ఏప్రిల్‌ 25 ‘‌టంగుటూరి’ సంస్మరణ

టంగుటూరి సూర్యకుమారి. ఈ పేరు వినగానే ‘మా తెలుగుతల్లికి’ మదిలో మోగుతుంది. తెలుగునాట పుట్టిన ఆ స్వరమాధురి ఏప్రిల్‌ 25‌న లండన్‌లో మూగవోయిన వైనం తలపుకొచ్చి గుండెంతా బరువెక్కుతుంది. గాయకురాలిగా అందరికీ ఆత్మీయురాలైన ఆమె చలనచిత్ర నటీమణిగానూ ఎందరికో చేరువయ్యారంటే, ఆ ఘనత అంతా సహజ సౌందర్యమూ నట ప్రావీణ్యాలదే! తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషా చిత్రాలకు తన కుశలత విస్తరించిందంటే అది అక్షరాలా బహుముఖ ప్రజ్ఞే. దేశ విదేశాల్లో ఎన్ని పేరు ప్రఖ్యాతలొచ్చినా కొన్ని ఏళ్ల తరబడి విద్యావ్యాసంగం కొనసాగించి కేంబ్రిడ్జి సీనియర్‌ ‌పరీక్షలో ప్రథమశ్రేణి సాధించారంటే అదంతా అసాధారణ ప్రభావమే. సంస్కృత, గుజరాతీ భాషల పరంగా ఎనిమిది పదుల సంగీత రికార్డులు వెలువరించారంటే; పాండితీ ప్రకర్షే మూలకారణం. గాన సారస్వతాలకు తోడు అతి పెద్ద నృత్య శిక్షణ మందిరాన్ని విదేశంలో ఆరంభించి నిర్వహించారంటే సమస్తమూ నిర్వహణ సామర్థ్యమే. సంప్రదాయాన్నీ, ఆధునికతనీ రంగరించి తాను విభిన్న రంగాల్లో నెలకొల్పిన విలువలు ఎన్నెన్నో. ఆసక్తి, అనురక్తి చిత్ర కళారంగానికీ విస్తరించిన దశలో ఆ కళాకారుడినే జీవిత భాగస్వామిగా స్వీకరించడం మరెంతో సమున్నతం. ఇంకా అత్యంత విశేషమేమిటంటే – అందాల సుందరిగా మిస్‌ ‌మద్రాస్‌ ‌పురస్కారాన్ని అప్పట్లోనే వశం చేసుకోవడం. ఇది ఇప్పటిది కాదు.. సరిగ్గా డెబ్భై సంవత్సరాల నాటి మాట. రమారమి ఎనభై ఏళ్ల జీవితకాలంలో ఆమెకి పలు రకాల అనుభవాలనిచ్చింది. వాటిల్లో కీలకమైనవి ఇవిగో ఇవీ.

ఇంటిపేరు అనుకోగానే టంగుటూరి ప్రకాశం పంతులు గుర్తొస్తారు. ఆ కుటుంబంలోనే జనించిన సూర్యకుమారి పన్నేండేళ్ల ప్రాయంలోనే మద్రాసుకు చేరి సినీ రంగాన ప్రవేశించారు. ఇక పాటలు పాడటం అంటారా? తనకు నాలుగేళ్ల వయసునుంచీ! పాటా, ఆటా రెండూ ఆమె కళా ప్రావీణ్యాన్ని వేనోళ్ల చాటాయి. మీకు రైతుబిడ్డ సినిమా గుర్తుందా? సరిగ్గా దశాబ్దాల నాటిది. అలాగే తనకు పదహారేళ్లప్పుడు విడుదలైన చంద్రహాస చిత్రంలో పాట విన్నారా? ‘ముదముగా’ అనే పదాన్ని ఎంత వైవిధ్యంగా, ప్రస్ఫు టంగా పలుకుతారో విని తీరాలి. అందులో మార్దవ కన్నా ఘాటుతనం మనల్ని పరిపూర్తిగా అలరిస్తుంది. గీతాన్ని ఒకసారి వింటే మళ్లీ మళ్లీ వినాలనీ అనిపిస్తుంటుంది. సినీ గీతాలతో పాటు లలిత, దేశభక్తి గేయాల గ్రామఫోన్‌ ‌రికార్డులనూ అప్పట్లో శతాధికంగా ఆవిష్కరించారు. అష్టపదుల వంటి సంప్రదాయాల్లోనైనా, అత్యాధునిక గీతికల్లోనైనా సూర్యకుమారి ఓ ప్రత్యేకత. విప్రనారాయణ సినిమా కైతే ఆమెతో పాడించేందుకే ఒక పాత్రను సృష్టించారు నిర్మాతలు. మరో చలనచిత్రంలో ‘రావోయి వనమాలి’ అంటూ పాడుతుంటే విని పరవశించని హృదయమంటూ లేదు. ఇంకో విలక్షణత – జయ ప్రద పేరిట నాడు ఓ సినిమా ఉంది. అందులోనూ టంగుటూరిది గణనీయ పాత్ర. దేవత అనే పేరున్న చిత్రంలోను ఆమె రూపం కనిపిస్తుంది. స్వరం వినిపిస్తుంది. పద్య పఠనంలో శ్రావ్యత మనోహర అనుభూతిని ప్రసాదిస్తుంది. ‘ఎంత వేడుక ఈ ప్రభాతము’ అని ఇంకో చిత్రంలో పాడుతుంటే, ‘రారా బిరాన నా మార’ అని ఆకట్టుకుంటుటే శభాష్‌ అనాల్సిందే ఎవరైనా! భక్త పోతన, కృష్ణప్రేమ వంటి ఆధ్యాత్మిక చిత్రాల్లో; మరదలు పెళ్లి, భాగ్యలక్ష్మి మొదలైన ప్రత్యేక ఇతివృత్త సినిమాల్లో ఎంతగానో పటిమ చాటారామె. లలిత సంగీత కచేరీల్లో కూడా తానొక దిట్ట. అలనాడు జాతీయోద్యమ తరుణంలో గీతాలాపనతో జనావళిని ఉర్రూతలూపారు. అటు తర్వాత స్వాతంత్య్ర సాధన తదుపరి ఒక కార్య క్రమంలో జాతి నేతల సమక్షాన ‘వందేమాతరం’ ఆలపిస్తుంటే, దేశభక్తి భావన పెల్లుబికింది అంతటా. జానపద గీతికాలాపనలోనూ తానే మిన్న.

సంగీతాన్ని శ్వాసించే ఆ విదుషీమణి అమెరికా, కెనడా, స్వీడన్‌ ‌సహా వివిధ దేశాల్లో శిక్షణ సంస్థలు స్థాపించారు. ఫలితం- వందలాది కళాకారుల ఆవిర్భావం. విశ్వకవి రవీంద్రనాథ్‌ ‌ఠాగూర్‌ ‌రచించిన ఆంగ్ల నాటకంలో రాణి పాత్రతో ఆమెను చూస్తుంటే, నటనా కౌశలమంతా కుప్పవోసినట్లు గోచరించేది. అందుకనే అమెరికన్‌ ‌నాటకరంగ వేదికపైన అద్భుతంతో విలక్షణ పురస్కృతి అందుకున్న తొలి భారతీయురాలయ్యారు. అదే ప్రదర్శన ఇతర దేశాల్లోనూ నెలల పర్యంతం కొనసాగి రికార్డు నెలకొల్పింది. మన దేశీయ నృత్య కళల మీద విస్తృతస్థాయి సదస్సులను ఇతరత్రా నిర్వహించిన ఘనతా టంగుటూరి సూర్యకుమారిదే. హైదరాబాద్‌ ‌మహానగరంలో ఏర్పాటైన ప్రపంచ తెలుగు మహా సభల వేదికపైనా తన సేవలకు గుర్తింపు సూచకంగా బహుకృతి స్వీకరించారు. అందులో కూడా ఆమె కళానైపుణి అనుపమానం, మరెవ్వరి అనుకరణకీ అందనంత ప్రశస్తం. సరస్వతిగా నటించి మెప్పిం చడం; నారద పాత్రలో లీనమవడం అమెకు మాత్రమే తెలిసిన విద్యలు.

