– ఎం.వి.ఆర్‌. ‌శాస్త్రి

నేతాజీ మిస్టరీ మీద గడచిన ముప్పావు శతాబ్దంలో దర్యాప్తులు, న్యాయ విచారణలు ఎన్నో జరిగాయి. ఎందరో ఎడతెగని అపరాధ పరిశోధనలు చేశారు. ఆర్కైవులు తవ్విపోశారు. లెక్కలేనన్ని పుస్తకాలు రాశారు. తర్జన భర్జనలు, పండిత చర్చలు అదేపనిగా చేస్తూనే ఉన్నారు. అయినా ఇంతవరకు నికరంగా ఏదీ తేల్చలేకపోయారు. 1945 ఆగస్టు 18న తైపేలో మరణించటం అబద్ధమైతే నిజం ఏమిటి? నేతాజీ ఏమయ్యాడు? ఎక్కడున్నాడు? ఎప్పుడు ఎలా మరణించాడు? ఈ ప్రశ్నలకు ఒక్కరు కూడా నమ్మదగిన, తిరుగులేని సమాధానం చెప్పలేకపోయారు.

రష్యా వెళ్ళాడు; స్టాలిన్‌ ‌చెరలో ఉన్నాడు; ఎలాగో ఎప్పుడో సైబీరియా నుంచి బయటపడ్డాడు; గుమ్నామీ బాబా అయ్యాడు – అంటూ కాశీమజిలీ కథలకు కొదవ లేదు. నెహ్రూ కాలగర్భంలో కలిసి, కాంగ్రెస్‌ ‌పాలనకు కాలం చెల్లి, రష్యాకు కమ్యూనిస్టు ఇనుప తెర తొలగి తరాలు గడిచాయి. సోషల్‌ ‌మీడియా విస్ఫోటం దరిమిలా సమాచారం ఎక్కువైన అజీర్తితో ప్రపంచం సతమతమవుతున్న ఈ సమాచార యుగంలో ఇప్పటివరకూ ఖాయంగా ఏమీ దొరకలేదు.

ప్రభుత్వాలు నియమించిన కమిటీలు, కమిషన్ల మీద మనకు నమ్మకం ఎలాగూ లేదు. కాని ప్రభుత్వాలతో ప్రమేయం లేకుండా జపాన్‌లో అత్యధిక సర్క్యులేషన్‌ ‌కలిగిన Yomiuri Shimbun దినపత్రిక 1966లో జరిపించిన సమగ్ర, స్వతంత్ర దర్యాప్తులో కూడా విమాన ప్రమాదం, బోస్‌ ‌మరణం నూటికి నూరు పాళ్ళు యథార్థమని ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాల, డాక్యుమెంటరీ సాక్ష్యాల ద్వారా రుజువయిన సంగతి ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం. 1946 ఆగస్టు- సెప్టెంబరులో ‘ఫ్రీ ప్రెస్‌ ‌జర్నల్‌’ ‌జర్నలిస్టు హరీన్‌ ‌షా వేరే ఎసైన్మెంటు మీద తైహోకు వెళ్లి ఉత్సాహం కొద్దీ చేసిన స్వతంత్ర పరిశోధనలోనూ సరిగ్గా అదే తేలింది.

ఇవి కూడా నమ్మబుద్ధికాకపోతే వీటికి మించిన రుజువు ఇంకొకటి ఉంది. బర్మా మాజీ ప్రధాని బా మా టోక్యో వెళుతూ 1945 ఆగస్టు 22న తైహోకులో ఆగాడు. నాలుగు రోజులకింద అక్కడే విమాన ప్రమాదంలో సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌మరణించిన సంగతి జపనీస్‌ ఆఫీసరు తనకు ఎయిర్‌ ‌పోర్టులో చెప్పినట్టు ‘‘Breakthrough in Burma’’ గ్రంథంలో ఆయన గుర్తుచేసుకున్నాడు. బోస్‌కు ఏమైందో విన్న తరవాత కూడా ప్రమాదభరితమైన ప్రయాణం చేస్తానంటారా – అని విమానం పైలట్‌ ‌బా మా ను అడిగాడట కూడా. బోస్‌ ‌విమాన ప్రమాదం కట్టుకథ కాదని దీన్ని బట్టే అర్థమవుతుంది.

