– బి.ఎస్‌.‌శర్మ

త్వరలో నూరేళ్ల సందర్భాన్ని చూడబోతున్న మహోన్నత సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌. ‌జాతీయతా స్ఫూర్తితో, హిందూ ధర్మ పరిరక్షణ ధ్యేయంతో, హిందూ ఐక్యత కోసం ఆవిర్భవించిన ఆ సంస్థ అసంఖ్యాకమైన దేశభక్తుల చెమటతో, రక్తంతోనే కాదు, ఎందరో తమ జీవితాలను అంకితం చేయడం వల్లనే ఈ అనన్య సామాన్యమైన ప్రయాణం సాగిస్తున్నది. వారందరి త్యాగఫలమే నేటి సంఘ స్వరూపం. అలాంటి త్యాగధనులలో ఒకరు సోమేపల్లి సోమయ్య. ఆయన జీవిత విశేషాల ఆవిష్కరణ – ‘స్ఫూర్తిప్రదాత శ్రీ సోమయ్య’ గ్రంథం. 200 పేజీల ప్రేరణాత్మక సంఘటనల సమాహరం. స్వర్గీయ పులుసు గోపిరెడ్డి ప్రారంభించిన ఈ పుస్తకం పనిని కె. శ్యాప్రసాద్‌ ‌పూర్తి చేశారు.

ఈ పుస్తకాన్ని ప్రధానంగా ఐదు భాగాలుగా విభజించవచ్చు.

మొదటి ఐదారు పేజీలలో సంఘాన్ని మన తెలుగు ప్రాంతానికి పరిచయం చేసిన ‘ఆది ప్రచార కుల’ విశేషాలూ, సంఘ విస్తరణ ప్రారంభదినాల్లో వారు ఎదుర్కొన్న సవాళ్లూ, గాంధీ హత్యానంతర విపత్కర పరిస్థితులూ, వీటిని తట్టుకుని ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నిలబడిన తీరు పరిచయమవుతాయి. తొలిదశలో సంఘ వ్యాప్తికి నడుం గట్టిన ఆ మహానుభావుల పేర్లు వింటేనే పాఠకులు పులకించిపోతారు. కాలి నడకన, సైకిళ్లపై ఊరూరా తిరుగుతూ శాఖల స్థాపనకు వారు పడ్డ శ్రమను మన కళ్లముందు సాక్షాత్కరింపజేసారు సంకలనకర్తలు!

రెండవ భాగంలో సోమయ్య జీవనయానం ఎలాంటిదో చెప్పారు. ఆయన 1942 సంవత్సరంలో తెనాలిలో బాల స్వయంసేవక్‌గా సంఘానికి వచ్చారు. 1943లో గుంటూరు శివార్లలో జరిగిన బృహత్‌ ‌హేమంత శిబిరంలో పాల్గొన్నారు. 1944లో బెల్గాం ఓటీసీలో పాల్గొన్న విషయం కూడా ఈ భాగంతో తెలుస్తుంది. 1948లో పూర్తి సమయం సంఘం కోసం అంకితం చేసే ప్రచారక్‌ ‌బాధ్యతలు స్వీకరించారు.

ఆయన 1959 నుంచి 1989 వరకూ ప్రాంత ప్రచారక్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆపై ఐదు దక్షిణ రాష్ట్రాల ‘సేవాభారతి’ పనిని పర్యవేక్షించారు. ఆ సమయంలోనే ఒక ప్రమాదంలో సోమయ్య స్వర్గస్థులయ్యారు.

ఒక ప్రచారక్‌ ‌జీవిత చరిత్ర అంటే సంఘ చరిత్రే. గడచిన నాలుగు దశాబ్దాల సంఘ చరిత్ర అంటే అది భారతదేశ సామాజిక, రాజకీయ, సాంస్కృతి చరిత్రే అవుతుంది. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌తెచ్చిన చింతనా ధోరణితో కోల్పోయినదేమిటో భారతజాతి తెలుసు కుంటున్న క్రమంలో జరిగిన అనేక పరిణామాలకు సోమయ్య ప్రత్యక్ష సాక్షి. వాటిలో ఆయన అంతర్భాగం కూడా. గురూజీ నిష్క్రమణ, 1975-77 నాటి అత్యవసర పరిస్థితి, ఏకాత్మతా యజ్ఞ రథయాత్ర, రామ జన్మభూమి ఉద్యమం వంటి కీలక ఘట్టాలలో ఆయన ఒక భాగం. ఈ విశేషాలను క్లుప్తంగా పొందుపరిచినా దాదాపు అరవై పేజీలు కేటా యించడం ముదావహం. వ్యక్తిగత ప్రతిష్ట కోసం తాపత్రయ పడకుండా నిర్విరామంగా, నిశ్శబ్దంగా భారతమాతకు అర్ధ శతాబ్డం అసాధారణమైన సేవ చేసిన అత్యున్నత సంఘ కార్యకర్త సోమయ్య. వ్యక్తి నిర్మాణం, రాష్ట్ర నిర్మాణకార్యంలో మమేకమై, మూర్తీభవించి ఆదర్శంగా నిలిచారు. నేడే కాదు, నాడు కూడా కమ్యూనిస్టులు కక్ష కట్టిన సంస్థలలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ప్రధానమైనది. కమ్యూనిస్టుల దాష్టీకానికి గురైన వారిలో సోమయ్య ఒకరు. కానీ వారు చేసిన శారీరక దాడి సోమయ్య సంకల్పాన్నీ, లక్ష్యాన్నీ మరింత ధృఢతరం చేసింది. ఈ వివరాల వేదిక ఈ భాగం.

సోమయ్య కన్నుమూసిన తరువాత ఆయనకు సంతాపం ప్రకటిస్తూ విఖ్యాతుల వ్యాఖ్యలు ఎలా ఉండి ఉంటాయి? మూడవ భాగం వీటి గురించి తెలియచేస్తున్నది. సోమయ్య తుదిశ్వాస విడిచిన తర్వాత జరిగిన శ్రద్ధాంజలి సభలో శేషాద్రి, చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి, హల్దేకర్‌ ‌జీ, అశోక్‌ ‌సింఘాల్‌ ‌వంటివారి నివాళులు అందించారు. ఏమి చేస్తే సోమయ్యకు నిజమైన నివాళి కాగలదు? అదే ఇందులో చర్చించారు.

డిగ్రీలు లేకపోయినా వన్నెకొచ్చిన సుగుణాలు, ఆదర్శాలు సోమయ్య సొంతమని వారు వర్ణించడం ఎంతో సబబుగా ఉంది. ఈనాడు మనం చూస్తోన్న ‘పాంచజన్యం’ పుస్తకం ఆలోచనలు సోమయ్యకు తాత్విక పునాదులు ఇచ్చాయి.

నాల్గవభాగంలో సేవా కార్యక్రమాల మీద, స్వయంసేవకుల మీద సోమయ్య వేసిన ముద్ర గురించి వివరించారు. వారితో కలసి సన్నిహితంగా పనిచేసిన దాదాపు నలభై మంది జ్యేష్ట కార్యకర్తల అనుభవాలను ఇందులో పొందుపరిచారు. సోమయ్య ఆత్మీయత, నిరాడంబర వ్యక్తిత్వం, మనోనిబ్బరం, వ్యూహ రచనా నైపుణ్యం, సూక్ష్మదృష్టి, ఒడుదుడుకుల్లో చలించని తత్త్వం, స్థితప్రజ్ఞత, నిశ్చల సముద్ర వంటి గాంభీర్యం, సంఘటనా కౌశలం, కార్యకర్తలకు పని నేర్పించడంలో వారి ప్రత్యేకత, ప్రతి స్వయంసేవకును పేరు పెట్టి పిలిచే వారి పద్ధతి ఈ భాగం ద్వారా అవగతమవుతాయి.

10 పేజీల చివరిభాగంలో 20 వరకు అపురూప చిత్రాలకు చోటిచ్చి ఎన్నో చరిత్రాత్మక ఘటనలను గుర్తు చేశారు.

అధిక విస్తృతిని నివారిస్తూ, పెద్దల సందేశాలలో అవసరమైన ఘట్టాలను క్లుప్తంగా ఇస్తూ, ముఖ్యమైన విశేషాలను అన్నింటినీ స్పృశిస్తూ, పునరుక్తులను సాధ్యమైనంత వరకు పరిహరిస్తూ, ఆసక్తికరంగా చదివించే రీతిలో ఈ సంకలనాన్ని రూపొందించారు. దీనితో పాతతరం వారు జ్ఞాపకాలు నెమరు వేసుకొంటారు. కొత్తతరానికి అలనాటి పరిస్థితులపై అవగాహన కలిగిస్తుంది. కార్యకర్తల నిర్మాణంలో వహించవలసిన మెలకువలను నేర్పిస్తుంది. సంస్థను నడపటంలో పాఠాలను నేర్పిస్తుంది. ఈ పుస్తకం వెలువరించిన ‘నవయుగ భారతి’ వారు అభినంద నీయులు! ఇది నవతరానికి సంఘ స్ఫూర్తిని పంచే శక్తిమంతమైన ఆయుధం. ఒక సిద్ధాంతం కోసం జీవితాన్ని అర్పించడం అసాధారణమైన విషయం. ఇది కొందరే చేస్తారు. అందుకు సిద్ధాంతం గొప్పదై ఉండాలి. సార్వకాలికమైనదై ఉండాలి. దానిని గాఢంగా నమ్మి జీవితాన్ని అర్పించిన వారి నైతిక బలాన్ని చెక్కుచెదరనీయకుండా ఉంచే లక్షణం ఆ సిద్ధాంతంలో ఉండాలి. అలా జీవితాన్ని ఇచ్చిన వారి ద్వారా సమాజంలో వచ్చిన గుణాత్మకమైన మార్పు, కలిగిన మేలు శాశ్వతంగా, నిర్మాణాత్మకంగా ఉండాలి. మనసా వాచా నమ్మిన సిద్ధాంతం సామాన్యుడిని అసామాన్యుడిగా ఎలా మలచగలగు తుంది? ఈ అన్ని అంశాల మధ్య ఉండే అంతస్సూ త్రాన్ని తెలియచేసేదే ఈ పుస్తకం.

స్ఫూర్తి ప్రదాత శ్రీ సోమయ్య

సంకలనం : స్వ. పులుసు గోపిరిడ్డి, కె. శ్యాంప్రసాద్‌

‌ప్రతులకు : సాహిత్యనికేతన్‌, ‌బర్కత్‌పురా,

హైదరాబాద్‌. ‌ఫోన్‌ : 040-27563236.

‌సాహిత్య నికేతన్‌, ‌విజయవాడ. సెల్‌: 6303541244

‌పే. : 200, వెల: రూ.200/-

About Author

By editor

Twitter
Instagram