హే భారత జననీ! స్వేచ్ఛా గగన వీధి విహారిణీ

అంటున్నప్పుడు సువిశాలత

జనావాళికి ప్రశాంతినిమ్మా, జగత్తుకు సమానతనిమ్మా

అంటుండగా స్వేచ్ఛా స్వాతంత్య్ర పిపాస

ఒంటిగా ఉయ్యాలలూగితివా నా ముద్దుబిడ్డా…   జంటగా నను పిలవక అనేటప్పుడు వ్యాపించిన ఆర్తి

ఎలా పాడినా, ఎవరిది ఆలాపించినా అది టంగుటూరి తరహా అని ఇట్టే పట్టేయవచ్చు ఎప్పుడైనా. లభించిన జనాదరణ అనంతమే. పాటలూ, మాటలూ, ఆటలూ వీటికి తోడు విదేశీ విశ్వవిద్యాలయ తరగతిగదుల బోధనలోనూ తనదైన విభిన్నత కనబరచారామె. భారతీయ సంస్కృతి నాగరికతలను పలు దేశాల్లో ప్రచారానికి తెచ్చి సాంస్కృతిక రాయబారి బాధ్యతలనూ నిర్వర్తించారు. బాపూజీ శతజయంతి మహోత్సవాల సమయాన ఇంగ్లండ్‌లో గీతాలాపన సాగించిన తొలి తెలుగు పడతి. వక్తగా తానేమిటో నిరూపించుకున్న మేలిమి ఉనన్యాసకురాలు. భారత చలనచిత్ర పరిశ్రమ ప్రతినిధుల బృందంలో ఒకరిగా ఉండి, ప్రపంచ దేశాలను పర్యటించి వచ్చారు. అక్కడి వారికి పాశ్చాత్య గీత, నృత్యాల్లో చక్కని శిక్షణనిచ్చిన బహునేర్పరి.

తెలుగు పదాల సొగసులు సూర్యకుమారి గొంతులోనే వినాలి మనమంతా.

అవి : శతపత్ర సుందరీ

               ఉదయ సాంధ్యవేళ హృదయ భావకేళీ

               యౌవన తరంగ లాస్యములో

                చిదానంద రూపా శివోహం

               ఎవరు విన్నారెవరు కన్నారో

               ఇదె జోత – ఓ స్వతంత్ర భారత పితా!

               స్వప్న జగతిలో చాయా వీణా

               చిన్నదోయి నా హృదయనావ

సభ్యతా సమావేశాల్లో ముందుగా సంగీత ప్రాధాన్య వివరణ (సూర్యకుమారి స్వరం నుంచి) భగవంతుడిచ్చిన గొంతుకను స్వరంతో మాట్లాడించే ప్రయత్నం చేయాలి మనం. ఓంకారం నుంచే శబ్దం పుట్టించి. అందులో నుంచి సృష్టి.

గీత ప్రకాశ్‌ ‌సంస్థను సాంస్కృతిక లక్ష్యాలతో స్థాపించినప్పుడు ఆమెకు ఇరవై ఏళ్లయినా లేవు. అనేక కార్యక్రమాలను తనకు తాను నిర్వహించి, వాటితో వచ్చే ధనాన్ని స్వచ్ఛంద సేవాసంస్థలకు అందించే వారు. ఆధ్యాత్మిక దృక్పథంతో మరోవైపు ప్రత్యేకించి గురువుల నుంచి యోగవిద్యను అభ్యసించారు. పలు సందర్భాల్లో సంగీత దర్శకత్వ బాధ్యతలు వహిం చారు. ఫ్రాన్స్‌లోని నాటక ప్రదర్శన సంస్థల గురించి విస్తారమైన అధ్యయనం జరిపారు. జర్మనీ వంటి దేశాలనూ పర్యటించి తన భావజాలాన్ని విపులీక రించారు. తాను ఎంతగానో ప్రేమించి పెళ్లాడిన ఎల్విన్‌ ‌శాశ్వతంగా వీడివెళ్లినా, ఈ లోకాన ఆయన లేనితనాన్ని మౌనంగా భరించారు. కలతలూ కన్నీళ్లూ ఎన్నెన్ని ఎదురైనా, ఆశాజ్యోతిని వదులుకోలేదు. సుఖదుఃఖాలు రెండింటినీ యథాతథంగా స్వీకరించ గలిగిన స్థితప్రజ్ఞరాలామె. సమాజ సేవలో భాగంగా అనేక రాష్ట్రాల్లో ఎంతగా పర్యటించారో, లభించిన మొత్తాన్ని ఎన్ని సంస్థలకు విరాళంగా అందించారో లెక్కకు అందవు. కళాచైతన్య అనే మరొక వ్యవస్థను ఆరంభించి సేవా సహాయ కార్యక్రమాలను ఇంకా ఇంకా విస్తరించారు.

