సిరివెన్నెల స్మృతి

‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, 20 మే, 1955 – 30 నవంబర్‌, 2021


‘‘‌కాలమనే హంతకి నాటి మధుర జీవనాన్ని దగ్ధం చేసింద’’ని వాపోయారు సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులవారు. అలా వేయి దీపాల వెల్తురు ఒక్కసారి కొండెక్కిపోయినట్టు అంతులేని తిమిరం, అంచులేని శూన్యం ఒక్కసారిగా ఆవహించాయి. తీక్షణమైన, తీవ్రమైన స్వరం నిశ్శబ్దం పరదాల వెనక అర్థాంతరంగా అంతర్థానమైపోయి ఎవరి పిలుపూ వినపడనంతగా అనంతదూరాలకి తరలి వెళ్లి భయపెడుతున్న మౌనం ఇప్పుడు ప్రతి తెలుగువారి అనుభవం. జగమంత కుటుంబం నాది అని ఎంతో ఆత్మవిశ్వాసంతో ప్రపంచాన్ని తన బాహువుల్లోకి వెచ్చగా పొదువుకున్న కవి.. వెంటనే ఏకాకి జీవితం నాది అని తనని తాను అందనంత దూరంగా విసిరేసుకోవడం ప్రతి తెలుగిళ్ల వెలితి. ఒక మహా అధ్యాయం ముగింపుని ముందుకు లాక్కొచ్చిన విషాదం ఇప్పుడు తెలుగు లోగిళ్లని బాధిస్తున్న దృశ్యం. అది సిరివెన్నెల నిష్క్రమణం.

శాస్త్రిగారి పాటల్లో లైనుకో గీతోపదేశం వినిపిస్తుంది. వాక్యానికో ఉన్నతమైన భావం కనిపిస్తుంది. ప్రతి చరణంలో జీవితేచ్ఛ పరవళ్లు తొక్కుతూ తడిగా తాకుతూ వెళ్తుంది. కాగితం మీద అక్షరాల్లో పరుచుకునే జీవనసారం ప్రతి క్షణాన్ని ఆప్యాయంగా తడుముతుంది. మొత్తంగా బతుకు పొడవునా పచ్చని పండగ తోరణం కడుతుంది. ‘‘నింగి ఎంత పెద్దదైన రివ్వుమన్న గువ్వపిట్ట రెక్కముందు చిన్నదేనురా..’’  అన్న కవి వాక్యం వింటే, జీవితంలో సాధించలేనిది ఏదీ ఉండదన్న ఆశ వేలరెక్కలతో విచ్చుకుంటుంది. అమాంతం ఆకాశం అందినట్టు, ఇంద్రధనసు ఇంట్లోకి అతిథిలా వచ్చినట్టు అనిపిస్తుంది జీవితాన్ని పాజిటివిటీతో నింపేస్తుంది. బాధపడ్డానికీ బెంబేలెత్తిపోడానికీ జీవితంలో చోటు లేదని స్పష్టమవుతుంది.

పసిడిపతకాల హారం కాదురా విజయతీరం.. ఆటనే మాటకర్థం నిను నువ్వే గెలుచు యుద్ధం’ అని ఓ పాటలో గెలుపు తాలూకు దృక్పథాన్నే మార్చేశారాయన. ఇలాంటివి ఆ వెన్నెల్లో కోకొల్లలు కలువలై కళ్లు తెరి చాయి. శాస్త్రిగారి పాట కేవలం పాట మాత్రమే కాదు. పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ ‌పాఠం. చురుక్కుమనే వాతలు, నిష్కర్షగా తోచే కోతలు, పారమార్థికమైన చేతలు, వైయక్తికమైన గీతలు, వివిధ ఆలోచనల కల నేతలు, అద్భుత ఆవిష్కరణల జ్యోతలతో సిరివెన్నెల పాట ధగద్ధగాయామానంగా మెరుస్తూ ఉంటుంది.

సిరివెన్నెల సినిమా కవే గాని, ఆయన సృజన సినిమా చెరసాల వదిలి నర్తనశాలై విజృంభిస్తుంది. సినిమా కొలమానాలు జారిపోయినా విడిగా ఆయన పాటకి అస్తిత్వం ఉంటుంది. సందర్భంతో సంబంధం లేకుండా ఆయన పాటకి సాహితీపరమైన ఔన్నత్యం దక్కుతుంది. సినిమా ఫార్ములా తాలూకు ఇరుకు సందుల్లోంచి తెలివిగా తప్పుకుని, స్క్రూలు బిగించిన పరిమితుల్లోంచి సమర్థంగా బయటపడి, పాలనవ్వుల పలకరింపులతో పాటని తీర్చిదిద్దడమే సిరివెన్నెల ప్రత్యేకత. ఆయన విజయసూత్రం. పెద్దవాళ్ల నుంచి కుర్రతరం వరకు ఆయన పాట బలీయంగా చేరుకోడానికి, ఇదే నేపథ్యం.

ఇదంతా కవిగా ఆయన నేర్పు. ఆయన పాటకి ఒక పార్శ్వం. ఇక రెండోది ఆయన మనందరికీ చెప్పిన వ్యాకరణం, తన పాటల్ని అర్థం చేసుకునే సంవిధానం – అంతర్దర్శనం. ఎవరినివాళ్లు ప్రశ్నించుకోవడం. భౌతికంగా కనిపించే అర్థాల దశ నుంచి గాఢంగా, గూఢంగా రగిలే ఆలోచనల అగ్గిరవ్వని గుర్తించమంటారాయన. బయట కాదు.. పైపైన కాదు అనేది ఆయన తపన.వేల పాటల్లో ఆయన అంతర్లీనంగా చెప్పిందీ.. ఆచరించమని అన్యాపదేశంగా ఆదేశించిందీ అదే. నిత్యజీవితం విసురుతున్న ఎన్నో సవాళ్లకి, సమాజంలోని విపరీత ధోరణుల తాలూకు దుర్మార్గాల నీడలకి, వ్యక్తిగతంగా పీడిస్తున్న ఎన్నో సమస్యల జాడలకి పరిష్కారం.. పిరికితనంతో వాటికి దూరంగా పారిపోవడం కాదనేది శాస్త్రిగారి అభిభాషణ. నిజంగా ఏదైనా ఒకటి సమస్య అని నువ్వు అనుకుంటే, కొంపలు అంటుకుపోయేలా ఉన్నాయి అని యథార్థంగా కష్టం వస్తే – దాన్ని ఎదుర్కునే శక్తి నీలోనే ఉంది అనేది ఆయన ఫిలాసఫీ. అసలు అది సమస్య అవునో కాదో ఒకసారి లెక్క చూసుకోమంటారాయన. ఒకవేళ నిజంగా సమస్యే అయితే, దాన్ని పోరాడ్డానికి పదును పెట్టాల్సిన ఆయుధాలు, దగ్గర ఉంచుకోవాల్సిన అస్త్ర శస్త్రాలు అన్నీ పాటల్లో అందించారా చింతనాశీలి.

చిరునవ్వుతో మొదలు…

ఎక్కడి వరకూనో ఎందుకు మనలో ప్రతి ఒక్కరూ నవ్వడమే మర్చిపోతున్నాం. పక్క మనిషిని చిర్నవ్వుతూ పలకరించడానికి కూడా టైమ్‌ ‌లేనంతగా బిజీ అయిపోతున్నాం. అదొక్కటే ఎన్ని బంధాలను ముడివేస్తుందో.. ఎన్ని దూరాల్ని దగ్గర చేస్తుందో.. ఎంత కొత్తగా ఈ ప్రపంచాన్ని పరిచయం చేస్తుందో అర్థం చేసుకొమ్మని శాస్త్రిగారు చిలక్కి చెప్పినట్టు చెప్పారు ఓ పాటలో. నవ్వలేని మానసిక దౌర్బల్యానికి అక్షరాలతో మందు వేశారు. ‘‘పెదవి ప్రమిద నిలపనీ నవ్వు జ్యోతిని’’  అని పొయటిగ్గా పొందిగ్గా చెప్పారు. వెక్కిళ్లు పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా అని మౌలికమైన ప్రశ్నని సంధిస్తూ ఇలా హితం చెప్పారాయన ‘‘మనుషులనిపించే రుజువు..మమతలు పెంచే రుతువు.. మనసులను తెరిచే హితవు.. వందేళ్లయినా వాడని చిరునవ్వు.’’

యువతరం అంటే శాస్త్రిగారికి అవ్యాజమైన ప్రేమ. ఎక్కణ్ణించి ఎక్కడికో గంతులు వేసే ఆలోచనలు, స్థిరత్వంలేని లక్ష్యాలు, ఏదో చేసెయ్యాలనే తపన, ఏం చెయ్యాలో తోచని గుంజాటన, చిన్న సమస్యొస్తే నిజానిజాలు బేరీజు వేసుకోకుండా తొందరపాటు నిర్ణయాలు.. లాంటివన్నీ ఛానలైజ్‌ ‌చేయగలిగితే రేపటి భారతం బాగుంటుంది అని శాస్త్రిగారి ఆలోచన. అందుకే ఐఐటి లాంటి విద్యాసంస్థల్లో ఇతరత్రా సందర్భాల్లో యువతని ఉద్దేశించి మాట్లాడాలంటే ఆయన చాలా ఆసక్తి చూపించేవారు. వాళ్లతో ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడేవారు. వాళ్లడిగే ప్రతి ప్రశ్నకీ ఓపిగ్గా జవాబిచ్చేవారు. సినిమాల్లో ఆ వయసువాళ్లకి ఏదైనా చెప్పే అవసరం, అవకాశం వచ్చినప్పుడల్లా ఆ పాటని అద్భుతమైన వ్యక్తిత్వ వికాస గ్రంథంగా మార్చేసేవారు శాస్త్రిగారు. ఆ వయసులో అనాలోచిత ప్రతిజ్ఞలు, తీర్మానాల్లో దౌర్బల్యం, మినహాయింపులు, ఆరంభ శూరత్వాలు, తప్పటడుగులూ, తొట్రుబాట్లు అన్నిటినీ పరిష్కారాలున్నాయి ఆయన పాటల్లో. ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోగలిగితే.. వాటిని ఆచరణలో పెట్టగలిగితే జీవితం పచ్చగా ఉంటుంది. ఏ నీడలూ జాడలూ దరికి కూడా చేరవు.

ఉత్తేజం.. ఉద్వేగం…

దేహముంది, ధైర్యముంది, నెత్తురుంది, సత్తువుంది. ఇంతకంటే సైన్యముండునా? ఆశ నీకు అస్త్రమౌను. శ్వాస నీకు శస్త్రమౌను. ఆశయమ్ము సారథౌనురా.. అని ఉత్తేజాన్ని ఉద్వేగాన్ని నింపిన పాట యువతకి ఒకపాఠ్యగ్రంథం. పోరాటానికి కావాల్సిన సమస్త సంబారాలూ నీలోనే ఉంటే చుట్టూ చూస్తావెందుకు అని ఆయన పాట విన్నాక, ఊపిరి నిండా అంతులేని ఆత్మవిశ్వాసమే ఉంటుంది. నడకలో ఎదురుదెబ్బ తగిలితే.. గమనం ఆగిపోకూడదని శాస్త్రిగారు అందించిన స్ఫూర్తి అదే పాటలో ఇలా ఉంటుంది.. ‘‘నొప్పిలేని నిమిష మేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా. నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు.. బతుకు అంటే నిత్య ఘర్షణ.’’

పిల్లాడు ఏదో పోటీ పరీక్ష రాశాడు. ఫలితం అనుకూలంగా లేదు. ఇంకొకడు ఒక మౌఖిక పరీక్షకి వెళ్లాడు. ఆ ప్రయత్నం అనుకూలించలేదు. ఎక్కువ మందికి వెంటనే స్ఫురించేది – ఈ బతుకెందుకని. ఒక్క నిమిషం ఆలోచించగలిగితే ఒక నిండు ప్రాణం నిలబడేదే అని అందరూ తలో సలహా పడేస్తారు గానీ అలాంటి సందర్భానికి శాస్త్రిగారు ఓ ఆంథమ్‌ ‌లాంటి పాట రాశారు. ‘‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి.. ఎప్పుడూ వదులుకో వద్దురా ఓరిమి..’’ అని మొదలయ్యే ఈ పాట విని కొన్ని ఆత్మహత్యలు ఆగాయంటే ఆ పాటకి అంతకన్నా ఏం కావాలి? కుంగిపోతున్న వెన్నెముక తాలూకు ప్రాణనాడుల్లో ఉత్తేజాన్ని నింపే మహత్తర మానవీయ కోణం లాంటి ఈ పాట నిడివి మొత్తం ప్రత్యక్షరం గుండెని గుడిగోపురంలా చేసే మంత్రం. జ్ఞానజ్యోతిని దర్శించే వేదాంతహృదయ మందారం.

ఒకడు ప్రయాణం ప్రారంభించాడు. ‘నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా..’’ అని ఒక ప్రశ్న వేసి ఆ ప్రయాణానికి ఒక స్పష్టతనిస్తాడు కవి. అసలు నువ్వు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నావో నీకు తెలుసా అనే పదునైన ప్రశ్న గుండెలోకి ఎంతగా దిగితే.. అంత కరెక్ట్ ఆన్సర్‌ ‌వస్తుంది. ఒకవేళ సమరానికి దిగితే ‘‘ఏ సమరం ఎవ్వరితో తేల్చుకోముందుగా’’ అని వేసిన క్వశ్చన్‌తో ఆయన కన్‌ఫ్యూజ్‌ ‌చేయరు. క్లారిటీ ఇస్తారు. నువ్వు పోరాడాల్సింది బయటివాడితో కాదేమో.. నీతో నువ్వే పోరాడాలేమో చూసుకో అని ఒక సలహా ఇచ్చి సమరానికి ఓ దిశా నిర్దేశం చేస్తారు.

చిరంజీవైనా పుడుతూనే మెగాస్టారైపోలేదు. నటుడవ్వాలన్న సంకల్పానికి కఠోరశ్రమని జోడించి ఆ స్థాయికి చేరుకున్నాడు. ఈ కథనే ఓ పాటలో చెబుతూ.. ఒకవేళ నీకు అలాంటి ఆశయం ఏదైనా ఉంటే మంచిదే, దానికెంత కష్టపడాలో అక్షరాల్లోనే బొమ్మకడతారు శాస్త్రిగారు. ‘తెగించే సత్తా చూపందే సడెన్‌గా స్వర్గం రాదయ్యా’ అని చెప్పాల్సిన విషయాన్ని విడమరుస్తారు. వాల్‌పోస్టర్‌ ‌చూసి నేనూ అంతటివాణ్ణి అవ్వాలని నిలబడి కలలు కనడం వల్ల ఉపయోగం లేదని చెబుతారు.

ఎవరో ఒకరు ఎప్పుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు… అనే ఓ పాట సంవి ధానంలో మొదటి అడుగు విశిష్టతనీ తొలి అడుగు వేసే మనిషి మార్గదర్శకత్వాన్ని అలతి అలతి పదాలతో శాస్త్రిగారు చెప్పిన తీరు.. సినిమాలో సన్నివేశానికే కాదు..పాట విన్న ప్రతి ఒక్కరికీ ఆ స్ఫూర్తి వర్తిస్తుంది.

నీ ఇంట్రెస్ట్ ఏమిటో అటే వెళ్లు అని యువతరానికి మంచి మాటలు చెప్పే పాటని ‘‘బోడి చదువులు వేస్ట్ ‌నీ బుర్రంతా భోం చేస్తూ..’’ అని మొదలుపెట్టి తను చెప్పాలనుకున్న విషయాన్ని మొహమాటం లేకుండా చెప్పడం ఆయనకే చెల్లింది. మనసు కాస్త కలతపడితే మందు ఇమ్మని మరణాన్ని అడగకు..అని పాటలో పాత్రకేకాదు.. కొన్ని కోట్లమందికి ఆయన అందించిన సందేశం కూడా.

గమనమే నీ గమ్యమైతే బాటలోనే బతుకు దొరుకు… ప్రశ్నలోనే బదులు వుంది గుర్తుపట్టే గుండెనడుగు – అని ఒక పాట గుండె తలుపు తడుతుంది. ‘కష్టం వస్తేనేకదా గుండె బలం తెలిసేది దుఃఖానికి తలవంచితే తెలివికింక విలువేది’ అని మరో పాటలో బతుకుచిత్రాన్ని ఆవిష్కరించారాయన. బతుకంటే బడి చదువా అని ఒక పాటలో ప్రశ్నించిన శాస్త్రిగారు ‘పొరపాటున చేజారిన తరుణం తిరిగొస్తుందా… ప్రతి పూటా ఒకపుటలా తన పాఠం వివరిస్తుందా?’ అని జాగ్రత్త చెబుతారు. ‘కరుణను మరిపించేదా చదువు సంస్కారం అంటే.. గుండెను బండగ మార్చేదా సంప్రదాయం అంటే..’ అని ఓ సామాజిక బాధ్యతని గుర్తు చేస్తారు.

… ఇలా చెప్పుకుంటూ వెళ్తే విశ్లేషణలో ఎంత సమయం గడిచిపోతుందో తెలియదు. ఎన్ని పాటల గురించి మాట్లాడుకున్నా ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. మధించిన కొద్దీ కొత్తకొత్త రూపాల్లో సాక్షాత్కరించడం శాస్త్రిగారి కవిత్వం. దర్శించేకొద్దీ లోతుల్లోకి తీసుకువెళ్లడం శాస్త్రిగారి కవిత్వంలోని సౌందర్యం. ఎన్నో భావచిత్రాలు దృశ్యకావ్యాలై వెండితెరని వెలిగించడం శాస్త్రిగారి శిల్పం.

వందేమాతరం

‘రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ’ నేపథ్యం శాస్త్రిగారిని నిఖార్సయిన దేశభక్తుడిగా, సుశిక్షితుడైన సైనికుడిలా తీర్చిదిద్దింది. ఆ కోణంలో సామాజికమైన పెడ ధోరణుల్ని ఆయన సహించలేరు. కవిగా స్పందిస్తారు. చాలా ధాటిగా చెబుతారు. ధారగా వెలిబుచ్చుతారు. తన అసంతృప్తిని పదునుగా మెరిసే ధగధగల ప్రశ్నార్థకంలా సంధించారు. కట్టు తప్పిపోతున్న సమాజం గురించి చెబుతూ, ‘సిగ్గులేని జనాన్ని’, ‘జీవచ్ఛవం’ లాంటి తీవ్రపదాలతో అభివర్ణించారంటేనే అర్థమవుతోంది – ఎంత వేదనలో ఉన్నారో. ఎలా ఉండాలి? ఎలా ఉన్నాం? ఎంత బాధ్యతగా ఉన్నాం? ఎందుకు ఉండలేకపోతున్నాం? లాంటి ఆవేదనాభరితమైన ఎన్నోప్రశ్నలకి సమాధానాలు దొరకని నిస్సహాయ స్థితిలోంచి వచ్చిన మాటలయి ఉండొచ్చు బహుశ. అర్థశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్ర మందామా.. స్వర్ణోత్సవాలు చేద్దామా అని ఆయన లేవనెత్తిన ప్రశ్న ఎంత చర్చకు దారి తీసిందో మనందరికీ తెలుసు. ‘‘సురాజ్యమవలేని స్వరాజ్య మెందుకని.. సుఖాన మనలేని వికాసమెందుకని’’ అని ఆయనలోని ఆర్తి అక్షర రూపమై సంచలనం సృష్టించింది. ‘‘అపుడెపుడో ఆటవికం. మరిపుడో ఆధునికం. యుగయుగాలుగా ఏ మృగాలకన్నా ఎక్కువ ఏం ఎదిగాం?’’ అనే తీక్షణమైన ప్రశ్న వేయడానికి శాస్త్రిగారు ఎంత కలత చెంది ఉంటారో ! సామాన్య శాస్త్రాన్ని ఓ మలుపు తిప్పిన పరిణామక్రమం తాలూకు మౌలికతనే ప్రశ్నించారు కవి. భారతీయ మూలాలకి తార్కిక భాష్యాన్ని అందించడమే గమ్యంగా ఎంచుకున్న ఒక తాపసిని కొన్ని పరిస్థితులు కలచివేశాయి. ఫలితంలో వచ్చిన సాహిత్యం కూడా ఎప్పటికీ నిలిచేదే కావడం విశేషం. సంఘ్‌ ‌కార్యకలాపాల కోసం ‘యోగులు సాగిన మార్గమిది..’ అనే ఓ గేయంలో దేశం గురించి ఆయన అభివ్యక్తిని చూస్తే ఈ వేదనకు కారణం ఇట్టే అర్థమవుతుంది.

సనాతనం… అధునాతనం…

ఈ నాగరికత అందించిన వారసత్వం, ఈ నెత్తుటితో సహవాసం చేస్తున్న సనాతన ధర్మం, వాఙ్మయమై వెల్లువెత్తిన వేదవేదాంగాల సారాంశం, పురాణేతిహాసాల వైభవం, భారతీయత భువనమంతా ప్రవచించిన విజ్ఞానకిరణాల ఉపదేశ సాక్షాత్కారం మేళవించిన అక్షరరూపం శాస్త్రిగారి సాహిత్యం. కళాతపస్వి సినిమాల్లో ఆధ్యాత్మిక జీవనతత్త్వాన్ని ఉప్పొంగించే గీతాలు, ఇతరుల సినిమాల్లో యుగళగీతాల్ని పరుగులెత్తించడంలో శాస్త్రిగారి అపారమైన ప్రతిభ మనకు తెలియనిది కాదు. కవిత్వాన్ని ఎంత విభిన్నంగా విలక్షణంగా చెప్పవచ్చో.. సినిమా పాటలో కూడా సృజనాత్మక స్వేచ్ఛకి కొత్త ప్రమాణాలు నిర్దేశించారాయన.

శిఖరాలకి లోతులకీ; తాత్త్వికతకి సార్థకతకీ; తాత్త్విక చింతనకి ఆత్మిక భావనకీ; ఉల్లాసానికి; ఉద్వేగానికీ; గాయానికి సాయానికీ; ఆవేదనకి; ఆర్తికీ అక్షరాలతో ముడివేసి ఆత్మదీపం వెలిగించే విజ్ఞాన సిరుల భాండాగారం సిరివెన్నెల పాట. పాటంటే – కాలరేఖల మీద సిరివెన్నెల చేసిన సాహితీ క్రతువు. తరుశాఖల మీద బహువన్నెలు పూయించిన పూల రుతువు. తత్త్వం లేని కవిత్వం రాయని ఒక నిబంధనకి కట్టుబడి, పాటకీ కవిత్వానికీ మధ్య అందమైన అనుబంధాన్ని ముడివేయడమే శాస్త్రిగారి విశిష్టత. ఆయన ఎంత సనాతనుడో అంత ఆధునికుడు. 66 యేళ్ల వయసులో ‘‘నీ కాళ్లని పట్టుకు వదలనన్నది…’’ అనే ఉర్రూతలూగించిన ఓ ట్రెండీ పాటని రాసిన శాస్త్రిగారి కలం ఎప్పటికీ నిత్యనూతనం.

అదే నివాళి !

తన ఆలోచనని సాకారం చేసుకోడానికి, అస్పష్టంగా ఉన్న భావానికి ఆకారం తీసుకోడానికి ఎన్ని యాతనలుపడ్డారో మనకు తెలీదుగాని… ఇక సాయంపట్టలేక చిట్టచివరిసారి సారీ చెప్పిన ఆఖరి ఊపిరికి, ఆయన కొవ్వొత్తిలా కాలిపోతున్న విషయాన్ని పక్కన పెట్టి మరీ ఖర్చుపెట్టిన కాలానికి, పాటకి పదును పెట్టడానికి ఆయన పడ్డ మథనలకి, వ్యక్తిగత జీవితాన్ని పణంపెట్టి కవిని మించి తన భుజం మీద వేసుకున్న బాధ్యతకీ, ఐహిక బంధాల నుంచి తనదైన లోకంలో ఒక్కడూ గడిపిన రాత్రులకీ, తనలో తాను పడ్డ సంఘర్షణలకీ ఈ సమాజం తిరిగి ఏమివ్వ గలదు? ఆచార్య స్థానంలో కూర్చోబెట్టిన సిరివెన్నెలను ఎలా సముచితంగా గౌరవించగలదు? దుఃఖాన్ని చూడడానికి, చూపించడానికి ఇష్టపడని ఆ యోగి అభిమానులందరినీ దుఃఖంలో మిగిల్చి వెళ్లిపోయిన ఈ సందర్భంలో వారి పాటలే మనకి ఓదార్పు. వాటి నుంచే శాస్త్రిగారిని గుర్తు చేసుకుంటూ ఉండాలి.

‘కవులు కంటున్న కలలు మనుష్యులలో ఫలిస్తాయి’ అన్న ఆధునిక మహాభారతకర్త  గుంటూరు శేషేంద్రశర్మ మాటల్ని ప్రస్తావించకుండా ఇప్పటి ఈ సందర్భాన్ని దాటలేం. ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పినట్టుగా ప్రశ్నించుకునే తత్త్వాన్ని పెంపొందించడం, వారి పాటల అంతర్దర్శనం చేయడం మాత్రమే వారికి అసలైన నివాళి. చెమ్మగిల్లిన కళ్లకి, దిగులు కమ్ముకున్న గుండెలకి అదే స్వాంతన.

అసతోమా సద్గమయ.. తమసోమా జ్యోతిర్గమయ… మృత్యోర్మా అమృతంగమయ

ఓం శాంతిః శాంతిః శాంతిః

By editor

Twitter
Instagram