ఏ ఘటన గురించి అయినా విచారణ చేసే టప్పుడు అప్పటి పరిస్థితులను, లభించిన సాక్ష్యాలను మొత్తంగా పరిశీలించి స్థూలంగా ఒక నిర్ణయానికి రావాలి. ఒక్కో సాక్షి చెప్పిన దానిని, సాక్షులు చెప్పిన వాటిలో తేడాలను, వైరుధ్యాలను శల్య పరీక్ష చేస్తే న్యాయ పరీక్షలో ఒక్క కేసూ నిలబడదు. బోస్‌ ‌మరణానికి సంబంధించి టైము, చికిత్స విధానం, మందుల వివరాలు, డెత్‌ ‌సర్టిఫికేట్‌ ‌నమోదు వగైరాలను ఘటన జరిగిన చాలా ఏళ్లకు గుర్తు చేసుకుని చెప్పటంలో సాక్షుల కథనాల్లో తేడాలు, తడబాట్లు సహజం. ప్రతిదీ భూతద్దంలో చూసి తప్పులు ఎన్నుతూ పోతే ఏ దర్యాప్తూ ఎప్పటికీ తెమలదు.

షెర్లాక్‌ ‌హోమ్స్‌ను మించిన పరిశోధక ప్రజ్ఞ చూపించి ఇప్పటికి ఎందరో మేధావులు విమాన ప్రమాదంలో బోస్‌ ‌మరణం ముమ్మాటికీ అబద్ధమని బల్లగుద్ది వాదించారు. దాదాపుగా వారందరూ చేసిన తప్పు అప్పటి పరిస్థితులను, పూర్వాపరాలను సరిగా అర్థం చేసుకోకపోవటం. బోస్‌ ‌రష్యా వెళ్ళాలని, ఎలాగైనా సోవియట్‌ ‌యూనియన్‌ ఆ‌శ్రయం పొంది అక్కడి నుంచి పోరాటం కొనసాగించాలనే అనుకున్నాడు. జపాన్‌ అధికారులూ అందుకు పూర్తిగా సహకరించారు. విమాన ప్రమాదం జరగ కుండా ఉంటే నేతాజీ రష్యాకే వెళ్ళేవాడు. ఈ వాస్తవం గమనించకుండా-రష్యా వెళ్ళాలనుకున్నాడు కాబట్టి బోస్‌ ‌నిజంగా రష్యాకే చేరాడు. లోకాన్ని మభ్య పెట్టటం కోసం విమాన ప్రమాదం నాటకం ఆడాడు అని ఊహించి, అదే నిజమని వాదించటం మన నాటు పత్తేదారుల పైత్యం. నేతాజీని కనపడితే కాల్చేద్దామని శత్రువులు కాచుకు కూచున్న సమయం కాబట్టి ఆసుపత్రి రికార్డుల్లో ఎక్కడా బోస్‌ ‌పేరు నమోదు కాకుండా జపాన్‌ అధికారులు జాగ్రత్త పడ్డారు. బోస్‌ ‌మరణాన్ని టోక్యోకు తెలియపరచి ఆదేశాలు పొందే అవకాశం లేకపోవటంతో, స్థానిక జపనీస్‌ అధికారులు ఎందుకైనా మంచిదని ఇచిరో ఒకురా అనే మారు పేరుతో డెత్‌ ‌సర్టిఫికెటు తీసుకుని అదే పేరు మీద అంత్యక్రియలు జరిపించారు. ‘మారుపేరుతో అంత్యక్రియ’’ అధ్యాయంలో వివరించిన ఘటనాక్రమాన్ని పరిశీలిస్తే అది నేతాజీ మరణానికి సంబంధించని బనాయింపు వ్యవహార మన్న అనుమానానికి ఆస్కారం కనిపించదు.

జపాన్‌ ‌చరిత్రలో ఎన్నడూ కనీ వినీ ఎరుగని ఘోర పరాభవ సమయమది. శత్రువుకు సరెండర్‌ ‌కావటం జరిగింది. అమెరికన్లు ఎప్పుడు వచ్చి జపాన్‌ను స్వాధీనపరచుకుంటారో, ఆ తరవాత ఎవరిని ఏమి చేస్తారో ఎవరికీ తెలియదు. ఆ సంధి కాలంలో టోక్యోలో ప్రభుత్వమనేది స్తంభించింది. ఏ నిర్ణయాన్ని తీసుకోవటానికి ఎవరూ సిద్ధంగా లేరు. ప్రతి అధికారీ, ప్రతి ప్రభుత్వ ప్రముఖుడూ తన ముందు గతిని తలచుకుని బెంబేలు పడుతున్నాడు. మంత్రులు, మిలిటరీ జనరల్స్, ‌రాజవంశీకులు సహా వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న చేటు కాలమది. జపాన్‌ ‌యావత్తూ చేష్టలుడిగి పెద్ద షాక్‌లో ఉన్నది. విమానాలు కదలటం లేదు. కమ్యూనికేషన్లు ఎక్కడికక్కడ తెగిపోయాయి. విమానంలో తనకు కాక ఇంకొక సీటు సంపాదించటానికే నేతాజీకి తల ప్రాణం తోకకొచ్చింది. అలాంటి సంక్షుబిత కాలంలో నేతాజీ విమాన ప్రమాదంలో మరణించినట్టు నాటకం ఆడించి, రహస్యంగా రష్యాకు చేర వేసేందుకు మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌వేసే తీరిక, స్థిమితం జపాన్లో ఏ సైన్యాధికారికీ లేదు. నేతాజీ అస్తులను టోక్యో తీసుకువెళ్లేందుకు వారాల తరబడి వెయిట్‌ ‌చేస్తే గానీ విమానం దొరకని కాలంలో నేతాజీ మరణాన్ని హబిబుర్‌ ‌రహమాన్‌ ‌వెంటనే తన పైవాళ్లకు ఎందుకు రిపోర్టు చేయ లేదు అని ముఖర్జీ కమిషన్‌ ‌లా పాయింట్లు తీయటం హాస్యాస్పదం.

అసలు ప్రమాదమే జరగలేదు పొమ్మని కొట్టి పారేయటానికి సమర గుహ, అనుజ్‌ ‌ధర్‌ ‌వంటి అమాం బాపతు పరిశోధకులు, అడపా దడపా మెయిన్‌ ‌స్ట్రీమ్‌, ‌సోషల్‌ ‌మీడియాలలో డిటెక్టివ్‌ అవతారాలెత్తే అతితెలివి మేధావులు చిలకల్లా పలికే కారణాలు ముఖ్యంగా ఏమిటంటే –

  1. 1945 ఆగస్టు 18న గాని దానికి ముందు రోజుగాని, ఆ మాట కొస్తే ఆ నెల మొత్తంలో గాని తైపే లేక తైహోకు వద్ద విమాన ప్రమాదం జరిగినట్టు విమానాశ్రయంలో గాని, స్థానిక ప్రభుత్వం వద్ద గాని ఎక్కడా పిసరంత రికార్డు లేదు.
  2. విమాన ప్రమాదంలో నేతాజీ దుర్మరణం ఊసే మరునాడు, లేక ఆ తరువాత రోజు స్థానిక పత్రికలలో ఎక్కడా రిపోర్టు కాలేదు.
  3. ప్రమాదానికి సంబంధించినవిగా జపాన్‌ ‌ప్రభుత్వం వెలువరించిన ఫోటోలలో కనిపించే దృశ్యానికీ, భౌతికంగా అక్కడికి వెళ్ళి పరిసరాలను పరిశీలిస్తే కాన వచ్చేదానికి పొంతన లేదు. అవి వేరేదో ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు.
  4. ఒక ప్రభుత్వాధినేత, సుప్రీమ్‌ ‌కమాండర్‌ అయిన సుభాస్‌ ‌బోస్‌ ‌మరణిస్తే పక్కనే ఉన్న హబిబుర్‌ ‌రహమాన్‌ ‌గాని, జపనీస్‌ ‌సైన్యాధికారులు గాని తమ పైవాళ్లకు వెంటనే రిపోర్ట్ ‌చెయ్యలేదు.
  5. ఆసుపత్రి రికార్డుల్లో, డెత్‌ ‌సర్టిఫికెట్లో, మరణాల మునిసిపల్‌ ‌రికార్డులలో, దహనవాటిక రికార్డులలో సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌పేరు లేనే లేదు.
  6. శవదహనం అయింది 20వ తేదీన అని ఒకసారి, 22న అని ఇంకో సారి హబిబుర్‌ ‌రహమాన్‌ ‌పేర్కొన్నాడు.
  7. చికిత్స చేసింది ఎవరు, మరణం ఎన్నింటికి, మరణ సమయంలో దగ్గర ఎవరున్నారు, డెత్‌ ‌సర్టిఫికేట్‌ ఏ ‌పేరుతో ఎవరిచ్చారు అన్న విషయాలలో ప్రత్యక్ష సాక్షులు చెప్పినదానిలో పొంతన లేదు.
  8. టోక్యోలో అంత్యక్రియలు అయ్యాయని మొదట టోక్యో రేడియోలో ప్రకటించి, కాదు తైహోకులో అని తరవాత మాట మార్చారు.
  9. ముఖం కనపడకుండా శవాన్ని ఫోటో తీశారు. మొహం ఎవరినీ చూడనివ్వకుండా దహనం కానిచ్చారు.

ఇలాంటి ఆక్షేపణలను, అభ్యంతరాలను విన్నవారు ఎవరైనా విమాన ప్రమాదం, దానివల్ల నేతాజీ మరణం కట్టుకథ అనే సహజంగా భావిస్తారు. అనుమానాలు పెట్టేవాళ్ళు చెప్పనివీ, ఈ సందర్భంలో ముఖ్యంగా గుర్తు పెట్టుకోవలసినవి ఇవి:

  1. ప్రమాదంలో కూలింది మామూలు పౌర విమానం కాదు. ఇరుక్కుని కింద కూచున్నా పదిహేను మంది పట్టని బాంబర్‌ ‌యుద్ధ విమానం. శత్రు స్థావరాల మీద బాంబులు వేసేందుకు ఉపయోగించే విమానాల కదలికలు శత్రువుల రాడార్లకు, నిఘా వ్యవస్థకు అందకుండా జాగ్రత్త పడతారు. వాటి కదలికలు సంబంధిత సైన్యాధి కారులు బహుకొద్ది మందికి మాత్రమే తెలుస్తుంది. సాధారణంగా ఏ విమానాశ్రయం లోనూ వాటి రాకపోకలు రికార్డు కావు.
  2. ఈ కాలంలో వలె అత్యాధునిక ఎయిర్‌ ‌ట్రాఫిక్‌ ‌కంట్రోల్‌ ‌వ్యవస్థ అప్పుడు లేదు.
  3. అది భయంకరమైన ప్రపంచ యుద్ధం ముగిసి, పరాజిత దేశాలలో ప్రభుత్వమనేది చచ్చుబడి, ఏ అధికారికీ కాళ్ళూ చేతులూ సరిగా ఆడక, కమ్యూనికేషన్లు ధ్వంసమై సర్వత్రా అనిశ్చితి, అరాచకం అలుముకున్న కాలం. తైవాన్‌ ‌పరిస్థితి మరీ ఘోరం. అప్పటిదాకా దానిమీద పెత్తనం చేసిన జపాన్‌ ‌యుద్ధంలో చితికింది. మిత్రరాజ్యాల దాడులలో తైపేలోని ప్రభుత్వ భవనాలు, వాటిలోని రికార్డులు ధ్వంసమయ్యాయి. విమానాశ్రయం బాంబు దాడుల్లో దారుణంగా దెబ్బ తిని పాక్షికంగా పని చేస్తున్నది. కొన్నేళ్ళ తరవాత చాంగ్‌ ‌కై షేక్‌ ‌ప్రభుత్వం ఏర్పడేదాకా తైహోకు లేక తైపేలో అధికార వ్యవస్థ అస్తవ్యస్తంగా సాగింది. కల్లోలిత కాలంలో ఘటనకు సంబంధించిన ఆధారం స్థానిక రికార్డులలో దొరకనంత మాత్రాన అసలా ఘటనే జరగలేదని కొట్టివేయటం అవివేకం.
  4. ప్రమాదం జరిగిన సమయాన తైహోకులో పెత్తనమంతా ఇంకా జపాన్‌ ‌మిలిటరీ చేతుల్లోనే ఉంది. ఆసుపత్రి అధికారులు, మునిసిపల్‌ ‌కార్యాలయం వాళ్ళు, దహనవాటిక ఉద్యోగులు జపనీస్‌ అధికారులు ఏమి చేయమంటే అది చేశారు. రికార్డుల్లో పేర్లు ఎలా నమోదు చేయమంటే అలా చేశారు. ఎవరికి ఎవరి పేరుతో ఏ సర్టిఫికేటు ఇమ్మంటే ఆ ప్రకారం ఇచ్చారు. ఆ పరిస్థితుల్లో అంతకు మించి వారు చేయగలిగింది లేదు.
  5. విమాన ప్రమాదానికి, మంటల్లో నేతాజీ కాలిపోవటానికి, ఆసుపత్రిలో చికిత్సకు, మరణానికి సంబంధించి విమాన సిబ్బంది, విమానాశ్రయ ఉద్యోగులు డాక్టర్లు, నర్సులు, ఇతర ప్రత్యక్ష సాక్షులు చెప్పినవి స్థూలంగా సరిపోయాయి. అనేక సంవత్సరాలు గడిచాక, వేరు వేరు దేశాల్లో స్థిరపడి, ఒకరితో ఒకరు కూడబలుక్కునే అవకాశమే లేకపోయినా వేరు వేరు దర్యాప్తుల్లో విడివిడిగా విచారింపబడిన సాక్షులందరూ ఒకే దృశ్యాన్ని వర్ణించారు. అందరూ ఒకేసారి అదే దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసి ఉండక పోతే సాక్ష్యాలలో ఆ సాపత్యం కుదరదు.
  6. విమాన ప్రమాదంలో నేతాజీ లాగే మరణించిన జపాన్‌ ఉన్నత సైన్యాధికారి జనరల్‌ ‌షిదేయి మరణాన్ని అతడి కుటుంబం అంగీక రించింది. ప్రమాదంలో మరణించిన మరెవరి కుటుంబీకుల నుంచీ ఎలాంటి అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తమవలేదు.

సర్కంస్టెన్షియల్‌ ‌సాక్ష్యాలు ప్రబలంగా ఉన్నప్పుడు ఎక్కడో అతకలేదని, ఏదో పొసగలేదని, మరేదో అనుమానాస్పదంగా ఉన్నదని చెప్పి యథార్థాన్ని తోసి పుచ్చటం మూర్ఖత్వం. వందల మంది చూస్తుండగా పట్టపగలు నడివీధిలో జరిగిన దుర్ఘటనకైనా ప్రత్యక్ష సాక్ష్యాల తప్పులెన్నుతూ వంకలు పెడుతూ పోతే ఏ కేసూ నిలబడదు. ఘటనా స్థలం ఫోటోలలో పరిసరాల యాంగిల్స్‌ను, హబిబుర్‌ ‌రహమాన్‌ ‌కాలిన గాయాల పరిమాణాన్ని, అతడు చూపించిన రిస్టు వాచీ షేపును భూతద్దంలో చూసి ప్రమాదం మిథ్య, మరణం కట్టుకథ అని నిర్ధారించటం ఏడ్చినట్టే ఉంది.

మన పండితులకు, పరిశోధకులకు, ఔత్సాహిక పత్తేదారులకు తెలివి అనేది ఉంటే చూడవలసింది రష్యావైపో, ఫైజాబాద్‌ ‌వైపో కాదు. వారు దృష్టి పెట్టవలసింది నేతాజీ అసలు శత్రువుల మీద! ఆలోచించవలసింది అసలు కుట్ర సంభావ్యత గురించి! తెలివితేటలు ఉపయోగించవలసింది విమాన ప్రమాదం జరగనే లేదని రుజువు చేయాలన్న వృథా ప్రయాస కోసం కాదు. ఆ ప్రమాదం యాదృచ్ఛికమా, ఎవరైనా కావాలని చేయించారా అన్నదే కనిపెట్టవలసింది.

సోషలిస్టు సుభాస్‌ ‌చంద్రబోస్‌ను ఖైదు చేస్తే, హింసిస్తే సోవియట్‌ ‌రష్యాకు గాని, స్టాలిన్‌కు గాని ఒరిగేది ఏమీ ఉండదు. కాని పక్కలో బల్లెం వంటి బోస్‌ను అంతమొందిస్తే బ్రిటిష్‌ ‌సామ్రాజ్యానికి లాభం చాలా ఉంటుంది. సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌ప్రధాన శత్రువు బ్రిటిష్‌ ‌సామ్రాజ్యం! కేంబ్రిడ్జిలో ఉండగా ఐసిఎస్‌ను కాలదన్నిన నాటి నుంచీ ఆ సామ్రాజ్యానికి బోస్‌ అం‌టే మంట. 1941లో కాబూల్‌ ‌నుంచి బెర్లిన్‌కు బోస్‌ ‌వెళ్ళనున్నాడని ఉప్పు అందగానే అతడిని కనపడగానే కాల్చేయ్యమని మధ్య దారిలోని బ్రిటిష్‌ ఏజెంట్లు అందరికీ స్పెషల్‌ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్‌ (•‌జు) నుంచి రహస్య ఆదేశాలు వెళ్ళిన సంగతి తెలిసిందే. జర్మనీ నుంచి జపాన్‌కు జలాంతర్గామిలో బోస్‌ ‌వెళుతున్నాడని తెలిశాక సముద్రజలాల్లోనే అతడిని సమాధి చెయ్యాలని లండన్‌ ‌విశ్వప్రయత్నం చేసింది.

 ఆగ్నేయాసియాలో బోస్‌ ‌సమీప వలయంలో డబుల్‌ ఏజెంట్లను పెట్టి సమాచారం రాబట్టటానికి బ్రిటిష్‌ ‌మిలిటరీ ఇంటెలిజెన్సు డిసెప్షన్‌ ‌డివిజన్‌ అధిపతి పీటర్‌ ‌ఫ్లెమింగ్‌ ‌చేయని ప్రయత్నం లేదు. ఐఎన్‌ఎలో ఒక సీనియర్‌ ‌సైన్యాధికారి బ్రిటిష్‌ ఇన్ఫార్మరుగా మారి నేతాజీ సమాచారాన్ని ఎప్పటి కప్పుడు బ్రిటిషువారికి చేరవేసేవాడు. ప్రపంచయుద్ధం ముగిశాక టోజో కంటే బోస్‌ ‌మీదే ఎక్కువగా తెల్లవాళ్ళు దృష్టి కేంద్రీకరించారు. వార్‌ ‌క్రిమినల్‌గా విచారణ జరిపే జంజాటం పెట్టుకోకుండా చిక్కగానే బోసును చంపెయ్యమని బ్రిటిష్‌ ‌సైన్యాన్ని ఆదేశించారు. ఎక్కడ దొరుకుతాడా, ఎప్పుడు వేటు వేద్దామా అని కాచుకు కూర్చున్న బ్రిటిష్‌ ‌సర్కారుకు నేతాజీ కదలికలు అతడి శిబిరంలో అమ్ముడుపోయిన విద్రోహుల ద్వారా ఎప్పటికప్పుడు తెలిసిపోతూనే ఉన్నాయి. 1945 ఆగస్టు 17 సాయంత్రం సైగాన్‌లో నేతాజీకి వీడ్కోలు ఇచ్చిన వారిలో ఫలానా సైన్యాధి కారి కూడా ఉన్నాడు. విమానం బయలుదేరగానే ఆ కబురు లండన్‌కు చేరవేసే ఉంటాడు.