‘మాదీ స్వతంత్ర దేశం – మాదీ స్వతంత్ర జాతి’ అని గళమెత్తిన ఆమె పలుకు తేనెల వనితగా కీర్తి గడించారు. ఆ రూపం ఎంత సుందరమో, కంఠం అంత మధురం. జీవనరంగంలో అడుగడుగునా సవాళ్లను ఎదుర్కొంటూనే విజయపథంలోకి దూసుకెళ్లిన మహిళామణి. కళలతో పాడే శాస్త్ర- పరిశోధనా రంగాలపైనా ఎక్కువ మక్కువ చూపిన ఆచరణవాది. ఏ పక్రియను చేపట్టినా, అందులో సంపూర్ణత లభించేదాకా వెనుతిరగని సాహసి. ఉన్న విలువలను పెంపొందించి, కొత్త వాటిని ప్రారంభించి ‘ప్రతిభ’ అనే పదానికి పరిపూర్ణ అర్ధమిచ్చిన దక్షురాలు. ఎన్ని దేశాల్లో పర్యటించినా ఎన్ని పక్రియలు అనుసరించినా, తెలుగుదనాన్ని మటుకు ఎటువంటి పరిస్థితిలోనూ వీడని కార్యశీలి. ఒకటా-రెండా, మూడు దశాబ్దాలకు పైగా ఇతర దేశాల్లో ఉండాల్సి వచ్చినా తెలుగుజ్యోతిని అఖండంగా వెలిగిస్తూ వచ్చారు. వచ్చిన అన్నింటినీ సమాజానికే అప్పగించారు తప్ప తనకంటూ ఎప్పుడూ ఏదీ మిగుల్చుకోలేదు. అన్ని రంగాలకు సమ ప్రాధాన్యమివ్వడం ఆమె బహుళత్వానికి సూచిక. స్వరాలాపన చేసి, వయొలిన్‌ ‌వినిపించి, వీణనూ రవళించి తాను శ్రోతలకు అలౌకిక అనుభూతి నందించారు. అపార గ్రహణశక్తితో మిగతా రంగా లనూ తనవిగా చేసుకొని, మొత్తానికి ఓ సరికొత్త చరిత్ర సృష్టించగలిగిన ఘనురాలు సూర్యకుమారి. తీరని కోరిక ఒక్కటే- సోదరత్వాన్ని కాంక్షిస్తూ, శాంతిని ప్రబోధిస్తూ తను రచించిన నృత్య సంగీత రూపకానికి ఓ రూపమంటూ ఇవ్వలేకపోవడం! అంతలోనే మరణం సంభవించినా; ఆ ఆనంద స్వరూపి ఆశయం ఎప్పుడూ చిరంజీవే. రెండు తెలుగురాష్ట్రాలకు తోడు ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉన్న తెలుగువారికి; సహ భాషల వారికి ఆ వనితా రత్నం ఎప్పుడు ఆదర్శనీయురాలే. ఆమె వ్యక్తి కాదు; చరిత్ర. అది ఎప్పుడూ నిలువుటద్దమే. అందులో ప్రతిబింబించే టంగుటూరి సూర్యకుమారి స్త్రీ లోకా నికి మణిపూస; కళా జగతికి శాశ్వత ఆశ.

– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE