సనాతనమైనది భారతీయత. సత్యానికి, ధర్మానికి పెద్ద పీట వేసింది. ‘సత్యంవద, ధర్మం చర’ అన్న వాక్యాలు భారత ప్రజల జీవనస్రవంతిలో శిరోధార్యమై వెలుగొందుతూ, తమ గొప్పతనాన్ని యుగయుగాలుగా చాటుతూనే ఉన్నాయి. ధర్మాన్ని పాటించడం అత్యంత అవశ్యమని ఎన్నో చక్కటి ఉదాహరణలతో తెలియజేస్తోంది మహాభారతం. ముఖ్యంగా మనం గుర్తుంచుకోదగిన పాత్రలు ధర్మరాజు, దుర్యోధనుడు. ధర్మనిరతికీ, శ్రేయోగుణానికీ ధర్మరాజు; దుష్ట ఆలోచనలకూ, దుర్నీతికీ ఉదాహరణగా దుర్యోధనుడు సాక్షాత్కరిస్తారు.

ధర్మమే సకల జగత్తుకూ ఆధారం అని తైత్తరీయారణ్యకం అంటుంది. అభ్యుదయాన్ని కలిగించేది ధర్మం అంటారు వైశేషికులు. వేదాల్లో చెప్పిన యాగాదులే ధర్మమంటారు మీమాంసకులు. చలనాన్ని నియంత్రణ చేసేది, గుణ సంబంధం లేనిది, రూపంలేనిది, అజీవమయినదీ ధర్మమని రుషుల నిర్వచనం.

అసలు ధర్మమనే మాటే చిత్రమైనది. ఈ విశ్వాన్ని ధరించేది ధర్మం. ఏది సంఘాన్ని కట్టుబాట్లలో నిలుపుతుందో అదే ధర్మమని మహాభారతంలోని కర్ణపర్వంలో అంటాడు శ్రీకృష్ణుడు. అతి పురాతనమయిన ధర్మసారాన్ని ఏ వ్యక్తో, ఏ ప్రవక్తో కనిపెట్టలేదు. అనేక అనుభవాల నుండి కాలం కనుగొన్న సంపూర్ణమతమే ధర్మం. కాలక్రమంలో జన వ్యవహారంలో అనేక రూపాలు ధరించింది. వర్ణాశ్రమ ధర్మాలను ధర్మమన్నారు కొందరు. వంశాచారాలూ ధర్మమే. లోకంలో మనం పాటించే ఆచారవ్యవహారాలనే ధర్మంగా పరిగణిస్తున్నారు. లోకనీతి కూడా ధర్మం కన్న భిన్నం కాదు. ఇలా స్థూలదృష్టికి విభిన్న అర్థాల్లో, రూపాల్లో గోచరిస్తున్నా సూక్ష్మదృష్టితో చూస్తే ఇవన్నీ ఒకే పరమధర్మం తాలూకు రూపాలు. ధర్మం మనస్సును నియంత్రిస్తుంది. ఇతరులకు హాని కలిగించని రీతిలోనే కోరికలు అనుభవించాలని శాసిస్తుంది. ధనం సంపాదించమంటుంది మనస్సు. న్యాయమార్గంలోనే, అదీ అవసరం మేరకే సంపదను ఆర్జించమంటుంది ధర్మం. అంతేకాదు, సంపాదించిన దానిలో కొంత దానం చేయాలనీ చెబుతుంది.

నీతి కూడా ధర్మ స్వరూపమే. మనిషి పతనం కాకుండా ఉండేందుకు మన సంప్రదాయం నీతి నియమాలను ఏర్పరిచింది. వ్యక్తిగత నీతి, సామాజిక నీతి, వాణిజ్యనీతి, రాజనీతి, యుద్ధనీతి…ఇలా మనిషి మనస్సును అడుగడుగునా నియంత్రించే నీతులున్నాయి. ధర్మంవల్ల, నీతివల్ల మనస్సు నియతమై ఉన్నప్పుడు ఈర్ష్య, కోపం, దురాశ మొదలైనవి మన మనసులో చేరవు.

నేటి కాలంలో శరవేగంతో జరుగుతున్న అనేక పరిణామాల హోరులో, ఈ వేదోపదేశం ఒక దిక్సూచి. నూతనత్వపు ఒరవడిలో చాలా దూరం కొట్టుకువచ్చి, ఏం కోల్పోయామన్నది తెలుసుకొని, చాలా మంది ఇప్పుడిప్పుడే, నేత్రాలు తెరుచుకొని, సనాతన ధార్మిక ప్రమాణాల వల్ల కలిగే ప్రశాంతత ఏమిటో గ్రహిస్తున్నారు. వారి అనుభవాలు మనకు గుణపాఠాలు కావాలి.

ఒక వ్యామోహం మనల్ని లాగుతున్నప్పుడు ఒక సనాతన ధర్మసూత్రం తన హెచ్చరికతో తన వైపు రమ్మని పిలుస్తుంది. ఆ సమయంలో ఆ ధర్మ సూత్రాన్ని ఆధారంగా గ్రహించి నిగ్రహంతో నిలదొక్కుకున్నప్పుడు పూర్ణమైన జీవన మాధుర్యాన్ని ఆస్వాదించగలం.

అర్థ, కామ, సాధనలోని వేగాన్ని నియంత్రించేది ధర్మమే. అది సనాతన సత్పథం. సమాజ క్షేమానికి అదొక్కటే శరణ్యం. విలువలను బోధించి, జీవితాల్లోకి అందించినప్పుడే ప్రస్తుతం అలుముకున్న అనిశ్చిత అవ్యవస్థను పరిష్కరించగలం.

మనల్ని పెద్దవారు ‘రామా! కృష్ణా!’ అని అనుకోమన్నారని అంటే ఒక మూల కూర్చుని రామా, కృష్ణా అని భజన చేసుకోమని కాదు అర్థం. రాముణ్ణి, కృష్ణుణ్ణి అధ్యయనం చేసి, జీవితాలకు అనుసంధానం చేసుకొని జీవించమని భావం. అందుకోసమే వాల్మీకి, వ్యాసుడు మనముందు రాముడిని, కృష్ణుడిని ఉంచారు. వారి ఆధారంగా ధర్మాన్ని అర్థం చేసుకొని, జీవితాలను మలచుకోవడమనేది పెద్దల ఉద్దేశం.

ఎల్లప్పుడూ ధర్మాన్నే ఆశ్రయించాలి!

ధర్మార్థకామమోక్షాల విషయంలో ఇందులో ఉన్నదే ఎక్కడైనా ఉంది. దీనిలో లేనిది, మరెక్కడా లేదు అని వైశంపాయనుడు జనమేజయునికి చెప్పాడు. సమస్త విజ్ఞానమూ వేదంలో ఇమిడి ఉన్నట్లుగానే మహాభారత ఇతిహాసంలోను ఇమిడి ఉండడంలో ఆశ్చర్యం లేదు. ఎప్పుడు ధర్మానికి గ్లాని కలిగినా, దాని పర్యవసానంగా అధర్మం పెచ్చుపెరుగుతుంది. దాన్ని తటస్థీకరించడానికి దైవ ప్రకృతి ప్రయత్నిస్తుంది. ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇలా చెప్పాడు. ధర్మానికి హాని కలిగి, అధర్మం విజృంభించి నప్పుడు, ధర్మాన్ని స్థిరంగా ప్రతిష్టించటానికి తాను అవతరిస్తానని పురుషోత్తముడు ప్రకటించాడు.

ధర్మం వల్లనే అర్థం లభిస్తుంది. ధర్మం వల్లనే కోరికలు నెరవేరుతాయి. ధర్మం వల్లనే ఉత్తమగతులు లభిస్తాయి. ఆ కారణం చేతనే అన్ని విధాలా ధర్మాన్నే ఆశ్రయించాలి. అర్థ కామ మోక్షాలు.. ధర్మం అనే పునాదిపైన ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ప్రథమమూ, ప్రధానమూ ధర్మమే.

– పూర్ణిమాస్వాతి

About Author

By editor

Twitter
Instagram