ఆగస్ట్ 12 ‌రాఖీ  పౌర్ణమి

‌రక్షాబంధన్‌ ‌ప్రేమ సహోదరత్వానిక ప్రతీక. సోదరసోదరీల మధ్య ఆత్మీయ భావనను పెంపొం దించడమే కాక కుటుంబ విలువలను పటిష్టపరు స్తుంది. యుద్ధాలలో విజయసిద్ధి కోసం, దుష్టశక్తులను పారదోలేందుకు ఉద్దేశించిన రక్షాబంధనం కాల క్రమంలో సోదరసోదరీ ప్రేమకు ప్రతీకగా మారింది. యుద్ధవీరులలో పట్టుదల, ఆత్మస్థయిర్యం కలిగేందుకు రక్ష కట్టేవారు. బలిచక్రవర్తి తన సర్వస్వాన్ని వామను డికి ధారపోసినప్పుడు ఆయన భార్య వింధ్యావళి, దేవదాన వుల సంగ్రామంలో పతిదేవుడి విజయాన్ని కాంక్షిస్తూ ఇంద్రాణి, తపస్సుకు వెళుతున్న ధ్రువుడికి తల్లి సునిథి, భరతుడికి శత్రుభయం ఉండకూడదని తల్లి శకుంతల, సోదరుల విజయాన్ని కాంక్షిస్తూ ధర్మరాజు రక్ష కట్టారని పురాణ గాథలు. స్వరాజ్య ఉద్యమ సమయంలో ఉద్యమకారులకు రాఖీ(లు) కట్టారు. వాటిని యుద్ధకంకణాలుగా భావించిన నాయకులు కలసి కట్టుగా ఉద్యమించారు.

భవిష్యోత్తర, విష్ణు, కూర్మ పురాణాలు రక్షాబంధన్‌ ‌గురించి చెబుతున్నాయి. విష్ణుపురాణం రాఖీ పౌర్ణ మిని ‘బలేవా’గా ప్రస్తావించింది (బలేవా అంటే బలి చక్రవర్తి బలీయమైన శక్తి). బలి తన అనన్య సామాన్య భక్తి  ప్రపత్తులతో శ్రీహరిని ప్రసన్నం చేసుకొని, తన రాజ్యానికి రక్షకుడిలా ఉండేలా వరం పొందాడు. అయితే శ్రీపతిని వైకుంఠానికి రప్పించుకోవాలనే ప్రయత్నంలో లక్ష్మీదేవి బ్రాహ్మణ స్త్రీ రూపంలో బలికి రక్ష కట్టి, తన నిజవృత్తాంతాన్ని వివరిస్తుంది. ఆమె మంచితనం, తెలివికి సంతసించిన అసురపతి వైకుంఠానికి వెళ్లవల్సిందిగా విష్ణువును వేడు కుంటాడు. బలి భక్తిభావన పరంగా ఏర్పడిన..

‘ఏన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహా బలః

తేనత్వామభి బధ్నామి రక్ష మాచలమాచల’

(రాక్షసేంద్రుడు బలి చక్రవర్తిని కట్టిపడేసిన విష్ణు శక్తితో నిన్ను బంధిస్తున్నాను. రక్షా బంధనమా చలిం చకు చలించకు) అనే శ్లోకం చెబుతూ రాఖీ కట్టాలి. సోదరీమణులతో రక్ష కట్టించుకున్న వారికి యమ కింకరుల బెడద ఉండదని యముడు తన సోదరి యమునకు చెప్పినట్లు భవిష్యోత్తర పురాణం వెల్లడిం చింది. చారిత్రక కథనాలను బట్టి.. ఔరంగజేబు తన సామంతుడైన రాజపుత్రుని వంశనాశనానికి కుట్ర పన్నగా అది తెలిసిన రాజపుత్రుని భార్య మరో సామం తుడికి ‘రక్ష’ పంపగా అతను ఔరంగజేబు యత్నాలను విఫలం చేసి సోదరి సమానురాలి మాంగల్యాన్ని కాపా డాడు. అలాగే చిత్తోర్‌గఢ్‌ ‌రాజు అకాల మరణంతో ఆయన భార్య కర్ణావతి రాజ్యభారం స్వీకరించినప్పుడు గుజరాత్‌ ‌సుల్తాన్‌ ‌బహదూర్‌షా చిత్తోర్‌గఢ్‌పై దండెత్తాడు. కర్ణావతి మొఘల్‌ ‌చక్రవర్తి హుమాయూన్‌ ‌సాయం అర్ధిస్తూ రాఖీ పంపగా, ఆమెను సోదరిగా భావించి బహదూర్‌షాను ఓడించి ఆమెకు రక్షణ కల్పించాడు హుమాయూన్‌. ‌విశ్వవిజేత కాంక్షతో మనదేశంపై దండెత్తిన అలెగ్జండర్‌పై జీలం నదీతీర ప్రాంత పాలకుడు పురుషోత్తముడు తలపడ్డాడు. ఆయన ధీరత్వాన్ని మెచ్చిన అలెగ్జండర్‌ ‌ప్రేయసి రుక్సానా ఆయనకు రాఖీ కట్టింది. అలెగ్జండర్‌తో కత్తి ఝళిపించిన పురుషోత్తముడు తన చేతికి రాఖీ కనిపిం చడంతో తన యత్నాన్ని విరమించాడు. మహావీరుడు పురుషోత్తముడు సోదరి సమానురాలి ఆనందం కోసం బందీ కావడం రక్షాబంధన్‌ ‌వెనుకగల బాధ్యత, పవిత్రత, సోదరసోదరీ బంధం విలువకు గొప్ప నిదర్శనంగా చెబుతారు.

రాకా అంటే నిండుదనం, సంపూర్ణం. రాకా చంద్రుడు అంటే పున్నమి చంద్రుడు. ఈ రోజున ధరించే రక్షను రాఖీగా వ్యవహరిస్తారు. ఈ రక్ష మొదట ఒక నూలు పోగుగా ఉండేది. కాలక్రమంలో జనం అభిరుచుల మేరకు రంగురంగులతో, నగిషీ లతో తయారవుతోంది. తాహతును బట్టి బంగారం తోనూ చేయిస్తున్నారు. రాఖీ మూలపదార్థం ఏదైనా ‘ఆత్మీయాను బంధం’ మూలం.

గాయత్రీమాతా నమస్తుభ్యం!

నూతన యజ్ఞోప•వీతధారణ / ఉపాకర్మ

శ్రావణ పూర్ణిమ నాడు ద్విజులు నూతన యజ్ఞోప వీతాన్ని ధరిస్తారు. జపహోమ ధ్యానాదుల నిమిత్తం దీక్షాసూచికగా నూతన యజ్ఞోపవీతం ధరించాలని శాస్త్రవచనం. గడచిన సంవత్సరంలో దోషాలు ఏమైనా చోటు చేసుకుంటే వాటి పరిహారార్థం కూడా నూతన యజ్ఞోపవీతధారణ చేస్తారు.

కొత్తగా ఉపనయనం అయినవారికి ఉపాకర్మను జరిపిస్తారు. ఉపనయనం వేళ యజ్ఞోపవీతంలో కట్టే ‘మౌంజి’ ఉపాకర్మ సమయంలో తొలగించి నూతన యజ్ఞోపవీతాన్ని ధరింప చేస్తారు. ఉపాకర్మ వేదాధ్యయ నానికి సంబంధించినది. దీనిని ‘ఉపాకరణం’ అని కూడా అంటారు. ‘సంస్కార పూర్వం గ్రహణం స్యా దుపాకరణం శ్రుతేః’ సంస్కారం అంటే ఉపనయం. ఆనాటి నుంచి వేదాన్ని అధ్యయనం చేయడం ఉపాకరణం. ‘ఓషధీనాం ప్రాదుర్భావే’ ఓషధులు మొలకెత్తిన తరువాత, శ్రవణ నక్షత్ర యుక్త శ్రావణ పూర్ణిమ నాడు కాని, హస్త నక్షత్రం గల రోజున కానీ వేదాధ్యయనం ఆరంభించాలని ధర్మ శాస్త్రకారులు పేర్కొ న్నారు. కొత్తగా వేదా ధ్యయనం మొదలు పెట్టడానికి, అధ్యయనం చేసిన దానిని జ్ఞాపకం ఉంచుకునేందుకు ఆవృత్తి చేయడం, వల్లె వేయడానికి కూడా ఈ రోజునే నిర్ణయించారు.

యజ్ఞోపవీత విశిష్టతను మననం చేసుకుంటే.. దానికి ఉండే మూడు పోగులు దేవపితృరుషి రుణాలకు సూచికలని, పోగులకు ఉండే మూడు ముళ్లు ఆరోగ్యం, సంపద, తేజస్సుకు సంకేతాలని చెబుతారు. శ్రౌత కర్మానుష్ఠాన, మంత్రానుష్ఠాన యోగ్యత కోసం మొదటి పోగు, గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణ కోసం రెండవది, వైదిక కర్మానుష్ఠాన యోగ్యత కోసం మూడవ పోగు ధరించాలన్నది నియమం. అయితే అత్యవసర వినియోగార్థం అయిదు పోగులు ధరించాలంటారు పెద్దలు. పాముకాటు లాంటి వాటికి అత్యవసర చికిత్సగా కట్టుకట్టేందుకు నాలుగవది, బ్రహ్మచారుల యజ్ఞోపవీతం జీర్ణమైనప్పుడు ఆపద్ధ్దర్మంగా ధరింప(దానం) చేయడానికి ఐదవ పోగు ధరించాలని అంటారు. పాల్కురికి సోమన ‘పండితారాధ్యచరిత్ర’లో జంధ్యాల పూర్ణిమను ‘నూలు’పండుగ అని అన్నాడు.

– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి,  సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE