సంపాదకీయం

శాలివాహన 1944 శ్రీ శుభకృత్‌ ‌చైత్ర శుద్ధ  దశమి – 11 ఏప్రిల్‌ 2022, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


రాత్రికి రాత్రే కోటీశ్వరులై పోవచ్చు. నిజానికి కోటీశ్వరులు అన్న మాట  ఇలాంటి వ్యాపారాలలో సంపాదనకి సరితూగని మాటే. ఎన్ని వందల కోట్లు ఎన్ని చేతులు మారతాయో! ఎంత అమానుషమైనప్పటికీ, ఎందరు యువతీయువకుల జీవితాలు సర్వనాశనం అయిపోతున్నప్పటికి ఇలాంటి చీకటి వ్యాపారాలు యథేచ్ఛగా సాగాలంటే ముందు ‘నైతిక విలువలు’ వంటి మాటలకు తుప్పు పట్టించాలి. వాటి మీద చాదస్తం ముద్ర వేయాలి. పాత చింతకాయ పచ్చడి అన్న బిరుదు తగిలించాలి. నైతిక విలువలు అనేవి భ్రమ కాదంటూ  కొందరు సహృదయులూ, పెద్దలూ, కుటుంబ సభ్యులూ చెప్పే హితబోధకు పూచికపుల్ల విలువ లేకుండా చేయాలి. అప్పుడే కదా, మాఫియా రాజ్యాలు పరిఢవిల్లుతాయి. అలాంటి రాజ్యం జాడ ఇప్పుడు హైదరాబాద్‌లోనూ ఊడలు దించుకున్న దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సరిహద్దు రాష్ట్రం పంజాబ్‌ ‘ఉడ్తా పంజాబ్‌’ (‌మత్తుమందులతో యువతరం మునిగితేలడం) అయిందని దేశం తల్లడిల్లిపోయింది. ఇప్పుడు అలాంటి భయంకర నిజమే హైదరాబాద్‌ ‌నగరంలో ఏప్రిల్‌ 3‌వ తేదీన భళ్లుమంది. మత్తు మందులు సేవించారన్న ఆరోపణలతో ఒకే హోటల్‌ ‌నుంచి 150 మంది వరకు యువతీ యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ఇది చాలాకాలంగా సాగుతున్నదట.

ఇలాంటి మాఫియా రాజ్యాలు ఇంతగా ఎలా స్వైరవిహారం చేయగలుగు తున్నాయి? ఇదంతా అధికార పార్టీ అండతోనేనని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఏప్రిల్‌ 3‌న పోలీసులు పట్టుకున్నవారిలో చాలామంది సంఘంలో పరువు ప్రతిష్ట కలిగినవారి పుత్రరత్నాలు, పుత్రికామణులే. ఎంపీలు, ఎమ్మేల్యేలు, మాజీ మంత్రులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తల బంగారు కొండలు, వంశోద్ధారకులు ఇలాంటి దగుల్బాజీ పార్టీలలో పట్టుబడుతున్నారు. పోలీసు ఉన్నతాధికారుల సంతానం మాత్రం తీసిపోయిందా? వాళ్లూ ఉన్నారు. వీరు కాకుండా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు కొందరు ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా పబ్‌ ‌సంస్కృతికి రాజపోషకులుగా మారారు. ఆ మధ్య ఆంధప్రదేశ్‌ ‌మత్తు మందుల పట్టివేతలతో దద్దరిల్లింది. ఇప్పుడు తెలంగాణ.

భారత నాగరికతను దారుణంగా దెబ్బ తీస్తున్నది పబ్‌ ‌సంస్క్సతి. భారతీయత అన్న పదం వినపడగానే కొందరికి  పదిగ్లాసుల నాటు సారా అమాంతం కడుపులో పడినట్టే ఉంటుంది. అంతగా శివాలెత్తుతారు. యువతీ యువకుల స్వేచ్ఛను అడ్డుకోవడమేనంటూ భాష్యం చెబుతారు. ఇక నాలుక చివర ఉండే మాట- ప్రగతి నిరోధకత్వం. ఇదే ప్రగతి అయితే నిరోధించవద్దా? మత్తుమందులతో, మద్యంతో రాత్రంతా తూగుతూ కాలక్షేపం చేస్తే చోటు చేసుకునే విపరిణామాలు ఎలా ఉంటాయో ఊహించడం పెద్ద కష్టం కాదు. కానీ పబ్‌ల మీద దాడిని స్వేచ్ఛ మీద దాడిగా చిత్రించే ఉదారవాదులు ఈ దేశంలో పుట్టుకొచ్చారు. మన సంస్కృతికి ఏమాత్రం సంబంధం లేని జనవరి 1వ తేదీ ఆ ముందురోజు రాత్రంతా పబ్‌లలో, బార్లలో యథేచ్ఛగా ఎగసిపడే మద్యం సీసాల పొంగుల మధ్యనే ప్రవేశిస్తున్నది. ఇంకొందరికి మాత్రం  ప్రతి రాత్రి డిసెంబర్‌ 31 ‌కాబోలు. డ్రంక్‌ అం‌డ్‌ ‌డ్రైవ్‌లో పట్టుబడుతున్న వారి వికార చేష్టలు, నోటి వెంట వచ్చే బూతులు ఎన్నో ప్రశ్నలకు తావిస్తున్నాయి. ఇందులో యువతులు కూడా ఉండడం అత్యంత అవమానకరం. దారుణ విషాదం. ఒక్క రాజకీయ నాయకులనే అంటే మనకి పాపం చుట్టుకుంటుంది. ఈ విష సంస్కృతిని పోషించే వారిలో   పోలీసు పెద్దలు కూడా ఉంటున్నారు. రేవ్‌ ‌పార్టీల పేరుతో సాగుతున్న ఈ భారతీయ వ్యతిరేక పాశ్చాత్య దాడిలో సాంఘిక కాలుష్యం ఎలాంటిది? మత్తు ఎక్కువై రోడ్ల మీద పడిపోతున్న యువతుల గతేమిటి? మత్తు మందులకు బానిసలై  అందుకు డబ్బు లేక నేరాలు చేసే యువత, అదే వ్యాపారంలోకి దిగి కటకటాల పాలౌతున్న విద్యార్థినీ విద్యార్థుల బతుకులు ఎలా తెల్లారతాయి? కన్నవారి కడుపు కోత మాటేమిటి? ఇంకా, ఆ మత్తులోనే ఒళ్లు తెలియని వేగంతో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురౌతున్న యువకుల మాటేమిటి? వీళ్ల నిర్వాకాలతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న, వికలాంగులవుతున్న బాటసారుల కుటుంబాలకు దిక్కెవరు?

డబ్బు సంపాదించడానికి ఎలాంటి మార్గమైనా తొక్కుతాం అనే మనుషుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నది. వీళ్లంతా రకరకాల మార్గాలలో పరువు ప్రతిష్టలు కలిగినవారై ఉండడమే దౌర్భాగ్యం. సినిమా రంగంలో కోట్లకు పడగలెత్తిన వారు కూడా పబ్‌లూ, బార్లూ అంటూ ఇంకా ఇంకా సంపాదించడానికి వెంపర్లాడడం చూస్తుంటే నీచమనిపించడం లేదా? ఇరవై నాలుగు గంటలూ మద్యమందించే వెసులుబాటు కొన్ని బార్లకు ఉందట. అందుకు రూ. 14 లక్షలు అదనమట. ఈ లెక్కలు హైదరాబాద్‌ ‌దాడి తరువాత మీడియా ద్వారా తెలిసినవే. పైగా ఈ బార్లు, పబ్‌ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నదన్న విమర్శ మరీ బాధ కలిస్తుంది. మత్తు మందులకు బానిసలైపోతున్న వారు మొదట గుర్తించవలసినది ఇదొక పెద్ద కుట్ర. విష వలయం. కొన్ని వాదాలు, కొన్ని ‘డే’ల గురించి ప్రచారం చేసి, ఆ మత్తులోకి యువతీయువకులను, ఇంకా చెప్పాలంటే బాలబాలికలను కూడా దింపుతున్నారు. దీని మీద సాంస్కృతికమైన పునాదితో యుద్ధం ప్రకటించవలసిందే. ఇప్పటికే అలాంటి యుద్ధం చేస్తున్న వారికి చేయూతనివ్వాలి. ప్రతి కుటుంబం పిల్లల మీద నిఘా ఉంచాలి. దీనిని హక్కుల పరిధిలో, స్వేచ్ఛ కోణంలో చూడడం సరికాదు. జీవితం బుగ్గి అయ్యాక ఇంక హక్కులు ఎవరికి? స్వేచ్ఛ ఎందుకు? కొన్ని బహుళజాతి సంస్థల వలల నుంచి, కొన్ని దేశాల విష సంప్రదాయాల బారి నుంచి ఇప్పటికైనా మన పిల్లలను మనం కాపాడుకోవాలి.

By editor

Twitter
Instagram