ఎన్నికల రాజకీయాలకీ, తిరోగమన రాజకీయాలకీ, స్వార్థ రాజకీయాలకీ మన దేశంలో కావలసినంత చెలామణి ఉంది. చట్టబద్ధంగా ఎన్నికైన పార్లమెంటు చేసిన చట్టాలను రోడ్ల మీద సవాలు చేసే అప్రజా స్వామిక ధోరణి దేశంలో బాగా పెరుగుతోంది. అందుకు నిదర్శనం రైతు ఉద్యమం పేరుతో బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు చట్టాల మీద జరిగిన దుష్ప్రచారం. అంతేకాదు, ప్రతిపక్షాలది తప్పిదమని ఇటీవలి కాలంలో చాలాసార్లు రుజువైంది. కానీ అందుకు కనీస బాధ్యత వహిస్తూ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పే సంస్కృతి కూడా లేదు. వీటన్నిటికీ పెద్ద దృష్టాంతమే రైతు సంస్కరణల చట్టాలు. ఆ చట్టాల వినియోగం, మేలు మీద సిఫారసులు చేయడానికి ఉద్దేశించిన సుప్రీం కోర్టు సంఘమే ఇప్పుడు వాటి రద్దుతో రైతుకు జరిగేది అన్యాయమేనని చెప్పింది. మార్చి 22వ తేదీన ఆ కమిటీ నివేదికలోని అంశాలు మీడియాలో వచ్చాయి. కానీ ఏది? ఆనాడు అంత రగడ సృష్టించిన ఒక్క రాజకీయ పార్టీ కూడా మాట్లాడదేమి? ఎర్రకోట మీదనే దాడికి దిగిన ఆ చురుకైన రైతులు, వారి నాయకులు ఏమయ్యారు?

సాగుచట్టాలపై వేసిన కమిటీ నివేదికను సుప్రీంకోర్టు ప్రచురించి ఉంటే రైతులను విద్యావంతులను చేసి ఉండేదని, చట్టాల వల్ల కలిగే లబ్ధి అర్ధమయ్యేటట్టు చేసేదని సుప్రీంకోర్టు సంఘం సభ్యుడు అనిల్‌ ‌ఘన్వాత్‌ అన్నారు. వీటి రద్దు సైలెంట్‌ ‌మెజారిటీ విషయంలో అన్యాయం. కమిటీకి అభిప్రాయాలను తెలియచేసిన 73 రైతు సంఘాలలో 61 సంఘాలు సాగుచట్టాలను పూర్తిగా సమర్థిం చాయి. వీటిలో సభ్యులు 3.3 కోట్లు. ఆందోళనలో ఉన్నవారు ప్రధానంగా పంజాబ్‌, ఉత్తర భారతదేశం నుంచి వచ్చారు. కనీస మద్దతు ధర అంశం ప్రమాదంలో పడిందంటూ వీరికి సోషలిస్ట్, ‌కమ్యూనిస్టు నాయకులు అబద్ధాలు చెప్పి, పెడతోవ పట్టించారని చెప్పారు. ఈ చట్టాలను రద్దు చేయడంలో మోదీ ప్రభుత్వానిది రాజకీయ తప్పిదమేనని కూడా అనిల్‌ ‌ఘన్వాత్‌ అభిప్రాయం వ్యక్తంచేశారు.

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌బాబ్డే నాయకత్వంలో కేంద్రం నియమించిన ఈ కమిటీ గత ఏడాది మార్చి 19న నివేదిక ఇచ్చింది. సాగు చట్టాల రద్దు సరికాదని, ఇందువల్ల రైతులకు అన్యాయమే జరుగుతుందని నిర్ద్వంద్వంగా చెప్పింది. చట్టాలను రద్దు చేయడం కంటే అమలు, రూపకల్పనలలో రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించా లని సిఫారసు చేసింది. రద్దు చేయడం, చిరకాలం అమలు చేయకుండా ఉంచడం కూడా రెండూ రైతులకు అన్యాయం చేస్తాయనే కమిటీ అభిప్రాయ పడింది. ప్రతిపక్షాలు, రైతు నేతలుగా చెలామణి అయిన విద్రోహులు విపరీతంగా ప్రచారం చేసిన భూములు లాగేసుకోవడం అంశం మీద కూడా కమిటీ మంచి సూచనలు చేసింది. రైతులకు ధరల హామీ ఒప్పందం, వ్యవసాయ సేవల చట్టం2020 కింద భూములు తీసేసుకుంటారంటూ రైతులలో వచ్చిన భయాలను తొలగించడానికి అవగాహన కల్పించి ఉండాల్సిందని కమిటీ చెప్పింది. మొత్తంగా సాగు చట్టాల విషయంలో ఈ దేశ జనాభాను, రైతాంగాన్ని విపక్షాలు, దొంగ రైతు నేతలు దగా చేశారని రుజువైంది. ఈ దేశంలో రైతు సంక్షేమం కంటే తాము వ్యతిరేకించే పార్టీ కేంద్రంలో ఉండరాదన్నదే వారందరి ధ్యేయంగా కనిపిస్తున్నది. బీజేపీని వ్యతిరేకించాలనుకుంటే వ్యతిరేకించవచ్చు. కానీ అందుకు రైతుల సంక్షేమానికి ఇంతకాలానికి వచ్చిన మంచి అవకాశాన్ని ఆ కుహనా నేతలు చెడగొట్టారు. ఇప్పుడు ప్రత్యామ్నాయం ఏమిటి?

స్వాతంత్య్రానంతరం, అధిక ఆహారోత్పత్తికి ప్రాధాన్యతనిచ్చి స్వయం సమృద్ధి సాధించిన మన దేశం, వ్యవసాయరంగానికి దశ దిశ కల్పించలేక పోయింది. రైతాంగంలో అధికశాతం నిరక్షరాస్యులు. దీంతో నేటికీ మూసపద్ధతికి అలవాటుపడి, సేద్యాన్ని లాభసాటిగా స్థిరమైన ఆదాయాలు దక్కించుకోలేక పోతున్నారు. అయిదున్నర దశాబ్దాలనాడు, ఆకలి కోరలలో చిక్కుకొన్న దేశంలో హరిత విప్లవం పాదుకొన్నా, లక్షలాదిగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం చారిత్రక వాస్తవం. రుణాల ఊబిలో చిక్కుకొన్న రైతులు అధిక వడ్డీల భారంతో కుంగి, కృశించి నిరాశా నిస్పృహలతో బలవన్మరణా లకు పాల్పడటం అభివృద్ధి చెందుతున్న దేశానికి సవాలుగా మారింది. ఈ సంక్షోభాన్ని పరిష్కరిం చటం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తక్షణ కర్తవ్యమ యింది. రైతు జీవన భద్రత, జాతికి ఆహార భద్రతలకు భరోసా ఇస్తూ సేద్యానికి ఊపిరి అందించే లక్ష్యానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉండటంతో, వ్యవసాయ రంగంలో కొత్త సంస్కరణల అమలు కార్యాచరణ, 2022 నాటికి అన్నదాతల ఆదాయాన్ని రెండింతలు చేయాలనే సత్సంకల్పంతో మోదీ సర్కారు వ్యవసా యంతోపాటు పశుపోషణ, కోళ్లు, మత్స్యసంపద, తేనెటీగల పెంపకంవంటి ఇతర అనుబంధ రంగా లపై పట్టు సాధించే నైపుణ్యతకు శ్రీకారం చుట్టింది. ప్రపంచానికే అన్నపూర్ణగా భారత్‌ ‌భాసిల్లాలనే తపన, లక్ష్యసాధన, కర్షకుల జీవన శ్రేయస్సు దృష్ట్యా కొత్త సంస్కరణల ఆలోచన ఆరంభమైంది.

1960 నుంచి 1980 వరకు భారతీయ వ్యవసాయ రంగం ధరలు, సబ్సిడీలు, పరపతి, విపణి, పరిశోధన, విస్తరణ వంటి మద్దతు విధానా లను అనుసరించి స్వయంసమృద్ధి సాధించింది. 1991 తరువాత పంటల సాగు ఖర్చును, రాష్ట్ర ప్రభుత్వాల సిఫార్సులకు, అంతిమంగా కేంద్ర స్థాయిలో ప్రసాదించే మద్దతు ధరలకు ఆర్థిక సంస్కరణల పుణ్యమా అని ఎక్కడా పొంతన లేకుండా రైతాంగం దిగుబడులు సాధించినా ఆర్థిక దైన్యావస్థలో చిక్కుకున్నారు. ఆరున్నర దశాబ్దాలనాడు స్థూల దేశీయోత్పత్తిలో 56.5 శాతంగా ఉన్న వ్యవసాయ రంగం వాటా 14 శాతానికి కృశించిపోవటానికి, గత ప్రభుత్వాల అసంబద్ధ విధానాలు, ప్రకృతి వైపరీత్యాలు, ఏటికి ఏడాది తడిసి మోపడవుతున్న ఖర్చులు కారణం. గిట్టుబాటు ఎండమావి అయి రుణభారంతో దిక్కుతోచని దుస్థితి నెలకొన్నది. 1995-2010 సంవత్సరాలలో రైతుల ఆత్మహత్యల సంఖ్య ఎన్‌సిఆర్‌బి నివేదిక ప్రకారం 2,56,913 కాగా, తదనంతర దశాబ్దంలో కూడా ఏటికేడాది మరింత పెరుగుతూనే ఉన్నాయి.

జాతీయ ఆహారభద్రత చట్టం (2013) కొవిడ్‌ ‌కోరలు చాచిన తరుణంలో పేద ప్రజలు, ఆకలి మంటలకు గురికాకుండా ఆదుకొంది. వ్యవసాయ సంక్షోభం నుంచి రైతాంగాన్ని రక్షించటానికి నేషనల్‌ ‌కమిషన్‌ ఆన్‌ ‌ఫార్మర్స్ ‌ఛైర్మన్‌గా డా।। ఎంఎస్‌ ‌స్వామినాథన్‌ 2006‌లో మద్దతు ధర నిర్ధారణ ఏ ప్రాతిపదికన ఉండాలో సూచించారు. గిట్టుబాటు ధర రైతు జీవితానికి ప్రాణాధారం. పండించిన పంటకు సరైన ధర రాని కారణంగా, దశాబ్దాల తరబడి భారత వ్యవసాయ రంగంలోని రైతాంగానికి ప్రాణభద్రత కల్పించటం ప్రభుత్వాల కర్తవ్యం అయింది. వాస్తవిక సేద్య వ్యయాన్ని నిక్కచ్చిగా మదింపువేసి, అదనంగా 50శాతం లాభం జతచేసి సహేతుకమైన మద్దతు ధర అమలు జరపటంలో నాటి కేంద్రం విఫలమైంది.

రైతు ఆదాయాలను రెట్టింపు చేస్తానన్న ప్రధాని మోదీ హామీ దేశ రైతాంగం పాలిట సరికొత్త ఆశాకిరణం అయింది. ఆహారోత్పత్తుల ఎగుమతులు పెంచటానికి 2018లో ఎనిమిది రకాల పంటలకు విడివిడిగా ఎగుమతి ప్రోత్సాహక వేదికలను కేంద్ర వ్యవసాయ శాఖ ఏర్పాటుచేసింది. కాని ప్రస్తుత మార్కెటింగ్‌ ‌వ్యవస్థ సన్న చిన్నకారు రైతులకు అనుకూలంగా లేదు. ప్రపంచంలోనే అత్యంత భారీ పంటల బీమా పథకాల్లో ఒకటైన ప్రధానమంత్రి పసల్‌ ‌బీమా యోజన (పిఎంఎఫ్‌బీవై) 2016 ఫిబ్రవరిలో ప్రాణం పోసుకొంది. కాని చాలా రాష్ట్రాలు తమవంతు వాటా ప్రీమియం చెల్లించటంలో వెనుకంజ వేశాయి. కొవిడ్‌ ‌ప్యాకేజిలో భాగంగా రూ.30వేల కోట్లతో ప్రత్యేకంగా నాబార్డు రైతులకు రుణాలు సమకూర్చింది. ఏది ఏమైనా ఆధునిక సాంకేతికత, మార్కెట్‌ ‌యార్డుల బలోపేతం, వ్యవసాయ సంస్కరణల ఆవశ్యకతను కేంద్రం గుర్తించింది.

 2018 ఆర్థిక మందగతి నుంచి ప్రపంచం పూర్తిగా కోలుకోకముందే కొవిడ్‌ ‌వచ్చిపడింది. వ్యవసాయ దిగుబడులు, సంస్థాగత రుణాలు, ప్రభుత్వ ఆర్థిక సహాయం గ్రామీణాభివృద్ధికి 2020లో కేంద్ర వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి శాఖ రూ.90 వేల కోట్లు ఖర్చు పెట్టడం, గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 130 కోట్ల పని దినాలు కూడా సృష్టిం చింది. కాని కనీస మద్దతు ధర ఉత్పత్తి వ్యయంకంటే ఎక్కువగా నిర్ణయిస్తే సాగు వ్యవసాయం భారం అవుతుందని, ద్రవ్యోల్బణం పెరుగుతుందని, ధరలు విజృంభిస్తాయని ఆర్థికశాస్త్రవేత్తలు డా।। అరవింద్‌ ‌సుబ్రహ్మణ్యం, డా।। అరవింద్‌ ‌సనగ జియాలు 2014 నవంబరులో హెచ్చరించారు. ప్రపంచ వాణిజ్య సంస్థ షరతుల కారణంగా భారత ప్రభుత్వం పంటలకు ఎంఎస్‌పీని తక్కువగా నిర్ణయిస్తోందనే ఆరోపణ కూడా ఉంది. భారత వ్యవసాయ రంగ ఉత్పాదకతను పెంపొందింపచేసి, స్థిరాభివృద్ధితో, ఏటా మద్దతు ధరకు పంటల కొనుగోలు వ్యవహారం రైతులకు, ప్రభుత్వానికి మధ్య తీవ్ర నిరసనలకు దారితీస్తు న్నందున కొత్త చట్టాల రూపకల్పనకు మోదీ ప్రభుత్వం, బలహీన విపణులను పటిష్టపరిచి, మార్కెట్‌లతో పనిలేకుండా రైతు ఎక్కడైనా స్వేచ్ఛగా అమ్ముకోవడానికి రైతాంగానికి కొత్త భరోసా కల్పించాలని నిర్ణయించింది.

మార్కెట్‌ ‌కమిటీల సంస్కరణ

దేశంలో అన్ని రంగాలకు తమ వస్తూత్పత్తులను అమ్ముకొనే విషయంలో పూర్తి స్వేచ్ఛ ఉన్నప్పుడు రైతులకూ ఆ అవకాశం ఇవ్వాలని, వ్యవసాయాన్ని వాణిజ్యంపరంగా ఒప్పంద సేద్యం అమలు తెరపైకి తెచ్చింది. అధునాతన వ్యవసాయ పరిజ్ఞాన్నాని కంపెనీ రైతుకు అందించి, కోత అనంతరం దాని తరలింపు నకు రవాణా, శుద్ధి, నిల్వ, ఎగుమతి ఖర్చులన్నీ కంపెనీ భరించాలి. ప్రభుత్వ రాయితీలు పొందే విధంగా రైతులకు కంపెనీ సహాయపడాలి. పంట కోసిన తరువాత పాడైతే రైతుకు సంబంధం లేదు. కనీస పూచీకత్తు ధర కంటే మార్కెట్‌లో ఎక్కువ ఉంటే అదనంగా ధర పెంచి రైతుకు చెల్లించాలి. కొన్న వెంటనే సొమ్ము చెల్లించాలి.

2020 సెప్టెంబరులో లోక్‌సభ, రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లులు దళారుల నుంచి రైతులకు రక్షణ కవచంలా దోహదపడుతాయని కేంద్రం భావించింది. కాని 2020 సెప్టెంబరు నుంచి ఎఐకెఎస్‌సిసి ఒక ఏడాదిపైగా ప్రజ్వరిల్లిన నిరస నోద్యమాల కారణంగా 2021 నవంబరు 19న, సాగుచట్టాల రద్దు చరిత్రాత్మక పరిణామంగా రైతుల కోరికను ప్రభుత్వం మన్నించింది.

వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, ఉత్పత్తి వాణిజ్యాలకు, స్వేచ్ఛకు కీలక సంస్కరణలు, దళారుల వర్తక ముఠాల కబంధ హస్తాల నుంచి రైతులకు విముక్తికి ఉద్దేశించినవే. వ్యవసాయరంగం సరఫరా గొలుసు వ్యవస్థగా సరియైన మార్గాలతో పెట్టుబడుల పెంపునకు, పోటీతత్వం ఏర్పడి అస్థిరత పోగొట్టేం దుకు అవకాశం ఉంది.

ప్రస్తుతం వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న అనిశ్చితి తొలగి సంస్కరణల కారణంగా ఇ- వర్తకానికి సంబంధించి స్పష్టమైన విధి విధానాలకు ఆస్కారం ఉంది. ఇప్పుడు కొంత వరకు అంతరాష్ట్ర వ్యాపారం ఉన్నా, చాలా రాష్ట్రా లలో ఉత్పత్తులు మార్కెటు, మండీలలో మాత్రమే అమ్ముకోవాల్సి వస్తోంది. అంతరాష్ట్ర అడ్డంకులు తొలగిస్తే, కొనుగోలుదారులు నేరుగా రైతు వద్దకు వెళ్లి కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యవసాయ సరఫరా గొలుసు వ్యవస్థలను పూర్తి స్తాయిలో ప్రక్షాళించటంతోపాటు, మరింత సమర్థవంతంగా పనిచేయటానికి, వినియోగదారులపై మరింత భారం పడకుండా చిన్న రైతులకు గిట్టుబాటు లభిస్తుంది. ఏది ఏమైనా సేద్య సంస్కరణలు, వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించే విధానాలకు ఈ చట్టాల రద్దు స్వస్తి పలికించింది. 86శాతం ఉన్న సన్న చిన్నకారు రైతాంగానికి, బడుగు రైతులకు సంస్కరణలు రక్షా కవచాలుగా ఉంటాయని ఆశించారు. సంస్కరణలపై సరియైన అవగాహన, అధ్యయనం, శిక్షణ, సామర్థ్యం, ఆలోచనలు యువతకు కలిగించటంతో వైఫల్యం, చట్టాల రద్దుకు దారితీసిందనిపిస్తోంది.

2022-23 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని 2016లో ప్రభుత్వం ప్రకటించింది. అది ప్రస్తుత పరిస్థితులలో సాధ్యం కాదనిపిస్తోంది. భవిష్యత్తులో పంటలకు కనీస మద్దతు ధరలు ఉండవని రైతులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలో వరల్డ్ ‌ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ ‌సంబంధిత ఎఒఎ, ఎమ్‌ఎస్‌పి కొనుగోళ్లను, గ్రీన్‌బాక్స్ ‌సబ్సిడీగా సవరించవలసి ఉంది. సాగు చట్టాల రద్దు సందర్భంలో ప్రధాని మోదీ, జాతికి క్షమాపణలు వ్యక్తం చేస్తూ, కొందరు రైతాంగ సోదరులను ఒప్పించలేకపోయానని అంటూ ఈ చట్టాలు దివ్వె నుంచి వెలువడే కాంతిలా స్వచ్ఛమైన దని పేర్కొన్నారు. గత ఏడాదిగా కొనసాగిన ఆందోళనలో 700మంది రైతుల బలిదానం మాత్రం విషాదకరం.

– జయసూర్య, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram