నిర్మల జలాలతో, ఒక పక్క శ్రీపర్వత అందాలతో, మరో పక్క షాలిమార్‌ ‌బాగ్‌, ‌నిషాత్‌ ‌బాగ్‌ ‌పేరుతో పిలిచే మొగల్‌ ‌గార్డెన్స్ ‌సోయగాలతో కళ్లు చెదిరే సౌందర్యంతో దర్శనమిస్తూ ఉంటుంది దాల్‌. శ్రీ‌నగర్‌ ‌నడిబొడ్డున ఉంది ఆ దాల్‌ ‌సరస్సు. శంకర భగవత్పాదులు ప్రతిష్టించిన అమ్మవారు శ్రీపర్వతం మీద కొలువై ఉన్నది. అక్కడ నుంచి దాల్‌ను చూడడం గొప్ప సౌందర్యాత్మక అనుభవం. సందర్శకుల కోసం సరస్సులో ఒక పక్కగా రంగు రంగుల మహా రాజహంసల్లా నిలిచి ఉండే వందలాది హౌస్‌బోట్లు. 18 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న సరస్సులో షికారీ పేరుతో తిరిగే అలంకరించిన ప్రత్యేకమైన నావలు, ఎన్నో రంగుల పూలను మోసుకొచ్చే నావలు.. కశ్మీర్‌ను భూతల స్వర్గమని ఎందుకంటారో చెప్పక చెబుతాయి. ఆ సరస్సు ఒడ్డునే ఉంది హరి పర్వతం. అక్కడ వెలసిన మాతా శారికాదేవికి 32 సంవత్సరాల తరువాత మళ్లీ కశ్మీరీ పండిత్‌లు, హిందువులు భక్తిగా ఏప్రిల్‌ 1, 2, 3 ‌తేదీలలో పూజలు చేసుకున్నారు. కశ్మీర్‌ ‌హిందూ పంచాంగంలో తొలిరోజును నెవ్రహ పేరుతో భక్తిప్రపత్తులతో ఆ పూజ నిర్వహిస్తారు. కానీ 1989-1990 నాటి పండిత్‌ల ఊచకోత తరువాత ఆ అమ్మవారికి ఇంతమంది పండిత్‌లు, హిందువులు కలసికట్టుగా పూజలు చేయలేదు. నిజమే, అప్పటి నుంచి వారి జీవితంలో చీకటి యుగం ప్రారంభమైంది.


శ్రీనగర్‌లో పలుచోట్ల నెవ్రహ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ‘1990లో జరిగిన ఊచకోతలో మా అమ్మానాన్నా ఇద్దరూ చనిపోయారు. అయినా కశ్మీరమే నా జన్మభూమి.’ అన్నాడు ఆ ప్రాంతంలోని హబ్బా కాదల్‌కు చెందిన ఓ పండిత్‌. ‌జన్మభూమి మీద కశ్మీరీ పండిత్‌లకు, ఇతర హిందువులకు ఉన్న అవ్యాజమైన అనురాగం ఇప్పటికైనా బయటి ప్రపంచానికి తెలిసి వచ్చింది. అది ది కశ్మీర్‌ ‌ఫైల్స్ ‌సినిమా చేసిన మహోన్నతమైన సేవ. ఈ చలనచిత్రం ఇప్పుడు ప్రపంచ సంచలనం. ఎన్నో దేశాలు ఆ సినిమా ద్వారా పండిత్‌ల మీద జరిగిన ఘోరాన్ని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాయి. కశ్మీర్‌ ‌లోయ మీద పండిత్‌లకు, హిందువులకు హక్కు ఉన్న మాట కాదనలేనిదన్న ఒక వాదన బలం పుంజుకుంది. భట్‌ ‌వంటి ఇంటి పేర్లు ముస్లింలలో, హిందువులలోను కూడా ఉంటాయి. దానర్థం ఏమిటి? ఆ సినిమాలోనే పుష్కర్‌నాథ్‌ ‌పండిత్‌ ‌మనవడికి చెప్పినట్టు,‘పీక మీద కత్తిమొన పెట్టి మతం మార్చారు.’

ఎన్ని ఇక్కట్లు పడినా, ఎందరిని కోల్పోయినా జన్మభూమి మీద భక్తి వీడని పండిత్‌ల నిబద్ధత శ్లాఘనీయం. పండిత్‌లకు రాజకీయ, సామాజిక, ఆర్థిక పునరావాసం కల్పించాలని రాజ్యసభలో ఏకైక పండిత్‌ ‌వర్గ సభ్యుడు ప్రైవేట్‌ ‌బిల్లు ప్రవేశపెట్టారు. ఇది ఆహ్వానించదగిన పరిణామం.

‘కశ్మీర్‌ ‌పండిత్‌లు బయటకు పోవాలని ఎవరూ ఒత్తిడి చేయలేరు. ఆ ప్రయత్నం చేసిన వారు ఎవరైనా తీవ్ర పరిణామాలు ఎదుర్కొనవలసి ఉంటుంది.’ ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సర్‌సంఘ చాలక్‌ ‌పూజనీయ మోహన్‌జీ భాగవత్‌ ‌చేసిన హెచ్చరిక ఇది. కశ్మీరీ పండిత్‌లను ఉద్దేశించి నెవ్రహ ఉత్సవాలలో భాగంగా మోహన్‌జీ ఏప్రిల్‌ 3‌న వర్చువల్‌గా మాట్లాడారు. మూడురోజుల నెవ్రహ ఉత్సవాలను ఆర్‌ఎస్‌ఎస్‌ ‌మద్దతుతో నడిచే సంజీవని శారదా కేంద్రం నిర్వహించింది. ఈ ఉత్సవాల నిర్వహణ వెనుక పెద్ద ఆశయమే ఉంది. ‘త్యాగ, శౌర్యదినం’ అని వీటికి పేరు పెట్టారు. కశ్మీరీ హిందువులు జరుపుకునే ఈ సంవత్సరాది పండుగకు ఆ సమాజం మొత్తం జన్మభూమిని దర్శించుకోవాలన్న నిబద్ధతతో ఉండాలనేది కూడా ఆశయాలలో ఒకటి. అలాగే తమ స్వస్థలాలకు తిరిగిరావాలన్న సంకల్పం కూడా ఈ పండుగ వేళ తీసుకుంటారు. తమ తల్లివేరు దగ్గరకు తిరిగి చేరుకుంటామని కశ్మీరీ హిందువులంతా నెవ్రహ సందర్భంగా ప్రతిజ్ఞ తీసుకుంటారని కూడా నిర్వాహకులు చెప్పారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఉత్సవంలోనే ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత ప్రసంగించారు. వచ్చే సంవత్సరానికల్లా తమ మాతృభూమికి చేరుకుంటారని, అందుకు ఆ సమాజమంతా బలంగా సంకల్పించుకోవాలనీ, అంతేకాకుండా తమ వర్గాన్ని భవిష్యత్తులో మరొకసారి ఎవరూ పెకలించలేని రీతిలో అక్కడ స్థిరపడాలని మోహన్‌జీ పిలుపునిచ్చారు.

పండిత్‌ల దుస్థితిని కళ్లకు కడుతున్న ‘ది కశ్మీర్‌ఫైల్స్’ ‌చలనచిత్రం వలసపోయిన వారి కడగండ్లను చిత్రించడమే కాదు, మొత్తం భారతీయ సమాజాన్ని కదిలించిందని మోహన్‌జీ చెప్పారు. 2011లో పండిత్‌లు కశ్మీర్‌ ‌లోయకు తిరిగి వెళ్లాలన్న ప్రయత్నం జరిగింది గాని, అప్పటి కంటే ఇప్పుడు తరలి వెళ్లడానికి మంచి అవకాశం ఉందని ఆయన అన్నారు. ఆర్టికల్‌ 370 ‌తరువాత ఆ రాష్ట్రంలో మార్పు వచ్చిన మాటను ఎవరూ కాదనలేరు. కాదంటున్నవారు ఈ దేశంలో లేకపోలేదు. అదంతా హిపోక్రసి. ముస్లిం బుజ్జగింపు. ఇంకా చెప్పాలంటే కరుడగట్టిన హిందూ ద్వేషం. అయినా ది కశ్మీర్‌ ‌ఫైల్స్ అభూత కల్పన అని ఎవరూ చెప్పలేక పోతున్నారు. అర్ధసత్యాలని బుకాయిస్తున్నారు.

జమ్ముకశ్మీర్‌ ‌శాంతివేదిక నిర్వహించిన నెవ్రహ ఉత్సవంలో బీజేపీ నాయకుడు డాక్టర్‌ ‌సుబ్రహ్మణ్య స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని విషయాలు వెల్లడించారు. అసలు కశ్మీర్‌లో ముస్లింలు, పండిత్‌లు వేర్వేరు కాదన్నారాయన. నిజానికి కాలక్రమంలో వేలాదిమంది హిందువు లను, ముఖ్యంగా పండిత్‌లను బలవంతంగా మతాంతరీకరణ చేశారు. తమ తోటివారినే కశ్మీరీ ముస్లింలు చంపారని ఆయన భావం. అలాగే ఆనాటి పండిత్‌ల వలసకు అసలు కారణం నాటి ప్రధాని విశ్వనాథ్‌ ‌ప్రతాప్‌ ‌సింగ్‌, ఆయన మంత్రివర్గంలో హోంమంత్రి ముఫ్తీ మహమ్మద్‌ ‌సయీద్‌ అని స్వామి చెబుతున్నారు. అంటే ఇందుకు మొత్తం బాధ్యతను నాటి ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లాది మాత్రమే కాదని ఆయన అభిప్రాయంగా కనిపిస్తున్నది.

ఆనాడు దేశంలో సంచలనం సృష్టించిన ముఫ్తీ కుమార్తె రుబియా అపహరణ ఉదంతాన్ని కూడా స్వామి గుర్తు చేసుకున్నారు. అయితే ఇంతవరకు రుబియా ఎలా ఉన్నదో ఎవరికీ తెలియదని ఆయన అన్నారు. అపహరణకు గురైన రుబియాను విడిపించ డానికి నాటి ప్రభుత్వం కొందరు జమ్ముకశ్మీర్‌ ‌లిబరేషన్‌ ‌ఫ్రంట్‌ ఉ‌గ్రవాదులను విడుదల చేయవలసి వచ్చిందని అన్నారు. తాను చంద్రశేఖర్‌ ‌ప్రభుత్వంలో మంత్రిగా ఉండగా, నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ ‌నాయకుడు సైఫుద్దీన్‌ ‌సౌజ్‌ ‌కుమార్తెను కూడా జమ్ముకశ్మీర్‌ ‌లిబరేషన్‌ ‌ఫ్రంట్‌ ఉ‌గ్రవాదులే అపహరించారని, కానీ మేము ఏ ఉగ్రవాదని విడుదల చేయలేదని, చివరకి ఉగ్రవాదులే ఆ అమ్మాయిని ఆటోలో తీసుకువచ్చి విడిచివెళ్లారని గుర్తుచేసుకున్నారు స్వామి. కశ్మీర్‌ ‌ఫైల్స్ ‌సినిమా తాను ఇంకా చూడలేదని, కానీ ప్రజాస్వామ్యంలో ఒక చిత్రాన్ని ఎలా నిషేధిస్తారని ఆయన ప్రశ్నించారు. అలాగే ఆర్టికల్‌ 370 ‌గురించి మాట్లాడుతూ.. మళ్లీ కొన్ని ప్రత్యేక హక్కులను కట్టబెడుతూ ఆ అధికరణ తిరిగి వస్తుందని కశ్మీర్‌ ‌ప్రజలు అనుకోవద్దనీ, దానిని మరచిపోవడం మంచిదని చెప్పారు.

కాస్త వేచి ఉంటే ఇంకొన్ని వాస్తవాలు బయటపడతాయని కూడా ఆశించవచ్చు. కశ్మీర్‌ ‌ఫైల్స్ ‌సినిమా అబద్ధాల పుట్ట అని కొందరు కాంగ్రెస్‌ ‌నాయకులే కారుకూతలు కూస్తుంటే అదే పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు వివేక్‌ ‌తన్ఖా పండిత్‌ల సామాజిక, రాజకీయ, ఆర్థిక పునరావాసానికి ఉద్దేశించిన బిల్లును ఏప్రిల్‌ 1‌న రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఇది ప్రైవేటు మెంబర్‌ ‌బిల్లు. వివేక్‌ ‌తన్ఖా రాజ్యసభలో ఉన్న ఏకైక కశ్మీరీ పండిత్‌. ఈ ‌బిల్లు పేరు ‘కశ్మీరీ పండిత్‌ ‌రికోర్స్, ‌రిస్టిట్యూషన్‌, ‌రిహ్యాబిలిటేషన్‌, అం‌డ్‌ ‌రీసెటిల్‌మెంట్‌ ‌బిల్‌ – 2022’. అన్యాక్రాంతమైపోయిన పండిత్‌ల ఆస్తులు ఇప్పించడం, వారికి దూరమైన సంస్క్సతికి వారిని మళ్లీ చేరువ కావించడం, వారి వారసత్వ సంపదను కాపాడడం ఈ బిల్లు ఉద్దేశం. అలాగే పునరావాసం, భద్రతలను కూడా ఈ బిల్లు కోరుతోంది. పండిత్‌ల ప్రయోజనాల గురించి సిఫారసులు చేయడానికి 21 మంది ప్రతినిధులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని కూడా వివేక్‌ ‌తన్ఖా కోరుతున్నారు.

పండిత్‌ల ఊచకోత మీద జ్యుడిషియల్‌ ‌ట్రిబ్యునల్‌ను కూడా నియమించాలని ఈ బిల్లు ద్వారా వివేక్‌ ‌కోరుతున్నారు. పండిత్‌లు తిరిగి స్వస్థలానికి వెళ్లడానికి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం చేసినదేమీ లేదని ఈ బిల్లును ప్రవేశపెట్టిన కాంగ్రెస్‌ ‌సభ్యుడే ఆరోపించడం విశేషం. ఇదే విమర్శ బీజేపీ కూడా చేసింది. కాగా, తాను ప్రవేశపెడుతున్న ఈ బిల్లుకు బీజేపీ మద్దతు ఇవ్వాలని వివేక్‌ ‌తన్ఖా విజ్ఞప్తి చేశారు. 1990 ఊచకోతలో వివేక్‌ ‌తన్ఖా కుటుంబం కూడా చెల్లాచెదురయింది.

వివేక్‌ అగ్నిహోత్రి ఇస్లామోఫోబియా కోసమే ఈ సినిమా నిర్మించారని చాలామంది ఉదారవాదులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టులు, టుక్డే టుక్డే గ్యాంగ్‌ ఆప్తులైన ప్రముఖులు, కేజ్రీవాల్‌ ‌వంటి విద్రోహపు నాయకులే ఈ మాట అంటున్నారు. కనీస మానవత్వాన్ని కూడా మరచిపోయి సినిమాను విమర్శించడం ద్వారా పండిత్‌ల కడగండ్లను కూడా అవహేళన చేస్తున్నారు. ఇంతకీ, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్ ‌ముస్లిం దేశమే. అక్కడ కశ్మీర్‌ ‌ఫైల్స్‌ను వారం రోజుల పాటు శల్య పరీక్ష చేసి ఒక్క కత్తిరింపును కూడా సూచించకుండా విడుదల చేయడానికి అనుమతించారు.

ఇంకెక్కడి ఇస్లామోఫోబియా? కానీ ఈ దేశంలో మతోన్మాదమే ధ్యేయంగా, భారతీయత మీద, హిందుత్వం మీద విషం చిమ్మే ఎస్‌డీపీఐ కశ్మీర్‌ ‌ఫైల్స్‌ను నిషేధించా లంటూ బ్యానర్లు పట్టుకుని ఊరేగింది. ఎమిరేట్స్‌తో పాటు సింగపూర్‌ అధికారులు కూడా క్లీన్‌ ‌సర్టిఫికెట్‌తో సినిమా విడుదలకు అనుమతించారు. అమెరికా ఇంత క్రితమే ఆ చిత్రం విడుదలకు అనుమతించింది. మరుగున పడిన ఒక వాస్తవాన్ని వెండితెర మాధ్యమంగా ప్రపంచం ముందుకు తెచ్చినందుకు దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రిని ఆకాశానికి ఎత్తుతున్నారు. పండిత్‌ల ఊచకోత గురించి తమకు వివరించవలసిందిగా బ్రిటిష్‌ ‌పార్లమెంట్‌ ‌వివేక్‌ అగ్నిహోత్రినీ, ఆయన సతీమణి, నటి పల్లవీజోషినీ ఆహ్వానించింది. ఏప్రిల్‌లోనే వారు పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు కూడా. ఏమైనా ఈ దేశంలో ముస్లిం మతోన్మాదం సంగతి, అదే సమయంలో హిందువుల, కశ్మీర్‌ ‌పండిత్‌ల వాస్తవ స్థితి ప్రపంచానికి తెలియడం ఖాయం. అందుకు దోహదం చేస్తున్న కశ్మీర్‌ ‌ఫైల్స్ ‌రూపకర్తలకు ధన్యవాదాలు చెప్పాలి. దొంగ సెక్యులరిజం, పక్షపాత హక్కుల ఉద్యమాలు, ఉదారవాదం పేరుతో హిందూత్వం మీద దుష్ప్రచారం ఇప్పటికైనా తగ్గితే భారతీయులు సంతోషిస్తారు.

About Author

By editor

Twitter
Instagram