– ఎం.వి.ఆర్‌. ‌శాస్త్రి

రెండో ప్రపంచ యుద్ధం జరిగింది మిత్ర కూటమికీ, అక్ష కూటమికీ నడుమ. మిత్రరాజ్యాలలో ప్రధానమైనవి బ్రిటన్‌, అమెరికా, రష్యా. అక్ష కూటమిలో ఉన్నవి జర్మనీ, ఇటలీ, జపాన్‌. ‌సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌భారత్‌ ‌స్వాతంత్య్రం కోసం అక్షకూటమి సహాయంతో బ్రిటన్‌, అమెరికాల మీద యుద్ధం ప్రకటించాడు. ప్రపంచ యుద్ధంలో కడకు అక్షకూటమి ఓడిపోయింది. ఇటలీ, జర్మనీల తరవాత జపాన్‌ ‌కూడా సరెండర్‌ అయ్యాక బోస్‌ ఏకాకి అయ్యాడు. తాను సైతం లొంగిపోవటానికి ఇష్టపడక పోరాటాన్ని కొనసాగించాలని నిశ్చయించుకున్నాడు. తరుముకొస్తున్న శత్రువును తప్పించుకోవటం కోసం రష్యా ఆశ్రయం పొందాలనుకున్నాడు. సామ్రాజ్య వాదానికి సోషలిజం బద్ధ వ్యతిరేకి కాబట్టి బ్రిటిష్‌ ‌సామ్రాజ్యంపై భారత స్వాతంత్య్ర పోరాటానికి సోషలిస్టు రష్యా తప్పక సహకరిస్తుందని బోస్‌ ‌నమ్మాడు. జపాన్‌ అధికారుల సాయంతో రష్యా భూభాగం చేరువకు చేరేందుకు జపాన్‌ ‌యుద్ధ విమానం సైగాన్‌లో 1945 ఆగస్టు 16 సాయంత్రం బయలుదేరాడు.

ఇంతవరకూ వాస్తవం.

దారిలో విమానప్రమాదంలో తాను మరణించి నట్టు జపాన్‌ ‌సాయంతో ప్రపంచాన్ని మభ్యపెట్టి, నేతాజీ ముందుగా అనుకున్న ప్రకారం మంచూరి యాలో విమానం దిగాడు. అటు నుంచి రష్యాకు చేరాడు. అక్కడ ఊహించనిది జరిగింది. తమ శత్రువైన హిట్లర్‌తో చేతులు కలిపిన బోస్‌ను రష్యా నియంత స్టాలిన్‌ ‌క్షమించలేదు. చిక్కిన వెంటనే బోసును సైబీరియా చెరలో పెట్టాడు. అది బ్రిటన్‌, అమెరికాలకు తెలిసే, వాటి ఆమోదంతోనే జరిగింది. ఇండియాకు తీసుకువచ్చి విచారణ జరిపి బోసును శిక్షించినా, వార్‌ ‌క్రిమినల్‌గా ఇండియా వెలుపల విచారణ జరిపి మరణదండన విధించినా ఇండియాలో తమ కొంప మునుగుతుంది కాబట్టి అతడిని బయటి ప్రపంచానికి తెలియకుండా రష్యన్‌ ‌చెరలోనే మగ్గనివ్వటం మంచిదని బ్రిటన్‌ ‌తలచింది. తనకు పక్కలో బల్లెమైన సుభాస్‌ ‌చంద్రబోస్‌ అలా విదేశీ చెరసాలలో అజ్ఞాతంగా కడతేరిపోవటం తనకూ క్షేమమని జవహర్లాల్‌ ‌నెహ్రూ భావించాడు. అందుకే ‘‘వార్‌ ‌క్రిమినల్‌ ‌సుభాస్‌ ‌బోసు’’కు స్టాలిన్‌ ఆ‌శ్రయం ఇచ్చినట్టు తన చెవిన పడగానే కంగారు పడి వెంటనే దానిని అడ్డుకొమ్మంటూ బ్రిటిష్‌ ‌ప్రధాని అట్లీకి ఉత్తరం రాశాడు. తాను ప్రధాన మంత్రిగా ఉన్నంతకాలం బోస్‌ ఆచూకీ లోకానికి తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. నెహ్రూ, అతడి అనంతరం అతడి కుమార్తె సోవియట్‌ ‌రష్యాకు అనుకూలంగా మెలగినందువల్ల మాస్కో కూడా సహకరించి, వారి రాజకీయ ప్రత్యర్థి బోసును సైబీరియా గులాగ్‌లోనే నిరవధికంగా బంధించింది. బహుశా సైబీరియా చెరలోనే చిత్రహింసలు అనుభవించి నేతాజీ అనామకంగా మరణించి ఉంటాడు. లేదా స్టాలిన్‌ ‌మరణానంతరం ఎలాగో రష్యా నుంచి బయటపడి స్వదేశానికి చేరి మారుపేరుతో అజ్ఞాతవాసం చేసి కాలధర్మం చెందాడు.

ఇది ఇప్పటికీ చాలామంది అభిప్రాయం. ఎంతమాత్రం వాస్తవం కాదు.

‘‘సుభాస్‌ ‌మరణించలేదు. రష్యాలో ఉన్నాడు.’’ అని గాంధీగారు ఏ ముహూర్తాన ఊహాగానం చేశాడో గాని ముప్పావు శతాబ్దం గడిచాక ఇప్పటికీ నేతాజీ పేరు వినగానే ఎంతో మందికి సోవియట్‌ ‌రష్యా, సైబీరియా చెర మదిలో మెదులుతున్నాయి. అదుగో బోస్‌, అయ్యో బోస్‌, ‌పాపం బోస్‌ – అం‌టూ ఇప్పటికి ఎన్ని కథలు విన్నాము!

1949-52 మధ్య మాస్కోలో భారత రాయబారిగా ఉన్న డాక్టర్‌ ‌సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ‌సోవియట్‌ ‌జైలులో నేతాజీని చూశాడట. ఖైదీతో ఏమీ మాట్లాడకూడదు అనే షరతుమీద ఆయనకు బోస్‌ను చూపించారట. ఆ వర్తమానాన్ని సర్వేపల్లి న్యూదిల్లీకి తెలియపరచాడట. ఆయన నోరు మూయించటం కోసం స్వదేశానికి తిరిగి వెళ్ళగానే డాక్టర్‌ ‌రాధాకృష్ణన్‌ ‌పేరును ఉపరాష్ట్రపతి పదవికి నెహ్రూ ప్రతిపాదించా డట. అబుల్‌ ‌కలాం ఆజాద్‌ ‌లాంటివారు వ్యతిరేకించినా నెహ్రూ లెక్కచెయ్యలేదట. మాస్కోలో ఓరియంటల్‌ ‌స్టడీస్‌ ఇనిస్టిట్యూట్‌ ‌డైరెక్టర్‌గా పని చేసిన, స్టాలిన్‌ ‌హయాంలో పలుకుబడి కలిగిన గౌఫ్రావ్‌ అనే సోవియట్‌ అధికారి ఎవరికో చెపితే వారిద్వారా తనకు ఈ భోగట్టా తెలిసిందని భారత విదేశాంగ శాఖలో సమాచార విభాగం డైరెక్టర్‌గా పనిచేసిన రాయిసింగ్‌ ‌చౌదరి కథనం.

రాధాకృష్ణన్‌కే కాదు. అతడికి ముందు మాస్కోలో మొదటి భారత రాయబారిగా పనిచేసిన జవహర్లాల్‌ ‌చెల్లెలు విజయలక్ష్మీ పండిట్‌కు కూడా నేతాజీ సైబీరియా ఖైదులో ఉన్న సంగతి తెలుసట. పదవీ విరమణ చేశాక ‘‘నాకు తెలిసిన ఓ సంగతి బయటపెడితే మొత్తం దేశం షాకవుతుంది’’ అని ఆమె ఓ ప్రైవేటు సంభాషణలో అన్నదట. దానిమీద సర్వత్రా ఉత్కంఠ రేకెత్తేసరికి ‘‘చాల్లే. నోరు మూసు కోమ’’ని నెహ్రూ గారు గదిమారట. అన్నయ్య మాట చెల్లెలు పాటించిందట. ఇది ఇంకొందరు చెప్పే అక్షర సత్యం.

ఇవే మాటలు 1970ల్లో ఖోస్లా కమిషన్‌ ‌ముందూ వినపడ్డాయి. నిజమేమిటో వివరించ వలసిందని కమిషన్‌ ‌కోరితే డాక్టర్‌ ‌రాధాకృష్ణన్‌, ‌విజయలక్ష్మీ పండిట్‌ ఇరువురూ తాము బోసును 1941లో దేశం వదిలిపోయాక చూడనే లేదని అఫిడవిట్లు ఇచ్చారు. ‘‘చూశారా! చూడలేదు అన్నారే గాని బోసు రష్యాలో ఉన్నట్టు తమకు తెలియదు అనలేదు. కాబట్టి వారికి తెలిసే ఉంటుంది’’ అని కనిపెట్టిన డిటెక్టివులకు కొదవ లేదనుకోండి!

ఖైదు నుంచి ఎలా తప్పించుకున్నాడో తెలియదు గాని 1964 మేలో తన ప్రియతమ జవహర్లాల్‌ ‌మరణించినప్పుడు నేతాజీ రహస్యంగా చూడ వచ్చాడట. నెహ్రూ అంత్యక్రియల్లో అనుకోకుండా ఒక కెమెరాకు చిక్కాడట! అదేదో ఫోటోలో కనపడే వాడే బోస్‌ అని గట్టిగా నమ్మి, ప్రచారం చేసిన ఉత్సాహవంతులు చాలామంది ఉన్నారు.

నెహ్రూ అంత్యక్రియల్లో కనపడిన వాడు మళ్ళీ పోయి సోవియట్‌ ‌ఖైదులో ఎందుకు కూచున్నాడో తెలియదు. 1965 యుద్ధం తరువాత చర్చల నిమిత్తం ప్రధానమంత్రి లాల్‌ ‌బహదూర్‌ ‌శాస్త్రి తాష్కెంటుకు వెళ్ళిన సంగతి తెలుసు కదా? అదిగో అప్పుడే-దేశానికి అద్భుతమైన సర్ప్రైజ్‌ ‌గిఫ్టుగా ఒక స్పెషల్‌ ‌పర్సన్‌ను తాను వెంటబెట్టుకు రాబోతున్నట్టు శాస్త్రీజీ తన భార్యకు ఫోన్‌లో చెప్పాడట. బహుశా అది జరగనివ్వకూడదు అనే కాబోలు రాత్రికి రాత్రే ప్రధానమంత్రికి విషప్రయోగం చేసి తాష్కెంటులోనే చంపేశారని నమ్మకంగా చెప్పుకునే వారు ఇప్పటికీ ఉన్నారు.

ఆ విధంగా స్పెషల్‌ ‌గిఫ్ట్ ‌పాకేజీలో ఇండియా తిరిగొచ్చే ఛాన్సు కోల్పోయిన నేతాజీ సోవియట్‌ ‌భూమిలోనే సెటిల్‌ అయినట్టుంది! బోస్‌ ‌రష్యాలో ఉన్నాడన్న దానిలో డౌటు లేకపోయినా ‘లోపల’ ఉన్నాడా, కటకటాల వెలుపల ఉన్నాడా, ఉంటే ఏ హోదాలో అన్న విషయంలో భిన్నాభిప్రాయాలు వినవస్తాయి. సైబీరియా జైల్లో అతడిని మరణించే దాకా బంధించి ఉంచారని కొందరు చెబుతారు. చిత్రహింసలు కూడా పెట్టేవారని ఇంకొందరు కనిపెట్టారు. లేదు. రష్యన్లు నేతాజీకి గౌరవ మర్యాదలు బాగానే చేశారు. స్వేచ్ఛగా తిరగనిచ్చేవారు అని ఇంకొందరి సమాచారం.

బుద్ధి శుద్ధి కోసం సైబీరియా క్యాంపుకు పంపబడ్డ జెరోవిన్‌ అనే జర్మన్‌ ‌యూదుకు అక్కడి విఐపి క్యాంపులో 1948లో ఒకసారి సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌తారస పడ్డాడట. తిరగటానికి ఒక కారు, అంగరక్ష కులుగా ఇద్దరు గార్డులను ఇచ్చి రష్యన్‌ ‌ప్రభుత్వం తనను బాగా చూసుకుంటున్నదని బోస్‌ ‌చెప్పాడట. త్వరలో ఇండియా వెళదామనుకుంటు న్నట్టూ అతగాడికి నేతాజీ ముందస్తు సమాచారం ఇచ్చాడట. అతడేమో ఆ వైనాన్ని అనంతరకాలంలో సోవియట్‌ ‌సామ్రాజ్యంలోని ఉక్రెయిన్‌లోని కర్మాగారంలో తనతో కలిసి పనిచేసిన అర్ధెందు సర్కార్‌ అనే సహచరుడి చెవిన వేసి ఈ సంగతి ఎవరికీ చెప్పకు అన్నాడట. చెప్పవద్దన్న సంగతి అందరికీ చెప్పకపోతే ఎలా అని తలచి, ఆ బుద్ధిమంతుడు ఎకాఎకి మాస్కోలోని ఇండియన్‌ ఎం‌బసీకి వెళ్లి అక్కడి సెకండ్‌ ‌సెక్రెటరీకి తాను విన్న తాజా కబురు తెలియపరచాడట. ఆ అధికారి షాకై పోకుండా, కనీసం మంచి బహుమాన మైనా ఇవ్వకుండా ‘‘రాజకీయాల జోలి నీకెందుకు? వచ్చినపని చూసుకోరాదా?’’ అని కసిరాడట. దాంతో సర్కార్‌ ‌హడలిపోయి నోటికి తాళం వేసుకున్నాడట. కొలకతా తిరిగివెళ్ళి, పిల్లలందరూ సెటిల్‌ అయ్యే దాకా ఆగి అప్పుడు తాళం విప్పాడట. అలాంటి గాలి కబుర్లన్నీ వినటానికి ఆ ఊళ్లోనే ముఖర్జీ కమిషన్‌ ‌వారు ఆఫీసు తెరిచి కూచున్నారని ఎవరో చెప్పగా అక్కడికి పోయి బోస్‌ ‌రహస్యాన్ని సవిస్తరంగా బయటపెట్టాడు.

కారు, గార్డుల భోగంతో సైబీరియా లేబర్‌ ‌క్యాంపులో బోస్‌ ఒకరి కంట పడటానికి రెండేళ్ళ ముందు అంటే 1946లో ఇంకో ముచ్చట. అలెగ్జాండర్‌ ‌కోలెస్నికోవ్‌ అనే రష్యన్‌ ఆర్మీ ఉన్నతాధి కారికి నలుగురు పోలిట్‌ ‌బ్యూరో మెంబర్ల రహస్య చర్చకు సంబంధించిన మీటింగు మినిట్సు కంటపడ్డా యట. సుభాస్‌చంద్ర బోస్‌ను సోవియట్‌ ‌యూని యన్‌లో ఇంకా ఉండనివ్వాలా వద్దా అన్నది అందులో చర్చించిన అంశమట. ఈ సంగతి అతగాడు చారిత్రక పత్రాల అధ్యయనం నిమిత్తం 1996 లో రష్యా వెళ్ళిన పూరవీ రాయ్‌ అనే కోలకతా యూనివర్సిటీ పరిశోధకురాలికి చెప్పాడు. రష్యన్‌ ఆర్కైవ్స్ ‌రహస్య మాళిగల్లో బోలెడు బోసుకు సంబంధించి బోలెడు రహస్య పత్రాలు దొరుకు తాయి. మీ గవర్నమెంటు చేత అడిగిస్తే అవన్నీ చూపిస్తారు – అని అతడు ఉచిత సలహా ఇచ్చాడు. అది మొదలుకుని ఆమె ఆ పత్రాలను బయటకు తీయించటమే జీవిత ధ్యేయంగా పెట్టుకుని, పెద్ద ప్రచార ఉద్యమం చేపట్టింది. ముఖర్జీ కమీషనును పట్టుకుని ఊదరబెట్టి పత్రాల వేట కోసం వెంట బెట్టుకుని రష్యాకు తీసుకు వెళ్ళింది.

గతంలో కమ్యూనిస్టు రష్యా చుట్టూ చీమను కూడా చిటుక్కుమనకుండా దుర్భేద్యమైన ఐరన్‌ ‌కర్టెన్‌ ఉం‌డేది. గోర్బచేవ్‌ ‌హయాంలో గ్లాస్‌ ‌నోస్త్, ‌పెరిస్త్రోయికాల పుణ్యమా అని ఇనప తెర తొలగి స్వేచ్చా వాయువులు వీచాయి. అంతకుపూర్వం ‘రష్యాలో బోస్‌’ ‌గురించి మనవాళ్ళు మాత్రమే మాట్లాడేవారు. భావ స్వేచ్చ వచ్చాక రష్యన్‌ ‌మేధావులూ నోరువిప్పసాగారు. A. Vinogradov అనే జర్నలిస్టు ఒక సోవియట్‌ ‌పత్రికలో ‘‘The Life And Death Of Netaji Bose’’ అనే వ్యాసం రాశాడు. బోస్‌ ఏమయ్యాడు అన్న విషయంలో న్యూదిల్లీ, మాస్కో అధికారులు పెదవి విప్పటం లేదు. మాస్కో ఆర్కైవ్స్‌లో దీనికి సంబంధించి వాస్తవ మేమిటో వెల్లడించే డాక్యుమెంట్లు ఉన్నాయి అని అందులో చెప్పాడు. 1994 లో ‘ఆసియా ఆఫ్రికా టుడే’’ అనే రష్యన్‌ ‌పత్రికలో ప్రధాన సంపాదకుడు Victor Touradjev కెజిబి రహస్య డాక్యుమెంట్ల ఆధారంగా బోస్‌ ‌మీద ఒక వ్యాసం ప్రచురించాడు. 1944 నవంబరులో టోక్యోలో మకాం చేసిన కాలంలో అక్కడి సోవియట్‌ ‌రాయబారి యాకోబ్‌ ‌మాలిక్‌ ‌నేతాజీ మాస్కోకు పంపిన రహస్య లేఖను అతడు ఆ వ్యాసంలో యథాతథంగా ఉటంకించాడు.

‘‘I am seeking the help of Soviet Government to fulfil the task of our freedom struggle to free India… My earnest desire is to pay a visit to your Excellency and find a way through which your Government can help us for the success of our struggle for freedom.’’ (భారత్‌ను విముక్తి చేయటానికి మేము చేస్తున్న స్వాతంత్య్ర పోరాటానికి సోవియట్‌ ‌ప్రభుత్వ సహాయాన్ని నేను అపేక్షిస్తున్నాను… మా స్వాతంత్య్ర సంగ్రామ సాఫల్యానికి మీ ప్రభుత్వం సహాయపడగల మార్గాన్ని కనుగొనేందుకు నేను తమరిని దర్శించాలని నా ఆకాంక్ష.) అన్నది ఆ లేఖ సారాంశం.

ఈ లేఖ ను పురస్కరించుకునే నేతాజీ రష్యాకు పయనమయ్యాడని ఆయన అభిమానుల వాదం. అసలు అలాంటి లేఖే తమకు అందలేదని కొంతకాలం, అందిన మాట నిజమే గాని మా టోక్యో రాయబారి దానిని తెరవకుండానే వెనక్కి పంపేశాడని ఆ తరవాత మాస్కో ఖండిస్తూ వచ్చింది. రాయబారి ద్వారా అందిన నాటి నేతాజీ లేఖ సోవియట్‌ ‌పత్రికలో వెల్లడవటంతో బుకాయింపు బండారం బయట పడింది. అధికార రహస్యాల వెల్లడి కోరే కోరస్‌ ‌లో సోవియట్‌ ‌మేధావులు కూడా గొంతు కలపటంతో బోస్‌ ‌మిస్టరీ మళ్ళీ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

నిజం ఏదో తేలాలంటే రష్యన్‌ ఆర్కైవ్స్‌లో వెనకటి ప్రభుత్వ రికార్డులను పరిశీలించాలి. గ్లాస్‌ ‌నోస్త్ ‌దరిమిలా పూర్వపు సర్కారీ పత్రాలను ఆర్కైవ్స్‌లో అందరూ చూసుకునే అవకాశం కల్పించినా, పార్టీ, ప్రభుత్వ అధినేతలకు, కే.జి.బి.కి, కీలక ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన ఆర్కైవ్స్‌ను మాత్రం రహస్యంగా ఉంచారు. వాటిలోని పత్రాలను సంబంధిత దేశ ప్రభుత్వం కోరితే తప్ప బయట పెట్టరు. ఈ నిబంధన ప్రకారం న్యూదిల్లీ నుంచి అభ్యర్ధన వస్తే చాలు అధికార పత్రాల రహస్య అరలు తెరుచుకుని నేతాజీ మిస్టరీ చిక్కుముడి ఇట్టే విడివడుతుందని పూరవీ రాయ్‌ ఎం‌త మొత్తుకున్నా ప్రయోజనం లేకపోయిందట. వెనుకటి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాల లాగే వాజపేయి ఎన్‌.‌డి.ఏ. ప్రభుత్వం కూడా రహస్య పత్రాల కోసం రాయబారి స్థాయి లోనో, అంతకంటే పై స్థాయిలోనో గట్టిగా అడగ కుండా ‘నోట్‌ ‌వెర్బల్‌’’ అనే సంతకం లేని సందేశం మాత్రం పంపి ఊరుకున్నదట. దాంతో భారత ప్రభుత్వానికే ఆసక్తి లేదని అర్థమై మాస్కో కూడా లైట్‌ ‌తీసుకున్నదట. చూశారా వాజపేయి సర్కారు కూడా కాంగ్రెస్‌ ‌బాపతే.. నేతాజీ అసలు రహస్యం లోకానికి వెల్లడి కాకుండా ప్రభుత్వమే అడ్డుపడు తున్నది అంటూ మేధావి గణం, మీడియా ఈ శతాబ్దం మొదట్లో పెద్ద దుమారం లేపాయి. కొంత కాలానికి ఎన్‌.‌డి.ఎ. పోయి యు.పి.ఎ. జమానా వచ్చింది. జస్టిస్‌ ‌ముఖర్జీ ఆర్కైవ్స్ ‌పరిశీలన నిమిత్తం మాస్కో వెళతానంటే కొత్త సర్కారు అక్కర్లేదు పొమ్మంది. పూర్వ ప్రభుత్వ సీనియర్‌ ‌మంత్రి మురళీ మనోహర్‌ ‌జోషీ కలగ జేసుకుని ప్రధాని మన్మోహన్‌ ‌సింగ్‌కు విజ్ఞప్తి చేస్తే గాని ముఖర్జీ మాస్కో యాత్రకు లైన్‌ ‌క్లియర్‌ ‌కాలేదు.

ఈ విధంగా అనేక మలుపులు, కావలసినన్ని వృథా వివాదాల తరవాత ముఖర్జీ కమిషను వారు సపరివారంగా రష్యాకు వేంచేసి, సాక్షులను విచారించి, పూరవమ్మ చెప్పిన ఆరు రహస్య ఆర్కైవ్లను తెరిపించి, వెయ్యి కళ్ళతో తనిఖీ చేస్తే – వాటిలో ఐదు అరల్లో బోస్‌ ‌కు సంబంధించిన సమాచారం ఒక్కటీ లేదు. ఆఖరు దానిలో ఉన్న సమాచారం పనికొచ్చేది కాదు! వారూ వీరూ తనకేదో చెప్పారంటూ పూరవీ రాయ్‌ ‌చెప్పిన మాటా వట్టిదేనని ఆయా సాక్షులను ప్రత్యక్షంగా విచారిస్తే తేలింది.

‘‘The question whether Netaji thereafter landed in Russia or elsewhere can not be answered for dearth of evidence’’ (ఆ తరవాత నేతాజీ రష్యాకు గాని, ఇంకో చోటికి గాని చేరాడా అన్న ప్రశ్నకు సాక్ష్యమేదీ కనపడని కారణంగా సమాధానం చెప్పలేము)- అని ముఖర్జీ కమిషన్‌ ‌చివరికి తేల్చింది.

ఆ విధంగా ‘సోవియట్‌ ‌చెరలో బోస్‌’’ ఉపాఖ్యానం తుస్సుమంది. అయినా ఇప్పటికీ ‘రష్యన్‌ ‌ప్రభుత్వం నిజం చెప్పటం లేదు. మన ప్రభుత్వం గట్టిగా పట్టుబట్టలేదు. నేతాజీ ముమ్మాటికీ రష్యాకే చేరాడు అని మూర్ఖంగా వాదించే తెలివిగలవాళ్ళు మన దేశంలో ఎందరో ఉన్నారు. రష్యాకు కాదు నేతాజీ రెడ్‌ ‌చైనాకు వెళ్ళాడని నేతాజీ సొంత అన్న శరత్‌ ‌బోస్‌ ‌లాంటి పెద్దల విశ్వాసం. అన్నట్టు కమ్యూనిస్టు చైనా ఆర్మీలో నేతాజీ పెద్ద జనరల్‌గా పనిచేశాడని ఫోటో కూడా చూపించే వాళ్ళూ ఉన్నారు. నేతాజీ విమాన ప్రమాదం అబద్ధమంటూ పార్లమెంటులో యాగీ చేసి ఖోస్లా కమిషన్‌కు కారణ భూతుడైన సమర్‌ ‌గుహ కూడా 1979లో నేతాజీ తిరిగొచ్చాడంటూ ఒక ఫోటో చూపించి మీడియాలో పెద్ద హడావుడి చేశాడు. అది- నేతాజీ అన్న శరత్‌ ‌శరీరానికి సుభాస్‌ ‌ముఖం అతికించిన ట్రిక్‌ ‌ఫోటోగ్రఫీ అన్న గుట్టు కాస్తా రట్టు అయ్యాక సమర్‌ ‌గుహ పరువు పోయింది.

అన్నిటికంటే పెద్ద జోకు ఏమిటంటే – స్టాలిన్‌ ‌మరణానంతరం నేతాజీ ఇండియాకు తిరిగివచ్చి సాధువు అవతారం ఎత్తాడట! పశ్చిమ బెంగాల్‌లోని షౌల్మరీలో కొత్తగా ఆశ్రమం పెట్టుకున్న శారదానంద అనే సాధువు నేతాజీ యేనని 1960లో దేశమంతటా పెద్ద సంచలనం. బోస్‌ ‌పేరు వింటే చాలు చలిజ్వరం వచ్చే జవహర్లాల్‌ ‌నెహ్రూ ఆ కబురు వినగానే నిజమేమిటో కనుక్కోమని ఇంటలిజెన్స్ ‌బ్యూరో డైరెక్టర్‌ ‌ను పంపించి రెండేళ్ళ పాటు ఆ ఆశ్రమం మీద గట్టి నిఘా పెట్టించాడు. పశ్చిమ బెంగాల్‌ ‌సీనియర్‌ ‌పోలిస్‌ ఆఫీసర్లు ఎప్పుడూ అక్కడే తచ్చాడే వారు. ఆ సాధువు చేతిరాతను నేతాజీ దస్తూరితో పరీక్ష చేయిస్తే రెండిటికీ కాస్త పోలిక ఉన్నట్టే తేలిందట! ‘‘నేను నేతాజీని కాను. నాకూ బోసుకూ పోలికే లేదు. నా మానాన నన్ను వదిలెయ్యండి’’ అని 1962 స్వయంగా ఆ సాదువే చేతులెత్తి అందరికీ దండం పెట్టాక గానీ ఆ గోల నెమ్మదిగా సద్దుమణగ లేదు.

దీనికంటే రసవత్తరమైనది పర్దేవాలా లేక గుమ్నామీ బాబా కథ.

అనగా అనగా ఒక తెర చాటు సాధువు. 1956 లో నేపాల్‌ ‌నుంచి లక్నో వచ్చాడట. అక్కడ కొన్నేళ్ళు ఉండి నైమిశారణ్యానికి, అక్కడినుంచి బస్తీకీ, అయోధ్యకూ మాకాం మార్చి చివరికి ఫైజాబాద్‌లోని రామ్‌భవన్‌లో స్థిరపడ్డాడట. అక్కడే 1985 సెప్టెంబరులో తనువు చాలించాడట. అయన మొహం ఎలా ఉంటుందో చూసిన వారు లేరు. ఎందుకంటే ఎప్పుడూ తెరచాటున ఉండేవాడు. ఒంటికి మాలిష్‌ ‌చేయించుకునేటప్పుడు కూడా మొగానికి మంకీ కాప్‌ అడ్డుపెట్టుకునే వాడు. ఎవరినీ సాధారణంగా కలవడు. ఎవరితోనూ మాటలాడడు. ఏదైనా చెప్పాలంటే పలక మీద రాసి వెంటనే చెరిపేస్తాడు. కాగితం మీద ఏదైనా రాస్తే వెంటనే దాన్ని చించి ముక్కలు చేసేవాడు. తప్పనిసరయి ఎవరికైనా తన చేతిరాత లో ఉన్న కాగితం ఇచ్చినా కాపీ చేసుకుని వెంటనే తిరిగి ఇచ్చివెయ్యాలని పట్టుబట్టేవాడు. పని పడితే రాత్రివేళ మాత్రమే బయటికి వెళ్ళేవాడు. అప్పుడు ఈజిప్షియన్‌ ‌మమ్మీలా మొగమంతా కప్పుకునేవాడు. నైమిశారణ్యంలో పర్దావాలా బాబా అని, ఫైజాబాద్‌లో గుమ్నామీ బాబా అని జనం అతడిని పిలిచేవారు. శిష్యులు, భక్తులు అందరికీ ఆయన ‘‘భగవాన్‌ ‌జీ.’’

లక్నోలో ఉండగా కొత్త కళ్ళద్దాలు కావలసివచ్చి ఓ రాత్రి తన శిష్యుడైన ఓ జమీందారును వెంటబెట్టుకుని కళ్ళజోళ్ళ షాపుకు భగవాన్‌ ‌జీ వెళ్ళాడు. తలమీద, మొహం మీద ముసుగులు తీసి అద్దాలు సరిపోయాయో లేదో చూసుకుంటూ ఉండగా బట్టతల, మొగం చూసి అక్కడే ఉన్న ఇంకో కస్టమర్‌ ‘‘‌నేతాజీ’’ అని కేక పెట్టాడట. వెంటనే అక్కడున్న ముగ్గురు యువకులు సాధువు కాళ్ళ మీద పడ్డారట. వెంటనే భగవాన్‌ ‌జీ, అతడి శిష్యుడు అద్దాలు అక్కడే పడేసి పరారయ్యారట. ఆ సాహస కృత్యాన్ని వివరించి ‘‘అదిగో అప్పటినుంచీ ఎవరూ గుర్తు పట్టకుండా ఇలా గడ్డాలు, మీసాలు పెంచాను’’ అని వినేవారికి చెబుతూండే వాడు పరదావాలా ‘నేతాజీ’!

‘‘నేను దశనామీ సన్యాసిని. పూర్వాశ్రమం అనేది గతించిన వాడిని. నాగతం గురించి అడగొద్దు’’ అంటూనే తానే నేతాజీ అని అందరికీ స్ఫురింపజేసెందుకు గుమ్నామీ బాబా చాలా హింట్లు పనిగట్టుకుని ఇస్తుండే వాడు. చచ్చిన వాడిని, రికార్డుల్లో పేరు కొట్టివేయబడిన వాడిని అంటూనే బోస్‌ ‌తల్లిదండ్రుల పేర్లు, చిన్ననాటి ముచ్చట్లు, సబ్మెరైన్‌ ‌సాహసయాత్ర వంటివి తరచూ ప్రస్తావిస్తూండే వాడు. అతడి ఆకారం, రంగు, దంతాల మధ్య ఎడం నేతాజీని పోలి ఉండేవి. బోస్‌లాగే రౌండ్‌ ఒమేగా వాచీ, గుండ్రని కళ్ళద్దాలు పెట్టుకునేవాడు. అతడి అలవాట్లు, మానెరిజాలు అచ్చం బోసులాగే ఉండేవి. నేతాజీ లాగే సిగరెట్లు, సిగార్లు చెయిన్‌ ‌స్మోకింగ్‌ ‌చేస్తూండేవాడు. అది ముస్సోలినీ అలవాటు చేసిన వ్యసనమని చెప్పేవాడు. నేతాజీకీ, ఇటలీ నియంత ముస్సోలినీకీ నడుమ చుట్టలు, బీడీలు కలిసి కాల్చుకునేంత సావాసం ఉన్న సంగతి బహుశా నేతాజీకి కూడా తెలిసి ఉండదు.

నేతాజీ పూర్వ సహచరులను గుర్తుపట్టటం, పాత విషయాలు గుర్తు చేయటం, అచ్చు నేతాజీ లాగే ఆర్డర్లు వేయటంతో ఇతగాడు నిజంగానే తమ నేతాజీ అని లీలా రాయ్‌, ‌పవిత్ర మోహన్‌రాయ్‌, ‌త్రైలోక్యనాథ్‌ ‌చక్రవర్తి వంటి వెటరన్లు నమ్మారు. దాంతో జన్మలో ఎన్నడూ నేతాజీని చూడనివారికి భగవాన్జీ మీద ఇంకా గురి కుదిరింది. ఆర్‌.ఎస్‌.ఎస్‌. అధినేత ఎం.ఎస్‌. ‌గోల్వాల్కర్‌, ‌యు.పి. మాజీ ముఖ్యమంత్రి సంపూర్ణానంద్‌ ‌వంటి వారితో సన్నిహిత పరిచయం ఉండటం, ప్రతి జనవరి 23న జన్మదిన వేడుకలకు ప్రముఖులు, బోస్‌ ‌కుటుంబీకులు రావటం, అతిగోప్యత పాటించటం మూలంగా భగవాన్‌జీ యే నేతాజీ అని బాగా ప్రచారం అయింది. ఎంతగా అంటే 1985లో మరణానంతరం గుమ్నామీ బాబా వస్తువులు, కాగితాలు, పుస్తకాలు అన్నీ ప్రభుత్వ ట్రెజరీకి తరలించి, అతడే నేతాజీ అవునో కాదో తేలేంతవరకు భద్రపరచాలని కోర్టు ఆదేశించింది.

బాబానే నేతాజీ అని జస్టిస్‌ ‌ముఖర్జీ కూడా గట్టిగా నమ్మాడు. నేతాజీ మిస్టరీ మీద తాను చేసిన ఆరేళ్ళ విచారణలో హెచ్చుభాగాన్ని ఈ రహస్యాన్ని నిరూపించటం కోసమే వెచ్చించి ఆయన తెగ కష్టపడ్డాడు. కోర్టు అనుమతితో గుమ్నామీ బాబాకు చెందిన 2673 ఐటెంలను పరీక్షించి, దస్తూరీ నిపుణులను పురమాయించి, డి.ఎన్‌.ఎ. ‌పరీక్షలకు ఏర్పాట్లు చేసి చాలా శ్రమపడ్డాడు. ఏం లాభం? ఆఖరికి బాబా దస్తూరీ కూడా నేతాజీ దానితో సరిపోలలేదు. అతడే నేతాజీ అనటానికి నమ్మదగిన ఒక్క రుజువూ దొరకలేదు.

గుమ్నామీ బాబా మీద సినిమాలు తీసి, పుస్తకాలు రాసి సందట్లో సడేమియాలు మాత్రం బాగానే బాగుపడ్డారు.

About Author

By editor

Twitter
Instagram