జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

రాజ్‌భవన్‌లకీ, ముఖ్యమంత్రి కార్యాలయాలకీ మధ్య యుద్ధం రాను రాను అవాంఛనీయ ధోరణి వైపు సాగుతోంది. కొందరు గవర్నర్లు ప్రతిపక్షాల దృష్టిలో ప్రతినాయకులు. ఇంకొన్ని చోట్ల అధికార పార్టీలు గవర్నర్లతో ఆగర్భ శత్రుత్వం ఉన్నట్టే వ్యవహరిస్తున్నాయి. గవర్నర్‌ ‌ప్రసంగ పాఠం పత్రాలను చింపి గాల్లో కొందరు, గవర్నర్‌ ‌మీదకే కొందరు విసురుతున్నారు. కొన్ని పార్టీలు గవర్నర్‌ను అసెంబ్లీలోనే ఘెరావ్‌ ‌చేసిన ఉదంతాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌, ‌కేరళ గవర్నర్లకు జరిగిన అవమానాల చరిత్ర దారుణం. గవర్నర్లంతా సక్రమంగా ఉన్నారని బల్లగుద్ది చెప్పడమో, ముఖ్యమంత్రులంతా సచ్చీలురని ఢంకా బజాయించడమో ఇక్కడ ఉద్దేశం కాదు. రాజ్‌భవన్‌తో సమరం చేయడం వేరు. గవర్నర్‌ను అంటరాని వారిగా చూడడం వేరు. ఈ క్రమంలో చూస్తే తెలంగాణ గవర్నర్‌ ‌డాక్టర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌, ‌రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం అత్యంత వికృత రూపం దాల్చింది. ఆమెను బాడీ షేమ్‌ ‌చేసినా ప్రభుత్వ పెద్దలు ఖండించకపోవడం జుగుప్సాకరంగా ఉంది. కేరళ, పశ్చిమ బెంగాల్‌, ‌తమిళనాడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు అవమానిస్తున్నది తమ తమ గవర్నర్లను కాదు, ప్రజాస్వామ్యాన్నీ, ఫెడరల్‌ ‌వ్యవస్థనే. ఇప్పుడు వేసుకోవలసిన ప్రశ్న- ప్రస్తుత గవర్నర్‌-‌సీఎంల రగడలో గవర్నర్లు నిజంగా ప్రతినాయకులా? అర్హతలు లేని వ్యక్తిని కౌన్సిల్‌కు ఎంపిక చేయడం సరికాదన్నందుకూ, ఎన్నికల అనంతర హింసను ఆపలేరా అని ప్రశ్నించినందుకూ, మతాంతరీకరణ వివాదం ఏమిటి అని అడిగినందుకూ, కేవలం పింఛన్లు కోసం సొంత పార్టీ కార్యకర్తలతో రాజ్‌భవన్‌ను నింపడం ఏమిటిని నిలదీసినందుకూ ఆ ముఖ్యమంత్రులంతా కక్ష కట్టిన మాట నిజం కాదా?


పశ్చిమ బెంగాల్‌ ‌గవర్నర్‌ ‌జగదీప్‌ ‌ధన్‌కర్‌కు తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వానికి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోంది. ఒక దశలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్‌ ‌ధన్‌కర్‌ ‌ట్విట్టర్‌ను స్తంభింపచేసేదాకా వెళ్లింది. బీజేపీయేతర రాష్ట్రాల్లో గవర్నర్లు రాజ్యాంగాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తున్నారన్న మమత నినాదానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ‌తందానా అంటున్నారు. కేసీఆర్‌ ‌నేతృత్వంలోని తెరాస ప్రభుత్వం కూడా గవర్నర్లు కేంద్రానికి తాబేదార్లుగా వ్యవహరిస్తున్నారంటూ విరుచుకుపడుతున్నది. మహారాష్ట్ర విషయానికి వస్తే ఉద్ధవ్‌ ‌ఠాక్రే నేతృత్వం లోని మహా వికాస్‌ అఘాడి (ఎంవిఎ) ప్రభుత్వానికి గవర్నర్‌ ‌భగత్‌సింగ్‌ ‌కోష్యారికి అస్సలు పొసగడం లేదు. విపక్షనేతలు రోజువారీగా గవర్నర్‌ను కలవడం ఒక అలవాటుగా మారిందంటూ ఉద్ధవ్‌ ఆరోపిస్తు న్నారు. కొందరు గవర్నర్ల గతాన్ని బట్టి విమర్శలకు దిగుతున్నారు. ఉదాహరణకు మహారాష్ట్ర గవర్నర్‌ ‌కోష్యారి. ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నేపథ్యం ఉన్నవారని, అందుకే ప్రభుత్వంతో గొడవ పడుతున్నారని కొందరి ఆరోపణ. కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ ‌మహమ్మద్‌ ‌ఖాన్‌ ‌సీపీఎం ప్రభుత్వంతో ఎందుకు గొడవ పడుతున్నట్టు? కాస్త ఆలోచిద్దాం!

గవర్నర్‌ ‌వ్యవస్థ మీద చిరకాలంగా కొనసాగు తున్న విమర్శల సాకుగా చేసుకుని తమ అక్రమాలను రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేసినా గవర్నర్‌ ఉత్సవ విగ్రహం మాదిరిగా ఉండిపోవాలని చాలా మంది ముఖ్యమంత్రుల కోరిక.

కేరళ, బెంగాల్‌ ‌ప్రభుత్వాల అసహనం

గవర్నర్‌ ‌తన రాజ్యంగ విలువలను, ఛాన్స్‌లర్‌ ‌విధులను నిర్వర్తించడంలో విఫలమైనప్పుడు వారిని పదవినుంచి తొలగించి క్రిమినల్‌ ‌చర్యలు తీసుకునే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ‌కోరుకుంటున్నారు. ఈమేరకు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. పశ్చిమబెంగాల్‌ ‌గవర్నర్‌ ‌జగదీప్‌ ‌ధన్‌కర్‌పై తృణ మూల్‌ ‌కాంగ్రెస్‌, ‌లెఫ్ట్ ‌పార్టీలు కలిసి ధ్వజమెత్తాయి. ఇంతకూ ఆయన చేసిన నేరం… ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసాకాండపై వివరణ ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఘాటుగా లేఖ రాయడం, దాన్ని బహిరంగ పరచడం. లేఖ వివరాలను బహిరంగ పరచడం ద్వారా అటు వంటి సమాచారానికి సంబంధించిన ‘పవిత్రత’ను ధ్వంసం చేశారన్నది తృణమూల్‌, ‌లెఫ్ట్‌ల ఆరోపణ.

తెలంగాణలో విభేదాలు

తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్‌ ‌తమిళిసై సౌందర్‌రాజన్‌కు మధ్య దూరం బాగా పెరిగింది. గత ఆరు నెలల నుంచి ఇద్దరు నేతలు కలుసుకోలేదు. ఆఖరికి ప్రభుత్వ కార్యకలాపాలకు గవర్నర్‌ను సీఎం పిలవడంలేదు. గవర్నర్‌ ఆహ్వానించిన కార్యక్రమా లకు తాను వెళ్లడంలేదు. గత ఏడాది గవర్నర్‌ ‌రెండు ఫైళ్లను ప్రభుత్వానికి తిప్పి పంపడం కేసీఆర్‌ ఆ‌గ్రహానికి ప్రధాన కారణమని చెబుతున్నారు. మొదటిది గవర్నర్‌ ‌కోటాలో ఒక ఎమ్మెల్సీని ఎంపిక చేయాలి. ఇందుకోసం కాంగ్రెస్‌ ‌నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన కౌశిక్‌రెడ్డి పేరును ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ‘రాజకీయాలకు సంబంధంలేని సమాజంలో ప్రముఖ వ్యక్తి పేరును సిఫారసు చేయాలం’టూ తమిళిసై ఆ ఫైలు తిప్పిపంపారు. ఇక రెండవది శాసనమండలికి ప్రస్తుతం ప్రొటైం ఛైర్మన్‌గా ఉన్న భూపాల్‌ ‌రెడ్డిని పదవీ కాలాన్ని పొడిగించాలని కేసీఆర్‌ ‌ప్రభుత్వం చేసిన సిఫారసును కూడా తమిళసై తిరస్కరించారు. భూపాల్‌రెడ్డి పదవీకాలం జనవరి 4తో ముగిసింది. గుత్తా సుఖేందర్‌రెడ్డి మండలి ఛైర్మన్‌గా గత ఏడాది జూన్‌లో రిటైర్‌ ‌కావడంతో ఆయన స్థానంలో భూపాల్‌ ‌రెడ్డి ప్రొటైం ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ప్రొటైమ్‌ ‌ఛైర్మన్‌ ‌పదవీకాలం ఆరునెలలు. కాగా తమిళిసై నిర్ణయంతో ఎంఐఎంకు చెందిన సయ్యద్‌ అమినుల్‌ ‌హసన్‌ ‌జాఫ్రి ప్రొటైం ఛైర్మన్‌ అయ్యారు.

ప్రొటొకాల్స్‌కు తిలోదకాలు

దీంతో కేసీఆర్‌ ఆ‌గ్రహం ఆచరణలో వ్యక్తం కావడం మొదలైంది. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ‌నిర్వహించిన గణతంత్ర వేడుకలకు ముఖ్యమంత్రి సహా రాష్ట్ర మంత్రులెవరూ హాజరుకాలేదు. రాజ్‌భవన్‌లో తమిళిసై రెండు ఫిర్యాదు బాక్స్‌లను ఏర్పాటు చేశారు. ఇది గులాబీ బాస్‌కు నచ్చలేదు. మార్చి 7న తెలంగాణ బడ్జెట్‌ ‌సమావేశం గవర్నర్‌ ‌ప్రసంగం లేకుండానే జరగడం కేసీఆర్‌ ‌కోపంలో భాగమే. నిజానికి గవర్నర్‌ ‌ప్రసంగం లేకుండా బడ్జెట్‌ ‌సమావేశం జరగడం సంప్రదాయానికి విరుద్ధం. ఇవి గత శాసనసభ సమావేశాలకు కొనసాగింపు మాత్రమే నని, అందువల్ల గవర్నర్‌ ‌ప్రసంగం అవసరంలేదని ప్రభుత్వం సమర్థించుకుంది. గత సమావేశాలు వాయిదా పడలేదని గుర్తుచేసింది. అయితే కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి, సభ నిరవధికంగా వాయిదా పడనప్పుడు, తర్వాతి సమావేశంలో గవర్నర్‌ ‌ప్రసంగం ఉండకూడదని రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనలేదని, అసలు 2021, అక్టోబర్‌లో ముగిసిన శాసనసభ సమావేశాలను ఎందుకు వాయిదా వేయలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. నిజానికి ఆ సమావేశాలను వాయిదా వేయడం విధాయకం. అప్పుడు ప్రస్తుత బడ్జెట్‌ ‌సమావేశంలో గవర్నర్‌ ‌ప్రసంగానికి వీలుండేది. కానీ అది జరగలేదు. అయితే సాంకేతికంగా ప్రభుత్వం చెప్పేది నిజమైనప్పటికీ, ఇందులో రాజకీయం లేదని చెప్పడం కష్టం. దీనిపై సహజంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌స్పందిస్తూ, కావాలనే గవర్నర్‌ ‌ప్రసంగం లేకుండా చేశారని విమర్శించారు.

మార్చి 29 గవర్నర్‌ ‌తమిళిసై హన్మకొండ పర్యటనకు వచ్చినప్పుడు ఆమెకు స్వాగతం చెప్పడానికి మంత్రులెవ్వరూ రాలేదు. దీంతో ఆమెకు అధికారులే స్వాగతం పలికారు. ప్రొటొకాల్‌ ‌ప్రకారం వరంగల్‌ ‌మేయర్‌ ‌స్వాగతం పలకడానికి రావాలి. కానీ రాలేదు. జాతీయ సాంస్కృతిక మహోత్సవం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆమె వచ్చారు. జిల్లా కలెక్టర్‌, ‌సి.పి.లు ఆమెకు స్వాగతం పలికారు. అంతకు ముందు మేడారం జాతరలో పాల్గొనడానికి వచ్చినప్పుడు కూడా ఆమె వచ్చేసరికి మంత్రులంతా అక్కడినుంచి వెళ్లిపోయారు. ఎవరూ లేకుండానే ఆమె సమ్మక్క-సారమ్మలను దర్శించుకున్నారు. ఏప్రిల్‌ 7‌న తమిళిసై ఢిల్లీలో హోమంత్రి అమిత్‌ ‌షాను కలిశారు. తెలంగాణలో నెలకొన్న ప్రొటొకాల్‌ ‌వివాదాలను ఆయనకు వివరించినట్టు ఆమె అప్పట్లో విలేకర్లకు చెప్పారు. యాదాద్రి ఆలయానికి వెళ్లినప్పుడు కూడా తనను ఈవో సహా, అధికారులెవరూ కలవలేదని గుర్తుచేశారు.

ఈ రగడ కొనసాగుతుడంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి ఏప్రిల్‌ 9‌న పునర్విభజన చట్టంలోని సెక్షన్‌-8 ‌కింద ఏ అంశంపైన అయినా గవర్నర్‌ ‌తుదినిర్ణయం తీసుకోవచ్చని పేర్కొనడం అగ్గికి ఆజ్యం పోసినట్లయింది. గ్రేటర్‌ ‌పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం చేయని పనులు గవర్నర్‌ ‌చేయవచ్చునని పేర్కొనడం, విద్య, వైద్యం, డ్రగ్స్‌పై ఆమె సమీక్షించవచ్చునంటూ గవర్నర్‌ ‌తనకు దఖలుపడిన అధికారాలతో అన్నింటినీ సరిచేయాలని కోరారు. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 8(2) ‌ప్రకారం ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో శాంతిభద్రతలు, అంతర్గత భద్రత, కీలక సంస్థల రక్షణ, ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ, కేటాయింపుపై గవర్నర్‌కు అధికారాలు కట్ట బెట్టారు. అయితే గతంలో సెక్షన్‌-8 అమలు విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించడంతో, కేంద్రం అటువంటిదేమీ లేదని స్పష్టం చేయడంతో ఇది సమసిపోయింది. ఇక ఏప్రిల్‌ 12‌న తెలంగాణ గవర్నర్‌ ‌భదాద్రి పర్యటనకు వెళ్లినప్పుడు కలెక్టర్‌, ఎస్పీ గైర్హాజరవడం మరో ప్రొటొకాల్‌ ‌వివాదానికి దారితీసింది. ఈ సందర్భంగా ఆమె భదాద్రి సీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు.

తమిళనాడులో ఇదే తంతు

తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. ‌రవి, డీఎంకే ప్రభుత్వం మధ్య సయోధ్య లేదు. ముఖ్యంగా ‘నీట్‌’ ‌పరీక్షనుంచి తమ రాష్ట్రాన్ని మినహాయించాలని కోరుతూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపాలని ప్రభుత్వం కోరుతూ వస్తోంది. కానీ అది రవి తన వద్దనే ఉంచుకున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో యూనివర్సిటీలకు వైస్‌ ‌ఛాన్స్‌లర్ల నియామకాలను గవర్నర్‌ ‌నుంచి తొలగించాలన్నది డీఎంకే డిమాండ్‌. ‌నరేంద్రమోదీ గుజరాత్‌ ‌ముఖ్యమంత్రిగా ఉండగా యూనివర్సిటీ వైస్‌ ‌ఛాన్స్‌లర్లను నియమించే అధికారం తన చేతుల్లోనే ఉంచుకున్నారని తమిళనాడు విద్యామంత్రి కె. పొన్ముడి గుర్తుచేస్తున్నారు. గతంలో ఎన్‌డీఏ కూటమి భాగస్వామి ఏఐడిఎంకే అధికారంలో ఉండగా, తమిళనాడులోని ఐదు రాష్ట్ర యూనివర్సిటీల్లో వైస్‌ ‌ఛాన్స్‌లర్ల నియామకాలను గవర్నర్‌ ‌ద్వారా బీజేపీ చేయించిందని డీఎంకే నేతల వాదన. అయితే ఏఐడిఎంకె హయాంలో అన్నా యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌గా నియమితులైన సూరప్పపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. వీటిపై అప్పటి ఏఐడిఎంకే ప్రభుత్వం విచారణ జరిపింది కూడా. కేవలం ఈ ఒక్క విషయంలో మాత్రమే ఏఐడీఎంకే భాజపాను వ్యతిరేకించింది. ప్రస్తుతం మాజీ వైస్‌ ‌ఛాన్స్‌లర్‌ ‌సూరప్ప అవినీతి ఆరోపణల కేసు మద్రాస్‌ ‌హైకోర్టులో విచారణలో ఉంది. సూరప్పను ప్రశ్నించేందుకు అప్పట్లో రాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన భన్వారీలాల్‌ ‌పురోహిత్‌ ‌తీవ్రంగా వ్యతిరేకించారని కూడా ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయితే ప్రభుత్వ వాదనను తిరస్కరించిన కోర్టు, విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే విచక్షణాధికారం గవర్నర్‌కే ఉంటుందని స్పష్టం చేసింది. తర్వాత పురోహిత పంజాబ్‌కు బదిలీ కాగా, గతంలో నాగాలాండ్‌లో సమర్థవంతంగా చర్చలు జరిపిన ఆర్‌.ఎన్‌.‌రవిని తమిళనాడు గవర్నర్‌గా కేంద్రం నియమించింది. మాజీ సివిల్‌ ‌సర్వెంట్‌ ‌కావడం వల్ల గత గవర్నర్లతో పోలిస్తే రవి వ్యవహార శైలి పూర్తి భిన్నం. ఇది డీఎంకేకు కొరుకుడు పడటం లేదు. వీరిమధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకొని, చివరకు గవర్నర్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ప్రభుత్వం హాజరు కావడంలేదు. కేబినెట్‌ ఆమోదించిన అనేక బిల్లులు గవర్నర్‌ ‌వద్ద పెండింగ్‌లో ఉన్నాయనేది ప్రభుత్వ ఆరోపణ. నీట్‌ ‌బిల్లును తిప్పి పంపాలని గవర్నర్‌ ‌నిర్ణయించినందుకు నిరసనగా లోక్‌సభలో డీఎంకే ఎంపీలు ఫిబ్రవరి 4న గలభా సృష్టించారు. గవర్నర్‌ను వెనక్కి పిలవాలని డిమాండ్‌ ‌చేశారు. అయితే ఈ బిల్లుపై మరోసారి అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ‌ఫిబ్రవరి 5న ప్రకటించారు. ఈ సమస్య రావణకాష్టంలా కాలుతూ చివరకు ఏప్రిల్‌ 19‌న గవర్నర్‌ ‌రవి ‘ధర్మపురం ఆధీనం మఠానికి’ వెళుతున్న సందర్భంగా నిరసనకారులు పెద్ద ఎత్తున నల్ల జెండాలతో నిరసన తెలిపేవరకు వెళ్లింది. మమతా బెనర్జీ గత ఫిబ్రవరిలో స్టాలిన్‌కు ఫోన్‌ ‌చేసి, బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో గవర్నర్ల అధికార దుర్వినియోగంపై చర్చించేందుకు విపక్ష ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేయాలన్న అభిప్రాయం వ్యక్తం చేయడం అందుకు తమిళనాడు ముఖ్యమంత్రి సానుకూలత వ్యక్తం చేయడం వెంట వెంటనే జరిగిపోయాయి. గవర్నర్‌కు నల్లజెండాలు చూపడం, కాన్వాయ్‌ని అడ్డగించడం ఆ మధ్య బెంగాల్‌లో రెండుమూడు సార్లు జరిగింది.

ఈ వివాదాలు ఈనాటివి కావు

నిజానికి గవర్నర్లను రాజకీయ ఉపకరణంగా వాడుకుంటున్నారన్న ఆరోపణ ఇప్పటిది కాదు. నెహ్రూనుంచే ప్రారంభమైంది. ఇక ఇందిరాగాంధీ హయాంలో రాజ్యాంగంలోని 356వ అధికరణాన్ని ఒక అస్త్రంగా ఉపయోగించడం పరాకాష్టకు చేరింది. నంబూద్రి, ఎన్టీఆర్‌ ‌వంటివారి కేసులలో గవర్నర్‌ ‌పాత్ర కంటే, కేంద్రం పాత్ర ఎక్కువన్నది నిజం. ఈ అధికరణాన్ని ఉపయోగించే 1980లో పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్‌ ‌నేత ప్రకాశ్‌ ‌సింగ్‌ ‌బాదల్‌ ‌నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే డిస్మిస్‌ ‌చేసింది. జనతాపార్టీ, సీపీఐలు ఇందులో భాగస్వాములుగా ఉండేవి. వీటికి అసెంబ్లీలో గొప్ప మెజారిటీ ఉండటం విశేషం. అప్పటి గవర్నర్‌ ‌మహేంద్ర మోహన్‌ ‌చౌదరి, నాటి ప్రధాని ఇందిరాగాంధీ సూచన మేరకు 356వ అధికరణం కింద ప్రభుత్వాన్ని డిస్మిస్‌ ‌చేశారు. ఇటువంటి సంఘటనలు అనేకం. ఈ వివాదాలు, సంఘర్షణల నేపథ్యంలోనే కోర్టులు తప్పనిసరి పరిస్థితుల్లో కలుగజేసుకోవాల్సి వస్తోంది.

గవర్నర్‌ ‌వ్యవస్థ వల్ల ప్రయోజనం లేదా?

ఇన్ని వివాదాలూ, పరిణామాల నేపథ్యంలో గవర్నర్‌ ‌వ్యవస్థ ఉండాలా లేదా అన్న చర్చ చిరకాలంగా కొన్నసాగుతున్నది. ఎప్పటినుంచో కొనసాగుతోంది. గవర్నర్‌ ‌వ్యవస్థ వల్ల నష్టాలు, లాభాలూ రెండు ఉన్నాయి. కానీ గవర్నర్‌ ‌వ్యవస్థను అత్యధికంగా దుర్వినియోగం చేసిన ఘనత కాంగ్రెస్‌ ‌పార్టీదే. అలా అని కాంగ్రెస్‌ ఏకఛత్రాధిపత్యంగా భారత్‌ను ఏలిన రోజులకీ, ఇవాళ్టికీ ఎంతో తేడా ఉంది. ఫెడరల్‌ ‌వ్యవస్థను ధ్వంసం చేయడానికీ, దేశాన్ని అల్లకల్లోలం చేయడానికీ దేశంలోను, బయటా కూడా కుట్రలు సాగుతున్నాయి. ఇస్లామిక్‌ ‌తీవ్రవాదం, చాపకింద నీరులా క్రైస్తవ వేర్పాటువాదం రెచ్చిపోతున్నాయి. బెంగాల్‌లో జరిగిన ఎన్నికల అనంతర హింస గురించి గవర్నర్‌ ‌బయటకు చెప్పాక, కోర్టులు మండిపడినాక మాత్రమే వెల్లడైంది. గవర్నర్‌ ‌వ్యవస్థ లేని ఈశాన్య రాష్ట్రాలను ఊహించడం కష్టం. ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ బీజేపీ వ్యతిరేకతతో, హిందూ వ్యతిరేకతతో మనుగడ సాధించాలని అనుకుంటున్నది. హిందువుల మీద వివక్ష దాని నైజం. పంజాబ్‌ ‌సంగతి వేరే చెప్పక్కర లేదు. పాక్‌తో అంటకాగాలనుకుంటున్న శక్తులకు అక్కడ ఇప్పటికీ కొదవలేదు. అధికారంలోకి వచ్చి కొద్దివారాలు కూడా కాకుండానే ముఖ్యమంత్రి మాన్‌ ‌మీద దేశ వ్యతిరేక చర్యల ఆరోపణలు వచ్చాయి. అలాగే కశ్మీర్‌. ‌కశ్మీర్‌ ‌మీద భారత్‌ ‌పట్టు కొనసాగేటట్టు చేస్తున్నది, గతంలో చేసినది గవర్నర్లే. అంతా గోప్యంగా సాగిపోయే కశ్మీర్‌లో హిందువుల గోడు బయటకు వినిపించినది కూడా గవర్నర్‌ ‌చర్యల వల్లనే. పోలీసులు, పత్రికలు, రాజకీయ పక్షాలు అన్నీ ‘భారత్‌’ ‌వ్యతిరేక వైఖరితోనే ఉన్న రాష్ట్రంలో గవర్నర్‌ ‌పాత్ర ఎంతటిదో అంచనా వేయడం కష్టం. ముస్లిం ఉగ్రవాదుల తరఫున, వామపక్ష తీవ్రవాదుల పక్షాన మాట్లాడేవాళ్లు గవర్నర్‌ ‌వ్యవస్థకు వ్యతిరేకంగానే మాట్లాడతారు. అయినా గవర్నర్‌ ‌వ్యవస్థను నాశనం చేయాలన్న గట్టి ఉద్యమం ఏదీ సాగకపోవడానికి వెనుక ఉన్న నేపథ్యం ఇదే. కొందరు ముఖ్య మంత్రులు, ముఖ్యంగా ఎన్‌టీఆర్‌ ‌వంటివారు గవర్నర్‌ ‌వ్యవస్థ గురించి అవాంఛనీయ వ్యాఖ్యలు చేయడం కూడా నష్టం కలిగించింది. ఇప్పుడు బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఇదే ధోరణిలో ఉన్నాయి.

విపక్ష ప్రభుత్వాలను ఇబ్బందులు పెట్టడానికి వీరిని కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటున్నదన్న ఆరోపణలున్నప్పటికీ, నేటి సమాఖ్య వ్యవస్థలో గవర్నర్లు కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య ఒక వారథి అన్న సత్యం మరువలేం. నిజంగా కేరళ ప్రభుత్వం కోరుతున్నట్టు గవర్నర్లను నియమించే అధికారం, వారిపై క్రిమినల్‌ ‌చర్యలు తీసుకునే అధికారాన్ని రాష్ట్రాలకు దఖలు పరిస్తే దేశంలో అరాచకం పరాకాష్టకు చేరడం ఖాయం. కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం కేవలం కొన్ని వర్గాలకే కొమ్ముకాస్తూ చేస్తున్న పాలన మిగిలిన వర్గాలకు ఇబ్బందికరంగా మారింది. గవర్నర్‌ను బీజేపీ ప్రతినిధిగా చిత్రిస్తూ, ఆయనను అవమానిస్తే ముస్లిం ఓట్లు పడతాయన్న వక్రదృష్టి కూడా ఇటీవల పెరిగింది.

జాతీయ భావన లేకుండా కేవలం రాష్ట్ర ప్రయోజనాలు, వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలతో అధికారంలోకి వచ్చే ప్రాంతీయ పార్టీలకు ముకుతాడు వేయకపోతే దేశం ఐక్యంగా ఉండటం కష్టం. కేంద్రం బలహీనపడినప్పుడు రాజ్యం విచ్ఛిన్నం కావడం, మనం ప్రాచీన యుగం నుంచి ఆధునిక యుగం వరకు చరిత్ర పాఠాల్లో చదువుకున్నదే. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నదనేది ప్రధానం కాదు, కేంద్రం దృఢంగా ఉన్నదా లేదా అన్నది ముఖ్యం. కేంద్రంలో, రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీలున్నప్పుడే సమస్యలు ఉత్పన్నమవుతాయి. పశ్చిమ బెంగాల్‌ ‌గవర్నర్‌ ‌ధన్‌కర్‌ ‌లేకపోతే అక్కడి అరాచకాలు బయటకు తెలిసేవా? తమిళనాడులో మొదట్నుచీ ఏ ప్రభుత్వం గవర్నర్‌తో సజావుగా వ్యవహరించిన దాఖలా లేదు. ఎప్పటికీ తమది ప్రత్యేకం అనుకునే రాష్ట్ర వ్యవహార శైలిని నియంత్రించాలంటే కేంద్రానికి గవర్నర్‌ ‌తప్పదు. తెలంగాణ ముఖ్యమంత్రి •కేసీఆర్‌ది ప్రత్యేక శైలి. ఆయనకు నచ్చితే దేవుడినైనా ఆకాశానికెత్తేస్తారు. లేదంటే ఆ దేవుడికే ఆయన అపాయింట్‌మెంట్‌ ‌దొరకదు. ‘ప్రతి చర్యకు సమాన ప్రతిచర్య’ తప్పక ఉండితీరుతుంది. ఇది ప్రతి రాజకీయవేత్త గుర్తించాల్సిన అంశం. తాను చెప్పిందే నడవాలన్న ఉద్దేశం ప్రతి రాజకీయ నాయకుడిలో ఉండటం సహజమే అయినా, ప్రత్యర్థి నుంచి కూడా అందుకు సమాన ప్రతిస్పందన ఉంటుందన్న సత్యం గుర్తుంచుకుంటే రాజకీయ పార్టీల మధ్య సయోధ్య కొంతవరకైనా సాధ్యమవుతుంది. పార్టీలకు అతీతంగా గవర్నర్‌ ‌వ్యవస్థను గౌరవించే సంస్కారం వస్తుంది. అలాంటి గవర్నర్లు కూడా వస్తారు. విభేదాలు వేరు, విద్వేషం వేరు. దీనిని రాజకీయ పార్టీలు గుర్తించాలి.

———————-

గవర్నర్ల విచక్షణాధికారాలు

–     ఒక బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపే అధికారం.

–      రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని సిఫారసు చేయడం.

–    పక్కనే ఉన్న కేంద్రపాలిత ప్రాంతానికి పాలకుడిగా అదనపు బాధ్యతలు స్వీకరించడం.

–    అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం ప్రభుత్వాలు గిరిజన జిల్లాల స్వయం ప్రతిపత్తి మండలికి, ఖనిజాన్వేషణకు లైసెన్స్‌ల జారీలో వచ్చిన ఆదాయంలో ఎంతమేర రాయల్టీగా చెల్లించాలో నిర్ణయించడం.

–      ఒక రాష్ట్రపాలన, శాసన వ్యవహారాలపై ముఖ్య మంత్రి నుంచి వివరాలు తెలుసుకోవడం.

–    ఎన్నికల్లో ఏపార్టీకి స్పష్టమైన మెజారిటీ రానప్పుడు, ప్రభుత్వ ఏర్పాటుకు ముఖ్య మంత్రిని నియమించడం లేదా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నేత మరణించినప్పుడు తర్వాతి ముఖ్యమంత్రిని నియమించడం.

–     శాసనసభలో మెజారిటీ నిరూపించుకోలేన ప్పుడు మంత్రిమండలిని రద్దు చేయడం.

–     మంత్రివర్గం మెజారిటీ కోల్పోయినప్పుడు ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ ‌చేయడం.

——————

గవర్నర్ల అధికార దుర్వినియోగానికి ఉదాహరణలు

–     1989లో కర్ణాటకలో ఎస్‌ఆర్‌ ‌బొమ్మై నేతృత్వంలోని జనతాదళ్‌ ‌ప్రభుత్వాన్ని డిస్మిస్‌ ‌చేయడం. బొమ్మై తన మెజారిటీని నిరూపించుకోవడానికి గవర్నర్‌ అవకాశం ఇవ్వలేదు.

–     ఆంధప్రదేశ్‌, ‌గోవా గవర్నర్లు, ఎన్టీఆర్‌, ‌విల్‌‌ఫ్రెడ్‌ ‌డిసౌజా ప్రభుత్వాలను ఏకపక్షంగా డిస్మిస్‌ ‌చేయడం.

–     ఉత్తరప్రదేశ్‌ ‌గవర్నర్‌ ‌రమేష్‌ ‌భండారి ఏకపక్ష వైఖరి కారణంగా సుప్రీంకోర్టు కలుగజేసు కోవాల్సి రావడం.

–     2018లో కర్ణాటక గవర్నర్‌ ‌సాధారణ మెజారిటీ సాధించని పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం. ఎన్నికల తర్వాత రెండు పార్టీలు కలిసి అలయన్స్‌గా ఏర్పాటైన ప్పటికీ వాటిని విస్మరించడం. తర్వాత ఈ సమస్య కోర్టు కలుగజేసుకోవడంతో పరిష్కారమైంది.

About Author

By editor

Twitter
Instagram