‌త్రిశంకులు

– డా।। దుగ్గరాజు శ్రీనివాసరావు

మహా అయితే మరో రెండు రోజులు అని డాక్టర్‌ ‌చెప్పటం; భార్య, పిల్లలు ఏడవటం కోమాలో ఉన్న అతనికి వినిపిస్తున్నది.

చావు తప్పదు అని తెలిసినప్పుడు భయం, బాధ కలగటం ఎవరికైనా సహజం. కానీ కోమాలో ఉన్న అతనికి భయం వెయ్యలేదు. చచ్చిపోతే… ఎంతో కాలంగా తాను కలలుకంటున్న ప్రభువు సాక్షాత్కారం అవుతుందని, పరలోక స్వర్గానికి చేరుతానన్న నమ్మకం అతనిది.

బాధ కలిగింది. అయిన వాళ్లకి దూరం అవుతున్నందుకు కాదు, ఆ బాధ. వైద్యుడు అతన్ని సుందరం అని పిలవడం వల్ల కలిగిన బాధ అది.

సుందరం అనేది అతనికి తల్లిదండ్రులు పెట్టిన పేరు. ఆ పేరుతోనే చదువుకున్నాడు. రాజ్యాంగం అందించిన రాయితీల ద్వారా ఉద్యోగి అయ్యాడు. ప్రమోషన్లు అందుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న సుందరంకి ఒక కొలీగ్‌ ‌ద్వారా బ్రదర్‌ ‌జక్రియ పరిచయమయ్యాడు. ఆ పరిచయం అతని జీవితాన్ని మార్చింది.

సుందరం పేరు ముందు జాన్‌ ‌వచ్చి చేరింది. అతని మతం మారింది. మారిన మతంతో కొత్త గుర్తులు వచ్చాయి. బ్రదర్‌ ‌జక్రియ మీద నమ్మకం ఏర్పడింది. ప్రభువు పట్ల విశ్వాసం అధికమైంది. అప్పటినుండి అతనికి సుందరం అనే పేరు కన్నా జాన్‌ అనే పేరే ఇష్టమైంది. అధికారిక రికార్డుల్లో మాత్రమే అతను సుందరం. ఇతరత్రా జాన్‌.

ఆ ‌విషయం తెలియని వైద్యుడు హెల్త్ ‌కార్డులో ఉన్న దాని ప్రకారం సుందరం అని పదే పదే అనటం బాధకు కారణమైంది.

ఆ సమయంలో ‘‘మన జాన్‌ ఎలా ఉన్నాడు?’’ అని బ్రదర్‌ ‌జక్రియ గొంతు వినిపించేసరికి కోమాలో ఉన్నా జాన్‌ ‌పొంగిపోయాడు.

బ్రదర్‌ ‌జక్రియ గొంతుతో ఎన్నో ప్రసంగాలు విన్నాడు. ఆయనతో కలిసి ఎన్నో ప్రార్థన గీతాలు పాడాడు. తన ప్రార్ధనా శక్తితో ఎంతో మంది రోగులకు స్వస్థత కల్పించడం చూశాడు! అలాంటి బ్రదర్‌ ‌జక్రియ వచ్చాడంటే ఇక తాను రక్షణ పొందినట్టే అనుకున్నాడు జాన్‌.

‌బ్రదర్‌ ‌జక్రియ వస్తూనే నానా హడావుడి చేశాడు. మీకెందుకు నేను వచ్చాగా అని జాన్‌ ‌భార్యకు, పిల్లలకు ధైర్యం ఇచ్చాడు. ‘‘మీరు ఇంటికి వెళ్లి నాకు మంచి భోజనం పంపండి.. నేను రాత్రంతా ప్రార్ధన చేస్తా’’ అన్నాడు.

బ్రదర్‌ ‌జక్రియ మాటలు జాన్‌కి భరోసా ఇచ్చాయి.

అయితే జక్రియ ప్రార్థనలు ఫలించలేదు. వైద్యుడి మాటే నిజమైంది. జాన్‌ ‌సుందరం ప్రభువులో నిద్రించాడు.

‘‘మరణించినా ఫర్వాలేదు… నా ప్రార్థనలతో నేరుగా స్వర్గానికి పంపుతాగా’’ అన్నాడు బ్రదర్‌ ‌జక్రియ.

ఆ మాట విన్న మరుక్షణంలో జాన్‌ ‌స్వర్గలోక ప్రవేశద్వారం దగ్గర నిలబడి ఉన్నాడు. తాను పుస్తకాలలో చదివినట్లుగా, ప్రసంగాలలో విన్న రీతిగా ఆ ద్వారం ముందు రెక్కలతో ఎగురుతున్న ఏంజిల్స్ ఉన్నారు. జాన్‌కి ఆనందం వేసింది. ప్రార్ధనా శక్తి మీద నమ్మకం పెరిగింది.

స్వర్గ ద్వారం తెరిచే క్షణం కోసం ఆనందంతో ఎదురు చూస్తున్నాడు జాన్‌.

‌కానీ ఎంతసేపున్నా జాన్‌ని స్వర్గంలోకి పిలవటం లేదు. ఎవరెవరో వస్తున్నారు. గుమ్మం ముందున్న ఏంజిల్స్ ‌తమ దగ్గరున్న ఎర్రంచు నల్ల పుస్తకంలో ఉన్న చిట్టాలో వచ్చిన వారి పేరు ఉందో లేదో చూసి లోపలికి పంపిస్తున్నారు.

ఇక ఆగలేక ‘‘నా పేరు జాన్‌. ఇం‌దాకటి నుండి ఎదురు చూస్తున్నాను. నన్ను పంపరేమిటి లోపలికి? నన్ను లోపలికి పంపకుండా నా తర్వాత వచ్చినవారిని పంపుతున్నారు. ఇక్కడ కూడా మా మీద వివక్షేనా?’’ అని అడిగాడు.

ఒక ఏంజిల్‌ ఆగు అన్నట్టు సైగ చేసి ఆ పుస్తకం మరోసారి తిరగేసి ‘‘ఇందులో నీ పేరు లేదు… నీకు ప్రవేశం లేదు వెళ్లిపో’ అంది.

జాన్‌ ఆశ్చర్యపోయి ‘‘ఇది అన్యాయం. నేను ప్రభువు సేవలోనే తరించా’’ అని గట్టిగా అరిచాడు.

ఒక ఏంజిల్‌ ‌ముందుకు వచ్చి ‘‘ఏమిటి ఇందులో అన్యాయం? ఇదిగో నీ బర్త్ ‌సర్టిఫికేట్‌, ‌డిగ్రీ సర్టిఫికేట్‌, ఆధార్‌ ‌కార్డు… అన్నింటిలో నీది వేరే మతమని ఉంది. ఇది మా మతస్థుల స్వర్గం – ఇందులోకి నీకు ప్రవేశం లేదు పో’’ అంటూ కసిరింది.

‘‘కాదు నేను ప్రభువునే విశ్వసించా.. రికార్డులు మార్చుకోకపోవడానికి కారణం వేరు.. నా భక్తి, విశ్వాసం ఇక్కడే..’’

‘‘మారిన నీ విశ్వాసం రికార్డుల్లో కూడా కనిపించాలి కదా? కానీ మా పుస్తకంలో కనిపించలేదంటే నీవు ప్రభువును మోసం చేశావన్నమాట. నీ విశ్వాస మార్పు నిజం కాదన్న మాట… ఇక దయ చెయ్‌’’ అని పక్కకు నెట్టివేసింది ఏంజిల్‌.

అయినా జాన్‌కి ఆశ చావలేదు. ఆ స్వర్గం ముందు అలాగే దీనంగా నిలబడ్డాడు. అలా ఆ పక్కగా ఎంతసేపు నిలుచున్నా ఏంజిల్స్ ‌దయ తలచలేదు. ఏం చేయాలో తెలియక కళ్లవెంట నీళ్లు కారుతున్నాయి. ఆ సమయంలో ఒక ఏంజిల్‌ ‘‘ఆ ‌పక్కనే ఇతర మతాల స్వర్గాలున్నాయి. అక్కడ ప్రయత్నించు’’ అని చెప్పింది రహస్యంగా.

సరేనని వెతుక్కుంటూ వెళ్లాడు. నిజమే అక్కడ మరో స్వర్గ ద్వారముంది. అక్కడ రెక్కలు కట్టుకున్న ఏంజిల్స్ ‌లేరు. కిరీటాలు పెట్టుకుని ధగధగా మెరుస్తున్న భటుల వంటి వారున్నారు.

ఆ స్వర్గం దగ్గరకి వెళ్లి, వాళ్లు కాదంటేనే ఇటు వచ్చానని చెప్పలేడు. ఇప్పుడు ఏం చెయ్యాలి. అటు రానివ్వలేదు.. ఇటు రానివ్వలేదు. ఏ స్వర్గం లేకుండా ఏం చేయాలి అని ఆలోచించుకుంటూ నెమ్మదిగా ఒక చెట్టు కింద దిగాలుగా కూర్చున్నాడు.

సరిగ్గా అప్పుడు ‘‘హాయ్‌… ‌జాన్‌’’ అం‌టూ పలు గొంతులు ఒక్కసారిగా పిలిచాయి.

ఎవరబ్బా…!? ఇక్కడ నన్ను పేరు పెట్టి పిలిచేది అనుకుంటూ అటు ఇటు చూశాడు. ఎవరూ కనపడలేదు. ఇది భ్రమేమో అనుకున్నాడు.

కాదు, వాస్తవమే అంటూ మరోసారి ‘‘జాన్‌’’ అనే పిలుపు వినిపించడమే కాక ‘‘తల ఎత్తి పైకి చూడు’’ అని కూడా బృందగానంలా వినిపించింది.

లేచి నిలబడి చూస్తే లెక్కలేనంతమంది ఆ చెట్టు కొమ్మలకు గబ్బిలాల్లాగా తలక్రిందులుగా వేళాడుతున్నారు. చాలామంది తాను చూసిన వాళ్లే..

మంత్రులుగా పెత్తనం చెలాయించిన వారు, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎన్నికైనవారు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ అధికారులు… లెక్కలేనంతమంది అక్కడ వేళాడుతున్నారు. కిటకిటలాడుతున్నాయి, చెట్టుకొమ్మలు.

‘‘ఏమిటి… ఈ పరిస్థితి?’’ దీనంగా అడిగాడు జాన్‌ ‌సుందరం.

‘‘దేవుళ్లను మోసం చేసిన వారికి వేసే శిక్ష అట ఇది.  రా రా… నువ్వు కూడా వచ్చి చేరు అన్నారు’’ ఒక్కసారిగా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram