గాంధీ సిద్ధాంతంతో అల్లుకున్న ప్రేమగాథ

– వి. రాజారామమోహనరావు

జీవితంలోని వివిధ విషయాల మీద విపులమైన వివరణ, విశ్లేషణ, సమాచారం కూర్చటం వల్ల నవల ప్రౌఢంగా తయారవుతుందని అడివి బాపిరాజుకు తెలుసు. ఆయన ‘నారాయణరావు’ నవల దీనికో గట్టి ఉదాహరణ. ఈ నవలను ఆయన 1934లో రాశారు. అప్పటికి  ఎంతో కృషి ఉంటేనే కానీ, ఒక విషయం మీద సమాచారం సేకరించటం సాధ్యపడేది కాదు. ఒక విషయం మీద పరిజ్ఞానం ఉంటే, ఆ వ్యక్తిని మేధావిగా, జ్ఞానిగా పరిగణించే వారు. బాపిరాజు అనుభవాలు బహుముఖీనమైనవి. ఆయనో విజ్ఞానఖని. పాశ్చాత్య సాహిత్యాన్నీ, ఎందరో తత్త్వవేత్తలనీ అధ్యయనం చేసివాడు.  విజ్ఞాన వితరణ ఆయన ప్రవృత్తి. అందుకే రచనలన్నీ రకరకాల విజ్ఞానంతో నిండి ఉండేవి. అందుకే ఆ తరం పాఠకులు, ముఖ్యంగా విజ్ఞానాసక్తి కలవారు వాటిని నెత్తిన పెట్టుకున్నారు.

1934లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించిన నవలలో పోటీలో విశ్వనాథ సత్యనారా యణ ‘వేయిపడగలు’,  బాపిరాజు ‘నారాయణరావు’ చలం ‘మైదానం’, పోటీలో మిగిలాయి. ఆచారాల మీద తిరుగుబాటు ‘మైదానం’. చివరికి బహుమతి విశ్వనాథ, బాపిరాజుకి చెరిసగం పంచారు. ఆ రకంగా ఆంధ్ర విశ్వకళాపరిషత్తు బహుమతి పొందిన నవల ‘నారాయణరావు’, వేయిపడగలు సహపంక్తిన నిలిచినందీ నవల. అంతటి స్థాయి చేరిన ‘నారాయణ రావు’ నవలలో ఏముంది? అని ప్రశ్నిస్తే, ఆ ప్రశ్నకి బదులుగా ‘ఏమి లేదు?’ అన్న ప్రశ్నే జవాబు.

సంగీతం, భారత పాశ్చాత్య సాహిత్యాలు, చిత్రకళ, శిల్పం ఎందరో తత్త్వవేత్తల రచనాసారం, సైన్సు, వేదాంతం మీద విపుల విశ్లేషణలు, వివిధ మతాల పుట్టుపూర్వోత్తరాలు, ఆంగ్లేయుల పాలన, స్వాతంత్య్రోద్యమం, బ్రహ్మ సమాజం, ఫ్రీలవ్‌ సొసైటీ భావనలు, పాశ్చాత్య శాస్త్రకారులు ఐన్‌స్టీన్‌, ఎడిరగ్టను లాంటి వారి పరిశోధనలూ, మన పూర్వీకుల యోగ సాధన ఫలితాలతో వాటి తులనాత్మక పరిశీలన, అమెరికా, రంగూన్‌, జపాన్‌ మొదలగు ఎన్నో విదేశీయుల కుటుంబ సహిత వంశ పారంపర్య వివరణలు; దేశ, విదేశీ సంగీత వాయిద్యాలు ఏ ఏ దేశాలవో, వాటి పుట్టుపూర్వోత్తరాలు, ప్రశస్తి, వైద్యంలో అల్లోపతి ఆయుర్వేదం, హోమియోపతి లోతుపాతులు, దక్షిణ హిందూ దేశమేకాక, ఉత్తర హిందూ దేశ యాత్ర పేరున పలు ప్రదేశాల సంఘటనలు వివరాలు, కపిల మహర్షి బోధనలు, ఉపనిషత్తుల అన్వయం, శ్రీకృష్ణతత్త్వం, మళయాళ ప్రాంత నంబూద్రీల చరిత్ర, ‘ఆనందము ఎన్ని రకములో’ తెలిపే మానసిక విశ్లేషణ, కళలు ఇచ్చే అలౌకిక ఆనందం, రష్యా రాజకీయ మార్పులు, కాళిదాసు షేక్‌స్పియరు రచనల తులనాత్మక పరిశీలన, స్వతంత్ర ప్రేమ, సంఘ రీతి రివాజులు, ప్రేమ` కామభావనల వ్యత్యాసం, సామీప్యం… ఇలా ఈ వరుసకి అంతులేనట్టు, ఎన్నెన్నో  చర్చలు ‘నారాయణరావు’లో వినిపిస్తాయి.

ఓ రకంగా ‘నారాయణరావు’ ఓ సమాచార గ్రంథం. ఇతివృత్తం చూస్తే, ప్రధానంగా అది నారాయణరావు, శారదల కథ. అచ్చులో 423 పేజీల ఈ నవలలో, వారి కథా అంతే పెద్దది అనిపించదు. ఎన్నెన్నో ఉపపాత్రలున్నాయి. వాటికి వేరు వేరు కథలున్నాయి. ఆ కథల్లో చాలావరకు ప్రధానమైన నారాయణరావు, శారదల కథ నడకకు అంతగా సహాయ పడినవి కావు. వేటి కథ వాటిదే అన్నట్టు ఉంటాయి. రచన, శైలి గ్రాంథిక వాసనతో సాగింది.

సుబ్బారాయుడు, జానకమ్మ రెండో కొడుకు నారాయణరావు. వారిది కోనసీమలోని కొత్తపేట. నారాయణరావు అన్నగారు, మరో నులుగురు ఆడపిల్లలు వారి సంతానం. ఆడపిల్లల అందరి పెళ్లిళ్లూ అయి కాపురాలు చేసుకుంటున్నారు. సుబ్బారాయుడికి మూడువందల ఇరవై ఎకరాల మాగాణీ ఉంది. తోటలు ముప్ఫై ఎకరములపైనే. వడ్డీ వ్యాపారంలో లక్షా అరవై వేలవరకూ తిరుగుతున్నాయి. బ్యాంకులో షేర్లతోపాటు రెండు లక్షల రూపాయలవరకూ ఉన్నాయి. ఎంత లేదన్నా ఇరవే వేలవరకూ నికర ఆదాయం.

నారాయణరావు ఎప్పుడూ ఏ పరీక్షా తప్పలేదు. ప్రతి తరగతిలోనూ మొదటివాడే. ఇంటర్‌లో బంగారుపతకాలు సంపాదించాడు. మహాత్మాగాంధీ సహాయ నిరాకరణోద్యమానికి పిలుపునిచ్చారు. నారాయణరావు దేశం కోసం ఉద్యమించి జైలుకెళ్లాడు. ఆరునెలలు ఉన్నాడు. ఆ తర్వాత బి.ఎస్‌.సి. ఆనర్స్‌ చదివాడు. మదరాసులో లా రెండో సంవత్సరం చదువుతున్నాడు.

 సెలవులకి స్నేహితులతో కలసి  మద్రాసు ` హౌరామెయిల్‌లో స్వగ్రామం వస్తున్నాడు. మెయిల్‌ బెజవాడ స్టేషన్‌ చేరింది. గవర్నరుగారు ప్రయాణిస్తున్న రైలు అప్పుడే వస్తోంది. అది వెళ్లే వరకు మెయిలు కదలదు. నారాయణరావు పుస్తకాల కోసం హిగిన్‌ బాదమ్స్‌ షాపుకి వెళ్లాడు. ఇక్కడ నారాయణరావుని బాపిరాజు ఇలా వర్ణించారు: ‘నారాయణరావు ఆజానుబాహుడు. అయిదడుగుల పదకొండు అంగళుముల పొడవువాడు. బల సంపదకు నెలవైనవాడు. ఉజ్వల శ్యాములుడు. చిన్నవై, తీక్షణమైన లోచననములు తీరై, సమమై కొంచము పొడుగైన ముక్కు, దూరస్థములగు నా కన్నుల మధ్య ప్రవహించి, ధనస్సువలె తిరిగిపోయిన పై పెదవికి నాతి దూరమున నాగింది. నారాయణరావు కుడిచేతి చూపుడు వ్రేలితో నడుగుపెదవిని నొక్కుకొనుచు, బొమలు ముడిచి, విశాలఫాలము, వీచికలు నిండిన పాల సముద్ర మట్లయిపోవ, పరధ్యానములో మునిగిపోయినాడు.’ వర్ణచిత్రం లాంటి వర్ణన. ఇటువంటి నారాయణరావుని విశ్వలాపురం జమీందారు, శాసనసభ సభ్యుడు, తల్లాప్రగడ లక్ష్మీసుందరప్రసాదరావు చూశారు. వివాహితుడు కాకపోతే నారాయణరావే తన రెండో కుమార్తె శారదకి తగిన వరుడని తొలి చూపులోనే అనుకున్నారు. తానంతతానుగా నారాయణరావుతో మాట కలిపి కొన్ని వివరాలు తెలుసుకున్నారు. అదే మెయిల్‌లో ప్రయాణిస్తున్న ప్రసాదరావు నారాయణరావునీ, అతడితోనే ఉన్న బావమరది లక్ష్మీపతినీ  కూడా తనతో ఫస్ట్‌క్లాస్‌లో ఎక్కించుకుని, కుటుంబ వివరాలూ తెలుసుకున్నారు.

నారాయణరావు స్వగ్రామం వెళ్లేలోపే, జమీందారు రాజమండ్రిలోనే అతన్ని మిత్రబృందంతో సహా ఆపేసి, శారదని తమింట్లోనే చూపించి, పెళ్లిచూపులు పూర్తి చేశారు. తర్వాత సుబ్బారాయుడు దగ్గరకి పెద్ద మనుషులని పంపి ఉద్దేశం తెలియజేశారు. వివాహం బ్రహ్మాండంగా జరిగింది. నారాయణరావు, శారద దంపతులయ్యారు. ఈ వివాహం ఇష్టపడని వ్యక్తులు ముగ్గురు. జమీందారు భార్య వరదకామేశ్వరి, ఆయన అక్కగారు వర్థనమ్మ, వరద కామేశ్వరిగారి మేనల్లుడు జగన్మోహనరావు. నారాయణరావు జమీందారీ వంశానికి చెందినవాడు కాదని, పల్లెటూరు మొరటు సంబంధమని వరదకామేశ్వరికి చులకన. అదీ కాక శారదని తన మేనల్లుడు, నారికేళవలస జమీందారు జగన్మోహన రావుకిచ్చి  చెయ్యాలని ఆవిడ కోరిక. ఈ ముగ్గురూ తరచుగా నారాయణరావు గురించి, అతని వంశం, కుటుంబం గురించి తేలిగ్గా మాట్లాడుతుండటం, చులకన చెయ్యటంతో, శారద పసిమనుసులో  నారాయణరావు మీద ఒక అనిష్టత చోటు చేసుకుంది. దీనివల్ల శారద నారాయణరావుకి దూరమవుతూ వచ్చింది. నారాయణరావు ఎంత ప్రేమ చూపించినా, సౌజన్యం కనబరిచినా శారదలో ఏ మాత్రం మార్పు రాలేదు. పైగా జగన్మోహనరావు ఆమెతో చనువుగా ఉంటూ, నారాయణరావు మోటువాడని, పందని, రాక్షసుడని చెపుతూ శారద అనిష్టతనీ, భయాన్నీ మరింత పెంచాడు. మగవాని పట్ల ప్రేమ లేనిదే, ఆడది దరిదాపులకు కూడా వెళ్లకూడదని ఆమె మనసులో నాటుకునేలా చెప్పాడు.

నారాయణరావు బి.ఎల్‌. ప్రథముడిగా ఉత్తీర్ణుడై, ఎప్రెంటిషిప్‌ కూడా  పూర్తి చేశాడు. శారద పెద్దదైంది. ఆ వేసవిలో ఇరువురికి పునస్సంథానం చేశారు. నారాయణరావు పట్ల విముఖత పేరుకుపోయిన శారద, కార్యం నాడు నానా గొడవ చేసింది. చాలా రాత్రి గడిచినా గదిలోకి వెళ్లలేదు. వెళ్లాక భర్తని దగ్గరకి రానివ్వలేదు. నారాయణరావు ఎన్నో రకాలుగా అడిగాడు. ఎంతగానో నచ్చచెప్పాడు. శారదలో మార్పులేదు. రెండోరోజు రాత్రి అంటే నారాయణరావు ‘ఏమిటిదని?’ బతిమాలగా ‘నాకు ప్రేమ లేదు’ అని తెగేసి చెప్పింది. నారాయణరావు మనసు చెదిరింది. శారద దరిచేరటం భావ్యం కాదనుకున్నాడు. దూరంగానే ఉండిపోయాడు. భర్త దూరంగా ఉండటం శారదకీ ఉపశమనమిచ్చింది. ఆ సంసారం ఆ రకంగానే సాగుతూ వచ్చింది.

మార్పుకోసం, అనుభవం కోసం నారాయణరావు తన స్నేహితుడితో కలిసి ఉత్తర భారతయాత్ర చేసి వచ్చాడు. తన సంసార జీవితం బావుండలేదని విచారపడి, తన కర్తవ్యం, ఆదర్శాలు దేనినీ విస్మరించలేడు. పరులకి సాయం చెయ్యటం, తనవారికి అండగా ఉండటం, సంఘసేవ, ధైర్యసాహసాలతో ఎందరినో ప్రమాదాల బారి నుంచి కాపాడటం, ఇలా సద్గుణరాసిగా మెలుగుతూ వస్తున్నాడు. అతని లలిత కళోపాసన, లలిత వర్తన అందరికి ప్రీతి పాత్రమైంది. బాపిరాజు అభిరుచులకి ప్రతిరూపం లాంటివాడు నారాయణరావు. అతనంటే అందరికీ ఇష్టమే. ఈ వార్తలు కొన్ని శారద చెవిన కూడా పడ్డాయి. నిజంగా తన భర్త అలాంటి ఉత్తముడా అన్న ఊహకూ వచ్చింది. కాని బావ జగన్మోహనరావు దుర్బోధలు ఆమె ఆ అభిప్రాయాన్ని గట్టిపడనీయలేదు.

నారాయణరావు మద్రాసులో మకాం పెట్టి ప్రాక్టీసు ఆరంభించాడు. మంచి లాయరుగా పేరొచ్చింది. సంపాదనకి లోటు లేదు. శారదని కాపురానికి పంపించారు. భర్తకి చేరువగా ఉండటం వల్ల అతని సుగుణాలు మరింతగా తెలిసొచ్చాయి. నారాయణరావుకి ఉన్న ఉన్నత పరిచయాలు, సకల కళలలో అతని అభినివేశం మురిపించాయి. భర్త ధీరోదాత్తుడు, సుందరుడు, లలితకళా విద్వన్మణి, సరళ హృదయుడు అని అర్థం చేసుకుంది. స్నేహితుల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా నారాయణరావు సాయం చెయ్యటం, దుర్భరంగా నరకప్రాయంగా ఉన్న అక్కల కాపురం సరిచెయ్యటం, కొత్తపేటలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలకు తెగించి పెదకాపు ఆస్తి కాపాడటం…. ఇవన్నీ శారద మనసు మారటానికి సాయపడ్డాయి. చివరికి తనని తాను మనస్ఫూర్తిగా భర్తకి అర్పించుకుంది.

శారదకి నారాయణరావు పట్ల సద్భావన లేక వారి కాపురం పొసగకపోవటం, ఆమె నిజం గ్రహించాక వారి సంసారం కుదుటపడటం ఈ నవలలో ప్రధాన కథ. కానీ అనేక ఉపపాత్రలు ఉన్నాయి. రాజేశ్వర్రావు ` పుష్పశీల లేచిపోవటం, వారి స్వేచ్ఛా ప్రణయ సిద్ధాంతాలు ఓ కథ. రామచంద్రరావు` విదేశీయానం మరో కథ. రాజారావు, జగన్మోహనరావు, శ్యామసుందరీ దేవి, పరమేశ్వరశాస్త్రి…. ఇలా మరెన్నో కథలు. అవన్నీ ఎన్నో రకాల సంఘటనల్ని, వివరాల్ని, అనుభవాలని వివరిస్తాయి. అవేవీ ప్రధాన కథతో పూర్తిగా కలవకపోయినా, పంతొమ్మిది వందలఇరవై, ముప్ఫై దశకాల నాటి జీవితపు బహుపార్శ్వాలని నవల కళ్లకు కట్టించింది. కళలు, మతం, నైతికత, సాంఘిక మార్పులు తాత్విక బేధాలు, రాజకీయ ప్రాబల్యం, ఆర్థిక వ్యత్యాసాలు జీవితంలో పలు రకాల కష్టసుఖాలు, నగర, పట్టణ, గ్రామీణ జీవితాల స్వరూపం, వ్యవసాయం, ఇతర వృత్తుల తీరు తెన్నులు, కులభేదాలు, ఇలా ఈ నవలలో లేని విషయం ఏదీ లేదనిపిస్తుంది. ఇంతటి వైవిధ్య సమాచారం పాఠకుల్ని అమితంగా విస్మయపరిచింది. అబ్బురపరిచింది. ఇదో కొత్త రకం భోజనంలా ఆకర్షించింది. ఇంతటి ఈ రచనా ప్రణాళిక వెనక నవలాకర్తకు ఓ గట్టి ధ్యేయమూ ఉంది. అది సంప్రదాయ సంరక్షణ. వీలున్నచోటల్లా, దాని విలువ గురించి నవలంతా చెపుతూ వచ్చారు. ఫ్రీలవ్‌ సొసైటీ అని బరితెగించిన పుష్పశీల కూడా చివరికి వివాహం చేసుకుని సంప్రదాయం వేపు మొగ్గటం దీనికి ఉదాహరణ. ఈ సంప్రదాయ పరిరక్షణ పాఠకులకి నచ్చింది.

ఎన్నో రకాలుగా రచనా బలం ఉన్న ఈ నవలలో స్వల్ప బలహీనతలూ లేకపోలేదు. నారాయణరావు పాత్రతో సహా చాలా పాత్రలు రచయితలు ఆలోచన నుంచి పుట్టి, అలాగే ప్రవర్తిస్తున్నట్టు ఉంటాయి. అంతే తప్ప నిజ జీవితంలోని వ్యక్తుల్లా ఉండవు. ఎంత వైవిధ్య విద్య విషయ వివరణ ఉందో, కొన్నిచోట్ల అది నిడివిలో పెద్దదై, ఆ వస్తువు పట్ల అంతగా ఆసక్తిలేనివారి పఠనాసక్తిని తగ్గించేలా ఉంది. నవలలో కథకి గొలుసులాంటి క్రమం లేదు. ఒక్కో పాత్రకి ఒక్కో ప్రకరణం. దేనికదే విడి కథలు. షాంపెయిన్‌లో సోడా కలపటం లాంటివీ వర్ణనల్లో ఉన్నాయి. ఇవన్నీ చిన్న విషయాలు. ‘తప్పుని కనుగొనుటకు ముఖ్య సూత్రం మనము హింసనాచరించుచున్నామా యని నిర్ణయించుకొనుటయే’ లాంటి గొప్ప సత్యాలు ఉన్నాయి. నారాయణరావు ‘విస్తృతమైన నవల. ఆనాటి జీవితానికి దర్పణం. మంచి జీవితానికి, మంచి విలువలు ప్రధానమని చెప్పిన నవల.

సాహిత్యం తదితర లలితకళలతో కలిస్తే, అది జీవితాన్ని మరింత గాఢంగా, కళాత్మకంగా సాదృశ్యం చేస్తుందన్నది బాపిరాజు దృష్టికోణం. అందుకే నవలలో అన్ని కళల మీద వివరణలు కనిపిస్తాయి. బాపిరాజు న్యాయవాది, రచయిత, గీత రచయిత, కవి, చిత్రకారుడు, సంగీతజ్ఞుడు, గాయకుడు, సినీ కళాదర్శకుడు, సంపాదకుడు, ఉపాధ్యాయుడు. ఇంతటి కలయిక ఒకే వ్యక్తిలో అపురూపం. ఈ అపురూప కలయిక వైవిధ్య సృజనే ‘నారాయణరావు’ నవల. అంతటి విస్తృతమైన నవలా సృజన తేలిక కాదు. అందుకే ఇంతకాలం చిరంజీవిగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram