25 ఏప్రిల్‌ 2022, ‌సోమవారం

శాలివాహన 1944 శ్రీ శుభకృత్‌ ‌చైత్ర  బహుళ దశమి

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


‌కరోనా కోరలు దిగి విలవిలలాడిన భారత్‌ను తక్కువ నష్టంతో బయట పడేసిన ఘనత నిస్సందేహంగా నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వానిదే. వృత్తులు చతికిల పడ్డాయి. ఉత్పత్తి లేదు. కొనుగోలు శక్తి శూన్యస్థితికి వచ్చింది. ఇలాంటి స్థితికి ఫలితం ఒక్కటే-దారిద్య్రం. కనీవినీ ఎరుగని అలాంటి సంక్షోభం రెండేళ్లు కుదిపేసినా అతి దారిద్య్రాన్ని భారతదేశం దాదాపు నిర్మూలించింది. వినియోగ అసమతౌల్యాన్ని 40 ఏళ్ల కనిష్టానికి తీసుకురాగలిగింది. దారిద్య్రం కూడా 2011-2019 మధ్యకాలంలో 12.3 శాతం తగ్గింది. ఇదంతా ప్రభుత్వం అందించిన, అందిస్తున్న ఆహార పథకంతో సాధ్యమైంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) ఈ ఏ‌ప్రిల్‌ 7‌న విడుదల చేసిన పత్రం (పాలసీ రిసెర్చ్ ‌వర్కింగ్‌ ‌పేపర్‌) ఈ ‌విషయాలను వెల్లడించింది. ప్రఖ్యాత ఆర్థికవేత్తలు సుజిత్‌ ‌భల్లా, అరవింద్‌ ‌వీర్‌మణి, కరణ్‌ ‌భాసిన్‌ ఈ ‌పత్రాన్ని రూపొందించారు.

 భారతదేశంలో అతి దారిద్య్రం కింద నివసిస్తున్నవారు ప్రస్తుతం ఒక శాతం కంటే తక్కువేనని ఆ పత్రం చెబుతోంది. కరోనా వంటి ఘోర సంక్షోభంలో కూడా ఆ అతి దారిద్య్రం ఒక శాతం లోపులోనే ఉన్నదంటే అందుకు కారణం- ప్రభుత్వం ఇచ్చిన ఆహార సరఫరా, రాయితీయేనని ఆ ఆర్థికవేత్తలు చెప్పారు. ఇందులో సంతోషించవలసిన అంశం, ఈ తగ్గుదల గ్రామాలలోనే ఎక్కువ. ఆశ్చర్యకరంగా కరోనా వేళ అసమానతలు తగ్గాయని నేషనల్‌ ‌బ్యూరో ఆఫ్‌ ఎకనమిక్‌ ‌రిసెర్చ్ ‌సంస్థ కూడా ఇంతకు ముందే తన అధ్యయనంలో వెల్లడించింది.

వాషింగ్టన్‌ ‌డీసీలోని ప్రపంచ బ్యాంక్‌ ‌కార్యాలయం మీద ఒక నినాదం కనిపిస్తుంది. అది-‘మన స్వప్నం దారిద్య్రం రహిత ప్రపంచం’. అలాంటి గొప్ప కలను సాకారం చేయడంలో ఎంతో ముందడుగు వేసినట్టు 2016లో ఆ బ్యాంక్‌ ‌ప్రకటించగలిగింది. ఆ సంవత్సరంలోనే మొదటిసారిగా ప్రపంచంలో అతి దారిద్య్రం స్థాయి పది శాతానికి దిగువన నమోదైంది. అంతకు ముందు- 1981లో 44 శాతం ఉన్న అతి దారిద్య్రం, 1990 నాటికి 37 శాతానికి తగ్గింది. ఇంతకీ అతి దారిద్య్రం అంటే ఏమిటి? ఇది అంతర్జాతీయ దారిద్య్ర రేఖ ఆధారంగా నిర్దేశించినదే. రోజుకు 1.9 డాలర్ల కంటే తక్కువ ఆదాయం, కొనుగోలు శక్తి ఉంటే అలాంటి వారిని అతి దారిద్య్రం అనుభవిస్తున్న వారిగా పరిగణిస్తారు. దారిద్య్రం తొలగే క్రమం ఏమిటి? అది- పేదలకు అవకాశాలను చేరువగా తేవడం. ఆదాయ సృష్టిలో పేదలకూ అవకాశాలను విస్తృతం చేయడం ఆర్థికవృద్ధి బాధ్యత. ఇదే ప్రపంచ దారిద్య్ర నిర్మూలనకు మార్గం.

మోదీ రూపొందించిన ఆహార భద్రత పథకం ‘ప్రధానమంత్రి గరీబ్‌ ‌కల్యాణ్‌ అన్న యోజన’ను ఈ తాజా అధ్యయనం శ్లాఘించింది. కొవిడ్‌ ‌వంటి ఆర్థిక సంక్షోభంలో కూడా అతి దారిద్య్రాన్ని అదుపులో ఉంచినది ఈ పథకమేనని ఆ పత్రం ప్రశంసించింది. ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశంలో కొవిడ్‌ ‌సమయంలో పేద, ధనిక వర్గాల మధ్య అంతరం విపరీతంగా పెరిగిందని కొన్ని అంతర్జాతీయ అధ్యయనాలు ఊదరగొడుతున్న నేపథ్యంలో నిజాలతో ఐఎంఎఫ్‌ ‌పత్రం బయటకు వచ్చింది. ఈ పత్రం ఏప్రిల్‌ 5, 2022‌న వెలువడింది. అతి దారిద్య్రానికి ప్రపంచ బ్యాంక్‌ ఇచ్చిన నిర్వచనం పరిధిలోనే అయినా, భారత జనాభాలో, కొవిడ్‌ ‌సంక్షోభ వేళలోనే దాని బాధితులు 0.8 శాతం. కొవిడ్‌ ‌కరాళనృత్యం చేసిన 2020లో కూడా దేశంలో అతి దారిద్య్రం జూలు విదల్చలేదు. కారణం, ప్రధాని కల్యాణ్‌ అన్న యోజన. ఆహార రాయితీ పథకాన్ని విస్తరింప చేయడం వల్ల సామాజిక భద్రతకు కూడా ఆస్కారం ఏర్పడిందని ఆ పత్రం అంగీకరించింది. ఈ పథకం ఫలితాలు సుస్పష్టంగా ఉన్నాయని కూడా శ్లాఘించింది. రాయితీల సర్దుబాట్లు దారిద్య్రం మీద ఎలాంటి ప్రభావం చూపుతాయి అన్న అంశం కూడా ఈ పత్రం పరిధిలో ఉంది. తలా ఒక్కింటికి, నెలకు ఐదు కిలోల వంతున ఆహారం మీద రాయితీ కల్పించారు. అంటే కుటుంబానికి 25 కిలోల ఆహారం మీద రాయితీ లభిస్తుంది. కొవిడ్‌ ‌సంక్షోభంలోనే 2020లో మోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్‌ ‌కల్యాణ్‌ ‌యోజన పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకాన్ని పటిష్టంగా అమలు పరిచి కుటుంబానికి నెలకు 25 కిలోల వంతున ఉచితంగా ఆహారధాన్యాలను సరఫరా చేశారు. ఈ పంపిణీకి నిబంధనలు కూడా సడలించారు. దీని పరిధి తక్కువేమీ కాదు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అమలైన ఈ పథకంతో 800 మిలియన్‌ల ప్రజలు లబ్ధి పొందారు. దీనిని ఈ సంవత్సరం సెప్టెంబర్‌ ‌వరకు కూడా పెంచి సాధించిన మంచిని నిలబెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు.

భారత్‌ ‌కంటే పాక్‌ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉందని నిస్సిగ్గుగా చాటే అబద్ధాల రాయుళ్ల కళ్లని ఈ పత్రమయినా తెరిపిస్తే మేలే. కానీ మోదీనీ, బీజేపీనీ విమర్శించేవారంతా నిద్ర నటిస్తున్నవారే. కొవిడ్‌ ఇక గతమని ఎవరూ చెప్పకుండానే ఆ వైరస్‌ ‌మరణాల మీద భారత ప్రభుత్వం అబద్ధాలు చెబుతున్నదంటూ తొందరపడి మొరుగుతున్నవారు ముందు ఈ పత్రాన్ని అధ్యయనం చేయడం అవసరం. చిన్న రైతుల కమతాల మీద ఆదాయం పెరిగిన సంగతినీ, పట్టణ ప్రాంత పేదరికం కూడా తగ్గిన వాస్తవాన్నీ కూడా ఐఎంఎఫ్‌ ‌పత్రం చాటింది. దీనికి కంటగించుకోవడం కంటే, వాస్తవాలు చూసి ఆనందించాలి. అంతేకాని, ఇది బీజేపీ ప్రభుత్వం, మోదీ సాధించారు కాబట్టి సంతాపం ప్రకటించాలని చూడడం సరికాదు. బీజేపీ వ్యతిరేకులు ఆ పనికి పాల్పడితే దేశానికి ఈ భావ దారిద్య్ర విపక్షం ఎప్పుడు వదులుతుందా అని జనం ఎదురు చూడవలసి వస్తుంది.

About Author

By editor

Twitter
Instagram