– డా।। గోపరాజు నారాయణరావు

కానీ అంతకంటే చిన్నవాడిలాగే కనిపిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం దగ్గర ఏదో ఊరు. మద్రాస్‌ ‌రాయపేట కాలేజీ నుంచి లైసెన్షి యేట్‌ ‌మెడికల్‌ ‌ప్రాక్టీషనర్‌ (ఎఎం‌పీ) పట్టా తీసుకున్న డాక్టరు. ‘‘నా కుశలం సంగతి సరే, నా చివరి ప్రశ్నకి సమాధానం లేదు అందులో.’’ నవ్వుతూ అన్నాడు బాస్టియన్‌. ‘‘ఓ….. ‌వెంటాడడమా? ఎందుకలా అంటున్నారు? నేను డాక్టర్ని. డిటెక్టివ్‌ని కాదు.’’ అన్నారు డాక్టర్‌ ‌మూర్తి, చక్కని ఇంగ్లిష్‌లో. ‘‘డాక్టర్లకి మరుపు వస్తే ప్రమాదం యంగ్‌ ‌డాక్టర్‌! ‌సంవత్సరం క్రితం చింతపల్లిలో సరిగ్గా రోడ్డు పనుల హడావిడిలో ఉన్నప్పుడే కలిశాం.’’ గుర్తుచేశాడు బాస్టియన్‌, ‌మెట్లు దిగి వస్తూ. ‘‘అయితే… మిమ్మల్ని వెంటాడమని కలెక్టర్‌ ‌హ్యాండర్సన్‌ ‌దొరవారే నన్ను పంపారన్న మాట.’’ అన్నారు డాక్టర్‌ ‌మూర్తి, గంభీరంగా ముఖం పెట్టి. గతుక్కుమన్నాడు బాస్టియన్‌. అదేమీ బయటకు కనిపించనివ్వకుండా అర్థంకానట్టు అడిగాడు, ‘‘అంటే!’’ ‘‘అప్పుడు గానీ, ఇప్పుడు గానీ హ్యాండర్సన్‌ ‌దొరవారు జారీ చేసిన ఆదేశాల మేరకే నేనొచ్చాను మరి.’’ అన్నారు డాక్టర్‌ ‌మూర్తి, చిన్నగా నవ్వుతూ. పైకేమీ తేలకపోయినా, ఇంకా అనుమానం పోలేదు బాస్టియన్‌ ‌కి. తన మీద నిఘాయేమోనని అతడికి గట్టి అనుమానం. ఈ మధ్య ఎవర్ని చూసినా అలాగే అనిపిస్తోంది. ఇద్దరూ ఒకే మెట్టు మీదకు వచ్చారు. ‘‘రూరల్‌ ‌హెల్త్ ‌చెకప్‌ ‌స్కీం వచ్చింది కదా! దాని మీద ఈ మూడేళ్ల నుంచీ మన్యంలో తిరుగుతున్నాం. దశలవారీగా చేస్తున్నాం. ఇవాళే కొత్తగా రాలేదు. మీరు కూడా మా సేవలు కొంచెం గుర్తించాలి డిప్యూటీ తహసీల్దారు గారు!’’ అన్నారు డాక్టర్‌ ‌మూర్తి, కరచాలనానికి చేయి ఇస్తూ. ‘‘మంచిది. అలాగే.. తప్పక గుర్తిద్దాం!’’ అని డాక్టర్‌ ‌మూర్తి చేతిని నెమ్మదిగా ఒత్తుతూ అన్నాడు బాస్టియన్‌. ‘‘అయినా… వర్షాకాలంలోనే కదా ఈ కొండోళ్ల బాధలన్నీ… అప్పుడైతే ఇంకా మంచి ఫలితాలొస్తాయి కదా! కానీ ఈ కాలంలో రోగాళ్లేముంది లెండి. ఎప్పుడైనా రావచ్చు. సరే, ఒక్కమాట. ఈ కొండవాళ్లు చెప్పేవన్నీ నమ్మక్కర్లేదండీ! వాళ్ల మూఢ నమ్మకాలే వాళ్ల చేత అలా మాట్లాడిస్తాయనిపిస్తుంది నాకు. బయట నుంచి వచ్చినవాడు ఎవడైనా దెయ్యం కిందే లెక్క వీళ్లకి. మీకు ఇంకొకటి చెబుతాను. మరీ ఇన్నేసి రోజులు ఈ కొండలంటా, కోనలంటా తిరక్కండి. మీ ఆరోగ్యం ఎలా ఉందని అడగక తప్పని పరిస్థితి వచ్చేస్తుంది.’’ అన్నాడు బాస్టియన్‌, ‌నవ్వుతూనే. ‘‘ఆ నమ్మకం ఎలా పుట్టిందో గానీ, వీళ్లు కూడా ‘దిగువ వైద్యాలు మన్నెపు రోగాలకి చాలవులే’ అనేస్తారు. అందుకే కదా, ప్రభుత్వం వారు వీళ్లకి ఆయుర్వేద వైద్యం కూడా చేయమని చెప్పారు..’’ డాక్టర్‌ ‌మూర్తి ఇంకా ఏదో చెప్పబోతుంటే అడిగాడు బాస్టియనే, హఠాత్తుగా. ‘‘సరే, భోజనం పంపించ మంటారా?’’ ‘‘మీకెందుకు శ్రమ? మా వాళ్లు వంట చేసే ఉంటారు. సర్కారు వారు ఇద్దరు సహాయకులను కూడా ఇచ్చారు.’’ అన్నారు డాక్టర్‌ ‌మూర్తి. ‘చిన్న సందుకూడా ఇవ్వడు’ మనసులోనే అనుకున్నాడు బాస్టియన్‌. ‌పైకి మాత్రం ‘‘సరే, తొందరపని మీద వెళుతున్నా. మళ్లీ కలుద్దాం! ఉంటారుగా!’’ అన్నాడు. ‘‘చాలా పల్లెలే తిరగాలి. రక్తపరీక్షలూ అవీ చేయాలి. ఉండాల్సి వస్తుంది.’’ అన్నారు డాక్టర్‌ ‌మూర్తి, నిట్టూర్పు విడుస్తూ, ‘‘సరే, తప్పుతుందా? మాదీ అదే పరిస్థితి. ఉందాం మరి! ’’ ఏదో నిశ్చయానికి వచ్చి నట్టు స్థిరంగా అన్నాడు బాస్టియన్‌, ‌వడివడిగా మెట్లు దిగుతూ. ‘డోలా లచ్చిని గప్పీదొర బంగ్లాకే తీసుకు రమ్మని చెప్పాలి… ఈ డాక్టరు ఎన్నాళ్లుంటాడో.. గోల!’ మనసులోనే అనుకున్నాడు బాస్టియన్‌.

***************

పేగులు లుంగ చుట్టుకుపోతున్నాయి. ఒంటికి పట్టిన కంకర దుమ్మును కడుక్కోవాలన్న ఆలోచన కూడా రావడం లేదు. వచ్చినా సమయం లేదు. కాళ్లూ చేతులూ కడుక్కోవడానికి కూడా మనస్క రించడం లేదు. కడుపులో తాటాకు మంటలా లేస్తోంది ఆకలి. నాలుగు ముద్దలు తినడానికి వడివడిగా నడుస్తున్నారు ఆ మామిడిచెట్టు దగ్గరకి. నిజానికి ఒళ్లు కడుక్కుని, అంత తాపీగా తింటే కుదరదు. పని… పని. ఏదో ఒక మిషతో మధ్యాహ్నం భోజనం ఆలస్యం అయ్యేలా చేస్తున్నారు కిష్టయ్య,

పిళ్లే. పని భారంతో పెద్దవాళ్లు, వయసు చేత చిన్నపిల్లలు నకనకలాడిపోతున్నారు మెతుకుల కోసం. రెండు రోజుల నుంచి ఇదే తంతు.

కొండమ్మ వడివడిగా వచ్చింది. మొగుడు ఇంకా రాలేదు. అయినా అతడి కోసం చూడదలుచుకోలేదు. పదడుగులు వేస్తే అన్నం ముంతలు భద్రపరిచిన మామిడిచెట్టు. అది దగ్గరయ్యే కొద్దీ ఆకలి మరింత పెరిగిపోతోంది. ఏదో నిస్త్రాణ శరీరంలో. అదే చెట్టు…

కానీ దానికింద ఆ దృశ్యం చూసి నిశ్చేష్టురాలై పోయిందామె. మామిడిచెట్టుకు ఒక పక్కగా పెట్టిన అన్నం ముంతలు రెండో మూడో పగలగొట్టినట్టు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఆ ప్రాంతమంతా ఎండుటాకుల మీద చిందరవందరగా పడి ఉంది అన్నం. తను తెచ్చుకున్న ముంత పెట్టిన చోటు చూసింది కొండమ్మ. అక్కడ లేదు. ముంతలని కొద్ది దూరం వరకు అలమబండలు లాక్కుపోయిన సంగతి అర్థమయింది. ఇలా జరగడం నాలుగోసారి. ఆ ప్రదేశమంతా ఎండుటాకుల మీద అన్నం మెతుకులు కనిపిస్తున్నాయి. కళ్లంట నీళ్లు ఉబికాయి ఒక్కసారిగా. దూరంగా కనిపిస్తున్న ఆ ముంత దగ్గరగా నడిచిందామె. అక్కడే మరో చెట్టుకింద ఎక్కువ అన్నం

మొతుకులు పడి ఉన్నాయి. పనస గింజలు కలిపిన మెతుకులు- ఎర్రటి కారం అంటిన తెల్లటి మెతుకులు. నోట్లో నీరు ఊరిపోయింది. ఆ చెట్టు పక్కనే దిగాలుగా కూలబడింది కొండమ్మ.

కడుపులో ఆకలి తన ఉనికిని పరమ కర్కశంగా గుర్తు చేస్తోంది ఆ లిప్తలో. నేల మీద చతికిల పడి వణుకుతున్న చేతులతో ఎండుటాకులు తీసుకుంది కొండమ్మ. వాటినిండా

మెతుకులు, ఇసుకరేణువులతో కలసి. ఒక్కక్షణం అంతా మరచిపోయింది. అవతల పని, ఆలస్యంగా వెళితే ఒంటి మీద పడే దెబ్బలు, మొగుడు అంతా మరచిపోయింది కొండమ్మ. ఆ ఇసుకని ఓపిగ్గా ఊదుకుంటూ ఒక్కొక్క ఎండుటాకులోని మెతుకులని నోట్లో ఒంపుకుంటోందామె.. ఒక్క పక్క ఆకలికి, ఇంకో పక్క తన దుస్థితికి కన్నీళ్లు వస్తున్నాయి. ఇది గమనించింది సన్యాసమ్మ. తను తింటున్న ముంతలో అన్నం దాదాపు అయిపోయింది. రెండు ముద్దలు మిగిలి ఉన్నాయి. కొండమ్మ దుస్థితిని చూడలేక పోయింది. ఆ కొద్ది అన్నంతోనే కొండమ్మ దగ్గరకి వెళ్లిందామె, వేగంగా. అప్పుడే స్పృహలోకి వచ్చినట్టు సన్యాసమ్మని చూసి సిగ్గుపడింది కొండమ్మ, ‘‘అలమబండలు (కొండముచ్చులు) చూడు ఎంత పనిచేశాయో!’’ అంది, డగ్గుత్తికతో. ‘‘మట్టిపాలైన కూడేం తింటావ్‌ ! ఇదిగో రెండు ముద్దలు నువ్వూ తిను.’’ అంటూ ముంత ఆమె చేతిలో పెట్టింది. అప్పుడే వచ్చాడు కొండమ్మ భర్త. ‘‘అయ్యో ! నువ్వూ తిర్లేదు కదా! మరి..!’’ అంటూ కొండమ్మ భర్తను చూసి నొచ్చుకుంది సన్యాసమ్మ. ‘‘ఇయాక్టికి ఇదే.. అనుకుంటాం!’’ ఆమె గొంతులో జలపాతంలా ఉరి కింది బాధ. మొగుడి చేతిలో ఒక ముద్ద పెట్టి, తను ఒక ముద్ద తిన్నది కొండమ్మ. తరువాత నీళ్లు పోసి కడిగి సన్యాసమ్మకి ఇచ్చింది ముంత. నీళ్ల ముంత ఎత్తి కడుపు పట్టినన్ని నీళ్లు తాగింది కొండమ్మ. మిగిలిన నీళ్లతో ఆమె భర్త కడుపు నింపుకున్నాడు. ‘‘ఈళ్లకి జాతీ నీతీ లేదు. ఒకబ్బకీ ఒక అయ్యకీ పుట్టినోళ్లయితే కదా! మీకు కొరడా దెబ్బలు కాదు, చెప్పు దెబ్బలు పడాలి. ఎంతసేపురా తిండి, ఏమే మింగింది చాలదా..!’’ అప్పటికే అక్కడ కిష్టయ్య అరుస్తున్నాడు.

***************

ఆకుపచ్చ మహా సముద్రంలో ఒక అల ఉవ్వెత్తున ఎగసి, వెనక్కి తగ్గడం మరచిపోయినట్టే ఉంది ఆ లోయ. ఆ లోయ కేసి తదేకంగా చూస్తున్నారు డాక్టర్‌ ‌మూర్తి. ఆ ఆకుపచ్చ కెరటం పై ఒంపు మీద ఉంది అతిథిగృహం- బుల్లి కాగితం పడవలా. తను నిలబడి చూస్తున్న ఆ గోడ దగ్గర నుంచి కిందికే ఉంది ఆ లోయ, ఎడం పక్కన. కుడి వైపున అంబరాన్ని చుంబిస్తున్నట్టు- కొండ. కొండగాలికి నేల మీద

ఎండుటాకులూ, కొమ్మల మీద పచ్చటి ఆకులూ కూడా కదులుతూనే ఉన్నాయి. అతిథిగృహం కట్టడానికి ఆ స్థలం ఎంపిక చేసిన వాడి అభిరుచిని మెచ్చవలసిందే. పైన సిమెంట్‌ ‌రేకులు. ప్లాస్టరింగ్‌ ‌లేని బండరాళ్లతో కట్టిన గోడలు కనిపిస్తున్నాయి. అయినా ఎంతో ఎంతో రమణీయం ఉంది. ప్రహారీకీ, బంగ్లాకీ కూడా తెల్లటి సున్నం వేశారు. వందగజాలు మించి ఉండదు స్థలం. అందులోనే చుట్టూ రెండు గజాల మేర స్థలం వదలి కట్టారు ప్రహారీ. అతిథి గృహం చిన్న రాజప్రాసాదమైనట్టు, దాని చుట్టూ నమూనా కోట గోడలా ఉంది ప్రహారీ. అడుక్కొకటిగా బుజ్జి బుజ్జి బురుజు ఆకారాలు కనిపిస్తున్నాయి. మనసంతా వికలంగా ఉంటే వెనక గది తలుపు తీసుకుని బయటకు వచ్చారు డాక్టర్‌ ‌మూర్తి. తెల్లటి పైజమా, లాల్చీలో ఉన్నారాయన. బాస్టియన్‌ అలా మెట్లు దిగి వెళ్లిపోవడంతోనే ఎనిమిది మాసాల క్రితం ఆయన రాసుకున్న డైరీ కళ్ల ముందుకొచ్చింది, అప్రయత్నంగా. అవి నీలి సిరాతో రాసిన ఒట్టి అక్షరాలు కాదు. ఎన్నో ఆర్తనాదాలకి సంకేత రూపాలు. చింతపల్లితో సహా కొన్నిచోట్ల రోడ్డు పని పేరుతో జరిగిన అకృత్యాల గురించి డైరీలో రాసు కున్నారాయన. ఇందులో ప్రత్యేకమైన ఉద్దేశమేదీ లేదు. అంతగా కదిలించాయి అవి. గుర్తుకొస్తే చాలు, మనసు వికలమైపోతోంది. ఆ డైరీ సంగతి తెలియదు కానీ, ఆ అకృత్యాలని చూడకపోయినా, ఆ బాధితులని డాక్టర్‌ ‌మూర్తి స్వయంగా చూసిన సంగతి మాత్రం బాస్టియన్‌ ‌కు తెలుసు. గాయాలు తగిలితే డాక్టర్‌ ‌గుర్తుకు రాక తప్పదు. మొదట అలాంటి బాధితులని చూసి అవి ఏవో అడవో, అడవి జంతువులో చేసిన గాయాలని అనుకున్నారు డాక్టర్‌ ‌మూర్తి.

కానీ ఆ గాయాలన్నీ బాస్టియన్‌ అనే మానవ మృగం చేసినవేనని నెమ్మదిగా తెలిసింది. డాక్టర్‌ ‌మూర్తి మన్యంలో అడుగుపెట్టగానే తెలిసిన మొదటి సంగతి – కొండవాళ్ల మీద రోడ్డు పేరుతో ఇప్పటికీ సాగుతున్న అకృత్యాలు.. ఇన్నేళ్లుగా ఆ అమాయ కులను హింసిస్తూనే ఉన్నాడు బాస్టియన్‌. ‌తలుచు కుంటే మనసు వికలమవుతోంది. మహా యుద్ధం.. అదే గ్రేట్‌ ‌వార్‌లో విజయం ఎవరిదో తెలియదు గానీ, విలయం మాత్రం మానవాళి మొత్తానిదే. కరువు, కరువు.. ఎక్కడ చూసినా కరువే. ఆంధ్ర పత్రికలో వచ్చిన వార్తలు ఇంకా గుర్తున్నాయి డాక్టర్‌ ‌మూర్తికి. యుద్ధం ముగుస్తుండగానే, అంటే 1918లో ధరలు తగ్గించాలని కృష్ణా జిల్లా చల్లపల్లిలో జనం గొడవలకి దిగారు. పెద్ద ఊరేగింపు జరిగింది. కొన్ని దుకాణాలకి నిప్పు పెట్టారు. ఉయ్యూరు, మచిలీ పట్నం, గుడివాడలలో కూడా ఇలాగే జరిగింది. గుంటూరు ప్రాంతంలో బాపట్ల, వేటపాలెం గ్రామాలలో కూడా ధరల తగ్గించాలని అల్లర్లు జరిగాయి. గోదావరి తీరంలో పోలవరంలో కూడా ఇలాంటి అల్లర్లు జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఏటా రెండు పంటలు పండే కృష్ణా, గోదావరి తీరాలకి ఇలాంటి గతి పట్టించారని జాతీయ కాంగ్రెస్‌ ‌నాయకులు ప్రకటనలు ఇచ్చారు. అసలు మద్రాస్‌ ‌ప్రెసిడెన్సీయే కరువు కాటకాలతో మండింది. మైసూరు సంస్థానం, కేరళ ప్రాంతంలో కూడా ధరలని తట్టుకోలేకి జనం వీధుల్లోకి వచ్చారు. బజార్లు, దుకాణాలు దోచుకోవడం సర్వసాధారణంగా మారిందని కూడా ఆ వార్తలలో రాశారు. అలాంటి స్థితే విశాఖ మన్యంలో కూడా. దానిని ఉపయోగించు కుంటున్నాడు బాస్టియన్‌. ‌బాస్టియన్‌ ‌ను చూసిన ప్రతిసారి అపారమైన తూప్లీంభావం కలుగుతూ ఉంటుంది డాక్టర్‌ ‌మూర్తికి.

కానీ ద్వేషించి ప్రయోజనం ఏమిటి? అంతకంటే అతడి వల్ల బాధల పడిన వారికి తన వంతు వైద్యసేవ చేసి, మామూలు మనుషుల్ని చేస్తే మంచిదన్న అభిప్రాయానికి వచ్చారు. అందుకే తన పని చేస్తూనే ఆయా గ్రామాలలో తిరుగుతున్నప్పుడు బాస్టియన్‌ ‌బాధితులకు వైద్యం కూడా అందిస్తున్నారు. అందుకు అవసరమైతే ఒకటి రెండు మైళ్లు నడిచి వెళుతున్నారు. లేదంటే వాళ్లకే కబురు చేస్తున్నారు.

దూరంగా భల్లూక రసితం- ఎలుగొడ్డు అరుపు. ఆయన జ్ఞాపకాలని తెగొట్టింది.

***************

కొట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు చేతిలో కర్రలని ఎత్తి పెట్టే ఉన్నారు, ఆ వృద్ధురాళ్లు. అది చూస్తే చాలు ఇక కోతులు, కొండముచ్చులు రావు. మనిషి ఉన్నా చేతిలో కర్ర లేకపోతే లెక్క చేయవు కూడా. అలమబండలు అక్కడికి రాకుండా చూసేందుకే ఆ ఇద్దరు ముసలమ్మలు ఉన్నారు. చిట్రాళ్లగొప్పు గ్రామం వాళ్లే. ఆ కర్రలు ఎప్పుడు కిందకి దిగుతాయా, ఎప్పుడు చెట్టు దిగుదామా అన్నట్టు చూస్తున్నాయి అలమబండలు. ముసలమ్మల జాగరూకతని, ఆ మామిడి చెట్టు కింద ఉన్న అన్నం ముంతలని ఎత్తుకు పోదామని కొమ్మల మీద పొంచి ఉన్న అలమబండలని మార్చి మార్చి తమాషా చూస్తున్నారు వాళ్ల దగ్గర కూర్చున్న ఆ పది పన్నెండు మంది పిల్లలు.

బొమ్మెత్తు పొద్దుకి వచ్చాడు సూరీడు. ఇదే మైదాన ప్రాంతం వారి లెక్క ప్రకారమైతే సమయం ఉదయం తొమ్మిది దాటింది. ఓ పావుగంటకి కర్రపోటు వేసుకుంటూ వచ్చాడు లోచిలి రామునాయుడు. అతడూ ఆ ఊరి వాడే. తొంభయ్‌ ఏళ్లుంటాయి. నుదురు మీద పచ్చబొట్టు నామంలా పొడిపించు కున్నాడు. పొట్టిగా ఉంటాడు.

ఊరంతా అతడిని వీరుడిలా ఆరాధిస్తుంటుంది. వయసులో ఉండగా చిరతపులితో దెబ్బలాడాడట. అందుకు రుజువుగా మెడ మీద జానడేసి గాట్లు రెండు స్పష్టంగా కనిపిస్తాయి, శౌర్యపతకాల మాది రిగా. ఎంతో ప్రశాంతంగా ఉంటాడు చూడడానికి. ఈ రోడ్డు పనిలో ఉన్నారు తమ్మరపు చితుకుల దొర, గునుతూరు ఎండు పడాలుబీ లంబసింగి ఊరి వాళ్లు. వాళ్లు వెళ్లి అలమబండలు, కోతల సమస్య చెప్పగానే సాటి కొండవాళ్ల మీద సానుభూతితో వస్తున్నారు ఆ ముగ్గురు వృద్ధులు. రెండు రోజుల నుంచి వాళ్లే అన్నం కుండలకి, బియ్యం మూటలకీ కాపలా ఉంటున్నారు. కోడిజాము వేళ వండుకుని, ఆ కుండలతో సహా ఇక్కడే పెద్ద మామిడిచెట్టు కింద అంతా పెట్టుకుంటారు. పని చేస్తున్నంత సేపు అలమబండలు, కోతులు ఆ అన్నం ముంతలు లాక్కుపోతాయేమోనన్న బెంగే. వండి తెచ్చిన అన్నం మట్టిపాలు కావడం చూసి భోరున ఏడ్చేవారు కొందరు. పిల్లలైతే చేప్పేందుకు లేదు. అదీ కాకుండా, ఇంత కష్టపడి, ఇన్ని తిట్లు తిని, దెబ్బలు కాచి చేసిన ఈ రోడ్డు పనికి ఇచ్చే బియ్యాన్ని, ఉప్పులూ పప్పులూ కాపాడుకోవడం కూడా పెద్ద సమస్యగా మారి పోయింది. మధ్యసిత్రం వేళ (మధ్యాహ్నం) కూలీలంతా భోజనాలకి వచ్చాక, అన్నం కుండలన్నీ అప్పగించి ఆ ముగ్గురు వృద్ధులు వెళ్లిపోతారు. దీనికి తోడు పిల్లల్ని కూడా చక్కగా ఒకచోట కూర్చో బెట్టి ఉంచుతున్నారు, కథలూ, కాకరకాయాలూ చెప్పి. అన్నం భద్రంగా ఉండడంతో పాటు, పిల్లలు ఎక్కడ ఉన్నారో అన్న బెంగ కూడా తీరింది చాలామందికి. అసలే చిరుతల భయం అక్కడంతా. ఇది కాక పాములు. పురుగూ పుట్రా సరే. పన్నెండు మంది వరకు పిల్లలు వాళ్ల దగ్గరే బుద్ధిగా కూర్చుని ఉన్నారు. ఆ ఇద్దరు ముసలమ్మలతో ముచ్చట్లాడుతున్నారు పిల్లలు. సన్యాసమ్మ కూతురు ఏరిన చితుకులు కట్ట నెత్తి మీద పెట్టుకుని అప్పుడే వచ్చింది.

దానికి ఆరేళ్లు. అక్క రావడం చూసి అప్పటి దాకా వాళ్ల మధ్య ఉన్న దాని తమ్ముడు బుడి బుడి అడుగులతో దగ్గరకి వెళ్లాడు. అది కూడా అందరితో పాటు కూర్చుంది. ‘‘ఏమే! బొట్టె, ఇందాక ఏదో అడిగావ్‌ ‌కదా! అడుగో! తాతొచ్చాడు, ఆయన్నడుగు.. సక్కంగా సెబుతాడు..!’’ అంది ఒక ముసలమ్మ, సన్యాసమ్మ కూతురుతో. భూమి నుంచి తన్నుకొచ్చిన పెద్ద వేరు మీద కూర్చున్నాడు రామునాయుడు, అన్నకుండలు, ముంతలకి పక్కనే. ‘‘తాతా! తాతా! ఆ పాటుంది సూడు, అందమైన నందపురము.. నందియాటలే ఆడివద్దాం..! అది.. ఓసారి పాడవా?’’ నందిపండుగ వేళ పాడుకుంటారు, విశాఖ మన్యంలో. రంపలోయలో దీనినే భూపండగ అంటారు.

‘‘ఓ..’’ చక్కగా రాగం తీశాడు రామునాయుడు ముందు. తరువాత పాటలోకి వచ్చాడు. ‘‘ఉయ్యాలని వేసినాము.. దేవుడని మొక్కినాము.. – దేవుడని మొక్కినాము.. దేవదుర్గము బీరమూరు..’’ అని ఓ క్షణం ఆగి అన్నాడు.

(ఇంకా ఉంది)

About Author

By editor

Twitter
Instagram