 ‘పర్ల్ ‌హార్బర్‌’ ‌కథా నాయకుడైన జపనీస్‌ అడ్మిరల్‌ ‌యమామోతోను 1943లో అమెరికన్‌ ఇం‌టెలిజెన్సు ఇలాగే మాటువేసి అతడు ప్రయాణిస్తున్న విమానాన్ని కూల్చి చంపిన వైనం జగత్ప్రసిద్ధం. యమామోతో మీద అమెరికన్లకు ఉన్నంత కక్ష నేతాజీ మీద బ్రిటిషర్లకూ ఉన్నది. అతడిని మట్టు పెట్టగలిగితే సింగపూర్‌, ‌రంగూన్‌, అం‌డమాన్స్ ‌పతనాలకు ప్రతీకారం తీర్చుకున్నట్టు అవుతుంది. ఇంఫాల్‌, ‌కోహిమాల మీద దాడి చేసిన దుస్సాహ సానికి అది తగిన శాస్తి. అలాగే సైన్యం విడిచిన అవిధేయులకు గట్టి వార్నింగ్‌! ‌చిరకాల శత్రువును హతమార్చగలిగితే భవిష్యత్తులో భారతదేశాన్ని ఐక్యంగా కలిపి ఉంచగలిగిన ప్రజా నాయకుడిని దేశానికి దక్కకుండా చేసినట్టూ ఉంటుంది.

 బ్రిటిష్‌ ‌సర్కారు తలచుకోవాలే గాని సుభాస్‌ ‌బోస్‌ ‌ప్రాణం తీయటం ఒక లెక్కలోనిది కాదు. SOE ఇండియన్‌ ‌మిషన్‌కు సంబంధించిన ‘Force 136’కు ఆ సమయాన ఆగ్నేయాసియా ఎల్లెడలా 33,000 మంది ఏజెంట్లు, ఇన్ఫార్మర్లు ఉన్నారు. యుద్ధంలో జపాన్‌ ‌నావల్‌ ‌కోడ్‌ను భేదించగలిగిన వారికి జపాన్‌ ‌విమానాల కదలికల సమాచారాన్ని పొంచి వినటం కష్టం కాదు. పైగా ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా మొత్తంలో గగన తలం మీద మిత్ర రాజ్యాలదే ఆధిపత్యం.

 తెల్లవారు కోరుకుంటే శాలీ బాంబర్‌ ‌విమానం తౌరేన్‌లో ఆగస్టు 17 రాత్రి మజిలీ చేసినప్పుడే దాని ఇంజన్లలో సమస్య వచ్చేలా చేయటం కష్టం కాదు. అది తౌరేన్‌లో ఆగి ఉన్న సమయంలోనే, కాగల కార్యం తైపేలో కానివ్వటానికి ముందస్తు సన్నాహాలకు కావలసినంత వ్యవధి ఉన్నది. అంతవరకూ బాగానే ఉన్న విమానం తైపేలో బయలుదేరటానికి ముందు పోర్ట్ ఇం‌జన్లో ఏదో ఇబ్బందిని సిబ్బంది కనిపెట్టటం గమనార్హం. టేకాఫ్‌ ‌సమయంలో కింది నుంచి కాల్పులు జరిపో, ఇంజన్లను ముందే పాడు చేసో విమానాన్ని కూల్చటం SOE ఆపరేటివ్‌ల ఆరితేరిన విద్య. దారుణ హత్యను మామూలు ప్రమాదంగా చిత్రించటంలో బ్రిటిషువారు సిద్ధ హస్తులు. సీక్రెట్‌ ఆపరేషన్‌ ‌సవ్యంగా అయిందోలేదో ధ్రువ పరచుకోవటానికే వైస్రాయి, మౌంట్‌ ‌బాటెన్‌ల ఆదేశం మీద ఇంటలిజెన్స్ ‌దర్యాప్తులు వేరువేరుగా జరిగి ఉండవచ్చు. బోస్‌ను చంపి దానిని ప్రమాదంగా లోకాన్ని మభ్యపెట్టటానికి బలమైన మోటివు, కావలసిన వనరులు బ్రిటిషువారికి పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి విమాన ప్రమాదానికి సంబంధించి మొట్టమొదట పరిశీలించవలసింది ఈ అంతర్జాతీయ కుట్ర కోణాన్ని. మునుముందు అనుమానించ వలసింది బ్రిటిష్‌ ‌సర్కారును! ఆ అసలు పని వదిలేసి మన మహా పరిశోధకులందరూ రష్యా మీద పడి, సైబీరియాలో కూపీలు తీయటం వృథా ప్రయాస.

వచ్చేవారం ముగింపు

About Author

By editor

Twitter
Instagram