సంపాదకీయం

శాలివాహన 1944 శ్రీ శుభకృత్‌ ‌చైత్ర  బహుళ  విదియ

18 ఏప్రిల్‌ 2022, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌

———————————————————-

‌పేదల సేవ, పరిశోధన, గిరిజనాభ్యున్నతి-పేరు ఏదైనా కావచ్చు. వాటిని అడ్డం పెట్టుకుని కొన్ని ఎన్‌జీవో (ప్రభుత్వేతర సంస్థ)లు భారత సార్వభౌమాధి కారాన్ని సవాలు చేస్తున్నాయి. అవి భారతజాతి సమైక్యతకు చేటు చేసేవేననీ గత నాలుగున్నర దశాబ్దాలుగా వినిపిస్తున్న విమర్శలు. ఈ ఎన్‌జీవోలకు ఊపిరి విదేశీ విరాళాలు. వీటి లావాదేవీల మీద ప్రభుత్వ అజమాయిషీ ఏమిటంటూ కొన్ని ఎన్‌జీవోల నిలదీయడమే పెద్ద వింత. ఏప్రిల్‌ 8‌న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇలాంటి ఎన్‌జీవోల మోసాలనీ, వాదాలనీ నిలువునా పాతరేసింది. విదేశీ విరాళాల స్వీకరణ పౌరుల తిరుగులేని హక్కేమీ కాదని అత్యున్నత న్యాయస్థానం తెగేసి చెప్పింది. వీటిని అనుమతించాలా వద్దా అనేది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయమేనని చాటింది. దేశ శ్రేయస్సును కాంక్షించే తీర్పు ఇది.

మతం మార్పిళ్లు, ఉగ్రవాదానికి అండగా ఉండడం, స్థూల జాతీయోత్పత్తినే ప్రభావితం చేసే విధంగా దేశ ప్రతిష్టను ప్రపంచం ఎదుట దిగజార్చడం వంటి నీచత్వం వెనుక ఎన్‌జీవోలు ఉంటున్నాయన్నది కఠోర వాస్తవం.

ది ఫారిన్‌ ‌కంట్రిబ్యూషన్‌ (‌రెగ్యులేషన్‌) ‌యాక్ట్ (ఎఫ్‌సీఆర్‌ఏ) ‌మేరకు రిజిస్ట్రేషన్‌ ‌లేదా లైసెన్స్ ఉం‌టే ఎన్‌జీవోలు విదేశీ నిధులు పొందవచ్చు. ఆ అనుమతిని పొడిగించుకోవచ్చు. ఎఫ్‌సీఆర్‌ఏను 1976లో పార్లమెంట్‌ ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం రాజకీయ పార్టీలు, రాజకీయ స్వభావం కలిగిన సంస్థలు, ప్రభుత్వోద్యోగులు, న్యాయమూర్తులు, కరస్పాండెంట్లు, కాలమిస్ట్‌లు విదేశీ నిధులు స్వీకరించడం నిషిద్ధం. విదేశీహస్తం ఆరోపణ నేపథ్యంలో, అత్యవసర పరిస్థితి పతాకస్థాయిలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ ఈ చట్టం తీసుకువచ్చారు. మార్చి 9, 1975న రాజ్యసభలో ఈ బిల్లు మీద చర్చ జరిగినప్పుడు సీఐఏ పేరు కనీసం 30 పర్యాయాలు ప్రస్తావనకు రావడం విశేషం. ప్రచ్ఛన్నయుద్ధం నేపథ్యంలో కొన్ని దేశాల ప్రభుత్వాలను కొనుగోలు చేయడానికి డాలర్లను వెదజల్లారని విమర్శ. 2010లో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వమే ఈ చట్టాన్ని సవరించింది. 2020లో ఎన్‌డీఏ ప్రభుత్వం మరొక సవరణ తెచ్చింది. ఈ సవరణ మీద దాఖలైన నోయెల్‌ ‌హార్పర్‌ ‌వర్సెస్‌ ‌కేంద్రం వ్యాజ్యంలో తాజాగా సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. విరాళం ఉద్దేశం ఏమిటో దాత వెల్లడించకపోతే ఆ మొత్తాన్ని స్వీకరించడానికి అనుమతించరాదని 2021లోనే సుప్రీంకోర్టు చెప్పింది.

విదేశీ విరాళాల మీద తాజా రగడకు కారణం మమతా బెనర్జీ. కలకత్తా కేంద్రంగా పనిచేసే మదర్‌ ‌థెరిసా ట్రస్ట్ ‌లైసెన్సును కేంద్రం రద్దు చేసింది. దేశంలోని 12,000 సంస్థల లైసెన్సులు జనవరి 1, 2022 నాటికి కాలదోషం పట్టాయి. వాటికి విదేశీ నిధులు అందుకొనే అర్హత లేదని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఇందులో థెరిసా మిషనరీస్‌ ఆఫ్‌ ‌చారిటీస్‌ ఒకటి. నిజానికి సెప్టెంబర్‌ 29, 2020-‌డిసెంబర్‌ 31,2021 ‌నడుమ మొత్తం 18,778 సంస్థల లైసెన్సులు మురిగిపోయాయి. 12,989 సంస్థలు వాటి పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకోగా, 5,789 సంస్థలు చేయలేదు. సాంకేతిక కారణాలతో 179 పునరుద్ధరణ దరఖాస్తులను తోసిపుచ్చారు. ఇదీ వాస్తవం. కానీ దీనికి మమత, కేజ్రీవాల్‌ ‌హిందుత్వ రంగు పులమబోయారు. గ్లోబల్‌ ‌పీస్‌ ‌ఫౌండేషన్‌ ఇనిషియేటివ్‌ ‌కొవిడ్‌ అం‌తమయ్యే వరకు విదేశీ నిధులు అందుకోవడానికి అనుమతించాలని కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ అంశం ప్రభుత్వంతో మాట్లాడుకోవలసిందని సుప్రీంకోర్టు 6000 ఎన్‌జీవోలకు సూచించింది. అసలు వీటికి అందుతున్న నిధులు ఎన్ని?

ఆగస్ట్ 11, 2021‌న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ ‌పార్లమెంటుకు చెప్పిన ప్రకారం 2017-18లో రూ. 16,940.58 కోట్లు, 2018-19లో రూ. 16,525.73 కోట్లు, 2019-20లో రూ.15,853.94 కోట్లు ఇక్కడి ఎన్‌జీవోలు అందుకున్నాయి. ఎఫ్‌సీఆర్‌ఏ ‌చట్టానికి 2020 సవరణ ప్రకారం నిధులు తెచ్చుకునే ప్రతి ఎన్‌జీవోకు ఢిల్లీలోని ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయంలో ఖాతా ఉండాలి. ఇదే ఎన్‌జీవోలకు నచ్చడం లేదు. ఎందుకు?

కొవిడ్‌ ‌సహా పలు సంక్షోభాలలో దేశం చిక్కుకున్నప్పుడు 3.4 మిలియన్‌ ‌ప్రజలను ఎన్‌జీవోలే ఆదుకున్నాయని కొందరు వెనకేసుకొస్తున్నారు. వీటి పట్ల మోదీ ప్రభుత్వ ఆలోచన మారాలని అంటున్నారు. నిజంగానే ఎన్‌జీవోలన్నీ పేదల సేవలో తరిస్తున్నాయా? గిరిజనులను ఉద్ధరిస్తున్నాయా? కచ్చితంగా కాదు. 2009 నాటి ప్రభుత్వ ఆడిట్‌ ‌ప్రకారం 883 ఎన్‌జీవోలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాయి. గుజరాత్‌లో ఒక మిషనరీ నడిపే ఎన్‌జీవోలో బాలికలను మతం మార్చారన్న అరోపణ ఉంది. అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌, ‌యాక్షన్‌ ఎయిడ్‌, ‌గ్రీన్‌పీస్‌ ‌చేసిన భారత వ్యతిరేక ప్రచారంతో 2-3 శాతం జీడీపీ పడిపోయిందని 2014లో బయటపడింది. షాహీన్‌బాగ్‌ ‌దాష్టీకం, దొంగ రైతు ఉద్యమం, ఇటీవలి కర్ణాటక మత ఘర్షణల వెనక కొన్ని ఎన్‌జీవోలు ఉన్నాయని కూడా రుజువైంది. నిషేధానికి గురైన కొన్ని ఎన్‌జీవోలూ, వాటి తప్పుడు పనులూ దేశానికి తెలుసు.

2019లో రాజ్యసభలో ప్రభుత్వం ఇచ్చిన వివరణ ప్రకారం ఆ ఐదేళ్లలో 14,500 ఎన్‌జీవోలను విదేశీనిధులు తీసుకోకుండా నిషేధించారు. 1808 సంస్థలకు లైసెన్సు రద్దయింది. భారతదేశంలో దాతృత్వ కార్యకలాపాల మీద సర్వే చేసిన బెయిన్‌ అం‌డ్‌ ‌కంపెనీ చెప్పిన ప్రకారం 2015-2018 మధ్య 40 శాతం సంస్థల విదేశీ విరాళాల మీద వేటు పడింది. ఇప్పుడు జరిగిందే మిటి? సేవ పేరుతో, హక్కుల పేరుతో, మైనారిటీలకు సాయం పేరుతో దేశ ప్రజల మెదళ్లనిండా విషం నింపే కుట్రకు సుప్రీంకోర్టు స్వస్తి పలకడమే. ఆ దుర్మార్గపు పని మరొక మార్గంలో జరగకుండా మాత్రం చూడాలి.

By editor

Twitter
Instagram