‌ ‌నాయకత్వంలో ఒక విచారణ సంఘాన్ని కోర్టు నియమించింది. ఈ సంఘమే విద్యాశాఖ అధికారుల మీద చర్యలకు సిఫారసు చేసింది కూడా. గ్రూప్‌ ‌డి ప్రవేశ పరీక్షలలో కూడా ఇలాంటి అవకతవకలే జరిగినట్టు తేలింది. ఈ వ్యవహారంలో పార్థా చటర్జీ పేరు వినిపించడంతో సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ సంవత్సరం మే 18, 25 తేదీలలో ప్రశ్నించిన తరువాత జూన్‌లో సీబీఐ మనీ లాండరింగ్‌ ‌కేసు నమోదు చేసింది. జూలై 22న చటర్జీకి చెందిన నివాసాల మీద దాడులు జరిగాయి. కొన్ని అపార్ట్‌మెంట్‌లు కూడా ఇతడివేనని తేలింది. అందులో కేవలం కుక్కల కోసం కేటాయించిన ఒక ఏసీ అపార్ట్‌మెంట్‌ ‌కూడా ఉంది.

 ఎవరీ పార్థా చటర్జీ?

పార్థాచటర్జీ… తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీకి అత్యంత విశ్వాసపాత్రుడు. ఈ కారణంగానే ఆయన సుమారు ఆరు మంత్రిత్వ శాఖలు నిర్వహించగలిగారు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన పార్థాచటర్జీ 2001 నుంచి 2022లో ఎస్‌ఎస్‌సీ స్కామ్‌లో అరెస్టయ్యే వరకు ఒక వెలుగు వెలిగారనే చెప్పాలి. ఆయన 1960ల్లో కళాశాల స్థాయి నుంచే రాజకీయాల్లో ప్రవేశించి, యువనేతగా కాంగ్రెస్‌లో చేరారు. అక్కడినుంచి ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. జనవరి 1, 1998న మమతా బెనర్జీ కాంగ్రెస్‌ ‌నుంచి బయటకు వచ్చి తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీని స్థాపించిన తర్వాత ఆయన చురుగ్గా రాజకీయాల్లో పాల్గొనడం ప్రారంభమైంది. 2001 నుంచి బెహలా పశ్చిమ నియోజవకర్గం నుంచి వరుసగా ఐదుసార్లు తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొదటగా అసెంబ్లీలో తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌నాయకుడిగా, తర్వాత విపక్షనేతగా పనిచేశారు. ముఖ్యంగా 2017లో ముకుల్‌ ‌రాయ్‌ ‌పార్టీని వీడిన తర్వాత చటర్జీ ప్రాధాన్యం బాగా పెరిగింది. అయితే 2016లో విద్యాశాఖను చేపట్టిన దగ్గరినుంచి ఈయన ప్రతిష్ట మసక బారటం మొదలైంది. ముఖ్యంగా టీచర్ల నియామకాల్లో అవినీతి రొంపిలో ఈయన పేరు వెలుగులోకి రావడం, క్రమంగా ఈ ఊబిలో నుంచి బయటపడ లేక చివరకు అరెస్ట్ ‌దాకా వెళ్లింది. లంచాలు తీసుకొని రాష్ట్రంలోని బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు జరుపుతున్నారన్న వార్తలు వ్యాపించడంతో 2019లో మొదటిసారి పార్థా చటర్జీ వివాదంలో చిక్కుకున్నారు. వీటిపై జిల్లాల్లో ఆందోళనలు జరుగుతున్నా పార్థా చటర్జీ సహా తృణమూల్‌ ‌నేతలు పెద్దగా పట్టించుకోలేదు. చివరకు 2021లో ఈ అవినీతి బాగోతంపై వస్తున్న ఆరోపణలను రాష్ట్ర హైకోర్టు పరిగణనలోకి తీసుకో వడంతో ఒక్కసారి పరిస్థితిలో మార్పు వచ్చింది. 2013, 2014 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని కుదిపేసిన శారదా స్కాం, నారదా టేపుల లీకు వ్యవహారాల్లో తన మంత్రివర్గ సహ చరులు అరెస్టయినప్పటికీ, పార్థా చటర్జీ మాత్రం మచ్చలేని మహరాజుగానే ఉండి పోయారు. బహుశా ఈ ధైర్యంతోనే టీచర్ల నియామకాల అవినీతిలో తన పాత్రపై సొంత పార్టీలో గుసగుసలు బయలుదేరినా చటర్జీ చలించలేదు. ఇదేకాలంలో పార్టీలో నెలకొన్న విభేదాలను పరిష్కరించే బాధ్యతలను నిర్వర్తించారు. 2020లో పార్టీనుంచి వలసలు మొదలైనప్పుడు, భిన్నాభిప్రాయాలు కలిగినవారిని బుజ్జగించే పనికూడా ఈయనకే పార్టీ అప్పగించింది.

రాష్ట్రంలో యూనివర్సిటీలకు వైస్‌ ‌ఛాన్సలర్ల నియామకాలు చేపట్టే అధికారం విద్యామంత్రిగా తనకే దఖలు పరచాలంటూ, అసెంబ్లీలో తీర్మానం పెట్టినప్పు డు ఒక్కసారిగా పార్థాచటర్జీ పేరు పతాక శీర్షికలకెక్కింది. నిజానికి వైస్‌ ‌ఛాన్స్‌లర్ల నియామకా ధికారం గవర్నర్‌కే ఉంటుంది. చివరికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలుగజేసుకోవడంతో ఆయన వెనక్కు తగ్గక తప్పలేదు. 2016లో ఈయన నిర్వహిస్తున్న వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖను అమిత్‌ ‌మిత్రాకు ఇవ్వడంతో అప్పటివరకు అప్రతిహతంగా సాగుతున్న ఆయన ప్రభకు మొదటిసారి దెబ్బ తగిలింది. 2021లో ఈయన చేతిలో ఉన్న విద్యాశాఖను బ్రత్య బసుకు అప్పగిం చడం రెండో దెబ్బ. ముఖ్యంగా చటర్జీ కాలంలో స్కూళ్ల పోస్టుల భర్తీల్లో వచ్చిన అవినీతి ఆరోపణలపై పార్టీ ఐదుగురు సభ్యులతో కూడిన ఒక సలహా సంఘాన్ని నియమించి, దాని నివేదిక ఆధారంగా పార్టీ ఈ చర్య తీసుకుంది. గత జూన్‌లో సీబీఐ చటర్జీని ప్రశ్నించిన తర్వాత, తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌రాష్ట్ర కార్యదర్శి కునాల్‌ ‌ఘోష్‌ ‌మాట్లాడుతూ ఈ వ్యవహారం మొత్తం పార్థా చటర్జీ హయాంలో జరిగింది తప్ప, బ్రత్య బసు పదవీకాలంలో కాదని వివరణ ఇచ్చుకోవడం ఈ వ్యవహారంలో పార్టీ దూరంగా జరుగుతున్నదనడానికి నిదర్శనం.

స్కామ్‌లు తృణమూల్‌కు అలవాటే

నిజం చెప్పాలంటే తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ఈ ‌స్కామ్‌లకు బాగా అలవాటు పడిపోయింది. పార్టీ నాయకులకు పోంజీ పథకాలు, డబ్బు లావాదేవీలు నిత్యకృత్యం. 2013లో బయటపడిన శారదా కుంభకోణం, తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌నాయకులకు సుదిప్తాసేన్‌తో సంబంధాలను ప్రస్ఫుటం చేసింది. 2016లో రోజ్‌వ్యాలీ స్కామ్‌, ‌టీఎంసీ నాయకులకు, డబ్బుకు ఎంతటి సంబంధమున్నదీ తేల్చింది. ఇన్ని జరుగుతున్నా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విద్య మమతా బెనర్జీకి ఎక్కడిదంటే- కేవలం అరాచకం, రక్తపాతాలతోనే. 2021 మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అవినీతి అక్రమాలు, కుటుంబ పాలనపై బీజేపీ ఎంత పోరాడినా ఫలితం దక్కలేదు. కాకపోతే బీజేపీ తన బలాన్ని గణనీయంగా పెంచుకోవడాన్ని తక్కువగా అంచనా వేయలేం!

మమతా బెనర్జీ తన పార్టీని మూడుసార్లు అధికారంలోకి తీసుకొచ్చారు. ఇదే సమయంలో మనీ లాండరింగ్‌, ‌మోసం వంటి కేసుల్లో సీబీఐ, ఈడీలు అరెస్ట్ ‌చేసిన ఆమె సహచరులు కూడా ఎన్నికల్లో గెలిచారు. రోజ్‌వ్యాలీ స్కామ్‌లో అరెస్టయిన టీఎంసీ ఎం.పీ. సుదీప్‌ ‌బందోపాధ్యాయ 2019 ఎన్నికల్లో మళ్లీ ఎన్నికయ్యారు. ఈయన్ను అప్పట్లో ఒడిషా లోని జైల్లో పెట్టారు కూడా. 2014లో మదన్‌ ‌మిత్రాను శారద స్కామ్‌లో సీబీఐ అరెస్ట్ ‌చేసినా 2021 అసెంబ్లీ ఎన్నికల్లో సలక్షణంగా గెలిచారు. తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌నుంచి బీజేపీలో చేరి మళ్లీ ఇప్పుడు తృణమూల్‌ ‌కాంగ్రెస్‌లో చేరిన ముకుల్‌ ‌రాయ్‌ని శారదా స్కామ్‌లో సీబీఐ ప్రశ్నించింది. ఆయన కూడా 2021 ఎన్నికల్లో శాసనసభకు ఎన్నికయ్యారు.

పాలకులు-క్లైంట్లు

సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ‌ఫ్రంట్‌ అధికారంలో ఉన్న రోజుల్లో, సీపీఎం మొత్తం పాలనాధికారాలను, విద్యాసంస్థల నియంత్రణ తన చెప్పుచేతుల్లో ఉంచుకునేది. కళాశాలల్లో ప్రవేశాలను ఎస్‌.ఎఫ్‌.ఐ. ‌నియంత్రించేది. పార్టీ ఒకరకంగా తాను పాలకుడుగా, తన వద్దకు అవసరానికి వచ్చేవారిని క్లైంట్లుగా భావించింది. అంటే పశ్చిమ బెంగాల్‌ల్లో ‘పాలకులు-క్లైంట్లు’ అనే ఒక కొత్త పద్ధతి అనుకో కుండానే అమల్లోకి వచ్చింది. ఇదే సంప్రదాయాన్ని మమతా బెనర్జీ అనుసరిస్తున్నారంతే. కాకపోతే ఇందుకు ప్రతిఘటన కూడా ఒక పద్ధతి ప్రకారం ఎదురవుతుండటం ఆమె అనుభవంలోకి వస్తోంది.

ఆశ్రిత పక్షపాతం

లెఫ్ట్-‌ఫ్రంట్‌ ‌ప్రభుత్వం ఓటమిపాలై తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన అర్హతలు లేనిరిని పాఠశాలలు, కళాశాలల గవర్నింగ్‌ ‌బాడీల్లో నియమించడం మొదలైంది. ఇవి నాయకులు, మంత్రులు అస్మదీయులకు అనుచిత సహాయాలు చేయడం మొదలైంది. ఆవిధంగా కలకత్తా హైకోర్టు తీవ్రంగా తప్పు పట్టిన మొట్టమొదటి మంత్రి పరేష్‌ అధికారి. స్కూల్‌ ‌టీచర్‌ ‌పోస్టుకు నిర్వహించిన పరీక్షల్లో తన కుమార్తె కంటే బాగా ముందున్నవారిని తప్పించి, ఆమెకు పోస్టింగ్‌ ఇప్పించుకున్నారని కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెను ఉద్యోగం నుంచి తొలగించాలని, అప్పటివరకు తీసుకున్న ప్రభుత్వ జీతాన్ని తిరిగిచ్చేయాలని ఆదేశాలు జారీచేసింది. దీన్ని గమనిస్తే మమతా బెనర్జీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు టర్మ్‌లు విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన పార్థా చటర్జీకి అవినీతి మరక అంటుకోవడంలో పెద్ద విశేషమేం లేదు. తాజాగా ఒకే కుటుంబానికి చెందిన పది మందిని పుర్బ, మిడ్నాపూర్‌ ‌స్కూళ్లలో నియమించా రంటూ ఒక పిటిషనర్‌ ‌హైకోర్టు దృష్టికి తీసుకు రావడంతో, వారంతా చటర్జీ బాడీగార్డు బిశ్వాంబర్‌ ‌మండల్‌ ‌సమీప బంధువులని తేలింది. తప్పుడు పత్రాలతో ఈ పోస్టులను పొందారన్న అభియోగంపై కోర్టు వారిని ఆగస్టు 17న అఫిడవిట్లతో హాజరుకావాలని ఆదేశించడం కొసమెరుపు.

పార్థా చటర్జీ అరెస్ట్ ‌రెండు అంశాలను ప్రధానంగా ముందుకు తీసుకొస్తోంది. మొదటిది, రాజకీయ నాయకులు అరెస్టయి, విచారణ ఎదుర్కొన్నప్పటికీ ఓటర్లు వారిని పూర్తి దుష్టులుగా చూడకపోవడం. రెండవది పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉద్యోగ నియామకాల్లో లంచాలు తీసుకోవడం ‘లాభాలతో కూడిన పరిశ్రమ’ కావడం. మరి ఈ రెండూ ఒకే వేదిక కలిగి వేర్వేరుగా కనిపిస్తున్న సమస్యలు. ఉద్యోగాలు వేలల్లో! అభ్యర్థులు లక్షల్లో! మరి క్యూను దాటాలంటే శక్తివంతమైన నాయకుడిని పట్టుకోవడమే మార్గం. అడిగింది ఇవ్వడం, ఉద్యోగం ఖాయం చేసుకోవడం. ఇదీ బెంగాల్‌లో జరిగే తంతు. పార్థా చటర్జీపై వచ్చిన ఆరోపణలన్నీ రుజువైతే, బెంగాల్‌లో రాజకీయ నాయకులతో సహా ఒక కొత్త వర్గం తయారైనట్టే. అవసరార్థుల నుంచి నిర్మొహమాటంగా తమకు కావలసిన మొత్తం తీసుకునే వర్గం ఇది! మనదేశంలోని యువ ఉద్యోగార్థులను ఈవిధంగా దోపిడీచేసే వర్గాలను అడ్డుకునేందుకు నైతిక నిరోధ కత ఏమీలేదు. ఈ అవినీతి భేతాళ పంచవింశతిలో ఉద్యోగార్థుల విద్యార్హతతో పనిలేదు. అన్ని అర్హతలు కల్పించేది డబ్బు మాత్రమే! ఈ జబ్బు కేవలం పశ్చిమ బెంగాల్‌కు మాత్రమే పరిమితం కాదు. తప్పుడు ధ్రువపత్రాతో టీచర్‌, అసిస్టెంట్‌ ‌టీచర్‌ ‌పోస్టులను భర్తీచేసే స్కామ్‌ను ఈమధ్యనే ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్‌ ‌ప్రభుత్వం వెలికితీసింది. కర్ణాటకలో రూ.100 కోట్ల పోలీస్‌-‌సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ‌నియామ కాలకు సంబంధించిన స్కామ్‌ ‌మరోటి. ఏజెంట్లకు డబ్బులు చెల్లిస్తే మార్క్ ‌షీట్లల్లో మార్కులు కూడా మారిపోతాయి!

బీజేపీ వైఖరి

పాత అవినీతి వ్యవహారాలను బీజేపీ వెలికి తీసుకురాలేకపోయినా, ఇప్పుడు మాత్రం తన పట్టు బిగించింది. అందుకు తగిన వాతావరణం కూడా ఉంది. పార్థా చటర్జీతో నష్టపోయిన వారిని పార్టీలో నంబర్‌ 2 అభిషేక్‌ ‌బెనర్జీ కలుసుకుని నష్టపోకుండా చూస్తామని బతిమాలుతున్నారు. సొంత పార్టీ ఎంపీ సౌగత్‌రాయ్‌ ‌కూడా తాజా వ్యవహారం పార్టీకి తలవంపేనని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ఎన్నికలో బొప్పి కట్టి ఉన్న మమతకు పార్థా చటర్జీ పరిణామం మూలిగే నక్క మీద తాటి పడినట్టయింది. తృణమూల్‌ ‌కాంగ్రెస్‌కు చెందిన 38మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని ప్రముఖ బాలీవుడ్‌ ‌నటుడు, భాజపా నేత మిథున్‌ ‌చక్రవర్తి వ్యాఖ్యానించడం పెద్ద సంచలనం సృష్టించింది. 2021 మే నాటి అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 77 స్థానాల్లో గెలుపు సాధించినప్పటికీ ఏడు గురు తిరిగి తృణమూల్‌ ‌కాంగ్రెస్‌లో చేరిపోయారు.

సుప్రీంకోర్టు తీర్పు కీలకం

నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) ‌పరిధిలో ఆస్తుల స్వాధీనం, జప్తు, సోదాలు నిర్వహించే అధికారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ (ఈడీ)కు ఉంటుందని సుప్రీంకోర్టు జూలై 27న ఇచ్చిన తీర్పులో స్పష్టం చేయడం కూడా టీఎంసీకి అశనిపాతం వంటిదే. ఇవి సోనియా, రాహుల్‌ ‌గాంధీలను నేషనల్‌ ‌హెరాల్డ్ ‌కేసులో ఈడీ విచారణకు వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ల యినప్పటికీ, తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌మంత్రిని కూడా ఈడీ అరెస్ట్ ‌చేయడంతో దీన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లే దారులు మూసుకుపోయాయి. రాజకీయ ప్రత్యర్థులపైకి ప్రయోగిస్తూ కేంద్రం ఈడీని దుర్విని యోగపరుస్తున్నదని దేశవ్యాప్తంగా విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న వేళ తాజా పరిణామం భాజపాకు మోదం చేకూరిస్తే, కాంగ్రెస్‌ ‌సహా విపక్షాలు నిరాశకు గురికావడం సహజమే. పీఎంఎల్‌ఏలోని పలు నిబంధనల్లోని రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ కాంగ్రెస్‌కు చెందిన కార్తీ చిదంబరం మరికొన్ని సంస్థలు, వ్యక్తులు దాఖలు చేసిన దాదాపు 240 పిటిషన్లపై జస్టిస్‌ ఎం.ఎ. ‌ఖాన్‌విల్కర్‌, ‌జస్టిస్‌ ‌దినేష్‌ ‌మహేశ్వరి, జస్టిస్‌ ‌సి.టి. రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి 545 పేజీల తీర్పు చెప్పింది. ‘ఒక నేరానికి సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు కాకున్నా…సెక్షన్‌ 48(ఎ)‌లో పేర్కొన్న విధంగా అధికారులు దానిపై విచారణ జరిపి జప్తులు చేపట్టవచ్చు. ఈడీ అధికారులు పోలీసుల మాదిరి కాదు’ అని న్యాయస్థానం స్పష్టం చేసింది.

మమత వైఖరిలో మార్పు

గతంలో రవాణా, క్రీడాశాఖ మంత్రిగా పనిచేసిన మదన్‌ ‌మిత్రా అరెస్టయినప్పుడు, ఆయన ఏ విధమైన శాఖా లేకుండానే కస్టడీలో ఉన్న రెండు నెలల కాలం మంత్రిగానే కొనసాగారు. నారద టేపుల వ్యవహారంలో నిందితుడికి 2016 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి టిక్కెట్‌ ఇవ్వొద్దని ఎన్ని వత్తిళ్లు వచ్చినా మమతా బెనర్జీ ఖాతరు చేయలేదు. శారద స్కాం, నారద టేపులు, రోజ్‌వ్యాలీ స్కామ్‌లు బయట పడినప్పుడు వచ్చిన విమర్శలను మమతా బెనర్జీ పట్టించుకోలేదు సరికదా ఎదురుదాడికి దిగారు. సీబీఐ విచారణలకు పోటీగా రాష్ట్ర దర్యాప్తు బృందాలను రంగంలోకి దించిన చరిత్ర ఆమెది. కానీ పార్థాచటర్జీ విషయంలో ప్రతి విమర్శలు చేసినా, ఆయన్ను మంత్రిపదవి, పార్టీ పదవుల నుంచి తప్పించి, విచారణను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలని మాత్రం కోరారు. మొత్తం లక్ష ఉద్యోగాల్లో రెండు వందల ఫిర్యాదులు మాత్రమే వచ్చినప్పుడు అందరినీ ఇబ్బందుల్లోకి నెట్టడం ఎంతవరకు సబబంటూ మమతా బెనర్జీ వాదించినప్పటికీ గతంలో ఉన్న పటుత్వం ఇప్పుడు లేదు. ఇవన్నీ ఆమె వైఖరిలో వచ్చిన మార్పునకు విస్పష్ట నిదర్శనాలు.

రాష్ట్ర గవర్నర్‌గా జగదీప్‌ ‌ధన్‌ఖడ్‌ ‌నియమితులైన దగ్గరినుంచి ఆయనతో ఉప్పు-నిప్పు మాదిరిగా వ్యవహరించిన మమతా బెనర్జీ, ఇటీవల రాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరు ఖరారుకు ముందు డార్జిలింగ్‌లో అస్సాం ముఖ్యమంత్రి హిమంత్‌ ‌బిశ్వ శర్మ, జగదీప్‌ ‌ధన్‌ఖడ్‌లతో సమావేశమైన తర్వాత ఆమె వ్యవహార శైలిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా విపక్షాల ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్‌ ఆల్వాను ప్రకటించిన తర్వాత, మమతా బెనర్జీ తమ పార్టీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్‌లో పాల్గొనబోదని స్పష్టం చేశారు. రాష్ట్రపతి పదవికి ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టిన యశ్వంత్‌ ‌సిన్హాకు ఓటు వేయడంలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారని, ఉపరాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టే విషయంలో తమను సంప్రదించలేదన్న సాకును చూపుతూ ఆమె ఓటింగ్‌కు దూరంగా ఉండటంలో మతలబేమిటి? రాష్ట్రపతి ఎన్నికలో టీఎంసీ ఎమ్మెల్యేలు కూడా క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారన్నది కాదనలేని సత్యం. ఉపరాష్ట్రపతి ఎన్నికలో తాము ఓటింగ్‌లో పాల్గొనబోమంటూ ప్రకటించిన మమతా బెనర్జీ, జూలై 27న పార్లమెంట్‌ ‌ముందు విపక్షాలు నిర్వహించిన ధర్నాలో పాల్గొనడం గమనార్హం. ముఖ్యంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాంగ్రెస్‌ ‌తమకు ఏ విధమైన సమాచారం ఇవ్వడంలేని మమతమ్మ ఆగ్రహం వ్యక్తం చేసినా కేవలం సాకు మాత్రమే అనుకోవాల్సి వస్తోంది! ఆగస్ట్ 7‌వ తేదీన ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌ ‌సమావేశంలో ముఖ్య మంత్రి మమతా బెనర్జీ పాల్గొనే అవకాశ ముంది. నీతి ఆయోగ్‌ ‌సమావేశాల వల్ల రాష్ట్రాలకు ఒరిగేదేమీలేదంటూ గత ఏడాది జరిగిన సమావేశా నికి గైర్హాజరైన మమతా బెనర్జీ ఇప్పుడు మనసు మార్చుకోవడం గమనార్హం. ముఖ్యంగా ఆమె కేబినెట్‌ ‌సహచరుడు పార్థా చటర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ‌విచారిస్తున్న తరుణంలో ఆమె నిర్ణయానికి ప్రాధాన్యత ఏర్పడింది.

ఇప్పుడు ఈ కేసును సాధ్యమైనంత త్వరగా తేల్చేయాలని మమతా బెనర్జీ కోరుతున్నారు. ఎందు కంటే ఈ కేసును సాగదీసి.. అవసరమైనప్పుడల్లా తమ పార్టీని దెబ్బతీయడానికి బీజేపీ దీన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటుందేమోనన్న భయం ఆమెది! ఇంతకీ విద్యాశాఖను ఇంతగా కలుషితం చేయడానికి కారణాన్ని ఊహించవచ్చు. దానిని అస్మదీయులతో, అనర్హులతో నింపితే టీఎంసీ మార్కు విద్యార్థులు బయటకు వస్తారు. మమత కోరుకున్నట్టు పాతికేళ్లు పాలించవచ్చు. వ్యవస్థలను నాశనం చేస్తున్నదంటే ఇకపై బీజేపీని విమర్శించే ముందు తన వెనుక ఉన్న నలుపును మమత గమనించాలి.

స్టిస్‌ అభిజిత్‌ అలుపెరుగని పోరాటంతో…

నిజాయతీపరుడు ఇబ్బందులు పడతాడు. కానీ చివరకు గెలుస్తాడు. అవినీతిపరుడి ఆటలు సాగవచ్చు కానీ అవి తాత్కాలికమే అన్న నానుడిని ప్రస్తుత పశ్చిమబెంగాల్‌ ‌పరిణామాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో టీచర్ల నియామకాల్లో అవినీతి పురాణాన్ని వెలికితీసిన ఘనత కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అభిజిత్‌ ‌గంగోపాధ్యాయదే అనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. అయితే ఈ కేసులో బాధితుల తరఫున వాదిస్తున్నది సీపీఎం రాజ్యసభ సభ్యుడు, న్యాయవాది బికాస్‌ ‌భట్టాచార్య. ఈ కేసులో తనకు ఎంతటి ప్రతిఘటన ఎదురైనా వెనుదిరగకుండా అలుపెరుగని ఒంటరి పోరాటం చేస్తున్నది జస్టిస్‌ అభిజిత్‌ ‌మాత్రమే. పశ్చిమ బెంగాల్‌ ‌స్కూల్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌నిర్వహించిన నియామకాల్లో చోటుచేసుకున్న అవినీతిపై దర్యాప్తు చేసేందుకు గత నవంబర్‌, 2021‌లో ఆదేశాలు జారీ చేసినప్పటి నుంచి జస్టిస్‌ అభిజిత్‌ ‌గంగోపాధ్యాయ పట్ల అన్ని రకాలుగా వ్యతిరేకత వ్యక్తం కావడం మొదలైంది. ఈ కేసుకు సంబంధించి స్కూల్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ అధికారులకు జస్టిస్‌ ‌గంగోపాధ్యాయ జారీచేసిన వివిధ ఆదేశాల వల్ల రాష్ట్ర రాజకీయ నేతలు, సహచర హైకోర్టు న్యాయమూర్తులు, బార్‌ అసోసియేషన్‌ల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నారు. ఒక దశలో స్కూల్‌ ‌సర్వీస్‌ అ‌క్రమాలపై కలకత్తా డివిజన్‌ ‌బెంచ్‌ ‌వ్యవహార శైలిపై ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు కూడా. ఒక జడ్జి సహచర డివిజన్‌ ‌బెంచ్‌ ‌న్యాయమూర్తులపై ఈ విధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయడం బహుశా దేశ న్యాయచరిత్రలో ఇదే ప్రథమం కావచ్చు! చివరకు జస్టిస్‌ ‌గంగోపాధ్యాయ వద్ద కేసులు వాదించబోమని 2022, ఏప్రిల్‌ 13‌న కలకత్తా హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ ‌తీర్మానం చేసింది. అయినా ఆయన చలించలేదు. అఖిల భారత తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌లీగల్‌ ‌సెల్‌ ఏకంగా ఆయన కోర్టు రూమ్‌ ‌వెలుపల నిరసనలు చేపట్టింది. సహచర న్యాయమూర్తులు, న్యాయవాదులు, అధికార పార్టీ.. ఇంతమంది నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్నప్పటికీ ఎంతమాత్రం చలించకుండా జస్టిస్‌ ‌గంగోపాధ్యాయ, టీచర్ల నియామక కుంభ కోణం గురించి అప్పటి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పార్ధా చటర్జీని సీబీఐ విచారణకు హాజరు కావాలని మే 18న ఆదేశాలు జారీచేశారు. దీనికి సరిగ్గా ఒకరోజు ముందు అంటే మే 17న రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సహాయ మంత్రి పరేష్‌ ‌చంద్ర అధికారిని కూడా సీబీఐ ముందు విచారణకు హాజరుకావాలని జస్టిస్‌ ‌గంగోపాధ్యాయ ఆదేశించారు. ఈ మంత్రి కుమార్తె అంకిత అధికారిని అక్రమంగా టీచర్‌గా నియమించారన్నది అభియోగం. గత ఏడాది ఈ కుంభకోణం బయటకు వచ్చిన దగ్గరినుంచి ఇప్పటి వరకు హైకోర్టు 1200 మంది అక్రమంగా నియమితులైన టీచర్లను తొలగించింది. వీరిలో అంకిత అధికారి కూడా ఒకరు. ఇదే సమయంలో పరేష్‌చంద్ర అధికారిని మంత్రి పదవి నుంచి తొలగించాలని ఆయన ముఖ్యమంత్రి, గవర్నర్లకు లేఖ కూడా రాశారు.

అధర్మం ఎన్ని నాల్కలతో విజృంభించినా, ఒక్క నిజాయతీపరుడిని ఏమీ చేయలేదన్న సత్యానికి జస్టిస్‌ ‌గంగోపాధ్యాయ నిలువెత్తు సాక్ష్యం. వర్తమాన దేశ రాజకీయ చరిత్రలో ముఖ్యంగా హింసా రాజకీయా లకు నెలవైన పశ్చిమ బెంగాల్లో ఏకంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఎంతో సాహసం, తెగువ కావాలి. తాను నమ్ముకున్న నిజాయతీ ఆయనకు ఇంతటి పోరాటపటిమను ఇచ్చిందనే చెప్పాలి. ఇంతకూ ఈ గంగోపాధ్యాయ ఎవరు? ఈయన మొదట తన కెరీర్‌ను వెస్ట్ ‌బెంగాల్‌ ‌సివిల్‌ ‌సర్వీస్‌లో ప్రారంభించారు. తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేసి కలకత్తా హైకోర్టులో అడ్వకేట్‌గా ప్రాక్టీసు మొదలుపెట్టారు. 2018, మే 2న రాష్ట్ర హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులై, 2020, జూలై 30న పర్మినెంట్‌ ‌జడ్జీ అయ్యారు. దురదృష్టవశాత్తు ఈ నిజాయతీపరుడి సాహసం మన దేశ మీడియాకు పట్టడం లేదు. కేవలం పార్ధా చటర్జీ, అర్పిత చటర్జీలపై పుంఖాను పుంఖాలుగా కథనాలు రాయడానికి మాత్రమే పరి మితం కావడం దౌర్భాగ్యం కాక మరేంటి?

–  జమలాపురపు విఠల్‌రావు, సీనియర్ జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE