‌వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథలపోటీకి ఎంపికైన రచన

తిరుపతయ్య నేరేడు చెట్టు కింద సగంకట్టి వదిలేసిన ఓ పునాదిపై కూర్చుని, ఆ చెట్టు పక్కగా ఉన్న చిన్న మేడింటి పైన ఓ కన్నేసి ఉంచాడు. ఇప్పటికి రెండు రోజులుగా ఆ ఇంటి చుట్టూనే తిరుగుతున్నాడు అతడు. ఆ ఇంటి పెద్దమనిషి రంగారావుతో పనిబడింది అతడికి. రంగారావేమో దొరక్కుండా ఉన్నాడు. నిన్నా మొన్నా చూసి చూసి వెళ్లిపోయాడుగానీ ఈ రోజు ఎంత రాత్రయినా అతనికోసం వేచి చూడాలని నిశ్చయించు కుని మరీ వచ్చి కూర్చున్నాడు. గంట క్రితమెళ్లి ఆ ఇంట్లోవాళ్లని అడిగితే మనిషి ఎక్కడకుపోయాడో, ఎప్పుడొస్తాడో తెలియదని చెప్పారు. పొద్దు నెత్తి కెక్కుతోంది. చెట్టు పక్కగా ఉన్న చిన్న సిమెంటు రోడ్డు మీదుగా అవతల వీధికి పోయేవాళ్లు పోతున్నారు; ఇవతలి వీధికి వచ్చేవాళ్లు వస్తున్నారు కానీ రంగారావు మాత్రం ఇంటికి రావడం కనబడ్డంలేదు.

ఇంతలో అటుగా పోతూ తోటి పనోడు నాగరాజు ‘వోరేట్రా తిరుపతీ! ఇక్కడ కాసినావు.’’ అని పలకరించాడు.

‘‘ఏం నేదురా. రంగరావు కూలి డబ్బులు ఇయ్యాల.. వచ్చినాను’’ అని చెప్పాడు తిరుపతయ్య.

‘‘ఏది, సింహాచలంకాడ కట్టిన అగ్గిపెట్టినాటి ఆ సిన్న డాబా ఇల్లు డబ్బులేనా?’’

‘‘అవును.. ఆట్లి డబ్బులేపర..’’

‘‘అదేటిది.. నీతోటోళ్లకి వొప్పుడో ఇచ్చీసినాడు గదా..’’

‘‘ఇచ్చీసినాడు.. అందరూ తీసీసుకున్నారు గానీ నాను తీసుకోనేదుమరి..’’

‘‘అదేవలగ..’’

‘‘అడుగుతావా.. పని ఇప్పించినందుకు రోజు కూలిలో ఆ బావు కమిసను కింద రోజుకి యాభై లెక్కన జమకట్టీసుకుంతాడట..’’

‘‘రంగారావు మా గొప్ప మనిసిలే.. ఏటి ఆ సిన్న ఇంటికాడ కూడా లేబరి కూలిలో కమీసను తీసీసు కోవాల.. మా భళేగుందిలే యవ్వారం! ఈ రోజున లేబరి కాంట్రాట్టర్ల పని బాగున్నాదనుకో.. లేబర్ని బుక్‌ ‌సేసుకోవడం, ఆళ్ల రోజు కూలీ నుండి ప్రతి రోజూ కమిసను గుంజుకోవడం.. కట్టపడి పన్జేయ కుండా తేరగా డబ్బులొత్తన్నాయి. ఇదే బోగుందని, నిన్నమొన్నటిదాకా మామూలుగా కూలీల్ని తమ యెనకాల తీసుకుపోయిన మేస్త్రీలు కూడా ఈయాళ ఆళ్లకి పని ఇప్పిత్తాం.. రోజు కూలీలో ఇంత కమిసను ఇయ్యాలని సెప్పి తీసుకుపోతున్నారు.. ఇదో పద్ధతికింద సేసినారు. ఈ రంగారావు మట్టుకు మనతోటి కూలీకి తిరిగినోడు గాదా.. అలాగ కూలీగా సేసీ సేసీ తాపీ మేస్త్రీ అయిపోనాడు.. ఇయ్యాల లేబరి సప్లయి చేసీ మేస్త్రీ కూడా అయిపోనాడు.. పన్లోకొచ్చాక నానూ పనిజేస్తన్నానని ఏదో తాపీ అటూ ఇటూ ఓ గంట పావుతాడు.. ఆయెనకాల పనంతా కూలోలమీదే వొగ్గీసి పోతాడు. అయినా వుప్పుడు ఆ బావు పనిజెయ్యాల్సిన పనేముందిలే.. కూలీల కట్టంనుంచి అప్పనంగా కమిసను కింద వేలకువేలు సొమ్ముచ్చి పడతంటే..’’

‘‘ఆఁ.. యేటి మరీ ఇంతన్నాయవా అనడిగి నాను.. రోజు కూలీలో పాతిక కోసుకుని నాకు రావలసిన కూలీ ఇయ్యమన్నాను.. రేపంతాడు మాపంతాడు.. మనిసి దొరక్కుంటన్నాడు.. అందుకే ఇంటికాడ కాసినాను..’’

‘‘సర్నే.. ఏదో రాజీకొచ్చియ్యి.. లేబరి మేస్త్రీలతో ఎట్టుకుంటే మనకి రోజులెల్లవు.. ఎందుకొచ్చినాది..’’ అని చెప్పిపోయాడు నాగరాజు.

భోజనం వేళ కావొస్తోంది. ఎండకి ఎవరిళ్లల్లో వాళ్లున్నారు. ఊరి చివర కావడంతో వీధంతా నిర్మానుష్యంగా ఉంది. ఆ వేళలో అవతలి వీధినుండి ఓ కుక్కల గుంపొకటి సిమెంటు రోడ్డుమీదుగా ఇవతలి వీధికి వచ్చింది. ఆ కుక్కల్ని చూసి ఇవతలి వీధికి చెందిన నల్లకుక్క మొరగడం మొదలెట్టింది. అంతలో తెల్లమచ్చల కుక్కపిల్ల దానికి తోడొచ్చి బొయ్యిమంది. దాని అరుపు పది కుక్కల పెట్టు అన్నట్లుగా ఉంది. అవతలి వీధి కుక్కలూ తమ గొంతులు పెంచాయి. వాటి అరుపులు ఇవతలి వీధిలో అక్కడక్కడా ఉన్న కుక్కల చెవుల్లో పడ్డాయి. అంతే! తమ వీధిలోకి వేరే వీధి కుక్కలేవో వచ్చిపడ్డాయని భౌ.. భౌ.. భౌమని అరుచుకుంటూ చిరుతల్లా పరుగెత్తుకుని వచ్చి అవతలి వీధి కుక్కలపై పడ్డాయి. రెండు గుంపుల మధ్య భీకరంగా కాట్లాట జరిగింది. నోరున్న కుక్కలు అరుచుకున్నాయి; కోరలున్న కుక్కలు కరుచుకున్నాయి. తిరుపతయ్య ఆ కుక్కల కాట్లాటను తిలకిస్తూ ఉండిపోయాడు. మొత్తానికి ఇవతలి వీధి కుక్కలు స్థానబలిమి చేత అవతలివీధి శత్రు కుక్కలపై పైచేయి సాధించి వాటి వెంటబడి తరిమేశాయి. అటుపైన తిరిగి అన్నీ మొదట గొడవపడిన చోటుకే వచ్చి తమ సంఘీభావాన్ని ప్రకటించుకున్నట్లుగా కాసేపు మొరిగి, ఒకదాన్నొకటి మూచూసుకుని వేటి దారిన అవి పోయాయి. తెల్లమచ్చల కుక్కపిల్ల మాత్రం మొరగడం ఆపలేదు. తోకముడిచి బెదురు చూపులతో చాలాసేపు బొయ్యి మంటూనే ఉంది. నల్లకుక్క రంగారావు ఇంటెదురు పెద్దింటి పెరటిగోడ పక్కన ఉన్న చెత్తకుప్ప వద్దకు పోయింది. అరిచి అరిచి నోరు పీకిందేమో కాసేపటి తర్వాత తెల్లమచ్చల కుక్కపిల్ల కూడా అక్కడినుండి వెళ్లిపోయింది. అది పోవడంతో గాలివాన వెలిసినట్లు ఆ ప్రాంతంలో ప్రశాంతత అలుముకుంది. కానీ తిరుపతయ్య మనోఫలకం పైనుండి కుక్కల కాట్లాట దృశ్యం చెరిగిపోలేదు. అది అంతవరకూ స్పష్టంగా అర్థం కాకుండా ఉండిపోయిన తనలోని కొన్ని భావాలకు ఏవేవో అర్థాలు తీస్తూ ఉంది.

తిరుపతయ్య తాపీ పనివాడు కావడంచేత తను భవన నిర్మాణ కార్మిక సంఘంలో సభ్యుడిగా ఉన్నాడు. సంఘం మీటింగుల్లో తరచూ వర్గ పోరాటం గురించి ఇప్పటికి అనేకమార్లు విని ఉన్నాడు. ఐదో తరగతి వరకూ చదువుకున్నోడు కావడం మూలాన అది అద్దాగుద్దంగా తలకు కొంత పట్టింది. తీరిక వేళల్లో ఆ పోరాటం గురించి తోటి కార్మికులతో చర్చలు పెట్టేవాడు. బుద్ధి బాగున్నప్పుడు భార్యకూ ఆ సంగతులు చెప్పేవాడు. సమాజం రెండు వర్గా లుగా విభజింపబడి ఉందని, ఒకటి దోపిడీ వర్గమని, రెండోది దోపిడీకి గురయ్యే వర్గమని, భూమి – ఫ్యాక్టరీలు దోపిడీవర్గం చేతుల్లో ఉంటాయని, కార్మికుల శ్రమను, వినియోగదారులను ఆ వర్గం దోచుకుంటుందని, మన సమాజంలో పెట్టుబడి దారులు, భూస్వాములు, వడ్డీ వ్యాపారులు, దొంగ వ్యాపారులు ఆ వర్గానికి చెందుతారని చెప్పాడు. ఇక రెండో వర్గమైన దోపిడీకి గురయ్యే శ్రామికవర్గంలో శ్రామికులు దోపిడీ వర్గం చేతుల్లో ఉన్న భూమి, ఫ్యాక్టరీల్లో పని చేస్తారని, కూలికి తమ శ్రమను అమ్ముకోవడం మినహా మరే అధికారం వారికి ఉండదని, దోపిడీదారుల దోపిడీకి గురవుతూ వీరు దారిద్య్రంతో సతమతమవుతున్నారని, అందువల్ల దోపిడీదారులపై దోపిడీకి గురయ్యేవాళ్లు పోరాటం చేసి ఆదర్శ సమాజాన్ని స్థాపించాలని చెప్పాడు. ఆ దోపిడీకి గురయ్యే వర్గంలోనే తామున్నామని, అందువల్ల నిత్యం ఆ వర్గ చైతన్యంతో మసులు కోవాలని చెప్పాడు. బుచ్చమ్మకు ఆ విషయాలేవీ అర్థమయ్యేవి కావు. ఎప్పుడు చెప్పినా ‘‘ఏవోనయ్యా.. ఆ విసయాలేవీ నాకు తెల్దు..’’ అనేసేది. ఎంత విన్నా, ఎంత ఆలోచించినా ఆ సిద్ధాంతం తిరుపతయ్యకూ అర్థమయ్యీ కానట్టే ఉండేది.

ఇప్పుడు కాట్లాటలో కుక్కలు ప్రదర్శించిన ముఠాతత్వాన్ని చూసి మర్మమేదో బోధ పడినట్లని పించింది తిరుపతయ్యకు. అవతలి వీధి కుక్కలు ఇవతలి వీధికి రాగానే ఇవతలి వీధి కుక్కలు ఏకమై తమ వర్గచైతన్యం ప్రదర్శించడంతో వర్గదృష్టి అంటే ఏమిటో స్పష్టంగా తెలిసొచ్చినట్లని పించింది అతగాడికి.

‘‘కమూనిస్టోళ్లు సెప్పింది కరెస్టే..’’ అంటూ లేచాడు. ఆవులిస్తూ ఒళ్లు విరుచుకుని రంగారావు ఇంటివైపు చూసి ‘‘ఏటీ దేవులాట ఈ మనిసి కోసం..’’ అని విసుక్కున్నాడు. గభాగభా ఇంటికెళ్లి భోంచేసి వచ్చేస్తే బాగుంటుందని చెప్పి అక్కడ్నుంచి కదిలాడు. పక్క వీధిలోనే అతనిల్లు. రంగారావు ఉంటున్న అడవివరానికి అరకిలోమీటరు దూరం. మనిషి ఇలా వెళ్లి అలా వచ్చేసి యధాప్రకారం చెట్టుకిందకు పోయి కూర్చున్నాడు. వడగాల్పు కొడుతోంది. నేరేడు చెట్టు ఆకులు సన్నగా కదుల్తున్నాయి. వాతావరణం నిర్లిప్తంగా ఉంది.

పెద్దింటివైపు యధాలాపంగా ఓసారి చూసి ముఖం తిప్పుకున్నాడు తిరుపతయ్య. నల్లకుక్క ఇంకా చెత్తకుప్ప దగ్గరే ఉంది. ఎండకు నాలుక వేలేసుకుని రొప్పుతూ కూర్చునుంది. భోజనాలు అయిపోయా యేమో, పెద్దింటావిడ రెండు గిన్నెలతో మిగిలిన అన్నం, కూరలు తెచ్చి చెత్త కుప్పవద్ద పారబోసింది. నల్లకుక్క గబుక్కున లేచి ఇంటావిడవైపు క్రీగంట చూస్తూ మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ వెళ్లి ఆబగా తినడం మొదలెట్టింది. ఎక్కడినుండి చూసిందోగానీ తెల్లమచ్చల కుక్కపిల్ల ఉత్సాహంతో తోక ఊపుకుంటూ అక్కడికి వచ్చేసింది. రావడమైతే వచ్చిందిగానీ నల్లకుక్క దానిని చూసి గుర్రుపెట్టడంతో అది ఆహారం అందనంత దూరంలో తటపటాయిస్తూ నిలబడిపోయింది. కాసేపు చూసి, తననూ తిననివ్వ మన్నట్లు తోకాడిస్తూ ముందుకు వెళ్లబోయింది. అది ఒక్క అడుగు వేసిందో లేదోగానీ నల్లకుక్క తన కోరలు బయటపెట్టి కరవడానికి దాని మీదకొచ్చింది. అదింకా కరవనేలేదు; ఆ కుక్కపిల్ల భయంతో కయ్‌ ‌కయ్‌మని అరుస్తూ దూరంగా పారిపోయింది.

‘‘మళ్లీ ఏటయ్యినాదే మీకు..’’ అని గొణు క్కున్నాడు తిరుపతయ్య.

ఓ కోడి దుమ్ము ఒకటి నల్లకుక్క కంటబడింది. దాని దృష్టి దానిపైకి మళ్లింది. తింటున్న ఆహారాన్ని వదిలిపెట్టి ఆ దుమ్ము నోటకరుచుకుని ఓ మూలకు పోయి దానిని కొరుకుతూ, లోపల మూలుగును ఎలాగైనా జుర్రుకోవాలని దానితో కుస్తీ పడుతూ కూర్చుంది. ఇదే సందని మెల్లగా తెల్లమచ్చల కుక్కపిల్ల పిల్లిలా ఆహారం దగ్గరకు వెళ్లి తినడం మొదలెట్టింది. అంతే! తన ఆహారం ముడతావా అన్నట్లు నల్లకుక్క ఆగ్రహోదగ్రురాలై అది పిల్ల అని కూడా చూడ కుండా తెల్లమచ్చల కుక్కని కరిచిపారేసింది. పాపం! కుక్కపిల్ల కుయ్యో మొర్రోమని రోడ్డుమీదకు పారి పోయి బిక్కుబిక్కుమంటూ చూస్తూ నిల్చుండి పోయింది. వీటి గొడవతో ఆ వీధిలోని మిగిలిన కుక్కలు కూడా అక్కడకొచ్చిపడ్డాయి. దున్నపోతులా ఉన్న కుక్కొకటి అంతవరకు చెత్తకుప్పమీద ఆధిపత్యం చెలాయిస్తున్న నల్లకుక్కను తరిమేసి తను ఆహారం తినడం ప్రారంభించింది. అది తినడం సహించలేక పందుల్లాంటి మరో రెండు కుక్కలు కలిసి దానిమీద పడి అరుస్తూ దానిని తిననివ్వకుండా చేసి తాము తినేందుకు ప్రయత్నించాయి. అవి ఒకదానికొకటి కలబడి గొడవపడుతుండగా, తెల్లమచ్చల కుక్కపిల్ల ఓ వారగా వెళ్లి తను తినేందుకు మళ్లా ప్రయత్నిం చింది. అదిలా ఒక్క ముద్ద నోట్లో పెట్టిందో లేదో కుక్కలన్నీ వెళ్లి అన్నంమీద కలబడ్డాయి. ఎనుబోతుల మధ్య లేగదూడలా తెల్లమచ్చల కుక్కపిల్ల నలిగి పోయింది. అది చూసి విస్తుపోయాడు తిరుపతయ్య. లేచి వాటిని కొట్టి తరిమేద్దామనుకున్నాడు. లేచాడు. కానీ కుక్కల గొడవలోకి తను పోవడం ఎవరైనా చూస్తే బాగోదని చెప్పి ఆగిపోయాడు. రంగారావు ఇంటివైపు చూసి ‘‘ఈ బావొకడు.. నా డబ్బులేయో నా మొఖాన పారేత్తే నా మానాన నాను పోతాను గదా.. ఇయ్యడూ సెయ్యడూ..’’ అని ఈసడించు కుంటూ మళ్లీ పునాది పైకి ఎక్కి కూర్చున్నాడు.

బయటకు మాట్లాడే అలవాటుగల మనిషి తిరుపతయ్య. పక్కన ఎవ్వరూ లేకపోయినా కొన్ని సందర్భాలలో తనలో తానే మాట్లాడేసుకుంటుం టాడు. అలా మాట్లాడుతుంటేనే ‘‘పిచ్చేటి నీకు’’ అని అప్పుడప్పుడూ కసురుకుంటుంది అతని భార్య బుచ్చమ్మ. కుక్కలు కాట్లాడుకుంటూనే ఉన్నాయి. వాటివైపు నిర్లిప్తంగా చూస్తుండిపోయిన తిరుప తయ్యలో కొత్త ప్రశ్నలు ఉదయించాయి; అవి పాత వాటితో ఘర్షణపడ్డం మొదలుపెట్టాయి. ఇందాక అవతలి వీధి కుక్క అని, తమలోనిది కాదని ఒక వర్గ స్పృహతో కలిసి వాటిని తరిమికొట్టిన కుక్కల గుంపేనా ఇది! అవతలి వీధి కుక్కలను తరిమికొట్టే టప్పుడు చూపిన వర్గ స్పృహను తమకు ఆహారం దొరికినప్పుడు తినే దగ్గర ఎందుకు చూపలేదు? తామంతా ఒక వీధివాళ్లం, సోదరుల్లా కలిసిమెలిసి తిరుగుతున్నాం.. కలిసి పంచుకు తిందాం అని ఎందుకు అనుకోలేకపోయాయి? అతడిలో ఒకటే తర్జన భర్జన! అంతవరకు అర్థమైనట్టే అనిపించిన సిద్ధాంతంమీద మళ్లీ సందేహాలు ముసురుకున్నాయి. వర్గచైతన్యంపై తను విన్నదీ, తెలుసుకున్నదీ అంతా కలగాపులగమైపోయి గందరగోళంలో పడిపోయాడు మనిషి.

రంగారావు ఇంటికి ఎప్పుడు వచ్చాడోగానీ లోపల్నుంచి ఎంగిలి చేయి కడుక్కోవడానికి బయటకు వచ్చాడు. తిరుపతయ్య అతడిని చూసి ‘‘హమ్మ! దొరికినాడ్రా మనిసి..’’ అనుకుంటూ పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ గభాగభా అతని వద్దకు వెళ్లాడు. రంగారావు ఎంగిలి చెయ్యి కడుక్కుని భుజా నున్న తువ్వాలుతో మూతి తుడుచుకుంటూ ‘‘ఇదుగో తిరుపతీ.. నీకెందుకు సెప్పు ఈ యాతన.. నలుగు రితో పాటే నీకూనూ.. ఇంతివ్వాల.. అంతివ్వాలని అల్లరిపెడితే ఎలాగ..’’ అన్నాడు అనునయంగా.

‘‘అదేటి రంగబాబు అలగంతావు.. నీ కమిసను కింద అంత తెగ్గోసీసుకుంతే ఎలగ.. అది నా కట్టం!’’

‘‘అదిగో మళ్లీ అదే మాట.. నాను నీకు పనిచ్చి నాను కదా.. నానే నీకు పనియ్యకపోతే ఎవుడయ్యా నిన్ను పిలిచి పనిత్తాడు.. ఆ మాత్రం కమిసను నాకు తినీ హక్కునేదా..’’

‘‘అదికాదు రంగబాబూ! నాను పది రోజులు పనిజేసినాను. రోజు కూలీ 350 రూపాయలన్నావు.. అంటే పదిరోజులకి మూడేల ఐదొందలు. ఆ కట్టంలో నీ కమిసను రోజుకి యాభై రూపాయలు. అంటే ఐదొందలు! అంత నాను ఇచ్చీసుకుంతే ఎలగ.. ఆ అప్పారావు మేస్త్రీ పాతికే తీసుకుండీవోడు.. పోనీ అలగజేసి తీసుకున్నా మనసుకు అంత కట్టం అనిపించదు.. యేటీ మరీ యాభై రూపాయలంతే..’’

‘‘ఎవుళు.. మూడు నెల్ల కిందట సచ్చిపోండు ఆ అప్పారావా.. ఆ బావు దారేరు.. ఉప్పుడు లేబరి మేస్త్రీలందరూ ఏ లెక్కన కూలీలకాడ తీసుకుంత న్నారో నానూ అంతే తీసుకుంతన్నాను.. ఎక్కువ తీసుకోడంనేదు.. కూలీలు సాలకపోతే ఎవుళినన్నా తీసుకురమ్మని జోగారావుకి సెబితే నిన్ను తీసుకొచ్చి నాడు. ఈ లెక్కలు ఆడేటీ సెప్పనేదా నీకు..’’ అనడిగాడు విసుక్కుంటూ రంగారావు.

‘‘నువ్వూ భవన నిర్మాణ కార్మిక సంఘంలో మనిసివే.. నానూ అందులో వోడినే.. కూలోల కట్టం తెలిసిన నువ్వూ అలాగే అనీసి.. అల్లాడూ అలగే అనేత్తే ఇంకేటి నాయమున్నాది..’’

‘‘నువ్వు సెప్పింది బానే వుందిగానీ తిరపతీ, లేబరి కాంట్రాట్టర్లందరూ ఒక కట్టుబాటుగా ఆ లెక్కనే తీసుకుంతన్నారు.. ఎవుళైనా కూలీలకాడ్నించి కమిసను తక్కువ సేసి తీసుకుంటే ఆళ్లు వొల్ల కోరుమరి..’’

ఇక అడిగి ప్రయోజనం లేదనుకున్నాడు తిరుపతయ్య. ‘‘సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం..’’ అనుకుని అతనిచ్చింది పుచ్చుకుని రోడ్డునపడ్డాడు. రంగారావు చేసిందానికి తనలో తానే తిట్టుకుంటూ ఇంటిదారి పట్టాడు.

‘‘వల్లకోరంట.. వల్లకోరు ఎవుళోగానీ.. ఈయన గోరి తల తీసి మొలేత్తారు మరి.. ఎంతసేపూ పక్కోడిది పడేసుకుందామనే పెతీవోడికీ.. అందుకే లోకం ఇలగన్నాయం అయిపోతంది.. అయినా నా రూపాయి తిన్నోడెవుడూ బాగుపడిపోడులే..’’ ఉద్రేకంతో అడుగులు వేగమందుకున్నాయి.

‘‘తోటి భవన నిర్మాణ కారిమికుడిననీ సూన్నేదు.. ఏటి సూసినాడు వొర్గం.. ఎవుడో కంపెనీవోడు శ్రామిక జనాల్ని దోసెత్తన్నాడంటే ఆడి వర్గ బుద్ధి అంత అనుకోవచ్చును.. మరి ఇతగాడి బుద్దేవైనాది.. గడ్డితిన్నాదా? ఓ కూలోడు ఇంకో కూలోడిని దోసియ్యడమేటి.. దోపిడీకి గురయ్యే కూలోడికి దోపిడీ చేసీ గుణమెలగొచ్చినాది..’’

అనాలోచితంగా తన నోటనుండి వచ్చిన ఆ మాట అతడిలో కొత్త ఆలో చనల్ని రగిలించింది. నోట్లో నోట్లో గొణుక్కోవడం మానేశాడు. వీధి కుక్కల కాట్లాట దృశ్యం మళ్లీ తన మనోఫలకం మీదకొ చ్చింది. వాటి గొడవతో తన గొడవకు లంకె కుది రింది. అంతవరకు అర్థం కాకుండా ఉండిపోయిన వీధి కుక్కల ద్వంద్వ బుద్ధి తాలూకా ఆంతర్యం బోధ పడింది. అవతలి వీధి కుక్కలను తరిమేసినప్పుడు అవి వర్గ స్పృహను ఎందుకు చూపాయో, తమకు ఆహారం దొరికినప్పుడు తినే దగ్గర ఎందుకు చూప లేదో అవగతమైంది. చెత్తకుప్పపై ఆహారం దొరికి నప్పుడు వేటికవి స్వార్థంతో ఆ ఆహారాన్ని దక్కించు  కుని తినెయ్యాలని కలబడ్డాయని, అలాగే తమ వీధిలో తమ ప్రాంతంపై తమ ఆధిపత్యాన్ని కాపాడుకోకపోతే అంతవరకు తమ బతుక్కి ఆసరా అవుతూ వస్తున్న ఆ ప్రాంతం తమకి కాకుండా పోతుందన్న భయంతో అవన్నీ వర్గ స్పృహను స్వార్థంతోనే ప్రదర్శించాయని గ్రహించాడు. అంతలో ఇల్లు వచ్చేసింది.

వాకిలిలో నులక మంచం వాల్చుకుని ‘‘ఎవుడి జాగాలో ఎవుడు జొరబడితే ఎవుడూరుకుంతాడు.. ఎవుడైనా అడ్డగింతాడు.. కుక్కలూ అదే పని సేసినాయి.. కడుపుదగ్గరకొచ్చీసరికి దేని కడుపు అయ్యి సూసుకున్నాయి..’’ అనుకుంటూ కూర్చు న్నాడు. ‘‘ఓలి బుచ్చమ్మా! ఎక్కడ సచ్చినావే.. లోటాతో మంచినీళ్లట్రాయె..’’ అని కేకేశాడు. బుచ్చమ్మ ఆ సమయంలో ఇంట్లోలేదు. ఏవో సరుకుల కోసమని కొట్టుకెళ్లింది. ఇంటివద్ద అతడి కొడుకున్నాడు.

‘‘మళ్లా ఇతగోడు కార్మిక సంఘంలోన ఏదో పదవి ఎలగబెడతన్నాడు.. ఎవర్ని ఉద్దరించేద్దారనో.. ఇసుమంటోళ్లే కార్మికరాజ్జెం తెచ్చెత్తారు..’’

కొడుకు మంచినీళ్లు తెచ్చిచ్చి ‘‘ఎవరినయ్యా అలా తిడుతున్నావు..’’ అనడిగాడు. విషయం చెప్పాడు తిరుపతయ్య.

‘‘చూడయ్యా.. కార్మిక రాజ్యంకోసమని కార్మిక సంఘం కట్టేవాళ్లు ఎంతమంది చెప్పు? ఎవరో సమాజంకోసం జీవితాలను ధారపోసే కొంతమంది మహాను భావులు తప్ప ఎవరన్నా సంఘాల్లో చేరేది వాళ్ల సంక్షేమం చూసుకోవడానికే.. ఈ రంగారావు అలాగ సంఘం కట్టినోడే.. మనిషి ఎప్పుడైనా ఎక్కడైనా తన ప్రయోజనమే చూసుకుంటాడు. వ్యక్తికి తన స్వార్థమే పరమావధి. తన స్వార్థం కోసమే మనిషి వర్గంలో ఉంటాడు తప్ప, కేవలం వర్గ ప్రయోజనం కోసం కాదు. తన ప్రయోజనం నెరవేరదు అంటే మనిషి ఏ సంఘమూ కట్టడు..’’ అని చిలక్కి చెప్పినట్లు చెప్పాడు తండ్రికి.

‘‘నీ మాట నిజవేపర.. నాదారోడిలోనా సోర్దం వున్నాది.. దోపిడిదారుడిలోనా వున్నాది.. ఎవుడు దోపిడీదారుడు.. ఎవుడు కాడని.. ఎవుళో కొద్దిమంది నీతికీ జాతికీ కట్టుబడినోళ్లు తప్ప ఎవుడికి అంకింది ఆడు దోత్తన్నాడు.. పెద చేప చిన చేపను తింటే, ఆ చినచేప తనకన్నా చిన చేపను తిం•న్నాది.. సోర్దంతో పెట్టుబడిదారుడు కారిమికుడిని దోత్తంటే, ఆ సోర్దం సూసుకోనే పెట్టుబడిదారుడి కాడ ఆ కారిమికుడు సర్దుకుపోతన్నాడు.. ఇదీ ఇతగాని సైతన్యం! ఇంకేటి వొర్గపోరాటంలే! సర్నే ఈ కబుర్లకేంగానీ..’’ అని నిక్కరుజేబులో చెయ్యిపెట్టి రంగారావిచ్చిన డబ్బులు తీసి ‘‘జార్తపెట్టు..’’ అని కొడుక్కిచ్చాడు.

– వెంకటమణి ఈశ్వర్‌

About Author

By editor

Twitter
Instagram