ఆగస్ట్ 27 ‌పోలాల అమావాస్య

– ఎ.రామచంద్ర రామానుజ

జీవితం ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సుఖశాంతులతో సాగడానికి పితృదేవతల ఆశీస్సులు, వర్షాలు బాగా కురిసి పాడిపంటలు వృద్ధికి గ్రామదేవత పోలేరమ్మ అనుగ్రహం ఉండాలన్నది గ్రామీణుల విశ్వాసం. అలాగే పెళ్లయి చిరకాలమైనా సంతానం లేని వారు అమ్మవారిని పూజిస్తారు. శివుని వాహనం నంది ఒక యుద్ధ సయయంలో చూపిన తెగువకు మురిసిన శివయ్య దానిని పూజించేందుకు ఈ తిథిని నిర్దేశించాడట. అవన్నీ శ్రావణ అమావాస్యనాడే. అదే ‘పోలాల అమావాస్య’ వ్రతం.

మంగళగౌరీదేవి వ్రతం ప్రత్యేకంగా సౌభాగ్య సంపద కోసం నిర్దేశితం కాగా ‘పోలాల అమావాస్య వ్రతం’ సంతాన ప్రాప్తికి, వారి సంరక్షణకు ఉద్దేశించి నది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల పిల్లలకు అపమృత్యు భయం తొలగి ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని విశ్వాసం. వివాహమై చిరకాలమైనా సంతతికి నోచని స్త్రీలు, వ్రతఫలితంగా సంతాన వతులైన వారు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. పిల్లాపాపలు చల్లగా ఉండాలని, మంచి వర్షాలతో పైర్లు ఏపుగా పెరగాలని కోరుతూ గ్రామీణులు పోలేరమ్మ వారిని ‘పోలాంబ’ పేరుతో పూజిస్తారు. తెలుగు నేలపై, ముఖ్యంగా తెలంగాణ పల్లెల్లో ఈ పండుగను ప్రముఖంగా జరుపుకుంటారు. అమ్మవారికి చీరసారెలు, ఆమెకు ఇష్టమైన నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ వ్రతాన్ని శ్రావణ అమావాస్యనాడు చేసుకోవాలి. ఈ పండుగకు సంబంధించి అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి.

ఒక కథనం ప్రకారం… ఒక గ్రామంలో పండితునికి ఏడుగురు మగ సంతానం. అందరికి పెళ్లిళ్లయ్యాయి. చివరి కోడలు తప్ప అంతా సంతాన వతులే. ఆమెకూ సంతానం కలుగుతున్నా బతికిబట్ట గట్టడం లేదు. అలా ఆరుసార్లు జరగడంతో మిగతా కోడళ్లు ఎప్పటికప్పుడు ‘పోలాల అమావాస్య వ్రతం’ నోచుకోలేకపోతున్నారు. వారంతా శ్రావణంలో అన్ని వ్రతాలు నోచారు. ఆ మాసం చివరి రోజు ‘పోలాల అమావాస్య’ వ్రతానికి ప్రతి ఏడాది ఆటంకం కలుగుతూ వచ్చింది. అది వారి కోపకారణమైంది. సూటిపోటి మాటలతో చిన్న తోడికోడలిని బాధించే వారు. ఏడవసారి గర్భవతి అయిన ఆమెను పిలవకుండానే వ్రతం చేసుకోవాలని పెద్ద కోడళ్లు నిర్ణయించుకున్నారు. అయితే సరిగ్గా శ్రావణ అమావాస్యనాడే ఆఖరి కోడలు మృతశిశువును ప్రసవించింది. ఈ సమాచారం తోడికోడళ్లకు తెలిస్తే తనను కించపరచడమే కాక వ్రతానికి పిలవరని భావించి, మృతశిశువును వస్త్రంలో దాచి, ఎవరికీ అనుమానం రాకుండా దుస్తులతో కృత్రిమ గర్భాన్ని ఏర్పాటు చేసుకుని వారితోపాటు ‘పోలాల అమావాస్య వ్రతాన్ని’ ఆచరించింది. ఆ తర్వాత చీకటి పడి ఊరు సద్దు మణిగిన తరువాత మృతశిశువుతో శ్మశానానికి బయలుదేరి పొలిమేరలోని పోలేరమ్మ ఆలయం వద్దకు చేరి తన దురదృష్టానికి, వ్రత విషయంలో చేసిన దోషానికి విలపించ•సాగింది.

గ్రామ సంచారానికి బయలుదేరిన పోలాలమ్మ దేవి ఆమెను సమీపించి ఆమె రోదనకు కారణం అడగగా ఆమె తన దయనీయ గాథను వివ రించిందట. జాలిపడిన పోలాలమ్మ ‘బాధపడకు! నీ కుమారుల సమాధుల దగ్గరకు వెళ్లి, వారికి నువ్వు పెట్టాలనుకున్న పేర్లతో పిలువు’ అని చెప్పి మాయమై పోయిందట. ఆమె అలాగే చేయడంతో సమాధుల నుంచి పిల్లలు సజీవంగా లేచివచ్చారట. ఆశ్చర్యానందాలతో ఆమె బిడ్డలతో ఇంటికి చేరి కుటుంబ సభ్యులకు జరిగింది వివరించింది. నాటి నుంచి ఏటా శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరించ సాగారు. ఇలాంటి గాథే శివపార్వతుల పరంగా ప్రచారంలో ఉంది. బాధితురాలిని ఈ కథలో పోలాలమ్మ అనుగ్రహిస్తే, మరో కథలో ఆది దంపతులు కటాక్షించినట్లు చెబుతారు.

వ్రత విధానం

పూజచేసే చోట గోమయంతో అలికి ముగ్గువేసి, అక్కడ కందమొక్కను ఉంచాలి. పసుపుకొమ్ము కట్టిన నాలుగు తోరాలను ఉంచి, ముందుగా వినాయకుని పూజించి, ఆ తర్వాత ఆ కందమొక్కలోకి మంగళ గౌరీదేవిని గానీ, సంతాన లక్ష్మీదేవిని గానీ ఆవాహన చేసి, షోడశోపచారాలతో అర్చించాలి. తొమ్మిది పూర్ణంబూరెలు నైవేద్యంగా సమర్పించాలి. సంతాన వతి అయిన పెద్దముత్తయిదువును పూజించి, కొత్త చీర, రవికల గుడ్డతో గౌరవించి, నైవేద్యం పెట్టిన బూరెలు, ఒక తోరాన్ని, ఆమెకు వాయనంగా అందచేయాలి. ఆ తర్వాత ఒక తోరాన్ని కందమొక్కకు కట్టి, మరొకటి తను మెడలో కట్టుకుని, మిగిలిన తోరాన్ని తన ఆఖరు సంతానం మొలలో కట్టాలి. అలా చేస్తే, ఆమె సంతానం ఆయురారోగ్య, ఐశ్వర్యాలతో పది కాలాలపాటు చల్లగా ఉంటారని విశ్వాసం. ‘పూర్ణంబూరె పూర్ణగర్భానికి, అందులోని పూర్ణం గర్భస్థ శిశువుకు చిహ్నం. స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది’ కనుక పూర్ణం బూరెలు వాయనంగా ఇవ్వాలని మన పూర్వికులు నియమం చేశారు.

రైతులకూ పండుగే….

జీవనాధారంగా ఉండే పశువులను పూజించే పర్వదినంగా పోలాల అమావాస్య కనిపిస్తుంది. ఆ రోజున వ్యవసాయదారులు ఎద్దులను పూజిస్తారు. వ్యవసాయ కార్మికులుగా జీవిస్తూ సొంత వ్యవసాయం, పశుసంపద లేనివారు మట్టితో ఎద్దు బొమ్మలు తయారుచేసి పూజిస్తారు. సంక్రాంతి సందర్భంగా కనుమనాడు బసవన్నలను పూజించే తరహాలోనే ఇప్పుడు అర్చిస్తారు. దీనివల్ల సమృద్ధిగా వానలు కురిసి పంటలు బాగా పండుతాయని విశ్వాసం. గ్రామదేవత(ల)ను, పితృదేవతలను ఆరాధించడం మరో ప్రత్యేకత. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది.

అంధకాసుర సంహారం సందర్భంగా నంది ప్రదర్శించిన ప్రతాపానికి మెచ్చిన పరమేశ్వరుడు ‘పోల’ అనే బిరుదును ప్రసాదించి, శ్రావణ అమావాస్యనాడు గోవులతో కలిపి వృషభాలను పూజించాలని నిర్దేశించాడని పురాణ కథనం. దానితో దీనికి ‘పోల వ్రతం’ అని పేరు వచ్చింది. వైదిక కార్యక్రమాలలో వినియోగించే దర్భలను ఈ తిథినాడే సేకరించాలని శాస్త్ర వాక్కు. అయితే కొన్ని ప్రాంతాలలో భాద్రపద అమావాస్యనాడు కూడా వీటి సేకరణ మొదలు పెడతారు.

About Author

By editor

Twitter
YOUTUBE