పండిట్‌జీ.. విద్యా ప్రదాత

 డిసెంబర్‌ 25 ‌మదన్‌ ‌మోహన్‌ ‌మాలవ్యా జయంతి

పండిట్‌ ‌మదన్‌ ‌మోహన్‌ ‌మాలవ్యా.. భరతమాత గర్వించదగ్గ ముద్దుబిడ్డల్లో ఒకరు. ఆయన జాతికి అందించిన సేవలు చిరస్మరణీయం. స్వాతంత్య్ర సమర యోధుడిగా, న్యాయ వాదిగా, పాత్రికేయుడిగా, విద్యావేత్తగా.. ఇలా బహుముఖ కోణాల్లో దేశానికి సేవ చేశారు.

మాలవ్యా పేరు చెప్పగానే ఎవరికైనా ముందు గుర్తుకు వచ్చేది బనారస్‌ ‌హిందూ విశ్వవిద్యాలయం. ప్రపంచంలోనే ప్రఖ్యాత, ఆసియాలోనే అతిపెద్దదైన విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా పేరుగాంచిన దీనికి ఆయన వ్యవస్థాపకుడు. ఈ విశ్వవిద్యాలయాన్ని విస్తరించేందుకు, ప్రగతిబాటలో నడిపించేందుకు, విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు మాలవ్యా తన జీవితాన్నే ధారపోశారని చెప్పడం అతిశయోక్తి కాదు. విశ్వవిద్యాలయమే శ్వాసగా జీవితాంతం గడిపారు. రాజకీయం కన్నా, న్యాయ వాదిగా కన్నా విద్యావేత్తగా బనారస్‌ ‌హిందూ విశ్వ విద్యాలయమే ప్రాణంగా భావించి దాని ప్రగతికి పాటుపడ్డారు. అంతటి మహోన్నతుడిని గత ప్రభుత్వాలు విస్మరించినా, నరేంద్రమోదీ ప్రభుత్వం గుర్తించి పండిట్‌ ‌మదన్‌ ‌మోహన్‌ ‌మాలవ్యాకు 2015లో అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ ప్రకటించి గౌరవాన్ని చాటుకుంది.

మాలవ్యా 1861 డిసెంబరు 25న ఉత్తర్‌‌ప్రదేశ్‌ ‌లోని ప్రయాగ్‌రాజ్‌ (అలహాబాద్‌)‌లో సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. కోల్‌కతా విశ్వవిద్యాలయంలో బీఏ చదివారు. అనంతరం అలహాబాద్‌ ‌విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. కొంతకాలం అలహాబాద్‌ ‌హైకోర్టులో ప్రాక్టీసు చేసి ప్రముఖ న్యాయవాదిగా పేరు గడించారు. కాంగ్రెస్‌ ‌పార్టీ కార్యకలాపాల్లో క్రియా శీలకంగా వ్యవహరించారు.  నాలుగుసార్లు (1909, 1918, 1932, 1933ల్లో) అధ్యక్ష బాధ్యతలు చేపట్టి పార్టీని ముందుకు నడిపించారు. భారత స్కౌట్స్ అం‌డ్‌ ‌గైడ్‌ ‌వ్యవస్థాపకుల్లో మాలవ్యా ఒకరు. ఆయన సంప్రదాయవాది. అదే సమయంలో మత సామరస్యానికి పాటుపడ్డ గొప్ప నాయకుడు. నేటి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ ‌వద్ద గంగానదికి హారతి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించింది ఆయనే. హరిద్వార్‌తో పాటు జ్యోతిర్లింగ క్షేత్రమైన వారణాసి లోనూ నిత్యం గంగా నదికి హారతి ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నారంటే మాలవ్యా చూపించిన మార్గమే అని చెప్పవచ్చు.

బనారస్‌ ‌హిందూ విశ్వవిద్యాలయ స్థాపనకు ఆయన చేసిన కృషి, చూపిన పట్టుదల అనన్య సామాన్యం. నిధుల కోసం జోలె పట్టారు. ఇందుకోసం నాటి నిజాం నవాబు వద్దకు కూడా వచ్చారు. మొదట నిజాం నిరాకరించారు. చివరికి మాలవ్యా తన చెప్పును వేలం వేస్తానని ప్రకటించగా నిజాం నవాబు ఆయన నిబద్ధతను చూసి ఆ చెప్పునకు అత్యధిక ధర ప్రకటించి కొనుగోలు చేశారు. ఆయన కృషి ఫలితంగానే 1916 ఫిబ్రవరి 4న వారణాసి పుణ్య క్షేత్రాన బనారస్‌ ‌హిందూ విశ్వవిద్యాలయం ప్రారంభ మైంది. ఉప కులపతిగా కొంతకాలం పనిచేసి విశ్వవిద్యాలయ ప్రగతికి దిశా నిర్దేశం చేశారు. మాలవ్యా కుమారుడు, మనుమడు కూడా తరవాత రోజుల్లో ఉప కులపతిగా పనిచేసి విశ్వవిద్యాలయ ప్రగతికి దోహదపడ్డారు. ఇప్పుడు వివిధ దేశాలకు చెందిన వేలమంది విద్యార్థులు ఇందులో చదువు కుంటున్నారు. ఇక్కడ చదివిన ఎందరో విద్యార్థులు దేశవిదేశాల్లో వివిధ రంగాల్లో అత్యున్నత స్థానాల్లో ఉన్నారు. నాడు మాలవ్యా నాటిన ఒక మొక్క నేడు వటవృక్షంగా ఎదిగి ఎంతో మంది విద్యార్థులకు నీడను ఇస్తోంది. వారికి బంగారు భవిష్యత్తును అందిస్తోంది.

వ్యాసకర్త: సీనియర్‌ ‌జర్నలిస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram